30, డిసెంబర్ 2002.. ఘోర రోడ్డు ప్రమాదం.. చావుకు సమీపంగా వెళ్లి అదృష్టవశాత్తు ప్రాణాలు దక్కించుకున్న రోజు.. 23 మార్చి, 2024.. ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరఫున కెప్టెన్‌గా బరిలోకి దిగిన రోజు.. ఈ రెండు ఘటనల మధ్య దాదాపు 15 నెలల సమయం ఉంది. ఈ మధ్య కాలంలో బాధ, వేదన ఉంది. జీవితంతో పోరాడిన సంఘర్షణ ఉంది. బతికితే చాలు.. ఆట గురించి అసలు ఆలోచనేరాని క్షణం నుంచి వేలాది మంది సమక్షంలో మళ్లీ క్రికెట్ ఆడగలిగే అవకాశం రావడం వరకు ఒక అసాధ్యాన్ని సాధ్యం చేసిన అద్భుతం ఉంది. అన్నింటికి మించి ఆ మనిషి నరనరాల్లో పట్టుదల ఉంది.
అదే పట్టుదల, అదే పంతం అతడిని మళ్లీ నిలబెట్టింది. అసలు ఆడగలడా అనుకున్న సగటు భారత క్రికెట్ అభిమానులంతా అతడిని గ్రౌండ్‌లో చూస్తూ సంతోషంగా ఆహ్వానించిన క్షణం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆ యువకుడే 26 ఏళ్ల రిషభ్ పంత్. భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్. అద్భుత ప్రదర్శనలతో దూసుకుపోతున్న దశలో జరిగిన కారు ప్రమాదం పంత్ కెరీర్‌కు చిన్న కామా పెట్టింది. కానీ అతను ఈ సవాల్‌ను స్వీకరించి మళ్లీ అగ్రశ్రేణి మ్యాచ్‌లు ఆడే వరకు రావడం అసాధారణం. అతని పునరాగమనం స్ఫూర్తిదాయకం.
భారత క్రికెట్‌లో రిషభ్ పంత్ ఒక సంచలనం. దూకుడైన ఎడమ చేతి వాటం బ్యాటర్ కమ్ వికెట్ కీపర్‌గా 2016 అండర్–19 ప్రపంచకప్‌లో సత్తా చాటడంతో అతనేంటో అందరికీ తెలిసింది. వేగవంతమైన అర్ధ సెంచరీ, సెంచరీలతో అతను చెలరేగాడు. భారత్ టైటిల్ గెలుచుకోకపోయినా మనకు దక్కిన సానుకూల ఫలితాల్లో పంత్ వెలుగులోకి రావడం ఒకటి. అతని ప్రదర్శన ఊరికే పోలేదు. ఐపీఎల్ వేలంలో ఢిల్లీ డేర్ డెవిల్స్ అతడిని తమ జట్టులోకి తీసుకుంది. మరో వైపు ఢిల్లీ రంజీ టీమ్‌లో కూడా రెగ్యులర్ సభ్యుడిగా మారిన అతను కెప్టెన్సీ బాధ్యతలనూ తీసుకున్నాడు.
ముస్తాక్ అలీ టి20 ట్రోఫీలో 32 బంతుల్లో పంత్ కొట్టిన రికార్డు సెంచరీ అతని స్థాయిని పెంచింది. ఆ జోరు చూసిన ఢిల్లీ ఐపీఎల్ టీమ్ మరే ఆలోచన లేకుండా అతణ్ణి జట్టులో కొనసాగించింది. ఇన్ని సీజన్లు ముగిసినా అప్పటి నుంచి ఇప్పటి వరకు అతను అదే జట్టుతో ఉండటం విశేషం. 2017లో ఐపీఎల్ జరుగుతున్న సమయంలో తండ్రి ఆకస్మిక మరణం 20 ఏళ్ల ఆ కుర్రాడిని కుంగదీసింది. అయితే అంత్యక్రియలు ముగిసిన 48 గంటల్లోనే తిరిగి వచ్చి మళ్లీ ఐపీఎల్‌లో తన మెరుపులను ప్రదర్శిస్తూ 57 పరుగులు చేశాడు. తర్వాతి సీజన్‌లో సన్‌రైజర్స్‌పై చెలరేగి పంత్ కొట్టిన సెంచరీ లీగ్‌లో బెస్ట్ ఇన్నింగ్స్‌లలో ఒకటిగా నిలిచిపోయింది.
ఒకే ఒక లక్ష్యంతో..
పంత్ సాధారణ నేపథ్యం నుంచి వచ్చాడు. తండ్రి రాజేందర్ ఒక ప్రైవేట్ స్కూల్‌ను నడిపేవాడు. ఉత్తరాఖండ్‌లోని రూర్కీ స్వస్థలం కాగా క్రికెట్ అవకాశాల కోసం ఢిల్లీ వైపు చూడాల్సి వచ్చింది. రూర్కీ నుంచి ఢిల్లీ ఆరున్నర గంటల ప్రయాణం. చిన్నప్పటి నుంచి అన్ని చోట్లకు అతని తల్లి సరోజ్ తోడుగా వచ్చేది. ఢిల్లీలోని ప్రముఖ కోచ్ తారక్ సిన్హాకు చెందిన సానెట్ అకాడమీలో అతను శిక్షణ తీసుకున్నాడు. 12 ఏళ్ల వయసులో జరిగిన ఒక ఘటన పంత్‌లో ఆటకు సంబంధించి పట్టుదలను పెంచింది.
సెలక్షన్స్, కోచింగ్ కోసం 45 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండిపోవాల్సి వచ్చింది. అయితే వసతి కోసం డబ్బులు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో స్థానికంగా మోతీబాగ్‌లోని ఒక గురుద్వారాలోనే తల్లి, కొడుకులు ఉన్నారు. ఆ సమయంలోనే తాను భారత్‌కు ఆడాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు అతను చెప్పుకున్నాడు. ఐపీఎల్‌లో అవకాశం దక్కినా.. టీమిండియా ప్లేయర్‌గా వచ్చే గుర్తింపు కోసం అతను శ్రమించాడు. కొన్నాళ్లకే అతని కల నెరవేరింది. భారత జట్టులో అవకాశం దక్కించుకున్న అతను కొన్ని చిరస్మరణీయ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.
మన గిల్లీ..
అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడమ్ గిల్‌క్రిస్ట్‌ను పంత్ గుర్తుకు తెచ్చాడు. తన మూడో టెస్టులోనే ఇంగ్లండ్ గడ్డపై అద్భుత సెంచరీతో అతను ఆకట్టుకున్నాడు. తర్వాతి ఏడాది ఆస్ట్రేలియా గడ్డపై సిడ్నీలో 159 పరుగులతో తన బ్యాటింగ్ పదును చూపించాడు. భారత జట్టు ఆస్ట్రేలియాలో తొలి సిరీస్ గెలిచేందుకు ఇది ఉపకరించింది. తర్వాతి ఏడాది సిడ్నీలోనే 97 పరుగులతో రాణించిన అతను ఈ మ్యాచ్‌ను డ్రాగా ముగించడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే అసలు ఘనత తర్వాతి టెస్టులోనే బ్రిస్‌బేన్‌లో వచ్చింది. భారత్‌కు ఓటమి తప్పదనుకున్న మ్యాచ్‌లో అజేయంగా 89 పరుగులతో అతను జట్టును గెలిపించిన తీరు ఈ సిరీస్ విజయాన్ని చిరస్మరణీయంగా మార్చింది. అంతకు ముందే రంజీ ట్రోఫీలో పంత్ చేసిన ట్రిపుల్ సెంచరీ అతను పైస్థాయికి చేరగలడనే నమ్మకాన్ని కలిగించింది.
మూడు దశల ప్రణాళికతో..
రిషభ్ పంత్‌కు ఎదురైన ప్రమాద తీవ్రత చూస్తే పరిస్థితి చాలా ఘోరంగా ఉండింది. చావు నుంచి తప్పించుకోవడం మాత్రమే ఊరట కలిగించే అంశం. మిగతా అన్నీ ప్రతికూల అంశాలే. ఆట సంగతేమో కానీ ముందు సాధారణ జీవితమైతే గడపగలగాలి కదా! చాలారోజుల వరకు ఆస్పత్రిలోనే ఉన్నాడు. శస్త్ర చికిత్సలు, స్కానింగ్, పరీక్షలు, రిపోర్టులతోనే సాగిపోయింది.
2022 డిసెంబర్‌లో పంత్‌కి జరిగిన రోడ్డు ప్రమాదం
అలాంటి స్థితిలో పంత్ తన కోసం తాను ఒక కొత్త ప్రణాళికను రూపొందించుకోవాల్సి వచ్చింది. ప్రమాదం నుంచి మైదానం వరకు అతను తన పురోగతిని మూడు రకాలుగా విభజించుకొని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ముందుగా ఆరోగ్యపరంగా సాధారణ స్థితికి రావడం. ఆటగాడి కోణంలో కాకుండా ఒక సామాన్యుడు ప్రమాదం బారిన పడితే వైద్యుల పర్యవేక్షణలో ఏం చేస్తాడో పంత్ కూడా అదే చేశాడు. ముందుగా కోలుకోవడం, ఇతరుల సహాయం లేకుండా నడక, తన పనులు తాను సొంతంగా చేసుకోవడంపై దృష్టి పెట్టాడు. రెండో క్రమంలో జనరల్ ఫిట్‌నెస్‌పై శ్రద్ధ తీసుకున్నాడు.
తేలికపాటి ఎక్సర్‌సైజ్‌లు, యోగావంటి వాటితో తన ఆరోగ్యాన్ని కాపాడుకున్నాడు. ఆపై మూడో దశకు వచ్చే సరికి క్రికెటర్ మ్యాచ్ ఫిట్‌నెస్ కోసం శ్రమించాడు. ఈ విషయంలో బీసీసీఐకి చెందిన జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) ఎంతో సహాయం అందించింది. డైట్, స్ట్రెంత్ అండ్ కండిషనింగ్, ఫిజియో ఏర్పాటు.. ఇలా అన్ని రకాలుగా ఒక్కో అడుగు ముందుకు వేసుకుంటూ పంత్ సిద్ధమయ్యాడు.
గాయాల నుంచి కోలుకుంటూ
లీగ్‌లో సత్తా చాటి..
‘నేను మళ్లీ క్రికెట్‌లో అరంగేట్రం చేస్తున్నట్లుగా అనిపిస్తోంది. నాకు ఎదురైన దురదృష్టకర ఘటనలను దాటి మళ్లీ క్రికెట్ ఆడటం అంటే కొత్త జన్మ ఎత్తినట్లు’ అని తొలి మ్యాచ్‌కు ముందు పంత్ స్వయంగా చెప్పుకున్నాడు. ఐపీఎల్‌లో 2024లో పంత్ మ్యాచ్‌లు చూసినవారికి పంత్ పురోగతి ఆశ్చర్యం కలిగించింది. అసలు ఎప్పుడూ ఏ ప్రమాదం జరగనట్లుగా, కొంత విరామం తర్వాత మాత్రమే అతను ఆటలోకి వచ్చినట్లుగా కనిపిస్తున్నాడు.
బ్యాటింగ్‌లో పదును, వికెట్ కీపింగ్‌లో చురుకుదనం, మైదానంలో అతని కదలికలు, కెప్టెన్సీ నైపుణ్యం కొత్త పంత్‌ను చూపిస్తున్నాయి. మరో సందేహం లేకుండా పూర్తి ఫిట్‌నెస్ స్థాయిని అతను ప్రదర్శించాడు. ముఖ్యంగా బ్యాటింగ్‌లో గతంలోలాగే ర్యాంప్ షాట్‌లు, స్విచ్ హిట్‌లు, ఒంటి చేత్తో సిక్సర్లు, ఏ బౌలర్‌నూ వదలకుండా అతను ఆధిపత్యం చూపించడం సగటు క్రికెట్ అభిమానిని సంతృప్తిపరచాయి. ఎందుకంటే లీగ్‌లో ఎవరికి ఆడినా అతను భారత క్రికెట్ భవిష్యత్తు అనే విషయం అందరికీ తెలుసు.
ఇంత తక్కువ సమయంలో కోలుకోవడంలో అతని వయసు కూడా కీలక పాత్ర పోషించడం వాస్తవమే అయినా.. అన్ని రకాల ప్రతికూలతలను దాటి అతను సగర్వంగా నిలిచాడు. అతని పోరాటానికి హ్యాట్సాఫ్ చెబుతూ మున్ముందు భారత్‌కు పంత్ మరిన్ని విజయాలు అందించాలని ఆశిద్దాం! — మొహమ్మద్ అబ్దుల్ హాది
Comments
Please login to add a commentAdd a comment