cricket career
-
WPL 2024: అలుపెరుగక దూసుకుపోయిన.. సూపర్ 'స్మృతి' మందాన
సాంగ్లీ.. మహారాష్ట్రలో ఒక చిన్న పట్టణం.. శ్రవణ్ అనే కుర్రాడు క్రికెట్ నెట్స్‌లో తీవ్రంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. రాష్ట్ర జట్టులోకి ఎంపికయ్యేందుకు ఆ అబ్బాయి తన ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నాడు. అతని చెల్లెలు తన తండ్రితో కలిసి అక్కడే అన్న ఆటను చూస్తోంది. అప్పటి వరకు క్రికెట్ అంటే ఏమిటో కూడా ఆ అమ్మాయికి తెలీదు. అయితే అప్పటికే కొన్నిసార్లు అన్న పేరు, అతను సాధించిన స్కోర్లతో న్యూస్పేపర్లలో వచ్చింది. ఇంటికి వెళ్లిన తర్వాత కూతురి ఆసక్తి చూసిన నాన్న ‘నువ్వు కూడా ఆడతావా’ అని అడిగాడు. ఆ వెంటనే అమ్మాయి నా పేరు కూడా పేపర్లో వస్తుందా అని నాన్నను అడిగేసింది. వెంటనే కల్పించుకున్న తల్లి.. ‘పదో తరగతి పరీక్షల్లో 96 శాతం వస్తే నీ పేరు కచ్చితంగా వస్తుంది’ అని సర్దిచెప్పింది. కానీ ఆ అమ్మాయి మనసులో మాత్రం ఒక మాట ఉండిపోయింది. పదో తరగతి పరీక్షా ఫలితాల కంటే క్రికెట్ ద్వారా పేరు తెచ్చుకోవడమే బాగుంటుందనిపించింది. అంతే.. తన మనసులో మాట చెప్పగానే తండ్రి అభ్యంతరం చెప్పలేదు. నాన్న అండగా ఉంటే తిరుగేముంది.. ఆ అమ్మాయి తర్వాతి రోజుల్లో అన్నీ పక్కన పెట్టి పూర్తిగా క్రికెట్ పైనే దృష్టి పెట్టింది. 16 ఏళ్ల వయసు తిరిగే సరికే భారత సీనియర్ జట్టులో చోటు సంపాదించి తానేంటో రుజువు చేసుకుంది. అండర్–19 స్థాయి తర్వాత అన్న ఆటకు గుడ్‌బై చెప్పిన ఉద్యోగ వేటలో పడిపోగా.. చెల్లెలు మాత్రం కుటుంబం ప్రోత్సాహంతో దూసుకుపోయింది. ఆ ప్లేయరే భారత ఓపెనర్ స్మృతి మంధానా. ప్రస్తుతం మన మహిళల టీమ్‌లో టాప్ బ్యాటర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్మృతి తాజాగా మహిళల ప్రీమియర్ లీగ్‌లో కెప్టెన్ హోదాలో బెంగళూరు టీమ్‌ను విజేతగా నిలిపి తన నాయకత్వ లక్షణాలను ప్రదర్శించింది. స్మృతి విజయప్రస్థానంలో కీలకమైన అంశం ఆమెకు కుటుంబసభ్యుల నుంచి లభించిన ప్రోత్సాహం. వస్త్రవ్యాపారి అయిన తండ్రి మొదటి రోజు నుంచే క్రికెట్లో ప్రోత్సహించగా, ఒక టీనేజ్ అమ్మాయి అవసరాలను దగ్గరి నుంచి చూసుకుంటూ తల్లి అన్ని రకాలుగా వెంట నిలిచింది. ఇక క్రికెట్ మానేసి బ్యాంక్ ఉద్యోగంలో చేరిన అన్న శ్రవణ్ ఆమెకు మార్గదర్శిగా వ్యవహరించడమే కాకుండా స్మృతి ప్రాక్టీస్‌లో అన్ని సమయాల్లో తానే వెంట ఉంటూ ఆమెకు నెట్స్‌లో బౌలింగ్ చేస్తూ తన వంతు సహకారం అందించాడు. సరిగ్గా చెప్పాలంటే ఒక్కసారి కెరీర్‌ను ఎంచుకున్న తర్వాత ఏ దశలోనూ ఆమె ప్రయాణానికి అడ్డంకులు రాలేదు. మధ్యలో ఒక్కసారి మాత్రం అన్నలాగే ఆటను మానేసి తనకిష్టమైన సైన్స్ చదువుకుందామనే ఆలోచన వచ్చినా, అప్పటికే ఆమె ఎదుగుతున్న తీరు ఆ ఆలోచనకు ఫుల్స్టాప్ పెట్టేశాయి. ఎందుకంటే 11 ఏళ్ల వయసుకే మహారాష్ట్ర అండర్–19 టీమ్‌లో చోటు దక్కించుకున్న స్మృతికి మున్ముందు దూసుకుపోవడమే మిగిలింది. నాలుగేళ్ల తర్వాత మహారాష్ట్ర సీనియర్ టీమ్‌లో అవకాశం లభించింది. తొలి మ్యాచ్‌లోనే సౌరాష్ట్రపై 155 పరుగులు బాది ఆమె వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర జట్టుకు వరుస విజయాలు అందించిన తర్వాత మహిళల టీమ్‌ల కోసం ప్రత్యేకంగా బీసీసీఐ నిర్వహించిన చాలెంజర్ టోర్నీలో టాప్‌స్కోరర్‌గా సత్తా చాటడంతో స్మృతి ఆట పదును ఏమిటో అందరికీ తెలిసింది. అంచెలంచెలుగా దూసుకుపోయి.. భారత టి–20 జట్టు తరఫున తొలిసారి అంతర్జాతీయ క్రికెట్లో అడుగు పెట్టిన స్మృతి మరో ఐదు రోజులకే వన్డేల్లోనూ అరంగేట్రం చేసింది. అంతర్జాతీయ వేదికపై ఆడటానికి కొద్ది రోజుల ముందే భారత దేశవాళీ వన్డేలో డబుల్ సెంచరీ (224) బాదిన స్మృతి ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా నిలిచింది. ఒక్కసారి టీమిండియాలోకి వచ్చిన తర్వాత ఆమె ఏ దశలోనూ వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ఓపెనర్‌గా జట్టు వరుస విజయాల్లో ఆమె కీలక పాత్ర పోషించింది. వరుసగా నాలుగేళ్ల పాటు వన్డేలు, టి–20ల్లో రెగ్యులర్ మెంబర్‌గా తనకు పోటీ లేకుండా జట్టులో స్మృతి కొనసాగింది. 2014లో ఇంగ్లండ్‌తో జరిగిన ఏకైక టెస్టులో భారత్ నుంచి ఏకంగా ఎనిమిది మంది అరంగేట్రం చేయగా, వారిలో స్మృతి కూడా ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో అర్ధ సెంచరీతో జట్టు విజయంలో ఆమె కీలక పాత్ర పోషించింది. ఇదే జోరులో విదేశీ లీగ్ టీమ్‌లను కూడా ఆకర్షించడంతో ఆస్ట్రేలియా విమెన్ బిగ్‌బాష్ లీగ్‌లో తొలిసారి ఆడే అవకాశం దక్కింది. అయితే అనూహ్యంగా అది స్మృతికి కొంత సమస్యగా కూడా మారింది. కాలికి తీవ్ర గాయం కారణంగా టోర్నీనుంచి అర్ధాంతరంగా తప్పుకోవడంతో పాటు భారత జట్టుకు కూడా ఐదేళ్లు దూరం కావాల్సి వచ్చింది. కొత్తగా బరిలోకి దిగి.. ఇంగ్లండ్ వేదికగా 2017 జూన్‌లో వన్డే వరల్డ్ కప్.. భారత్, ఆతిథ్య ఇంగ్లండ్ మధ్య లీగ్ మ్యాచ్. ఓపెనర్‌గా బరిలోకి దిగిన స్మృతి 72 బంతుల్లోనే 90 పరుగులు సాధించి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా భారత్‌ను గెలిపించింది. అయితే ఆట కంటే ఆమె మరో రకంగా అందరి దృష్టిని ఆకర్షించింది. నాలుగేళ్ల కెరీర్ తర్వాత తొలిసారి స్మృతి కంటి అద్దాలు లేకుండా మైదానంలోకి దిగింది. అప్పటి వరకు ఆమెను గ్రౌండ్లో కంటి అద్దాలతోనే అందరూ చూశారు. గాయం కారణంగా వచ్చిన విరామంలో ఆమె తన శస్త్ర చికిత్సతో తన లుక్‌ను కూడా మార్చుకుంది. ఈ సమయం తన కెరీర్లో కొత్త మార్పుకు సూచికగా భావించానని, ఇకపై కొత్త స్మృతిని చూస్తారని ఆమె స్వయంగా చెప్పుకుంది. నిజంగానే కెరీర్ పరంగా కూడా స్మృతికి సంబంధించి అదో మరో మలుపు. తర్వాతి మ్యాచ్‌లోనే వెస్టిండీస్‌పై సెంచరీ కూడా సాధించి వరల్డ్ కప్‌లో ఆమె తన జోరు కొనసాగించింది. వరల్డ్ కప్ తర్వాత వెంటనే జరిగిన దక్షిణాఫ్రికా పర్యటనలోనూ శతకంతో చెలరేగింది. ఏడాది తిరిగే లోపే న్యూజిలాండ్ వేదికగా మరో సెంచరీ కొట్టేసింది. ఈ రెండేళ్ల కాలం ఆమె కెరీర్లో అత్యద్భుతంగా సాగింది. రికార్డులే రికార్డులు.. దాదాపు రెండు దశాబ్దాల సుదీర్ఘకాలం పాటు భారత మహిళల క్రికెట్‌ను మిథాలీ రాజ్ శాసించింది. మన జట్టుకు సంబంధించి అన్ని ఘనతలనూ ఆమెనే సాధించింది. అయితే తర్వాతి తరంలో స్మృతి అలాంటి ఫామ్‌ను చూపించింది. పైగా వన్డేలతో పాటు ఈతరం ప్రతినిధిగా టి–20 క్రికెట్లో కూడా స్మృతి తన స్థాయిని చూపించింది. క్రికెట్‌కు సంబంధించి నాలుగు విదేశీ పర్యటనలను కఠినమైనవిగా భావిస్తారు. ‘సేన’ అంటూ పిలుచుకునే (దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) ఇందులో ఉన్నాయి. ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఈ నాలుగు దేశాల్లోనూ వన్డేల్లో సెంచరీ చేసిన అత్యంత అరుదైన రికార్డు స్మృతి పేరిట ఉంది. అంతర్జాతీయ టి–20ల్లో భారత్ తరఫున వేగవంతమైన అర్ధ సెంచరీ (24 బంతుల్లో) ఆమెనే సాధించింది. కామన్వెల్త్ క్రీడల్లో రజతం, ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచిన భారత జట్టులో ఆమె సభ్యురాలు. అద్భుతమైన ఆటతో విదేశీ లీగ్‌లను కూడా ఆకట్టుకున్న స్మృతి బ్రిస్బేన్ హీట్, సిడ్నీ థండర్, సదరన్ బ్రేవ్, వెస్టర్న్ స్టార్మ్ జట్లకు కూడా ప్రాతినిధ్యం వహించింది. అయితే బీసీసీఐ నిర్వహించే విమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో బెంగళూరు టీమ్‌ను విజేతగా నిలపడం ఆమె స్థాయిని మరింత పెంచింది. పురుషుల విభాగంలో ఐపీఎల్లో 16 సీజన్లు ఆడినా బెంగళూరుకు ఇప్పటి వరకు ట్రోఫీ దక్కలేదు. కానీ రెండో ప్రయత్నంలోనే మహిళల టీమ్ దానిని సాధించడంలో అటు ప్లేయర్‌గా, ఇటు కెప్టెన్‌గా స్మృతికే ఘనత దక్కుతుంది. గత ఏడాది తొలి సీజన్లో 2 మ్యాచ్‌లే గెలిచి నాలుగో స్థానానికి పరిమితమైన టీమ్‌ను ఈ సారి విజేతగా మలచడం అసాధారణం. మున్ముందు భారత మహిళల క్రికెట్‌కు చుక్కానిలా ముందుండి నడిపించగల సామర్థ్యం స్మృతికి ఉందనేది వాస్తవం. 2018లో అంతర్జాతీయ క్రికెట్ మండలి వార్షిక అవార్డుల్లో అత్యుత్తమ మహిళా క్రికెటర్ అవార్డును స్మృతి సొంతం చేసుకుంది. భారత ప్రభుత్వం ఆమె ఆటకు అర్జున పురస్కారంతో గౌరవించింది. దీనికి తోడు బ్రాండింగ్ ప్రపంచంలో కూడా ఆమె ఇప్పుడు పెద్ద సెన్సేషన్. సహజంగానే ఆటకు అందం తోడవడంతో పలు కంపెనీలు స్మృతితో ఒప్పందాలు చేసుకున్నాయి. గల్ఫ్ ఆయిల్, హావెల్స్, పవర్ షూస్, హెర్బలైఫ్, రెడ్‌బుల్, ఈక్విటాస్, హీరో, బూస్ట్, హ్యుందాయ్ మోటార్స్, మాస్టర్‌కార్డ్, గార్నియర్, పీఎన్బీ మెట్‌లైఫ్ తదితర సంస్థల కోసం స్మృతి పని చేసింది. — మొహమ్మద్ అబ్దుల్ హాది ఇవి చదవండి: విమాన సిబ్బందిని చీరకట్టుకునేలా చేసింది, నేర్పించింది ఆమె! -
Sarfaraz Khan: 'నాన్నకు ప్రేమతో..' ఆ రికార్డ్‌ను బ్రేక్ చేసి చూపించాను!
