కుంభమేళాలో రూ. 2 లక్షల కోట్ల వ్యాపార అవకాశాలు
కార్పొరేట్ల ఖర్చు రూ. 3,000 కోట్లు...
పది సెకన్ల ప్రకటనలకు రూ. 5 లక్షలు
ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా ఘనంగా ప్రారంభమైంది. 12 ఏళ్లకోసారి వచ్చే ఈ సంరంభానికి భక్తులు పోటెత్తనున్నారు. దీంతో ఈ భారీ కార్యక్రమంలో వ్యాపార అవకాశాలను వెతుక్కుంటున్నాయి కంపెనీలు. ఒకవైపు తమ ఉత్పత్తుల విక్రయాలపై దృష్టి పెడుతూనే మరోవైపు బ్రాండ్‌ని మరింతగా జనాల్లోకి తీసుకెళ్లేందుకు భారీగా కూడా ఖర్చు పెడుతున్నాయి.
ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో 45 రోజుల పాటు సాగే మహా కుంభమేళాకు దాదాపు 40 కోట్ల మంది దీనికి హాజరవుతారని అంచనా. ఇందులో రూ. 2 లక్షల కోట్ల పైగా వ్యాపార అవకాశాలు ఉంటాయని స్వయంగా ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. దీనితో ఆ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు బడా బ్రాండ్లు మహా కుంభ మేళాకు క్యూ కట్టాయి. కోట్ల సంఖ్యలో మేళాకి వచ్చే భక్తుల దృష్టిని ఆకర్షించేందుకు పోటీపడుతున్నాయి.
ఇందులో భాగంగా డాబర్ ఆమ్లా, వాటికా బ్రాండ్లు మహిళల కోసం చేంజింగ్ రూమ్‌లు ఏర్పాటు చేస్తున్నాయి. పిల్లల సంరక్షణ కోసం డాబర్ లాల్ తేల్ స్పెషల్ బేబీ కేర్ రూమ్‌లను ఏర్పాటు చేస్తున్నాయి. అటు ఆడియో కథల ప్లాట్‌ఫాంకు ఎఫ్‌ఎం ఈ కార్యక్రమం సందర్భంగా తమ ఓటీటీ యాప్ ‘భక్తి’ని ఆవిష్కరిస్తోంది. ఇందుకోసం టెంట్లు, కియోస్క్ లతో బ్రాండ్‌కి ప్రచారం చేస్తోంది. ఐటీసీ బ్రాండ్ బింగో! .. స్థానిక పాటలపై రీల్స్ చేస్తోంది.
మదర్ డెయిరీ సంస్థ పాలు, పాల ఉత్పత్తుల విక్రయానికి 45 కియోస్క్ లు ఏర్పాటు చేస్తోంది. ఇక ఆతిథ్య రంగ సంస్థలు సైతం ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునే పనిలో ఉన్నాయి. ఒనొరా హాస్పిటాలిటీ సంస్థ దాదాపు 175 లగ్జరీ టెంట్లు ఏర్పాటు చేస్తోంది. ఐటీడీసీ కూడా యోగా, మెడిటేషన్, సాంస్కృతిక కార్యక్రమాల్లాంటి ఫీచర్లతో లగ్జరీ టెంట్ల ద్వారా పర్యాటకులను ఆకర్షించే ప్రయత్నాల్లో ఉంది. మహా కుంభమేళాలో క్యాంపా తదితర ఉత్పత్తులను విస్తృతంగా అందుబాటులో ఉంచడంతో పాటు పలు సేవలు కూడా అందిస్తున్నట్లు రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్ (ఆర్‌సీపీఎల్) తెలిపింది. భక్తులు, పర్యాటకులు సేదతీరేందుకు క్యాంపా ఆశ్రమ్, ఆరామ్ స్థల్ మొదలైనవి ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.
హోర్డింగ్‌లకు రూ. పది లక్షలు ...
కుంభమేళా సందర్భంగా కార్పొరేట్ కంపెనీలు దాదాపు రూ. 3,000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు అంచనా. కార్యక్రమం ఆసాంతం హోర్డింగ్‌లు లేదా ఫ్లెక్స్ బోర్డ్‌లు కొనసాగించాలంటే రూ. 10 లక్షలు, ఎల్‌ఈడీ స్క్రీన్లపై 10 సెకన్ల ప్రకటనకు రూ. 5 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం 45 రోజుల పొడవునా ప్రచారం కోసం బ్రాండ్లు కనీసం రూ. 50 లక్షల నుండి రూ. 1 కోటి వరకు వ్యయం చేస్తుందని భావిస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వమే ఈ కార్యక్రమంపై ఏకంగా రూ. 5,000 కోట్లు ఖర్చు పెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా భక్తులు తరలిరానుండటంతో బ్రాండింగ్‌కి ఇది భారీ అవకాశంగా ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
→ మహిళల కోసం డాబర్ ఆమ్లా, వాటికా చేంజింగ్ రూమ్స్
→ డాబర్ దంత్ స్నాన్ జోన్స్, పిల్లల కోసం డాబర్ లాల్ తేల్ ప్రత్యేక సంరక్షణ గదులు
→ మదర్ డెయిరీ 45 కియోస్క్ లు
→ ‘భక్తి’ ఓటీటీ యాప్‌ను ప్రారంభిస్తున్న కుకు ఎఫ్‌ఎం
→ ఐటీడీసీ లగ్జరీ టెంట్లు
→ మహా కుంభమేళా ప్రకటనల హక్కులను హైదరాబాద్‌కి చెందిన కంపెనీ శ్రేయాస్ మీడియా దక్కించుకుంది.
– సాక్షి, బిజినెస్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment