ముంబై: ఎంతటి కరోనా కాలమైనా సరే... భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇలాంటి స్పందన మాత్రం అస్సలు ఊహించి ఉండదు! భారత క్రికెట్ జట్టుకు ఉన్న పాపులార్టీ, ఆటగాళ్లు గర్వంగా ధరించే టీమ్ జెర్సీ, కిట్‌లను స్పాన్సర్ చేసేందుకు పెద్ద పెద్ద సంస్థలే ‘క్యూ’ కడతాయని భావించిన బోర్డుకు తిరస్కరణ ఎదురైంది. మరో భారీ స్పాన్సర్‌షిప్ వేటలో ప్రతిష్టాత్మక ‘నైకీ’ సంస్థకు ఎలాంటి మినహాయింపులు ఇవ్వడానికి అంగీకరించకుండా బిడ్‌లు కోరిన బోర్డుకు గట్టి దెబ్బ తగిలింది. కిట్ స్పాన్సర్‌షిప్ కోసం పోటీ పడిన నాలుగు సంస్థల్లో ఒక్కరు కూడా ‘ఫైనాన్షియల్ బిడ్’ వేయలేదు.
14 ఏళ్లు భారత కిట్‌ను స్పాన్సర్ చేసిన నైకీతో పాటు అడిడాస్, ప్యూమాలాంటి దిగ్గజ స్పోర్టింగ్ కంపెనీలు, డ్రీమ్ ఎలెవన్‌కే చెందిన ఫ్యాన్ కోడ్ సంస్థ ప్రాధమికంగా ఆసక్తి చూపించి బిడ్‌లు కొనుగోలు చేశాయి. అయితే అసలు సమయానికి వీరంతా వెనక్కి తగ్గడం విశేషం. నిజానికి ఇప్పటి వరకు నైకీ ప్రతీ అంతర్జాతీయ మ్యాచ్‌కు బీసీసీఐ రూ. 85 లక్షల చొప్పున చెల్లిస్తూ వచ్చింది. దీనికి తగ్గించి బేస్ బ్రైస్‌ను రూ. 65 లక్షలకు చేసినా సరే... ఎవరూ ముందుకు రాకపోవడం పరిస్థితిని సూచిస్తోంది. రాబోయే రోజుల్లో బ్రాండింగ్ ప్రమోషన్ విషయంలో బీసీసీఐ తమకు ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో వీరంతా స్పాన్సర్‌షిప్ నుంచి దూరం జరిగినట్లు సమాచారం. నిజానికి ఐపీఎల్ తర్వాత ఏమిటనే విషయంలో బోర్డు వద్దే సరైన ప్రణాళిక కొరవడిన ఫలితమే ఇది.
Comments
Please login to add a commentAdd a comment