"2009.. ఓ 12 ఏళ్ల కుర్రాడు స్కూల్ క్రికెట్లో 439 పరుగుల స్కోరు సాధించి కొత్త రికార్డు నెలకొల్పాడు. ‘సచిన్ రికార్డ్‌ను బద్దలు కొట్టాలని నాన్న చెప్పాడు. చేసి చూపించాను!’ 2014.. ఐదేళ్ల తర్వాత.. అదే కుర్రాడు ప్రతిష్ఠాత్మక రంజీ ట్రోఫీతో పాటు అండర్–19 వరల్డ్ కప్ కూడా ఆడాడు. 'ఇది ఆరంభం మాత్రమేనని నాన్న చెప్పాడు'. నేను ఇక్కడితో ఆగిపోనని మాటిచ్చాను!" 2024.. మరో పదేళ్లు.. అదే అబ్బాయి భారత జట్టు తరఫున టెస్ట్ క్రికెట్లోకి అడుగు పెట్టాడు. ‘మా నాన్న కళ్ల ముందు దేశం తరఫున ఆడాలనుకున్నాను.. ఇప్పుడు ఆ కల నెరవేరింది!’ తండ్రి, కోచ్, మెంటర్.. ఏదైనా.. ఆ అబ్బాయి క్రికెట్ ప్రపంచం నాన్నతో మొదలై నాన్నతోనే సాగుతోంది. ఆరేళ్ల వయసులో ఆట మొదలుపెట్టిన దగ్గరి నుంచి ఇప్పుడు భారత సీనియర్ టీమ్‌కు ప్రాతినిధ్యం వహించే వరకు అన్నింటా, అడుగడుగునా నాన్నే ఉన్నాడు. అపార ప్రతిభావంతుడిగా వెలుగులోకి వచ్చి అద్భుత ప్రదర్శనలతో పై స్థాయికి చేరే వరకు ఈ తండ్రీ కొడుకులు పడిన శ్రమ, పట్టుదల, పోరాటం ఎంతో ప్రత్యేకం. అందుకే అతని అరంగేట్రం క్రికెట్ అభిమానులందరినీ భావోద్వేగానికి గురి చేసింది. అతడే సర్ఫరాజ్ ‘నౌషాద్’ఖాన్! భారత జట్టు తరఫున టెస్ట్ క్రికెట్ ఆడిన 311వ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్. అదే రోజు వికెట్ కీపర్ జురేల్ కూడా అరంగేట్రం చేశాడు. గతంలోనూ తొలి టెస్ట్ సమయంలో ఆటగాళ్లు తమ సంతోషాన్ని ప్రదర్శించి, తమ పురోగతిని గుర్తు చేసుకున్న రోజులు ఉన్నాయి. అతి సాధారణ నేపథ్యం నుంచి వచ్చి టీమిండియా గడప తొక్కినవారూ ఉన్నారు. కానీ సర్ఫరాజ్ తొలి టెస్ట్ రోజున మైదానంలోనే కాదు సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున సందడి కనిపించింది. గత కొంతకాలంగా దేశవాళీలో అతని ఆటను చూసినవారు, అతన్ని భారత జట్టుకి ఇంకెప్పుడు ఎంపిక చేస్తారంటూ ప్రశ్నిస్తున్న వారు.. అతనికి ఆ అవకాశం వచ్చిన రోజున ఊరట చెందినట్లుగా ‘అన్ని విధాలా అర్హుడు’ అంటూ ప్రశంసలు కురిపించారు. టెస్ట్ క్యాప్ అందిస్తున్న సమయంలో.. ‘నువ్వు ఎంత కష్టపడి ఇక్కడి వరకు వచ్చావో నాకు తెలుసు. మీ నాన్న, కుటుంబసభ్యులు ఈ ఘనతను చూసి గర్విస్తారు’ అంటూ దిగ్గజం అనిల్ కుంబ్లే వ్యాఖ్యానించడం.. ‘నేను చూసుకుంటా.. మీరు మీ అబ్బాయి కోసం ఏమేం చేశారో మా అందరికీ బాగా తెలుసు’ అంటూ స్వయంగా కెప్టెన్ రోహిత్ శర్మ భరోసానివ్వడం సర్ఫరాజ్ అరంగేట్రం విలువను చాటాయి. కఠోర శ్రమ.. అకుంఠిత దీక్ష.. ‘జీవితంలో ఏదైనా సాధించడానికి ఎంత కష్టపడాలి?’ అని సర్ఫరాజ్ తండ్రి నౌషాద్‌ను అడిగితే ‘తట్టుకోలేనంత’ అని జవాబిస్తాడు. ఎందుకంటే ఆటగాడిగా తీర్చిదిద్దేందుకు ఆయన తన కొడుకును ఎంతో కష్టపెట్టాడు, బాధించాడు, అతని బాల్యాన్ని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకున్నాడు. ‘సర్ఫరాజ్ తన ఫ్రెండ్స్‌తో ఏనాడూ బయటకు వెళ్లింది లేదు. గాలిపటాలు ఎగరేసింది లేదు. తెల్లవారుజామున లేవగానే ప్రాక్టీస్‌కు వెళ్లిపోవడం.. గంటల కొద్దీ సాధన చేయడం.. ఇంటికి రావడం.. మళ్లీ సాయంత్రం కూడా ఇదే తరహాలో ప్రాక్టీస్ చేసింది’ అని కొడుకు కోసం తను ప్లాన్ చేసిన దినచర్యను స్వయంగా నౌషాదే చెప్పాడు. రోజుకు దాదాపు 600కు పైగా బంతులు అంటే దాదాపు 100 ఓవర్లు అతనొక్కడే ఆడేవాడు. ఆరేళ్ల ఆట తర్వాత స్కూల్ క్రికెట్ ద్వారా తొలి సారి సర్ఫరాజ్ పేరు ముంబై క్రికెట్లో వినిపించింది. 439 పరుగుల స్కోరు సాధించి అతను అందరి దృష్టినీ ఆకర్షించాడు. అయితే 12 ఏళ్ల వయసులో సాధించిన ఈ ఘనత అతని కష్టాన్ని మరింత పెంచింది. తర్వాత ఐదేళ్ల పాటు సర్ఫరాజ్‌ను రాటుదేల్చే క్రమంలో ఆ శిక్షణను తండ్రి మరింత కఠినంగా మార్చాడు. తర్వాతి నాలుగేళ్ల పాటు సర్ఫరాజ్ స్కూల్ ముఖమే చూడలేదు. వ్యక్తిగతంగా ట్యూటర్‌ను పెట్టినా దాని వల్ల పెద్దగా ఒరిగిందేమీ లేదు. అతనికి కష్టం విలువ తెలియాలని కొన్నిసార్లు రాత్రిళ్లు భోజనం కూడా పెట్టేవాడు కాదు నౌషాద్. నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు అన్నింటిలోనూ సర్ఫరాజ్‌కు తండ్రి మాత్రమే కనిపించేవాడు. తన కోసం కాకుండా తండ్రి కోసమే బతుకుతున్నట్లుగా అనిపించేది. ‘మీ అబ్బాయి ఇదంతా ఇష్టంతోనే చేశాడా? అతను అంతలా కష్టపడ్డాడు.. అతనిలో ఇంకా శక్తి ఉందా? అంటూ నన్ను చాలామంది ప్రశ్నించారు. బయటినుంచి చూస్తే కఠినంగా అనిపించినా అది తప్పలేదు. తన లక్ష్యంపై మరింత ఏకాగ్రత పెట్టేందుకు.. ఇతర విషయాల వైపు దృష్టి మరల్చకుండా చేసేందుకు నేను అనుసరించిన తీరు కరెక్టే. తర్వాత రోజుల్లో మావాడు దాన్ని అర్థం చేసుకున్నాడు అని వాళ్లకు సమాధానం ఇచ్చాను’ అంటాడు నౌషాద్. అయితే కెరీర్ ఆరంభంలో వయసు విషయంలో మోసం చేశాడంటూ ఓవర్ ఏజ్ ఆరోపణలు సర్ఫరాజ్‌పై వచ్చాయి. చివరకు అడ్వాన్స్డ్ టెస్ట్ ద్వారా అతను తప్పు చేయలేదని తేలింది. కానీ ఇది మానసికంగా ఆ పిల్లాడిపై ప్రభావం చూపించింది. ఆత్మవిశ్వాసం కోల్పోయిన అతను ఇక క్రికెట్ ఆడనంటూ ఏడ్చేశాడు. దాన్నుంచి కోలుకునేందుకు చాలా సమయం పట్టింది. ఎట్టకేలకు 2014లో ముందుగా ముంబై అండర్–19 జట్టులో చోటు దక్కడంతో సర్ఫరాజ్ కష్టానికి సరైన ప్రతిఫలం దక్కింది. ఆ వెంటనే భారత్ తరఫున అండర్–19 ప్రపంచకప్‌లో సర్ఫరాజ్ ఆడాడు. రెండేళ్ల తర్వాత రెండోసారి అతనికి అండర్–19 వరల్డ్ కప్ ఆడే అవకాశం కూడా వచ్చింది. రెండు వరల్డ్ కప్‌లలో కలిపి 7 అర్ధ సెంచరీలు సహా 566 పరుగులు సాధించడంతో అతను ఒక స్థాయికి చేరుకున్నాడు. వివాదాలను దాటి తప్పులు సరిదిద్దుకొని.. చదువులో, వ్యాపారంలో లేదా ఏ ఇతర రంగంలోనైనా తాను సాధించలేకపోయిన విజయాలను, ఘనతలను తమ పిల్లలు సాధించాలని కోరుకోవడం.. తమ జీవితంలో మిగిలిన ఆశలు, కోరికలను వారి ద్వారా తీర్చుకొని సంతోషపడటం ప్రపంచంలో చాలామంది తల్లిదండ్రులు చేసేదే. నౌషాద్ కూడా అలాంటివాడే. ఉత్తరప్రదేశ్‌లోని ఆజమ్గఢ్ స్వస్థలం. క్రికెటర్‌గా కనీస నైపుణ్యం ఉండటంతో భవిష్యత్తు నిర్మించుకునేందుకు ముంబై చేరాడు. అయితే మహానగరంలో ఉపాధి దొరికినా తగిన అవకాశాలు రాక క్లబ్ క్రికెటర్ స్థాయికే పరిమితమయ్యాడు. దాంతో స్థానిక పిల్లలకు కోచింగ్ ఇవ్వడం మొదలుపెట్టాడు. చిన్న అద్దె ఇంట్లో ఉంటూ ఒకింత పేదరికంలోనే జీవితాన్ని కొనసాగించాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే తన కొడుకును ఆటగాడిగా తీర్చిదిద్దాలని, ఎలాగైనా పెద్ద స్థాయిలో ఆడించాలనే తపన మొదలైంది అతనిలో. దీని కోసం దేనికైనా సిద్ధమనే కసితో అతను పని చేశాడు. అయితే కొన్ని సార్లు అదుపు తప్పాడు. వరుస తప్పులతో కొడుకు ఇబ్బందులకు పరోక్ష కారణమయ్యాడు. ఎంత బాగా ఆడినా తగిన అవకాశాలు రావడం లేదనే ఆగ్రహంతో ముంబై క్రికెట్ అసోసియేషన్ అధికారులతోనే తలపడేందుకు సిద్ధమవడంతో వాళ్లు అతనిపై చర్య తీసుకున్నారు. టీమ్‌తో ఉన్నా జట్టు కోచ్ కాకుండా మా నాన్న వద్దే శిక్షణ తీసుకుంటానంటూ మొండికేయడంతో సర్ఫరాజ్పైనా హెచ్చరిక జారీ అయింది. సెలక్టర్ల వైపు అభ్యంతరకర సైగలు చేయడంతో రెండేళ్ల పాటు అతని మ్యాచ్ ఫీజులను నిలిపేసింది. ఈ వరుస గొడవలతో ఆగ్రహం చెందిన నౌషాద్ ఇక తన కొడుకు ముంబైకి ఆడడంటూ సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌కు తీసుకుపోయాడు. మూడేళ్లు యూపీ తరఫున ఆడిన తర్వాత కనీస గుర్తింపు రాకపోవడంతో తాను చేసింది తప్పని అతనికి అర్థమైంది. అద్భుత ప్రదర్శనతో.. ముంబైకి తిరిగొచ్చాక.. ఒక్కసారిగా కొత్త సర్ఫరాజ్ కనిపించాడు. వరుసగా రెండు సీజన్లలో అత్యద్భుత ప్రదర్శనతో చెలరేగిపోయి రెండుసార్లూ 900కు పైగా పరుగులతో సత్తా చాటాడు. వరుసగా డబుల్, ట్రిపుల్ సెంచరీలతో చెలరేగి ఒక దశలో 82.83 సగటుతో ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో దిగ్గజ బ్యాటర్ బ్రాడ్‌మన్ తర్వాతి స్థానంలో అతని పేరు కనిపించడం విశేషం. కోవిడ్ సమయంలో ముంబైలో ఆడటం సాధ్యం కాకపోతే తన మిత్రుల సహకారంతో యూపీలో వేర్వేరు నగరాలకు వెళ్లి సాధన కొనసాగించాడు. పరుగుల వరద పారిస్తూ.. ముంబై వరుస టోర్నీల్లో గెలవడంలో కీలక పాత్ర పోషించాడు సర్ఫరాజ్. అతని గ్రాఫ్ చూసిన గవాస్కరే.. సర్ఫరాజ్‌ని భారత జట్టుకు ఇంకెప్పుడు ఎంపిక చేస్తారంటూ ప్రశ్నించాల్సి వచ్చింది. అయినా ప్రతి సిరీస్‌కూ ఎదురు చూడటం, నిరాశపడటం రొటీన్ అయిపోయింది. అసలు భారత్‌కు ఆడతాడా అనే సందేహాలూ మొదలయ్యాయి. సహనం కోల్పోతున్న పరిస్థితి. ఎట్టకేలకు ఆ సమయం 2024 ఫిబ్రవరి 15న వచ్చింది. ఎలాంటి వివాదం లేకుండా ఏ ఒక్కరూ ప్రశ్నించకుండా ముక్తకంఠంతో సరైన ఎంపికగా అందరూ అభినందిస్తుండగా తీవ్ర భావోద్వేగాల మధ్య సర్ఫరాజ్ తొలి టెస్ట్ ఆడి రెండు అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నాడు. ‘నాన్న కలను నిజం చేశాను’ అంటూ సర్ఫరాజ్ చెబుతుంటే నౌషాద్ కన్నీళ్లపర్యంతం అయిన దృశ్యం అందరి కళ్లల్లో నిలిచిపోయింది. ఎన్నో ప్రతికూలతలను దాటి ఇక్కడికి చేరిన సర్ఫరాజ్ భవిష్యత్తులోనూ మరిన్ని గొప్ప ఇన్నింగ్స్ ఆడాలనేదే సగటు భారత క్రికెట్ అభిమాని ఆకాంక్ష. – మొహమ్మద్ అబ్దుల్ హాది ఇవి చదవండి: దేవుడా..! బచ్చన్‌కి బిడియం ఎక్కువే..! -
'తన కెరీర్‌ను తానే నాశనం చేసుకున్నాడు'
సిడ్నీ : రిషబ్ పంత్ కెరీర్ ప్రమాదంలో పడిందని.. ఇప్పటికైనా ఆటతీరు మార్చుకోవాలని టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఇప్పటికైనా తనకున్న బద్దకాన్ని వదిలేసి ఆట మీద దృష్టి పెడితే మంచిదని పేర్కొన్నాడు. పంత్ ఆటతీరు ఇలాగే కంటిన్యూ అయితే భవిష్యత్తులో టెస్టు జట్టులో కూడా చోటు దక్కడం కష్టమేనని తెలిపాడు. (చదవండి : మీరే కాదు.. నేనూ మిస్సవుతున్నా : కోహ్లి) 'ఆసీస్ టూర్‌కు పంత్‌ను కేవలం టెస్టు జట్టుకు మాత్రమే పరిగణలోకి తీసుకున్నా రాహుల్ ఫామ్ దృష్యా.. మరోవైపు వృద్ధిమాన్ సాహాకు టెస్టుల్లో ఉన్న రికార్డు చూసుకుంటే పంత్ టెస్టులు ఆడడం కష్టమే. ఆసీస్- ఏతో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్‌లోనూ ఇండియా- ఏ తరపున పంత్ స్థానంలో సాహాకు స్థానం లభించిదంటేనే విషయం అర్ధమయి ఉండాలి. రానున్న రోజుల్లో పంత్ టెస్టుల్లో కూడా తన స్థానాన్ని కోల్పోనున్నాడు. ఇప్పటికైనా బద్దకాన్ని వదిలేసి ఆటతీరును మార్చుకోవాలి. ఆటలో తను చేసిన తప్పిదాలే.. ఇప్పుడు పంత్ కెరీర్‌ను ప్రశ్నార్థకం చేశాయి. స్వయంగా తన కెరీర్‌ను తానే నాశనం చేసుకుంటున్నాడు. మళ్లీ తుది జట్టులోకి రావాలంటే కఠోర సాధన చేయాల్సిన అవసరం ఉంది.. లేదంటే అతని కెరీర్ ముగిసినట్లే 'అని వెల్లడించాడు. ఆకాశ్ చోప్రా పంత్‌పై చేసిన వ్యాఖ్యలు నిజమనే అభిప్రాయం వ్యక్తమయ్యేలా చేస్తున్నాయి. వాస్తవానికి పంత్ మంచి టెక్నిక్ ఉన్న ఆటగాడు.. టీమిండియాకు ఎంపికైన మొదట్లో దూకుడైన ఆటతీరును చూసి మంచి భవిష్యత్తు ఉన్న ఆటగాడిగా పేరు సంపాదిస్తారని అంతా భావించారు. కానీ రాను రాను పంత్ ఆటతీరులో నిర్లక్ష్య ధోరణి స్పష్టంగా కనిపించేది. ఎదో మొక్కుబడికి ఆడుతున్నామా అన్నట్లుగా అతని షాట్లు ఉండేవి. ఆట కీలకదశలో ఉన్న సమయంలో ఎన్నోసార్లు నిర్లక్ష్యంగా వికెట్ సమర్పించుకునేవాడు. ఇదే సమయంలో కేఎల్ రాహుల్ నిలకడైన ప్రదర్శన చేస్తూ టీమిండియాలో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకున్నాడు. కేవలం పంత్ నిర్లక్ష్యమే ఇప్పుడు ఆసీస్‌తో జరిగిన పరిమిత ఓవర్లతో పాటు ప్రస్తుతం జరుగుతున్న టీ20 సిరీస్‌కు దూరం చేసింది. ఐపీఎల్‌లోనూ పంత్ నుంచి ఒక్క మంచి ఇన్నింగ్స్ రాలేదు. ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌లు గెలవడంలో సహకరించిన పంత్ భారీ ఇన్నింగ్స్‌లు మాత్రం ఆడలేకపోయాడు. (చదవండి : ధావన్.. నేను ధోనిని కాదు: వేడ్) -
నూతన భారతావనికి నీవొక స్ఫూర్తి
న్యూఢిల్లీ: ధోని అంటేనే ధనాధన్. దీనికి న్యాయం చేస్తూ... తొలి పొట్టి ప్రపంచకప్ (2007)ను భారత్‌కు అందించాడు. ధోని అంటేనే నడిపించే నాయకుడు... దీన్ని వన్డే ప్రపంచకప్ (2011) ఫైనల్లో చూపించాడు. మరెన్నో క్లిష్టమైన మ్యాచ్‌ల్ని తనకిష్టమైన షాట్లతో ముగించాడు. ఆటలో, ఆర్మీలో తన మనోనిబ్బరాన్ని గట్టిగా చాటిన ధోని వీడ్కోలుపై సాక్షాత్తూ దేశ ప్రధానే స్పందించారు. అతని 15 ఏళ్ల కెరీర్లో భారతావని మురిసిన క్షణాల్ని ఉదహరిస్తూ యువతకు స్ఫూర్తి ప్రధాతగా నిలిచావంటూ కితాబిస్తూ లేఖ రాశారు. క్రికెట్ కెరీర్ కోసం వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసిన ధోనికి ఇకపై కుటుంబ జీవితం సాఫీగా సాగాలని మనసారా దీవించారు. లేఖ పూర్తి పాఠం ప్రధాని మాటల్లోనే.... ‘ఎక్కడి నుంచి వచ్చామన్నది ముఖ్యం కాదు... ఏం సాధించాం, ఎలా సఫలీకృతం అయ్యామన్నదే ముఖ్యం. ఈ నీ ప్రేరణే యువతకు మార్గనిర్దేశం. ఓ చిన్న పట్టణం నుంచి వచ్చిన నీవు యావత్ దేశమే గర్వించేస్థాయికి ఎదిగావు. జాతిని గర్వపడేలా చేశావు. భారత్‌లో, క్రికెట్లో నీకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చావ్. నీ ఆటతీరుతో కోట్లాది అభిమానుల్ని అలరించావు. నీ పట్టుదలతో యువతరానికి స్ఫూర్తిగా నిలిచావు. నూతన భారతావనికి నీవొక రోల్ మోడల్. ఇంటిపేరు లేకుండా వచ్చిన నీవు గొప్ప పేరు, ప్రఖ్యాతలతో నిష్క్రమిస్తున్నావు. నా దృష్టిలో టీమిండియాకు అత్యుత్తమ సారథివి నీవే! నీ సమర్థ నాయకత్వంతో జట్టును అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్లావు. బ్యాట్స్‌మన్‌గా, వికెట్ కీపర్‌గా బహుముఖ ప్రజ్ఞాపాటవాలున్న అరుదైన క్రికెటర్‌గా నీ పేరు చరిత్రలో నిలిచిపోతుంది. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో.... నీవున్నావనే భరోసా టీమిండియాను ఒడ్డున పడేస్తావన్న ధీమా ఈ దేశం ఎన్నటికీ మర్చిపోదు. ముఖ్యంగా 2011 వన్డే ప్రపంచకప్ తెచ్చిపెట్టిన ఘనత తరాల పాటు ప్రజల మదిలో చెక్కు చెదరదు. ఇక నీ పేరు క్రికెట్ లెక్కా పద్దులకు, రికార్డులకే పరిమితం చేయడం ఏమాత్రం సరైంది కాదు. చరిత్రలో నిలిచిన ‘మహేంద్రసింగ్ ధోని’ని అంచనా వేసేందుదుకు ఏ కితాబులు సరితూగవు. తోటివారిని ప్రోత్సహిస్తూ ధైర్యంగా ముందడుగు వేస్తూ యంగ్ టీమిండియా సాధించిన 2007 టి20 ప్రపంచకప్ నీ సారథ్యానికి సాటిలేని ఉదాహరణ నీ హెయిర్ స్టయిల్ ఎప్పుడెలా ఉన్నా... గెలుపోటములను మాత్రం సమానంగా స్వీకరించే లక్షణం చాలా మంది నేర్చుకోవాల్సిన పాఠం. క్రికెట్ బాధ్యతలతో పాటు ఆర్మీకి చేసిన సేవలు అమూల్యం. ఇంతటి ఘనమైన... సాఫల్యమైన కెరీర్‌కు కుటుంబసభ్యుల (సతీమణి సాక్షి, కుమార్తె జీవా) మద్దతు ఎంతో అవసరం. ఇకపై నీవు జట్టు సభ్యులతో కాకుండా మీ వాళ్లతో కావాల్సినంత సమయం గడపొచ్చు. నీకంతా మంచే జరగాలి’’ అని మోదీ లేఖలో శుభాశీస్సులు తెలిపారు. ఈ లేఖను ట్వీట్ చేసిన ధోని ప్రధానికి కృతజ్ఞతలు తెలిపాడు. ‘కళాకారులు, సైనికులు, క్రీడాకారులు అభినందనల్నే ఆశిస్తారు. వాళ్ల కృషి, త్యాగాలను ప్రతీ ఒక్కరు గుర్తించాలనే భావిస్తారు’ అని ధోని తెలిపారు. -
మహేంద్రుడి మాయాజాలం
‘19:29 గంటల సమయం నుంచి నన్ను రిటైర్ అయినట్లుగా పరిగణించగలరు’... వీడ్కోలు చెబుతున్నప్పుడు కూడా అందరికంటే అదే భిన్నమైన శైలి. లేదంటే ఈ తరహాలో ఎవరైనా ఇలా ప్రకటించినట్లు మీకు గుర్తుందా! ధోనిపై ఇప్పటికే ఒక బయోపిక్ వచ్చేసింది. అయినా సరే అంతకు మించి మరో సినిమాకు సరిపడే డ్రామా అతని కెరీర్లో ఉంది. ఎక్కడో వెనుకబడిన రాంచీనుంచి వచ్చిన నేపథ్యం... రైల్వేలో టికెట్ ఇన్స్పెక్టర్గా పని చేయడం... ఆ తర్వాత అనూహ్యంగా అంది వచ్చిన అవకాశం... జులపాల జుట్టుతో టార్జాన్ లుక్...బెదురు లేని బ్యాటింగ్, భీకర హిట్టింగ్...కొద్ది రోజులకే కెప్టెన్‌గా మారి టి20 ప్రపంచ కప్ గెలిపించడం... ఇలా ధోని కథలో ఆసక్తికర మలుపులెన్నో. గణాంకాలను అందని ఘనతలెన్నో... బ్యాట్స్‌మన్‌గా అద్భుత టెక్నిక్ లేకపోయినా...వికెట్ కీపింగ్ సాంప్రదాయ శైలికి భిన్నంగా ఉన్నా తను మారలేదు, మారే ప్రయత్నం చేయలేదు. అదే ధోనిని అందరికంటే ప్రత్యేకంగా నిలబెట్టింది. వన్డే బ్యాట్స్‌మన్‌గా పది వేలకు పైగా పరుగులు సాధించినా... ధోని అందరి మదిలో ‘కెప్టెన్ కూల్’గానే ఎక్కువగా నిలిచిపోయాడు. అతని నాయకత్వ లక్షణాలు భారత్‌కు ఎన్నో అద్భుత విజయాలు అందించాయి. 2007లో టి20 ప్రపంచ కప్, ఆ తర్వాత భారత అభిమానులంతా కలలు గన్న వన్డే వరల్డ్ కప్ (2011)లతో తన ఘనతను లిఖించుకున్న ఎమ్మెస్ 2013లో చాంపియన్ ట్రోఫీని కూడా సాధించి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. మూడు ఐసీసీ టోర్నీలను గెలిచిన ఏకైక కెప్టెన్‌గా నిలిచిపోయాడు. మైదానంలో ధోని కెప్టెన్సీ ప్రతిభకు ఉదాహరణగా నిలిచిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ప్రత్యర్థి జట్లపై వ్యూహ ప్రతివ్యూహాలు పన్నడంలో, ఎక్కడా సంయమనం కోల్పోకుండా మైదానంలో ప్రశాంతంగా జట్టును నడిపించడంలో అతనికి అతనే సాటి. 5 ఏప్రిల్ 2005...మన విశాఖపట్నంలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ ధోని సత్తాను ప్రపంచానికి పరిచయం చేసింది. 123 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్లతో పాక్‌పై అతను చేసిన 148 పరుగులకు ప్రపంచం ఫిదా అయిపోయింది. అప్పటినుంచి ఆ బ్యాట్నుంచి ఎన్నో గొప్ప ఇన్నింగ్స్‌లు జాలువారాయి. అదే ఏడాది జైపూర్‌లో ఏకంగా 10 సిక్సర్లతో విరుచుకు పడి అజేయంగా చేసిన 183 పరుగులు కెరీర్లో అత్యుత్తమంగా నిలిచిపోగా...మరెన్నో చిరస్మరణీయ ప్రదర్శనలు మహిని మన మనసుల్లో నిలిచిపోయేలా చేశాయి. ఒక వీడ్కోలు మ్యాచ్ కావాలని... ఆఖరి రోజు మైదానంలో సహచరుల జయజయధ్వానాల మధ్య తప్పుకోవాలనే కోరికలు ధోనికి ఎప్పుడూ లేవు. అతను ఏదో రోజు నిశ్శబ్దంగా నిష్క్రమిస్తాడని అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా అదే జరిగింది. టెస్టులనుంచి రిటైర్మెంట్ ప్రకటించినట్లు ఏకవాక్యంతో అతను తన అంతర్జాతీయ ఆటను ముగించాడు. అందుకు ఈ ‘లెఫ్టినెంట్ కల్నల్’ భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఎంచుకున్నాడు. ఇక అతని మెరుపులు ఐపీఎల్‌లోనే చూసేందుకు సిద్ధం కండి! 2008, 2009లలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులు సాధించాడు. వరుసగా రెండేళ్లు ఈ అవార్డు గెల్చుకున్న తొలి ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. ఘనతలు, అవార్డులు ► 2007లో దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న’ అందుకున్నాడు. ► 2009లో దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మశ్రీ’... 2018లో దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మ భూషణ్’ అందుకున్నాడు. ధోని ఫినిషర్ 66 విజయవంతమైన లక్ష్య ఛేదనలో 66 సార్లు నాటౌట్‌గా నిలిచాడు (47 వన్డేల్లో; 15 టి20ల్లో; 4 టెస్టుల్లో) 43 మ్యాచ్‌లో 43 సార్లు విన్నింగ్ రన్స్ కొట్టాడు (30 వన్డేల్లో; 10 టి20ల్లో; 3 టెస్టుల్లో) 13 మ్యాచ్‌ను 13 సార్లు సిక్సర్‌తో ముగించాడు (9 వన్డేల్లో; 3 టి20ల్లో; ఒకసారి టెస్టులో) ధోని కెప్టెన్సీ రికార్డు ఆడిన వన్డేలు: 200, గెలిచినవి: 110, ఓడినవి: 74; టై: 5, ఫలితం రానివి: 11 ఆడిన టెస్టులు: 60, గెలిచినవి: 27, ఓడినవి: 18; డ్రా: 15 ఆడిన టి20లు: 72, గెలిచినవి: 42, ఓడినవి: 28 ధోని పేరిట ప్రపంచ రికార్డులు... ► వన్డేల్లో అత్యధికసార్లు నాటౌట్‌గా నిలిచిన ప్లేయర్ (84) ► వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన వికెట్ కీపర్ (183 నాటౌట్) ► వన్డేల్లో అత్యధిక స్టంపింగ్స్ చేసిన కీపర్ (123) ► అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక స్టంపింగ్స్ చేసిన కీపర్ (195) ► అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా వ్యవహరించిన క్రికెటర్ (332 మ్యాచ్‌లు) ► టి20 ప్రపంచకప్ చరిత్రలో ఒక జట్టుకు అత్యధికంగా ఆరుసార్లు కెప్టెన్‌గా వ్యవహరించిన ఏకైక ప్లేయర్ (6 సార్లు; 2007, 2009, 2010, 2012, 2014, 2016). ► ‘అద్భుత కెరీర్ ముగించిన ఎమ్మెస్ ధోనికి అభినందనలు. మీరు వదిలి వెళుతున్న క్రికెట్ వారసత్వం క్రికెట్ ప్రేమికులు, ఔత్సాహికులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. భవిష్యత్తులో అంతా మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నా’ – వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ► ‘భారత క్రికెట్‌కు నువ్వు అందించిన సేవలు ఎప్పటికీ మరచిపోలేనివి. నీతో కలిసి 2011 వరల్డ్ కప్ సాధించిన నా జీవితంలో మధుర ఘట్టం. నీ రెండో ఇన్నింగ్స్ బాగా సాగాలని కోరుకుంటున్నా’ – సచిన్ టెండూల్కర్ ► ‘ప్రతీ క్రికెటర్ ఏదో ఒక రోజు తన ప్రయాణం ముగించాల్సిందే. అయితే నీకు అత్యంత ఆత్మీయులు అలా చేసినప్పుడు భావోద్వేగాలు సహజం. నీవు దేశానికి చేసింది ప్రతీ ఒక్కరి మదిలో గుర్తుండిపోతుంది. కానీ మన మధ్య పరస్పర గౌరవం నా హృదయంలో నిలిచిపోయింది. ఈ ప్రపంచం ఎన్నో ఘనతలను చూసింది. అయితే దాని రూపాన్ని నేను చూశాను’ –విరాట్ కోహ్లి ► ‘భారత క్రికెట్లో ఒక శకం ముగిసింది. ప్రపంచ క్రికెట్లో అతనో అద్భుతమైన ఆటగాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో అతని నాయకత్వ లక్షణాలకు మరెవరూ సాటి రారు. వన్డేల్లో అతని బ్యాటింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే’ – సౌరవ్ గంగూలీ ► ‘ఎలాంటి ఫిర్యాదులు లేకుండా ధోని కెరీర్ ముగిస్తున్నాడు. డ్రెస్సింగ్ రూమ్ సహచరుడిగా నీలాంటి ప్రొఫెషనల్‌తో కలిసి పని చేయడం నాకు దక్కిన గౌరవం. భారత అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడిగా నిలిచిన ధోనికి సెల్యూట్’ –రవిశాస్త్రి ► ‘ధోని