Shreyas Media
-
మహా బ్రాండ్ మేళా!
ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా ఘనంగా ప్రారంభమైంది. 12 ఏళ్లకోసారి వచ్చే ఈ సంరంభానికి భక్తులు పోటెత్తనున్నారు. దీంతో ఈ భారీ కార్యక్రమంలో వ్యాపార అవకాశాలను వెతుక్కుంటున్నాయి కంపెనీలు. ఒకవైపు తమ ఉత్పత్తుల విక్రయాలపై దృష్టి పెడుతూనే మరోవైపు బ్రాండ్‌ని మరింతగా జనాల్లోకి తీసుకెళ్లేందుకు భారీగా కూడా ఖర్చు పెడుతున్నాయి. ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో 45 రోజుల పాటు సాగే మహా కుంభమేళాకు దాదాపు 40 కోట్ల మంది దీనికి హాజరవుతారని అంచనా. ఇందులో రూ. 2 లక్షల కోట్ల పైగా వ్యాపార అవకాశాలు ఉంటాయని స్వయంగా ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. దీనితో ఆ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు బడా బ్రాండ్లు మహా కుంభ మేళాకు క్యూ కట్టాయి. కోట్ల సంఖ్యలో మేళాకి వచ్చే భక్తుల దృష్టిని ఆకర్షించేందుకు పోటీపడుతున్నాయి. ఇందులో భాగంగా డాబర్ ఆమ్లా, వాటికా బ్రాండ్లు మహిళల కోసం చేంజింగ్ రూమ్‌లు ఏర్పాటు చేస్తున్నాయి. పిల్లల సంరక్షణ కోసం డాబర్ లాల్ తేల్ స్పెషల్ బేబీ కేర్ రూమ్‌లను ఏర్పాటు చేస్తున్నాయి. అటు ఆడియో కథల ప్లాట్‌ఫాంకు ఎఫ్ఎం ఈ కార్యక్రమం సందర్భంగా తమ ఓటీటీ యాప్ ‘భక్తి’ని ఆవిష్కరిస్తోంది. ఇందుకోసం టెంట్లు, కియోస్క్ లతో బ్రాండ్‌కి ప్రచారం చేస్తోంది. ఐటీసీ బ్రాండ్ బింగో! .. స్థానిక పాటలపై రీల్స్ చేస్తోంది. మదర్ డెయిరీ సంస్థ పాలు, పాల ఉత్పత్తుల విక్రయానికి 45 కియోస్క్ లు ఏర్పాటు చేస్తోంది. ఇక ఆతిథ్య రంగ సంస్థలు సైతం ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునే పనిలో ఉన్నాయి. ఒనొరా హాస్పిటాలిటీ సంస్థ దాదాపు 175 లగ్జరీ టెంట్లు ఏర్పాటు చేస్తోంది. ఐటీడీసీ కూడా యోగా, మెడిటేషన్, సాంస్కృతిక కార్యక్రమాల్లాంటి ఫీచర్లతో లగ్జరీ టెంట్ల ద్వారా పర్యాటకులను ఆకర్షించే ప్రయత్నాల్లో ఉంది. మహా కుంభమేళాలో క్యాంపా తదితర ఉత్పత్తులను విస్తృతంగా అందుబాటులో ఉంచడంతో పాటు పలు సేవలు కూడా అందిస్తున్నట్లు రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్ (ఆర్సీపీఎల్) తెలిపింది. భక్తులు, పర్యాటకులు సేదతీరేందుకు క్యాంపా ఆశ్రమ్, ఆరామ్ స్థల్ మొదలైనవి ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. హోర్డింగ్‌లకు రూ. పది లక్షలు ... కుంభమేళా సందర్భంగా కార్పొరేట్ కంపెనీలు దాదాపు రూ. 3,000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు అంచనా. కార్యక్రమం ఆసాంతం హోర్డింగ్‌లు లేదా ఫ్లెక్స్ బోర్డ్‌లు కొనసాగించాలంటే రూ. 10 లక్షలు, ఎల్ఈడీ స్క్రీన్లపై 10 సెకన్ల ప్రకటనకు రూ. 5 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం 45 రోజుల పొడవునా ప్రచారం కోసం బ్రాండ్లు కనీసం రూ. 50 లక్షల నుండి రూ. 1 కోటి వరకు వ్యయం చేస్తుందని భావిస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వమే ఈ కార్యక్రమంపై ఏకంగా రూ. 5,000 కోట్లు ఖర్చు పెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా భక్తులు తరలిరానుండటంతో బ్రాండింగ్‌కి ఇది భారీ అవకాశంగా ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. → మహిళల కోసం డాబర్ ఆమ్లా, వాటికా చేంజింగ్ రూమ్స్ → డాబర్ దంత్ స్నాన్ జోన్స్, పిల్లల కోసం డాబర్ లాల్ తేల్ ప్రత్యేక సంరక్షణ గదులు → మదర్ డెయిరీ 45 కియోస్క్ లు → ‘భక్తి’ ఓటీటీ యాప్‌ను ప్రారంభిస్తున్న కుకు ఎఫ్ఎం → ఐటీడీసీ లగ్జరీ టెంట్లు→ మహా కుంభమేళా ప్రకటనల హక్కులను హైదరాబాద్‌కి చెందిన కంపెనీ శ్రేయాస్ మీడియా దక్కించుకుంది.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
మహా కుంభ మేళా ప్రకటనల హక్కులు శ్రేయాస్‌కు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సేల్స్, మార్కెటింగ్ కంపెనీ శ్రేయాస్ మీడియా మహా కుంభ మేళా–2025 ప్రత్యేక ప్రకటనల హక్కులను దక్కించుకుంది. కుంభ మేళా జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగనుంది. ఆధ్యశ్రీ ఇన్ఫోటైన్‌మెంట్‌లో భాగమైన శ్రేయాస్ మీడియా వెండింగ్, అమ్యూజ్మెంట్ జోన్స్, ఫుడ్ కోర్ట్ సహా పలు కార్యకలాపాల హక్కులు సైతం పొందింది. రూ.6,300 కోట్లతో యూపీ ప్రభుత్వం నిర్వహించనున్న ఈ మేళాకు దేశ, విదేశాల నుంచి 50 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా. 4,000 హెక్టార్ల విస్తీర్ణంలో జరిగే ఈ మెగా ఈవెంట్ భారత చరిత్రలో అత్యంత గొప్ప కుంభ మేళా అవుతుందని శ్రేయాస్ మీడియా ఫౌండర్ జి.శ్రీనివాస్ రావు తెలిపారు. ప్రకటనలు, బ్రాండింగ్‌కు కంపెనీలు సుమారు రూ.3,000 కోట్లు వెచి్చంచే అవకాశం ఉందన్నారు. మేళా వేదికగా బ్రాండ్లను కోట్లాది మందికి చేర్చడానికి సంస్థ తనకున్న అపార అనుభవం, అసమాన నైపుణ్యాన్ని ఉపయోగిస్తుందని చెప్పారు. -
సాయి ధరమ్ తేజ్ 'సత్య' ప్రెస్ మీట్ (ఫొటోలు)
-
శ్రేయాస్ మీడియా ఇక గ్లోబల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మూవీ ఈవెంట్స్, ప్రమోషన్స్‌లో దేశంలో అగ్ర శ్రేణి సంస్థ శ్రేయాస్ మీడియా రూ.30 కోట్ల నిధులను సమీకరిస్తోంది. వ్యూహాత్మక, ప్రముఖ పెట్టుబడిదార్లతో ఈ మేరకు కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. మధ్య ప్రాచ్య, యూఎస్, ఏషియా పసిఫిక్‌తోపాటు దేశవ్యాప్తంగా విస్తరణకు తాజా నిధులను ఉపయోగిస్తామని శ్రేయాస్ గ్రూప్ ఫౌండర్ గండ్ర శ్రీనివాస్ రావు మంగళవారమిక్కడ మీడియాకు తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన శ్రేయాస్ మీడియా 2011లో ప్రారంభమైంది. దక్షిణాదిన 1,500లకుపైగా ఈవెంట్స్‌ను నిర్వహించింది. వీటిలో 1,000 దాకా సినిమా ప్రచార కార్యక్రమాలు ఉన్నాయి. దుబాయిలోనూ కార్యకలాపాలు ప్రారంభించింది. తెలుగుతో మొదలై దక్షిణాది భాషలకు సేవలను విస్తరించింది. గరిష్టంగా 10 కోట్ల మంది.. దక్షిణాది సినిమాలతో కలిసి పనిచేసేందుకు దేశ, విదేశీ బ్రాండ్స్ సిద్ధంగా ఉన్నాయని శ్రీనివాస్ వెల్లడించారు. ‘స్పాన్సర్స్‌కు సినిమాలతో పెద్ద ఎత్తున మైలేజ్ వచ్చేలా ఈవెంట్స్ చేస్తున్నాం. కార్యక్రమాల్లో సినీ తారలు ఉండడంతో బ్రాండ్స్ సులువుగా వీక్షకులకు చేరువ అవుతున్నాయి. ప్రపంచంలోనే ఇది విభిన్న కాన్సెప్ట్. నటులు, దర్శకులు, నిర్మాతలకు సామాజిక మాధ్యమాల్లో కోట్లాది మంది అభిమానులున్నారు. సినిమాతో ముడిపడి ఏ కార్యక్రమం చేసినా స్పాన్సర్ బ్రాండ్స్ కోట్లాది మందికి చేరువ అవుతున్నాయి. ఒక్కో కార్యక్రమాన్ని గరిష్టంగా 10 కోట్ల మందికిపైగా వీక్షిస్తున్నారు. అందుకే విదేశీ బ్రాండ్స్ స్పాన్సర్షిప్కు ముందుకు వస్తున్నాయి. దక్షిణాది సినిమాల గురించి దేశ, విదేశాల్లోనూ మాట్లాడుకుంటున్నారు. ఇది మాకు, బ్రాండ్స్‌కు గొప్ప వ్యాపార అవకాశం‘ అని ఆయన వివరించారు. కొత్త విభాగాల్లోకి ఎంట్రీ.. సినిమా ఆసరాగా కొత్త విభాగాల్లో ప్రవేశిస్తామని శ్రీనివాస్ వెల్లడించారు. ‘శ్రేయాస్ఈటీ ఓటీటీని పునర్నిర్మిస్తాం. ఇందులో భాగంగా నూతన సాంకేతికతతో ఇంటెరాక్టివ్ మూవీస్, మినీ, స్నాక్ మూవీస్తోపాటు తొలిసారిగా 8డీ మూవీస్ పరిచయం చేస్తాం. రెట్రో మూవీస్‌ను పొందుపరుస్తాం. కంపెనీ 2027 నాటికి ఏటా 650 సినిమా కార్యక్రమాలు, 120 మూవీ ప్రమోషన్స్ చేపట్టాలని లక్ష్యంగా చేసుకుంది. గ్రూప్ టర్నోవర్ రూ.700 కోట్లు ఆశిస్తోంది. ఇందులో మూవీ ఈవెంట్స్ వాటా రూ.285 కోట్లు ఉంటుందని అంచనా. 2021–22లో రూ.20 కోట్ల టర్నోవర్ సాధించాం’ అని చెప్పారు. –శ్రేయాస్ గ్రూప్ ఫౌండర్ గండ్ర శ్రీనివాస్ రావు -
గ్లోబల్ కంపెనీగా శ్రేయాస్ మీడియా
హైదరాబాద్: మూవీ ఈవెంట్స్, ప్రమోషన్స్ లో దేశంలో అగ్ర శ్రేణి కంపెనీ శ్రేయాస్ మీడియా రూ.30 కోట్ల నిధులను సమీకరిస్తోంది. వ్యూహాత్మక, ప్రముఖ పెట్టుబడిదారులు ఈ నిధులను సమకూరుస్తున్నారు. 2011లో ప్రారంభమైన హైదరాబాద్‌కు చెందిన ఈ కంపెనీ ఇప్పటికే దక్షిణాదిన 1,500లకుపైగా ఈవెంట్స్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. వీటిలో 1,000 దాకా సినిమా ప్రచార కార్యక్రమాలు ఉండడం విశేషం. ఇటీవలే కంపెనీ దుబాయిలో కార్యకలాపాలు ప్రారంభించింది. తెలుగుతో మొదలై దక్షిణాది భాషలకు సేవలను విస్తరించింది. విస్తరణ బాటలో మధ్య ప్రాచ్య, యూఎస్, ఏషియా పసిఫిక్ తోపాటు దేశవ్యాప్తంగా విస్తరణకు ఈ నిధులను వినియోగిస్తామని శ్రేయాస్ గ్రూప్ ఫౌండర్ గండ్ర శ్రీనివాస్ రావు ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. ‘ప్రజలకు సులువుగా చేరువ కావడానికి దక్షిణాది సినిమాలతో కలిసి పనిచేసేందుకు దేశ, విదేశీ బ్రాండ్స్ సిద్ధంగా ఉన్నాయి. స్పాన్సర్స్ కు సినిమాలతో పెద్ద ఎత్తున మైలేజ్ వచ్చేలా ఈవెంట్స్ చేస్తున్నాం. నిర్మాతలకు సినిమా ప్రమోషన్ ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. కార్యక్రమాల్లో సినీ తారలు ఉండడంతో బ్రాండ్స్ సులువుగా వీక్షకులకు చేరువ అవుతున్నాయి. ప్రపంచంలోనే ఇది విభిన్న కాన్సెప్ట్. సినిమా తారలు, నటులు, దర్శకులు, నిర్మాతలకు సామాజిక మాధ్యమాల్లో కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఒక్కో కార్యక్రమం గరిష్టంగా 10 కోట్ల మందికిపైగా ప్రజలు వీక్షిస్తున్నారు. సినిమాతో ముడిపడి ఏ కార్యక్రమం చేసినా స్పాన్సర్ బ్రాండ్స్ కోట్లాది మందికి చేరువ అవుతున్నాయి. అందుకే పెద్ద బ్రాండ్స్ సైతం స్పాన్సర్షిప్కు ముందుకు వస్తున్నాయి. దక్షిణాది సినిమాల గురించి దేశవ్యాప్తంగానే కాదు విదేశాల్లోనూ మాట్లాడుకుంటున్నారు. ఇది మాకు, బ్రాండ్స్‌కు గొప్ప వ్యాపార అవకాశం. మూవీ ఈవెంట్స్, ప్రమోషన్స్ రంగంలో ఏక ఛత్రాధిపత్యం సాగిస్తున్నాం" అని వివరించారు. సినిమా చుట్టూ బ్రాండ్స్.. తెలుగుతోపాటు భారతీయ సినిమాలకు గ్లోబల్ అటెన్షన్ వచ్చింది. సినిమాను ఆసరాగా చేసుకుని కొత్త విభాగాల్లో ప్రవేశిస్తామని శ్రీనివాస్ వెల్లడించారు. ‘ఇందులో భాగంగా శ్రేయాస్ఈటీ ఓటీటీని పునర్నిర్మిస్తాం. కొత్త టెక్నాలజీతో ఇంటెరాక్టివ్ మూవీస్, మినీ, స్నాక్ మూవీస్ తోపాటు తొలిసారిగా 8డీ మూవీస్ పరిచయం చేస్తాం. రెట్రో మూవీస్‌ను పొందుపరుస్తాం. శ్రేయాస్‌కు చెందిన కంటెంట్ ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్లో ఉన్న సౌత్ ప్లస్‌తో 100కుపైగా బ్రాండ్స్, 600లకు పైచిలుకు ఆర్టిస్టులు, ఇన్ఫ్లూయెన్సర్లు చేతులు కలిపారు’ అని ఆయన వివరించారు. వచ్చే మూడేళ్లలో కస్టమర్లకు ఓటీటీ యాప్స్ ఉచితంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రకటనల ఆదాయం ఇందుకు కారణమని చెప్పారు. ఐదేళ్లలో రూ. 700 కోట్లు కంపెనీ 2027 నాటికి ఏటా 650 మూవీ ఈవెంట్స్, 120 మూవీ ప్రమోషన్స్ చేపట్టాలని లక్ష్యంగా చేసుకుంది. గ్రూప్ టర్నోవర్ రూ.700 కోట్లు ఆశిస్తోంది. ఇందులో మూవీ ఈవెంట్స్ వాటా రూ.285 కోట్లు ఉంటుందని అంచనా. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.20 కోట్ల టర్నోవర్ సాధించింది. ఇక లైవ్ ఈవెంట్స్ మార్కెట్ దేశంలో 2019లో రూ.8,300 కోట్లు నమోదు చేసిందని శ్రేయాస్ గ్రూప్ తెలిపింది. ‘మహమ్మారి కారణంగా మార్కెట్ తగ్గినప్పటికీ మూడేళ్లలో ఈ విభాగం కోవిడ్–19 ముందస్తు స్థాయికి చేరుకోనుంది. మీడియా, ఎంటర్టైన్మెంట్ పరిశ్రమ 2030 నాటికి రూ.5.3 లక్షల కోట్లకు చేరుకోనుంది’ అని వివరించింది. చదవండి: కంపెనీల ఐపీవోకి సెబీ గ్రీన్ సిగ్నల్, టార్గెట్ రూ.7వేల కోట్లు! -
అగ్ర దర్శకుడికి బేతాళప్రశ్న!
చిత్రం: ‘రాంగ్ గోపాల్ వర్మ’; తారాగణం: షకలక శంకర్, ప్రభు, కత్తి మహేశ్; కెమెరా: బాబు; కాన్సెప్ట్, మాటలు, పాటలు, నిర్మాత, దర్శకత్వం: జర్నలిస్ట్ ప్రభు; రిలీజ్: డిసెంబర్ 4; ఓ.టి.టి: శ్రేయాస్. నిజజీవిత వ్యక్తుల జీవితాన్నీ, ప్రవర్తననూ ఆధారంగా చేసుకొని, వారి మీద వ్యంగ్య బాణాలు, విమర్శలు సంధిస్తూ సినిమాలు తీయడం ఓ ప్రత్యేకమైన జానర్. మిగిలిన ప్రాంతీయ భాషా సినీ సీమల్లో కన్నా తెలుగులో ఈ కోవ చిత్రాలు కాస్తంత ఎక్కువే! 1980లలోనే పెద్ద ఎన్టీఆర్ తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ‘మండలాధీశుడు’, ‘గండిపేట రహస్యం’ లాంటి వ్యంగ్యాత్మక సినీ ప్రయత్నాలు జరిగాయి. ఈ ఫిక్షనల్ రియాలిటీ చిత్రాలకు పరాకాష్ఠ – ఇటీవల కరోనా కాలంలో హీరో పవన్ కల్యాణ్ పై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన ‘పవర్ స్టార్’. దానికి పోటీగా వర్మపై షకలక శంకర్ హీరోగా వచ్చిన ‘పరాన్నజీవి’. ఈ పర్సనల్ ట్రోలింగ్ సినిమాల మధ్య రచయిత జొన్నవిత్తుల తీస్తానని ప్రకటించిన ‘ఆర్జీవీ’ (రోజూ గిల్లే వాడు) చిత్రం ఇంకా తయారీలో ఉంది. ఇంతలో తాజాగా సీనియర్ సినీ జర్నలిస్టు ప్రభు రూపొందించిన చిత్రం ‘రాంగ్ గోపాల్ వర్మ’. కథేమిటంటే..: పబ్లిసిటీ కోసం, నాలుగు డబ్బుల కోసం రాజ్‌గోపాల్ వర్మ (ఆర్జీవీ) అనే ఓ అగ్ర దర్శకుడు విపరీత ధోరణులకు పాల్పడుతుంటారు. ఆ ధోరణిని అతని అసిస్టెంట్లు (కత్తి మహేశ్ వగైరా) ప్రశ్నిస్తారు. దానికి ఆర్జీవీ తనదైన జవాబిస్తారు. కానీ, చివరకు ఆర్జీవీని అంతరాత్మే