మెడికల్ కౌన్సిల్ నిబంధనలు బేఖాతరు
విలాసవంతమైన ఆఫర్లతో వైద్యులను ఆకట్టుకునేందుకు యత్నం
వైద్యుల క్రెడిట్ అవర్స్ సర్టిఫికెట్లూ ఫార్మా ప్రతినిధుల చేతుల్లోనే..
ఫలితంగా మార్కెట్‌లోకి నాసిరకం మందులు.. రోగులపై తీవ్ర ప్రభావం
తెనాలి: వైద్య రంగంలో నూతనంగా వచ్చిన ఆవిష్కరణలు, కొత్త ఔషధాలు, రోగనిర్ధారణలో నవీన విధానాలపై అవగాహన కోసం నిర్వహిస్తున్న సదస్సులు గతి తప్పుతున్నాయి. ఫార్మా కంపెనీల “స్పాన్సర్‌షిప్’లతో వైద్య సదస్సులు వివాదాలకు కేరాఫ్‌గా నిలుస్తున్నాయి. విలాసవంతమైన ఆఫర్లతో వైద్యులను ఆకట్టుకునేందుకు ఆయా కంపెనీలు చేస్తున్న ప్రయత్నాలు.. చివరకు రోగుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి.
విలాసవంతంగా.. వైద్యులపై వల
వైద్యుల సదస్సుల నిర్వహణలో ఫార్మ కంపెనీలు భాగం కాకూడదని నేషనల్ మెడికల్ కౌన్సిల్ నిబంధన ఉంది. అలాగే వైద్యులు, వారి అసోసియేష¯న్‌లతో ఎటువంటి లావాదేవీలు జరపకూడదని స్పష్టం చేసింది. కానీ ఈ నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు. సదస్సులకు వైద్యులు హాజరయ్యేందుకు అవసరమైన విమాన టికెట్ల నుంచీ ఆయా ప్రాంతాల్లో తిరిగేందుకు లగ్జరీ కార్లు, బస చేసేందుకు విలాసవంతమైన హోటళ్లు తదితర సకల సదుపాయాలన్నీ ఫార్మా కంపెనీలే స్పాన్సర్ చేస్తున్నాయి.
వైద్య సదస్సు జరిగే ప్రాంగణమంతటినీ తమ బ్రాండ్లు కనపడేలా పోస్టర్లు, ఫ్లెక్సీలు, కటౌట్లతో నింపేస్తున్నాయి. తమ స్టాల్‌కు విచ్చేసినందుకు ఖరీదైన బహుమతులు, వివిధ ఎంటర్‌టైన్‌మెంట్ ఈవెంట్లతో వైద్యులను తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి.
ఈ క్రమంలో గుంటూరులో కొద్ది నెలల కిందట జరిగిన వైద్యుల సదస్సులో ఫార్మా కంపెనీ ప్రతినిధి ఒకరు వైద్యురాలిపై అనుచితంగా ప్రవర్తించటంతో అతడికి దేహశుద్ధి చేశారు. చెన్నైలో కొద్దిరోజుల కిందట జరిగిన మరో సదస్సు అశ్లీల నృత్యాలకు వేదికైంది. విజ్ఞానం పెంచాల్సిన వైద్య సదస్సులను ఇలా వివాదాలకు కేంద్ర బిందువుగా చేస్తున్నాయి.
‘క్రెడిట్ అవర్స్’పైనా ఫార్మా కంపెనీలదే పెత్తనం
వైద్యవిజ్ఞాన సదస్సులకు హాజరయ్యే వైద్యులకు మెడికల్ కౌన్సిల్.. క్రెడిట్ అవర్స్‌ను కేటాయిస్తుంది. ప్రతి వైద్యుడు వివిధ సదస్సుల్లో పాల్గొని సంవత్సరానికి ఆరు క్రెడిట్ అవర్స్ చొప్పున ఐదేళ్లలో 30 క్రెడిట్ అవర్స్ సంపాదించాల్సి ఉంటుంది. మెడికల్ కౌన్సిల్‌లో తమ వైద్య సర్టిఫికెట్లు రెన్యువల్ చేసుకునేందుకు ఈ క్రెడిట్ అవర్స్ దోహదపడతాయి.
ఈ సదస్సులకు ఆయా రాష్ట్రాల మెడికల్ కౌన్సిల్ సభ్యులు, ప్రతినిధులు హాజరై సదస్సు జరిగే తీరును పరిశీలించాల్సి ఉంటుంది. ప్రతి సర్టిఫికెట్‌పైనా మెడికల్ కౌన్సిల్ సభ్యుల సంతకాలు ఉంటాయి. ఇన్ని నియమ నిబంధనలున్నా పలు ఫార్మా కంపెనీలు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నాయి.
వైద్యుల పేర్ల నమోదు నుంచి సదస్సు తర్వాత ఇచ్చే క్రెడిట్ అవర్స్ సర్టిఫికెట్ల జారీ వరకు.. అన్నింటిలోనూ ఫార్మా కంపెనీలదే పెత్తనం. సదస్సుకు హాజరుకాని వైద్యుల పేర్లను కూడా ఫార్మా కంపెనీల ప్రతినిధులే నమోదు చేసి.. సర్టిఫికెట్లను తీసుకెళ్లి మరీ వైద్యులకు అందజేస్తుంటారు. తమ ఉత్పత్తులను రోగులకు సూచించేలా వైద్యులను ప్రభావితం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.
తగ్గిన మందుల నాణ్యత
ఫార్మా కంపెనీలు, కొందరు వైద్యుల వల్ల రోగులపై మందుల అధికభారం పడుతోంది. అలాగే నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేని మందులు రోగుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. కేంద్ర ఔషధాల ప్రమాణాల నియంత్రణ సంస్థ తాజాగా చేసిన పరీక్షల్లో పారాసిటమాల్ సహా 53 రకాల మందుల్లో నాణ్యత లేదని తేలింది. గత ఆగస్టులో 156 కాంబినేషన్ ఔషధాలు హానికరమంటూ నిషేధం విధించింది.
Comments
Please login to add a commentAdd a comment