
కలి విడి పడక...
కాలం మారుతోంది, మారుతోన్న కాలంతో పాటు సాంకేతికతా మారుతోంది. అయితే ఇదే తరుణంలో మనుషుల ఆలోచన ధోరణి మరింతగా మారుతోంది. దైనందిన వ్యవహారాలలో చిత్రవిచిత్రమైన పోకడలు చోటు చేసుకుంటున్నాయి. అసలు ఇలాంటివి కూడా ఉంటాయా అనేవిధమైన అలవాట్లు, పద్ధతులు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ ట్రెండ్ వేగంగా విస్తరిస్తోంది. అదే స్లీపింగ్ డివోర్స్. విడాకుల గురించి అందరికీ తెలుసు. మరి ఈ నిద్ర విడాకులు ఏంటనేగా సందేహం. అయితే ఈ కథనంలోకి వెళ్లవలసిందే!
ప్రస్తుతం సమాజంలో నిద్ర విషయంలో ఒక కొత్త ట్రెండు మొదలైంది. మనుషుల ఆలోచన ధోరణి మారడంతో స్లీపింగ్ డివోర్స్ ఇప్పుడు కుటుంబాలలో ఒక భాగంగా మారింది. అంటే నిద్ర విడాకులు.. అంటే మరేంటో కాదు... రాత్రిపూట నిద్రపోయే సమయంలో భార్యాభర్తలు విడివిడిగా వేరువేరు గదుల్లో పడుకుని ఎవరికి వారు హాయిగా నిద్రపోతారు. తెల్లవారి లేచిన తర్వాత మళ్లీ ఇంట్లో కలిసి ఉంటారు. దీనినే స్లీపింగ్ డివోర్స్ అంటారు.
రాత్రి పడుకున్న తర్వాత ఒకరు స్మార్ట్‌ఫోన్ వినియోగిస్తూ ఉండడం, ఒకరికి ఇష్టం లేకుండా మరొకరు గట్టిగా హత్తుకుని పడుకోవడం లాంటి సమస్యలకు పరిష్కారంగా చాలా జంటలు స్లీపింగ్ డైవర్స్ విధానాన్ని అవలంబిస్తున్నారు. అయితే ఈ స్లీపింగ్ డివోర్స్‌తో మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అంటే.. లాభనష్టాలు రెండూ ఉంటాయి!
దంపతుల మధ్య బంధం బలంగా ఉండాలంటే వారు కలిసి పడుకుంటేనే మంచిదని మానసిక వైద్య నిపుణులంటారు. కానీ ఇప్పుడు భార్యాభర్తల మధ్య బంధం బలంగా ఉండాలంటే, ఎలాంటి గొడవలు లేకుండా ఉండాలంటే విడివిడిగా పడుకోవడమే మంచిదని చెబుతున్నారు. వివాహబంధాన్ని కాపాడుకోవడానికే ఈ ట్రెండు ఫాలో అవుతున్నట్టు చెబుతున్నారు.
ఎవరి వెర్షన్ వారిదే...
నిద్ర అసమానతలతో ఇద్దరు ఒకేచోట పడుకుని రోజూ కీచులాడుకునే కంటే, విడివిడిగా పడుకొని మిగతా సమయాలలో కలిసి ఉండటం ఉత్తమమని కొందరు చెబుతున్నారు. అయితే ఇలా భార్యాభర్తలు విడివిడిగా పడుకోవడం వల్ల వారి మధ్య బంధం బలహీనంగా మారుతుందని, ఒకరినొకరు అర్థం చేసుకునే స్వభావం తగ్గుతుందని కొందరు మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. ఏది ఏమైనా స్లీపింగ్ డివోర్స్ విషయంలో ఎవరి వర్షన్ వాళ్ళది.. ఎవరైనా సరే హాయిగా నిద్రపోవడమే ముఖ్యమని చెబుతూ ఉండడం గమనార్హం. పైగా వివాహ బంధాన్ని కాపాడుకోవడానికి ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నట్లు చెబుతుండడం గమనార్హం. ఒకే బెడ్‌పై కలిసి పడుకోవాల్సిన కపుల్స్.. వేరువేరు గదుల్లో పడుకోవడం లేదా, వేరు వేరు మంచాలపై పడుకోవడం వల్ల ఎవరూ నష్టపోయే పని ఏం ఉండదని కొందరి వాదన.
కలిసి పడుకునే సమయంలో వచ్చే గురక, దుప్పటిని ఇద్దరు పంచుకోవడం, ఇద్దరిలో ఒకరు స్మార్ట్‌ఫోన్ వాడడం, ఒకరికి ఇష్టం లేకుండా మరొకరు హత్తుకోవడం ఇలా ఎన్నో సమస్యలకు చెక్ పెట్టేందుకే నిద్ర విడాకులు విధానాన్ని అవలంబిస్తున్నారు. అయితే, ఇలా విడివిడిగా నిద్రించడంతో కంటినిండా నిద్రపట్టి మరుసటి రోజు మరింత యాక్టివ్‌గా టూర్‌లో పాల్గొన్నట్టు అనేక మంది చెప్పుకొచ్చారు.
ఈ స్లీప్ డివోర్స్ కారణంగా లాభనష్టాలు రెండూ ఉన్నాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఒకేచోట ఇష్టం లేకుండా కలిసి పడుకోవడం వల్ల బంధాలు బీటలు వారేకంటే విడివిడిగా ఉంటూ సంతోషంగా ఉండడమే బెటర్ అనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే దీర్ఘకాలంగా జంటలు కలిసి నిద్రించకపోతే ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. బంధం బలోపేతంగా ఉండాలంటే కచ్చితంగా కపుల్స్ కలిసి పడుకోవాలని సూచిస్తున్నారు.
భాగస్వాములు ఇద్దరి నిద్రలో ఉండే అసమానతల కారణంగా ఒకరివల్ల మరొకరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని, ఈ స్లీపింగ్ డైవర్స్ ట్రెండును ఫాలో అవుతున్నారు. ఎవరికి వారు ప్రశాంతంగా సుఖంగా నిద్ర΄ోవడానికి విడివిడి గదులను లేదా విడివిడి పడకలను ఎంచుకుంటున్నారు. అన్నింటికీ మించి భార్యాభర్తల మధ్య గురక సమస్య...భాగస్వాముల నిద్రలో అసమానతలే కారణం. పురుషుల్లో 45 శాతం మంది భాగస్వామికి దూరంగా విడిగా పడుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారట. అయితే, మహిళల్లో మాత్రం కేవలం 25 శాతం మందే ఇందుకు సుముఖంగా ఉన్నట్టు పరిశోధకుల అంచనా.
ఇదీ చదవండి: ఒక్క సోలార్ బోట్ కోసం అధిక జీతమిచ్చే ఉద్యోగం, అన్నీ వదిలేశారు!
ఇటీవల హిల్టన్ ట్రెండ్స్ పేరిట విడుదలైన ఓ నివేదికలో పలు ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూశాయి. ఈ నివేదిక ప్రకారం, రోజుల తరబడి టూర్లకు వెళ్లే జంటల్లో ఏకంగా 63 శాతం మంది ఒంటరిగా నిద్రించేందుకే మొగ్గు చూపుతున్నారట. అంతేకాకుండా ఇలా చేస్తే కంటినిండా నిద్ర పట్టిందని, మరుసటి రోజు టూర్‌ను బాగా ఎంజాయ్ చేశామని చెబుతున్నారు. ఇక పిల్లాజల్లాతో వెళ్లేవాళ్లు కూడా తమ బిడ్డల్ని వేరే గదిలో నిద్రపుచ్చేందుకే మొగ్గు చూపుతున్నారట. ఈ ట్రెండ్‌పై అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్ కూడా దృష్టి సారించింది. కమ్మటి నిద్రకోసమే తాము విడివిడిగా పడుకున్నట్టు అనేక జంటలు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment