దుబాయ్: ప్రేక్షకులతో సహా ఆటగాళ్లు ఎప్పుడెప్పుడా అని ఆత్రంగా ఎదురుచూస్తోన్న శుభఘడియ రానే వచ్చింది. క్రికెట్ అభిమానులకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మాంచి కిక్ ఇచ్చే శుభవార్తను అందజేసింది. కరోనా నేప థ్యంలో అసలు జరుగుతుందో లేదో అని అందరిలో ఉత్కంఠను రేకెత్తించిన డ్రీమ్–11 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్–13కు ముహుర్తం ఖరారు అయింది. ఆదివారం ఐపీఎల్ పాలక మండలి లీగ్ షెడ్యూల్‌ను విడుదల చేయడంతో అభిమానుల్లో ఆనందం పరవళ్లు తొక్కింది. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు లీగ్‌ను నిర్వహించనున్నారు.
ఈసారి కూడా ఐపీఎల్ సంప్రదాయాన్ని పాటిస్తూ డిఫెండింగ్ చాంపియన్, గత సీజన్ రన్నరప్‌ల మధ్యే తొలి మ్యాచ్‌ను ఏర్పాటు చేశారు. దీంతో సెప్టెంబర్ 19న అబుదాబి వేదికగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్ల మధ్య జరిగే మ్యాచ్‌తో ఈ సీజన్ ఐపీఎల్‌కు తెరలేవనుంది. లీగ్ కోసం అన్ని జట్లూ దుబాయ్ చేరినప్పటికీ ఇటీవల చెన్నై బృందంలో 13 మంది వైరస్ బారిన పడటంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారిపోయింది. దీన్ని తేలిక చేస్తూ బీసీసీఐ తొలి మ్యాచ్‌ను సీఎస్కేతో జరిగేలా షెడ్యూల్ రూపొందించడంతో అభిమానుల ఆనందం రెట్టింపైంది.
లీగ్ విశేషాలు
► కరోనాతో యూఏఈకి తరలిపోయిన ఐపీఎల్‌కు షార్జా, అబుదాబి, దుబాయ్ నగరాలు ఆతిథ్యమివ్వనున్నాయి.
► అబుదాబి వేదికగా శనివారం తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్, దుబాయ్ వేదికగా ఆదివారం రెండో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తలపడనున్నాయి.
► లీగ్ మూడో రోజు సోమవారం దుబాయ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో సన్‌రైజర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచ్ ఆడనుంది.
► సెప్టెంబర్ 22న షార్జాలో రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్‌ల మధ్య మ్యాచ్ జరుగనుంది.
► లీగ్‌లో పది రోజులు రెండేసి మ్యాచ్‌లు జరుగుతాయి. ఇందులో తొలి మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు, రెండో మ్యాచ్ రాత్రి 7:30 గంటల నుంచి జరుగుతాయి.
► ఓవరాల్‌గా దుబాయ్‌లో 24 మ్యాచ్‌లు, అబుదాబిలో 20 మ్యాచ్‌లు, షార్జాలో 12 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.
► ప్రస్తుతానికి లీగ్ దశ మ్యాచ్‌ల వరకే షెడ్యూల్‌ను ప్రకటించిన బీసీసీఐ.. ప్లే ఆఫ్స్, ఫైనల్ మ్యాచ్ షెడ్యూల్‌ను, వేదికలను తర్వాత ప్రకటించనుంది.
► ఈ సీజన్ లీగ్ 53 రోజుల పాటు జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment