ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్ కోసం బీసీసీఐ ప్రధాన (టైటిల్) స్పాన్సర్ వేటలో పడింది. ఆసక్తి ఉన్న సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించింది. అనేక పరిణామాల మధ్య ‘వివో’ అనూహ్యంగా ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్‌నుంచి తప్పుకోవడంతో ఇప్పుడు బోర్డు కొత్త స్పాన్సర్‌ను వెతుక్కోవాల్సి వచ్చింది. ఐపీఎల్–13 సీజన్ పోటీలు సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు యూఏఈలో జరగనుంది. అయితే ఈ డీల్ కాలపరిమితి (ఆగస్టు 18 నుంచి డిసెంబర్ 31) నాలుగున్నర నెలలే! బిడ్లను ఈ నెల 14 వరకు దరఖాస్తు చేయవచ్చు.
ఇతర నిబంధనలు, ఒప్పంద వివరాలు, స్పాన్సర్‌షిప్‌తో చేకూరే ప్రయోజనాలు తదితర అంశా లు తెలుసుకున్న తర్వాత ఆగస్టు 18 వరకు సదరు కంపెనీలు తుది బిడ్లు దాఖలు చేయాల్సి ఉం టుంది. స్పాన్సర్‌షిప్ కోసం బిడ్ వేసే కంపెనీ టర్నోవర్ కనీసం రూ. 300 కోట్లు ఉండాలని బీసీసీఐ నిబంధన విధించింది. ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ కోసం ‘వివో’ ప్రతి ఏడాది రూ. 440 కోట్లు చెల్లించింది. ఇప్పుడు దీంతో పోలిస్తే తక్కువ మొత్తానికి కంపెనీలు ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.
రేసులో పతంజలి...
యోగా గురువు బాబా రామ్‌దేవ్‌కు చెందిన పతంజలి ఆయుర్వేద కంపెనీ కూడా ఐపీఎల్‌కు స్పాన్సర్‌షిప్ అందించేందుకు ఆసక్తి చూపిస్తుండటం విశేషం. తమ ఉత్పత్తులకు ఐపీఎల్ ద్వారా అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుందని ఆ సంస్థ భావిస్తోంది. దీనిని పతంజలి ప్రతినిధులు నిర్ధారించారు. ‘ఐపీఎల్ స్పాన్సర్‌షిప్ అంశం మా పరిశీలనలో ఉంది. మన భారతీయ కంపెనీపై అంతర్జాతీయ స్థాయిలో దృష్టి పడాలనేదే మా కోరిక. అయితే ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు’ అని పతంజలి అధికార ప్రతినిధి ఎస్కే తిజారావాలా చెప్పారు. పతంజలి గ్రూప్ ఏడాది టర్నోవర్ సుమారు రూ. 10 వేల కోట్లుగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment