స్పోర్ట్స్: లైఫ్‌స్టోరీ
అక్టోబర్ 2023.. హాంగ్జూలో ఆసియా క్రీడలు జరుగుతున్నాయి. ఆర్చరీ రికర్వ్ ఈవెంట్‌లో ఆంధ్రప్రదేశ్ కుర్రాడొకడు పోటీ పడుతున్నాడు. వ్యక్తిగత విభాగంలో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్. రెండో సెట్‌లో మొదటి బాణంతో సున్నా స్కోరు.. నాలుగో సెట్ రెండో బాణంతో సున్నా స్కోరు.. మొత్తం ఎనిమిది బాణాల వ్యవధిలో రెండు 0, 0 స్కోర్లు.. ఎవరూ ఊహించని రీతిలో అతి ఘోరమైన ప్రదర్శన.. ఆ కుర్రాడు కన్నీళ్ల పర్యంతమయ్యాడు.
నవంబర్ 2023.. థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో ఆర్చరీ కాంటినెంటల్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్... ఈ కీలక పోరులో అదే కుర్రాడు తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు.. ఈసారి ఒక్క బాణం కూడా గురి తప్పలేదు. తన ప్రతిభనంతా ప్రదర్శిస్తూ అతను చెలరేగిపోయాడు. ఫలితంగా ఈ ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ పాల్గొనేందుకు అవసరమైన తొలి అర్హత (కోటా)ను అందించాడు. తనతో పాటు సహచరులందరిలోనూ సంతృప్తి.
ఆసియా క్రీడల్లో వైఫల్యంతో చోకర్ అంటూ అన్నివైపుల నుంచి విమర్శలపాలై ఆపై ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం వరకు నెల రోజుల వ్యవధిలో అతను జీరో నుంచి హీరోగా మారాడు. ఆ ఆర్చర్ పేరు బొమ్మదేవర ధీరజ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ధీరజ్ గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
‘పించింగ్’.. దీరజ్ చేసిన పొరపాటుకు సాంకేతిక నామమిది. ఆర్చర్ లక్ష్యం దిశగా బాణాలు విసురుతున్న సమయంలో ఆటగాడి ప్రమేయం లేకుండా మూడో వేలు పొరపాటున బాణం చివరన తగిలితే అది దిశ లేకుండా ఎక్కడితో దూసుకెళ్లిపోతుంది. ఇది సాంకేతికంగా జరిగిన తప్పే కావచ్చు. కానీ ఫలితం చూస్తే ఆర్చర్‌దే పెద్ద వైఫల్యంగా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అతడిని మరీ పేలవమైన ఆటగాడిగా చూపిస్తుంది. ఇలాంటి అనుభవమే ధీరజ్‌కు ఎదురైంది. ఆర్చరీలో 9 పాయింట్లు సాధించిప్పుడు, ఆపై పర్‌ఫెక్ట్ 10 సాధించలేని సందర్భాల్లో కూడా ఆర్చర్లు తీవ్రంగా నిరాశ చెందుతారు.
అలాంటి సున్నా పాయింట్లు అంటే పెద్ద వైఫల్యం కిందే లెక్క. ఈ స్థితిలో ధీరజ్ అసలు తన లోకంలో తాను లేనట్లుగా కుప్పకూలిపోయి పోటీ నుంచి ఓటమిపాలై నిష్క్రమించాడు. జట్టు సహచరులు ‘నీ తప్పేం లేద’ంటూ ఓదార్చే ప్రయత్నం చేసినా అతని బాధ తగ్గలేదు. ‘క్రికెట్‌లో అంటే సాధారణ అభిమానులకు ఎక్కడ తప్పు జరిగిందో స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఆర్చరీలో సాంకేతికాంశాలను నేను ఎలా వివరించగలను. ఇలాంటివి ఏమీ తెలియకుండా నన్ను ఆన్‌లైన్‌లో చాలామంది తీవ్ర పదజాలంతో దూషించారు. మాటల్లో చెప్పలేనంత వేదన అనుభవించాను’ అని ధీరజ్ నాటి ఘటనను గుర్తు చేసుకుంటాడు.
బలంగా పైకి లేచి..
క్రీడల్లో కింద పడటం కొత్త కాదు కాని, పడ్డ ప్రతిసారి పైకి లేచేందుకు క్రీడలు అవకాశం కల్పిస్తాయి. ఘోర వైఫల్యం ఒకటి ఎదురైతే, ఆ తర్వాత మళ్లీ దానిని సరిదిద్దుకునే అవకాశం వస్తుంది. ధీరజ్ విషయంలో కూడా ఇదే జరిగింది. కేవలం నాలుగు రోజుల్లోనే అతను తన తప్పును దిద్దుకొని సత్తా చాటేందుకు అదే ఆసియా క్రీడల టీమ్ ఈవెంట్ వేదికగా మారింది.
‘నా వల్ల కాదు’ అంటూ ధీరజ్ సహచరులకు చెప్పినా, ‘నువ్వు బాణాలు సంధించు చాలు అంతా బాగుంటుంది’ అంటూ వారు ధైర్యం చెప్పారు. చివరకు భారత జట్టు టీమ్ విభాగంలో సగర్వంగా ఫైనల్ చేరి రజత పతకాన్ని సొంతం చేసుకుంది. అతాను దాస్, తుషార్ షెల్కే, ధీరజ్‌లతో కూడిన జట్టు రెండో స్థానంలో నిలిచింది. ఆర్చరీలో ఆల్‌టైమ్ గ్రేట్ టీమ్ కొరియాతో జరిగిన ఫైనల్లో ఓటమిపాలైనా, ఓవరాల్ ప్రదర్శన భారత్‌కు సంతృప్తినిచ్చింది. ధీరజ్ కూడా కీలక సమయాల్లో పర్‌ఫెక్ట్ స్కోర్లతో తన వంతు పాత్ర పోషించాడు.
అలా మొదలై..
ధీరజ్ స్వస్థలం విజయవాడ. చాలామంది చిన్నపిల్లల్లాగే బాణాలతో ఆడుకునే సరదా ఆ తర్వాత అసలైన ఆట వైపు మళ్లించింది. ఐదేళ్ల వయసులో అతను ఈ ఆటవైపు బాగా ఆకర్షితుడై విల్లును అందుకున్నాడు. ఉపాధ్యాయుడైన తండ్రి తన కుమారుడిని నిరుత్సాహపరచకుండా ఆర్చరీలో ప్రాథమిక శిక్షణ వైపు తీసుకెళ్లాడు.
నగరంలోని ప్రముఖ ఓల్గా ఆర్చరీ అకాడమీలో ధీరజ్ ఓనమాలు నేర్చుకున్నాడు. కోచ్‌లు చెరుకూరి లెనిన్, చెరుకూరి సత్యనారాయణ మార్గనిర్దేశనంలో అతని ఆట పదునెక్కింది. అకాడమీలో జార్ఖండ్ నుంచి వచ్చిన ఇతర కోచ్‌లు కూడా అతని ప్రతిభను గుర్తించి తీర్చిదిద్దారు. దాంతో స్థానికంగా, చిన్న స్థాయి టోర్నీల్లో విజయాలు సాధిస్తూ ధీరజ్ గుర్తింపు తెచ్చుకున్నాడు.
అదే మలుపు..
వరుస విజయాలతో దిగువ స్థాయిలో తన ప్రతిభను నిరూపించుకుంటూ వచ్చిన ధీరజ్‌కు కెరీర్‌లో మరింత పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది. అయితే ఆర్థిక సమస్యలతో పాటు ఇతర ప్రతికూలతలు ఇబ్బందిగా మారాయి.
ఇలాంటి సమయంలో క్రీడా ఎన్జీఓ ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ (ఓజీక్యూ) ధీరజ్ ఆటను గుర్తించడం అతని కెరీర్‌లో కీలకమైన మలుపు. 2017లో ప్రతిభాన్వేషణలో భాగంగా నిర్వహించిన సెలక్షన్స్‌లో ఓజీక్యూ ప్రతినిధి అనుకూల్ భరద్వాజ్ దృష్టిలో పడ్డాడు. తమ జూనియర్ ప్రోగ్రామ్‌లో ధీరజ్‌ను చేర్చుకొని వారు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అత్యుత్తమ స్థాయిలో శిక్షణ, అంతర్జాతీయ స్థాయి ఎక్విప్‌మెంట్‌తో ధీరజ్ తన ఆటకు పదును పెట్టుకున్నాడు.
ఈ క్రమంలో కొన్ని పరాజయాలు ఎదురైనా, అవి అతని కెరీర్‌కు ప్రతిబంధకం కాలేదు. 2018 యూత్ ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత జట్టులో అతనికి స్థానం దక్కలేదు. ఆ తర్వాత టోక్యో ఒలింపిక్స్ ట్రయల్స్‌లో కూడా నాలుగో స్థానంలో నిలవడంతో ఆ అవకాశమూ పోయింది. అయితే ఈ ఓటముల నుంచి పాఠాలు నేర్చుకంటూ ధీరజ్ ఇతర టోర్నీల్లో సత్తా చాటుతూ వచ్చాడు.
ఆర్మీ అండదండలతో..
2017లో ఆసియా అవుట్‌డోర్ చాంపియన్‌షిప్‌లో వ్యక్తిగత రజతం, 2018లో ఆసియా గ్రాండ్ ప్రి టీమ్ ఈవెంట్‌లో రజతంతో ధీరజ్‌కు తగిన గుర్తింపు దక్కింది. అయితే అతని కెరీర్ గత రెండేళ్లలో మరింతగా దూసుకుపోయింది. ఈ క్రమంలో పుణేలోని ఆర్మీ స్పోర్ట్స్ ఇన్‌స్టిట్యూట్ అతని ఆటకు మరింత మెరుగులు దిద్దుకునేందుకు అవకాశం కల్పించింది. అక్కడ చేరిన అనంతరం కొరియా కోచ్ కిమ్‌హగ్‌యాంగ్ శిక్షణలో ధీరజ్ రాటుదేలాడు.
ఇది అతని ప్రదర్శనలలో, ఫలితాల్లో కనిపించింది. వరుసగా పెద్ద విజయాలు ధీరజ్ ఖాతాలో చేరాయి. వరల్డ్ యూత్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో టీమ్ స్వర్ణం, వరల్డ్ కప్‌లో 1 స్వర్ణం, 3 రజతాలు, ఆసియా గ్రాండ్ ప్రిలో 2 స్వర్ణాలతో పాటు గత ఆసియా క్రీడల్లో రజతంతో అతని కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శన నమోదైంది. ఆసియా క్రీడల సెలక్షన్ ట్రయల్స్‌లో భాగంగా అతను కొత్త ప్రపంచ రికార్డును సృష్టించడం విశేషం.
కోల్‌కతాలో జరిగిన ఈవెంట్‌లో మొత్తం 1140 పాయింట్లతో అమెరికాకు చెందిన బ్రాడీ ఎలిసన్ గత రికార్డు (1386)ను అతను సవరించాడు. ఆర్మీలో సుబేదార్ హోదాలో ఉన్న ధీరజ్ ఇప్పుడు పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం మరో పెద్ద అవకాశాన్ని కల్పించింది. ఆర్చరీలో అతి కష్టమైన, బాగా ఉండే ఈవెంట్ పురుషుల రికర్వ్ విభాగం. అయితే ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 14వ స్థానంలో ఉన్న ధీరజ్ చూపిస్తున్న ఫామ్, ఆత్మవిశ్వాసం భారత్‌కు ఒలింపిక్స్ చరిత్రలో తొలి ఆర్చరీ పతకాన్ని అందించవచ్చు. — మొహమ్మద్ అబ్దుల్ హాది
Comments
Please login to add a commentAdd a comment