ఆరేళ్ల వయసులోనే ఆ అమ్మాయి జిమ్నాస్టిక్స్ వైపు ఆకర్షితురాలైంది. అయితే ఆమె పాదం కింది భాగం చూస్తే సమతలంగా ఉంది. ఈ ఆటకు ఇలాంటి పాదం పనికి రాదని, జంప్ చేసే సమయంలో ఇబ్బంది కలుగుతుందని స్థానిక కోచ్‌లు చెప్పేశారు. కానీ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) కోచ్‌గా ఉన్న బిశ్వేశ్వర్ నంది మాత్రం ఆ అమ్మాయిలో చురుకుదనాన్ని గుర్తించాడు. తాను ఆమె లోపాన్ని ఎలాగైనా సరిదిద్ది మరీ ఆటలో తీర్చిదిద్దుతానని ఆమె తండ్రికి మాటిచ్చాడు. అక్కడి నుంచి మొదలైన ఆ చిన్నారి ప్రస్థానం ఆపై భారత జిమ్నాస్టిక్స్ చరిత్రలో అత్యుత్తమ ప్లేయర్‌గా నిలిచే వరకు సాగింది. ఆ అమ్మాయే దీపా కర్మాకర్. 16 ఏళ్ల సుదీర్ఘ శ్రమ తర్వాత తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న దీప.. ఎన్నో అరుదైన రికార్డులను, గతంలో ఎవరికీ సాధ్యం కాని మరెన్నో ఘనతలను నమోదు చేసింది.
ఓడినా విజేతగా నిలిచి..
ప్రొడునోవా వాల్ట్.. జిమ్నాస్టిక్స్‌లో అత్యంత కఠినమైన, ప్రమాదకరమైన ఈవెంట్. ప్రపంచ జిమ్నాస్టిక్స్ చరిత్రలో ఐదుగురు మాత్రమే ఈ ఈవెంట్‌ను విజయవంతంగా పూర్తి చేయగలిగారు. వారిలో దీప కూడా ఉంది. 2016 రియో ఒలింపిక్స్‌లో ఆమె ఈ విన్యాసాన్ని చేసి చూపించింది. తన సత్తాను చాటింది. అప్పటి వరకు మన దేశం నుంచి.. ఒలింపిక్స్ క్రీడల చరిత్రలో మహిళల విభాగంలో ఎవరూ కనీసం అర్హత కూడా సాధించలేకపోయారు.
అది దీపకు మాత్రమే సాధ్యమైంది. ఆపై ఫైనల్‌కు కూడా చేరిన ఆమె తన అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. కానీ దురదృష్టవశాత్తు 0.15 పాయింట్ల తేడాతో నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో కాంస్యం చేజార్చుకుంది. అయితేనేమి.. ఆమె ఘనతను అందరూ గుర్తించారు. అందుకే పతకాలు గెలుచుకున్నవారితో సమానంగా ఆమెకూ అభినందనలు, ప్రశంసలు, ప్రోత్సాహకాలు లభించాయి. ఒలింపిక్ పతకం గెలవకపోయినా ఆటలో తన 17 ఏళ్ల కష్టానికి దక్కిన ప్రతిఫలంతో దీప కన్నీళ్లపర్యంతమైంది. ఈ క్రమంలో సహజంగానే ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అర్జున, ఖేల్‌రత్న, పద్మశ్రీ.. దీపను వరించాయి.
జాతీయ స్థాయిలో..
త్రిపుర రాజధాని అగర్తలా దీప స్వస్థలం. తండ్రి ప్రోత్సాహంతో ఆటల వైపు ఆసక్తి చూపించిన ఆమె బిశ్వేశ్వర్ నంది అండగా నిలవడంతో పూర్తి స్థాయిలో జిమ్నాస్టిక్స్‌పై దృష్టి సారించింది. కఠోర శ్రమ, ప్రాక్టీస్ తర్వాత తన సమతల పాదం లోపాన్నీ అధిగమించిన దీపకు ఆపై ఎలాంటి ఇబ్బందీ తలెత్తలేదు. స్థానికంగా చిన్న చిన్న టోర్నీల్లో విజయాలు సాధించిన తర్వాత 15 ఏళ్ల వయసులో దీప పేరు తొలిసారి పెద్ద స్థాయికి చేరింది.
బెంగాల్‌లోని జల్పాయీగుడీలో జరిగిన జాతీయ జూనియర్ చాంపియన్‌షిప్‌లో ఆమె విజేతగా నిలిచింది. ఆ తర్వాత ఆమె తన సాధనకు మరింత పదును పెట్టింది. ఫలితంగా సీనియర్ టీమ్‌లోకి పిలుపు వచ్చింది. రెండేళ్ల తర్వాత న్యూఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ క్రీడలకు ఎంపిక చేసిన భారత జట్టులో దీపకు చోటు దక్కింది. అయితే పోటీల్లో పాల్గొనే అవకాశం మాత్రం రాలేదు. కానీ తర్వాతి ఏడాది జాతీయ క్రీడల్లో త్రిపుర తరఫున పాల్గొని అందుబాటులో ఉన్న నాలుగు స్వర్ణాలనూ దీప గెలుచుకోవడం విశేషం.
విమర్శలను దాటి..
అంతర్జాతీయ స్థాయికి వచ్చేసరికి దీప ఏం చేసినా అది భారత్ తరఫున మొదటి ఘనతగానే నమోదైంది. 2014 గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో కాంస్యం సాధించిన దీప ఈ క్రీడల్లో పతకం గెలిచిన తొలి భారత జిమ్నాస్ట్‌గా నిలిచింది. తర్వాతి ఏడాదే ప్రతిష్ఠాత్మక ఆసియా చాంపియన్‌షిప్‌లో కూడా ఆమె కాంస్యం గెలుచుకుంది. ఆ తర్వాత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తన అత్యుత్తమ ప్రదర్శనను కనబరుస్తూ ఐదో స్థానం సాధించింది.
ఇదే ఆమెను రియో ఒలింపిక్స్ దిశగా తీసుకెళ్లింది. ‘నా గురించి విమర్శలు వచ్చిన ప్రతిసారి వారికి నా ఆటతోనే సమాధానం ఇచ్చాను. 2014లో ప్రొడునోవా మొదలుపెట్టినప్పుడు నన్ను బఫెలో అంటూ చాలా మంది ఆట పట్టించారు. వెంటనే కామన్వెల్త్ పతకం సాధించి చూపించాను. వయసు అయిపోయింది, ఆటలో దమ్ము లేదు అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు 31 ఏళ్ల వయసులో ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచి చూపించాను. ఇలాంటి ముగింపు ఇవ్వాలనే ఇంతకాలం ఆగాను. ఇప్పుడు సంతృప్తిగా ఉంది’ అంటూ దీప తన రిటైర్మెంట్ సమయంలో వెల్లడించింది.
వండర్‌ఫుల్‌గా ముగించి..
తన ఆత్మకథ స్మాల్ వండర్‌లో ఆమె తన కెరీర్‌లోని పలు మలుపుల గురించి చెప్పుకుంది. రియో ఒలింపిక్స్ తర్వాత ఒక్కసారిగా స్టార్ ప్లేయర్ హోదా వచ్చినా ఆ తర్వాత పరిస్థితులు ప్రతికూలంగా మారాయి. వరుస గాయాలతో ఆమె దాదాపు రెండేళ్ల పాటు ఆటకు దూరం కావాల్సి వచ్చింది. పైగా పెద్ద స్థాయి వ్యక్తుల నుంచి మద్దతు దక్కకపోవడంతో ట్రయల్స్‌లో అగ్ర స్థానంలో నిలిచినా పలు సాకులు వెతికి ఆమెను ఆసియా క్రీడలకు పంపకుండా ఫెడరేషన్ నిలిపివేసింది. ఇలాంటి కఠిన సమయాల్లో తాను మానసికంగా మరింత దృఢంగా తయారైంది. విరామం తర్వాత 2018లో రెండు పెద్ద విజయాలతో ఆమె తన సత్తా చాటింది. రెండు వరల్డ్ కప్‌లలో వరుసగా స్వర్ణం, కాంస్యం గెలిచి ఘనంగా పునరాగమనం చేసింది.
ఆస్తమా, దగ్గు కోసం వాడే హైజినమైన్ మందును అనుకోకుండా తీసుకొని నిషేధానికి గురైనప్పుడు ఆమెకు ఎక్కడా కనీస మద్దతు లభించలేదు. ఈ ఘటన తర్వాత మళ్లీ తానేంటో నిరూపించుకోవాలనే పట్టుదల ఆమెలో కనిపించింది. 30 ఏళ్లు దాటినా.. అదే జిమ్నాస్టిక్స్ బార్‌పై తీవ్రంగా సాధన చేసింది. 2024 మేలో తాష్కెంట్‌లో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్ బరిలోకి దిగి స్వర్ణ పతకంతో మెరిసి.. ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా నిలిచింది. ఈ టోర్నీకి ముందు ‘నేను ఇంకా బతికే ఉన్నానని చాటాలనిపించింది. అందుకే పోటీ పడుతున్నా’ అని భావోద్వేగంతో చెప్పిన దీప సగర్వంగా తన కెరీర్‌ను ముగించి భవిష్యత్ తరాలకు జిమ్నాస్టిక్స్‌లో వెలుగుల దారి చూపించింది.
Comments
Please login to add a commentAdd a comment