‘అనుకోలేదని ఆగవు కొన్ని!’ నిజమే... ఇంటర్ వరకు తాను క్రికెట్‌లోకి అడుగు పెడతానని శ్రీచరణి అనుకోలేదు. ఖోఖో, లాంగ్‌జంప్‌లలో అండర్–14 విభాగంలో రాష్ట్రస్థాయిలో పతకాలు గెలుచుకున్న శ్రీచరణి ఇంటర్ చదివే రోజుల్లో క్రికెట్‌పై ఆసక్తి పెంచుకుంది. క్రికెట్ గ్రౌండ్‌లోకి అడుగుపెట్టింది. ఆటలో తనను తాను మెరుగుపరుచుకుంటూ ఆల్‌రౌండర్ అనిపించుకుంది. తాజా విషయానికి వస్తే... మహిళల ప్రీమియర్ లీగ్ 2025 కోసం నిర్వహించిన మినీ వేలంలో శ్రీచరణిని ఎంపిక చేసుకోవడానికి ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. ‘దిల్లీ క్యాపిటల్స్’ రూ.55 లక్షలతో శ్రీచరణిని ఎంపిక చేసుకుంది.
కడప జిల్లా యర్రంపల్లి గ్రామానికి చెందిన శ్రీచరణి అందరిలాగే ఎంతోమంది స్టార్ క్రికెటర్‌ల అద్భుతాలు చూస్తూ, వింటూ వస్తోంది. ఇప్పుడు ఆమె ఒక అద్భుతంగా, మోడల్‌గా నిలిచింది. ‘శ్రీచరణి మా ఊరు అమ్మాయే’ అని గ్రామస్థులు గర్వంగా చెప్పుకునేలా చేసింది.
యర్రంపల్లి గ్రామానికి చెందిన నల్లపురెడ్డి చంద్రశేఖరరెడ్డి, రేణుక దంపతుల కుమార్తె శ్రీచరణి. తండ్రి ఆర్‌టీపీపీలో ఎలక్ట్రికల్ ఫోర్‌మెన్. ఒకటి నుంచి పదవ తరగతి వరకు ఆర్‌టీపీపీలోని డీఏవీ స్కూల్‌లో చదివింది శ్రీచరణి. ఇంటర్మీడియట్ హైదరాబాద్‌లోని లేపాక్షి జూనియర్ కళాశాలలో పూర్తిచేసింది. ప్రస్తుతం వీరపునాయునిపల్లెలోని వీఆర్‌ఎస్ డిగ్రీ కళా శాలలో బీఎస్సీ, కంప్యూటర్స్
చదువుతూ మరోవైపు క్రికెట్‌లో రాణిస్తోంది.
2017–18లో క్రికెట్‌లో జిల్లా అండర్–19 జట్టుకు ఎంపికైంది. అప్పటినుంచి ఇక వెనక్కి తిరిగిచూసే అవసరం రాలేదు. అదేఏడాది రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం వచ్చింది. 2020లో సీనియర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం వచ్చింది. జిల్లాకు చెందిన శిక్షకులు ఖాజామైనుద్దీన్, మధుసూదన్‌రెడ్డి మార్గదర్శకత్వంలో ఎన్నో మెలకువలు నేర్చుకుంది.
మెరుగైన శిక్షణ కోసం కడపకు చెందిన మాజీ రంజీ క్రీడాకారుడు ఎం. సురేష్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ‘సురేష్ క్రికెట్ అకాడమీ’లో శిక్షణ పొందుతూ ఆంధ్రా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోంది. ప్రస్తుతం కోల్‌కతాలో నిర్వహిస్తున్న బీసీసీఐ మహిళల సీనియర్ క్రికెట్ మ్యాచ్‌లలో ఆంధ్రా జట్టుకు ఆడుతుంది.పెద్ద పట్టణాల్లో ఉండే అమ్మాయిలు మాత్రమే క్రికెట్‌లో రాణిస్తారని, జాతీయస్థాయిలో ఆడతారనే అపోహను బ్రేక్ చేసింది. ‘నీ ఇష్టానికి కష్టం తోడైతే... అదే విజయం’ అంటున్న శ్రీ చరణి ఎంతోమంది గ్రామీణ ప్రాంత అమ్మాయిలకు స్ఫూర్తిని ఇస్తోంది. – నాగరాజు, కడప ఫోటోలు: వల్లెపు శ్రీనివాసులు
ఆ నమ్మకం ఉంది
చిన్నప్పటి నుంచి నాకు ఆటలంటే ఎంతో ఇష్టం. అమ్మానాన్నలు ఎంతో ్రపోత్సహించేవారు. అథ్లెటిక్స్‌లో రాణిస్తున్న నేను క్రికెట్‌పై ఆసక్తి చూపినప్పుడు అమ్మానాన్నలు మొదట సందేహించారు. అయితే మామ కిశోర్ కుమార్ మాత్రం ్రపోత్సహించేవారు. నేను క్రికెట్‌లో కూడా రాణిస్తుండడంతో అమ్మానాన్నలకు నాపై నమ్మకం వచ్చి సంతోషంగా ఉన్నారు. మనలో పట్టుదల ఉంటే ప్రతికూల పరిస్థితులు కూడా అనుకూలంగా మారి దారి చూపుతాయి. సరదాగా మొదలుపెట్టిన క్రికెట్ ఇప్పుడు నాకు సర్వస్వం అయింది. రానున్న కాలంలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తానన్న నమ్మకం ఉంది. – శ్రీచరణి
సత్తా చాటేలా...
2021లో అండర్–19 చాలెంజర్స్ ట్రోఫీలో ఇండియా–సి జట్టుకు ప్రాతినిధ్యం వహించిన శ్రీచరణి 4 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. గత ఏడాది నిర్వహించిన బీసీసీఐ సీనియర్ అంతర్ రాష్ట్ర మహిళల క్రికెట్ మ్యాచ్‌లలో ఆంధ్రా జట్టుకు ప్రాతినిధ్యం వహించి కర్నాటక జట్టుపై 7 వికెట్లు, అండర్–23 మ్యాచ్‌లలో రాజస్థాన్ జట్టుపై 5 వికెట్లు తీసి ఉత్తమ ప్రదర్శన కనబరిచింది.
లెఫ్ట్‌ఆర్మ్ బౌలర్‌గా, లెఫ్ట్‌హ్యాండ్ బ్యాట్స్ ఉమన్‌గా నిలకడగా రాణిస్తుండటంతో ఇటీవల నిర్వహించిన ఉమెన్ టీ–20 పోటీల్లో ఆంధ్రాజట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం వచ్చింది. తన బౌలింగ్ తీరుతో సెలెక్టర్‌ల దృష్టిని ఆకర్షించింది. గత నెలలో ముంబై ఇండియన్స్ జట్టు ఎంపికలకు వెళ్లిన సమయంలో శ్రీచరణి ఆటలోని నైపుణ్యం గుర్తించిన డబ్ల్యూపీఎల్ ప్రతినిధులు దిల్లీ క్యాపిటల్స్‌కు రూ.55లక్షలతో ఎంపిక చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment