Sports: తాను '700ల మైలు రాయిని' దాటిన వండర్సన్‌..! | James Anderson Has A Great Place In The History Of Cricket, Know Interesting Facts About Him In Telugu - Sakshi
Sakshi News home page

Sports: తాను '700ల మైలు రాయిని' దాటిన వండర్సన్‌..!

Published Sun, Mar 24 2024 1:10 PM | Last Updated on Sun, Mar 24 2024 2:17 PM

James Anderson Has A Great Place In The History Of Cricket - Sakshi

41 సంవత్సరాల 7 నెలల 8 రోజులు.. ఈ వయసులో అంతర్జాతీయ క్రీడల్లో చాలా మంది రిటైర్మెంట్‌ తీసుకొని ఎక్కడో ఒక చోట కోచ్‌గానో లేక వ్యాఖ్యాతగానో పని చేస్తూ ఉంటారు. లేదంటే ఆటకు దూరంగా దానితో సంబంధం లేకుండా కుటుంబంతో సమయం గడుపుతూ ఉంటారు. కానీ జేమ్స్‌ అండర్సన్‌ ఇంకా క్రికెట్‌ మైదానంలో పరుగెడుతూ ఉన్నాడు. పట్టుదలగా బౌలింగ్‌ చేస్తూ ప్రత్యర్థిని నిలువరించే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఈ పోరాటతత్త్వమే అతడిని ప్రత్యేకంగా నిలబెట్టింది. ఏకంగా 700 వికెట్ల మైలురాయిని అందుకునేలా చేసింది. 21 ఏళ్లుగా సాగుతున్న అంతర్జాతీయ కెరీర్‌ అతని స్థాయి ఏమిటో చూపిస్తే, అలసట లేకుండా సాగుతున్న ప్రయాణం ఎన్నో అద్భుత ప్రదర్శనలను ప్రపంచ క్రికెట్‌ అభిమానులకు అందించింది.

సాధారణంగా బ్యాటర్లు ఎక్కువ సంవత్సరాలు ఆటలో కొనసాగడంలో విశేషం లేదు. గతంలోనూ చాలామంది ఇంతకంటే ఎక్కువ ఏళ్లు క్రికెట్‌ ఆడారు. కానీ ఎంతో కఠోర శ్రమతో కూడిన పేస్‌ బౌలింగ్‌లో అన్ని ప్రతికూలతలను, గాయాలను దాటి ఒక బౌలర్‌ ఇలా సత్తా చాటడం ఎంతో అరుదైన విషయం. 2002లో తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడిన జిమ్మీ అండర్సన్‌ తన సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో ఘనతలను తన పేరిట లిఖించుకున్నాడు. వరల్డ్‌ క్రికెట్‌ ఆల్‌టైమ్‌ గ్రేట్‌లలో ఒకడిగా సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. 

187 టెస్టు మ్యాచ్‌లు.. జిమ్మీ అండర్సన్‌ కెరీర్‌ ఇది. ప్రపంచ క్రికెట్‌లో బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ (200) మాత్రమే ఇంతకంటే ఎక్కువ టెస్టులు ఆడాడు. 16 ఏళ్లకే అరంగేట్రం చేసిన బ్యాటర్‌గా సచిన్‌తో పోలిస్తే 20 ఏళ్ల వయసులో తొలి టెస్టు ఆడిన అండర్సన్‌ కెరీర్‌ ప్రస్థానం పూర్తిగా భిన్నం. టి–20ల కాలంలో నాలుగు ఓవర్లు వేయగానే అలసిపోతున్న ఈతరం బౌలర్లతో పోటీ పడుతూ రోజుకు 15–20 వరకు అంతర్జాతీయ టెస్టుల్లో బౌలింగ్‌ చేయడం అసాధారణం. వీటికి 194 వన్డేలు అదనం. టెస్టులు, వన్డేలు కలిపి అతను దాదాపు 50 వేల బంతులు బౌలింగ్‌ చేశాడు. వన్డేలకు దాదాపు 9 ఏళ్ల క్రితమే వీడ్కోలు పలికినా టెస్టుల్లో ఇంకా అదే జోరును అండర్సన్‌ కొనసాగించి చూపిస్తున్నాడు.

ఒకే ఒక లక్ష్యంతో..
జేమ్స్‌ అండర్సన్‌ క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకోవడంలో ఎప్పుడూ ఎలాంటి సమస్యా రాలేదు. అతను చిన్నప్పటినుంచే క్రికెట్‌ అంటే బాగా ఇష్టపడ్డాడు. చూడటంతో పాటు క్రికెట్‌ కోసమే పుట్టినట్లుగా ఆడేవాడు. అందుకే ఇంట్లోనూ ప్రోత్సాహం లభించింది. స్కూల్‌ క్రికెట్‌నుంచే అతను బౌలింగ్‌పై దృష్టి పెట్టాడు. సాధనతో ఆపై పూర్తి స్థాయి పేస్‌ బౌలర్‌గా సత్తా చాటాడు. దాంతో వరుసగా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి.

స్థానిక లాంక్‌షైర్‌ కౌంటీ మైనర్‌ లీగ్‌లలో అండర్సన్‌ సత్తా చాటాడు. దాంతో లాంక్‌షైర్‌ ప్రధాన కౌంటీ టీమ్‌ తరఫున ఆడేందుకు ఎంపికయ్యాడు. అండర్సన్‌ ఎంత మెరుగ్గా కౌంటీల్లో ప్రభావం చూపించాడంటే లాంక్‌షైర్‌ తరఫున కేవలం 3 వన్డేలు ఆడగానే అతనికి ఇంగ్లండ్‌ జాతీయ జట్టులో చోటు లభించడం విశేషం. తన జెర్సీపై కనీసం తన పేరు, నంబర్‌ కూడా లేకుండానే హడావిడిగా టీమ్‌తో కలిసిన అండర్సన్‌ అడిలైడ్‌లో ఆస్ట్రేలియాపై అద్భుతమైన బౌలింగ్‌ను ప్రదర్శించాడు. దాంతో 2003 వరల్డ్‌ కప్‌ అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. ఇలా మొదలైన ఆరంభం రెండు దశాబ్దాలుగా గొప్పగా సాగుతూనే ఉంది.

అత్యుత్తమ బౌలింగ్‌ ప్రదర్శనలతో..
అండర్సన్‌ కెరీర్‌ ఆరంభంలో రెండు పార్శా్వలతో సాగింది. చక్కటి బౌలింగ్‌తో లయతో సాగుతున్నప్పుడు అతనిలాంటి మంచి బౌలర్‌ ఎవరూ లేరన్నట్లుగా వికెట్ల వర్షం కురిసింది. కానీ ఒక్కసారి లయ కోల్పోతే అంత చెత్త బౌలర్‌ లేరన్నట్లుగా బ్యాటర్లు చితకబాదారు. లార్డ్స్‌ మైదానంలో తన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనే ఐదు వికెట్లతో తన రాకను ఘనంగా చాటడం, ఆ తర్వాత కొద్ది రోజులకే పాకిస్తాన్‌పై వన్డేల్లో హ్యట్రిక్‌ అతడికి తగిన గుర్తింపును తెచ్చి పెట్టాయి. కానీ అప్పటికే ఇంగ్లండ్‌ జట్టులో పలువురు సీనియర్లు పాతుకుపోయి ఉండటంతో తగినన్ని అవకాశాలు దక్కలేదు. దాంతో విరామాలతో వచ్చిన అవకాశాల్లో అండర్సన్‌ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు.

అయితే 2005 తర్వాత ఇంగ్లండ్‌ ప్రధాన పేసర్లంతా ఆటకు గుడ్‌బై చెప్పడంతో వచ్చిన అండర్సన్‌ ఇక వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. వెలింగ్టన్‌లో న్యూజిలాండ్‌పై చెలరేగి ఐదు వికెట్ల ప్రదర్శనతో జట్టును గెలిపించడంతో టీమ్‌లో స్థానం సుస్థిరమైంది. సంప్రదాయ స్వింగ్, సీమ్‌ బౌలింగ్‌తో పాటు రివర్స్‌ స్వింగ్‌ విద్యలో కూడా ఆరితేరిన తర్వాత అండర్సన్‌ మరింత ప్రమాదకరంగా మారాడు. కెరీర్‌ ఆరంభంలో తన యాక్షన్‌ను మార్చుకొని కొంత ఇబ్బందిపడిన అతను కొద్ది రోజులకే మళ్లీ తన పాత్‌ సైడ్‌ ఆర్మ్‌ యాక్షన్‌కు వచ్చి అద్భుతాలు చేశాడు. ముఖ్యంగా 2010 తర్వాత అండర్సన్‌ తనను తాను అత్యుత్తమ పేసర్‌గా తీర్చి దిద్దుకున్నాడు.

ఇంగ్లండ్‌లో హీరో లేదా జీరో అయ్యేందుకు ఎప్పుడూ అవకాశం ఉండే సిరీస్‌ యాషెస్‌. సొంత గడ్డపై పలుమార్లు ఆసీస్‌ బ్యాటర్ల పని పట్టిన అండర్సన్‌ కెరీర్‌లో 2010–11 ఆస్ట్రేలియా పర్యటన హైలైట్‌గా నిలిచింది. ఆసీస్‌ను వారి సొంతగడ్డపై 3–1తో చిత్తుగా ఓడించడంలో 24 వికెట్లతో అండర్సన్‌ ప్రధాన పాత్ర పోషించాడు. టెస్టు క్రికెట్‌పైనే పూర్తిగా దృష్టి పెట్టేందుకు 2015 వరల్డ్‌ కప్‌ తర్వాత వన్డేలకు గుడ్‌బై చెప్పిన అండర్సన్‌ తాను అనుకున్నట్లుగా ఈ ఫార్మాట్‌లో మరిన్ని గొప్ప ప్రదర్శనలను తన ఖాతాలో వేసుకున్నాడు.

