ప్రపంచంలో మొట్ట మొదటి బౌలర్‌గా అశ్విన్‌ అరుదైన ఘనత | IND Vs ENG: Ashwin Becomes 1st Bowler In 147 Years Of History With 5 Wicket Haul In Debut And 100th Test - Sakshi
Sakshi News home page

147 ఏళ్ల చరిత్ర: ప్రపంచంలో మొట్ట మొదటి బౌలర్‌గా అశ్విన్‌ అరుదైన ఘనత

Published Sat, Mar 9 2024 5:38 PM | Last Updated on Sat, Mar 9 2024 5:57 PM

Ind vs Eng: Ashwin Becomes 1st 147 Years History 5 For Debut And 100th Test - Sakshi

టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. క్రికెట్‌ ప్రపంచంలో ఏ బౌలర్‌కూ ఇంత వరకు సాధ్యం కాని ఘనత సాధించాడు. కాగా 2011లో అంతర్జాతీయ టెస్టుల్లో అడుగుపెట్టాడు ఈ చెన్నై ఆటగాడు.

ఢిల్లీ వేదికగా వెస్టిండీస్‌తో తన తొలి టెస్టు ఆడాడు. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీసిన ఈ రైటార్మ్‌ స్పిన్నర్‌.. రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లతో చెలరేగాడు.

అలా తన కెరీర్‌లో తొలి ఐదు వికెట్ల హాల్‌ నమోదు చేశాడు. తాజాగా తన వందో టెస్టులోనూ ఈ ఘనత సాధించాడు అశ్విన్‌. ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లకే పరిమితమైన అశూ.. రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లతో దుమ్ములేపాడు.

ఈ నేపథ్యంలో.. అరంగేట్రంలో, వందో టెస్టులో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన తొలి బౌలర్‌గా అశ్విన్‌ ప్రపంచ రికార్డు సొంతం చేసుకున్నాడు. 147 ఏళ్ల టెస్టు చరిత్రలో ఈ ఘనత సాధించిన ఏకైక బౌలర్‌గా నిలిచాడు.

కాగా అశ్విన్‌ తన కెరీర్‌లో ఇప్పటి వరకు మొత్తంగా 36 సార్లు ఐదు వికెట్ల హాల్‌ సాధించడం విశేషం. తద్వారా టీమిండియా స్పిన్‌ దిగ్గజం అనిల్‌ కుంబ్లే పేరిట ఉన్న రికార్డు(35 సార్లు) బద్దలు కొట్టాడు. 

అంతేకాదు ఒకే ప్రత్యర్థి జట్టుపైన అత్యధిక టెస్టు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గానూ నిలిచాడు. ఇప్పటి వరకు అశ్విన్‌.. ఆస్ట్రేలియా మీద 114, ఇంగ్లండ్‌ మీద 114 వికెట్లు తీశాడు. ఇక రవిచంద్రన్‌ అశ్విన్‌.. ఇంగ్లండ్‌తో సిరీస్‌ సందర్భంగానే 500 వికెట్లు క్లబ్‌లో చేరాడు. అతడి ఖాతాలో ప్రస్తుతం 516 వికెట్లు ఉన్నాయి.

ఇదిలా ఉంటే.. ధర్మశాలలో ఇంగ్లండ్‌తో జరిగిన నామమాత్రపు ఆఖరి టెస్టులో టీమిండియా భారీ విజయం సాధించింది. ఇన్నింగ్స్‌ 64 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకుంది. 

చదవండి: #Sarfaraz: తెగ మిడిసిపడుతున్నాడు.. గిల్‌- బెయిర్‌స్టో గొడవలో సర్ఫరాజ్‌.. వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement