సాక్షి, వెబ్‌డెస్క్: ‘హాకీ’.. చెప్పుకోవడానికే మన జాతీయ క్రీడ. కానీ ఈ కాలం వారికి దాని గురించి పెద్దగా తెలియదనేది నమ్మకతప్పాల్సిన వాస్తవం. మన దగ్గర ఆటలంటే చాలు టక్కున గుర్తుకు వచ్చేది క్రికెట్. గతమెంతో ఘనమన్నట్లు ఒకప్పుడు ఒలింపిక్స్‌లో 8 గోల్డ్ మెడల్స్ గెలిచిన చరిత్ర ఉన్నప్పటికి మన జాతీయ క్రీడకు దక్కాల్సినంత ప్రాధాన్యత దక్కలేదనేది వాస్తవం. కారణాలు ఏవైనా కావచ్చు.. కానీ గత 40 ఏళ్లుగా హాకీ తన ప్రభావం కోల్పోతూ వస్తోంది. ఎంతలా అంటే 2008 బీజింగ్ ఒలింపిక్స్‌కు కనీసం అర్హత సాధించలేక చతికిలపడింది. దాంతో మన దేశంలో హాకీ కథ ముగిసిందనే చాలా మంది భావించారు. అలాంటి పరిస్థితులను తట్టుకుని.. నిలబడి ఇప్పుడు మళ్లీ అదే ఒలింపిక్స్‌లో మెడల్ గెలిచే స్థాయికి చేరింది. ఇక ఈ విజయంలో ఫీల్డ్‌లో పోరాడిన ఆటగాళ్ల కృషి ఎంత ఉందో.. అంతకంటే పెద్ద పాత్రే పోషించారు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. వాస్తవంగా చెప్పాలంటే ఈ రోజు భారత హాకీ టీం సాధించిన పతకం ఆయన చలవే. ఆ వివరాలు తెలియాలంటే ఇది చదవండి..
భారత్ హాకీలో చివరిసారిగా 1980 ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించింది. ఆ తర్వాత మరో పతకం రావడానికి దాదాపు 41 ఏళ్ల సమయం పట్టింది. ఇందుకు కారణాలు అనేకం.. 1980 తర్వాత దేశంలో క్రీడలకు కమర్షియల్ రంగులు అద్దుకుంటున్న టైం అది. అప్పుడే ఆటల్లో ‘రాజకీయాలు’ ఎక్కువయ్యాయి. హాకీలో టాలెంట్‌కు సరైన గుర్తింపు దక్కకపోగా.. రిఫరెన్స్‌లు, రికమండేషన్లతో సత్తువలేని ఆటగాళ్ల ఎంట్రీ జట్టును నిర్వీర్యం చేస్తూ వచ్చింది. దీనికి తోడు ఆటగాళ్ల మధ్య గొడవలు ఒక సమస్యగా మారితే.. ‘కోచ్’ ఓ ప్రధాన సమస్యగా మారింది. తరచూ కోచ్‌లు మారుతుండడం, భారత హాకీ ఫెడరేషన్‌లో నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతుండడం, స్పానర్‌షిప్-ఎండోర్స్‌మెంట్ వివాదాలు వెంటాడాయి. వీటికితోడు క్రికెట్‌కు పెరిగిన ఆదరణతో హాకీ ఉత్త జాతీయ క్రీడగా మారిపోయింది. ప్రోత్సాహకాల్లో మిగిలిన ఆటలకు తగ్గిన ప్రాధాన్యం(హాకీ అందులో ఒకటి)తో ప్రభుత్వాలు చిన్నచూపు చూశాయి.
ఆదుకున్న నవీన్ పట్నాయక్..
ఇదే సమయంలో పుండు మీద కారం చల్లినట్లు అన్నాళ్లు ఇండియన్ హాకీ టీమ్‌కు స్పాన్స్‌రగా కొనసాగుతున్న సహారా 2018లో టీమ్ స్పాన్సర్‌షిప్ నుంచి తప్పుకుంది. హాకీని స్పాన్సర్‌ని చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఇలాంటి సమయంలో ఒడిశాలోని నవీన్ పట్నాయక్ ప్రభుత్వం హాకీ ఇండియాను ఆదుకుంది. ఐదేళ్లకుగాను హాకీని స్పాన్సర్ చేయడానికి పట్నాయక్ ప్రభుత్వం రూ.100 కోట్లతో హాకీ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది. పట్నాయక్ నాడు చూపిన చొరవే.. నేడు టోక్యో ఒలిపిక్స్‌లో పతకానికి కారణమయ్యింది.