లాంటి ఆటగాడు రావడం అంటే మిషన్ ఇంపాజిబుల్. ఎమ్మెస్ లాంటి వాడు గతంలోనూ, ఇప్పుడూ లేరు. ఇంకెప్పుడూ రారు. ఆటగాళ్లంతా వచ్చి పోతుంటారు కానీ అతనంత ప్రశాంతంగా ఎవరూ కనిపించరు. ఎందరో క్రికెట్ అభిమానుల కుటుంబ సభ్యుడిగా ధోని మారిపోయాడు. ఓం ఫినిషాయనమ’ –వీరేంద్ర సెహ్వాగ్ ► ‘గొప్ప కెరీర్‌ను ముగించినందుకు ధోనికి నా అభినందనలు. నీతో కలిసి ఆడటం నాకూ గౌరవకారణం. నాయకుడిగా నీ ప్రశాంత శైలితో అందించిన విజయాలు ఎప్పటికీ మధురానుభూతులే’ – అనిల్ కుంబ్లే ► ‘చిన్న పట్టణంనుంచి వచ్చి మ్యాచ్ విన్నర్‌గా, గొప్ప నాయకుడిగా ఎదిగిన ధోని ప్రయాణం అద్భుతం. నువ్వు అందించిన జ్ఞాపకాలకు కృతజ్ఞతలు. నీతో కలిసి ఆడిన క్షణాలు ఎప్పటికీ మరచిపోలేను’ –వీవీఎస్ లక్ష్మణ్ -
ఒంటి కన్ను ‘పులి’
ఒక కన్ను మూసుకుని.. మరో కన్నుతో చుట్టూ పరిసరాలను గమనించండి.. కనీసం ఐదు నిమిషాలు కూడా చూడలేని పరిస్థితి మనది. కానీ ఆ ఒంటి కన్నుతోనే 14 ఏళ్ల పాటు ప్రత్యర్థి జట్ల బౌలర్లు సంధించిన పదునైన బంతులను హెల్మెట్ కూడా ధరించకుండా తుత్తునియలు చేసిన వీరుడొకరున్నాడు. భయమనేది లేకుండా క్రికెట్ మైదానంలో చూపిన ఈ తెగువకు అందరూ అతడిని ముద్దుగా ‘టైగర్’ అని పిలుచుకున్నారు. అతనెవరో కాదు.. భారత క్రికెట్‌కు అత్యంత పిన్న వయస్సులోనే కెప్టెన్‌గా వ్యవహరించిన మన్సూర్ అలీఖాన్ పటౌడీ. - రంగోల నరేందర్ గౌడ్ పటౌడీలది నవాబుల వంశం. తన 11వ పుట్టిన రోజునాడే తండ్రి ఇఫ్తికార్ అలీ ఖాన్ మరణించడంతో భోపాల్, పటౌడీ ప్రాంతాలకు మన్సూర్‌ను నవాబ్‌గా ప్రకటించారు. ఇంగ్లండ్‌లో ఉన్నత విద్యనభ్యసించేందుకు వెళ్లినప్పటి నుంచే జూనియర్ పటౌడీలో క్రికెట్ సత్తా బయటపడింది. వించెస్టర్ కాలేజీలో టాప్ క్రికెటర్‌గా పేరుతెచ్చు కున్నాడు. 1957లో 16 ఏళ్ల వయస్సులో ససెక్స్ తరఫున ఫస్ట్‌క్లాస్ అరంగేట్రం చేశాడు. 1959లో స్కూల్ కెప్టెన్‌గా వ్యవహరించి ఆ సీజన్లో 1068 పరుగులు సాధించి పాత రికార్డులు బద్దలు కొట్టాడు. యూనివర్సిటీ స్థాయిలో ఆక్స్‌ఫర్డ్‌కు ఆడడమే కాకుండా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన తొలి భారతీయుడయ్యాడు. అప్పటివరకు కెరీర్ జోరుగా సాగుతున్నా.. 1961లో అతడి జీవితంలో విషాదం చోటు చేసుకుంది. కారు ప్రమాదంలో తన కుడి కన్నులో అద్దాలు గుచ్చుకోవడంతో చూపు పోయింది. అటు మిగిలిన కంటితో చూసే దృశ్యాలు కూడా స్పష్టంగా కానరాని పరిస్థితి. ఇక మన్సూర్ క్రికెట్ కెరీర్ ముగిసినట్టే అని అంతా అనుకున్నారు. కానీ తన కెరీర్ ఇంత నిస్సారంగా ముగిసేందుకు వీల్లేదని పటౌడీ నిర్ణయించుకున్నాడు. నెట్స్‌లో తీవ్రంగా సాధన చేయడం ప్రారంభించాడు. ఉన్న ఒక్క కంటితోనే ఆడటమెలాగో నేర్చుకున్నాడు. కుడి కంటికి జరిగిన ప్రమాదాన్ని తనకు అనుకూలంగా మలుచుకున్నాడు. ఎందుకంటే పటౌడీ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్. ఈ బ్యాట్స్‌మెన్‌కు ఎక్కువగా ఉపయోగపడేది ఎడమ కన్నే. ఈ ప్రమాదం జరిగిన ఆరు నెలల్లోపే పటౌడీ భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడంటే ఆ 20 ఏళ్ల కుర్రాడి పట్టుదల ఏమిటో స్పష్టమవుతుంది. 1961 డిసెంబర్లో ఇంగ్లండ్‌తో తన తొలి టెస్టును ఆడగా మద్రాస్‌లో జరిగిన మూడో టెస్టులో సెంచరీ సాధించి ఇంగ్లండ్‌పై తొలిసారిగా సిరీస్ విజయం సాధించేలా చేశాడు. ఆ త ర్వాత ఏడాదికి విండీస్ పర్యటనలో ఉన్న జట్టుకు పటౌడీ కెప్టెన్‌గా ఎన్నికయ్యాడు. అప్పటికి అతడి వయస్సు కేవలం 21 ఏళ్ల 77 రోజులు మాత్రమే. ఇంత చిన్న వయస్సులో జట్టు సారథిగా ఎన్నికవ్వడం అప్పటికి ప్రపంచ రికార్డు. ఆ తర్వాత తైబు (జింబాబ్వే) ఈ రికార్డు బ్రేక్ చేసినా భారత్ నుంచి మాత్రం ఇప్పటికీ తనదే రికార్డు. కెరీర్లో ఆడిన 46 టెస్టుల్లో 40 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా ఉన్న పటౌడీ భారత్ నుంచి అత్యంత గొప్ప సారథిగానూ పేరు తెచ్చుకున్నాడు. ఆయన కాలంలోనే విదేశీ గడ్డ (1968, కివీస్)పై భారత్ తొలిసారి టెస్టు సిరీస్‌ను గెలుచుకుంది. 1975లో కెరీర్‌ను ముగించిన తను 2,793 పరుగులు సాధించాడు. ఇందులో ఆరు సెంచరీలుండగా అత్యధిక స్కోరు 203 నాటౌట్. 1968లో విజ్డెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా నిలిచిన పటౌడీ 2011లో లంగ్ ఇన్ఫెక్షన్తో మృతి చెందారు.