వయసు 16 ఆట ఖరీదు 1.6 కోట్లు | G Kamalini: 16-Year-Old Bought By Mumbai Indians For Rs 1. 6 Crore At WPL 2025 Auction | Sakshi
Sakshi News home page

వయసు 16 ఆట ఖరీదు 1.6 కోట్లు

Published Wed, Dec 18 2024 4:25 AM | Last Updated on Wed, Dec 18 2024 4:25 AM

G Kamalini: 16-Year-Old Bought By Mumbai Indians For Rs 1. 6 Crore At WPL 2025 Auction


న్యూస్‌మేకర్‌ కమలిని 

తమిళనాడుకు చెందిన ఆ అమ్మాయి 12 ఏళ్ల వయసు వరకూ స్కేటింగ్‌ చేసింది. అదృష్టమో దురదృష్టమో లాక్‌డౌన్‌ వచ్చింది. బోర్‌ కొట్టి బ్యాట్‌ అందుకుంది. సరిగ్గా నాలుగేళ్లు. డబ్ల్యూపీఎల్‌ ఆక్షన్‌లో 10 లక్షలు పలికితే గొప్పనుకుంటే కోటీ అరవై లక్షలు పలికింది. అద్భుతమైన ప్రతిభ, కృషి ఉంటే  విధిని తిరగరాయొచ్చని చెబుతుంది జి.కమలిని.

మొన్నటి ఆదివారం (డిసెంబర్‌ 15) ఏం జరిగిందో తెలుసా? కౌలాలంపూర్లో మహిళల అండర్‌–19 ఆసియా కప్‌లో భాగంగా పాకిస్తాన్‌–ఇండియాల మధ్య మ్యాచ్‌ జరుగుతోంది. ఫస్ట్‌ బ్యాటింగ్‌లో పాకిస్తాన్‌ బ్యాటర్స్‌ రన్స్‌ కోసం బాల్‌ను బాదినప్పుడల్లా వికెట్స్‌ వెనుక నుంచి ఆ అమ్మాయి గట్టిగట్టిగా కేకలు వేస్తూ బాల్‌ను విసరమని ఫీల్డర్లను ఉత్సాహపరుస్తోంది. 

ఆ అమ్మాయి హుషారు ప్రేక్షకులను ఆకట్టుకుంది. మధ్యాహ్నం టార్గెట్‌ను ఛేదించే బాధ్యత ఇండియన్స్‌ది. వికెట్‌కీపర్‌గా ఉన్న అమ్మాయి ఇప్పుడు బ్యాట్‌ పట్టుకొని క్రీజ్‌ మీదకు వచ్చింది. అంతవరకే గుర్తుంది... అందరికీ. ఆ తర్వాత ఆ అమ్మాయి కొడుతున్న షాట్లకి గతం భవిష్యత్తు మర్చిపోయి వర్తమానంలో మునకలేశారు. షాట్‌ షాట్‌కు కేరింతలే. మొత్తం 44 రన్స్‌ చేసిందా అమ్మాయి. లాస్ట్‌ బంతిని భారీ సిక్స్‌ కొట్టి ఆట ముగించింది.

కౌలాలంపూర్‌లో ఇలా ఆట ముగుస్తున్న సమయానికి బెంగళూరులో డబ్ల్యూపీఎల్‌ కోసం మహిళా క్రికెటర్ల ఆక్షన్‌ జరుగుతోంది. ఇదే అమ్మాయి పేరును పిలిచారు. అంతవరకూ ఆమె 10 లక్షల రూపాయలకు వేలంలో దక్కుతుందని అందరూ భావించారు. కాని కౌలాలంపూర్‌ ఆట ప్రభావం చూపింది. ముంబై ఇండియన్స్‌ టీమ్, ఢిల్లీ కాపిటల్స్‌ టీమ్‌ పాట పెంచుతూ పోటీ పడ్డాయి. చివరకు కోటీ అరవై లక్షలతో ఆక్షన్‌ ముగిసి ఆ అమ్మాయి ముంబై ఇండియన్స్‌ జట్టు భాగస్వామి అయ్యింది. 
ఒకేరోజు ఇలా కౌలాలంపూర్‌లో ఇటు బెంగళూరులో మార్మోగిన ఆ అమ్మాయి పేరు కమలిని. వయసు 16.

మదురై అమ్మాయి
కమలినిది మధ్యతరగతి కుటుంబం. మదురైలో ఉండేది. స్కేటింగ్‌ నేర్చుకుంటూ హుషారుగా ఉండే కమలిని 12 ఏళ్ల వరకు క్రికెట్‌ జోలికే వెళ్లలేదు. 2022లో కరోనా రావడంతో లాక్‌డౌన్‌ వచ్చి ఆమె తండ్రి గుణాలన్‌ కాలక్షేపానికి కొడుకుతో వీధిలో క్రికెట్‌ ఆడటం మొదలుపెట్టాడు. ఒకరోజు కమలినిని పిలిచి నువ్వు బౌలింగ్‌ చెయ్‌ అన్నాడాయన. కమలిని బౌలింగ్‌ చేస్తే దిమ్మెర పోయాడు. అలా ఆ వయసులో అలా బౌలింగ్‌ చేసే పిల్లలు లేరు.

 కమలినికి ఇది సహజసిద్ధంగా వచ్చిందని గ్రహించిన తండ్రి మరి ఆలస్యం చేయలేదు. మరుసటి సంవత్సరమే చెన్నై కాపురం మార్చి‘చైన్నె సూపర్‌కింగ్స్‌ అకాడెమీ’లో చేర్చాడు. అక్కడ ఆమె ప్రతిభ గమనించి వెంటనే ‘తమిళనాడు అండర్‌–19’లోకి తీసుకున్నారు. విమెన్స్‌ అండర్‌ 19 టి 20 కప్‌లో 8 మేచెస్‌లో 311 పరుగులు కొట్టింది కమలిని. అంతేకాదు సిక్సర్ల కమలినిగా పేరు ΄పొందింది. ఆమె సిక్స్‌కు బాల్‌ని లేపితే బౌండరీ దాటాల్సిందే.

తండ్రి అంటే ప్రేమ
కమలినికి తండ్రంటే చాలా ప్రేమ. ఆయనకు గుండె సమస్య తలెత్తితే తల్లడిల్లిపోయింది కమలిని. ‘మా నాన్నంటే నాకు చాలా ఇష్టం’ అంటుంది. ఆ సమయంలో ఆటమీద మనసు లగ్నం చేయలేకపోయింది. అయితే తండ్రికి సర్జరీ అయ్యి ఇంకేం పర్వాలేదని డాక్టర్లు చె΄్పాక ఆ మరుసటి రోజే తమిళనాడు– ఆంధ్రల మధ్య మ్యాచ్‌ ఉంటే చెలరేగి సెంచరీ బాదింది కమలిని. ప్రతిభ, తల్లిదండ్రుల ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రోత్సాహం సమృద్ధిగా ఉన్న ఈ అమ్మాయి మున్ముందు మరిన్ని ఘనవిజయాలు సాధిస్తుంది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement