టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన మైలురాయి ముంగిట నిలిచాడు. అంతర్జాతీయ కెరీర్‌లో ఇప్పటి వరకు 99 టెస్టులు ఆడిన ఈ ఆల్‌రౌండర్.. ధర్మశాలలో ‘సెంచరీ’ పూర్తి చేసుకోనున్నాడు.
ఇంగ్లండ్‌తో జరుగనున్న ఐదో టెస్టు సందర్భంగా అశూ ఈ ఫీట్ అందుకోనున్నాడు. ఈ నేపథ్యంలో దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లేతో మాట్లాడుతూ అశ్విన్ తన మనసులోని భావాలు పంచుకున్నాడు.
కెప్టెన్ అయితే బాగుండేది.. అశ్విన్ భావోద్వేగం
‘‘నా కెరీర్‌లో ఎన్నో ఎత్తుపళ్లాలు. ఎన్నో సవాళ్లు. ప్రతికూల సమయంలో.. ‘నాకే ఎందుకిలా జరుగుతోంది?’ అని బాధపడేవాడిని. అయితే, క్లిష్ట పరిస్థితులు, ఒత్తిళ్లను దాటినందు వల్లే ఈరోజు నాకంటూ ఈ గుర్తింపు వచ్చిందని, ఈ స్థాయికి చేరుకోగలిగానని అనిపిస్తోంది.
చాలా మంది నా దగ్గరకు వచ్చి.. ‘నీకు కెప్టెన్‌గా అవకాశం ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది’ అని అంటూ ఉంటారు. కానీ.. అది ఎప్పటికీ జరుగదనే విషయం నాకు తెలుసు. అందుకే మనసులో ఎలాంటి సంశయాలు పెట్టుకోకుండా హాయిగా ఉంటాను’’ అని అశూ భావోద్వేగానికి లోనయ్యాడు.
వాళ్లకు విఫలం కావడానికి మరిన్ని ఛాన్సులు
ఇదిలా ఉంటే.. విదేశీ గడ్డపై ముఖ్యంగా SENA(సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో అశ్విన్‌ను కాదని.. మరో స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకే బీసీసీఐ ప్రాధాన్యం ఇస్తోందన్న విషయం తెలిసిందే. ఈ అంశం గురించి ప్రస్తావనకు రాగా అశ్విన్ హుందాగా సమాధానమిచ్చాడు.
‘‘బ్యాటర్లతో పోలిస్తే బౌలర్లను ద్వితీయ శ్రేణి కిందే పరిగణిస్తారు. నేను ఒక్క మ్యాచ్‌లో విఫలమైతే వెంటనే పక్కనపెట్టేస్తారు. అదే వేరే వాళ్లకు విఫలం కావడానికి మరిన్ని ఛాన్సులు ఇస్తారు.
నాకు ఆ స్వార్థం లేదు
అయినా, నేను మనశ్శాంతిగానే ఉండగలుగుతాను. ఎందుకంటే.. కొన్ని కఠిన వాస్తవాలను అంగీకరించకతప్పదని నాకు తెలుసు. ఐదు రోజుల ఆట ముగిసిన తర్వాత జట్టు గెలిచిందా లేదా అన్న విషయానికి ప్రాధాన్యం ఇస్తాను. టీమిండియా గెలిస్తే నాకంతకంటే సంతోషం మరొకటి ఉండదు.
అంతేగానీ స్వప్రయోజనాల కోసం జట్టు ప్రయోజనాలను తాకట్టుపెట్టాలనే స్వార్థం నాకు లేదు’’ అని అశ్విన్ ఉద్వేగపూరితంగా మాట్లాడాడు. ఈ మేరకు జియో సినిమా షోలో అశూ వ్యాఖ్యలు చేశాడు.
500 వికెట్ల క్లబ్‌లో చేరిన ఘనుడు
కాగా ఇంగ్లండ్‌తో తాజా సిరీస్ మూడో టెస్టు సందర్భంగా అశ్విన్ 500 వికెట్ల క్లబ్(టెస్టు)లో చేరిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ధర్మశాలలో అశూతో పాటు ఇంగ్లండ్ క్రికెటర్ జానీ బెయిర్‌స్టో కూడా తన వందో టెస్టు ఆడబోతున్నాడు.
ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మకు విశ్రాంతినిచ్చి.. అశ్విన్ సారథ్య బాధ్యతలు అప్పగించడం ద్వారా వందో టెస్టు సెలబ్రేట్ చేస్తారని అభిమానులు భావించారు. అయితే, రోహిత్ ఇప్పటికే జట్టుతో చేరడంతో అశూకు ఆ ఛాన్స్ లేనట్లే కనిపిస్తోంది.
చదవండి: Anant- Radhika: రోహిత్ తిరుగు పయనం.. భయ్యాకు కోపం వచ్చిందంటే!
Comments
Please login to add a commentAdd a comment