WPL 2024: అలుపెరుగక దూసుకుపోయిన.. సూపర్‌ 'స్మృతి' మందాన | WPL 2024 Winning Captain Smriti Mandhana Success Journey And Interesting Facts In Telugu - Sakshi
Sakshi News home page

Smriti Mandhana Success Journey: అలుపెరుగక దూసుకుపోయిన.. సూపర్‌ 'స్మృతి' మందాన

Published Sun, Mar 31 2024 1:48 PM

WPL 2024 Winning Captain Smriti Mandhana Success Journey Intresting Facts - Sakshi

క్రికెట్‌ కెరీర్‌

సాంగ్లీ.. మహారాష్ట్రలో ఒక చిన్న పట్టణం.. శ్రవణ్‌ అనే కుర్రాడు క్రికెట్‌ నెట్స్‌లో తీవ్రంగా బ్యాటింగ్‌ చేస్తున్నాడు. రాష్ట్ర  జట్టులోకి ఎంపికయ్యేందుకు ఆ అబ్బాయి తన ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నాడు. అతని చెల్లెలు తన తండ్రితో కలిసి అక్కడే అన్న ఆటను చూస్తోంది. అప్పటి వరకు క్రికెట్‌ అంటే ఏమిటో కూడా ఆ అమ్మాయికి  తెలీదు. అయితే అప్పటికే కొన్నిసార్లు అన్న పేరు, అతను సాధించిన స్కోర్లతో న్యూస్‌పేపర్లలో వచ్చింది. ఇంటికి వెళ్లిన తర్వాత కూతురి ఆసక్తి చూసిన నాన్న ‘నువ్వు కూడా ఆడతావా’ అని అడిగాడు. ఆ వెంటనే అమ్మాయి నా పేరు కూడా పేపర్లో వస్తుందా అని నాన్నను అడిగేసింది. వెంటనే కల్పించుకున్న తల్లి.. ‘పదో తరగతి  పరీక్షల్లో 96 శాతం వస్తే నీ పేరు కచ్చితంగా వస్తుంది’ అని సర్దిచెప్పింది. కానీ ఆ అమ్మాయి మనసులో మాత్రం ఒక మాట ఉండిపోయింది.

పదో తరగతి పరీక్షా ఫలితాల కంటే క్రికెట్‌ ద్వారా పేరు తెచ్చుకోవడమే బాగుంటుందనిపించింది. అంతే.. తన మనసులో మాట చెప్పగానే తండ్రి అభ్యంతరం చెప్పలేదు. నాన్న అండగా ఉంటే తిరుగేముంది.. ఆ అమ్మాయి తర్వాతి రోజుల్లో  అన్నీ పక్కన పెట్టి పూర్తిగా క్రికెట్‌ పైనే దృష్టి పెట్టింది. 16 ఏళ్ల వయసు తిరిగే సరికే భారత సీనియర్‌ జట్టులో చోటు సంపాదించి తానేంటో రుజువు చేసుకుంది. అండర్‌–19 స్థాయి తర్వాత అన్న ఆటకు గుడ్‌బై చెప్పిన ఉద్యోగ వేటలో పడిపోగా.. చెల్లెలు మాత్రం కుటుంబం ప్రోత్సాహంతో దూసుకుపోయింది. ఆ ప్లేయరే భారత ఓపెనర్‌ స్మృతి మంధానా. ప్రస్తుతం మన మహిళల టీమ్‌లో టాప్‌ బ్యాటర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్మృతి తాజాగా మహిళల ప్రీమియర్‌ లీగ్‌లో కెప్టెన్‌ హోదాలో బెంగళూరు టీమ్‌ను విజేతగా నిలిపి తన నాయకత్వ లక్షణాలను ప్రదర్శించింది.

స్మృతి విజయప్రస్థానంలో కీలకమైన అంశం ఆమెకు కుటుంబసభ్యుల నుంచి లభించిన ప్రోత్సాహం. వస్త్రవ్యాపారి అయిన తండ్రి మొదటి రోజు నుంచే క్రికెట్‌లో ప్రోత్సహించగా, ఒక టీనేజ్‌ అమ్మాయి అవసరాలను దగ్గరి నుంచి చూసుకుంటూ తల్లి అన్ని రకాలుగా వెంట నిలిచింది. ఇక క్రికెట్‌ మానేసి బ్యాంక్‌ ఉద్యోగంలో చేరిన అన్న శ్రవణ్‌ ఆమెకు మార్గదర్శిగా వ్యవహరించడమే కాకుండా స్మృతి ప్రాక్టీస్‌లో అన్ని సమయాల్లో తానే వెంట ఉంటూ ఆమెకు నెట్స్‌లో బౌలింగ్‌ చేస్తూ తన వంతు సహకారం అందించాడు. సరిగ్గా చెప్పాలంటే ఒక్కసారి కెరీర్‌ను ఎంచుకున్న తర్వాత ఏ దశలోనూ ఆమె ప్రయాణానికి అడ్డంకులు రాలేదు.

మధ్యలో ఒక్కసారి మాత్రం అన్నలాగే ఆటను మానేసి తనకిష్టమైన సైన్స్‌ చదువుకుందామనే ఆలోచన వచ్చినా, అప్పటికే ఆమె ఎదుగుతున్న తీరు ఆ ఆలోచనకు ఫుల్‌స్టాప్‌ పెట్టేశాయి. ఎందుకంటే 11 ఏళ్ల వయసుకే మహారాష్ట్ర అండర్‌–19 టీమ్‌లో చోటు దక్కించుకున్న స్మృతికి మున్ముందు దూసుకుపోవడమే మిగిలింది. నాలుగేళ్ల తర్వాత మహారాష్ట్ర సీనియర్‌ టీమ్‌లో అవకాశం లభించింది. తొలి మ్యాచ్‌లోనే సౌరాష్ట్రపై 155 పరుగులు బాది ఆమె వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర జట్టుకు వరుస విజయాలు అందించిన తర్వాత మహిళల టీమ్‌ల కోసం ప్రత్యేకంగా బీసీసీఐ నిర్వహించిన చాలెంజర్‌ టోర్నీలో టాప్‌స్కోరర్‌గా  సత్తా చాటడంతో స్మృతి ఆట పదును ఏమిటో అందరికీ తెలిసింది.

అంచెలంచెలుగా దూసుకుపోయి..
భారత టి–20 జట్టు తరఫున తొలిసారి అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగు పెట్టిన స్మృతి మరో ఐదు రోజులకే వన్డేల్లోనూ అరంగేట్రం చేసింది. అంతర్జాతీయ వేదికపై ఆడటానికి కొద్ది రోజుల ముందే భారత దేశవాళీ వన్డేలో డబుల్‌ సెంచరీ (224) బాదిన స్మృతి ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా నిలిచింది. ఒక్కసారి టీమిండియాలోకి వచ్చిన తర్వాత ఆమె ఏ దశలోనూ వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ఓపెనర్‌గా జట్టు వరుస విజయాల్లో ఆమె కీలక పాత్ర పోషించింది. వరుసగా నాలుగేళ్ల పాటు వన్డేలు, టి–20ల్లో  రెగ్యులర్‌ మెంబర్‌గా తనకు పోటీ లేకుండా జట్టులో స్మృతి కొనసాగింది.

2014లో ఇంగ్లండ్‌తో జరిగిన ఏకైక టెస్టులో భారత్‌ నుంచి ఏకంగా ఎనిమిది మంది అరంగేట్రం చేయగా, వారిలో స్మృతి కూడా ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో అర్ధ సెంచరీతో జట్టు విజయంలో ఆమె కీలక పాత్ర పోషించింది. ఇదే జోరులో విదేశీ లీగ్‌ టీమ్‌లను కూడా ఆకర్షించడంతో ఆస్ట్రేలియా విమెన్‌ బిగ్‌బాష్‌ లీగ్‌లో తొలిసారి ఆడే అవకాశం దక్కింది. అయితే అనూహ్యంగా అది స్మృతికి కొంత సమస్యగా కూడా మారింది. కాలికి తీవ్ర గాయం కారణంగా టోర్నీనుంచి అర్ధాంతరంగా తప్పుకోవడంతో పాటు భారత జట్టుకు కూడా ఐదేళ్లు దూరం కావాల్సి వచ్చింది.

కొత్తగా బరిలోకి దిగి..
ఇంగ్లండ్‌ వేదికగా 2017 జూన్‌లో వన్డే వరల్డ్‌ కప్‌.. భారత్, ఆతిథ్య ఇంగ్లండ్‌ మధ్య లీగ్‌ మ్యాచ్‌. ఓపెనర్‌గా బరిలోకి దిగిన స్మృతి 72 బంతుల్లోనే 90 పరుగులు సాధించి ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా భారత్‌ను గెలిపించింది. అయితే ఆట కంటే ఆమె మరో రకంగా అందరి దృష్టిని ఆకర్షించింది. నాలుగేళ్ల కెరీర్‌ తర్వాత తొలిసారి స్మృతి కంటి అద్దాలు లేకుండా మైదానంలోకి దిగింది. అప్పటి వరకు ఆమెను గ్రౌండ్‌లో కంటి అద్దాలతోనే అందరూ చూశారు. గాయం కారణంగా వచ్చిన విరామంలో ఆమె తన శస్త్ర చికిత్సతో తన లుక్‌ను కూడా మార్చుకుంది.

ఈ సమయం తన కెరీర్‌లో కొత్త మార్పుకు సూచికగా భావించానని, ఇకపై కొత్త స్మృతిని చూస్తారని ఆమె స్వయంగా చెప్పుకుంది. నిజంగానే కెరీర్‌ పరంగా కూడా స్మృతికి సంబంధించి అదో మరో మలుపు. తర్వాతి మ్యాచ్‌లోనే వెస్టిండీస్‌పై సెంచరీ కూడా సాధించి వరల్డ్‌ కప్‌లో ఆమె తన జోరు కొనసాగించింది. వరల్డ్‌ కప్‌ తర్వాత వెంటనే జరిగిన దక్షిణాఫ్రికా పర్యటనలోనూ శతకంతో చెలరేగింది. ఏడాది తిరిగే లోపే న్యూజిలాండ్‌ వేదికగా మరో సెంచరీ కొట్టేసింది. ఈ రెండేళ్ల కాలం ఆమె కెరీర్‌లో అత్యద్భుతంగా సాగింది.

రికార్డులే రికార్డులు..
దాదాపు రెండు దశాబ్దాల సుదీర్ఘకాలం పాటు భారత మహిళల క్రికెట్‌ను మిథాలీ రాజ్‌ శాసించింది. మన జట్టుకు సంబంధించి అన్ని ఘనతలనూ ఆమెనే సాధించింది. అయితే తర్వాతి తరంలో స్మృతి అలాంటి ఫామ్‌ను చూపించింది. పైగా వన్డేలతో పాటు ఈతరం ప్రతినిధిగా టి–20 క్రికెట్‌లో కూడా స్మృతి తన స్థాయిని చూపించింది. క్రికెట్‌కు సంబంధించి నాలుగు విదేశీ పర్యటనలను కఠినమైనవిగా భావిస్తారు. ‘సేన’ అంటూ పిలుచుకునే (దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) ఇందులో ఉన్నాయి. ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఈ నాలుగు దేశాల్లోనూ  వన్డేల్లో సెంచరీ చేసిన అత్యంత అరుదైన రికార్డు స్మృతి పేరిట ఉంది.

అంతర్జాతీయ టి–20ల్లో భారత్‌ తరఫున వేగవంతమైన అర్ధ సెంచరీ (24 బంతుల్లో) ఆమెనే సాధించింది. కామన్వెల్త్‌ క్రీడల్లో రజతం, ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచిన భారత జట్టులో ఆమె సభ్యురాలు. అద్భుతమైన ఆటతో విదేశీ లీగ్‌లను కూడా ఆకట్టుకున్న స్మృతి బ్రిస్‌బేన్‌ హీట్, సిడ్నీ థండర్, సదరన్‌ బ్రేవ్, వెస్టర్న్‌ స్టార్మ్‌ జట్లకు కూడా ప్రాతినిధ్యం వహించింది. అయితే బీసీసీఐ నిర్వహించే విమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో బెంగళూరు టీమ్‌ను విజేతగా నిలపడం ఆమె స్థాయిని మరింత పెంచింది.

పురుషుల విభాగంలో ఐపీఎల్‌లో 16 సీజన్లు ఆడినా బెంగళూరుకు ఇప్పటి వరకు ట్రోఫీ దక్కలేదు. కానీ రెండో ప్రయత్నంలోనే మహిళల టీమ్‌ దానిని సాధించడంలో అటు ప్లేయర్‌గా, ఇటు కెప్టెన్‌గా స్మృతికే ఘనత దక్కుతుంది. గత ఏడాది తొలి సీజన్‌లో 2 మ్యాచ్‌లే గెలిచి నాలుగో స్థానానికి పరిమితమైన టీమ్‌ను ఈ సారి విజేతగా మలచడం అసాధారణం. మున్ముందు భారత మహిళల క్రికెట్‌కు చుక్కానిలా ముందుండి నడిపించగల సామర్థ్యం స్మృతికి ఉందనేది వాస్తవం.

2018లో అంతర్జాతీయ క్రికెట్‌ మండలి వార్షిక అవార్డుల్లో అత్యుత్తమ మహిళా క్రికెటర్‌ అవార్డును స్మృతి సొంతం చేసుకుంది. భారత ప్రభుత్వం ఆమె ఆటకు అర్జున పురస్కారంతో గౌరవించింది. దీనికి తోడు బ్రాండింగ్‌ ప్రపంచంలో కూడా ఆమె ఇప్పుడు పెద్ద సెన్సేషన్‌. సహజంగానే ఆటకు అందం తోడవడంతో పలు కంపెనీలు స్మృతితో ఒప్పందాలు చేసుకున్నాయి. గల్ఫ్‌ ఆయిల్, హావెల్స్, పవర్‌ షూస్, హెర్బలైఫ్, రెడ్‌బుల్, ఈక్విటాస్, హీరో, బూస్ట్, హ్యుందాయ్‌ మోటార్స్, మాస్టర్‌కార్డ్, గార్నియర్, పీఎన్‌బీ మెట్‌లైఫ్‌ తదితర సంస్థల కోసం స్మృతి పని చేసింది. — మొహమ్మద్‌ అబ్దుల్‌ హాది

ఇవి చదవండి: విమాన సిబ్బందిని చీరకట్టుకునేలా చేసింది, నేర్పించింది ఆమె!

Advertisement
 
Advertisement
 
Advertisement