న్యూఢిల్లీ : వచ్చే సెప్టెంబరు నుంచి భారత జాతీయ క్రికెట్ జట్టు సభ్యుల దుస్తులపై కొత్త లోగో రానుంది. ప్రస్తుతం భారత జట్టుకు ప్రధాన స్పాన్సర్‌గా ఉన్న చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ ఒప్పొ తప్పుకోవాలని నిర్ణయించుకుంది. దీని స్థానంలో బెంగళూరు ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఆన్‌లైన్ ట్యుటోరియల్ సంస్థ ‘బైజూస్’... కాంట్రాక్టును చేపట్టనున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.
‘భారత అగ్రగామి విద్యా సంబంధిత యాప్ బైజూస్‌కు స్వాగతం’ అని బోర్డు పేర్కొంది. ఒప్పొ... మరో మొబైల్ సంస్థ వివో (రూ.768 కోట్లు)ను వెనక్కు నెట్టి 2017 మార్చిలో టీమిండియా స్పాన్సర్‌షిప్‌ను ఐదేళ్ల కాల వ్యవధికి రూ.1,079 కోట్లకు దక్కించుకుంది. రెండున్నరేళ్లు పైనే గడువున్నా... ‘చాలా వ్యయ భారంతో కూడిన’, ‘కొనసాగించలేని’ పరిస్థితుల్లో వైదొలగుతున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో టీమిండియా జెర్సీలపై ఒప్పొ లోగోకు ప్రస్తుత వెస్టిండీస్ సిరీసే ఆఖరుది కానుంది. బైజూస్ ఒప్పందం సెప్టెంబరు 5 నుంచి అమల్లోకి వస్తుంది.
భారత్‌లో సెప్టెంబరు 15 నుంచి దక్షిణాఫ్రికా పర్యటన ప్రారంభం కానుంది. మిగతా మొత్తాన్ని భరిస్తూ ఈ సంస్థ 2022 మార్చి 31 వరకు ఒప్పందంలో ఉంటుంది. ఈ మేరకు గురువారం ఒప్పొ, బైజూస్, బీసీసీఐ మధ్య అంగీకారం కుదిరింది. బీసీసీఐకి ఒప్పొ ద్వైపాక్షిక సిరీస్‌ల్లో ఒక్క మ్యాచ్‌కు రూ.4.61 కోట్లు, ఐసీసీ టోర్నీల్లోని మ్యాచ్‌కు రూ.1.56 కోట్లు చెల్లిస్తోంది. దీనికిముందు కాంట్రాక్టులో ఉన్న స్టార్ ఇండియా వరుసగా రూ.1.92 కోట్లు, రూ.61 లక్షలే చెల్లించడం గమనార్హం. ‘మార్పిడి ప్రక్రియపై ఆ రెండు సంస్థలు మాట్లాడుకుని మాకు తెలిపాయి.
ఈ మేరకు బీసీసీఐ నిబంధనలు అనుమతిస్తాయి. దీనిపై క్రికెట్ పాలకుల కమిటీ (సీఓఏ)కి మేం సమాచారం ఇచ్చాం. కొత్త సంస్థ పాతవారు చెల్లించినంత ఇస్తుంది. లావాదేవీల వివరాలు గోప్యం. బీసీసీఐకి నష్టమేం లేదు’ అని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. మరో అధికారి మాత్రం ఈ పరిణామాలతో బీసీసీఐకి అదనంగా 10 శాతం నగదు వచ్చే వీలుందని పేర్కొన్నారు. అయితే, ఇందులోనూ బీసీసీఐ ఆఫీస్ బేరర్లను విశ్వాసంలోకి తీసుకోకుండా సీఓఏ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రపంచ కప్ జరుగుతుండగా జూన్ 7నే సీఓఏ... ఒప్పందం వ్యవహారాన్ని న్యాయ విభాగానికి నివేదించినట్లు సమాచారం. ఈ తీరును బీసీసీఐలోని కొందరు గట్టిగా ప్రశ్నిస్తున్నారు. అసలు మొత్తం ఒప్పందాన్నే రద్దు చేసి కొత్తగా దరఖాస్తులు పిలిస్తే మరింత ఎక్కువ మొత్తం వస్తుందని, తద్వారా ప్రక్రియ పారదర్శకంగా ఉంటుందని వ్యాఖ్యానిస్తున్నారు. ఒప్పందం నుంచి వైదొలగాలంటే... ఆరు నెలల నోటీసు ఇవ్వాలన్న నిబంధన ఏమైందని ప్రస్తావిస్తున్నారు.
ఒప్పొందం నుంచి తప్పుకుంది
Published Fri, Jul 26 2019 4:54 AM | Last Updated on Fri, Jul 26 2019 7:41 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment