కరాచీ: కరోనా దెబ్బ ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలపై భారీగా పడింది. క్రీడలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. స్పాన్సర్‌షిప్ అందించే విషయంలో కంపెనీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు పరిస్థితి ఇబ్బందికరంగా తయారైంది. ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన ఆ జట్టుకు అండగా నిలిచేందుకు ఎవరూ రాలేదు. సుదీర్ఘ కాలంగా ప్రధాన స్పాన్సర్‌గా ఉన్న ‘పెప్సీ’ ఇటీవలే తప్పుకుంది.
కొత్తగా బిడ్‌లను ఆహ్వానిస్తే ఒకే ఒక కంపెనీ ముందుకొచ్చింది. అయితే ‘పెప్సీ’ ఇచ్చిన మొత్తంలో 30 శాతం మాత్రమే ఇస్తామనడంతో పీసీబీకి షాక్ తగిలింది. ఈ నేపథ్యంలో స్పాన్సర్ లేకుండానే టీమ్ ఇంగ్లండ్‌కు వెళ్లింది. అయితే డబ్బులు రాకపోయినా స్వచ్ఛంద సంస్థకు ప్రచారం ఇచ్చినట్లుగా ఉంటుందని భావించిన పీసీబీ... మాజీ క్రికెటర్ అఫ్రిదికి చెందిన ‘షాహిద్ అఫ్రిది ఫౌండేషన్’ లోగో ముద్రించిన జెర్సీలను ధరించాలని నిర్ణయించింది. కరోనా సమయంలో ఈ ఫౌండేషన్ అనేక సేవాకార్యక్రమాలు నిర్వహించింది. తనను పాక్ బోర్డు ఇలా గౌరవించడం పట్ల అఫ్రిది ఆనందం వ్యక్తం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment