ఎవరీ శశాంక్..? ఇన్నింగ్స్ చివర్లో వచ్చి.. సుడిగాలి వేగంతో..!
29 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 61 పరుగులు.. నాటౌట్..
25 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 46 నాటౌట్..
25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 41 పరుగులు..
28 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్స్‌లతో 68 నాటౌట్..
ఇలా ఐపీఎల్–2024లో ఈ బ్యాటర్ తన విధ్వంసాన్ని కొనసాగిస్తున్నాడు. ఇన్నింగ్స్ చివర్లో వచ్చి సుడిగాలి వేగంతో చెలరేగిపోతున్న అతని ఆటతీరు అభిమానులను అలరిస్తోంది. సింగిల్స్‌తో కాకుండా సిక్సర్లతోనే స్కోరుబోర్డును పరుగెత్తిస్తున్న ఆ శైలి ఈ సీజన్‌లో అతనికి కొత్త ఫ్యాన్స్‌ను తెచ్చి పెట్టింది. ముఖ్యంగా కోల్‌కతాతో మ్యాచ్‌లో 262 పరుగుల రికార్డు లక్ష్యాన్ని అందుకునే క్రమంలో మైదానంలో అన్ని వైపులకు అతను బాదిన ఎనిమిది సిక్సర్లు ఔరా అనిపించాయి.
ఐపీఎల్ ప్రతి ఏటా కొంత మంది కొత్త హీరోలను ప్రపంచానికి పరిచయం చేస్తుంది. లీగ్‌లో తమ జట్టు ఓవరాల్ ప్రదర్శనతో సంబంధం లేకుండా అప్పటి వరకు జాతీయ జట్టుకు ఆడకపోయినా కొందరి అద్భుత ప్రదర్శన ఫ్రాంచైజీ క్రికెట్‌కు కొత్త ఊపును, ఉత్సాహాన్ని ఇస్తుంది. అలాంటి ఒక ఆటగాడే శశాంక్ సింగ్. ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతూ అతను ప్రదర్శిస్తున్న సంచలన ఆటతీరుతో అందరి దృష్టిలో పడ్డాడు. ఐపీఎల్ వేలం సమయంలో తన ప్రమేయం లేకుండానే వివాదంలో నిలిచి అనూహ్యంగా జట్టులోకి వచ్చిన ఈ ఛత్తీస్‌గఢ్ ఆటగాడు ఇప్పుడు తన ఆటతోనే అందరికీ సమాధానమిచ్చాడు.
గత ఏడాది డిసెంబర్ 20న ఐపీఎల్–2024 సీజన్‌లో మిగిలిన స్థానాల కోసం వేలం జరిగింది. వేలం నిర్వహిస్తున్న మల్లికా సాగర్ ‘శశాంక్ సింగ్’ అనే పేరు ప్రకటించింది. అయితే ఏ ఫ్రాంచైజీ నుంచి కూడా స్పందన రాలేదు. ఆ తర్వాత మరో ఇద్దరు ఆటగాళ్లు వేలంలో అమ్ముడుపోయారు. ఆపై మళ్లీ ‘శశాంక్ సింగ్’ అనే పేరు వినిపించింది. అప్పటి వరకు వరుసగా యువ ఆటగాళ్లను తీసుకుంటూ పోతున్న పంజాబ్ కింగ్స్ యజమానులు కూడా ప్యాడిల్ ఎత్తి తమ ఆసక్తిని ప్రదర్శించారు.
రూ. 20 లక్షల కనీస విలువకు ఇతర జట్లేవీ ముందుకు రాకపోవడంతో శశాంక్‌ను పంజాబ్ తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు. అయితే కొద్ది క్షణాల తర్వాత అనూహ్యంగా పంజాబ్ యజమాని ప్రీతి జింటా తమకు ఈ ఆటగాడు అవసరం లేదంటూ వేలం నిర్వాహకులకు చెప్పేందుకు ప్రయత్నించారు. కానీ మీరు ఆలస్యం చేశారంటూ మల్లికా సాగర్ స్పష్టం చేసేసింది. దాంతో బలవంతంగా, కాస్త నిరాశగా శశాంక్‌ను పంజాబ్ తీసుకుంది.
దీనిపై పెద్ద దుమారం రేగింది. ఒక యువ ఆటగాడిని ఇలా అవమానపరుస్తారా అంటూ విమర్శలు వచ్చాయి. చివరకు కింగ్స్ యాజమాన్యం పలు రకాలుగా వివరణ ఇస్తూ తమ జట్టులోకి ఆహ్వానించింది. అయితే తాము వద్దనుకున్న ఆటగాడు ఎంత విలువైనవాడో సీజన్ సాగిన కొద్దీ యాజమాన్యానికి తెలిసొచ్చింది. శశాంక్ సింగ్ మాత్రం అన్నింటికీ ఒకే ఒక చిరునవ్వుతో సమాధానం ఇస్తూ మైదానంలో దూసుకుపోయాడు.
ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అందుకుంటూ..
బలమైన నేపథ్యం ఉన్నా..
‘నేను చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చాను. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను అని ఎవరైనా అంటే అవి ఆర్థికపరమైన కష్టాలే కానవసరం లేదు. గెలుపు దారిలో ఎన్నో ప్రతికూలతలు ఎదురవుతాయి. మానసికంగా దృఢంగా ఉండటంతో పాటు పట్టుదలగా నిలబడితేనే ముందుకు వెళ్లగలం’ అని శశాంక్ సింగ్ తన గురించి తాను చెప్పుకున్నాడు. ఎందుకంటే శశాంక్ తండ్రి సీనియర్ ఐపీఎస్ అధికారి (ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో స్పెషల్ డీజీగా పని చేస్తున్నారు).
ఆయనకు క్రికెట్ అంటే పిచ్చి. 1996 వరల్డ్ కప్ సమయంలో ఐదేళ్ల వయసున్న శశాంక్‌కు తొలిసారి క్రికెట్‌లో ఓనమాలు నేర్పించారు. అప్పటికి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఏర్పడలేదు. శశాంక్ పుట్టిన భిలాయ్ మధ్యప్రదేశ్‌లోనే ఉంది. చిన్న వయసులోనే ఆటలో చురుకుదనం చూపించిన శశాంక్ మధ్యప్రదేశ్ అండర్–15, అండర్–17 జట్ల తరఫున ఆడాడు. ఇక సీనియర్ స్థాయికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణంలో తండ్రి తీసుకున్న ఒక నిర్ణయం శశాంక్ కెరీర్ గతి తప్పేలా చేసింది.
తనకు ముంబైకి బదిలీ కావడంతో కొడుకును కూడా అక్కడకు తీసుకెళ్లారు. నిజానికి ముంబైలో ఉంటే మంచి శిక్షణ లభిస్తుందని, ఆడేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయని ఆయన సానుకూల రీతిలోనే ఆలోచించారు. కానీ అక్కడికి వెళ్లాక అంచనా తప్పి అంతా తలకిందులైంది.
దేశవాళీలో అవకాశాలు దక్కినా..
ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా.. లీగ్‌లతో మొదలు పెట్టి శశాంక్ అన్ని రకాల గుర్తింపు పొందిన టోర్నీలలో ఆడాడు. అప్పటినుంచే అతనికి దూకుడైన, విధ్వంసక ఆటగాడిగా, భారీ సిక్సర్లు కొట్టేవాడిగా గుర్తింపు వచ్చింది. సంప్రదాయానికి భిన్నంగా ఉండే అతని టెక్నిక్‌తో శశాంక్ పరుగుల వరద పారించాడు. ఒక లీగ్ మ్యాచ్‌లో అతను ఒక్కరోజే ట్రిపుల్ సెంచరీ కొట్టాడు. దాంతో 2014–15 సీజన్‌లోనే ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై తరఫున అరంగేట్రం చేసే అవకాశం లభించింది.
ఆ తర్వాత ఇదే జోరులో వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ కోసం కూడా ముంబై జట్టులోకి ఎంపికయ్యాడు. అయితే ఆ తర్వాత అసలు కథ మొదలైంది. ఆ సమయంలో జట్టులో ఉన్న రహానే, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, అభిషేక్ నాయర్, శార్దూల్ ఠాకూర్, సిద్దేశ్ లాడ్ వంటి స్థానిక ఆటగాళ్లను దాటి తుది జట్టులో చోటు దక్కించుకోవడం చాలా కష్టంగా మారిపోయింది. దాంతో పాటు శశాంక్‌ను అంతా ముంబైకి చెందని ‘పరాయివాడు’గా చూడటం మొదలైంది.
దాంతో ప్రదర్శన ఎంత బాగున్నా ఒక్క మ్యాచ్‌లో ఆడే అవకాశం ఇస్తే నాలుగు మ్యాచ్‌లలో ఆడించకుండా కూర్చోబెట్టసాగారు. దాంతో నాలుగేళ్ల పాటు జట్టుతో ఉన్నా రంజీ ట్రోఫీలో ఆడే అవకాశమే రాలేదు. ఇది శశాంక్‌ను తీవ్ర అసహనానికి గురిచేసింది.
పంజాబ్ జట్టు యజమాని ప్రీతీ జింతాతో..
పట్టుదలతో పైకి లేచి..
‘అది నాకు కష్టకాలం. అయితే నేను ఎవరినీ నిందించలేదు. విమర్శలు చేయలేదు. నా ఆటపై నాకు నమ్మకముంది. ఇది నా కెరీర్ కోసం సరైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం. నా సమస్యను నేనే పరిష్కరించుకుంటానని, మీ సహకారం అవసరం లేదని కూడా నాన్నకు స్పష్టంగా చెప్పా. అందుకే జట్టు మారాలని నిర్ణయించుకున్నా’నని చెబుతూ శశాంక్ నాటి రోజులను గుర్తు చేసుకున్నాడు. ముంబై నుంచి మారాలని నిర్ణయించుకున్న తర్వాత దేశవాళీలో పుదుచ్చేరిని ఎంపిక చేసుకొని ఒక సీజన్ పాటు ఆడాడు. కానీ అది మరీ బలహీన జట్టు కావడంతో తాను ఆశించిన ఫలితం దక్కలేదు.
చివరకు తనకు సరైంది తన రాష్ట్రమే అని అతను అర్థం చేసుకున్నాడు. ఛత్తీస్‌గఢ్ కోచ్ దేవేంద్ర బుందేలా సలహా మేరకు టీమ్‌లోకి వచ్చిన శశాంక్ 2019–20 సీజన్‌లో రంజీ ట్రోఫీలోకి అడుగు పెట్టాడు. దాంతో తన కెరీర్‌లో ఏదో సాధించిన సంతృప్తి. గత ఏడాది విజయ్ హజారే వన్డే టోర్నీలో మణిపూర్‌తో మ్యాచ్‌లో 150 పరుగులు చేయడంతో పాటు 5 వికెట్లు తీసిన శశాంక్ ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు.
అయితే అతనికి మరింత సంతృప్తినిచ్చిన విజయం నాలుగేళ్ల క్రితం విజయ్ హజారే ట్రోఫీలోనే వచ్చింది. ముంబై జట్టులో తనతో కలసి ఆడిన పలువురు క్రికెటర్లు అన్నివైపుల నుంచి స్లెడ్జింగ్ చేస్తుండగా కీలక ఇన్నింగ్స్ ఆడి తొలిసారి ముంబైపై 5 వికెట్ల తేడాతో ఛత్తీస్‌గఢ్ విజయం సాధించడం అతనికి ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
ఐపీఎల్‌లో ఆలస్యంగా..
ఈ ఏడాది ఐపీఎల్‌లో మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగిపోతున్న శశాంక్ ప్రయాణం ఇక్కడా గొప్పగా సాగలేదు. 2017 నుంచి 2021 మధ్య ఢిల్లీ, రాజస్థాన్ జట్లతో ఉన్నా ఐపీఎల్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. ఎట్టకేలకు 2022లో సన్‌రైజర్స్ తరఫున బరిలోకి దిగి తొలి మ్యాచ్‌లో 6 బంతుల్లోనే 25 పరుగులు సాధించి వెలుగులోకి వచ్చాడు. అయితే ఇలాంటి ప్రదర్శన తర్వాత కూడా అక్కడ పెద్దగా అవకాశాలు రాలేదు.
గత సీజన్‌లో అయితే ఆడే చాన్సే రాలేదు. కానీ ఇప్పుడు అనూహ్యంగా దక్కిన ఆపర్చునిటీని అతను రెండు చేతులతో ఒడిసి పట్టుకున్నాడు. ప్రత్యర్థి బౌలర్లపై చెలరేగిపోతూ ధనాధన్ బ్యాటింగ్‌తో లీగ్‌పై తనదైన ముద్ర వేశాడు. ‘నా కొడుకు జీవితంలో కొత్త వెలుగు వచ్చేందుకు బాగా ఆలస్యమైంది. ఇది నన్ను నిరాశపరచే అంశం’ అంటూ తండ్రి బాధపడినా.. తనకు అలాంటి చింత ఏమీ లేదని, ప్రతికూలతలను దాటి తాను వచ్చిన స్థాయి పట్ల సంతృప్తిగా ఉన్నానని శశాంక్ చెప్పుకున్నాడు.
కొన్నేళ్ల క్రితం క్రికెట్‌లో పరిస్థితులు చూసి సివిల్ సర్వీసెస్ కోసం ప్రిపరేషన్ మొదలు పెట్టినా.. ఆటపై ప్రేమ కుదురుగా ఉండనీయక మళ్లీ అతను బ్యాట్ పట్టేలా చేసింది. 32 ఏళ్ల వయసులో భారత జట్టులో స్థానాన్ని ఆశించే విషయంలో ఏమీ చెప్పలేకపోయినా.. అతని ఆట చూస్తే ఏదోరోజు అద్భుతం జరగవచ్చని మాత్రం అనిపిస్తోంది. – మొహమ్మద్ అబ్దుల్ హాది
ఇవి చదవండి: Mothers day 2024 అమ్మలూ మీరూ, మీ ఆరోగ్యం జాగ్రత్త!
Comments
Please login to add a commentAdd a comment