హాకీపై మక్కువతో..
నవీన్ పట్నాయక్ భారత హాకీ టీమ్‌ను స్పాన్సర్ చేయడానికి కారణం.. గతంలో ఆయన కూడా హాకీ ప్లేయరే కావడం. ఆయన డూన్ స్కూల్‌లో చదువుతున్న సమయంలో హాకీ గోల్‌కీపర్‌గా ఉన్నారు. అందుకే ఆ ఆటపై ఉన్న ఇష్టంతోనే టీమ్‌కు స్పాన్సర్‌గా ఉండటానికి ఆయన ముందుకు వచ్చారు. పురుషుల జట్టుతోపాటు మహిళలూ జట్టుకూ ఐదేళ్ల పాటు స్పాన్సర్‌గా ఉండటానికి ఒప్పందం కుదుర్చుకుంది ఒడిశా ప్రభుత్వం. ఇది జరిగిన మూడేళ్లకు ఇప్పుడు ఇండియన్ మెన్స్ హాకీ టీమ్ ఒలింపిక్స్ మెడల్ గెలిచింది. మహిళల టీమ్ కూడా మెడల్‌కు అడుగు దూరంలో ఉంది.
ఒడిశాలో 2014 నుంచి హాకీ హవా..
2014లో ఒడిశా ప్రభుత్వం చాంపియన్స్ ట్రోఫీ హాకీకి ఆతిథ్యమిచ్చింది. అప్పుడే ఒడిశా స్పాన్సర్‌షిప్‌కు బీజం పడింది. ఆ టోర్నీపై నవీన్ పట్నాయక్ ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఆ తర్వాత 2017లో ఒడిశా ప్రభుత్వం స్పాన్సర్‌గా ఉన్న కళింగ లాన్సర్స్ టీమ్ హాకీ ఇండియా లీగ్‌ను గెలిచింది. ఇక 2018లో హాకీ వరల్డ్ లీగ్‌ను కూడా ఒడిశా నిర్వహించింది. ఆ తర్వాత 2019లో ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ మెన్స్ సిరీస్ ఫైనల్స్, ఒలింపిక్ హాకీ క్వాలిఫయర్స్.. 2020లో ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ కూడా ఒడిశాలో జరిగాయి. ఇలా ఇండియన్ హాకీ టీం వేసే ప్రతి అడుగులోనూ నవీన్ పట్నాయక్ ప్రత్యేక శ్రద్ధ, కృషి ఉన్నాయి.
ఒడిశా గతంలో కొందరు గొప్ప హాకీ ఆటగాళ్లను తయారు చేసింది. పురుషులు, మహిళల జట్లలో ఒడిశాకు చెందిన పలువురు క్రీడాకారులున్నారు. వీరిలో వైస్ కెప్టెన్లు - బీరేంద్ర లక్రా, దీప్ గ్రేస్ ఎక్కా వంటి వారు ఒడిశాకు చెందినవారే. నవీన్ పట్నాయక్ ప్రభుత్వం 2023 వరకు హాకీ ఇండియాకు స్పాన్సర్‌గా ఉంది. అదే ఏడాది భారతదేశం ఎఫ్‌ఐహెచ్ పురుషుల హాకీ ప్రపంచ కప్‌కు ఆతిథ్యమివ్వనుంది.
ఈ ఒలింపిక్స్‌లో ఇండియన్ హాకీ టీమ్ ఆడిన పలు మ్యాచ్‌లను నవీన్ పట్నాయక్ చూశారు. ఇప్పుడు కాంస్య పతకం గెలిచిన తర్వాత కూడా టోక్యోలో ఉన్న టీమ్‌తో వీడియో కాల్‌లో మాట్లాడి శుభాకాంక్షలు చెప్పారు. ఈ విజయం ప్రతి భారతీయుడికీ గర్వకారణమన్నారు నవీన్ పట్నాయక్.
Comments
Please login to add a commentAdd a comment