పెట్రోల్‌ ట్యాంకు మీద కిట్‌ పెట్టి.. ఆ తర్వాత నన్నూ కూర్చోబెట్టి! | 'My Wife Didn't Know What She Was Getting Into': Ashwin's Emotional Tribute On 100th Test | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌ ట్యాంకు మీద కిట్‌ పెట్టి.. ఆ తర్వాత నన్నూ కూర్చోబెట్టి: అశ్విన్‌ భావోద్వేగం

Published Thu, Mar 7 2024 12:41 PM | Last Updated on Thu, Mar 7 2024 1:04 PM

My Wife Didnt Know What She Was Getting Into Ashwin Emotional Tribute 100th Test - Sakshi

భార్యాపిల్లలతో అశ్విన్‌ (PC: BCCI)

R Ashwin's Emotional Tribute On 100th Test: ‘‘క్రికెట్‌ టోర్నీల్లో ఐపీఎల్‌కు ఉన్న ఆదరణ వేరు. అందుకే చాలా మంది టీ20 క్రికెట్‌ ఆడి ఐపీఎల్‌లోకి రావాలని భావిస్తారు. వాళ్ల కలలు నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.

అయితే, ఒక్క విషయం మాత్రం ఆశావహ క్రికెటర్లందరూ గుర్తుపెట్టుకోవాలి. టెస్టు ఫార్మాట్‌ అనేది జీవితం నేర్పలేని పాఠాలెన్నింటినో నేర్పిస్తుంది. నా దృష్టిలో టెస్టు క్రికెట్‌ అంటే.. జీవితానికి సరికొత్త అర్థాన్నిచ్చే మంత్రం.

ఒత్తిడిని ఎలా తట్టుకోవాలి.. ప్రతికూలతలను ఎలా అధిగమించాలన్న విషయాలను బోధిస్తుంది. నా మనసులో ఎన్నో భావోద్వేగాలు చెలరేగుతున్నాయి. నాతో పాటు చెన్నైలో కూర్చుని ఉన్న ఓ వ్యక్తి కూడా ఉద్వేగాలతో ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉంటాడు.

నా క్రికెట్‌ కిట్‌ బైక్‌ పెట్రోల్‌ ట్యాంకు మీద పెట్టి..
దురదృష్టవశాత్తూ ఆయన ఇక్కడ లేరు. చిన్నతనంలో.. నా క్రికెట్‌ కిట్‌ బైక్‌ పెట్రోల్‌ ట్యాంకు మీద పెట్టి.. ఆ తర్వాత నన్ను కూడా ముందు కూర్చోబెట్టుకుని.. కోచింగ్‌ క్యాంపునకు తీసుకువెళ్లేవాడు.

ప్రభుత్వ ఉద్యోగి అయిన ఆయన.. తన కుమారుడు జీవితంలో.. కెరీర్‌లో ముందుకు వెళ్లాలని బలంగా కోరుకున్నారు. మా అమ్మ, మా తాతయ్య సహకారంతోనే ఆయన నన్ను ఈ స్థాయికి తీసుకురాగలిగారు. 

ప్రతి అడుగులోనూ నా వెన్నంటే ఉంది
ఇక నా భార్య.. నన్ను పెళ్లి చేసుకునే సమయంలో నా ఈ ప్రయాణం ఎక్కడిదాకా వెళ్తుందో ఆమెకు తెలియదు. అయినా.. ప్రతి అడుగులోనూ నా వెన్నంటే ఉంది.

నాకు ఇద్దరు ముద్దులొలికే పిల్లలు ఉన్నారు. వాళ్లు కూడా గత కొన్నేళ్లుగా నా క్రికెట్‌ జర్నీని అర్థం చేసుకుంటూ ఆస్వాదించగలుగుతున్నారు’’ అని టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు.

భారత్‌ తరఫున 100వ టెస్టు బరిలో దిగిన తరుణంలో.. తాను క్రికెటర్‌గా ఎదగడంలో తన తండ్రి రవిచంద్రన్‌ పాత్ర.. సుదీర్ఘకాలం కెరీర్‌ కొనసాగించడంలో తన భార్య ప్రీతి అండదండగా నిలిచిన తీరును గుర్తుచేసుకుని ఎమోషనల్‌ అయ్యాడు.

కాగా ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆఖరిదైన టెస్టు గురువారం మొదలైంది. ధర్మశాల వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌ అశ్విన్‌ కెరీర్‌లో వందో టెస్టు. ఇక ఈ ఘనత సాధించిన 14వ భారత ఆటగాడిగా  చెన్నై ఆల్‌రౌండర్‌ అశూ చరిత్రకెక్కాడు.  

చదవండి: టీమిండియా స్టార్‌ సంచలన నిర్ణయం?!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement