sponsorship
-
ఖో-ఖోకు పెరుగుతున్న స్పాన్సర్షిప్
భారతీయ క్రీడగా పేరొందిన ఖో-ఖోకు స్పాన్సర్షిప్ పెరుగుతోంది. ఈ ఆటను మరింత మందికి చేరువ చేసేందుకు కార్పొరేట్ కంపెనీలు తమ సహకారం అందిస్తున్నాయి. అంతర్జాతీయ గుర్తింపు లభించే దిశగా ఖో-ఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (కేకేఎఫ్ఐ) పని చేస్తోంది. 2000 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఖో-ఖోను చాలాకాలంగా దక్షిణ ఆసియాలో ఎక్కువగా ఆడుతున్నారు. అయితే క్రికెట్ అంతటి ప్రజాదరణ పొందడంలో మాత్రం వెనకబడింది. ఈ పరిస్థితిని మార్చి ఖోఖోను ప్రపంచ వేదికలపై నిలబెట్టే ప్రయత్నాన్ని కేకేఎఫ్ఐ చేస్తోంది. ఇందులో భాగంగా ఈ సంస్థ మరిన్ని స్పాన్సర్షిప్లకు కోసం చూస్తోంది.ఖో-ఖో ప్రపంచకప్కేకేఎఫ్ఐ ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన ఖో-ఖో ప్రపంచకప్‌ను ఆవిష్కరించింది. జనవరి 13 నుంచి 19 వరకు దీన్ని నిర్వహించనున్నారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో 23 దేశాలకు చెందిన జట్లు పోటీపడ్డాయి. ఏరియల్ డ్యాన్సర్లతో సహా ప్రసిద్ధ కళాకారుల ప్రదర్శనలు, స్టార్ పెర్ఫార్మర్ షిమాక్ దావర్ కొరియోగ్రఫీతో ఈ టోర్నమెంట్ ప్రారంభ వేడుకలు నిర్వహించారు.స్పాన్సర్ షిప్లుఖో-ఖోను ఆధునీకరించడంలో భాగంగా కేకేఎఫ్ఐ క్రీడా ప్రాంగణాల్లో మార్పులు చేస్తోంది. గతంలో ఇది మట్టి కోర్టుల్లో జరిగేది. దాన్ని ఇండోర్ మ్యాట్లపై జరిగేలా చేసింది. ఇది ఆటగాళ్లకు, ప్రేక్షకులకు అనుకూలంగా మారింది. ఈ వాతావరణం స్పాన్సర్ షిప్‌లను కూడా ఆకర్షించింది. ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న ఖో-ఖో ప్రపంచకప్‌నకు ఈజ్ మై ట్రిప్, జీఎంఆర్ ఏరో, జొమాటో, బ్లాక్ బెర్రీస్, టాటా వంటి బ్రాండ్లు మద్దతు ఇస్తున్నాయి. డిస్నీ+ హాట్‌స్టార్, స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్, డీడీ స్పోర్ట్స్ వంటి ప్రధాన నెట్‌వర్క్‌ల్లో ఈ టోర్నమెంట్ ప్రసారం అవుతోంది. ఈ టోర్నమెంట్లకు 200 మిలియన్లకు పైగా వ్యూయర్షిప్ ఉంటుందని అంచనా.ఇదీ చదవండి: క్రెడిట్ కార్డు పోయిందా? బ్లాక్ చేయండిలా..అల్టిమేట్ ఖో-ఖో (యూకేకే) లీగ్క్రికెట్లో ఐపీఎల్, కబడ్డీలో ప్రో కబడ్డీ లీగ్ ఎలాగో ఖో-ఖోలోనూ అల్టిమేట్ ఖో-ఖో (యూకేకే) లీగ్‌ను 2022లో ప్రారంభించారు. ఇందులోనూ ఫ్రాంచైజీలుంటాయి. ప్రో కబడ్డీ లీగ్, ఇండియన్ సూపర్ లీగ్ తరువాత దేశంలో అత్యధికంగా వీక్షించిన క్రికెటేతర క్రీడా టోర్నమెంట్‌గా యూకేకే ప్రజాదరణ పొందింది. లీగ్ మొదటి సీజన్లో 64 మిలియన్ల వ్యూయర్ షిప్ సొంతం చేసుకుంది. -
వైద్య సదస్సులను కమ్మేస్తున్న ‘ఫార్మా’
తెనాలి: వైద్య రంగంలో నూతనంగా వచ్చిన ఆవిష్కరణలు, కొత్త ఔషధాలు, రోగనిర్ధారణలో నవీన విధానాలపై అవగాహన కోసం నిర్వహిస్తున్న సదస్సులు గతి తప్పుతున్నాయి. ఫార్మా కంపెనీల “స్పాన్సర్షిప్’లతో వైద్య సదస్సులు వివాదాలకు కేరాఫ్‌గా నిలుస్తున్నాయి. విలాసవంతమైన ఆఫర్లతో వైద్యులను ఆకట్టుకునేందుకు ఆయా కంపెనీలు చేస్తున్న ప్రయత్నాలు.. చివరకు రోగుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. విలాసవంతంగా.. వైద్యులపై వలవైద్యుల సదస్సుల నిర్వహణలో ఫార్మ కంపెనీలు భాగం కాకూడదని నేషనల్ మెడికల్ కౌన్సిల్ నిబంధన ఉంది. అలాగే వైద్యులు, వారి అసోసియేష¯న్లతో ఎటువంటి లావాదేవీలు జరపకూడదని స్పష్టం చేసింది. కానీ ఈ నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు. సదస్సులకు వైద్యులు హాజరయ్యేందుకు అవసరమైన విమాన టికెట్ల నుంచీ ఆయా ప్రాంతాల్లో తిరిగేందుకు లగ్జరీ కార్లు, బస చేసేందుకు విలాసవంతమైన హోటళ్లు తదితర సకల సదుపాయాలన్నీ ఫార్మా కంపెనీలే స్పాన్సర్ చేస్తున్నాయి. వైద్య సదస్సు జరిగే ప్రాంగణమంతటినీ తమ బ్రాండ్లు కనపడేలా పోస్టర్లు, ఫ్లెక్సీలు, కటౌట్లతో నింపేస్తున్నాయి. తమ స్టాల్‌కు విచ్చేసినందుకు ఖరీదైన బహుమతులు, వివిధ ఎంటర్టైన్మెంట్ ఈవెంట్లతో వైద్యులను తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో గుంటూరులో కొద్ది నెలల కిందట జరిగిన వైద్యుల సదస్సులో ఫార్మా కంపెనీ ప్రతినిధి ఒకరు వైద్యురాలిపై అనుచితంగా ప్రవర్తించటంతో అతడికి దేహశుద్ధి చేశారు. చెన్నైలో కొద్దిరోజుల కిందట జరిగిన మరో సదస్సు అశ్లీల నృత్యాలకు వేదికైంది. విజ్ఞానం పెంచాల్సిన వైద్య సదస్సులను ఇలా వివాదాలకు కేంద్ర బిందువుగా చేస్తున్నాయి.‘క్రెడిట్ అవర్స్’పైనా ఫార్మా కంపెనీలదే పెత్తనంవైద్యవిజ్ఞాన సదస్సులకు హాజరయ్యే వైద్యులకు మెడికల్ కౌన్సిల్.. క్రెడిట్ అవర్స్‌ను కేటాయిస్తుంది. ప్రతి వైద్యుడు వివిధ సదస్సుల్లో పాల్గొని సంవత్సరానికి ఆరు క్రెడిట్ అవర్స్ చొప్పున ఐదేళ్లలో 30 క్రెడిట్ అవర్స్ సంపాదించాల్సి ఉంటుంది. మెడికల్ కౌన్సిల్లో తమ వైద్య సర్టిఫికెట్లు రెన్యువల్ చేసుకునేందుకు ఈ క్రెడిట్ అవర్స్ దోహదపడతాయి. ఈ సదస్సులకు ఆయా రాష్ట్రాల మెడికల్ కౌన్సిల్ సభ్యులు, ప్రతినిధులు హాజరై సదస్సు జరిగే తీరును పరిశీలించాల్సి ఉంటుంది. ప్రతి సర్టిఫికెట్‌పైనా మెడికల్ కౌన్సిల్ సభ్యుల సంతకాలు ఉంటాయి. ఇన్ని నియమ నిబంధనలున్నా పలు ఫార్మా కంపెనీలు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నాయి. వైద్యుల పేర్ల నమోదు నుంచి సదస్సు తర్వాత ఇచ్చే క్రెడిట్ అవర్స్ సర్టిఫికెట్ల జారీ వరకు.. అన్నింటిలోనూ ఫార్మా కంపెనీలదే పెత్తనం. సదస్సుకు హాజరుకాని వైద్యుల పేర్లను కూడా ఫార్మా కంపెనీల ప్రతినిధులే నమోదు చేసి.. సర్టిఫికెట్లను తీసుకెళ్లి మరీ వైద్యులకు అందజేస్తుంటారు. తమ ఉత్పత్తులను రోగులకు సూచించేలా వైద్యులను ప్రభావితం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. తగ్గిన మందుల నాణ్యతఫార్మా కంపెనీలు, కొందరు వైద్యుల వల్ల రోగులపై మందుల అధికభారం పడుతోంది. అలాగే నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేని మందులు రోగుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. కేంద్ర ఔషధాల ప్రమాణాల నియంత్రణ సంస్థ తాజాగా చేసిన పరీక్షల్లో పారాసిటమాల్ సహా 53 రకాల మందుల్లో నాణ్యత లేదని తేలింది. గత ఆగస్టులో 156 కాంబినేషన్ ఔషధాలు హానికరమంటూ నిషేధం విధించింది. -
2028 వరకు ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా ‘టాటా గ్రూప్’
ప్రపంచ వ్యాప్త క్రికెట్ అభిమానుల్ని చూరగొన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్ స్పాన్సర్‌షిప్‌ను భారత దిగ్గజ సంస్థ ‘టాటా’ గ్రూప్ పొడిగించుకుంది. ఐదేళ్ల కాలానికి రూ.2500 కోట్ల భారీ మొత్తంతో కొత్తగా ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ఈ సీజన్ నుంచి 2028 వరకు మళ్లీ టాటా ఐపీఎల్‌గా అలరించనుంది. టాటా సంస్థ గత రెండేళ్లుగా ఐపీఎల్‌తో కొనసాగుతోంది. 2022, 2023 సీజన్లలో టైటిల్ స్పాన్సర్‌గా ఉంది. తాజా ఒప్పందం విలువ ఐపీఎల్ టైటిల్ హక్కుల చరిత్రలోనే అత్యధిక మొత్తమని బీసీసీఐ తెలిపింది. -
క్రికెట్ వరల్డ్ కప్ స్పాన్సర్‌గా మహీంద్రా
దేశీయ కార్పొరేట్ దిగ్గజం మహీంద్రా క్రికెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టనుంది. త్వరలో ప్రారంభంకానున్న క్రికెట్ వరల్డ్‌కప్-2023 కోసం స్టార్ స్పోర్ట్స్‌తో కలిసి అసోసియేట్ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. అలాగే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌కు కో పవర్డ్ స్పాన్సర్‌గా పని చేయనుంది. క్రికెట్‌తో తమకున్న అనుబంధాన్ని విస్తరించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మహీంద్రా సంస్థ వెల్లడించింది. కాగా, మహీంద్రా కంపెనీ ఆటోమొబైల్ మరియు ఫార్మింగ్ సెక్టార్లలో అగ్రగామిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి వన్డే వరల్డ్‌కప్-2023 ప్రారంభంకానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, గత వరల్డ్‌కప్ రన్నరప్ న్యూజిలాండ్ మధ్య జరిగే మ్యాచ్‌తో క్రికెట్ ఫెస్టివల్ స్టార్ట్ అవుతుంది. అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 14న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది. అంతకుముందే భారత్.. చెన్నైలో ఆస్ట్రేలియాను ఢీకొంటుంది (అక్టోబర్ 8న). ఆతర్వాత అక్టోబర్ 11న ఆఫ్ఘనిస్తాన్, 19న బంగ్లాదేశ్, 22న న్యూజిలాండ్, 29న ఇంగ్లండ్, నవంబర్ 2న శ్రీలంక, నవంబర్ 5న సౌతాఫ్రికా, 12న నెదర్లాండ్స్‌తో తలపడనుంది. నవంబర్ 19న జరిగే ఫైనల్‌తో వరల్డ్‌కప్ ముగియనుంది. -
BCCI: ఒక్కో అంతర్జాతీయ మ్యాచ్‌కు రూ.4.20 కోట్లు!
ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఖాతాలో కొత్త టైటిల్ స్పాన్సర్షిప్ ద్వారా వచ్చే మూడేళ్లలో రూ. 235 కోట్లు చేరనున్నాయి. ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ అయిన ‘ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్’ బోర్డు మ్యాచ్‌ల టైటిల్ స్పాన్సర్షిప్ హక్కులు సొంతం చేసుకుంది. బీసీసీఐ నిర్వహించబోయే అంతర్జాతీయ (సీనియర్ పురుషుల, మహిళల) మ్యాచ్‌లతో పాటు దేశవాళీ టోర్నీలు, అండర్–19, అండర్–23 టోర్నీలకు ఈ హక్కులు వర్తిస్తాయి. కొత్త ఒప్పందం ప్రకారం ఐడీఎఫ్సీ ఒక్కో అంతర్జాతీయ మ్యాచ్‌కు బీసీసీఐకి రూ. 4 కోట్ల 20 లక్షలు చెల్లిస్తుంది. మూడేళ్ల వ్యవధిలో మొత్తం 56 అంతర్జాతీయ మ్యాచ్‌లు జరుగుతాయి. వచ్చే నెలలో ఆ్రస్టేలియాతో జరిగే మూడు వన్డేల సిరీస్‌తో మొదలయ్యే ఒప్పందం 2026 ఆగస్టు వరకు అమల్లో ఉంటుంది. తాజా ఒప్పందానికి ముందు వరకు ‘మాస్టర్ కార్డ్’ ఒక్కో మ్యాచ్‌కు రూ.3 కోట్ల 80 లక్షలు చెల్లించింది. -
BCCI: భారీ ఆదాయంపై కన్ను.. మీడియా హక్కుల టెండర్లు విడుదల
బీసీసీఐ భారీ ఆదాయంపై కన్నేసింది.స్పాన్సర్షిప్ హక్కుల రూపంలో కోట్లు గడించాలని చూస్తోంది. ఈ మేరకు స్పాన్సర్షిప్ టెండర్లకు ఆహ్వానాలు పలికిన సంగతి తెలిసిందే. అయితే ఒక్క రోజు గడువక ముందే దేశవాళీ, అంతర్జాతీయ మ్యాచ్‌లకు మీడియా హక్కులు కట్టబెట్టేందుకు సిద్ధపడింది. వన్డే వర్డల్ కప్(ODI World Cup 2023) సమీపిస్తున్నందున మీడియా హక్కుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు బుధవారం ప్రకటించింది. అంతేకాదు ఇన్విటేషన్ టు టెండర్(Invite To Tender)లో వివరాలతో పాటు షరతులు స్పష్టంగా పేర్కొంది. ఆసక్తిగల మీడియా సంస్థలు జీఎస్టీ(GST)తో కలిపి రూ.15 లక్షల నాన్ రీఫండబుల్ ఫీజు చెల్లించాలని తెలిపింది. అర్హతలు, అవసరాలు, బిడ్స్ వేయడం, హక్కులు, అభ్యంతరాలు.. ఇవన్నీ టెండర్ ప్రక్రియలో భాగమని బీసీసీఐ వెల్లడించింది. ఐటీటీ ఆగస్టు 25వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని బీసీసీఐ ప్రకటనలో పేర్కొంది. చదవండి: బంతిని తన్నబోయి ప్రత్యర్థి కాలు విరగొట్టాడు -
కనీస ధర 350 కోట్లేనా!.. బీసీసీఐ ఎందుకిలా?
టీమిండియా క్రికెట్‌కు త్వరలోనే కొత్త స్పాన్సర్షిప్ రానుంది. ఈ మేరకు బీసీసీఐ టీమిండియా లీడ్ స్పాన్సర్స్ హక్కుల కోసం రూ. 350 కోట్ల బేస్‌ప్రైస్‌తో టెండర్లకు ఆహ్వానించింది. బీసీసీఐ జూన్ 14న టెండర్లను రిలీజ్ చేసింది. పోటీకి వచ్చే సంస్థలకు జూన్ 26 వరకు టెండర్లను దక్కించుకునే అవకాశం ఇచ్చింది. ఇటీవలే టీమిండియా టూల్ కిట్ స్పాన్సర్‌గా ప్రముఖ స్పోర్ట్స్ బ్రాండ్ ఆదిదాస్‌తో బీసీసీఐ ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఐదేళ్ల పాటు ఈ ఒప్పందం అమల్లో ఉంటుంది. ఈ క్రమంలోనే లీడ్ స్పాన్సర్‌గా కూడా ఎక్కువ కాలం ఉండే సంస్థతోనే ఒప్పందం చేసుకోవాలని బీసీసీఐ భావిస్తోంది. అయితే రూ. 350 కోట్లను బేస్‌ప్రైస్‌గా బీసీసీఐ నిర్ణయించడం ఆసక్తి కలిగించింది. గతంలో బైజూస్ సంస్థ టీమిండియాకు స్పాన్సర్స్‌గా వ్యవహరించినప్పుడు భారత జట్టు స్వదేశంలో ఆడే ఒక్కో మ్యాచ్‌కూ రూ.5.07 కోట్లను బైజూస్ చెల్లించేది. అదే ఐసీసీ, ఏసీసీకి సంబంధించిన టోర్నీల్లో అయితే మ్యాచ్‌కు రూ.1.56 కోట్లు చెల్లించేది. కానీ ఈసారి మాత్రం స్పాన్సర్ షిప్ హక్కుల కనీస ధరను బీసీసీఐ బాగా తగ్గించినట్లు తెలుస్తోంది. మరి ఈ హక్కులు ఎవరికి దక్కుతాయో చూడాలి. కాగా టీమిండియా ఇటీవలే ముగిసిన డబ్ల్యూటీసీ ఫైనల్లో ఎలాంటి స్పాన్సర్స్ లేకుండానే బరిలోకి దిగింది. బీసీసీఐ తక్కువ ధరకే స్పాన్సర్షిప్ కోసం టెండర్లను పిలవడం వెనుక ఒక కారణం ఉన్నట్లు సమాచారం. ఖర్చును తగ్గించుకునే పనిలోనే బీసీసీఐ స్పాన్సర్షిప్ కొనుగోలు విషయంలో తెలివైన నిర్ణయం తీసుకుందని నిపుణులు అంటున్నారు. ''లీడ్ స్పాన్సర్ హక్కులకు చాలా రియలిస్టిక్‌గా కనీస ధరను బీసీసీఐ నిర్ణయించింది. ఇంతకాలం క్రికెట్‌పై భారీగా ఖర్చు పెట్టిన చాలా మంది స్పాన్సర్లు తమ ఖర్చును భారీగా తగ్గించేసుకుంటున్నారు'' అంటూ అభిప్రాయపడ్డారు. చదవండి: హరారే స్పోర్ట్స్‌క్లబ్‌లో అగ్నిప్రమాదం.. ఐసీసీ కీలక ప్రకటన -
భారత క్రికెట్ జట్టు కిట్ స్పాన్సర్‌గా అడిడాస్
చెన్నై: జర్మనీకి చెందిన ప్రముఖ క్రీడా ఉత్పాదనల సంస్థ అడిడాస్ భారత క్రికెట్ జట్టు కిట్ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. ప్రస్తుత స్పాన్సర్ ‘కిల్లర్ జీన్స్’తో కాంట్రాక్టు గడువు ఈ నెలాఖరుతో ముగియనుండటంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త స్పాన్సర్షిప్ ఇచ్చింది. దీనిపై బోర్డు కార్యదర్శి జై షా మాట్లాడుతూ ‘దేశంలో క్రికెట్ అభివృద్ధి అంచనాలను మించుతుంది. కాబట్టి ప్రపంచశ్రేణి సంస్థ మాతో జట్టు కట్టడంపై పెద్దగా ఆశ్చర్యమేమీ లేదు’ అని అన్నారు. జర్మన్ స్పోర్ట్స్ బ్రాండ్ అయిన అడిడాస్‌తో ఒప్పందం ఎన్నేళ్లు, ఎంత మొత్తానికి స్పాన్సర్షిప్ పొందిందనే వివరాలేవీ ఆయన వెల్లడించలేదు. విశ్వసనీయ వర్గాల ప్రకారం రూ. 350 కోట్లతో అడిడాస్ కిట్ స్పాన్సర్షిప్ దక్కించుకున్నట్లు తెలిసింది. టీమిండియా వచ్చే నెల 7 నుంచి ఆస్ట్రేలియాతో జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో తలపడుతుంది. ఆ జెర్సీలపై అడిడాస్ లోగో కనిపించనుంది. టీమ్ స్పానర్ బైజుస్ కూడా మారుతున్నట్లు తెలిసింది. ఈ నవంబర్ వరకు గడువున్నప్పటికీ సదరు సంస్థ ముందుగానే వైదొలగనుండటంతో త్వరలోనే బిడ్లను ఆహ్వానిస్తారు. -
‘టాటా’ డబ్ల్యూపీఎల్
న్యూఢిల్లీ: భారత మల్టీనేషనల్ కంపెనీ ‘టాటా’ మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టైటిల్ స్పాన్సర్షిప్ హక్కుల్ని కైవసం చేసుకుంది. ఇప్పటికే ఈ దేశీయ కార్పొరేట్ దిగ్గజం పురుషుల లీగ్ ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా ఉంది. ‘టాటా’ చైనా మోబైల్ సంస్థ ‘వీవో’ స్థానంలో ఐపీఎల్‌లోకి ప్రవేశించింది. తాజాగా మహిళల లీగ్‌లోనూ భాగమైంది. ఐదేళ్ల పాటు డబ్ల్యూపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా ‘టాటా’ కొనసాగనుంది. అయి తే ఎంతమేరకు ఈ ఒప్పందం కుదిరిందనే వివరాలను అటు బోర్డుగానీ, ఇటు కార్పొరేట్ సంస్థగానీ వెల్లడించలేదు. వచ్చే నెల 4 నుంచి డబ్ల్యూపీఎల్ పోటీలన్నీ ముంబైలోని రెండు వేదికలు బ్రబోర్న్, డీవై పాటిల్ స్టేడియాల్లో జరుగనున్నాయి. -
శ్రేయాస్ మీడియా ఇక గ్లోబల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మూవీ ఈవెంట్స్, ప్రమోషన్స్‌లో దేశంలో అగ్ర శ్రేణి సంస్థ శ్రేయాస్ మీడియా రూ.30 కోట్ల నిధులను సమీకరిస్తోంది. వ్యూహాత్మక, ప్రముఖ పెట్టుబడిదార్లతో ఈ మేరకు కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. మధ్య ప్రాచ్య, యూఎస్, ఏషియా పసిఫిక్‌తోపాటు దేశవ్యాప్తంగా విస్తరణకు తాజా నిధులను ఉపయోగిస్తామని శ్రేయాస్ గ్రూప్ ఫౌండర్ గండ్ర శ్రీనివాస్ రావు మంగళవారమిక్కడ మీడియాకు తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన శ్రేయాస్ మీడియా 2011లో ప్రారంభమైంది. దక్షిణాదిన 1,500లకుపైగా ఈవెంట్స్‌ను నిర్వహించింది. వీటిలో 1,000 దాకా సినిమా ప్రచార కార్యక్రమాలు ఉన్నాయి. దుబాయిలోనూ కార్యకలాపాలు ప్రారంభించింది. తెలుగుతో మొదలై దక్షిణాది భాషలకు సేవలను విస్తరించింది. గరిష్టంగా 10 కోట్ల మంది.. దక్షిణాది సినిమాలతో కలిసి పనిచేసేందుకు దేశ, విదేశీ బ్రాండ్స్ సిద్ధంగా ఉన్నాయని శ్రీనివాస్ వెల్లడించారు. ‘స్పాన్సర్స్‌కు సినిమాలతో పెద్ద ఎత్తున మైలేజ్ వచ్చేలా ఈవెంట్స్ చేస్తున్నాం. కార్యక్రమాల్లో సినీ తారలు ఉండడంతో బ్రాండ్స్ సులువుగా వీక్షకులకు చేరువ అవుతున్నాయి. ప్రపంచంలోనే ఇది విభిన్న కాన్సెప్ట్. నటులు, దర్శకులు, నిర్మాతలకు సామాజిక మాధ్యమాల్లో కోట్లాది మంది అభిమానులున్నారు. సినిమాతో ముడిపడి ఏ కార్యక్రమం చేసినా స్పాన్సర్ బ్రాండ్స్ కోట్లాది మందికి చేరువ అవుతున్నాయి. ఒక్కో కార్యక్రమాన్ని గరిష్టంగా 10 కోట్ల మందికిపైగా వీక్షిస్తున్నారు. అందుకే విదేశీ బ్రాండ్స్ స్పాన్సర్షిప్కు ముందుకు వస్తున్నాయి. దక్షిణాది సినిమాల గురించి దేశ, విదేశాల్లోనూ మాట్లాడుకుంటున్నారు. ఇది మాకు, బ్రాండ్స్‌కు గొప్ప వ్యాపార అవకాశం‘ అని ఆయన వివరించారు. కొత్త విభాగాల్లోకి ఎంట్రీ.. సినిమా ఆసరాగా కొత్త విభాగాల్లో ప్రవేశిస్తామని శ్రీనివాస్ వెల్లడించారు. ‘శ్రేయాస్ఈటీ ఓటీటీని పునర్నిర్మిస్తాం. ఇందులో భాగంగా నూతన సాంకేతికతతో ఇంటెరాక్టివ్ మూవీస్, మినీ, స్నాక్ మూవీస్తోపాటు తొలిసారిగా 8డీ మూవీస్ పరిచయం చేస్తాం. రెట్రో మూవీస్‌ను పొందుపరుస్తాం. కంపెనీ 2027 నాటికి ఏటా 650 సినిమా కార్యక్రమాలు, 120 మూవీ ప్రమోషన్స్ చేపట్టాలని లక్ష్యంగా చేసుకుంది. గ్రూప్ టర్నోవర్ రూ.700 కోట్లు ఆశిస్తోంది. ఇందులో మూవీ ఈవెంట్స్ వాటా రూ.285 కోట్లు ఉంటుందని అంచనా. 2021–22లో రూ.20 కోట్ల టర్నోవర్ సాధించాం’ అని చెప్పారు. –శ్రేయాస్ గ్రూప్ ఫౌండర్ గండ్ర శ్రీనివాస్ రావు -
బైజూస్‌తో అనుబంధాన్ని కొనసాగించనున్న బీసీసీఐ
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ప్రముఖ ఆన్లైన్ ఎడ్యుకేషనల్ కంపెనీ బైజూస్‌తో అనుబంధాన్ని కొనసాగించాలని నిర్ణయించింది. శ్రీలంకతో ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్ సిరీస్ ముగిశాక బైజూస్‌తో టీమిండియా జెర్సీ ఒప్పందం ముగియనున్న నేపథ్యంలో బీసీసీఐ ఈ మేరకు నిర్ణయించింది. భారత క్రికెట్ జట్టు జెర్సీ స్పాన్సర్‌గా బైజూస్‌ను మరో ఏడాది పాటు పొడిగించనున్నట్లు బీసీసీఐ సోమవారం వెల్లడించింది. 2019 సెప్టెంబర్ నుండి బైజూస్ భారత క్రికెట్ జట్టు జెర్సీ స్పాన్సర్‌గా వ్యవహరిస్తుంది. అంతకుముందు చైనీస్ మొబైల్ సంస్థ ఒప్పో టీమిండియా జెర్పీ స్పాన్సర్‌గా ఉండింది. జెర్సీ స్పాన్సర్షిప్కు గాను బైజూస్ ద్వైపాక్షిక సిరీస్‌లకు రూ. 4.61 కోట్లు, అంతర్జాతీయ మ్యాచ్‌లకు రూ. 1.56 కోట్లు బీసీసీఐకి చెల్లిస్తోంది. చదవండి: షేన్ వార్న్ హఠాన్మరణం వెనుక విస్తుపోయే నిజాలు..! -
ఆరు ఫ్రాంచైజీలకు కొత్త స్పాన్సర్లు, జెర్సీలు.. కొత్తకొత్తగా
ఐపీఎల్ మెగావేలం 2022కు రెండు రోజులు మాత్రమే మిగిలిఉంది. మొత్తం 590 మంది ప్లేయర్లు వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఏ ఆటగాడు ఏ ఫ్రాంచైజీకి వెళతాడు.. ఎంతకు అమ్ముడుపోతాడనేది ఆసక్తికరంగా మారింది. ఈసారి ఐపీఎల్లో అదనంగా రెండు జట్లు వచ్చి చేరిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఉన్న 8 జట్లకు తోడూ లక్నో సూపర్‌జెయింట్స్, అహ్మదాబాద్ టైటాన్స్ చేరడంతో మొత్తం ఫ్రాంచైజీల సంఖ్య 10కి చేరింది. కాగా ఇందులో ఆరు జట్లకు సంబంధించి.. స్పాన్సర్లు, జెర్సీలు మారే అవకాశాలు ఉన్నాయి. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ స్పాన్సర్లలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఇక మిగిలిన ఆరు జట్లు సీఎస్కే, ముంబై ఇండియన్స్, ఎస్ఆర్హెచ్, రాజస్తాన్ రాయల్స్, లక్నో సూపర్‌జెయింట్స్, అహ్మదాబాద్(గుజరాత్ టైటాన్స్)ల స్పాన్సర్స్, జెర్సీలు కొత్తగా రానున్నాయి. ఇక ఫిబ్రవరి 12,13 తేదీల్లో బెంగళూరు వేదికగా ఐపీఎల్ మెగావేలం జరగనుంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. సీఎస్కే- టీవీఎస్ యూరోగ్రిప్ ముంబై ఇండియన్స్- స్లైస్ ఎస్ఆర్హెచ్- కార్స్24 లక్నో సూపర్‌జెయింట్స్- మై11సర్కిల్ గుజరాత్ టైటాన్స్(పరిశీలనలో స్లైస్) రాజస్తాన్ రాయల్స్(ఖరారు కాలేదు) పాత స్పాన్సర్స్ కొనసాగనున్న నాలుగు జట్లు.. ఆర్సీబీ- ముత్తూట్ ఫిన్‌కార్ప్ ఢిల్లీ క్యాపిటల్స్-జేఎస్డబ్య్లూ పెయింట్స్ పంజాబ్ కింగ్స్- ఎబిక్స్ క్యాష్ కోల్‌కతా నైట్‌రైడర్స్-ఎంపీఎల్ ఐపీఎల్ 2022 మెగావేలం ముఖ్య విషయాలు.. ►10 ఫ్రాంచైజీలు 33 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి ►ఐపీఎల్ మెగావేంలో భాగంగా మొత్తం రూ.900 కోట్ల బడ్జెట్లో ఇప్పటికే రూ.343.7 కోట్లు ఖర్చు చేశారు. ►వేలంలో పాల్గొననున్న 10 ఫ్రాంచైజీల వద్ద మిగిలిన మొత్తం కలిపి రూ.556.3 కోట్లు ►వేలానికి రానున్న 590 మంది ఆటగాళ్లలో 217 స్థానాలకు ఎంపిక చేయనున్నారు. ►ఫిబ్రవరి 12,13 తేదీల్లో 217 స్థానాలకు రూ.556.3 కోట్లతో 590 మంది ఆటగాళ్ల నుంచి ఎంపికచేయనున్నారు. -
ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం.. మరో పదేళ్లు హాకీకి స్పాన్సర్షిప్
భువనేశ్వర్: భారత పురుషుల, మహిళల హాకీ జట్లకు ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన స్పాన్సర్‌గా కొనసాగుతుందని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వెల్లడించారు. మంగళవారం ఇరు జట్లను ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ మరో పదేళ్ల పాటు స్పాన్సర్షిప్ చేస్తామని చెప్పారు. ‘రెండు జట్లు తమ అద్భుత ప్రదర్శనతో టోక్యో ఒలింపిక్స్‌లో కొత్త చరిత్ర లిఖించాయి. దేశం యావత్తు గర్వపడేలా హాకీ జట్లు మైదానంలో పోరాడాయి. అసామాన పోరాట పటిమ చూసి భారత్ భావోద్వేగంతో ఉప్పొంగిపోయింది. జాతీయ క్రీడ హాకీతో మా అనుబంధం కొనసాగుతుంది’ అని అన్నారు. ఒక్కో ప్లేయర్‌కు రూ. 10 లక్షలు, సహాయ సిబ్బందికి రూ. 5 లక్షలు చొప్పున ప్రోత్సాహక బహుమతిగా అందజేసిన ఒడిషా ప్రభుత్వం హాకీ ఇండియాకు కూడా రూ. 50 లక్షలు అందించింది. 2018 నుంచి భారత హాకీ జట్లకు ‘టీమ్ స్పాన్సర్’గా ఒడిశా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఇటీవల ముగిసిన ఒలింపిక్స్‌లో పురుషుల జట్టు 41 ఏళ్ల పతక నిరీక్షిణకు కాంస్యంతో తెరదించిన సంగతి తెలిసిందే. మహిళల జట్టు నాలుగో స్థానంలో నిలిచింది. -
మీరు ఆడండి.. మేము అండగా ఉంటాం.. ‘టోక్యో’తో మారిన సీన్!
టోక్యో ఒలింపిక్స్ భారత క్రీడా ముఖ చిత్రాన్ని మార్చనున్నాయా? క్రికెట్‌తో పాటు ఇతర క్రీడలకు కార్పోరేటు దన్ను విస్తరించనుందా? ఆటగాళ్లకు మెరుగైన సౌకర్యాలు, శిక్షణ లభించనున్నాయా అంటే అవుననే సమాధానం వస్తోంది. సాక్షి, వెబ్‌డెస్క్: అనేక అనుమానాల మధ్య మొదలైన టోక్యో ఒలింపిక్స్ భారత క్రీడలపై భారీ ప్రభావం చూపింది. ఆరంభంలో అపజయాలు పలకరించినా విశ్వ క్రీడల చివరల్లో భారత ఆటగాళ్లు చూపిన తెగువ, పోరాడిన తీరు ఇండియన్ల మనసుపై చెరగని ముద్రని వేశాయి. గట్టి ప్రోత్సాహం లభిస్తే మన ఆటగాళ్లు విశ్వవేదికలపై మరింత మెరుగైన ప్రదర్శన, పతాకలు తేవడం గ్యారంటీ అనే భరోసా ఇచ్చాయి. దీంతో ఆటగాళ్లకు మెరుగైన శిక్షణ, వసతులు కల్పించడంతో పాటు ఆర్థికంగా అండగా ఉండేందుకు కార్పోరేటు కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. ప్రైవేటు రంగంలో కోచింగ్ సెంటర్లు ఒలింపిక్ క్రీడల్లో అథ్లెటిక్స్ విభాగంలో అప్పుడెప్పుడో రన్నింగ్ రేసులో పీటీ ఉష పతకం ఆశలు రేపగా దాదాపు నలభై ఏళ్లకు జావెలిన్ త్రోలో నీరజ్ చోప్డా ఆ కలను నిజం చేశాడు. రెజ్లింగ్‌లో భజరంగ్ పునియా రజతంతో మెరిశాడు. అయితే వీరిద్దరు ఒలింపిక్స్‌కి ముందు ఇన్స్పైర్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (ఐఐఎస్)లో శిక్షణ పొందారు. ఇండియా నుంచి ఒలింపిక్స్‌లో పోటీ పడుతున్న క్రీడాకారులకు అత్యుత్తమ శిక్షణ ఇచ్చేందుకు ఐఐఎస్ పని చేస్తోంది. దీనికి ఆర్థిక సహకారాన్ని జిందాల్ ఇండస్ట్రీస్‌తో పాటు కోటక్ గ్రూప్, ఇండస్ఇండ్, సిటీబ్యాంక్, బ్రిడ్జిస్టోన్, బోరోసిల్ ఇలా మొత్తం 20కి పైగా కార్పోరేట్ కంపెనీలు ఆర్థిక సాయం అందిస్తున్నాయి. ప్రభుత్వ పరంగా కాకుండా క్రీడాకారులకు అత్యుత్తమ శిక్షణ ఇచ్చే ప్రైవేటు ఇన్సిస్టి్యూట్గా ఐఐఎస్ పేరు మార్మోగిపోతుంది. పెరుగుతున్న ఫండింగ్ ఐఐఎస్‌లో శిక్షణ తీసుకున్న ఇద్దరు ఒలింపిక్ పతకాలు తేవడంతో ఈ ఏడాది ఐఐఎస్‌కు తమ ఫండింగ్‌ను 40 శాతం పెంచుతామంటూ జేఎస్‌డబ్ల్యూ సిమెంట్స్ ఎండీ పార్థ్ జిందాల్ ప్రకటించారు. తమలాగే రిలయన్స్, ఆదానీ, టాటాలు కూడా పెంచే అవకాశం ఉందంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విషఁంలో రిలయన్స్ ఒక అడుగు ముందుకు వేసి గోస్పోర్ట్స్ ఫౌండేషన్ పేరుతో ఎన్జీవోని నిర్వహిస్తోంది. కంపెనీలకు అవసరమే మనదేశంలో క్రికెట్‌కి క్రేజ్ ఎక్కువ. బ్రాండ్ ప్రచారం చేసుకోవాలన్నా క్రికెట్ ప్రధానంగా అయ్యింది. అయితే క్రికెట్ స్సాన్సర్షిప్, ఆటగాళ్ల ఎండార్స్మెంట్ ఫీజులు కోట్లలో ఉంటున్నాయి. వీటిని దక్కించుకోవాలంటే భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో ఇతర క్రీడలను ప్రోత్సహించడం అనివార్యత ఎప్పటి నుంచో ఉంది. ఎడిల్‌వైస్ కంపెనీ అయితే 2008 నుంచి ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ (ఏజీక్యూ) పేరుతో ప్రత్యేకంగా ఫండ్ ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తోంది. అయితే దేశం మొత్తం గుర్తించి... సెలబ్రేట్ చేసుకునే స్థాయిలో ఆటగాళ్ల నుంచి విజయాలు రాలేదు. ఒలింపిక్ చరిత్రలోనే ఈసారి ఇండియాకు అత్యధిక పతకాలు వచ్చాయి. దీంతో మెరుగైన ఆటగాళ్లకు స్పాన్సర్ చేసేందుకు ఒలింపిక్ అసోసియేషన్‌తో ఎడిల్‌వైస్ కంపెనీ చర్చలు ప్రారంభించింది. పీపీపీ మోడ్ ఒడిషా, టాటా గ్రూపులు సంయుక్తంగా పబ్లిక్, ప్రైవేటు పార్ట్నర్షిప్లో పురుష, మహిళా హకీ జట్లను స్పాన్సర్షిప్ అందించాయి. నలభై ఏళ్ల తర్వాత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకం సాధించగా మహిళల జట్టు తృటిలో పతకాన్ని కోల్పోయినా స్ఫూర్తిదాయక ఆటతీరుని కనబరిచింది. దీంతో పీపీపీ మోడ్‌లో ఆటగాళ్లకు అండగా నిలించేందుకు రియలన్స్, జిందాల్‌లు ముందుకు వచ్చాయి. అథ్లెటిక్స్‌కి రిలయన్స్ స్పాన్సర్ చేస్తుండగా స్విమ్మింగ్‌కి చేదోడుగా ఉండేందుకు జిందాల్ అంగీకారం తెలిపింది. ఒడిషా తరహాలో ఒక్కో రాష్ట్రం ఒక్కో క్రీడకు అండగా నిలిస్తే విశ్వపోటీల్లో ఇండియా ప్రదర్శన మరో స్థాయిలో ఉంటుందని జిందాల్ స్పోర్ట్స్ హెడ్ వినీల్ కార్నిక్ తెలిపారు. -
41 ఏళ్ల ఎదురు చూపులు.. ఆ సీఎం వల్లే ఈ ఒలింపిక్ పతకం
సాక్షి, వెబ్‌డెస్క్: ‘హాకీ’.. చెప్పుకోవడానికే మన జాతీయ క్రీడ. కానీ ఈ కాలం వారికి దాని గురించి పెద్దగా తెలియదనేది నమ్మకతప్పాల్సిన వాస్తవం. మన దగ్గర ఆటలంటే చాలు టక్కున గుర్తుకు వచ్చేది క్రికెట్. గతమెంతో ఘనమన్నట్లు ఒకప్పుడు ఒలింపిక్స్‌లో 8 గోల్డ్ మెడల్స్ గెలిచిన చరిత్ర ఉన్నప్పటికి మన జాతీయ క్రీడకు దక్కాల్సినంత ప్రాధాన్యత దక్కలేదనేది వాస్తవం. కారణాలు ఏవైనా కావచ్చు.. కానీ గత 40 ఏళ్లుగా హాకీ తన ప్రభావం కోల్పోతూ వస్తోంది. ఎంతలా అంటే 2008 బీజింగ్ ఒలింపిక్స్‌కు కనీసం అర్హత సాధించలేక చతికిలపడింది. దాంతో మన దేశంలో హాకీ కథ ముగిసిందనే చాలా మంది భావించారు. అలాంటి పరిస్థితులను తట్టుకుని.. నిలబడి ఇప్పుడు మళ్లీ అదే ఒలింపిక్స్‌లో మెడల్ గెలిచే స్థాయికి చేరింది. ఇక ఈ విజయంలో ఫీల్డ్‌లో పోరాడిన ఆటగాళ్ల కృషి ఎంత ఉందో.. అంతకంటే పెద్ద పాత్రే పోషించారు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. వాస్తవంగా చెప్పాలంటే ఈ రోజు భారత హాకీ టీం సాధించిన పతకం ఆయన చలవే. ఆ వివరాలు తెలియాలంటే ఇది చదవండి.. భారత్ హాకీలో చివరిసారిగా 1980 ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించింది. ఆ తర్వాత మరో పతకం రావడానికి దాదాపు 41 ఏళ్ల సమయం పట్టింది. ఇందుకు కారణాలు అనేకం.. 1980 తర్వాత దేశంలో క్రీడలకు కమర్షియల్ రంగులు అద్దుకుంటున్న టైం అది. అప్పుడే ఆటల్లో ‘రాజకీయాలు’ ఎక్కువయ్యాయి. హాకీలో టాలెంట్‌కు సరైన గుర్తింపు దక్కకపోగా.. రిఫరెన్స్‌లు, రికమండేషన్లతో సత్తువలేని ఆటగాళ్ల ఎంట్రీ జట్టును నిర్వీర్యం చేస్తూ వచ్చింది. దీనికి తోడు ఆటగాళ్ల మధ్య గొడవలు ఒక సమస్యగా మారితే.. ‘కోచ్’ ఓ ప్రధాన సమస్యగా మారింది. తరచూ కోచ్‌లు మారుతుండడం, భారత హాకీ ఫెడరేషన్లో నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతుండడం, స్పానర్షిప్-ఎండోర్స్మెంట్ వివాదాలు వెంటాడాయి. వీటికితోడు క్రికెట్‌కు పెరిగిన ఆదరణతో హాకీ ఉత్త జాతీయ క్రీడగా మారిపోయింది. ప్రోత్సాహకాల్లో మిగిలిన ఆటలకు తగ్గిన ప్రాధాన్యం(హాకీ అందులో ఒకటి)తో ప్రభుత్వాలు చిన్నచూపు చూశాయి. ఆదుకున్న నవీన్ పట్నాయక్.. ఇదే సమయంలో పుండు మీద కారం చల్లినట్లు అన్నాళ్లు ఇండియన్ హాకీ టీమ్‌కు స్పాన్స్రగా కొనసాగుతున్న సహారా 2018లో టీమ్ స్పాన్సర్షిప్ నుంచి తప్పుకుంది. హాకీని స్పాన్సర్ని చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఇలాంటి సమయంలో ఒడిశాలోని నవీన్ పట్నాయక్ ప్రభుత్వం హాకీ ఇండియాను ఆదుకుంది. ఐదేళ్లకుగాను హాకీని స్పాన్సర్ చేయడానికి పట్నాయక్ ప్రభుత్వం రూ.100 కోట్లతో హాకీ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది. పట్నాయక్ నాడు చూపిన చొరవే.. నేడు టోక్యో ఒలిపిక్స్లో పతకానికి కారణమయ్యింది. హాకీపై మక్కువతో.. నవీన్ పట్నాయక్ భారత హాకీ టీమ్‌ను స్పాన్సర్ చేయడానికి కారణం.. గతంలో ఆయన కూడా హాకీ ప్లేయరే కావడం. ఆయన డూన్ స్కూల్లో చదువుతున్న సమయంలో హాకీ గోల్‌కీపర్‌గా ఉన్నారు. అందుకే ఆ ఆటపై ఉన్న ఇష్టంతోనే టీమ్‌కు స్పాన్సర్‌గా ఉండటానికి ఆయన ముందుకు వచ్చారు. పురుషుల జట్టుతోపాటు మహిళలూ జట్టుకూ ఐదేళ్ల పాటు స్పాన్సర్‌గా ఉండటానికి ఒప్పందం కుదుర్చుకుంది ఒడిశా ప్రభుత్వం. ఇది జరిగిన మూడేళ్లకు ఇప్పుడు ఇండియన్ మెన్స్ హాకీ టీమ్ ఒలింపిక్స్ మెడల్ గెలిచింది. మహిళల టీమ్ కూడా మెడల్‌కు అడుగు దూరంలో ఉంది. ఒడిశాలో 2014 నుంచి హాకీ హవా.. 2014లో ఒడిశా ప్రభుత్వం చాంపియన్స్ ట్రోఫీ హాకీకి ఆతిథ్యమిచ్చింది. అప్పుడే ఒడిశా స్పాన్సర్షిప్కు బీజం పడింది. ఆ టోర్నీపై నవీన్ పట్నాయక్ ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఆ తర్వాత 2017లో ఒడిశా ప్రభుత్వం స్పాన్సర్‌గా ఉన్న కళింగ లాన్సర్స్ టీమ్ హాకీ ఇండియా లీగ్‌ను గెలిచింది. ఇక 2018లో హాకీ వరల్డ్ లీగ్‌ను కూడా ఒడిశా నిర్వహించింది. ఆ తర్వాత 2019లో ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ మెన్స్ సిరీస్ ఫైనల్స్, ఒలింపిక్ హాకీ క్వాలిఫయర్స్.. 2020లో ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ కూడా ఒడిశాలో జరిగాయి. ఇలా ఇండియన్ హాకీ టీం వేసే ప్రతి అడుగులోనూ నవీన్ పట్నాయక్ ప్రత్యేక శ్రద్ధ, కృషి ఉన్నాయి. ఒడిశా గతంలో కొందరు గొప్ప హాకీ ఆటగాళ్లను తయారు చేసింది. పురుషులు, మహిళల జట్లలో ఒడిశాకు చెందిన పలువురు క్రీడాకారులున్నారు. వీరిలో వైస్ కెప్టెన్లు - బీరేంద్ర లక్రా, దీప్ గ్రేస్ ఎక్కా వంటి వారు ఒడిశాకు చెందినవారే. నవీన్ పట్నాయక్ ప్రభుత్వం 2023 వరకు హాకీ ఇండియాకు స్పాన్సర్‌గా ఉంది. అదే ఏడాది భారతదేశం ఎఫ్ఐహెచ్ పురుషుల హాకీ ప్రపంచ కప్‌కు ఆతిథ్యమివ్వనుంది. ఈ ఒలింపిక్స్‌లో ఇండియన్ హాకీ టీమ్ ఆడిన పలు మ్యాచ్‌లను నవీన్ పట్నాయక్ చూశారు. ఇప్పుడు కాంస్య పతకం గెలిచిన తర్వాత కూడా టోక్యోలో ఉన్న టీమ్‌తో వీడియో కాల్లో మాట్లాడి శుభాకాంక్షలు చెప్పారు. ఈ విజయం ప్రతి భారతీయుడికీ గర్వకారణమన్నారు నవీన్ పట్నాయక్. -
బీసీసీఐ ఇలా అస్సలు ఊహించి ఉండదు!
ముంబై: ఎంతటి కరోనా కాలమైనా సరే... భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇలాంటి స్పందన మాత్రం అస్సలు ఊహించి ఉండదు! భారత క్రికెట్ జట్టుకు ఉన్న పాపులార్టీ, ఆటగాళ్లు గర్వంగా ధరించే టీమ్ జెర్సీ, కిట్లను స్పాన్సర్ చేసేందుకు పెద్ద పెద్ద సంస్థలే ‘క్యూ’ కడతాయని భావించిన బోర్డుకు తిరస్కరణ ఎదురైంది. మరో భారీ స్పాన్సర్షిప్ వేటలో ప్రతిష్టాత్మక ‘నైకీ’ సంస్థకు ఎలాంటి మినహాయింపులు ఇవ్వడానికి అంగీకరించకుండా బిడ్లు కోరిన బోర్డుకు గట్టి దెబ్బ తగిలింది. కిట్ స్పాన్సర్షిప్ కోసం పోటీ పడిన నాలుగు సంస్థల్లో ఒక్కరు కూడా ‘ఫైనాన్షియల్ బిడ్’ వేయలేదు. 14 ఏళ్లు భారత కిట్‌ను స్పాన్సర్ చేసిన నైకీతో పాటు అడిడాస్, ప్యూమాలాంటి దిగ్గజ స్పోర్టింగ్ కంపెనీలు, డ్రీమ్ ఎలెవన్‌కే చెందిన ఫ్యాన్ కోడ్ సంస్థ ప్రాధమికంగా ఆసక్తి చూపించి బిడ్లు కొనుగోలు చేశాయి. అయితే అసలు సమయానికి వీరంతా వెనక్కి తగ్గడం విశేషం. నిజానికి ఇప్పటి వరకు నైకీ ప్రతీ అంతర్జాతీయ మ్యాచ్‌కు బీసీసీఐ రూ. 85 లక్షల చొప్పున చెల్లిస్తూ వచ్చింది. దీనికి తగ్గించి బేస్ బ్రైస్‌ను రూ. 65 లక్షలకు చేసినా సరే... ఎవరూ ముందుకు రాకపోవడం పరిస్థితిని సూచిస్తోంది. రాబోయే రోజుల్లో బ్రాండింగ్ ప్రమోషన్ విషయంలో బీసీసీఐ తమకు ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో వీరంతా స్పాన్సర్షిప్ నుంచి దూరం జరిగినట్లు సమాచారం. నిజానికి ఐపీఎల్ తర్వాత ఏమిటనే విషయంలో బోర్డు వద్దే సరైన ప్రణాళిక కొరవడిన ఫలితమే ఇది. -
'డ్రీమ్' ధనాధన్
కరోనా కష్టకాలంలో కూడా భారత క్రికెట్ గల్లా పెట్టెలో కాసులకు కొదవ లేకపోయింది. వినోదానికి చిరునామాగా మారిన ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ ద్వారా ఒక్క సీజన్‌కే రూ. 222 కోట్లు బీసీసీఐకి లభించనున్నాయి. ఇప్పటికే తప్పుకున్న ‘వివో’తో పోలిస్తే ఇది తక్కువగా కనిపిస్తున్నా... ఇతర మార్గాల ద్వారా తాము ఆశించిన మొత్తాన్ని దాదాపుగా అందుకునేందుకు బీసీసీఐ ప్రణాళిక రూపొందించింది. ముంబై: ప్రముఖ ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్ ఫామ్ ‘డ్రీమ్ 11’ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) –2020 టైటిల్ స్పాన్సర్షిప్ హక్కులు సొంతం చేసుకుంది. ఈ ఏడాది కోసం డ్రీమ్ రూ. 222 కోట్లు చెల్లించనుంది. స్పాన్సర్షిప్ కోసం వేసిన బిడ్లను మంగళవారం తెరవగా...అందరికంటే ఎక్కువగా బిడ్ వేసిన డ్రీమ్ 11కు ఈ అవకాశం దక్కింది. రెండో స్థానంలో బైజూస్ (రూ. 201 కోట్లు), అన్ అకాడమీ (రూ. 170 కోట్లు) నిలిచాయి. వచ్చే ఏడాది స్పాన్సర్‌గా వ్యవహరించేందుకు ‘వివో’ తిరిగి రాకపోతే తర్వాత రెండేళ్లు కూడా డ్రీమ్ ఎలెవన్‌కు స్పాన్సర్షిప్ హక్కులు ఇవ్వనుంది. ఇందు కోసం రూ. 240 కోట్ల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ‘వివో’ ఏడాదికి రూ. 440 కోట్లు చెల్లించింది. దాంతో పోలిస్తే ఇది సగమే (49.5 శాతం తక్కువ). అయితే ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద సంస్థలే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న సమయంలో ఇది ఏ రకంగా చూసినా బోర్డుకు లాభదాయకమే. పైగా ఈ సారి అసోసియేట్ స్పాన్సర్ల సంఖ్యను మూడునుంచి ఐదుకు పెంచిన బోర్డు...చెరో రూ. 40 కోట్ల చొప్పున అదనంగా మరో రూ. 80 కోట్లను తమ ఖాతాలో వేసుకోనుంది. అంటే ఐపీఎల్–13 సీజన్‌నుంచి బోర్డుకు స్పాన్సర్ల ద్వారానే రూ. 302 కోట్లు రానున్నాయి. ఇక్కడా ‘చైనా’ ఉంది! భారత్–చైనా మధ్య సరిహద్దు వివాదం కారణంగానే ఐపీఎల్ స్పాన్సర్‌షిప్‌నుంచి చైనా కంపెనీ ‘వివో’ అర్ధాంతరంగా తప్పుకుంది. ఇప్పుడు వచ్చి న డ్రీమ్11లో కూడా చైనా సంస్థ ‘టెన్సెంట్’ పెట్టుబడులు ఉన్నాయి. అయితే దీనిని బీసీసీఐ సమర్థించుకుంది. ‘ఇది ముమ్మాటికీ భారత కంపెనీనే. దీనిని ప్రారంభించినవారితో పాటు అందులో పని చేస్తున్న ఉద్యోగులు భారతీయులే. టెన్సెంట్ వాటా 10 శాతంకంటే కూడా తక్కువ. కాబట్టి దానిని పట్టించుకోనవసరం లేదు’ అని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ బ్రిజేశ్ పటేల్ స్పష్టం చేశారు. ‘డ్రీమ్ 11’ ఆటలతో జత కట్టడం ఇది మొదటిసారి కాదు. ఐసీసీ అధికారిక ఫాంటసీ క్రికెట్ ప్లాట్‌ఫామ్‌గా ఉండటంతో పాటు కరీబియన్ లీగ్, బిగ్ బాష్, సూపర్ లీగ్ తదితర పోటీలకు స్పాన్సర్‌గా వ్యవహరించింది. ఐపీఎల్‌తో కూడా అసోసియేట్ స్పాన్సర్‌గా ఉంటూ ఇప్పుడు టైటిల్ స్పాన్సర్‌షిప్‌ను దక్కించుకుంది. అయితే ప్రపంచంలో అత్యుత్తమ క్రీడా వినోదంగా గుర్తింపు తెచ్చుకున్న ఐపీఎల్‌కు ఒక ఫాంటసీ లీగ్ స్పాన్సర్‌గా వ్యవహరించడమే ఆశ్చర్యం కాగా... దాని మాటున భారీ బెట్టింగ్‌కు ఇది అవకాశం కల్పిస్తోంది. ఎందుకంటే కొన్నాళ్ల క్రితం శ్రీలంకలో మ్యాచ్ జరుగుతుందంటూ పంజాబ్‌లో మ్యాచ్‌లు నిర్వహించి ఆన్లైన్లో బెట్టింగ్‌లు జరిపిన వివాదంలో డ్రీమ్ 11 పేరు కూడా ఉంది. దీనిపై ప్రస్తుతం బీసీసీఐ అవినీతి వ్యతిరేక విభాగం విచారణ కూడా జరుగుతోంది. ఇలాంటి స్థితిలో బోర్డు దానికి స్పాన్సర్షిప్ అప్పజెప్పడం విషాదం. 2013 ఐపీఎల్ సమయంలో వచ్చిన బెట్టింగ్ వివాదాన్ని బీసీసీఐ మరచిపోయినట్లుంది! ‘కలల’ ఆటలు... డ్రీమ్ 11, మొబైల్ ప్రీమియర్ లీగ్, మై 11 సర్కిల్, బల్లేబాజీ, మై టీమ్ 11, స్కిల్ ఫర్ ట్యూన్... పేరు ఏదైతేనేం... అన్నీ ఊరించి ఊబిలోకి దింపే తరహా ఫాంటసీ స్పోర్ట్స్ లీగ్‌లే! భారత్‌లో ఒక్కసారిగా దూసుకొచ్చిన ఈ కలల క్రీడలకు ధోని, కోహ్లి, రోహిత్, యువరాజ్ అందరూ బ్రాండ్ అంబాసిడర్లే. వీటిలో ఒకదానికి ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా ప్రచారకర్త. మొబైల్లో యాప్‌ను డౌన్లోడ్ చేయడం మొదలు ఇది వ్యసనంగా మారే వరకు అన్ని కంపెనీలది దాదాపు ఒకే శైలి. సరిగ్గా చెప్పాలంటే ‘భాగ్యలక్ష్మి బంపర్ డ్రా’కు ఇది ఆధునిక మొబైల్ వెర్షన్ మాత్రమే! ముందుగా అవి ఉచితంగా ఆడే అవకాశం కల్పిస్తాయి. ఆ తర్వాత కొంత డబ్బు చెల్లించి సభ్యులుగా మారితే ఎక్కువగా ఆడే అవకాశం ఉందంటూ ఆఫర్లు... ఆపై ప్రతీ ఆట (మ్యాచ్)కు కనీస మొత్తం చెల్లించిన తర్వాతే అందులో భాగమయ్యేందుకు ఆస్కారం ఉంటుంది. క్రికెట్ లేదా మరే క్రీడపైనైనా తనకు ఉన్న కొద్దిపాటి పరిజ్ఞానంతోనే డబ్బులు సంపాదించుకోవచ్చనే ఆశతో ఎంతో మంది దీనికి అలవాటు పడిపోతున్నారు. తమను తాము సదరు క్రీడలో పెద్ద అనుభవజ్ఞులైన విశ్లేషకులుగా భావించి వేసుకుంటున్న అంచనాలతో లెక్క తప్పడం, ఆపై పెద్ద మొత్తంలో నష్టపోవడం తరచుగా జరిగిపోతున్నాయి. కానీ లీగ్ నిర్వాహకులకు మాత్రం సర్వీస్ ఫీజు పేరుతో కాసుల పంట పండుతోంది. లీగ్‌లో ఎవరూ గెలిచినా, ఓడినా వారి ఆదాయం అమాంతం పెరిగిపోతోంది. ఈ ఫాంటసీ లీగ్‌ల వ్యవహారమంతా పక్కా జూదం అంటూ ఇందులో భారీగా నష్టపోయినవారు గతంలో కోర్టుకెక్కారు. అయితే ‘ఇందులో ఆడాలంటే తెలివితేటలు, ఆటలపై పరిజ్ఞానం కూడా అవసరం. కాబట్టి పూర్తిగా జూదంగా పరిగణించలేం’ అంటూ కోర్టు డ్రీమ్ 11కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయితే చట్టంలోని కొన్ని లోపాలను తమకు అనుకూలంగా మార్చుకొని ఈ సంస్థలు తమ వ్యవహారాలు నడిపిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. సుప్రీం కోర్టు తీర్పు చెప్పినా... తెలంగాణ రాష్ట్రంలో ఫాంటసీ లీగ్‌కు అనుమతి లేదు. తెలంగాణతో పాటు ఒడిషా, అసోంలలో ఈ లీగ్‌లు ఆడటం చట్టవిరుద్ధం. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి డ్రీమ్ 11 విలువ 2.25 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 17 వేల కోట్లు) కావచ్చని వ్యాపార వర్గాల అంచనా. దీన్ని బట్టి చూస్తే మిగిలిన రాష్ట్రాల్లో ఇది ఎంతగా విస్తరించిందో అర్థమవుతుంది. -
స్పాన్సర్లు కావలెను
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్ కోసం బీసీసీఐ ప్రధాన (టైటిల్) స్పాన్సర్ వేటలో పడింది. ఆసక్తి ఉన్న సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించింది. అనేక పరిణామాల మధ్య ‘వివో’ అనూహ్యంగా ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్‌నుంచి తప్పుకోవడంతో ఇప్పుడు బోర్డు కొత్త స్పాన్సర్‌ను వెతుక్కోవాల్సి వచ్చింది. ఐపీఎల్–13 సీజన్ పోటీలు సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు యూఏఈలో జరగనుంది. అయితే ఈ డీల్ కాలపరిమితి (ఆగస్టు 18 నుంచి డిసెంబర్ 31) నాలుగున్నర నెలలే! బిడ్లను ఈ నెల 14 వరకు దరఖాస్తు చేయవచ్చు. ఇతర నిబంధనలు, ఒప్పంద వివరాలు, స్పాన్సర్‌షిప్‌తో చేకూరే ప్రయోజనాలు తదితర అంశా లు తెలుసుకున్న తర్వాత ఆగస్టు 18 వరకు సదరు కంపెనీలు తుది బిడ్లు దాఖలు చేయాల్సి ఉం టుంది. స్పాన్సర్షిప్ కోసం బిడ్ వేసే కంపెనీ టర్నోవర్ కనీసం రూ. 300 కోట్లు ఉండాలని బీసీసీఐ నిబంధన విధించింది. ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ కోసం ‘వివో’ ప్రతి ఏడాది రూ. 440 కోట్లు చెల్లించింది. ఇప్పుడు దీంతో పోలిస్తే తక్కువ మొత్తానికి కంపెనీలు ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. రేసులో పతంజలి... యోగా గురువు బాబా రామ్‌దేవ్‌కు చెందిన పతంజలి ఆయుర్వేద కంపెనీ కూడా ఐపీఎల్‌కు స్పాన్సర్షిప్ అందించేందుకు ఆసక్తి చూపిస్తుండటం విశేషం. తమ ఉత్పత్తులకు ఐపీఎల్ ద్వారా అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుందని ఆ సంస్థ భావిస్తోంది. దీనిని పతంజలి ప్రతినిధులు నిర్ధారించారు. ‘ఐపీఎల్ స్పాన్సర్షిప్ అంశం మా పరిశీలనలో ఉంది. మన భారతీయ కంపెనీపై అంతర్జాతీయ స్థాయిలో దృష్టి పడాలనేదే మా కోరిక. అయితే ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు’ అని పతంజలి అధికార ప్రతినిధి ఎస్కే తిజారావాలా చెప్పారు. పతంజలి గ్రూప్ ఏడాది టర్నోవర్ సుమారు రూ. 10 వేల కోట్లుగా ఉంది. -
ఐపీఎల్ స్పాన్సర్ ఎవరు?
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)–2020కి ప్రముఖ మొబైల్ సంస్థ ‘వివో’ ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించడం లేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గురువారం అధికారికంగా ప్రకటించింది. ‘వివో’ లీగ్‌నుంచి తప్పుకున్నట్లు రెండు రోజుల క్రితమే దాదాపు ఖరారైపోగా... బోర్డు మాత్రం ఇప్పుడు తమ వైపునుంచి నిర్ధారిస్తూ ప్రకటన జారీ చేసింది. ‘2020 ఐపీఎల్‌కు సంబంధించి బీసీసీఐ, వివో మొబైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తమ భాగస్వామ్యాన్ని రద్దు చేసుకున్నాయి’ అంటూ ఏకవాక్యంతో ఈ విషయాన్ని వెల్లడించింది. ఇందుకు కారణాలు, ఇతర వివరాలేమీ పేర్కొనలేదు. అయితే బోర్డు ప్రకటన ప్రకారం చూస్తే ఐపీఎల్‌కు వివో దూరం కావడం ఈ ఒక్క ఏడాదికే పరిమితమని తెలుస్తోంది. ఆపై ఒప్పందాన్ని పునస్సమీక్షిస్తారా, మళ్లీ జత కడతారా అనేది మాత్రం ప్రస్తావించలేదు. సంవత్సరం తర్వాత పరిస్థితులు చక్కబడితే అప్పుడు దానిపై ఆలోచించుకోవచ్చని బీసీసీఐ భావిస్తోంది. బోర్డు తరఫునుంచి కనీసం కార్యదర్శి లేదా మరెవరి పేరు, సంతకం కూడా లేకుండా బీసీసీఐ పత్రికా ప్రకటన జారీ చేయడం విశేషం. మరోవైపు ఐపీఎల్‌తో భాగస్వామ్యానికి ‘విరామం’ ఇస్తున్నట్లు వివో ప్రకటించింది. బరిలో ఆ మూడు... ఏడాదికి రూ. 440 కోట్లు చెల్లించే విధంగా ‘వివో’ ఐపీఎల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. నిజానికి వివో తప్పుకోవడంలో భారతీయుల మనోభావాలతో పాటు ఆర్థిక పరమైన అంశాలు కూడా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తాజా పరిస్థితుల్లో తాము ఈ సారి రూ. 440 కోట్లు చెల్లించలేమని, కనీసం 50 శాతం మొత్తాన్ని తగ్గించాలంటూ వివో కొన్నాళ్ల క్రితం బీసీసీఐకి విజ్ఞప్తి చేసింది. దీనికి బోర్డు ఒప్పుకోలేదు. ఇప్పుడు ‘వివో’ తప్పుకోవడంతో పలు ప్రముఖ సంస్థలు స్పాన్సర్షిప్ కోసం ముందుకు వస్తున్నట్లు సమాచారం. వేర్వేరు కారణాలతో ఈసారి అంత భారీ మొత్తం రాకపోయినా... కొంత తక్కువగా చెల్లించి స్పాన్సర్‌గా వ్యవహరించాలని ప్రధానంగా మూడు సంస్థలు ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అందులో మొదటగా వినిపిస్తున్న పేరు ‘బైజూస్’. ఈ సంస్థ ఇప్పటికే భారత జట్టుకు ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. ఆ భాగస్వామ్యం కారణంగా బైజూస్‌కు మొదటి ప్రాధాన్యత దక్కవచ్చని సమాచారం. కరోనా నేపథ్యంలో పెరిగిన ఆన్లైన్ తరగతుల కారణంగా అత్యంత ఆర్జన పొందిన సంస్థల్లో ఒకటిగా బైజూస్ నిలిచింది. టీమిండియాలాగే బీసీసీఐకి చెందిన మెగా ఈవెంట్‌తో కూడా జత కట్టాలని ఆ కంపెనీ కోరుకుంటోంది. బైజూస్‌కు ప్రధానంగా భారతీయ కంపెనీ ‘జియో’నుంచి పోటీ ఎదురవుతోంది. ప్రస్తుతం ఎదురు లేకుండా అన్ని విధాలా దూసుకుపోతున్న జియోకు స్పాన్సర్షిప్ మొత్తం ఏ మాత్రం సమస్య కాకపోవచ్చు. ఐపీఎల్లో సగం జట్లకు అసోసియేట్ స్పాన్సర్‌గా ‘జియో’ ఇప్పటికే వ్యవహరిస్తోంది కాబట్టి లీగ్ కొత్త కాదు. క్రికెట్‌తో ఇప్పటి వరకు ఎక్కడా జత కట్టని మరో ప్రముఖ సంస్థ ‘అమెజాన్’ కూడా ఆసక్తి చూపిస్తున్నట్లు తెలిసింది. అత్యంత ప్రజాదరణ ఉన్న ఆటతో అనుబంధం పెంచుకునేందుకు ఇది సరైన సమయంగా ‘అమెజాన్’ భావిస్తోంది. చివరగా ‘కోకాకోలా’ పేరు వినిపిస్తున్నా... మిగతా మూడింటితో పోలిస్తే ఈ సంస్థకు అవకాశాలు తక్కువ. తాజా సమాచారం ప్రకారం రూ. 250–300 కోట్లు స్పాన్సర్‌షిప్‌గా లభిస్తే చాలని బీసీసీఐ కోరుకుంటోంది. అసలు ఒప్పందంతో పోల్చకుండా వివో ఆఫర్ చేసినదాంతో పోలిస్తే ఇది ఎంతో మెరుగని బోర్డు భావిస్తోంది. ‘జట్టు’ కడుతున్నారు... ముంబై: యూఏఈ గడ్డపై ఐపీఎల్ సీజన్‌కు రంగం సిద్ధం కావడంతో ఫ్రాంచైజీలు కూడా తమ తమ సేనల్ని సమాయత్తం చేస్తున్నాయి. ఫ్రాంచైజీ యాజమాన్యాలు ఇప్పటికే బోర్డు ఇచ్చే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) ముసాయిదాపై చర్చించుకున్నాయి. ఈ విషయంలో ముంబై ఇండియన్స్ అందరికంటే చురుగ్గా వ్యవహరిస్తోంది. నగరంలోని ఓ హోటల్ మొత్తాన్ని తీసుకున్న ఆ ఫ్రాంచైజీ తమ ఆటగాళ్లను క్వారంటీన్ చేసే పనిలో పడింది. కోవిడ్ టెస్టులు కూడా నిర్వహించి ఆటగాళ్ల ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తోంది. పరీక్షా ఫలితాలు, క్వారంటీన్ ముగిసిన వెంటనే నవీ ముంబైలో ఈ ఫ్రాంచైజీకి ఉన్న స్టేడియంలో శిక్షణ శిబిరం మొదలు పెట్టనున్నట్లు తెలిసింది. రాజస్తాన్ రాయల్స్ కూడా త్వరలోనే తమ ఆటగాళ్లు, సహాయ సిబ్బందికి కోవిడ్ పరీక్షలు చేసి రెండు వారాల్లో జట్టును సన్నద్ధం చేయాలని చూస్తోంది. మరో వైపు ఆటగాళ్లు టోర్నీ, ఫ్రాంచైజీ ప్రచార కార్యక్రమాలకు సంబంధించి షూటింగ్లలో పాల్గొనాలన్నా కూడా మార్గదర్శకాల ప్రకారమే నడుచుకోవాల్సి వుంటుంది. -
‘వివో’ వెనకడుగు...
‘ఐపీఎల్–2020 స్పాన్సర్లలో ఎలాంటి మార్పు లేదు. ఈసారి కూడా ప్రధాన స్పాన్సర్‌గా ‘వివో’ కొనసాగుతుంది’... ఆదివారం జరిగిన సమావేశం తర్వాత ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చేసిన అధికారిక ప్రకటన ఇది. అయితే రెండు రోజుల్లోపే అంతా మారిపోయింది. ఈ ఏడాది యూఏఈలో జరిగే లీగ్ స్పాన్సర్షిప్ హక్కులు వదిలేసుకోవాలని చైనా మొబైల్ సంస్థ ‘వివో’ భావిస్తోంది. ఇంకా అధికారికంగా బీసీసీఐ దీనిని ఖరారు చేయకపోయినా... ‘వివో’ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ముంబై: ఐపీఎల్–13 కోసం సన్నద్ధమవుతున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి కీలక సమయంలో షాక్ తగిలింది. టోర్నీ ప్రధాన స్పాన్సర్‌గా ఉన్న చైనా ప్రముఖ మొబైల్ ఫోన్ కంపెనీ ‘వివో’ లీగ్‌తో భాగస్వామ్యాన్ని వదులుకోవాలని నిర్ణయించుకుంది. బోర్డు వైపు నుంచి ఎలాంటి సమస్యా లేకపోయినా చైనాకు చెందిన కంపెనీ కావడంతో ‘వివో’పై గత రెండు రోజులుగా విమర్శల పర్వం తీవ్రంగా సాగింది. గల్వాన్ లోయలో చైనా చేతిలో భారత సైనికులు వీరమరణం పొందిన నేపథ్యంలోనూ ‘వివో’తో జత కట్టడంపై కొందరు బహిరంగంగా బోర్డు నిర్ణయాన్ని తప్పుపట్టగా... పెద్ద సంఖ్యలో అభిమానులు సోషల్ మీడియాలో విరుచుకు పడ్డారు. దాంతో ‘వివో’ వెనక్కి తగ్గినట్లు సమాచారం. భారీ మొత్తానికి... 2008లో ఐపీఎల్ మొదలైన తర్వాత ముందుగా డీఎల్ఎఫ్, ఆ తర్వాత పెప్సీ ప్రధాన స్పాన్సర్లుగా వ్యవహరించాయి. అయితే స్పాట్ ఫిక్సింగ్ అనంతరం వచ్చి న వివాదాలతో పెప్సీ అర్ధాంతరంగా తమ కాంట్రాక్ట్‌ను రద్దు చేసుకోగా మధ్యలో రెండేళ్ల కాలానికి ‘వివో’ స్పాన్సర్షిప్ కోసం ముందుకు వచ్చింది. ఆ తర్వాత 2017లో బోర్డుతో వివో ఐదేళ్ల కాలానికి భారీ మొత్తానికి ఒప్పందం కుదుర్చుకుంది. 2018–2022 మధ్య ఐదేళ్ల ఐపీఎల్‌కు రూ. 2199 కోట్లు (ఏడాదికి రూ. 440 కోట్ల చొప్పున) చెల్లించేందుకు సిద్ధమైంది. ఇందులో ప్రస్తుతం రెండేళ్లు మాత్రమే పూర్తయ్యాయి. గల్వాన్ ఘటన తర్వాత చైనా కంపెనీలతో ఒప్పందాలను పునఃస్సమీక్షిస్తామని బీసీసీఐ ప్రకటించింది. అయితే ఐపీఎల్ సమావేశంలో మాత్రం అలాంటిదేమీ కనిపించలేదు. ‘కాంట్రాక్ట్ ఉల్లంఘన సమస్యలు’ తదితర అంశాలను కారణాలుగా చూపిస్తూ ‘వివో’ తదితర కంపెనీలను కొనసాగించేందుకే సిద్ధమైనట్లు ప్రకటించింది. ఒప్పందంలో ఇతర షరతులు, నిబంధనలపై పూర్తి స్థాయిలో స్పష్టత లేకపోయినా... ఈసారి లీగ్‌తో జత కట్టడంకంటే దూరంగా ఉంటేనే మేలని ‘వివో’ భావించినట్లుంది. తాము చెల్లిస్తున్న భారీ మొత్తానికి తగినంత ప్రచారాన్ని, లాభాన్ని ఏ కంపెనీ అయినా కోరుకోవడం సహజం. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ‘వివో’ ఆశించింది జరగకపోవచ్చు. కరోనా ఒక కారణం కాగా, చైనా కంపెనీలపై భారత్‌లో వచ్చిన వ్యతిరేకత నేపథ్యంలో ‘వివో’ ఆదాయంపై సహజంగానే ప్రభావం పడి ఉండవచ్చు. అన్నింటికి మంచి మరో ప్రధాన కారణం నిబంధనల ప్రకారం ఐపీఎల్ ఆటగాళ్లు, జట్లు కచ్చితంగా ‘వివో’ ఉత్పత్తులకు ప్రచారం చేసి పెట్టాలి. ఈ సమయంలో ఏ కోహ్లితోనో, ధోనితోనో ‘వివో’ ఫోన్ కొనమని చెప్పించడం అంత సులువు కాదు! దీనివల్ల ప్రచారం కంటే ప్రతికూలం ప్రభావమే ఎక్కువగా పడుతుంది. వీటన్నింటికంటే లీగ్‌కు దూరంగా ఉండ టమే మేలని కంపెనీ అనుకున్నట్లుంది. అయితే అది ఈ ఒక్క ఏడాదికేనా లేక పూర్తిగా లీగ్ నుంచి తప్పుకున్నట్లా అనేదానిపై స్పష్టత లేదు. ఈ ఒక్క ఏడాది మాత్రమే ‘వివో’ వైదొలగితే... ఒప్పందాన్ని 2023 వరకు పొడిగించే అవకాశం ఉంది. మా సంగతేంటి... ఐపీఎల్ స్థాయిని బట్టి చూస్తే కొత్త స్పాన్సర్‌ను వెతుక్కోవడం బోర్డుకు పెద్ద కష్టం కాకపోవచ్చు. అయితే ‘వివో’ ఇస్తున్న రూ. 440 కోట్లు వస్తాయా అనేది కాస్త సందేహమే. అంతకంటే తక్కువ మొత్తం రావచ్చని బోర్డు ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. మరో వైపు ‘వివో’ ఒప్పందం ప్రభావం తమపై ఏమాత్రం ఉండదని ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి. ప్రధాన స్పాన్సర్ ద్వారా వచ్చే ఆదాయంలో ప్రతీ ఫ్రాంచైజీకి ఏడాదికి రూ. 20 కోట్లు లభిస్తాయి. ఇప్పుడు ‘వివో’ తప్పుకున్నా... మరొకరు వస్తే తమకు రావాల్సింది ఎలాగూ దక్కుతుందని, దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఫ్రాంచైజీలు చెబుతున్నాయి. అయితే ఐపీఎల్‌కు ప్రేక్షకులను అనుమతించకపోతే కోల్పోయే టికెట్ల డబ్బు (గేట్ రెవిన్యూ) విషయంపై మాత్రం వారు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. తాము కోల్పోయే ఆదాయాన్ని నష్టపరిహారంగా బోర్డు చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై తామంతా ఒకే తాటిపై ఉండాలంటూ ఒక ప్రముఖ ఫ్రాంచైజీ యాజమాన్యం ఇతర ఏడు జట్ల మేనేజ్మెంట్లతో మాట్లాడినట్లు సమాచారం. ప్రస్తుతం యూఏఈలో ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే కనీసం 30–40 శాతం ప్రేక్షకులనైనా అనుమతించేలా బోర్డు ప్రయత్నిస్తోంది. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 19 వరకు లీగ్ జరగనుంది. -
‘కిట్’ స్పాన్సర్ వేటలో...
ముంబై: భారత క్రికెట్ జట్టుకు కొత్త కిట్ స్పాన్సర్‌ను వెతికే పనిలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పడింది. ప్రముఖ సంస్థ ‘నైకీ’తో బోర్డు కాంట్రాక్ట్ వచ్చే నెలతో ముగియనుంది. దాంతో కొత్త అపెరాల్ భాగస్వామిని ఎంచుకునేందుకు బోర్డు బిడ్లను ఆహ్వానించింది. ఆగస్టు 26 వరకు సంస్థలు పోటీ పడవచ్చు. విజేతగా నిలిచే బిడ్డర్ టీమిండియా ప్రధాన జట్టుతో పాటు ఇతర అనుబంధ (మహిళా, యువ) జట్లకు కూడా కిట్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తుంది. భారత క్రికెట్ కు సంబంధించి జెర్సీలు, క్యాప్‌లు తదితర అపెరాల్స్‌ను అధికారికంగా అమ్ముకునే హక్కులు వారికి లభిస్తాయి. గత నాలుగేళ్ల కాలానికి ‘నైకీ’ రూ. 30 కోట్ల రాయల్టీ సహా రూ. 370 కోట్లు బోర్డుకు చెల్లించింది. 14 ఏళ్ల అనుబంధం... ఈ బిడ్‌లో ప్రస్తుతానికి చూస్తే నైకీ కూడా మళ్లీ పాల్గొనేందుకు అర్హత ఉంది. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో అది సందేహమే. ఈ ప్రఖ్యాత సంస్థకు భారత క్రికెట్‌తో 14 ఏళ్ల అనుబంధం ఉంది. తొలిసారి 2006 జనవరి 1న బీసీసీఐతో జత కట్టింది. నాడు అడిడాస్, రీబాక్‌లతో పోటీ పడి ఐదేళ్ల కాలానికి 43 మిలియన్ డాలర్లు (అప్పట్లో) చెల్లించి అపెరాల్ హక్కులు సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కష్టకాలం నేపథ్యంలో స్పాన్సర్షిప్ మొత్తాన్ని కాస్త తగ్గించి తమనే కొనసాగించాలని నైకీ కోరగా... బోర్డు అందుకు అంగీకరించలేదని సమాచారం. పైగా కోవిడ్–19 కారణంగా ఈ ఏడాది పలు సిరీస్‌లు రద్దయిన విషయాన్ని కూడా నైకీ గుర్తు చేసినా లాభం లేకపోయింది. ఒక వేళ ఇప్పుడు కూడా నైకీ బిడ్‌లో పాల్గొన్నా తాము అనుకున్న తక్కువ మొత్తానికే కోట్ చేస్తే... ఇతర కంపెనీలు దానిని వెనక్కి తోసి అవకాశం దక్కించుకోవచ్చు. -
స్పాన్సర్ స్థానంలో స్వచ్ఛంద సంస్థ!
కరాచీ: కరోనా దెబ్బ ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలపై భారీగా పడింది. క్రీడలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. స్పాన్సర్షిప్ అందించే విషయంలో కంపెనీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు పరిస్థితి ఇబ్బందికరంగా తయారైంది. ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన ఆ జట్టుకు అండగా నిలిచేందుకు ఎవరూ రాలేదు. సుదీర్ఘ కాలంగా ప్రధాన స్పాన్సర్‌గా ఉన్న ‘పెప్సీ’ ఇటీవలే తప్పుకుంది. కొత్తగా బిడ్లను ఆహ్వానిస్తే ఒకే ఒక కంపెనీ ముందుకొచ్చింది. అయితే ‘పెప్సీ’ ఇచ్చిన మొత్తంలో 30 శాతం మాత్రమే ఇస్తామనడంతో పీసీబీకి షాక్ తగిలింది. ఈ నేపథ్యంలో స్పాన్సర్ లేకుండానే టీమ్ ఇంగ్లండ్‌కు వెళ్లింది. అయితే డబ్బులు రాకపోయినా స్వచ్ఛంద సంస్థకు ప్రచారం ఇచ్చినట్లుగా ఉంటుందని భావించిన పీసీబీ... మాజీ క్రికెటర్ అఫ్రిదికి చెందిన ‘షాహిద్ అఫ్రిది ఫౌండేషన్’ లోగో ముద్రించిన జెర్సీలను ధరించాలని నిర్ణయించింది. కరోనా సమయంలో ఈ ఫౌండేషన్ అనేక సేవాకార్యక్రమాలు నిర్వహించింది. తనను పాక్ బోర్డు ఇలా గౌరవించడం పట్ల అఫ్రిది ఆనందం వ్యక్తం చేశాడు. -
‘విలువ’ పడిపోనుందా!
ముంబై: భారత క్రికెట్ జట్టుకు క్లాతింగ్ పార్ట్నర్గా వ్యవహరిస్తోన్న ప్రఖ్యాత సంస్థ ‘నైకీ’తో ఒప్పందం వచ్చే సెప్టెంబరుతో ముగియనుంది. దాంతో కొత్త స్పాన్సర్ కోసం టెండర్లు పిలవాలని బీసీసీఐ యోచిస్తోంది. తమ బ్రాండ్‌ను ప్రమోట్ చేసుకునే క్రమంలో ఇప్పటి వరకు నైకీ ప్రతీ అంతర్జాతీయ మ్యాచ్‌కు రూ. 88 లక్షల చొప్పున బోర్డుకు చెల్లించింది. ఏడాదికి మరో రూ. 6 కోట్ల మినిమం గ్యారంటీ, 15 శాతం రాయల్టీతో పాటు సుమారు రూ. 10 కోట్ల విలువైన నైకీ ఉత్పత్తులు కూడా అందించింది. ఇదంతా కలిపి నాలుగేళ్లలో 220 మ్యాచ్‌లు జరిగేలా ఒప్పందం కుదిరింది. అయితే కోవిడ్–19 కారణంగా ప్రపంచ మార్కెట్ దెబ్బ తింది. అన్ని రంగాలు సమస్యలు ఎదుర్కొంటుండటంతో ఏ రూపంలోనైనా స్పాన్సర్షిప్ మొత్తం తగ్గుదల కనిపించవచ్చని బీసీసీఐ అంచనా వేసింది. అందుకనుగుణంగా తాజాగా ప్రకటించబోయే రెక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్పీ)లో బేస్ ప్రైస్ విలువను తగ్గించాలని బోర్డు నిర్ణయించినట్లు సమాచారం. ఈ మొత్తం రూ. 61 లక్షలుగా ఉండవచ్చు. గతంతో పోలిస్తే ఇది 31 శాతం తక్కువ కావడం విశేషం. పైగా కంపెనీలు పలు సడలింపులు కోరుతూ షరతులు కూడా పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. -
బోర్డుకు నష్టం లేకుంటేనే...
ప్రపంచం మొత్తం కరోనాతో పోరాడుతుంటే భారత్ ఈ వైరస్‌తోపాటు చైనా కుయుక్తులపై కూడా పోరాడుతోంది. అందులో భాగంగానే ఇటీవల చైనా యాప్‌లపై నిషేధం విధించింది. చైనా వస్తుసేవల్ని కూడా బహిష్కరించాలనే డిమాండ్లు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఈ డిమాండ్ సెగ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి బలంగానే తాకింది. అందుకే ఐపీఎల్ ప్రధాన స్పాన్సర్, చైనా మొబైల్ కంపెనీ ‘వివో’పై బోర్డులో చర్చ నడుస్తోంది. సాక్షి, న్యూఢిల్లీ: ఇప్పుడు భారత క్రికెట్ అభిమానులంతా ఈ ఏడాది ఐపీఎల్ జరగాలని బలంగా కోరుకుంటున్నారు. అదే సమయంలో ‘వివో’ స్పాన్సర్‌షిప్‌ను వద్దంటున్నారు. ఈ చైనా ఫోన్ల కంపెనీ స్పాన్సర్షిప్ లేకపోయినంత మాత్రాన బోర్డుకు వచ్చే పెద్ద నష్టమేమీ లేదు. అలాగని భావోద్వేగాల ఆధారంగా నిర్ణయం తీసుకునే ఆర్థిక వ్యవహారం కాదు. అందుకే బీసీసీఐ ఈ అంశంపై ఆచితూచి స్పందిస్తోంది. ఒప్పందంలోని స్పాన్సర్షిప్ రద్దు నిబంధన బీసీసీఐకి అనుకూలమైతేనే దానిపై నిర్ణయం తీసుకుంటుందని... రద్దు నిబంధన ప్రతికూలంగా ఉంటే స్పాన్సర్‌షిప్‌ను కొనసాగిస్తుందని బోర్డు వర్గాలు తెలిపాయి. పైగా ఇది చైనా ప్రభుత్వానికి లబ్ధి చేకూర్చేదేమీ కాదు. ఇటు బోర్డుకు, అటు పన్నుల రూపేణా భారత ప్రభుత్వానికి కోట్లు తెచ్చిపెట్టే ఆర్థికాంశం. ఈ విషయాన్ని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ ఇదివరకే వివరించారు. ఇది చైనాకిచ్చిన కాంట్రాక్టు కాదని .... మనకు సాలీనా వస్తున్న రూ.440 కోట్ల రాబడి అన్నారు. పాలకమండలి సమావేశమైతేనే... 2020 ఐపీఎల్ సీజన్‌పై తేల్చాలన్నా... ‘వివో’ను వద్దనుకోవాలన్నా... అది మీడియా సమావేశంలో నిర్ణయించే తేలికైన అంశం కాదు. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ (జీసీ) భేటీలోనే తేలు తుంది. అప్పుడే సాధ్యాసాధ్యాలను కూలంకశంగా చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారు. ఇదే విషయాన్ని జీసీ సభ్యులు తెలిపారు. అయితే ఐపీఎల్ జీసీ మీటింగ్ జరగాలంటే టి20 ప్రపంచకప్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఆస్ట్రేలియా ఇప్పటికే ఈ ఏడాది మెగా టోర్నీ నిర్వహణపై నిరాసక్తత వ్యక్తపరిచినా... అది ఐసీసీ ఈవెంట్ కాబట్టి ఐసీసీనే వెల్లడించాలి. మనకు ఇప్పటికే టి20 వరల్డ్‌కప్ సహా, ఆసియా కప్‌పై ఎలాంటి సమాచారం లేదు. అలాంటపుడు దేని కోసం ఐపీఎల్ పాలక మండలి సమావేశమవుతుంది? ఒకవేళ ఆ టోర్నీలు లేకపోతేనే ఐపీఎల్‌పై ఓ నిర్ణయం తీసుకుం టుంది’ అని సీనియర్ బోర్డు అధికారి, జీసీ సభ్యుడు చెప్పారు. ఇక ‘వివో’పై కూడా అప్పుడే చర్చించే వీలుంటుందని, ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే బోర్డుకు పోయేదేమీ లేదనుకుంటే తప్పకుండా పరిశీలిస్తుందన్నారు. కానీ బీసీసీఐనే పరిహారం చెల్లించాల్సిన ప్రతికూలాంశాలుంటే మాత్రం ఒప్పందం గడువు 2022 దాకా వేచి చూడాలన్నారు. ఒక్క ముంబైలోనే ఐపీఎల్! ఈ ఏడాది ఐపీఎల్ జరిగితే ఒక్క నగరానికే పరిమితం చేయాలని కొందరు బీసీసీఐ సీనియర్ అధికారులు జీసీ వర్గాలకు సూచించారు. అది ముంబై అయితేనే సౌకర్యంగా ఉంటుందన్నారు. ముంబైలో మూడు అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాలున్నాయి. వాంఖెడే, బ్రబౌర్న్, డీవై పాటిల్ స్టేడియాలున్నాయి. దీంతోపాటు రిలయెన్స్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్‌కు కూడా ప్రత్యేకించి మైదానం ఉంది. అలాగే స్టార్ హోటళ్లకు కొదవే లేదు. అయితే ఇదేమీ ఇప్పటి సూచన కాదు. మహారాష్ట్రలో వైరస్ సాధారణంగా ఉన్నపుడు చేసిన సూచన... కానీ ఇప్పుడైతే ముంబై పరిస్థితి ఘోరంగా ఉంది. అక్టోబర్‌కల్లా ముంబైలో వైరస్ నియంత్రణలోకి వస్తుందన్న ఆశలుంటేనే ఒకే వేదికపై ఐపీఎల్ నిర్వహించాలన్న సూచనను జీసీ పరిశీలిస్తుంది. -
‘చైనా బంధం’ తెంచుకోవాల్సిందే
న్యూఢిల్లీ: మన దేశం కోసం, ప్రభుత్వానికి మద్దతుగా నిలవడం కోసం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చైనా స్పాన్సర్లతో ఇకపై ఒప్పందాలు చేసుకోరాదని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమాని నెస్ వాడియా అన్నాడు. ఇప్పటికిప్పుడు ఒప్పందాన్ని ఉల్లంఘించడం కష్టం కాబట్టి 2021 నుంచి వాటిని పక్కన పెట్టాలని అతను సూచించాడు. స్వదేశీ కంపెనీలు ఒక్కసారిగా ముందుకు రావడం కష్టమే అయినా... మెల్లమెల్లగా చైనా సంస్థలను పక్కన పెట్టాలని అతను చెప్పాడు. ప్రస్తుతం ఐపీఎల్‌కు చైనా మొబైల్ కంపెనీ ‘వివో’ ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. ‘ఇది ఇండియన్ ప్రీమియర్ లీగే తప్ప చైనా ప్రీమియర్ లీగ్ కాదు. ఎప్పుడైనా మన దేశమే ముందు. ఆ తర్వాత డబ్బు. నా ఉద్దేశం ప్రకారం చైనా కంపెనీలతో బంధం తెంచుకోవాల్సిందే. వారిని పక్కన పెడితే ఆ స్థానంలో స్పాన్సర్షిప్ అందించేందుకు పలు భారత కంపెనీలు ముందుకు వస్తాయని నా నమ్మకం. మన కోసం ప్రాణాలర్పిస్తున్న సైనికులను గౌరవించేందుకు ఇదో అవకాశం. కనీసం వచ్చే ఏడాది నుంచైనా చైనా సంస్థల స్పాన్సర్షిప్ తీసుకోవద్దు. ఇలాంటి సమయంలో దేశం తరఫున నిలవడం మన నైతిక బాధ్యత’ అని నెస్ వాడియా వ్యాఖ్యానించాడు. ఐపీఎల్‌లోని ఇతర ఫ్రాంచైజీలు కూడా దాదాపు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాయి. అయితే ప్రభుత్వం నుంచి ఏదైనా విధానపరమైన నిర్ణయం తీసుకుంటే ఆలోచిస్తామని, అప్పటి వరకు ఇలాంటి విషయంలో వేచి చూడటమే సరైన పద్ధతి అని వారు అభిప్రాయపడ్డారు.