indian hockey
-
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్
రాజ్‌గిర్ (బిహార్): భారత మహిళల హాకీ జట్టు ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోకి ప్రవేశించింది. మంగళవారం జరిగిన సెమీస్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్, జపాన్‌పై 2-0 గోల్స్ తేడాతో గెలుపొందింది. భారత్ తరఫున వైస్ కెప్టెన్ నవ్‌నీత్ కౌర్ 48వ నిమిషంలో పెనాల్టీ స్ట్రోక్‌ను గోల్‌గా మలిచింది. అనంతరం లాల్రెమ్సియామి 56వ నిమిషంలో మరో గోల్ చేసింది. రేపు జరుగబోయే ఫైనల్లో భారత్ చైనాతో తలపడనుంది. ఈ టోర్నీలో అజేయంగా నిలిచిన భారత్ లీగ్ దశలో చైనాను ఓడించింది. చైనా తొలి సెమీఫైనల్లో మలేసియాపై 3-1 గోల్స్ తేడాతో గెలుపొందింది.మూడు, నాలుగు స్థానాల కోసం జరిగే మ్యాచ్‌లో మలేసియా, జపాన్ తలపడతాయి. ఐదు, ఆరు స్థానాల కోసం జరిగిన మ్యాచ్‌లో కొరియా థాయ్‌లాండ్‌ను 3-0 గోల్స్ తేడాతో ఓడించి, ఐదో స్థానాన్ని దక్కించుకుంది. -
భారత హాకీలో మహరాణి
దేశ రాజధానికి దాదాపు 200 కిలోమీటర్ల దూరంలోని హరియాణా రాష్ట్రంలో.. చారిత్రక గ్రాండ్‌ట్రంక్ రోడ్‌పై శాహాబాద్ పేరుతో ఒక చిన్న పట్టణం ఉంటుంది. దాదాపు 50 వేల జనాభా గల అలాంటి పట్టణాన్ని మామూలుగా అయితే ఎవరూ పట్టించుకోరు. కానీ అక్కడి ఆడబిడ్డలు దానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. అక్కడి అమ్మాయి ఆటలోకి అడుగు పెడితే హాకీ స్టిక్ అందుకోవాల్సిందే. ఇప్పటి వరకు ఒక్క శాహాబాద్ నుంచే భారత జూనియర్, సీనియర్ మహిళల హాకీ జట్లకు 45 మంది ప్రాతినిధ్యం వహించారు. ఒక దశలో భారత సీనియర్ టీమ్‌లో 12 మంది ఇక్కడివారే కావడం విశేషం. అలాంటి చరిత్ర ఉన్న ఊరు నుంచి వచ్చిన అమ్మాయే రాణి రామ్‌పాల్. ప్లేయర్‌గా, కెప్టెన్‌గా అరుదైన విజయాలు సాధించి భారత హాకీకి రాణిగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె తనకంటూ కొత్త చరిత్రను లిఖించుకుంది. రాణి.. జట్టులోకి వచ్చే సమయానికి పలువురు సీనియర్లు ఆట నుంచి తప్పుకుంటు న్నారు. అలాంటి సందర్భంలో తన ఆటతో టీమ్ బెస్ట్ ప్లేయర్‌గా ఎదిగి, తర్వాత 15 ఏళ్ల పాటు జట్టు భారాన్ని మోసింది. ఒంటి చేత్తో పలు కీలక విజయాలు అందించింది. అంతర్జాతీయ హాకీలో అరంగేట్రం చేసిన ఏడాది తర్వాత రష్యాలో జరిగిన చాంపియన్స్ చాలెంజ్ టోర్నమెంట్లో అత్యధిక గోల్స్ సాధించడంతో పాటు యంగ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా నిలవడంతో ఆమె విజయప్రస్థానం మొదలైంది. మరుసటి ఏడాదే అర్జెంటీనాలో జరిగిన వరల్డ్ కప్‌లో 5 గోల్స్ కొట్టిన రాణి ఇక్కడా బెస్ట్ యంగ్ ప్లేయర్ ఆఫ్ ద వరల్డ్ కప్‌గా నిలవడం విశేషం. 19 ఏళ్ల వయసులో జూనియర్ వరల్డ్ కప్‌లో భారత జట్టు తొలిసారి పతకం సాధించడం (కాంస్యం)లో కీలక పాత్ర పోషించిన ఆమె ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా శిఖరాన నిలబడింది. అతి పిన్న వయస్కురాలిగా..కులాధిపత్యం, సంప్రదాయాలు, కట్టుబాట్లు, ఖాప్ పంచాయత్‌ల నియమ నిబంధనలు అన్నింటినీ బద్దలు కొట్టి.. షార్ట్ స్కర్ట్స్‌తో అమ్మాయిలు హాకీ ఆడగలగడమే శాహాబాద్లో పెద్ద ఘనత. అలాంటి వారిలో రాణి రామ్‌పాల్ తన అద్భుత ఆటతో మరెన్నో మెట్లు పైకెక్కి తన స్థాయిని పెంచుకుంది. ఆరేళ్ల వయసులోనే హాకీకి ఆకర్షితురాలైన ఆమె స్టిక్ చేతపట్టింది. మరో మూడేళ్ళ తర్వాత స్థానిక హాకీ అకాడమీలో చేరిన అనంతరం రాణి ఒక్కసారిగా దూసుకుపోయింది. హరియణా జట్టు తరఫున స్కూల్ నేషనల్స్, ఆపై జూనియర్ నేషనల్స్‌లో ఆమె అసాధారణ ప్రదర్శన అందరినీ ఆకర్షించింది. ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నీ కోసం భారత సీనియర్ జట్టు ఎంపిక జరుగుతున్న సమయంలో ఆమె పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది. ఇంత చిన్న అమ్మాయా.. అంటూ తీవ్రంగా చర్చ సాగినా ఆటలో మేటిగా గుర్తించి సెలక్టర్లు ఎంపిక చేయక తప్పలేదు. ఫలితంగా 14 ఏళ్ల వయసులోనే భారత సీనియర్ జట్టు తరఫున రాణి అంతర్జాతీయ హాకీలోకి అడుగు పెట్టింది. ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలిగా ఆమె రికార్డు సృష్టించింది. అసాధారణ కెరీర్..మైదానంలో రాణి చూపించిన పదునైన ఆట, చురుకుదనం ఆమెను ఇతర ప్లేయర్లకంటే భిన్నంగా అగ్రస్థానాన నిలబెట్టాయి. ఫార్వర్డ్‌గా కీలక గోల్స్ చేయడంతో పాటు మిడ్‌ఫీల్డర్‌గా కూడా రెట్టింపు బాధ్యతతో ఆడింది. 254 అంతర్జాతీయ మ్యాచ్‌లలో సాధించిన 120 గోల్స్ రాణిని ప్రపంచ అత్యుత్తమ హాకీ క్రీడాకారిణులలో ఒకరిగా నిలబెట్టాయి. 2009లో జరిగిన ఆసియా కప్‌లో రజతం సాధించిన భారత జట్టులో రాణి సభ్యురాలిగా ఉంది. ఆ తర్వాత 2017లో ఇదే టోర్నీలో జట్టు టైటిల్ సాధించడంలో కూడా ఆమెదే ప్రధాన పాత్ర. ప్రతిష్ఠాత్మక ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో ఆరేళ్ల వ్యవధిలో భారత జట్టు కాంస్య, రజత, స్వర్ణ పతకాలు గెలుచుకుంది. ఆ సమయంలో ప్లేయర్‌గా కెరీర్లో ఉచ్ఛ స్థితిలో ఉన్న రాణి ప్రదర్శనే ఈ విజయాలకు కారణం అనడంలో ఎలాంటి సందేహం లేదు. 2014 ఆసియా క్రీడల్లో కాంస్యం సాధించిన జట్టులో కూడా రాణి సభ్యురాలు. విజయసారథిగా..ప్రతి ప్లేయర్‌కి కెరీర్లో చెప్పుకోదగ్గ, అత్యుత్తమ క్షణాలు కొన్ని ఉంటాయి. రాణి రామ్‌పాల్ సుదీర్ఘ కెరీర్లోనూ అలాంటివి చాలా ఉన్నాయి. 2018 ఆసియా క్రీడల్లో రాణి సారథ్యంలో జట్టు రజత పతకాన్ని గెలుచుకుంది. అదే ఏడాది జరిగిన వరల్డ్ కప్‌లో క్వార్టర్ ఫైనల్‌కి చేరిన జట్టు కామన్వెల్త్ క్రీడల్లో నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో పతకం కోల్పోయింది. 1980 తర్వాత 36 ఏళ్లకు 2016 రియో ఒలింపిక్స్‌కు భారత మహిళల హాకీ జట్టు అర్హత సాధించడంలో ప్లేయర్‌గా రాణిదే కీలక పాత్ర. ఆ ఈవెంట్లో టీమ్ విఫలమైనా.. జట్టుపై ఆమె ప్రభావం కొనసాగింది. ఈ క్రమంలో నాయకురాలిగా సమర్థంగా జట్టును నడిపించిన ఆమె 2020 టోక్యో ఒలింపిక్స్‌కు టీమ్ అర్హత సాధించేలా చేయగలిగింది. ఈ ఒలింపిక్స్‌లో ప్లేయర్‌గా, కెప్టెన్‌గా రాణి ప్రదర్శన ఎప్పటికీ మర్చిపోలేనిది. లీగ్ దశను దాటి హాట్ ఫేవరిట్ ఆస్ట్రేలియాపై క్వార్టర్ ఫైనల్లో సాధించిన సంచలన విజయంతో భారత్ సెమీస్‌కి చేరింది. కాంస్యపతక పోరులో చివరి వరకు పోరాడి 3–4తో బ్రిటన్ చేతిలో మన అమ్మాయిలు ఓడారు. అయితే ఈ నాలుగో స్థానం భారత మహిళల హాకీ చరిత్రలోనే అత్యుత్తమమైంది.ప్రతిభకు పట్టం..టోక్యో ఒలింపిక్స్ తర్వాత వరుస గాయాలు ఆమెను వరల్డ్ కప్‌కు, కామన్వెల్త్ క్రీడలకు దూరం చేశాయి. కోలుకొని తిరిగి జట్టులోకి వచ్చినా ఫిట్నెస్ సమస్యలు వెంటాడాయి. దాంతో 15 ఏళ్ల అసాధారణ కెరీర్‌కు గుడ్‌బై చెబుతూ రాణి ఇటీవల 29 ఏళ్లకే రిటైర్మెంట్ను ప్రకటించింది. తన ప్రదర్శనకుగాను అర్జున, ఖేల్‌రత్న, పద్మశ్రీ వంటి ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకుంది. భారతీయ రైల్వే రాయ్‌బరేలీలోని కొత్త హాకీ స్టేడియానికి రాణి పేరు పెట్టి ఆమెపై గౌరవాన్ని ప్రదర్శించింది. రాణి ఘనకీర్తిని గుర్తిస్తూ ఆమె ధరించిన 28 నంబర్ జెర్సీని ఇకపై ఎవరూ వాడకుండా హాకీ ఇండియా దానికీ రిటైర్మెంట్ను ఇవ్వడం విశేషం. -
భారత్‌పై అక్కసు తీర్చుకున్న పాక్ హాకీ జట్టు!
పురుషుల హాకీ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ చైనాను 1-0 గోల్స్ తేడాతో ఓడించి ఐదోసారి ఆసియా ఛాంపియన్‌గా నిలిచింది. నిన్న జరిగిన ఫైనల్లో భారత్ చైనాపై న్యారో మార్జిన్‌తో విజయం సాధించింది. ఉత్కంఠ భరితంగా సాగిన తుది సమరంలో జుగ్రాజ్ సింగ్ 51వ నిమిషంలో గోల్ చేసి భారత్‌కు ఆధిక్యాన్ని అందించాడు. భారత్ ఇదే లీడ్‌ను చివరి వరకు కొనసాగించి విజేతగా నిలిచింది.చైనాకు మద్దతుగా పాక్ ఆటగాళ్లుఫైనల్ మ్యాచ్ సందర్భంగా పాక్ ఆటగాళ్లు చైనాకు మద్దతుగా నిలిచి అబాసుపాలయ్యారు. పాక్ ఇదే టోర్నీ సెమీఫైనల్లో చైనా చేతిలో ఘోరంగా ఓడింది. అయినా పాక్ ఆటగాళ్లు నిసిగ్గుగా చైనా జెండాలు పట్టుకుని వేలాడారు. వారు ఏకంగా చెంపలపై చైనా జెండా స్టిక్కర్లు అంటించుకుని మద్దతు తెలిపారు. తాము మద్దతు తెలిపినా చైనా ఓడిపోవడంతో పాక్ ఆటగాళ్లు దిగాలుగా ఉండిపోయారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌మీడియాలో వైరలవుతుండటంతో భారత అభిమానులు పాక్‌ను ఆటాడేసుకుంటున్నారు. వారి బుద్ధే అంతా చీవాట్లు పెడుతున్నారు. కాగా, సెమీస్‌లో చైనా చేతిలో ఓడిన పాక్ మూడో స్థానం కోసం జరిగిన పోటీలో కొరియాపై 5-2 గోల్స్ తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన అనంతరమే పాక్ ఆటగాళ్లు నేరుగా వచ్చి భారత్-చైనా ఫైనల్ మ్యాచ్ వీక్షించారు. India's Asian Champions Trophy heroes rewarded! 🏆🇮🇳The victorious Indian Men's Hockey Team gets a well-deserved bonus for their record 5th title win! Each player will receive ₹3 lakhs, while support staff members will be awarded ₹1.5 lakhs each.This well-deserved reward… pic.twitter.com/cvI8avkpvx— Hockey India (@TheHockeyIndia) September 17, 2024చదవండి: అజేయంగా ‘ఆసియా’ విజేతగా -
భారత్ ఖాతాలో వరుసగా నాలుగో విజయం
ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీమెంట్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ వరుసగా నాలుగో విజయం నమోదు చేసింది. దక్షిణ కొరియాతో ఇవాళ (సెప్టెంబర్ 12) జరిగిన మ్యాచ్‌లో భారత్ 3-1 గోల్స్ తేడాతో గెలుపొందింది. భారత్ తరఫున కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ రెండు, స్ట్రయికర్ అరైజీత్ సింగ్ హుండల్ ఓ గోల్ చేశారు. కొరియా చేసిన ఏకైక గోల్‌ను జిహున్ యంగ్ సాధించాడు. భారత్ తమ తదుపరి లీగ్ మ్యాచ్‌లో దాయాది పాకిస్తాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ సెప్టెంబర్ 14న జరుగనుంది. భారత్ ఈ టోర్నీలో ఇదివరకే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. టీమిండియా.. తమ తొలి మ్యాచ్‌లో చైనాపై 3-1 గోల్స్ తేడాతో.. రెండో మ్యాచ్‌లో జపాన్‌పై 5-1 గోల్స్ తేడాతో.. మూడో మ్యాచ్‌లో మలేసియాపై 8-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. భారత్ ఈ టోర్నీలో జయకేతనం ఎగురవేసి రికార్డు స్థాయిలో వరుసగా ఐదోసారి టైటిల్ కైవసం చేసుకోవాలని భావిస్తుంది. -
రాజ్ కుమార్ హ్యాట్రిక్.. ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్‌లో భారత్
చైనా వేదికగా జరుగుతున్న హీరో ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత హాకీ జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈ టోర్నీలో భారత్ వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. తొలి మ్యాచ్‌లో చైనాను 3-0 తేడాతో మట్టికరిపించిన భారత్.. రెండో మ్యాచ్‌లో జపాన్ను 5-1 తేడాతో చిత్తు చేసింది. తాజాగా మలేసియాపై 8-1 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ సెమీఫైనల్స్‌కు అర్హత సాధించింది.రాజ్ కుమార్ హ్యాట్రిక్మలేసియాతో మ్యాచ్‌లో రాజ్ కుమార్ పాల్ హ్యాట్రిక్ గోల్స్ సాధించాడు. ఆట 3, 25, 33వ నిమిషాల్లో రాజ్ కుమార్ గోల్స్ చేశాడు. భారత్ తరఫున రాజ్ కుమార్‌తో పాటు అరైజీత్ సింగ్ హుండల్ 6, 39 నిమిషంలో, జుగ్రాజ్ సింగ్ 7వ నిమిషంలో, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ 22వ నిమిషంలో, ఉత్తమ్ సింగ్ 40వ నిమిషంలో గోల్స్ సాధించారు. మలేసియా సాధించిన ఏకైక గోల్‌ను అకీముల్లా అనువర్ 34వ నిమిషంలో సాధించాడు.ఈ టోర్నీలో భారత్ తమ తదుపరి మ్యాచ్‌ల్లో కొరియా, పాకిస్తాన్లతో తలపడనుంది. కొరియాతో మ్యాచ్ సెప్టెంబర్ 12న.. పాక్‌తో మ్యాచ్ సెప్టెంబర్ 14న జరుగనున్నాయి. చదవండి: స్టిమాక్ కాంట్రాక్ట్ పునరుద్ధరణపై ఏఐఎఫ్ఎఫ్ విచారణ -
భారత హాకీ జట్టకు ఘన సన్మానం.. అమిత్‌కు రూ. 4 కోట్ల నజరానా
భువనేశ్వర్: వరుసగా రెండు ఒలింపిక్స్ క్రీడల్లో కాంస్య పతకాలు సాధించిన భారత హాకీ జట్టుకు తమ రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక సహకారం కొనసాగిస్తుందని... 2036 వరకు భారత హాకీ జట్టుకు ఒడిశా ప్రభుత్వం స్పాన్సర్‌గా కొనసాగుతుందని ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ప్రకటించారు.బుధవారం భువనేశ్వర్‌లో భారత జట్టు సభ్యులకు ఒడిశా ప్రభుత్వం సన్మానించింది. పారిస్ క్రీడల్లో కాంస్యం నెగ్గిన భారత జట్టులో కీలక సభ్యుడైన ఒడిశాకు చెందిన డిఫెండర్ అమిత్ రోహిదాస్‌కు రూ. 4 కోట్ల నజరానాను చెక్ రూపంలో అందించింది. జట్టులోని ఇతర ఆటగాళ్లకు తలా రూ. 15 లక్షల, సహాయక సిబ్బదికి రూ. 10 లక్షల నగదు బహుమతి అందజేసింది. 2018 నుంచి భారత హాకీ జట్లకు ఒడిశా ప్రభుత్వం అధికారిక స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది.ఈ సందర్భంగా భారత సారథి హర్మన్‌ప్రీత్ మాట్లాడుతూ.. ‘జర్మనీతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో విజయానికి చేరువగా వచ్చాం. చాలా అవకాశాలు సృష్టించుకున్నాం. అయితే అది మా రోజు కాదు. అయినా కాంస్య పతక పోరులో తిరిగి సత్తాచాటాం. స్వర్ణం సాధించడమే లక్ష్యంగా పారిస్‌కు వెళ్లాం. కానీ అది సాధ్యపడలేదు. వరసగా రెండు విశ్వక్రీడల్లో పతకాలు సాధించడం చాలా ఆనందంగా ఉంది. ఒడిశా ప్రభుత్వం అందించిన సహాయ సహకారాలు మరవలేనివని.. ఇక్కడ హాకీకి కావాల్సిన సకల సదుపాయాలు ఉన్నాయి’ అని అన్నాడు. -
భారత జూనియర్ హాకీ జట్టు కోచ్‌గా శ్రీజేశ్!
పారిస్ ఒలింపిక్స్‌లో అద్భుతమైన ప్రదర్శనతో వరుసగా రెండో కాంస్య పతకం సాధించిన అనంతరం కెరీర్‌కు వీడ్కోలు పలికిన భారత హాకీ జట్టు గోల్ కీపర్ పీఆర్ శ్రీజేశ్ త్వరలోనే కొత్త అవతారంలో దర్శనమివ్వనున్నాడు. గోల్ పోస్ట్ ముందు తన అసమాన ప్రతిభతో దేశానికి ఎన్నో మధుర విజయాలు అందించిన శ్రీజేశ్.. ఇకపై జాతీయ జూనియర్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించనున్నాడు. ‘త్వరలోనే శ్రీజేశ్‌ను జూనియర్ (అండర్–21) జట్టు కోచ్‌గా నియమిస్తాం. దీని గురించి అతడితో మాట్లాడాం. యువ ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేయడంలో అతడికి మించిన వారు మరొకరు లేరు. దీంతో పాటు శ్రీజేశ్ స్థానాన్ని భర్తీ చేయనున్న గోల్ కీపర్లు సూరజ్ కార్కెరా, క్రిషన్ బహదూర్ పాఠక్‌కు కూడా దిశా నిర్దేశం చేయాల్సి ఉంటుంది’ అని హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ పేర్కొన్నాడు. -
కాంస్య పతకంతో వీడ్కోలు పలికిన భారత హాకీ లెజెండ్...
ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత హాకీ జట్టు అద్భుతం చేసింది. ఈ విశ్వ క్రీడల్లో వరుసగా రెండోసారి కాంస్య పతకాన్ని భారత హాకీ జట్టు సొంతం చేసుకుంది. సెమీస్‌లో జర్మనీ చేతిలో పోరాడి ఓడిన టీమిండియా.. స్పెయిన్‌తో కాంస్య పతక పోరులో మాత్రం సత్తాచాటింది. 2-1 తేడాతో స్పెయిన్ ఓడించిన భారత జట్టు కాంస్య పతకాన్ని ముద్దాడింది. ఇక ఈ చిరస్మరణీయ విజయంతో భారత స్టార్ గోల్ కీపర్ పీఆర్ శ్రీజేశ్ తన 18 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు విడ్కోలు పలికాడు. కాగా తన రిటైర్మెంట్ విషయాన్ని ఒలింపిక్స్ ఆరంభానికి ముందే శ్రీజేశ్ ప్రకటించాడు.ఈ క్రమంలో తన కెరీర్లో చివరి మ్యాచ్ ఆడిన పీఆర్ శ్రీజేష్‌కు సహచర ఆటగాళ్లు ఘన వీడ్కోలు పలికారు. ఆటగాళ్లంతా శ్రీజేష్‌కు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. తమ భుజాలపై ఎత్తుకొని గోల్ పోస్ట్ పోల్‌పై కూర్చోబెట్టారు. తమ హాకీ స్టిక్స్‌తో జేజేలు కొట్టారు. కాగా భారత్ కాంస్య పతకం సాధించడంలో శ్రీజేష్‌ది కీలక పాత్ర. ముఖ్యంగా బ్రిటన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీజేష్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. కోట గోడలా నిలిచిన శ్రీజేష్ బ్రిటన్‌కు ఎక్స్ట్రా గోల్ చేసే ఛాన్స్ ఇవ్వలేదు.ఇక 2006లో సౌత్ ఆసియన్ గేమ్స్‌తో అరంగేట్రం చేసిన శ్రీజేష్.. ఎన్నో ఘనతలను తన పేరిట లిఖించుకున్నాడు. కెప్టెన్‌గా, గోల్‌కీపర్‌గా భారత్‌కు చిరస్మరణీయ విజయాలను అందించాడు. రియో ఒలింపిక్స్‌లో భారత జట్టుకు శ్రీజేష్ సారథ్యం వహించాడు.2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత హారీ జట్టులో శ్రీజేష్ సభ్యునిగా ఉన్నాడు. ఇది శ్రేజేష్కు నాలుగో ఒలింపిక్స్ కావడం గమనార్హం. అతడి కెరీర్లో రెండు ఆసియా గేమ్స్ బంగారు పతకాలు, రెండు ఆసియా కప్ టైటిల్స్, నాలుగు ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్స్ కూడా ఉన్నాయి. 2021లో శ్రేజేష్ 2021లో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును అందుకున్నాడు."నా ఆటను ముగించేందుకు ఇంతకంటే సరైన సమయం ఉండదు. మేం పతకంతో తిరిగి వెళుతున్నాం. కొందరు అభిమానులు నన్ను కొనసాగించమని కోరుతున్నారు. కానీ నా నిర్ణయంలో మార్పు లేదు. కొన్ని నిర్ణయాలు కఠినమైనవే అయినా వాటిని సరైన సమయంలో తీసుకోవడమే బాగుంటుంది. మా జట్టు సభ్యులంతా చాలా బాగా ఆడారు. టోక్యోలో గెలిచిన కాంస్యానికి నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎందుకంటే ఒలింపిక్స్‌లో మేం పతకం గెలవగలమనే నమ్మకాన్ని అది కల్పించిందని" తన రిటైర్మెంట్ ప్రకటనలో శ్రీజేష్ పేర్కొన్నాడు. -
Paris Olympics: జెర్మనీతో సెమీస్.. భారత హాకీ జట్టుకు బిగ్ షాక్
ప్యారిస్ ఒలింపిక్స్ సెమీఫైనల్స్‌కు ముందు భారత హాకీ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగలింది. నిషేదం కారణంగా భారత డిఫెండర్ అమిత్ రోహిదాస్ మంగళవారం జెర్మనీతో జరగనున్న సెమీఫైనల్‌కు దూరమయ్యాడు. ఆదివారం గ్రేట్ బ్రిటన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించాడని రోహిదాస్‌పై ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్(FIH )టెక్నికల్ డెలిగేట్ ఒక్క మ్యాచ్ నిషేధం విధించింది. ఈ క్రమంలోనే సెమీస్ పోరుకు రోహిదాస్ దూరంగా ఉండనున్నాడు. సెమీఫైనల్లో హాకీ జట్టు 16 మంది సభ్యులకు బదులుగా 15 మందితో ఆడనుంది. అయితే హాకీ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ తీసుకున్న నిర్ణయంపై భారత జట్టు అసహనంగా ఉంది. అయితే హాకీ ఇండియా ఇప్పటికే ఎఫ్ఐహెచ్ నిర్ణయంపై సవాలు చేసింది. రోహిదాస్‌పై విదించిన బ్యాన్ పై పూనరాలోచించాలని హాకీ ఇండియా అప్పీల్ చేసింది. అయితే సెమీస్‌కు ముందు ఎఫ్ఐహెచ్ తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకాశాలు తక్కువ.అసలేం జరిగిందంటే?మ్యాచ్ 17వ నిమిషంలో భారత డిఫెండర్ అమిత్ రోహిదాస్ స్టిక్ బ్రిటన్ ఫార్వర్డ్ విలియమ్ కల్నాన్ తలకు తగిలింది. వీడియో రీప్లే చూస్తే అతను ఉద్దేశపూర్వకంగా చేసినట్లు అనిపించకపోయినా... మ్యాచ్ రిఫరీ తీవ్ర చర్య తీసుకున్నాడు. రోహిదాస్‌కు ‘రెడ్ కార్డ్’ చూపించడంతో అతను మైదానాన్ని వీడాల్సి వచ్చింది. దాంతో మిగిలిన మ్యాచ్ మొత్తం భారత్ 10 మందితోనే ఆడింది. -
టీమిండియా ఆటగాడిపై పోక్సో కేసు
భారత జాతీయ జట్టు హాకీ ప్లేయర్ వరుణ్ కుమార్‌పై పోక్సో కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని 22 ఏళ్ల అమ్మాయి బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వరుణ్‌పై కేసు నమోదు చేశారు. 2018లో ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన వరుణ్.. అప్పటినుంచి పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు సదరు యువతి ఫిర్యాదులో పేర్కొంది. ఆ సమయంలో తాను మైనర్‌నని (17 ఏళ్లు).. వరుణ్ స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియాలో శిక్షణలో ఉన్నాడని యువతి ఫిర్యాదులో ప్రస్తావించింది. యువతి ఫిర్యాదు నేపథ్యంలో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు వరుణ్ కోసం గాలిస్తున్నారు. వరుణ్ పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. కేసు నమోదు కాకముందు వరకు వరుణ్ భువనేశ్వర్‌లోని జాతీయ శిక్షణా శిబిరంలో ఉన్నట్లు తెలుస్తుంది. 28 ఏళ్ల వరుణ్ కుమార్ భారత జాతీయ జట్టు తరఫున డిఫెండర్ స్థానంలో ఆడతాడు. 2017 నుంచి జాతీయ జట్టుకు ఆడుతున్న వరుణ్.. టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత జట్టులో స్టాండ్‌బై సభ్యుడిగా ఉన్నాడు. జూనియర్ స్థాయి నుంచి జాతీయ జట్టుకు ఆడుతున్న వరుణ్.. హాకీ ఇండియా లీగ్‌లో పంజాబ్ వారియర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. టీమిండియా తరఫున 142 మ్యాచ్‌లు ఆడిన వరుణ్ మొత్తం 40 గోల్స్ చేశాడు. -
Men's Hockey5s World Cup: క్వార్టర్ ఫైనల్లో భారత్ ఓటమి
మస్కట్: పురుషుల హాకీ ‘ఫైవ్–ఎ–సైడ్’ ప్రపంచకప్ టోర్నీలో భారత జట్టు పతకం రేసులో నిలువలేకపోయింది. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత జట్టు 4–7 గోల్స్ తేడాతో నెదర్లాండ్స్ చేతిలో ఓడిపోయింది. భారత్ తరఫున రహీల్ మొహమ్మద్ (1వ, 7వ, 25వ ని.లో) మూడు గోల్స్ చేయగా... మందీప్ మోర్ (11వ ని.లో) ఒక గోల్ సాధించాడు. క్వార్టర్ ఫైనల్లో ఓడిన భారత జట్టు 5 నుంచి 8 స్థానాల కోసం వర్గీకరణ మ్యాచ్‌ల్లో భాగంగా కెన్యాతో జరిగిన పోరులో 9–4తో ఘనవిజయం సాధించింది. -
Men's Hockey5s World Cup: క్వార్టర్ ఫైనల్లో భారత్
మస్కట్: పురుషుల హాకీ ‘ఫైవ్–ఎ–సైడ్’ ప్రపంచకప్ టోర్నమెంట్లో భారత జట్టు క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. జమైకాతో జరిగిన పూల్ ‘బి’ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 13–0 గోల్స్ తేడాతో గెలిచింది. భారత్ తరఫున మణీందర్ సింగ్ (28వ, 29వ ని.లో), మంజీత్ (5వ, 24వ ని.లో), రహీల్ మొహమ్మద్ (16వ, 27వ ని.లో), మన్దీప్ మోర్ (23వ, 27వ ని.లో) రెండు గోల్స్ చొప్పున చేశారు. ఉత్తమ్ సింగ్ (5వ ని.లో), రాజ్‌భర్ పవన్ (9వ ని.లో), గుర్జోత్ సింగ్ (14వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. పూల్ ‘బి’లో ఆరు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచిన భారత జట్టు నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో నెదర్లాండ్స్‌తో తలపడుతుంది. -
రన్నరప్‌గా నిలిచిన భారత్
మస్కట్: మహిళల హాకీ ఫైవ్స్ ప్రపంచకప్ టోర్నీలో భారత జట్టు రన్నరప్‌గా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి ఇతిమరపు రజని కెపె్టన్సీలోని భారత జట్టు 2–7 గోల్స్ తేడాతో నెదర్లాండ్స్ జట్టు చేతిలో ఓడిపోయింది. భారత్ తరఫున జ్యోతి ఛత్రి (20వ ని.లో), రుతుజా (23వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. ఈ టోర్నీలో తెలంగాణకు చెందిన యెండల సౌందర్య భారత జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరించింది. -
భారత హాకీ జట్టుకు రెండో గెలుపు
మస్కట్: మహిళల ‘ఫైవ్స్’ ప్రపంచకప్ హాకీ టోర్నీలో భారత జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. అమెరికాతో జరిగిన పూల్ ‘సి’ రెండో మ్యాచ్‌లో టీమిండియా 7–2 గోల్స్‌తో గెలిచింది. భారత్ తరఫున మరియానా (20వ, 22వ ని.లో), దీపిక (23వ, 25వ ని.లో) రెండు గోల్స్ చొప్పున చేయగా... ముంతాజ్ (27వ ని.లో), అజ్మీనా (29వ ని.లో), మహిమ (17వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. పోలాండ్‌తో జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో భారత్ 5–4తో గెలిచింది. -
సెమీస్‌లో భారత్.. ఒలింపిక్స్ బెర్త్ అవకాశాలు సజీవం
రాంచీ: పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించే అవకాశాలను భారత మహిళల హాకీ జట్టు సజీవంగా నిలబెట్టుకుంది. ఇక్కడ జరుగుతున్న ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో సవితా పూనియా సారథ్యంలోని భారత జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గ్రూప్ ‘బి’లో భాగంగా ఇటలీ జట్టుతో జరిగిన చివరిదైన మూడో లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 5–1 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున ఉదిత రెండు గోల్స్ (1వ, 55వ ని.లో) చేయగా... దీపిక (41వ ని.లో), సలీమా టెటె (45వ ని.లో), నవ్‌నీత్ కౌర్ (53వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. ఇటలీ జట్టుకు కామిలా మాచిన్ (ప్లస్ 60వ ని.లో) ఏకైక గోల్‌ను అందించింది. అంతకుముందు జరిగిన మరో మ్యాచ్‌లో అమెరికా 1–0తో న్యూజిలాండ్‌ను ఓడించింది. దాంతో గ్రూప్ ‘బి’లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన అమెరికా 9 పాయింట్లతో టాపర్‌గా నిలువగా... రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన భారత్ 6 పాయింట్లతో రెండో స్థానం సంపాదించి సెమీఫైనల్ బెర్త్‌లు ఖరారు చేసుకున్నాయి. గురువారం జరిగే సెమీఫైనల్స్‌లో జపాన్‌తో అమెరికా; జర్మనీతో భారత్ తలపడతాయి. ఈ టోర్నీలో టాప్–3లో నిలిచిన జట్లు పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తాయి. -
ఛాంపియన్ భారత్
రాంచీ: స్వదేశంలో తొలిసారి జరిగిన ఆసియా మహిళల హాకీ చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో టీమిండియా 4–0 గోల్స్ తేడాతో జపాన్ జట్టును ఓడించింది. భారత్ తరఫున సంగీత కుమారి (17వ ని.లో), నేహా (46వ ని.లో), లాల్రెమ్సియామి (57వ ని.లో), వందన కటారియా (60వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. Congrats to the 🇮🇳 Women’s 🏑 team as they beat 🇯🇵 4-0 in the final to win the Asian Champions Trophy at Ranchi. 7 matches,7 convincing wins. After the disappointment of missing out on the Asian Games🥇this will give the team huge confidence for the Olympic Qualifiers in 2024 pic.twitter.com/6XY2yPCc4m— Viren Rasquinha (@virenrasquinha) November 5, 2023 ఆసియా చాంపియన్స్ ట్రోఫీని భారత్ నెగ్గడం ఇది రెండోసారి. 2016లో టీమిండియా తొలిసారి ఈ టైటిల్ సాధించింది. విజేతగా నిలిచిన భారత జట్టుకు హాకీ ఇండియా నజరానా ప్రకటించింది. జట్టులోని ప్రతి సభ్యురాలిగా రూ. 3 లక్షలు చొప్పున అందజేస్తామని తెలిపింది. -
పేదరికం.. ఎన్నో అవమానాలు.. ఇప్పుడు దేశం గర్వించదగ్గ హాకీ ప్లేయర్
భారత దేశంలో నేటికి కొన్ని ప్రాంతాల్లో అమ్మాయిలు వివక్షను ఎదుర్కొంటూనే ఉన్నారు. ప్రతి విషయంలో వారిపై అంక్షల పర్వం కొనసాగుతూనే ఉంది. వారు మనసు నచ్చిన ఏ పనిని స్వేచ్ఛగా చేయలేకపోతున్నారు. తల్లిదండ్రులు మద్దతు ఉన్నా, సమాజం ప్రతి విషయంలో వారిని కుళ్ళబొడుస్తూనే ఉంది. ఇలాంటి అనుభవాలనే భారత దేశం గర్వించదగ్గ మహిళా హాకీ ప్లేయర్ వందనా కటారియా కూడా ఎదుర్కొంది. తనకు ఎంతో ఇష్టమైన క్రీడను (హాకీ) ఆడే క్రమంలో ఆమె ఎన్నో అవమానాలను ఎదుర్కొంది. అబ్బాయిలు ఆడే ఆటలు అమ్మాయిలకు ఎందుకని చుట్టుపక్కల వాళ్లు చులకన చేశారు. అబ్బాయిల్లా పొట్టి పొట్టి నిక్కర్లు వేసుకోవడమేంటని అవహేళన చేశారు. ఈ విషయంలో ఆమె తల్లిదండ్రులను కూడా నిందించారు. ఓ దశలో అమ్మాయిగా ఎందుకు పుట్టానా అని ఆమె బాధపడింది. అసలే పేదరికంతో బాధపడుతుంటే చుట్టుపక్కల వాళ్లు సూటిపోటీ మాటలతో మరింత వేధించారు. ఇలాంటి సమయంలోనే ఆమె గట్టిగా ఓ నిర్ణయం తీసుకుంది. తన ఆటతోనే విమర్శకుల నోళ్లు మూయించాలని డిసైడైంది. ఆ క్రమంలో ఒక్కోమెట్టు ఎక్కుతూ ప్రస్తుతం యావత్ భారత దేశం గర్వించదగ్గ క్రీడాకారిణిగా పేరు తెచ్చుకుంది. ఈ మధ్యే 300వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన వందన కటారియా.. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జన్మించిన వందన.. భారత మహిళా హాకీ జట్టులో ఫార్వర్డ్ ప్లేయర్‌గా కొనసాగుతుంది. భారత్ తరఫున జూనియర్ వరల్డ్‌కప్ స్థాయి నుంచి ఒలింపిక్స్ వరకు ప్రాతినిథం వహించిన ఆమె.. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్ సాధించడం ద్వారా తొలిసారి దేశవ్యాప్త గుర్తింపు దక్కించుకుంది. అయితే అదే ఒలింపిక్స్ వందనతో పాటు ఆమె కుటుంబానికి కూడా చేదు అనుభవాలను మిగిల్చింది. టోక్యో ఒలింపిక్స్ సెమీఫైనల్స్‌లో భారత్.. అర్జెంటీనా చేతిలో ఓడిపోవడంతో వందన, ఆమె కుటుంబం కులపరమైన దూషణలను ఎదుర్కొంది. ఒలింపిక్స్‌లో పాల్గొన్న జట్టులో వందన లాంటి చాలా మంది దళితులు ఉన్నందున సెమీస్‌లో భారత్ ఓడిందని కొందరు అగ్రవర్ణ పురుషులు ఆమె కుటుంబాన్ని దుర్భాషలాడారు. ఇలాంటి అవమానాలను తన 14 ఏళ్ల కెరీర్లో అనునిత్యం ఎదుర్కొన్న వందన.. మహిళల హాకీలో అత్యున్నత శిఖరాలను అధిరోహించి, విమర్శకుల నోళ్లు మూయించింది. 31 సంవత్సరాల వందన.. తన అక్కను చూసి హాకీ పట్ల ఆకర్శితురాలైంది. కనీసం బూట్లు కూడా కొనలేని స్థితి నుంచి నేడు దేశం గర్వించదగ్గ స్టార్‌గా ఎదిగింది. హాకీ స్టిక్ కొనే ఆర్ధిక స్థోమత లేకపోవడంతో ఆమె చెట్ల కొమ్మలతో సాధన చేసి ఈ స్థాయికి చేరింది. ఓ పక్క పేదరికంతో బాధపడుతూ.. మరోపక్క అవమానాలను దిగమింగుతూ సాగిన వందన ప్రస్తానం భారత దేశ మధ్యతరగతి అమ్మాయిలకు ఆదర్శంగా నిలుస్తుంది. -
Asia Cup 2023: పాక్‌పై టీమిండియా గెలుపు
ఆసియా కప్ 5s హాకీ టోర్నీలో టీమిండియా విజేతగా నిలిచింది. చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో ఇవాళ (సెప్టెంబర్ 2) జరిగిన ఫైనల్లో భారత్ 6-4 గోల్స్ తేడాతో గెలుపొందింది. నిర్ణీత సమయంలో భారత్, పాక్‌లు చెరి 4 గోల్స్ చేయడంతో పెనాల్టీ షూటౌట్స్ ద్వారా ఫలితం తేలింది. షూటౌట్స్‌లో భారత్ రెండు అటెంప్ట్స్‌ను గోల్స్‌గా మలిచి, ఛాంపియన్‌గా అవతరించింది. 5s ఫార్మాట్లో భారత్ పాక్‌ను ఓడించడం మూడు సందర్భాల్లో ఇదే మొదటిసారి. India beat Pakistan in Men's Hockey 5s Asia Cup Final. pic.twitter.com/VyKC6aG06S — Azhutozh ⚕ (@azhutozh) September 2, 2023 సెకెండాఫ్‌లో 2-4 గోల్స్ తేడాతో వెనుకంజలో ఉండిన భారత్.. అనూహ్యంగా పుంజుకుని, షూటౌట్స్ వరకు వెళ్లి విజేతగా నిలిచింది. షూటౌట్స్‌లో పాక్ రెండు ప్రయత్నాల్లో విఫలం కాగా.. గుర్జోత్ సింగ్, మణిందర్ సింగ్‌లు తలో గోల్ చేసి, భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. అంతకుముందు భారత్ 2-4 గోల్స్‌తో వెనుకపడి ఉన్నప్పుడు మొహమ్మద్ రహీల్ 2 గోల్స్ చేసి, మ్యాచ్ డ్రా అయ్యేందుకు దోహదపడ్డాడు. Maninder Singh scores the second goal in shoot-out as India clinches Hockey 5s Asia Cup title defeating Pakistan. Both teams were 4-4 tied in normal time before India won the shootout 2-0.#Hockey5sAsiaCup #HockeyIndia pic.twitter.com/SWncUcVxnn — Pritish Raj (@befikramusafir) September 2, 2023 -
ఇంగ్లండ్‌తో భారత్ మ్యాచ్ ‘డ్రా’
బార్సిలోనా: స్పెయిన్ హాకీ సమాఖ్య శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న నాలుగు దేశాల అంతర్జాతీయ హాకీ టోర్నీని భారత మహిళల జట్టు ‘డ్రా’తో ప్రారంభించింది. ఇంగ్లండ్ జట్టుతో బుధవారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌ను భారత్ 1–1తో ‘డ్రా’గా ముగించింది. ఇంగ్లండ్ తరఫున హోలీ హంట్ ఏడో నిమిషంలో గోల్ చేయగా... భారత జట్టుకు లాల్రెమ్సియామి 41వ నిమిషంలో గోల్ సాధించి స్కోరును సమం చేసింది. చివరి క్వార్టర్లో రెండు జట్లకు రెండు చొప్పున పెనాల్టీ కార్నర్లు లభించినా ఫలితం లేకపోయింది. మరోవైపు ఇదే టోర్నీలో పోటీపడుతున్న భారత పురుషుల జట్టు తొలి మ్యాచ్‌లో స్పెయిన్ జట్టు చేతిలో 1–2తో ఓడిపోగా... నెదర్లాండ్స్ జట్టుతో జరిగిన రెండో మ్యాచ్‌ను 1–1తో ‘డ్రా’ చేసుకుంది. -
'అమ్మా నన్ను మన్నించు'.. హాకీ దిగ్గజం ధనరాజ్ పిళ్లై
1998.. ముప్పైరెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత హాకీ జట్టు ఆసియా క్రీడల్లో స్వర్ణపతకాన్ని గెలుచుకుంది. 10 గోల్స్‌తో సత్తా చాటి కెప్టెన్ ధన్‌రాజ్ పిళ్లై జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. బ్యాంకాక్ నుంచి ఢిల్లీ వచ్చిన టీమ్‌కి అనూహ్య పరిస్థితి ఎదురైంది. ఘనాతిఘనమైన స్వాగతం సంగతి దేవుడెరుగు.. దేశంలో ఆటను నడిపించే భారత హాకీ సమాఖ్య (ఐహెచ్ఎఫ్)కు చెందిన అధికారులైనా కనీసం విమానాశ్రయానికి వచ్చి తమ ఆటగాళ్లను కలవలేదు. అన్నింటికి మించి ఎటువంటి కనీస ఏర్పాట్లూ చేయకపోవడంతో ఆటగాళ్లకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ రాత్రంతా భారత ఆటగాళ్లు ఎయిర్‌పోర్ట్‌లో నేలపై పడుకోవాల్సి వచ్చింది. దాంతో ధన్‌రాజ్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఐహెచ్ఎఫ్ మొత్తాన్ని తిట్టిపడేసి తన కోపాన్ని ప్రదర్శించాడు. ఆ తర్వాతి ఫలితం ఊహించిందే. అప్పట్లో కంటిచూపుతో ఐహెచ్ఎఫ్ని శాసిస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి కేపీఎస్ గిల్.. తర్వాతి సిరీస్‌కి ఎంపిక చేయకుండా పిళ్ళైపై చర్య తీసుకొని తన బలాన్ని చూపించాడు. మళ్లీ టీమ్‌లోకి వచ్చేందుకు ధన్‌రాజ్ తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అయితే ఇదంతా ఊహించిందే. ‘తప్పు నాది కానప్పుడు దేనికైనా తెగిస్తాను.. న్యాయం కోసం పోరాడేందుకు సిద్ధం’ అనే లక్షణం ధన్‌రాజ్‌లో ఎప్పటినుంచో ఉంది. అద్భుతమైన ఆటగాడిగా మాత్రమే కాకుండా అవసరమైతే వ్యవస్థను ప్రశ్నించేందుకూ సిద్ధపడే తత్వమే ధన్‌రాజ్‌ని ప్రత్యేకంగా నిలబెట్టింది. భారత హాకీ దిగ్గజాలలో ఒకడిగా తనకంటూ విశిష్ట గుర్తింపు తెచ్చుకున్న ఘనత ధన్‌రాజ్‌ది! ధ్యాన్‌చంద్, బల్బీర్ సింగ్, మొహమ్మద్ షాహిద్ వంటి దిగ్గజాల తర్వాతి తరంలో తన దూకుడైన ఆటతో ధన్‌రాజ్ పిళ్లై భారత హాకీలో ప్రత్యేకంగా నిలిచాడు. 90వ దశకంలో వేర్వేరు కారణాలతో కునారిల్లిన భారత హాకీ సాధించిన కొన్ని చెప్పుకోదగ్గ ఫలితాల్లో తన ఆటతో అతను శిఖరాన నిలిచాడు. హాకీ స్టిక్‌తో మైదానంలో ధన్‌రాజ్ చూపించిన మ్యాజిక్ క్షణాలెన్నో. టర్ఫ్‌పై వేగంగా దూసుకుపోవడం, ప్రత్యర్థి డిఫెండర్లను దాటి సహచరులకు పర్ఫెక్ట్ పాస్‌లు అందించడం, అతని డ్రిబ్లింగ్, రివర్స్ హిట్లు, ఫార్వర్డ్‌గా కొట్టిన గోల్స్ మాత్రమే కాదు.. ప్రత్యర్థి పెనాల్టీలను విఫలం చేయడంలో డిఫెండర్‌గా కూడా ధన్‌రాజ్ ఆట అత్యుత్తమంగా సాగింది. ఆటలో ప్రతిభ మాత్రమే కాదు.. స్టిక్ చేతిలో ఉంటే అతనికి పూనకం వచ్చేస్తుంది. ఒక రకమైన కసి, ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదల అతని ఆవేశానికి మరింత బలాన్నిస్తాయి. దశాబ్దంన్నర అంతర్జాతీయ కెరీర్లో ధన్‌రాజ్ భారత హాకీకి పోస్టర్ బాయ్‌గా నిలిచాడు. భారత్ తరఫున 339 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అతను 170 గోల్స్ సాధించడమే కాదు, మరెన్నో వందల గోల్స్‌లో తన వంతు పాత్రను పోషించాడు. ఆటపై మమకారంతో.. పుణే శివారులోని ఖడ్కి.. ధన్‌రాజ్ స్వస్థలం. అతని తండ్రి ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీలో లేబర్‌గా పని చేస్తుండేవాడు. ఆర్మీ అధికారుల ప్రాబల్యం ఉండే ఆ కంటోన్మెంట్ ఏరియాలో చాలామంది ఏదో ఒక ఆడుతూ కనిపించేవారు. క్రీడలపై అమితాసక్తి ఉన్న తండ్రి తన నలుగురు కొడుకులను కూడా ప్రోత్సహించాడు. వారిలో చిన్నవాడు ధన్‌రాజ్‌ని హాకీ ఆకర్షించింది. అక్కడ ఉండే మట్టిలో, పేడతో అలికిన టర్ఫ్‌పై విరిగిన పాత స్టిక్‌లతో హాకీ ఆడుతూ ఉండే ధన్‌రాజ్‌కి ఆ ఆటపై మరింత ఆసక్తి పెరిగింది. ఒకనాటి భారత దిగ్గజం మొహమ్మద్ షాహిద్‌ని అతను విపరీతంగా అభిమానించేవాడు. అతని శైలిలోనే ఆడి చూపించేవాడు. చివరకు అది పూర్తిస్థాయి ప్రొఫెషనల్‌గా మారే వరకు చేరింది. అధికారికంగా ఆ సమయంలో హాకీలో వేర్వేరు వయో విభాగాల్లో పోటీలు లేకపోయినా.. అందరికీ ధన్‌రాజ్‌లో ఏదో ప్రత్యేకత కనిపించింది. అదే మలుపు.. ధన్‌రాజ్‌లో ప్రతిభను పూర్తిగా వాడుకొని సరైన దారిలో నడిపించాలని అన్నయ్య రమేశ్ భావించాడు. తాను అప్పటికే ముంబైలో హాకీ ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తమ్ముడిని తన వద్దకు తెచ్చుకొని సరైన రీతిలో దిశానిర్దేశం చేశాడు. అక్కడే ప్రముఖ కోచ్ జోకిమ్ కార్వాలోను కలవడం పిళ్లై జీవితాన్ని మార్చేసింది. ఈ కుర్రాడిలో ప్రత్యేక ప్రతిభ ఉందని గుర్తించిన ఆయన శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఆటను తీర్చిదిద్దడం మాత్రమే కాకుండా అప్పట్లో యువ ఆటగాళ్లకు అండగా నిలుస్తున్న మహీంద్ర అండ్ మహీంద్ర క్లబ్లో తన సిఫారసుతో ప్రవేశం ఇప్పించి ఆ జట్టు తరఫున ఆడే అవకాశం కల్పించాడు. దాంతో ధన్‌రాజ్ హాకీలో మరింత దూసుకుపోయాడు. చివరకు భారత జట్టులో స్థానం సంపాదించే వరకు అతను ఆగలేదు. 1989లో తొలిసారి దేశం తరఫున ఆడే అవకాశం దక్కించుకున్న ధన్‌రాజ్ 2004 వరకు జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. సాధించిన ఘనతలెన్నో.. 15 ఏళ్ల పాటు ధన్‌రాజ్ భారత హాకీలో అంతర్భాగంగా ఉన్నాడు. మన జట్టు సాధించిన ఎన్నో గుర్తుంచుకోదగ్గ విజయాల్లో అతను ప్రధాన పాత్ర పోషించాడు. ఆసియా కప్‌లో ఒకసారి విజేతగా నిలవడంతో పాటు మరో 2 రజతాలు, ఒక కాంస్యం గెలుచుకున్న జట్టులో.. ఆసియా క్రీడల్లో స్వర్ణం, 3 రజతాలు సాధించిన టీమ్‌లలో సభ్యుడైన అతను 2001లో చాంపియన్స్ చాలెంజ్ టోర్నీని గెలుచుకున్న జట్టులో కూడా ఉన్నాడు. హాకీలో 3 మెగా ఈవెంట్లలో కనీసం నాలుగు సార్లు పాల్గొన్న ఏకైక ఆటగాడు ధన్‌రాజ్ కావడం విశేషం. నాలుగు ఒలింపిక్స్‌లలో, నాలుగు చాంపియన్స్ ట్రోఫీలలో, నాలుగు వరల్డ్ కప్‌లలో అతను భాగమయ్యాడు. వ్యక్తిగత ప్రదర్శనకు సంబంధించి చాంపియన్స్ ట్రోఫీలో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా నిలిచిన క్షణం ధన్‌రాజ్‌ని అందరికంటే అగ్రభాగాన నిలబెట్టింది. ఈ ఘనత సాధించిన తొలి భారత ఆటగాడు అతనే. 1994 ప్రపంచకప్‌లో అత్యుత్తమ ఆటగాళ్లతో కూడిన వరల్డ్ ఎలెవన్‌ని ఎంపిక చేసినప్పుడూ ధన్‌రాజ్‌కి చోటు దక్కింది. క్లబ్లలోనూ మేటి.. ఒకప్పుడు మట్టి మైదానాల్లో సత్తా చాటిన భారత హాకీ తర్వాతి రోజుల్లో ఆస్ట్రోటర్ఫ్ దెబ్బకు చతికిలపడింది. సంప్రదాయ శైలికి పూర్తి భిన్నమైన యూరోపియన్ శైలి ప్రపంచ హాకీలోకి ప్రవేశించడంతో మన జట్టు ప్రమాణాలు బాగా పడిపోయాయి. యూరోపియన్ల ఫిట్నెస్తో పోలిస్తే భారత ఆటగాళ్లు ఆ స్థాయిని అందుకోలేని పరిస్థితి. ముఖ్యంగా 90వ దశకంలో మన జట్టు పరాజయాలకు ఇదీ ఒక కారణం. అలాంటి సమయంలోనే ధన్‌రాజ్ తాను కొత్తగా మారేందుకు సిద్ధమయ్యాడు. జట్టులో అత్యుత్తమ ఫిట్నెస్ ఉన్న ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న అతను తన ఆటనూ మార్చుకుంటే అది భారత జట్టుకు మేలు చేస్తుందని భావించాడు. అందుకే యూరోపియన్ క్లబ్‌లలో అవకాశాల కోసం ప్రయత్నించాడు. ధన్‌రాజ్ స్థాయి ప్లేయర్ గురించి అందరికీ బాగా తెలుసు కాబట్టి ప్రతిజట్టూ అతడిని కోరుకుంది. అందుకే పెద్ద ఎత్తున అతడికి చాన్స్ దక్కింది. స్టట్గార్డ్ కికర్స్ (జర్మనీ), హెచ్‌సీ లయన్ (ఫ్రాన్స్), ఇండియన్ జింఖానా (లండన్) క్లబ్‌లకు అతను ప్రాతినిధ్యం వహించాడు. వివాదాలతో సహవాసం చేస్తూనే.. ఆటగాడిగా గొప్ప స్థాయికి చేరినా అతని మాటతో, దూకుడుతో ధన్‌రాజ్ చాలా మంది దృష్టిలో రెబల్‌గా మారాడు. అయితే తన తిక్కకూ లెక్క ఉంటుందని అతను పలు సందర్భాల్లో చెప్పుకున్నాడు. విమానాశ్రయ ఘటనలోనే కాకుండా ఆటగాళ్లకు కనీస ఫీజులు కూడా ఇవ్వడం లేదని పలుమార్లు ఫెడరేషన్తో గొడవలు, అంతర్జాతీయ ఆటగాళ్లకు కూడా నాసిరకం ఆహారం ఇస్తున్నారంటూ స్పోర్ట్స్ అథారిటీ కేంద్రలో కుక్‌పై దాడి, మ్యాచ్ జరిగినంతసేపూ భారత్‌ని అవమానించాడంటూ స్టాండ్స్‌లోకి వెళ్లి మరీ ప్రేక్షకుడిని కొట్టిన తీరు అతని ఆవేశాగ్రహాలను చూపించాయి. అయితే అతను ఏనాడూ ఇలాంటి వాటి వల్ల తన స్థానానికి ముప్పు వస్తుందని భయపడలేదు. ఆసియా గేమ్స్ పతకం తర్వాత ఫెడరేషన్తో గొడవతో కోల్పోయిన స్థానాన్ని ఆరునెలల్లో మళ్లీ దక్కించుకున్నాడు. ‘నాకు తెలుసు.. నా ఆటపై నాకు నమ్మకముంది. మరొకరు నా స్థానాన్ని భర్తీ చేయలేరు’ అని చెప్పడం అతని ఆత్మవిశ్వాసాన్ని చూపించింది. నిజంగానే మైదానం బయట ఘటనలు అతని స్థాయిని తగ్గించలేదు. పద్మశ్రీ పురస్కారం అందుకున్న ధన్‌రాజ్.. ఖేల్‌రత్న అవార్డు స్వీకరించిన తొలి హాకీ క్రీడాకారుడు. అది మాత్రం దక్కలేదు.. హాకీ ఆటగాడిగా ఎన్నో సాధించినా.. ఒలింపిక్స్ పతకం మాత్రం ధన్‌రాజ్‌కి కలగానే మిగిలిపోయింది. ఏకంగా నాలుగు ఒలింపిక్స్‌లలో పాల్గొన్నా ఆ అదృష్టం లభించలేదు. 1992 బార్సిలోనా, 1996 అట్లాంటా, 2000 సిడ్నీ, 2004 ఏథెన్స్‌లలో పిళ్లై భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. దురదృష్టవశాత్తూ ఆ సమయంలో జట్టు మొత్తం పేలవ ప్రదర్శనే కనబర్చింది. పతకం కాదుకదా కనీసం చేరువగా కూడా రాలేక వరుసగా 7, 8, 7, 7 స్థానాలకే పరిమితమైంది. ముఖ్యంగా సిడ్నీ ఒలింపిక్స్ సమయంలో జట్టుపై కాస్త ఆశలు ఉండేవి. అందుకే ఈసారి ఎలాగైనా పతకంతో తిరిగొస్తాం అని ధన్‌రాజ్ అందరికీ చెప్పాడు. పోలండ్‌తో చివరి లీగ్ మ్యాచ్ గెలిస్తే భారత్ సెమీస్ చేరుతుంది. ఆఖరి వరకు ఆధిక్యంలో ఉండి గెలిచే అవకాశం ఉన్న స్థితిలో అనూహ్యంగా గోల్ ఇవ్వడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. దాంతో తర్వాతి నాలుగు రోజుల పాటు ధన్‌రాజ్.. తన గేమ్స్ విలేజ్ గదిలోనే ఉంటూ రోధించాడు. తనతో మాట్లాడేందుకు తల్లి ఫోన్లో ఎంత ప్రయత్నించినా స్పందించలేదు. మాట తప్పినందుకు మన్నించమని తల్లికి చెప్పమంటూ తన సహచరులకు సూచించాడు. దీనిని దృష్టిలో ఉంచుకునే అతని జీవిత విశేషాలతో కూడిన బయోగ్రఫీకి ఫర్గివ్ మి అమ్మా అని పేరు పెట్టారు. -
సెమీస్‌లో భారత్.. థాయ్‌లాండ్‌పై 17–0తో ఘన విజయం
సలాలా (ఒమన్): ఆసియా కప్ జూనియర్ పురుషుల హాకీ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. థాయ్‌లాండ్ జట్టుతో ఆదివారం జరిగిన పూల్ ‘ఎ’ చివరి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 17–0 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున అంగద్‌బీర్ సింగ్ (13వ, 33వ, 47వ ని.లో) మూడు గోల్స్ చేయగా... అమన్‌దీప్ లాక్రా (26వ, 29వ ని.లో), ఉత్తమ్ సింగ్ (24వ, 31వ ని.లో) రెండు గోల్స్ చొప్పున సాధించారు. శ్రద్ధానంద్ తివారి (46వ ని.లో), యోగంబర్ రావత్ (17వ ని.లో), అమన్‌దీప్ (47వ ని.లో), రోహిత్ (49వ ని.లో), అరైజీత్ సింగ్ హుండల్ (36వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. ఐదు జట్లున్న పూల్ ‘ఎ’లో భారత్ మూడు విజయాలు, ఒక ‘డ్రా’తో 10 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. పూల్ ‘ఎ’లో నేడు జపాన్, పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ విజేతకు మరో సెమీఫైనల్ బెర్త్ దక్కుతుంది. మ్యాచ్ ‘డ్రా’ అయితే పాకిస్తాన్ ముందంజ వేస్తుంది. -
భారత హాకీకి సంబంధించి ఒడిశా ప్రభుత్వం చారిత్రక నిర్ణయం
భువనేశ్వర్: భారత సీనియర్, జూనియర్ పురుషుల, మహిళల హాకీ జట్లకు మరో పదేళ్లపాటు (2033 వరకు) స్పాన్సర్ షిప్ చేస్తామని ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2018 నుంచి ఒడిశా జాతీయ హాకీ జట్లకు స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. 2018, 2023లలో పురుషుల ప్రపంచకప్ టోర్నీలకు ఒడిశా ఆతిథ్యమిచ్చింది. -
ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకున్న హార్ధిక్
భారత హాకీ సమాఖ్య (హెచ్ఐ) 2022 సంవత్సరానికిగాను భారత జట్టుకు సంబంధించి వార్షిక అవార్డులను ప్రకటించింది. పురుషుల విభాగంలో మిడ్‌ఫీల్డర్ హార్దిక్ సింగ్, మహిళల విభాగంలో సవితా పూనియా హాకీ ఇండియా ఉత్తమ ఆటగాళ్లుగా నిలిచారు. ఒడిషాలో జరిగిన హాకీ ప్రపంచకప్‌లో హార్దిక్ అద్భుత ఆటతీరు కనబర్చాడు. ఎఫ్ఐహెచ్ ఉమెన్స్ నేషనల్ కప్ టైటిల్ గెలిపించి ప్రొ లీగ్‌కు భారత జట్టు అర్హత సాధించడంలో కీపర్‌గా, కెప్టెన్‌గా సవిత కీలక పాత్ర పోషించింది. ఇద్దరికీ హాకీ ఇండియా తరఫున రూ. 25 లక్షల చొప్పున నగదు పురస్కారం లభించింది. శుక్రవారం జరిగిన కార్యక్రమంలో వీటిని అందజేశారు. దీంతో పాటు 2021కు సంబంధించిన అవార్డులను కూడా ప్రకటించగా హర్మన్‌ప్రీత్, సవితా పూనియా అత్యుత్తమ ఆటగాళ్లుగా అవార్డులు అందుకున్నారు. 2022లో సుల్తాన్ జొహర్ కప్ గెలిచిన భారత జూనియర్ జట్టును కూడా ఈ సందర్భంగా సత్కరించారు. -
వరల్డ్‌కప్ గెలిస్తే ఒక్కొక్కరికి రూ. 1 కోటి..!
భువనేశ్వర్: భారత హాకీ జట్టుకు ఇప్పటికే ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న ఒడిషా ప్రభుత్వం ఆటగాళ్లను ఉత్సాహపరిచే మరో ప్రకటన చేసింది. స్వదేశంలో జరిగే ప్రపంచ కప్‌ను భారత్ గెలుచుకుంటే ఒక్కో ఆటగాడికి రూ. 1 కోటి చొప్పున కానుకగా అందజేస్తామని ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించారు. ఈ నెల 13నుంచి 29 వరకు ఒడిషాలోని రెండు నగరాల్లో హాకీ ప్రపంచకప్ జరుగుతుంది. గురువారం రూర్కెలాలో జరిగిన కార్యక్రమంలో భారత్‌లోనే అతి పెద్దదైన బిర్సా ముండా ఇంటర్నేషనల్ హాకీ స్టేడియాన్ని పట్నాయక్ ప్రారంభించారు. దీంతో పాటు భువనేశ్వర్ (కళింగ స్టేడియం) కూడా వరల్డ్ కప్ మ్యాచ్‌లకు వేదిక కానుంది. ఈ నేపథ్యంలో ‘ఒడిషా రే’ పుస్తకాన్ని కూడా ఆవిష్కరించిన అనంతరం భారత ఆటగాళ్లతో ముఖ్యమంత్రి ముచ్చటించారు. తమ రాష్ట్రానికి హాకీతో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్న పట్నాయక్...ఆటగాళ్లకు ‘బెస్ట్ విషెస్’ చెప్పారు. ఈ మెగా టోర్నీలో మొత్తం 16 జట్లు పాల్గొంటున్నాయి. -
‘రాణి’ లేని జట్టుతో ప్రపంచకప్‌కు..
న్యూఢిల్లీ: మాజీ కెప్టెన్, స్టార్ స్ట్రయికర్ రాణి రాంపాల్ ఫిట్నెస్ సమస్యలతో ప్రపంచకప్ ఆడే జట్టుకు దూరమైంది. సీనియర్ గోల్ కీపర్ సవిత సారథ్యంలోని మహిళల భారత హాకీ జట్టును హాకీ ఇండియా (హెచ్ఐ) సెలక్టర్లు మంగళవారం ప్రకటించారు. తొడ కండరాల గాయం నుంచి రాణి పూర్తిగా కోలుకోలేదు. దీంతో ఆమెను ఎంపిక చేయలేదని హెచ్ఐ వర్గాలు వెల్లడించాయి. గతేడాది టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌ను తొలిసారి నాలుగో స్థానంలో నిలిపిన ఘనత రాణిది. ఆ తర్వాత గాయం కారణంగా ఆమె ఏ టోర్నీ ఆడలేదు. ఇటీవలే ప్రొ లీగ్ మ్యాచ్‌లకు ఎంపిక చేసినా... పూర్తి ఫిట్నెస్ లేక తొలి నాలుగు మ్యాచ్‌ల్లో ఆడలేకపోయింది. దీంతో భారత ప్రపంచకప్ జట్టు నుంచి తప్పించారు. నెదర్లాండ్స్, స్పెయిన్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న మహిళల ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్ వచ్చే నెల 1 నుంచి 17 వరకు జరుగుతుంది. భారత జట్టు: సవిత (కెప్టెన్, గోల్‌కీపర్), దీప్ గ్రేస్ ఎక్కా (వైస్ కెప్టెన్), బిచూ దేవి, గుర్జీత్ కౌర్, నిక్కీ ప్రధాన్, ఉదిత, నిషా, సుశీల చాను, మోనిక, నేహా, జ్యోతి, నవ్‌జ్యోత్ కౌర్, సోనిక, సలిమా టేటే, వందన కటారియా, లాల్రెమ్సియామి, నవ్‌నీత్ కౌర్, షర్మిలా దేవి.