టీమిండియా ఘన విజయం (PC: BCCI X)
India vs England 5th Test Day 3: ఇంగ్లండ్‌తో నామమాత్రపు ఐదో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. పర్యాటక జట్టును ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. ఉపఖండ పిచ్‌లపై ‘బజ్‌బాల్’ ఆటలు చెల్లవంటూ మూడు రోజుల్లోనే మ్యాచ్ ముగించి దిమ్మతిరిగేలా షాకిచ్చింది.
భారత స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్‌తో పాటు.. బ్యాటర్లు కెప్టెన్ రోహిత్ శర్మ(103), శుబ్‌మన్ గిల్(110) అద్భుత ప్రదర్శనల కారణంగా ఈ విజయం సాధ్యమైంది.
ఫలితంగా సొంతగడ్డపై ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ 4-1తో సిరీస్ కైవసం చేసుకుంది. విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ వంటి ప్రధాన బ్యాటర్లు లేకుండానే యువ క్రికెటర్లతో కూడిన జట్టుతోనే భారీ విజయం అందుకుని తమ స్థాయిని చాటుకుంది టీమిండియా.
That series winning feeling 😃#TeamIndia 🇮🇳 complete a 4⃣-1⃣ series victory with a remarkable win 👏👏
— BCCI (@BCCI) March 9, 2024
Scorecard ▶️ https://t.co/OwZ4YNua1o#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/vkfQz5A2hy
స్పిన్నర్ల ఆధిపత్యం
ఇక ఈ మ్యాచ్‌లో అశ్విన్ కెరీర్‌లో వందో టెస్టు. ఇందులో అశూ మొత్తంగా 9 వికెట్లు పడగొట్టి సత్తా చాటగా.. ఓవరాల్‌గా కుల్దీప్ యాదవ్ 7, రవీంద్ర జడేజా రెండు, జస్‌ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు దక్కించుకున్నారు.
ఇదిలా ఉంటే.. కుల్దీప్ యాదవ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, డబుల్ సెంచరీల వీరుడు యశస్వి జైస్వాల్‌కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి.
ధర్మశాలలో మ్యాచ్ సాగిందిలా
గురువారం మొదలైన ధర్మశాల టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. టీమిండియా స్పిన్నర్ల దెబ్బకు 218 పరుగులకే కుప్పకూలింది. కుల్దీప్ యాదవ్ ఐదు(5/72) వికెట్లతో చెలరేగగా.. వందో టెస్టు వీరుడు రవిచంద్రన్ అశ్విన్ నాలుగు (4/51) వికెట్లతో దుమ్ములేపాడు. రవీంద్ర జడేజా తాను సైతం అంటూ ఒక వికెట్(1/17) దక్కించుకున్నాడు.
ఈ క్రమంలో తొలి రోజే బ్యాటింగ్ మొదలుపెట్టిన టీమిండియాకు ఓపెనర్లు యశస్వి జైస్వాల్(57), రోహిత్ శర్మ శుభారంభం అందించారు. ఇక రెండో రోజు ఆటలో భాగంగా రోహిత్ శర్మ సెంచరీ(103) పూర్తి చేసుకోగా.. వన్‌డౌన్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్(110) సైతం శతక్కొట్టాడు.
వీరిద్దరికి తోడు అరంగేట్ర బ్యాటర్ దేవ్‌దవ్ పడిక్కల్(65), సర్ఫరాజ్ ఖాన్(56) అర్ధ శతకాలతో రాణించారు. ఫలితంగా శుక్రవారం నాటి ఆట ముగిసే సరికి టీమిండియా ఎనిమిది వికెట్ల నష్టానికి 473 పరుగులు స్కోరు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది.
ఈ క్రమంలో.. 473/8 ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం నాటి ఆట మొదలుపెట్టి.. కేవలం నాలుగు పరుగులు జతచేసి భారత్ ఆలౌట్ అయింది. 477 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగించి.. 259 పరుగుల ఆధిక్యం సంపాదించింది.
అనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లండ్.. టీమిండియా స్పిన్నర్ల ధాటిని తట్టుకోలేకపోయింది. 195 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో భారత్ జయభేరి మోగించింది.
ఐదుగురి అరంగేట్రం
ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్ సందర్భంగా రెండో టెస్టులో మధ్యప్రదేశ్ బ్యాటర్ రజత్ పాటిదార్.. మూడో టెస్టులో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, ఉత్తరప్రదేశ్ యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్.. నాలుగో టెస్టులో బెంగాల్ పేసర్ ఆకాశ్ దీప్.. ఐదో టెస్టులో దేవ్‌దత్ పడిక్కల్ అంతర్జాతీయ క్రికెట్‌లో అడగుపెట్టారు.
వీరిలో రజత్ పాటిదార్ మినహా మిగిలిన నలుగురు తమదైన ముద్ర వేయగలిగారు. ముఖ్యంగా ధర్మశాలలో జరిగిన ఐదో టెస్టులో సర్ఫరాజ్ ఖాన్ మెరుపు అర్ధ శతకం(56) సాధించగా.. అరంగేట్రంలోనే పడిక్కల్ సైతం హాఫ్ సెంచరీ(65)తో మెరిశాడు.
టీమిండియా వర్సెస్ ఇంగ్లండ్ ఐదో టెస్టు స్కోర్లు
►టాస్: ఇంగ్లండ్.. తొలుత బ్యాటింగ్
►ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 218
►భారత్ తొలి ఇన్నింగ్స్‌లో చేసిన పరుగులు: 477 (ఓవరాల్‌గా 259 పరుగుల ఆధిక్యం)
►ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 195
►విజేత: టీమిండియా.. ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో గెలుపు
►ఐదు మ్యాచ్‌ల సిరీస్ 4-1తో టీమిండియా కైవసం
►హైదరాబాద్‌లో తొలి టెస్టు గెలిచిన ఇంగ్లండ్.. ఆ తర్వాత విశాఖపట్నం, రాజ్‌కోట్, రాంచి.. తాజాగా ధర్మశాలలో టీమిండియా వరుస విజయాలు.
Comments
Please login to add a commentAdd a comment