ఒకప్పుడు కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఇతర పార్టీల వారిని రమ్మంటే పారిపోయారు. కాని కర్నాటక ఫలితాలు కాంగ్రెస్ జాతకాన్ని మార్చేశాయి. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి క్యూ కడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందేమో అన్న ఆశ వారిని ఆ పార్టీ వైపు నడిపిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా పరిస్థితి అలాగే ఉంది. గతంలో వెళ్ళిపోయినవారు, కొత్తగా కొంతమంది కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు బారులు తీరారు..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటినుంచీ నిన్నా మొన్నటి వరకు కాంగ్రెస్ పరిస్థితి గందరగోళంగా ఉండేది. పార్టీ నుంచి బయటకు వెళ్ళేవారే తప్ప వచ్చేవారే లేరు. కానీ, కర్నాటక ఎన్నికల ఫలితాలు టీకాంగ్రెస్ ఫేట్ మార్చేశాయి. ఇతర పార్టీలకు వెళ్ళివారు వచ్చేస్తామంటున్నారు. ప్రత్యర్థి పార్టీలోని వారు కూడా హస్తానికి జై కొడుతున్నారు. తాజా పరిణామాలు ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్‌కు జీవం పోస్తున్నాయి. గత ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వకపోవడంతో మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ బయటకు వెళ్ళిపోయారు. టిక్కెట్ లభించిన రామారావు పటేల్ ఓడిపోయి తర్వాత బీజేపీలో చేరిపోయారు. అలా ముథోల్ నియోజకవర్గంలో ఇద్దరు నేతలు పార్టీని వీడిపోయారు.
రామారావు పటేల్ వెళ్ళిపోవడంతో బీఆర్‌ఎస్‌లో ఉన్న నారాయణరావు పటేల్‌ను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించగా నిరాకరించారు. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వచ్చేందుకు నారాయణరావు పటేల్ ఆసక్తిగా ఉన్నారట. వయస్సు మీరిపోవడంతో తాను పోటీ చేయకపోయినా తన కుమారుడు అఖిలేష్ పటేల్‌ను ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తానంటే కాంగ్రెస్‌లోకి రావడానికి సిద్ధమంటున్నారట. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గ్రూప్‌తో పాటు హస్తం గూటికి చేరేందుకు రెడీగా ఉన్నారట నారాయణరావు పటేల్. అదేవిధంగా నిర్మల్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు శ్రీహరిరావు కాంగ్రెస్‌లో చేరడానికి సిద్దమవుతున్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మీద తిరుగుబాటు చేసిన శ్రీహరిరావు ఎలాగైనా ఆయన్ను ఓడించాలని కంకణం కట్టుకున్నారు. అందుకే పొంగులేటి వర్గంతో పాటు కారు దిగి చేయి పట్టుకుని నడవాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.
సింగరేణిలో డాక్టర్‌గా పనిచేస్తున్న డాక్టర్ రాజా రమేష్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్నికల బరిలోకి దిగాలనుకుంటున్నారు. చెన్నూరు నుంచి పోటీ చేయాలని భావిస్తున్న ఈ డాక్టర్ కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు ఆసక్తిగా ఉన్నారని అంటున్నారు. అదేవిధంగా ఖానాపూర్, బోథ్ నియోజకవర్గాల నుంచి కూడా కాంగ్రెస్‌లో చేరడానికి భారీగా ముందుకు వస్తున్నట్లు టాక్. ఒకప్పుడు కాంగ్రెస్ అంటే ఆమడ దూరం పారిపోయినవారంతా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీయే దిక్కని వస్తున్నారు. ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గ్రూప్‌తో పాటు వీరంతా ఒకేసారి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది.
కర్నాటక ఫలితాలు తెలంగాణ కాంగ్రెస్‌లో జోష్ నింపింది నిజమే. కానీ ఆ జోష్‌ను ఇక్కడి కాంగ్రెస్ నేతలు ఎంతవరకు నిలుపుకుంటారన్నదే ప్రశ్న. మూడు ముఠాలు, ఆరు గ్రూప్లుగా వర్ధిల్లుతున్న కాంగ్రెస్‌లోకి కొత్తవారు వచ్చి ఇమడగలరా? టిక్కెట్ల విషయంలో పాతవారితో పోటీ పడగలరా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: సునీల్ కనుగోలు రిపోర్టులో ఏముంది?.. టీకాంగ్రెస్ నేతల్లో కొత్త టెన్షన్!
Comments
Please login to add a commentAdd a comment