"2009.. ఓ 12 ఏళ్ల కుర్రాడు స్కూల్ క్రికెట్‌లో 439 పరుగుల స్కోరు సాధించి కొత్త రికార్డు నెలకొల్పాడు. ‘సచిన్ రికార్డ్‌ను బద్దలు కొట్టాలని నాన్న చెప్పాడు. చేసి చూపించాను!’ 2014.. ఐదేళ్ల తర్వాత.. అదే కుర్రాడు ప్రతిష్ఠాత్మక రంజీ ట్రోఫీతో పాటు అండర్–19 వరల్డ్ కప్ కూడా ఆడాడు. 'ఇది ఆరంభం మాత్రమేనని నాన్న చెప్పాడు'. నేను ఇక్కడితో ఆగిపోనని మాటిచ్చాను!"
2024.. మరో పదేళ్లు.. అదే అబ్బాయి భారత జట్టు తరఫున టెస్ట్ క్రికెట్‌లోకి అడుగు పెట్టాడు. ‘మా నాన్న కళ్ల ముందు దేశం తరఫున ఆడాలనుకున్నాను.. ఇప్పుడు ఆ కల నెరవేరింది!’
తండ్రి, కోచ్, మెంటర్.. ఏదైనా.. ఆ అబ్బాయి క్రికెట్ ప్రపంచం నాన్నతో మొదలై నాన్నతోనే సాగుతోంది. ఆరేళ్ల వయసులో ఆట మొదలుపెట్టిన దగ్గరి నుంచి ఇప్పుడు భారత సీనియర్ టీమ్‌కు ప్రాతినిధ్యం వహించే వరకు అన్నింటా, అడుగడుగునా నాన్నే ఉన్నాడు. అపార ప్రతిభావంతుడిగా వెలుగులోకి వచ్చి అద్భుత ప్రదర్శనలతో పై స్థాయికి చేరే వరకు ఈ తండ్రీ కొడుకులు పడిన శ్రమ, పట్టుదల, పోరాటం ఎంతో ప్రత్యేకం. అందుకే అతని అరంగేట్రం క్రికెట్ అభిమానులందరినీ భావోద్వేగానికి గురి చేసింది. అతడే సర్ఫరాజ్ ‘నౌషాద్’ఖాన్!
భారత జట్టు తరఫున టెస్ట్ క్రికెట్ ఆడిన 311వ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్. అదే రోజు వికెట్ కీపర్ జురేల్ కూడా అరంగేట్రం చేశాడు. గతంలోనూ తొలి టెస్ట్ సమయంలో ఆటగాళ్లు తమ సంతోషాన్ని ప్రదర్శించి, తమ పురోగతిని గుర్తు చేసుకున్న రోజులు ఉన్నాయి. అతి సాధారణ నేపథ్యం నుంచి వచ్చి టీమిండియా గడప తొక్కినవారూ ఉన్నారు. కానీ సర్ఫరాజ్ తొలి టెస్ట్ రోజున మైదానంలోనే కాదు సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున సందడి కనిపించింది.
గత కొంతకాలంగా దేశవాళీలో అతని ఆటను చూసినవారు, అతన్ని భారత జట్టుకి ఇంకెప్పుడు ఎంపిక చేస్తారంటూ ప్రశ్నిస్తున్న వారు.. అతనికి ఆ అవకాశం వచ్చిన రోజున ఊరట చెందినట్లుగా ‘అన్ని విధాలా అర్హుడు’ అంటూ ప్రశంసలు కురిపించారు. టెస్ట్ క్యాప్ అందిస్తున్న సమయంలో.. ‘నువ్వు ఎంత కష్టపడి ఇక్కడి వరకు వచ్చావో నాకు తెలుసు. మీ నాన్న, కుటుంబసభ్యులు ఈ ఘనతను చూసి గర్విస్తారు’ అంటూ దిగ్గజం అనిల్ కుంబ్లే వ్యాఖ్యానించడం.. ‘నేను చూసుకుంటా.. మీరు మీ అబ్బాయి కోసం ఏమేం చేశారో మా అందరికీ బాగా తెలుసు’ అంటూ స్వయంగా కెప్టెన్ రోహిత్ శర్మ భరోసానివ్వడం సర్ఫరాజ్ అరంగేట్రం విలువను చాటాయి.
కఠోర శ్రమ.. అకుంఠిత దీక్ష..
‘జీవితంలో ఏదైనా సాధించడానికి ఎంత కష్టపడాలి?’ అని సర్ఫరాజ్ తండ్రి నౌషాద్‌ను అడిగితే ‘తట్టుకోలేనంత’ అని జవాబిస్తాడు. ఎందుకంటే ఆటగాడిగా తీర్చిదిద్దేందుకు ఆయన తన కొడుకును ఎంతో కష్టపెట్టాడు, బాధించాడు, అతని బాల్యాన్ని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకున్నాడు. ‘సర్ఫరాజ్ తన ఫ్రెండ్స్‌తో ఏనాడూ బయటకు వెళ్లింది లేదు. గాలిపటాలు ఎగరేసింది లేదు. తెల్లవారుజామున లేవగానే ప్రాక్టీస్‌కు వెళ్లిపోవడం.. గంటల కొద్దీ సాధన చేయడం.. ఇంటికి రావడం.. మళ్లీ సాయంత్రం కూడా ఇదే తరహాలో ప్రాక్టీస్ చేసింది’ అని కొడుకు కోసం తను ప్లాన్ చేసిన దినచర్యను స్వయంగా నౌషాదే చెప్పాడు.
రోజుకు దాదాపు 600కు పైగా బంతులు అంటే దాదాపు 100 ఓవర్లు అతనొక్కడే ఆడేవాడు. ఆరేళ్ల ఆట తర్వాత స్కూల్ క్రికెట్ ద్వారా తొలి సారి సర్ఫరాజ్ పేరు ముంబై క్రికెట్‌లో వినిపించింది. 439 పరుగుల స్కోరు సాధించి అతను అందరి దృష్టినీ ఆకర్షించాడు. అయితే 12 ఏళ్ల వయసులో సాధించిన ఈ ఘనత అతని కష్టాన్ని మరింత పెంచింది. తర్వాత ఐదేళ్ల పాటు సర్ఫరాజ్‌ను రాటుదేల్చే క్రమంలో ఆ శిక్షణను తండ్రి మరింత కఠినంగా మార్చాడు. తర్వాతి నాలుగేళ్ల పాటు సర్ఫరాజ్ స్కూల్ ముఖమే చూడలేదు. వ్యక్తిగతంగా ట్యూటర్‌ను పెట్టినా దాని వల్ల పెద్దగా ఒరిగిందేమీ లేదు. అతనికి కష్టం విలువ తెలియాలని కొన్నిసార్లు రాత్రిళ్లు భోజనం కూడా పెట్టేవాడు కాదు నౌషాద్.
నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు అన్నింటిలోనూ సర్ఫరాజ్‌కు తండ్రి మాత్రమే కనిపించేవాడు. తన కోసం కాకుండా తండ్రి కోసమే బతుకుతున్నట్లుగా అనిపించేది. ‘మీ అబ్బాయి ఇదంతా ఇష్టంతోనే చేశాడా? అతను అంతలా కష్టపడ్డాడు.. అతనిలో ఇంకా శక్తి ఉందా? అంటూ నన్ను చాలామంది ప్రశ్నించారు. బయటినుంచి చూస్తే కఠినంగా అనిపించినా అది తప్పలేదు. తన లక్ష్యంపై మరింత ఏకాగ్రత పెట్టేందుకు.. ఇతర విషయాల వైపు దృష్టి మరల్చకుండా చేసేందుకు నేను అనుసరించిన తీరు కరెక్టే. తర్వాత రోజుల్లో మావాడు దాన్ని అర్థం చేసుకున్నాడు అని వాళ్లకు సమాధానం ఇచ్చాను’ అంటాడు నౌషాద్.
అయితే కెరీర్ ఆరంభంలో వయసు విషయంలో మోసం చేశాడంటూ ఓవర్ ఏజ్ ఆరోపణలు సర్ఫరాజ్‌పై వచ్చాయి. చివరకు అడ్వాన్స్‌డ్ టెస్ట్ ద్వారా అతను తప్పు చేయలేదని తేలింది. కానీ ఇది మానసికంగా ఆ పిల్లాడిపై ప్రభావం చూపించింది. ఆత్మవిశ్వాసం కోల్పోయిన అతను ఇక క్రికెట్ ఆడనంటూ ఏడ్చేశాడు. దాన్నుంచి కోలుకునేందుకు చాలా సమయం పట్టింది. ఎట్టకేలకు 2014లో ముందుగా ముంబై అండర్–19 జట్టులో చోటు దక్కడంతో సర్ఫరాజ్ కష్టానికి సరైన ప్రతిఫలం దక్కింది. ఆ వెంటనే భారత్ తరఫున అండర్–19 ప్రపంచకప్‌లో సర్ఫరాజ్ ఆడాడు. రెండేళ్ల తర్వాత రెండోసారి అతనికి అండర్–19 వరల్డ్ కప్ ఆడే అవకాశం కూడా వచ్చింది. రెండు వరల్డ్ కప్‌లలో కలిపి 7 అర్ధ సెంచరీలు సహా 566 పరుగులు సాధించడంతో అతను ఒక స్థాయికి చేరుకున్నాడు.
వివాదాలను దాటి తప్పులు సరిదిద్దుకొని..
చదువులో, వ్యాపారంలో లేదా ఏ ఇతర రంగంలోనైనా తాను సాధించలేకపోయిన విజయాలను, ఘనతలను తమ పిల్లలు సాధించాలని కోరుకోవడం.. తమ జీవితంలో మిగిలిన ఆశలు, కోరికలను వారి ద్వారా తీర్చుకొని సంతోషపడటం ప్రపంచంలో చాలామంది తల్లిదండ్రులు చేసేదే. నౌషాద్ కూడా అలాంటివాడే. ఉత్తరప్రదేశ్‌లోని ఆజమ్‌గఢ్ స్వస్థలం. క్రికెటర్‌గా కనీస నైపుణ్యం ఉండటంతో భవిష్యత్తు నిర్మించుకునేందుకు ముంబై చేరాడు. అయితే మహానగరంలో ఉపాధి దొరికినా తగిన అవకాశాలు రాక క్లబ్ క్రికెటర్ స్థాయికే పరిమితమయ్యాడు.
దాంతో స్థానిక పిల్లలకు కోచింగ్ ఇవ్వడం మొదలుపెట్టాడు. చిన్న అద్దె ఇంట్లో ఉంటూ ఒకింత పేదరికంలోనే జీవితాన్ని కొనసాగించాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే తన కొడుకును ఆటగాడిగా తీర్చిదిద్దాలని, ఎలాగైనా పెద్ద స్థాయిలో ఆడించాలనే తపన మొదలైంది అతనిలో. దీని కోసం దేనికైనా సిద్ధమనే కసితో అతను పని చేశాడు. అయితే కొన్ని సార్లు అదుపు తప్పాడు. వరుస తప్పులతో కొడుకు ఇబ్బందులకు పరోక్ష కారణమయ్యాడు. ఎంత బాగా ఆడినా తగిన అవకాశాలు రావడం లేదనే ఆగ్రహంతో ముంబై క్రికెట్ అసోసియేషన్ అధికారులతోనే తలపడేందుకు సిద్ధమవడంతో వాళ్లు అతనిపై చర్య తీసుకున్నారు.
టీమ్‌తో ఉన్నా జట్టు కోచ్ కాకుండా మా నాన్న వద్దే శిక్షణ తీసుకుంటానంటూ మొండికేయడంతో సర్ఫరాజ్‌పైనా హెచ్చరిక జారీ అయింది. సెలక్టర్ల వైపు అభ్యంతరకర సైగలు చేయడంతో రెండేళ్ల పాటు అతని మ్యాచ్ ఫీజులను నిలిపేసింది. ఈ వరుస గొడవలతో ఆగ్రహం చెందిన నౌషాద్ ఇక తన కొడుకు ముంబైకి ఆడడంటూ సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌కు తీసుకుపోయాడు. మూడేళ్లు యూపీ తరఫున ఆడిన తర్వాత కనీస గుర్తింపు రాకపోవడంతో తాను చేసింది తప్పని అతనికి అర్థమైంది.
అద్భుత ప్రదర్శనతో..
ముంబైకి తిరిగొచ్చాక.. ఒక్కసారిగా కొత్త సర్ఫరాజ్ కనిపించాడు. వరుసగా రెండు సీజన్లలో అత్యద్భుత ప్రదర్శనతో చెలరేగిపోయి రెండుసార్లూ 900కు పైగా పరుగులతో సత్తా చాటాడు. వరుసగా డబుల్, ట్రిపుల్ సెంచరీలతో చెలరేగి ఒక దశలో 82.83 సగటుతో ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో దిగ్గజ బ్యాటర్ బ్రాడ్‌మన్ తర్వాతి స్థానంలో అతని పేరు కనిపించడం విశేషం. కోవిడ్ సమయంలో ముంబైలో ఆడటం సాధ్యం కాకపోతే తన మిత్రుల సహకారంతో యూపీలో వేర్వేరు నగరాలకు వెళ్లి సాధన కొనసాగించాడు. పరుగుల వరద పారిస్తూ.. ముంబై వరుస టోర్నీల్లో గెలవడంలో కీలక పాత్ర పోషించాడు సర్ఫరాజ్. అతని గ్రాఫ్ చూసిన గవాస్కరే.. సర్ఫరాజ్‌ని భారత జట్టుకు ఇంకెప్పుడు ఎంపిక చేస్తారంటూ ప్రశ్నించాల్సి వచ్చింది. అయినా ప్రతి సిరీస్‌కూ ఎదురు చూడటం, నిరాశపడటం రొటీన్ అయిపోయింది.
అసలు భారత్‌కు ఆడతాడా అనే సందేహాలూ మొదలయ్యాయి. సహనం కోల్పోతున్న పరిస్థితి. ఎట్టకేలకు ఆ సమయం 2024 ఫిబ్రవరి 15న వచ్చింది. ఎలాంటి వివాదం లేకుండా ఏ ఒక్కరూ ప్రశ్నించకుండా ముక్తకంఠంతో సరైన ఎంపికగా అందరూ అభినందిస్తుండగా తీవ్ర భావోద్వేగాల మధ్య సర్ఫరాజ్ తొలి టెస్ట్ ఆడి రెండు అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నాడు. ‘నాన్న కలను నిజం చేశాను’ అంటూ సర్ఫరాజ్ చెబుతుంటే నౌషాద్ కన్నీళ్లపర్యంతం అయిన దృశ్యం అందరి కళ్లల్లో నిలిచిపోయింది. ఎన్నో ప్రతికూలతలను దాటి ఇక్కడికి చేరిన సర్ఫరాజ్ భవిష్యత్తులోనూ మరిన్ని గొప్ప ఇన్నింగ్స్ ఆడాలనేదే సగటు భారత క్రికెట్ అభిమాని ఆకాంక్ష.
– మొహమ్మద్ అబ్దుల్ హాది
Comments
Please login to add a commentAdd a comment