ప్రపంచవ్యాప్తంగా చెలరేగి..
అండర్సన్‌ సొంత మైదానాల్లో మాత్రమే రాణిస్తాడని, వాతావరణంలో కాస్త మంచు, తేమ ఉంటేనే స్వింగ్‌తో చెలరేగుతాడనేది అతనిపై పలు సందర్భాల్లో వచ్చిన విమర్శ. అయితే ఒక్కో ఏడాది ఆటలో రాటుదేలుతూ పోయిన తర్వాత ఇలాంటి విమర్శలకు అతను చెక్‌ పెట్టాడు. ఇంగ్లండ్‌లోని అన్ని వేదికలపై అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాల్లో సహజంగానే అతని పేరు కనిపిస్తుంది. కానీ వీటికి తోడు  శ్రీలంకలోని గాలేలో 6 వికెట్లు, కేప్‌టౌన్‌లో 5 వికెట్లు, అడిలైడ్‌లో 5 వికెట్లు, 2012లో నాగ్‌పూర్‌లో భారత్‌పై 4 కీలక వికెట్లతో ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ ప్రదర్శన.. ఇలా విదేశీ గడ్డపై అండర్సన్‌ తీసిన వికెట్లు అతని ప్రభావాన్ని చూపించాయి.

ఇక అరంగేట్ర టెస్టు నుంచి ఇప్పటి వరకు అతని ఆటలో సాగిన పురోగతి, వేర్వేరు ప్రత్యర్థులపై నమోదు చేసిన గణాంకాలు చూస్తే ఆశ్చర్యం కలిగిస్తాయి. మాస్టర్‌ ఆఫ్‌ స్వింగ్‌ నుంచి అతను మాస్టర్‌ ఆఫ్‌ ఆల్‌ కండిషన్స్‌గా మారాడు. 700 వికెట్లు ముగ్గురే సాధించగా వారిలో మురళీధరన్, వార్న్‌ స్పిన్నర్లు కాగా అండర్సన్‌ తొలి పేస్‌ బౌలర్‌. ఇతర జట్లతో పోలిస్తే ఇంగ్లండ్‌ ఎక్కువ టెస్టులు ఆడటం సహజంగానే అండర్సన్‌కు కలిసి వచ్చినా, అతను ఆటడం మాత్రమే కాకుండా అత్యున్నత ప్రమాణాలు కొనసాగించాడు. వయసు పెరుగుతున్న కొద్దీ విలువ పెరిగే వైన్‌లాగా అతను మారాడు.

అతని వికెట్లను మూడు దశలుగా విడగొడితే; తొలి 44 టెస్టుల్లో సగటు 35 కాగా, తర్వాతి 47 టెస్టుల్లో అది 28కి తగ్గింది. ఇక 2014నుంచి ఆడిన 96 టెస్టుల్లో సగటు ఏకంగా 22.66కి తగ్గడం అంటే బౌలర్‌గా అతను ఎంత మెరుగయ్యాడో అర్థమవుతుంది. ముఖ్యంగా 35 ఏళ్ల వయసు దాటిన తర్వాత అండర్సన్‌ ఏకంగా 220 వికెట్లు తీయడం విశేషం. స్వింగ్‌కు పెద్దగా అనుకూలించని ఉపఖండపు పిచ్‌లపై కూడా గత పదేళ్లలో అండర్సన్‌ 23.56 సగటును నమోదు చేయడం అతను ఎంత ప్రభావం చూపించాడో చెబుతుంది.

మురళీధరన్‌ (800 వికెట్లు)ను చేరుకోవడం చాలా కష్టం కాబట్టి మరో 9 వికెట్లు తీసి షేన్‌వార్న్‌ (708)ను దాటడం అండర్సన్‌ తదుపరి లక్ష్యం. ఇంగ్లండ్‌ బోర్డు అతనిపై నమ్మకముంచితే, అతని ఘనతలను పరిగణనలోకి తీసుకొని వేటు వేయకుండా మరికొంత కాలం ఆడే అవకాశం కల్పిస్తే సచిన్‌ అత్యధిక టెస్టుల (200) రికార్డును అండర్సన్‌ అధిగమించగలడు. ఒకవేళ ఆ లోపే అతని ఆట ముగిసిపోయినా, వరల్డ్‌ క్రికెట్‌లో అత్యుత్తమ పేస్‌ బౌలర్లలో ఒకడిగా అతను సాధించిన ఘనతల విలువ ఏమాత్రం తగ్గదు. — మొహమ్మద్‌ అబ్దుల్‌ హాది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement