దేశ రాజధానికి దాదాపు 200 కిలోమీటర్ల దూరంలోని హరియాణా రాష్ట్రంలో.. చారిత్రక గ్రాండ్‌ట్రంక్ రోడ్‌పై శాహాబాద్ పేరుతో ఒక చిన్న పట్టణం ఉంటుంది. దాదాపు 50 వేల జనాభా గల అలాంటి పట్టణాన్ని మామూలుగా అయితే ఎవరూ పట్టించుకోరు. కానీ అక్కడి ఆడబిడ్డలు దానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. అక్కడి అమ్మాయి ఆటలోకి అడుగు పెడితే హాకీ స్టిక్ అందుకోవాల్సిందే. ఇప్పటి వరకు ఒక్క శాహాబాద్ నుంచే భారత జూనియర్, సీనియర్ మహిళల హాకీ జట్లకు 45 మంది ప్రాతినిధ్యం వహించారు. ఒక దశలో భారత సీనియర్ టీమ్‌లో 12 మంది ఇక్కడివారే కావడం విశేషం. అలాంటి చరిత్ర ఉన్న ఊరు నుంచి వచ్చిన అమ్మాయే రాణి రామ్‌పాల్. ప్లేయర్‌గా, కెప్టెన్‌గా అరుదైన విజయాలు సాధించి భారత హాకీకి రాణిగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె తనకంటూ కొత్త చరిత్రను లిఖించుకుంది.
రాణి.. జట్టులోకి వచ్చే సమయానికి పలువురు సీనియర్లు ఆట నుంచి తప్పుకుంటు న్నారు. అలాంటి సందర్భంలో తన ఆటతో టీమ్ బెస్ట్ ప్లేయర్‌గా ఎదిగి, తర్వాత 15 ఏళ్ల పాటు జట్టు భారాన్ని మోసింది. ఒంటి చేత్తో పలు కీలక విజయాలు అందించింది. అంతర్జాతీయ హాకీలో అరంగేట్రం చేసిన ఏడాది తర్వాత రష్యాలో జరిగిన చాంపియన్స్ చాలెంజ్ టోర్నమెంట్‌లో అత్యధిక గోల్స్ సాధించడంతో పాటు యంగ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా నిలవడంతో ఆమె విజయప్రస్థానం మొదలైంది. మరుసటి ఏడాదే అర్జెంటీనాలో జరిగిన వరల్డ్ కప్‌లో 5 గోల్స్ కొట్టిన రాణి ఇక్కడా బెస్ట్ యంగ్ ప్లేయర్ ఆఫ్ ద వరల్డ్ కప్‌గా నిలవడం విశేషం. 19 ఏళ్ల వయసులో జూనియర్ వరల్డ్ కప్‌లో భారత జట్టు తొలిసారి పతకం సాధించడం (కాంస్యం)లో కీలక పాత్ర పోషించిన ఆమె ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా శిఖరాన నిలబడింది.
అతి పిన్న వయస్కురాలిగా..
కులాధిపత్యం, సంప్రదాయాలు, కట్టుబాట్లు, ఖాప్ పంచాయత్‌ల నియమ నిబంధనలు అన్నింటినీ బద్దలు కొట్టి.. షార్ట్ స్కర్ట్స్‌తో అమ్మాయిలు హాకీ ఆడగలగడమే శాహాబాద్‌లో పెద్ద ఘనత. అలాంటి వారిలో రాణి రామ్‌పాల్ తన అద్భుత ఆటతో మరెన్నో మెట్లు పైకెక్కి తన స్థాయిని పెంచుకుంది. ఆరేళ్ల వయసులోనే హాకీకి ఆకర్షితురాలైన ఆమె స్టిక్ చేతపట్టింది. మరో మూడేళ్ళ తర్వాత స్థానిక హాకీ అకాడమీలో చేరిన అనంతరం రాణి ఒక్కసారిగా దూసుకుపోయింది. హరియణా జట్టు తరఫున స్కూల్ నేషనల్స్, ఆపై జూనియర్ నేషనల్స్‌లో ఆమె అసాధారణ ప్రదర్శన అందరినీ ఆకర్షించింది. ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నీ కోసం భారత సీనియర్ జట్టు ఎంపిక జరుగుతున్న సమయంలో ఆమె పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది. ఇంత చిన్న అమ్మాయా.. అంటూ తీవ్రంగా చర్చ సాగినా ఆటలో మేటిగా గుర్తించి సెలక్టర్లు ఎంపిక చేయక తప్పలేదు. ఫలితంగా 14 ఏళ్ల వయసులోనే భారత సీనియర్ జట్టు తరఫున రాణి అంతర్జాతీయ హాకీలోకి అడుగు పెట్టింది. ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలిగా ఆమె రికార్డు సృష్టించింది.
అసాధారణ కెరీర్..
మైదానంలో రాణి చూపించిన పదునైన ఆట, చురుకుదనం ఆమెను ఇతర ప్లేయర్లకంటే భిన్నంగా అగ్రస్థానాన నిలబెట్టాయి. ఫార్వర్డ్‌గా కీలక గోల్స్ చేయడంతో పాటు మిడ్‌ఫీల్డర్‌గా కూడా రెట్టింపు బాధ్యతతో ఆడింది. 254 అంతర్జాతీయ మ్యాచ్‌లలో సాధించిన 120 గోల్స్ రాణిని ప్రపంచ అత్యుత్తమ హాకీ క్రీడాకారిణులలో ఒకరిగా నిలబెట్టాయి. 2009లో జరిగిన ఆసియా కప్‌లో రజతం సాధించిన భారత జట్టులో రాణి సభ్యురాలిగా ఉంది. ఆ తర్వాత 2017లో ఇదే టోర్నీలో జట్టు టైటిల్ సాధించడంలో కూడా ఆమెదే ప్రధాన పాత్ర. ప్రతిష్ఠాత్మక ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో ఆరేళ్ల వ్యవధిలో భారత జట్టు కాంస్య, రజత, స్వర్ణ పతకాలు గెలుచుకుంది. ఆ సమయంలో ప్లేయర్‌గా కెరీర్‌లో ఉచ్ఛ స్థితిలో ఉన్న రాణి ప్రదర్శనే ఈ విజయాలకు కారణం అనడంలో ఎలాంటి సందేహం లేదు. 2014 ఆసియా క్రీడల్లో కాంస్యం సాధించిన జట్టులో కూడా రాణి సభ్యురాలు.
విజయసారథిగా..
ప్రతి ప్లేయర్‌కి కెరీర్‌లో చెప్పుకోదగ్గ, అత్యుత్తమ క్షణాలు కొన్ని ఉంటాయి. రాణి రామ్‌పాల్ సుదీర్ఘ కెరీర్‌లోనూ అలాంటివి చాలా ఉన్నాయి. 2018 ఆసియా క్రీడల్లో రాణి సారథ్యంలో జట్టు రజత పతకాన్ని గెలుచుకుంది. అదే ఏడాది జరిగిన వరల్డ్ కప్‌లో క్వార్టర్ ఫైనల్‌కి చేరిన జట్టు కామన్వెల్త్ క్రీడల్లో నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో పతకం కోల్పోయింది. 1980 తర్వాత 36 ఏళ్లకు 2016 రియో ఒలింపిక్స్‌కు భారత మహిళల హాకీ జట్టు అర్హత సాధించడంలో ప్లేయర్‌గా రాణిదే కీలక పాత్ర. ఆ ఈవెంట్‌లో టీమ్ విఫలమైనా.. జట్టుపై ఆమె ప్రభావం కొనసాగింది. ఈ క్రమంలో నాయకురాలిగా సమర్థంగా జట్టును నడిపించిన ఆమె 2020 టోక్యో ఒలింపిక్స్‌కు టీమ్ అర్హత సాధించేలా చేయగలిగింది. ఈ ఒలింపిక్స్‌లో ప్లేయర్‌గా, కెప్టెన్‌గా రాణి ప్రదర్శన ఎప్పటికీ మర్చిపోలేనిది. లీగ్ దశను దాటి హాట్ ఫేవరిట్ ఆస్ట్రేలియాపై క్వార్టర్ ఫైనల్లో సాధించిన సంచలన విజయంతో భారత్ సెమీస్‌కి చేరింది. కాంస్యపతక పోరులో చివరి వరకు పోరాడి 3–4తో బ్రిటన్ చేతిలో మన అమ్మాయిలు ఓడారు. అయితే ఈ నాలుగో స్థానం భారత మహిళల హాకీ చరిత్రలోనే అత్యుత్తమమైంది.
ప్రతిభకు పట్టం..
టోక్యో ఒలింపిక్స్ తర్వాత వరుస గాయాలు ఆమెను వరల్డ్ కప్‌కు, కామన్‌వెల్త్ క్రీడలకు దూరం చేశాయి. కోలుకొని తిరిగి జట్టులోకి వచ్చినా ఫిట్‌నెస్ సమస్యలు వెంటాడాయి. దాంతో 15 ఏళ్ల అసాధారణ కెరీర్‌కు గుడ్‌బై చెబుతూ రాణి ఇటీవల 29 ఏళ్లకే రిటైర్మెంట్‌ను ప్రకటించింది. తన ప్రదర్శనకుగాను అర్జున, ఖేల్‌రత్న, పద్మశ్రీ వంటి ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకుంది. భారతీయ రైల్వే రాయ్‌బరేలీలోని కొత్త హాకీ స్టేడియానికి రాణి పేరు పెట్టి ఆమెపై గౌరవాన్ని ప్రదర్శించింది. రాణి ఘనకీర్తిని గుర్తిస్తూ ఆమె ధరించిన 28 నంబర్ జెర్సీని ఇకపై ఎవరూ వాడకుండా హాకీ ఇండియా దానికీ రిటైర్మెంట్‌ను ఇవ్వడం విశేషం.
భారత హాకీలో మహరాణి
Published Sun, Nov 17 2024 12:53 AM | Last Updated on Sun, Nov 17 2024 12:53 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment