Global Brands Interested In Sponsoring Shreyas Media Events Globally, Details Inside - Sakshi
Sakshi News home page

శ్రేయాస్‌ మీడియా ఇక గ్లోబల్‌

Published Wed, May 4 2022 5:56 AM | Last Updated on Wed, May 4 2022 9:55 AM

Shreyas Media as global here after with sponsorship - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మూవీ ఈవెంట్స్, ప్రమోషన్స్‌లో దేశంలో అగ్ర శ్రేణి సంస్థ శ్రేయాస్‌ మీడియా రూ.30 కోట్ల నిధులను సమీకరిస్తోంది. వ్యూహాత్మక, ప్రముఖ పెట్టుబడిదార్లతో ఈ మేరకు కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. మధ్య ప్రాచ్య, యూఎస్, ఏషియా పసిఫిక్‌తోపాటు దేశవ్యాప్తంగా విస్తరణకు తాజా నిధులను ఉపయోగిస్తామని శ్రేయాస్‌ గ్రూప్‌ ఫౌండర్‌ గండ్ర శ్రీనివాస్‌ రావు మంగళవారమిక్కడ మీడియాకు తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన శ్రేయాస్‌ మీడియా 2011లో ప్రారంభమైంది. దక్షిణాదిన 1,500లకుపైగా ఈవెంట్స్‌ను నిర్వహించింది. వీటిలో 1,000 దాకా సినిమా ప్రచార కార్యక్రమాలు ఉన్నాయి. దుబాయిలోనూ కార్యకలాపాలు ప్రారంభించింది. తెలుగుతో మొదలై దక్షిణాది భాషలకు సేవలను విస్తరించింది.  

గరిష్టంగా 10 కోట్ల మంది.. 
దక్షిణాది సినిమాలతో కలిసి పనిచేసేందుకు దేశ, విదేశీ బ్రాండ్స్‌ సిద్ధంగా ఉన్నాయని శ్రీనివాస్‌ వెల్లడించారు. ‘స్పాన్సర్స్‌కు సినిమాలతో పెద్ద ఎత్తున మైలేజ్‌ వచ్చేలా ఈవెంట్స్‌ చేస్తున్నాం. కార్యక్రమాల్లో సినీ తారలు ఉండడంతో బ్రాండ్స్‌ సులువుగా వీక్షకులకు చేరువ అవుతున్నాయి. ప్రపంచంలోనే ఇది విభిన్న కాన్సెప్ట్‌. నటులు, దర్శకులు, నిర్మాతలకు సామాజిక మాధ్యమాల్లో కోట్లాది మంది అభిమానులున్నారు. సినిమాతో ముడిపడి ఏ కార్యక్రమం చేసినా స్పాన్సర్‌ బ్రాండ్స్‌ కోట్లాది మందికి చేరువ అవుతున్నాయి. ఒక్కో కార్యక్రమాన్ని గరిష్టంగా 10 కోట్ల మందికిపైగా వీక్షిస్తున్నారు. అందుకే విదేశీ బ్రాండ్స్‌ స్పాన్సర్‌షిప్‌కు ముందుకు వస్తున్నాయి. దక్షిణాది సినిమాల గురించి దేశ, విదేశాల్లోనూ మాట్లాడుకుంటున్నారు. ఇది మాకు, బ్రాండ్స్‌కు గొప్ప వ్యాపార అవకాశం‘ అని ఆయన వివరించారు.

కొత్త విభాగాల్లోకి ఎంట్రీ.. 
సినిమా ఆసరాగా కొత్త విభాగాల్లో ప్రవేశిస్తామని శ్రీనివాస్‌ వెల్లడించారు. ‘శ్రేయాస్‌ఈటీ ఓటీటీని పునర్నిర్మిస్తాం. ఇందులో భాగంగా నూతన సాంకేతికతతో ఇంటెరాక్టివ్‌ మూవీస్, మినీ, స్నాక్‌ మూవీస్‌తోపాటు తొలిసారిగా 8డీ మూవీస్‌ పరిచయం చేస్తాం. రెట్రో మూవీస్‌ను పొందుపరుస్తాం. కంపెనీ 2027 నాటికి ఏటా 650 సినిమా కార్యక్రమాలు, 120 మూవీ ప్రమోషన్స్‌ చేపట్టాలని లక్ష్యంగా చేసుకుంది. గ్రూప్‌ టర్నోవర్‌ రూ.700 కోట్లు ఆశిస్తోంది. ఇందులో మూవీ ఈవెంట్స్‌ వాటా రూ.285 కోట్లు ఉంటుందని అంచనా. 2021–22లో రూ.20 కోట్ల టర్నోవర్‌ సాధించాం’ అని చెప్పారు.  
–శ్రేయాస్‌ గ్రూప్‌ ఫౌండర్‌ గండ్ర శ్రీనివాస్‌ రావు  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement