ఉత్తరప్రదేశ్‌లోని హపూర్‌లో పుట్టింది ఫైజా సైఫీ. నలుగురు సంతానంలో పెద్దమ్మాయి. ఫైజా తండ్రి ఫరీదాబాద్‌లో పనిచేసేవారు. దీంతో ఫైజా కూడా అక్కడే చదివింది. కాస్త పెద్దయ్యేసరికి ‘‘మనం మన సంప్రదాయాలు కచ్చితంగా పాటించాలి’’ అని ఇంట్లో వారు చెప్పేవాళ్లు. వయసుతోపాటు నిబంధనలు పెరిగాయి. తనకు నచ్చని ఆంక్షలు పాటించడానికి ఫైజా ఒకపట్టాన ఇష్టపడేది కాదు. టీనేజ్‌లోకి రాగానే ‘‘ఇది చేయకూడదు, అది చేయకూడదు, అలా ఉండు, ఇలా ఉండు’’ అని చెప్పేవారితో ‘అలా ఎందుకు?’ అని వాదిస్తుండేది.'
‘‘అత్తారింటికి వెళ్లాక పనులన్నీ నువ్వే చేయాలి’’ అని చెప్పినప్పుడు తనకు ఇష్టం లేకపోయినా.. ఉదయం నాలుగ్గంటలకే లేచి ఇంటిపనులు చేసేది. స్కూలు నుంచి వచ్చాక కూడా ఇంటిపనులు చూసుకోక తప్పేది కాదు. ఇలా పనులు చూసుకుంటూనే 2003లో పదో తరగతి పాసైంది. ఆ తరువాత ఢిల్లీ సంబంధం వస్తే పెళ్లిచేశారు ఫైజాకు.
ఇల్లు కాస్తా జైలైంది..
పెళ్లి అంటే ఏంటో తెలియని వయసులో.. తనకంటే బాగా ఎక్కువ వయసు ఉన్న వ్యక్తితో వివాహం జరిగింది. భర్తకు మూర్ఛరోగంతో పాటు మానసిక సమస్యలు ఉండడంతో కోపం వచ్చినప్పుడల్లా ఫైజాను విపరీతంగా కొట్టేవాడు. దీనికితోడు పుట్టింట్లో ఎప్పుడూ ధరించని బురఖాను అత్తారింట్లో తప్పనిసరిగా వేసుకోవాలని హుకుం జారీ చేశారు. దీంతో ఫైజాకు జైల్లో ఉన్నట్లు అనిపించింది. రోజంతా గొడ్డు చాకిరి.. అడుగడుగుకీ ఆంక్షలు.. అత్తారింటి బాధలు భరించలేక అమ్మావాళ్ల దగ్గర గోడు వెళ్లబోసుకున్నా.. ‘‘సమాజంలో పరువు, మర్యాదలు..’’ అని చెప్పి నోరు మూయించేవారు. ఎవరికీ చెప్పుకోలేక తనలో తాను కుమిలిపోయేది ఫైజా.
పిల్లలు పుట్టాక కూడా..
అత్తారింట్లో ప్రసవం అయిన తరువాత వారానికే ఇంటి పనులు ఫైజా నెత్తిన పడ్డాయి. పెద్దకుటుంబం కావడంతో.. ఒక్కొక్కరు ఒక్కో రకమైన రుచిని కోరుతూ తను చేయగలదా.. లేదా..? అని కూడా చూడకుండా ఆమెను వండమని బలవంతం చేసేవాళ్లు. దీంతో ఫైజా నడుము నొప్పి, మైగ్రేన్, థైరాయిడ్, ఆస్తమాల బారిన పడి బాగా నీరసించిపోయింది. తిన్నావా? మందులు వేసుకున్నావా? అని అడిగేవారు ఒక్కరూ లేరు.
ఇంత కష్టంలోనూ.. తన రెండున్నరేళ్ల కొడుకుని ప్లేస్కూల్లో దింపడానికి వెళ్లేది ఫైజా. అక్కడ పరిచయమైన టీచర్‌తో.. తనకు చదువుకోవాలని ఉందంటూ తన ఇంటి పరిస్థితులను వివరించి చెప్పింది. అప్పుడు టీచర్ ప్రైవేటుగా చదువుకోవచ్చని సలహా చెప్పడంతో చదవడం ప్రారంభించింది. పరీక్షలు ఉన్నప్పుడు పుట్టింటికి వెళ్లి అక్కడనుంచి రాసేది. పెద్దబాబుకి ఐదేళ్లు వచ్చేటప్పటికి రెండో బాబు కడుపులో పడ్డాడు. ఈసారి ఫైజా ఆరోగ్యం మరింత క్షీణించింది. మెడ నొప్పి, హై బీపీ వంటి సమస్యలు తలెత్తాయి.
టీవీలో యోగా చూసి..
ఒకరోజు ఫైజా ఆరోగ్యం బాగా క్షీణించడంతో పుట్టింటికి పంపించేశారు. అక్కడ ఆయుర్వేద మందులు వాడడంతో కొంత ఉపశమనం లభించింది. ఆ తరవాత రెండో బాబును ప్రసవించింది. ప్రసవం తరువాత పదిహేనురోజులు పుట్టింటిల్లోనే ఉంది. ఆ సమయంలో ఒకరోజు టీవీలో వస్తోన్న యోగా కార్యక్రమాలను చూసింది.
యోగాతో అనారోగ్యాలు నయం అవుతాయని తెలుసుకుని యోగా నేర్చుకోవడం ప్రారంభించింది. ఎవరికీ తెలియకుండా ఆసనాలు వేసేది. ఆసనాలు వేసేకొద్ది తన ఆరోగ్యం కుదుటపడడం గమనించింది ఫైజా. యోగా గురించి ఇతరులకు సలహాలు ఇస్తుండేది. రహస్యంగా ఇంటర్మీడియట్ పూర్తిచేసిన తరువాత హిమాలయ యూనివర్శిటీలో యోగా, ఆక్యుప్రెజర్ థెరపీ, ఆయుర్వేదంలో డిప్లొమా చేసింది.
ఆ రోజు రానేవచ్చింది!
ఫైజా ఎవరికీ తెలియకుండా చదువుకున్నప్పటికీ అత్తారింట్లో అన్నీ తెలిసిపోయాయి. దాంతో ఆమెను కొత్తరకంగా హింసించడం, అకారణంగా చేయి చేసుచేసుకోవడం మొదలు పెట్టారు. ఫైజా భర్త ట్రిపుల్ తలాఖ్ చెప్పి.. రెండో పెళ్లికి రెడీ అయిపోయాడు. అంతటితో ఫైజాకు అత్తారింటితో సంబంధాలు తెగిపోయాయి. పుట్టింటిలో కొన్నిరోజులు ఉన్న తరువాత.. ‘‘నీ వల్ల చెల్లెళ్లు, తమ్ముళ్లకు పెళ్లిళ్లు కావు.
నువ్వు మీ అత్తారింటికి వెళ్లు. అక్కడే సర్దుకుపో’’ అని సతాయించడం మొదలు పెట్టారు ఫైజా తల్లిదండ్రులు. దాదాపు పదేళ్లపాటు అత్తారింట్లో అనుభవించిన నరకాన్ని మళ్లీ ఎదుర్కోవాలనుకోలేదు ఫైజా. తల్లిదండ్రులకు చెప్పినా అర్థం చేసుకోరు. వేరే దారిలేక తన పిల్లలను తీసుకుని ఫరీదాబాద్‌లో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌లో చేరింది. ఇక్కడ రెడ్ క్రాస్ సొసైటీ సాయం, మరోపక్క రూమ్‌మేట్స్ కూడా పిల్లలను ఉంచుకోవడానికి ఒప్పుకోవడంతో ఉద్యోగంలో చేరింది.
యోగా టీచర్‌గా..
స్కూల్లో టీచర్‌గా చేరిన ఫైజా యోగా తరగతులు చెప్పేది. అలా చెబుతూ 2013లో ‘ఫైజా యోగా’ పేరుతో సొంతంగా ఇన్‌స్టిట్యూట్‌ను పెట్టుకుంది. ప్రారంభంలో రోజుకి యాభైగా ఉన్న విద్యార్థుల సంఖ్య ఇప్పుడు ఐదువందలకు పైకి చేరింది. ఇన్‌స్టిట్యూట్‌లో తరగతులేగాక యోగా క్యాంప్స్‌కూడా నిర్వహిస్తోంది ఫైజా. ఫీజులు చెల్లించలేనివారికి ఉచితంగా యోగా నేర్పించి వారిని యోగా ఇన్‌స్ట్రక్టర్‌లుగా మారుస్తోంది. ఫైజా ఇన్‌స్టిట్యూషన్ గురించి తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు సైతం ఆమెతో సంబంధాలను పునరుద్ధరించుకోవడం మొదలుపెట్టారు. అలా ఆమె జీవితం యోగవంతం అయింది.
ఆరోగ్యంగా.. ఆనందంగా..
'నాకు ఢిల్లీ, ముంబై, అమెరికా, కువైట్‌ల నుంచి క్లైంట్లు ఉన్నారు. ఆన్‌లైన్ తరగతులు చెబుతున్నాను. ఏళ్లపాటు ప్రయత్నించినా గర్భం దాల్చని వారు సైతం నేను అందించే ప్రత్యేకమైన యోగా థెరపీ ద్వారా పిల్లల్ని కంటున్నారు. నా దగ్గర యోగా నేర్చుకునేవారిలో చాలామంది బీపీ, గుండె సమస్యలు, అధిక బరువు, డయాబెటిస్, థైరాయిడ్, ఆందోళన, నిరాశా నిస్పృహల నుంచి బయటపడి ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తున్నారు.
తమ్ముడు, చెల్లి కూడా నా దగ్గర యోగా నేర్చుకుని ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకుంటున్నారు. యోగా నాతోపాటు చాలామందిని ఆరోగ్యంగా, ఆత్మవిశ్వాసంతో నిలబెడుతోంది. యోగా వల్లే ఈ రోజు నేను, నా ఇద్దరు కొడుకులు ఆరోగ్యంగా, ఆనందంగా బతక గలుగుతున్నాం. అమ్మాయిలూ.. మీ నిర్ణయాలు మీరే తీసుకోండి. ఎవరి మీదా ఆధారపడకండి. ఇతరుల మీద ఆధారపడినంత కాలం ఆత్మవిశ్వాసం కోల్పోతారు. మిమ్మల్ని మీరు నమ్ముకుంటే.. నాలాగా ఏదైనా సాధించగలుగుతారు.!' – ఫైజా సైఫీ
ఇవి కూడా చదవండి: Pranav Shukla: పండుటాకులే పిల్లలుగా..
Comments
Please login to add a commentAdd a comment