నిలదీస్తుంది. దానికి ఆయన రియాక్షన్ తెరపై చూడాలి. సినిమా టైటిల్‌ను బట్టి, టైటిల్ రోల్ నటుడి హావభావాలను బట్టి, అంశాలను బట్టి ఈ సినిమా ఎవరిని ఉద్దేశించి తీసిన ఫిక్షనల్ రియాలిటీయో ఇట్టే అర్థమైపోతుంది. ‘ఎ రైట్ డైరెక్టర్ ఇన్ ది రాంగ్ డైరెక్షన్’ అంటూ టైటిల్‌కు పెట్టిన ట్యాగ్ లైన్‌తోనే సినిమాలో తాను ఏం చెప్పదలుచుకున్నదీ, ఏం చూపించదలుచుకున్నదీ ఈ చిత్రదర్శకుడు తేల్చేశారు. ఎలా తీశారంటే..: ఆర్జీవీని అనుకరించడంలో దిట్ట అయిన షకలక శంకర్ ఆ హావభావాలనూ, డైలాగ్ డెలివరీనీ యథోచితంగా మెప్పించారు. దర్శకుడు ప్రభు సినిమాలో తన నిజజీవిత జర్నలిస్టు పాత్రలో కనిపిస్తారు. మిగిలిన పాత్రధారులు, పరిమిత సాంకేతిక విభాగాల పనితనం అంతే పరిమితం. దర్శక, నిర్మాత దాసరి నారాయణరావు వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన అనుభవం ప్రభుది. ఆయన తన గురువును ఆదర్శంగా తీసుకొని, ఈ 42 నిమిషాల సినిమాకు తానే కాన్సెప్ట్, మాటలు, పాటలు, నిర్మాణ, దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. 32 ఏళ్ళుగా సినీ జర్నలిజమ్‌లో అబ్బిన ప్రశ్నించే లక్షణాన్ని ఈసారి కలంతో కాక కెమేరాతో ఆయన వ్యక్తం చేశారనుకోవాలి. ఆర్జీవీకి వ్యతిరేకంగా ఈ సినిమా తీయడానికి వివిధ మెగా సినీ వర్గాల నుంచి ప్యాకేజీలు అందాయని పుకార్లు వస్తున్న నేపథ్యంలో ఈ ప్రయత్నంపై పరిశ్రమలో ఓ చిన్న ఆసక్తి నెలకొంది. ఆ గాలివార్తలను కొట్టిపారేసిన దర్శకుడు సినీ పరిశ్రమలోని అవాంఛనీయ ధోరణిని ప్రశ్నించడమే ఈ సినిమా లక్ష్యమని తేల్చారు. అదే సమయంలో ఎవరినో కించపరచాలనే ఉద్దేశంతో కాక, ఆవేదనతో ఈ ప్రయత్నం చేసినట్టు సినిమా చివర చెప్పుకొచ్చారు. మొత్తం మీద కొత్త తరహా సినిమా టేకింగ్, ఆలోచనలతో ఒకప్పుడు దేశాన్ని ఊపేసిన ఓ అగ్ర దర్శకుడు ఇప్పుడు బూతు సినిమాలు, ఫిక్షనల్ రియాలిటీ పేరుతో ట్రోలింగ్ సినిమాలు తీసే స్థాయికి దిగజారిపోవడాన్ని ఈ సినిమా చర్చకు పెడుతుంది. ఆత్మవిమర్శతో పంథా మార్చుకుంటే, ఇప్పటికీ ఆస్కార్ అందుకొనే ప్రతిభ ఆ దర్శకుడికి ఉందని అంటుంది. ‘నా జీవితం, నా సినిమా, నా పోర్న్ కాలక్షేపం, నా ఓడ్కా, నా ట్వీట్లు... నా ఇష్టం’ అనే ఆర్జీవీకి ఇలాంటి సద్విమర్శలూ, సలహాలూ కొత్త కావు. కానీ, సెన్సార్ అవసరం లేని ఓటీటీల పుణ్యమా అని ఆర్జీవీతో సహా పలువురు తీస్తున్న కంటెంట్‌ను చూసినప్పుడు చాలామందిలో కలిగిన ఆవేదనకు తెర రూపం – ఈ లేటెస్ట్ సినిమా. అంతమాత్రాన ఈ తాజా సినిమాతో ఆర్జీవీ సహా అసలు ఎవరైనా మారిపోతారనుకోవడమూ అత్యాశే. అయినా సరే, సినీ రంగంలో ఉంటూ కూర్చున్న చెట్టుకే చేటు తెస్తున్నారన్న వాదనతో ప్రభు ఈ చిరుప్రయత్నం చేశారు. దీనిలో సగటు సినిమా లక్షణాలు వెతుక్కోవడం వేస్ట్. పరిమితమైన బడ్జెట్లో, అతి పరిమితమైన వనరులు, సాంకేతిక సౌలభ్యాలతో తీసిన ఈ కొత్త గిల్లుడు సినిమా పే పర్ వ్యూ పద్ధతిలో ఓటీటీ వేదికలో ఎంత మందికి చేరుతుందో చెప్పలేం. ఎంతమందిని ఆకట్టుకుంటుందో కూడా చెప్పలేం. కాకపోతే, గొప్ప సినీ ప్రయత్నం కాకున్నా... ధర్మాగ్రహంతో వేసిన ఓ ఆవేదనాభరిత ప్రశ్నగా ఈ ఇండిపెండెంట్ ఫిల్మ్ మిగిలిపోవచ్చు. కొసమెరుపు: అగ్రదర్శకుడిపై కలం చూపిన కెమేరా ఆగ్రహం. బలాలు: సినీసీమలో అవాంఛనీయ ధోరణిపై ఆగ్రహం వర్మ చుట్టూ ఉన్న వివాదాలు గడచిన ‘గిల్లుడు సినిమా’ల్లోని అంశాల ప్రస్తావన బలహీనతలు: విడిగా కథంటూ ఏమీ లేకపోవడం విమర్శలు, విశ్లేషణలతోనే మొత్తం సినిమా సాగడం పరిమిత బడ్జెట్, పరిమిత టెక్నికల్ సహకారం – రెంటాల జయదేవ -
‘అల వైకుంఠపురంలో’ ఈవెంట్‌పై క్రిమినల్ కేసు
సాక్షి, హైదరాబాద్: అనుమతులకు విరుద్ధంగా గడువు ముగిసిన తరువాత కూడా కార్యక్రమాన్ని నిర్వహించడమే కాకుండా పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చారన్న కారణంగా శ్రేయాస్ మీడియా ఎండీ శ్రీనివాస్‌తో పాటు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మేనేజర్ యగ్నేష్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 6న సాయంత్రం యూసుఫ్ గూడ బెటాలియన్ పోలీస్ గ్రౌండ్స్‌లో ‘అల వైకుంఠపురంలో’ సినిమా మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహించారు. కార్యక్రమానికి సినిమా హీరో, హీరోయిన్లు అల్లు అర్జున్, పూజాహెగ్డేతో పాటు నిర్మాతలు అల్లు అరవింద్, చిన్నబాబు హాజరయ్యారు. కాగా ఇందుకు సంబందించి ఈ నెల 2న హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మేనేజర్ కె.యగ్నేష్ పోలీసుల అనుమతి తీసుకున్నారు. వేడుకలకు దాదాపు 5 నుంచి 6వేల మంది హాజరవుతారని రాత్రి 10 గంటల వరకు కార్యక్రమం ముగుస్తుందని అతను పోలీసులకు ఇచ్చిన లేఖలో పేర్కొన్నాడు. శ్రేయాస్ మీడియా నిర్వహించిన ఈ కార్యక్రమం 11.30 గంటల వరకు కొనసాగింది. గంటన్నర అదనంగా కార్యక్రమాన్ని కొనసాగించడమే కాకుండా పోలీసులకు ఇచ్చిన దరఖాస్తులో ఆరువేల మందికి మాత్రమే పాస్‌లు ఇచ్చామని చెప్పిన నిర్వాహకులు దాదాపు 15వేల మందిని ఆహ్వానించినట్లుగా గుర్తించారు. ఈ కారణంగా వేడుకలో తొక్కిసలాట జరగడమేగాక వేలాదిగా తరలివచ్చిన అభిమానులతో యూసుఫ్‌గూడ రహదారులు కిక్కిరిశాయి. పోలీసులు వీరిని నియంత్రించలేకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కార్యక్రమ నిర్వాహకుల నిర్లక్ష్యం తీవ్ర అసౌకర్యానికి, ఉద్రిక్తతకు దారితీసిందని తొక్కిసలాట జరిగిందని ఇందుకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ జూబ్లీహిల్స్ ఎస్ఐ నవీన్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రేయాస్ మీడియా ఎండీ శ్రీనివాస్‌తో పాటు యగ్నేష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: అల్లు అర్జున్ భావోద్వేగం) -
హైవే థ్రిల్లర్!
రహదారిలో ప్రమాదాలు, ఘోరాలు ఎప్పుడైనా ఊహించని విధంగా జరగొచ్చు. సరిగ్గా ఓ అయిదుగురు వ్యక్తులకు ఓ హైవే మీద ఎదురైన అనుకోని సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘రహదారి’. రాజ్, సేదు, పూజ ముఖ్యతారలుగా శ్రేయాస్ మీడియా పతాకంపై రాజ్ దర్శకత్వంలో జి.శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రచార చిత్రాన్ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘‘ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే హైలైట్. రోడ్ జర్నీ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలోని ప్రతి సన్నివేశం ప్రేక్షకులకు థ్రిల్ కలిగిస్తుంది’’ అని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: కిషోర్ మణి, సంగీతం: రాహుల్ రాజ్. -
ఫామ్‌హౌస్‌లో ప్రణయం
‘‘నాకో మంచి హిట్ రావాలనే ఆశయంతో అందరూ కష్టపడి ఈ సినిమా చేశారు. కొంతమందైతే పారితోషికం కూడా తీసుకోలేదు. అందరూ మనసు పెట్టి సినిమా చేస్తే తెలుగు పరిశ్రమ బాగుంటుంది. లేకపోతే రాబోయే రోజుల్లో పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకమవుతుంది’’ అని శివాజీ చెప్పారు. ఆయన హీరోగా శ్రేయాస్ మీడియా సమర్పణలో స్నేహ మీడియా, హెజెన్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు నిర్మించిన చిత్రం ‘బూచమ్మా బూచోడు’. రేవన్ యాదు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రమేష్ అన్నంరెడ్డి, ప్రసాద్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రం ఆడియో సీడీని మధుర శ్రీధర్ ఆవిష్కరించి మల్టీ డైమన్షన్ వాసుకి ఇచ్చారు. బిగ్ సీడీని మారుతి విడుదల చేశారు. వినోద ప్రధానంగా సాగే హారర్ మూవీ ఇదని, ఈ నెల 18 లేక 24న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. ఓ యువజంట ఫామ్‌హౌస్‌లోకి అడుగుపెట్టాక ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనేదే ఈ చిత్రం ప్రధానాంశం అని దర్శకుడు తెలిపారు. ఇది కొత్త జానర్లో సాగే సినిమా అని చిత్రసంగీతదర్శకుడు శేఖర్ చంద్ర చెప్పారు.