hoardings
-
మహా బ్రాండ్ మేళా!
ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా ఘనంగా ప్రారంభమైంది. 12 ఏళ్లకోసారి వచ్చే ఈ సంరంభానికి భక్తులు పోటెత్తనున్నారు. దీంతో ఈ భారీ కార్యక్రమంలో వ్యాపార అవకాశాలను వెతుక్కుంటున్నాయి కంపెనీలు. ఒకవైపు తమ ఉత్పత్తుల విక్రయాలపై దృష్టి పెడుతూనే మరోవైపు బ్రాండ్‌ని మరింతగా జనాల్లోకి తీసుకెళ్లేందుకు భారీగా కూడా ఖర్చు పెడుతున్నాయి. ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో 45 రోజుల పాటు సాగే మహా కుంభమేళాకు దాదాపు 40 కోట్ల మంది దీనికి హాజరవుతారని అంచనా. ఇందులో రూ. 2 లక్షల కోట్ల పైగా వ్యాపార అవకాశాలు ఉంటాయని స్వయంగా ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. దీనితో ఆ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు బడా బ్రాండ్లు మహా కుంభ మేళాకు క్యూ కట్టాయి. కోట్ల సంఖ్యలో మేళాకి వచ్చే భక్తుల దృష్టిని ఆకర్షించేందుకు పోటీపడుతున్నాయి. ఇందులో భాగంగా డాబర్ ఆమ్లా, వాటికా బ్రాండ్లు మహిళల కోసం చేంజింగ్ రూమ్‌లు ఏర్పాటు చేస్తున్నాయి. పిల్లల సంరక్షణ కోసం డాబర్ లాల్ తేల్ స్పెషల్ బేబీ కేర్ రూమ్‌లను ఏర్పాటు చేస్తున్నాయి. అటు ఆడియో కథల ప్లాట్‌ఫాంకు ఎఫ్ఎం ఈ కార్యక్రమం సందర్భంగా తమ ఓటీటీ యాప్ ‘భక్తి’ని ఆవిష్కరిస్తోంది. ఇందుకోసం టెంట్లు, కియోస్క్ లతో బ్రాండ్‌కి ప్రచారం చేస్తోంది. ఐటీసీ బ్రాండ్ బింగో! .. స్థానిక పాటలపై రీల్స్ చేస్తోంది. మదర్ డెయిరీ సంస్థ పాలు, పాల ఉత్పత్తుల విక్రయానికి 45 కియోస్క్ లు ఏర్పాటు చేస్తోంది. ఇక ఆతిథ్య రంగ సంస్థలు సైతం ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునే పనిలో ఉన్నాయి. ఒనొరా హాస్పిటాలిటీ సంస్థ దాదాపు 175 లగ్జరీ టెంట్లు ఏర్పాటు చేస్తోంది. ఐటీడీసీ కూడా యోగా, మెడిటేషన్, సాంస్కృతిక కార్యక్రమాల్లాంటి ఫీచర్లతో లగ్జరీ టెంట్ల ద్వారా పర్యాటకులను ఆకర్షించే ప్రయత్నాల్లో ఉంది. మహా కుంభమేళాలో క్యాంపా తదితర ఉత్పత్తులను విస్తృతంగా అందుబాటులో ఉంచడంతో పాటు పలు సేవలు కూడా అందిస్తున్నట్లు రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్ (ఆర్సీపీఎల్) తెలిపింది. భక్తులు, పర్యాటకులు సేదతీరేందుకు క్యాంపా ఆశ్రమ్, ఆరామ్ స్థల్ మొదలైనవి ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. హోర్డింగ్‌లకు రూ. పది లక్షలు ... కుంభమేళా సందర్భంగా కార్పొరేట్ కంపెనీలు దాదాపు రూ. 3,000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు అంచనా. కార్యక్రమం ఆసాంతం హోర్డింగ్‌లు లేదా ఫ్లెక్స్ బోర్డ్‌లు కొనసాగించాలంటే రూ. 10 లక్షలు, ఎల్ఈడీ స్క్రీన్లపై 10 సెకన్ల ప్రకటనకు రూ. 5 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం 45 రోజుల పొడవునా ప్రచారం కోసం బ్రాండ్లు కనీసం రూ. 50 లక్షల నుండి రూ. 1 కోటి వరకు వ్యయం చేస్తుందని భావిస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వమే ఈ కార్యక్రమంపై ఏకంగా రూ. 5,000 కోట్లు ఖర్చు పెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా భక్తులు తరలిరానుండటంతో బ్రాండింగ్‌కి ఇది భారీ అవకాశంగా ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. → మహిళల కోసం డాబర్ ఆమ్లా, వాటికా చేంజింగ్ రూమ్స్ → డాబర్ దంత్ స్నాన్ జోన్స్, పిల్లల కోసం డాబర్ లాల్ తేల్ ప్రత్యేక సంరక్షణ గదులు → మదర్ డెయిరీ 45 కియోస్క్ లు → ‘భక్తి’ ఓటీటీ యాప్‌ను ప్రారంభిస్తున్న కుకు ఎఫ్ఎం → ఐటీడీసీ లగ్జరీ టెంట్లు→ మహా కుంభమేళా ప్రకటనల హక్కులను హైదరాబాద్‌కి చెందిన కంపెనీ శ్రేయాస్ మీడియా దక్కించుకుంది.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
‘హోర్డింగ్ ప్రమాదాలకు కంపెనీలదే బాధ్యత’
ఇటీవలికాలంలో దేశంలోని పలు నగరాల్లో హోర్డింగ్‌లు కూలిపోయి, ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వీటిని అరికట్టేందుకు, ప్రభుత్వం త్వరలో అవుట్డోర్ అడ్వర్టైజ్మెంట్ పాలసీ-2024ను తీసుకురాబోతోంది. దీని ప్రకారం రోడ్లు లేదా ఇంటి పైకప్పులపై అమర్చిన హోర్డింగ్‌లు పడిపోవడం వల్ల ఎవరైనా చనిపోతే లేదా వికలాంగులైతే ఈ ప్రకటనలు ఏర్పాటుచేసే కంపెనీలు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.ఇదేవిధంగా ఇటువంటి ప్రమాదాల్లో ఆస్తులకు నష్టం జరిగినప్పుడు కూడా అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు పరిహారం చెల్లించాలి. ఈ పరిహారం ఎంత అనేది తర్వాత నిర్ణయిస్తారు. ఇప్పటివరకూ అడ్వర్టైజింగ్ పాలసీలో ప్రమాదాల్లో పరిహారం ఇచ్చే పరిస్థితి లేదు. ఉత్తరప్రదేశ్‌లో తొలిసారిగా ఈ పాలసీని అమలుచేయనున్నారు. పట్టణాభివృద్ధి శాఖ రూపొందించిన ఈ ప్రతిపాదిత విధానానికి ఉన్నత స్థాయిలో అంగీకారం లభించింది. అవసరమైన కొన్ని సవరణలు చేసిన తర్వాత కేబినెట్లోనూ ఆమోదం పొందింది.ప్రతిపాదిత విధానం ప్రకారం ఇళ్లు లేదా పైకప్పులపై హోర్డింగ్‌లు పెట్టే ముందు సంబంధిత మున్సిపల్ కార్పొరేషన్ల నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. పురపాలక సంస్థలు నగరాల్లో ఏర్పాటు చేసిన అన్ని హోర్డింగ్‌లను జియో ట్యాగింగ్ చేసి 90 రోజుల్లోగా పౌర సంస్థల వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. అలాగే చట్టవిరుద్ధమైన ప్రకటనలను ఏర్పాటు చేస్తే భారీ జరిమానా విధించనున్నారు. -
పెరిగిన నితీశ్ ఇమేజ్.. పాట్నాలో ‘టైగర్ జిందాహై’ పోస్టర్లు
పాట్నా: లోక్‌సభ ఎన్నికల్లో జేడీయూ అద్భుత ప్రదర్శన తర్వాత ఆ పార్టీ చీఫ్, బిహార్ సీఎం నితీశ్‌కుమార్ ఇమేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఎన్డీఏ మూడో టర్ము ప్రభుత్వంలో జేడీయూ కీలకంగా మారడం ఆ పార్టీ క్యాడర్‌కు ఉత్సాహాన్నిస్తోంది. ఇందులో భాగంగానే బిహార్ రాజధాని పాట్నాలోని మెయిన్ సెంటర్లో ఆ పార్టీ కార్యకర్తలు టైగర్ జిందాహై అని పెద్ద హోర్డింగ్ పెట్టారు. ఈ పోస్టర్‌పై పులి బొమ్మతో పాటు నితీశ్‌కుమార్ భారీ చిత్రాన్ని ఏర్పాటు చేశారు. ఇదొక్కటే కాకుండా పట్టణంలోని పలు చోట్ల నితీశ్‌ను కీర్తిస్తూ పెద్ద పెద్ద పోస్టర్లు, ఫ్లెక్సీలు పెట్టారు.‘ఫలితాలకు ముందు నితీశ్ ఇమేజ్ ఫలితాల తర్వాత నితీశ్ ఇమేజ్‌కు చాలా వ్యత్యాసం ఉంది. బిహార్ ఓటర్లలో నితీశ్ పాపులారిటీ పెరిగింది’అని జేడీయూ నేత నీరజ్‌కుమార్ చెప్పారు.కాగా, మోదీ మూడో టర్ము ప్రభుత్వంలో జేడీయూ కీలక మంత్రిత్వ శాఖలను ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు బిహార్‌కు ప్రత్యేక హోదా, అగ్నివీర్ స్కీమ్‌లో మార్పుల కోసం జేడీయూ కొత్త సంకీర్ణ ప్రభుత్వాన్ని గట్టిగా అడిగే అవకాశం ఉంది. -
Election Commission: హోర్డింగులు, పోస్టర్లపై ప్రింటర్, పబ్లిషర్ పేర్లు ముద్రించాల్సిందే
న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు నియమ నిబంధనలు కచి్చతంగా పాటించాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. హోర్డింగులు సహా ఎన్నికల ప్రచారంలో ఉపయోగించే ఇతర సామగ్రిపై ప్రింటర్, పబ్లిషనర్ పేర్లు స్పష్టంగా కనిపించేలా ముద్రించాలని ఆదేశించింది. ఎన్నికల ప్రచారంలో జవాబుదారీతనం, పారదర్శకత కోసమే ఈ నిబంధన విధించినట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసిన హోర్డింగులపై ప్రింటర్, పబ్లిషర్ పేర్లు లేవంటూ ఆమ్ ఆద్మీ పార్టీ సహా పలువురు ఇటీవల ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో హోర్డింగుల సహా కరపత్రాలు, పోస్టర్లపై ప్రింటర్, పబ్లిషర్ పేర్లను తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. -
గుర్తుతెలియని ప్రచార హోర్డింగ్‌లపై ఈసీ నిషేధం
సాక్షి,అమరావతి: ఎన్నికల ప్రచార హోర్డింగులపై ప్రింటర్ మరియు పబ్లిషర్ల స్పష్టమైన గుర్తింపును తప్పనిసరి చేస్తూ భారత ఎన్నికల సంఘం అన్ని రాష్ట్రాలను బుధవారం( ఏప్రిల్ 10) ఆదేశించింది. మున్సిపాలిటీల స్థలాల్లో గుర్తింపు లేకుండా ఉన్న హోర్డింగ్‌లపై ఈసీకి ఫిర్యాదులు అందడంతో ప్రధాన ఎన్నికల కమిషన్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 127A, ప్రింటర్ మరియు ప్రచురణకర్త పేరు, చిరునామా లేకుండా ఎన్నికల కరపత్రాలు, పోస్టర్లు, ప్లకార్డులు లేదా బ్యానర్లను ముద్రించడం లేదా ప్రచురించడాన్ని నిస్సందేహంగా నిషేధిస్తున్నట్లు ఈసీ తెలిపింది. పార్టీ, అభ్యర్థి ప్రచారం కోసం ఇచ్చే ప్రకటనలు, వ్యతిరేకంగా ఇచ్చే ఎలాంటి ప్రకటనపై అయినా చిరునామా లేకపోతే నిషేధం వర్తిస్తుంది. అధికారంలో ఉన్న పార్టీ లేదా ప్రభుత్వం ప్రకటనలకు సంబంధించి ప్రభుత్వ ఖజానా ఖర్చుతో విడుదల చేసే రాజకీయ ప్రకటనలను కూడా ఈసీ నిషేధించింది. ఇదీ చదవండి.. రూ.200 కోట్ల హవాలా గుట్టురట్టు -
కోడ్‌కు విరుద్ధమైన రాజకీయ ప్రచారాన్ని అనుమతించొద్దు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థలకు చెందిన వాణిజ్య స్థలాల్లో ఎటువంటి రాజకీయ ప్రకటనలు, హోర్డింగులు, పోస్టర్లు, బ్యానర్లను అనుమతించవద్దని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లాల ఎన్నికల అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం జాతీయ, ప్రధాన రహదారుల పక్కనున్న హోర్డింగులను అన్ని రాజకీయ పార్టీలకు సమాన ప్రాతిపదికన కేటాయించాలని, నూతన హోర్డింగులకు అనుమతులను మాత్రం ఇవ్వద్దని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు తీరును అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో రాష్ట్ర సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్బంగా మీనా మాట్లాడుతూ.. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోనున్న నేపథ్యంలో రాజకీయ ప్రకటనలు, పోస్టర్లు, హోర్డింగులు, బ్యానర్ల ప్రదర్శన విషయంలో జిల్లా ఎన్నికల అధికారులు ఎంతో అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు విరుద్ధంగా ఎటువంటి రాజకీయ ప్రచారాన్ని అనుమతించవద్దని సూచించారు. సరిహద్దుల్లో లిక్కర్ రవాణాను నియంత్రించాలి ప్రైవేటు భవనాలపై వాల్ పెయింట్లకు ఎటువంటి అనుమతిలేదని, ఇప్పటికే ఉన్నవాటిని వెంటనే చెరిపించేయాలని ఆదేశించారు. ప్రభుత్వ అనుమతితో ప్రైవేటు భవనాలపై ఇప్పటికే ఉన్న పెద్ద హోర్డింగులు, కటౌట్ల భద్రతను, నిర్మాణ స్థిరత్వాన్ని పరిశీలించాలని, ఏమాత్రం దృఢత్వం లేకపోయినా ప్రకటనలకు అనుమతించ వద్దన్నారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి లిక్కర్, ఓటర్లను ప్రభావితం చేసే పలు రకాల వస్తువులు అక్రమ రవాణాను నియంత్రించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. ఇందులో భాగంగా సరిహద్దు ప్రాంతాల్లో శాశ్వత ప్రాతిపదికన చెక్ పోస్టులు ఉన్న చోట వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణను పెంచాలని ఆదేశించారు. రాజకీయ పార్టీలు ఉద్యోగులకు, ఓటర్లకు నగదు, బహుమతులు వంటి తాయిలాలు పంపిణీ చేసే అంశాన్ని తీవ్రంగా పరిగణించాలని, అటు వంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలను నియంత్రించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. ఎన్నికల ప్రణాళికలు వెంటనే ఇవ్వాలి సి విజిల్ ఫిర్యాదులను నిర్ణీత సమయంలో నూరు శాతం పరిష్కరించాలని, ఎలక్ట్రానిక్ సీజర్ మేనేజ్మెంట్ వ్యవస్థను పెద్ద ఎత్తున వినియోగించుకునేలా ఎన్ఫోర్స్మెంట్ ఏజన్సీలపై ఒత్తిడి పెంచాలని మీనా అన్నారు. ఇంకా కొన్ని జిల్లాల నుంచి జిల్లా ఎన్నికల నిర్వహణ ప్రణాళికలు అందలేదని, వాటిని వెంటనే తమకు అందజేయాలని ఆదేశించారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేలోపే ఎన్నికల సిబ్బందికి మరోసారి లేదా రెండు సార్లు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించే అంశంపై జిల్లా ఎన్నికల అధికారులు దృష్టి సారించాలన్నారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో పాటు అదనపు సీఈవోలు పి.కోటేశ్వరరావు, ఎమ్.ఎన్.హరేంధిర ప్రసాద్, డిప్యూటీ సీఈవో కె. విశ్వేశ్వరరావు, సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
ఇదంతా నిబంధనాలతోనే..
హైదరాబాద్: జీహెచ్ఎంసీలో అక్రమ హోర్డింగులు, యూనిపోల్స్ తదితర వ్యాపార ప్రకటనలకు సంబంధించిన బోర్డుల తొలగింపు కాగితాల్లో తప్ప కార్యాచరణకు నోచుకోవడం లేదు. గ్రేటర్ నగరంలో రెండువేలకు పైగా ఉన్న ఇలాంటి వాటిని తొలగిస్తామని జీహెచ్ఎంసీ ప్రకటించి నెలలు గడుస్తున్నా పనులు మాత్రం ప్రారంభం కాలేదు. వీటిని తొలగించేందుకు గతంలో సైతం రెండు మూడు పర్యాయాలు టెండర్లు ఆహ్వానించినప్పటికీ కాంట్రాక్టు ఏజెన్సీలు ముందుకు రాకపోవడంతో పనులు జరగలేదు. భవనాల రూఫ్‌టాప్‌లు తదితర ప్రాంతాల్లో ఉన్న హోర్డింగులను యజమానులే తొలగించాల్సిందిగా ఆదేశించింది. అయినా ఎవరూ పట్టించుకోలేదు. అయినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేక, ఇక తామే తొలగించేందుకు యంత్రాంగం సిద్ధమై టెండర్లు పిలిచినా ఏజెన్సీలు ముందుకు రాలేదు. టెండరు నిబంధనల మేరకు హోర్డింగులతో పాటు యూనిపోల్స్, బస్‌షెల్టర్స్,గ్లో సైన్ బోర్డులు, ఇతరత్రా వ్యాపార ప్రకటనలన్నీ తొలగించే బాధ్యత ఏజెన్సీలదే. ఇందుకోసం ఏజెన్సీలకు జీహెచ్ఎంసీ చెల్లించేదేమీ లేదు. జీహెచ్ఎంసీకే అవి చెల్లించాలి. అందుకే ఏజెన్సీలు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. ఇదంతా నిబంధనాలతోనే.. ► హోర్డింగులను తొలగించడంతో వెలువడే ఐరన్, స్క్రాప్ ఏజెన్సీ తీసుకోవాలి. ఇందుకోసం టన్నుకు ఇంత అనే రేటు వంతున జీహెచ్ఎంసీకి చెల్లించాలి. అలా జీహెచ్ఎంసీకి ఎక్కువ రేట్ (హెచ్1) ఇచ్చేందుకు ముందుకొచ్చే ఏజెన్సీలకు హోర్డింగులను తొలగించే టెండరు ఖరారు చేస్తుంది. అంతేకాదు.. క్షేత్రస్థాయిలో ఎన్ని హోర్డింగులున్నాయో, వాటిని తొలగించడం ద్వారా రాగల ఆదాయమెంతో తదితరాలను ఏజెన్సీలే అంచనా వేసుకొని టెండరులో పాల్గొనాలి. తొలగించేందుకు అనువైన పరిస్థితులున్నదీ, లేనిదీ చూసుకోవాలి. అవన్నీ చూసుకొని తొలగించే బాధ్యత ఏజెన్సీలదే. ► తొలగింపు సందర్భంగా ఎదురయ్యే సమస్యలు సైతం ఏజెన్సీలే పరిష్కరించుకోవాలి. జీహెచ్ఎంసీ సహకరించదు. ఇలాంటి నిబంధనలుండటం వల్లే కాంట్రాక్టు ఏజెన్సీలు ముందుకు రావడం లేదని పలువురు భావిస్తున్నారు. దీంతో, జీహెచ్ఎంసీ కాగితాల్లో చూపేందుకు మాత్రమే ఈ టెండర్లు ఆహ్వానిస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హోర్డింగుల తొలగింపు పనులను ఏజెన్సీలకు కాంట్రాక్టుకిచ్చే బదులు జీహెచ్ఎంసీయే చేపడితే పనులు జరగవచ్చని, ఇప్పటికై నా జీహెచ్ఎంసీ ఆ పని చేయాలని, నిబంధనలు మార్చకుండా కేవలం టెండర్లు ఆహ్వానించినంత మాత్రాన ప్రయోజనం ఉండదని పలువురు భావిస్తున్నారు. -
డేంజర్ హోర్డింగ్! ఎప్పుడు కూలునో..?
హైదరాబాద్: గ్రేటర్ నగరంలో ఎప్పుడు గాలి వీస్తే ఏ హోర్డింగు కూలిపోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. సీజన్లతో సంబంధం లేకుండా వర్షాలతో పాటు ఈదురుగాలులు సైతం వీస్తున్నాయి. శిథిల భవనాలపై, సామర్థ్యం లేని పిల్లర్లపై సైతం హోర్డింగులున్నాయి. జీహెచ్ఎంసీ యంత్రాంగం యాడ్ ఏజెన్సీల ఒత్తిళ్ల వల్లనో, దిగువస్థాయి సిబ్బంది ఆమ్యామ్యాల వల్లనో కానీ చూసీ చూడనట్లు వదిలేసింది. ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రం ఎక్కడ లేని హడావుడి చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చిరించి, అనంతరం ఆ విషయం మరచిపోతోంది. దాదాపు ఏడేళ్ల క్రితం జూబ్లీహిల్స్‌లో యూనిపోల్ కూలి పలు కార్లు ధ్వంసమయ్యాయి. అనుమతి లేని హోర్డింగులు, యూనిపోల్స్‌ను తొలగించడంతో పాటు.. అనుమతి పొందినవైనా సరే కూలితే వాటిని ఏర్పాటు చేసిన ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటనలు జారీ చేసింది. నగరంలో గంటకు 100–150 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచిన ఘటనలు కూడా ఉన్నాయి. ఈదురు గాలులకు పెద్ద చెట్లే నేలకూలుతున్నాయి. ఇటీవలే హిమాయత్‌నగర్‌లో చెట్టు కూలి ఆటోపై పడటంతో డ్రైవర్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అంతకంటే ప్రమాదకరంగా ఉన్న, అక్రమంగా వెలసిన హోర్డింగులు మాత్రం నగరంలో కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. చర్యలకు సిద్ధం గ్రేటర్ నగరంలో అక్రమంగా వెలసిన హోర్డింగులతో పాటు ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం కోసం అక్రమంగా ఏర్పాటు చేసిన యూనిపోల్స్, బస్షెల్టర్లు, గ్లో సైన్‌బోర్డులు, లాలీపాప్స్, ఆర్చీలు తదితర ప్రాంతాల్లో ప్రకటనలున్న నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చి వేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈమేరకు టెండర్లు కూడా ఆహ్వానించినట్లు పేర్కొన్నారు. అక్రమంగా ఏర్పాటైన వాటినన్నింటినీ త్వరలోనే తొలగించనున్నట్లు పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ జోన్ల వారీగా ఈ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందుకుగాను జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లకు చెల్లించేదేమీ ఉండదు. వాటిని తొలగించే కాంట్రాక్టర్లే సదరు ఇనుప సామగ్రిని తీసుకుంటాయని, జీహెచ్ఎంసీకే అవి నిర్ణీత ధరను చెల్లించాల్సి ఉంటుందని, ఎవరు ఎక్కువ ధర చెల్లిస్తే వారికి కాంట్రాక్టు పనులు అప్పగించనున్నట్లు తెలిపారు. కాంట్రాక్టర్లు వాటిని స్క్రాప్‌గా విక్రయించుకోవడం ద్వారా వారికి లాభముంటుందన్నారు. -
అమిత్ షా పర్యటన వేళ పోస్టర్ల కలకలం..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ‘ఈడీ’ వేడి రాజేసింది. అధికార బీఆర్ఎస్, బీజేపీ మధ్య నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తగ్గేదేలే అన్నట్టుగా రెండు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. హైదరాబాద్ పర్యటన వేళ పోస్టర్ల కలకలం చోటుచేసుకుంది. నగరంలో గుర్తు తెలియని వ్యక్తులు హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు. హోర్డింగ్‌లో వాషింగ్ పౌడర్ నిర్మా.. వెల్కమ్ టూ అమిత్ షా అంటూ రాసుకొచ్చారు. అలాగే, బీజేపీ నేతలు హిమంత బిశ్వశర్మ, నారాయణ రాణే, సువేందు అధికారి, సుజనా చౌదరి, జ్యోతిరాధియ సింధియా సహా పలువురు నేతల ఫొటోలు పెట్టారు. ఎంత అవినీతికి పాల్పడినా బీజేపీలో చేరితే మరకలు పోతాయనే అర్థం వచ్చేలా హోర్డింగ్స్ పెట్టారు. ఇదిలా ఉండగా.. ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో ఎమ్మెల్సీ కవితను శనివారం ఈడీ విచారించిన విషయం తెలిసిందే. కాగా, ఈడీ విచారణ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వినూత్నంగా పోస్టర్లతో నిరసనలు తెలిపారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో పలు చోట్ల బీజేపీ నేతలకు సంబంధించిన పోస్టర్లు అంటించారు. -
యూపీలో 'బై బై మోదీ' హోర్డింగ్.. అది టీఆర్ఎస్ మద్దతుదారుల పనేనా?
లక్నో: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన క్రమంలో 'చాలు మోదీ, చంపకు మోదీ' అంటూ పలు చోట్ల బ్యానర్లు, హోర్డింగ్‌లు వెలిసిన సంగతి తెలిసిందే. అయితే.. బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తర్‌ప్రదేశ్‌లో మోదీకి వ్యతిరేకంగా హోర్డింగ్ ఏర్పాటు చేయటం కలకలం రేపింది. యూపీ ప్రయాగ్ రాజ్ నగరం, బెలి రోడ్‌లోని రిజర్వ్ పోలీస్ లైన్‌కు సమీపంలో శనివారం 'బై బై మోదీ' అంటూ హోర్డింగ్ ఏర్పాటు చేశారు. రంగంలోకి దిగిన కోలోనెల్‌గంజ్ పోలీసులు ప్రింటింగ్ ప్రెస్ ఓనర్, కార్యక్రమ నిర్వహకుడు సహా మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) మద్దతుదారు అది ఏర్పాటు చేసినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. అరెస్టయిన వారిలో ప్రింటింగ్ ప్రెస్ ఓనర్ అభేయ్ కుమార్ సింగ్, కార్యక్రమ నిర్వహకుడు అనికేత్ కేసరి, కాంట్రాక్టర్ రాజేశ్ కేసర్వాని, కార్మికులు శివ, నంక అలియాస్ ధర్మేంద్రలుగా గుర్తించారు. కోలేనెల్‌గంజ్ డిప్యూటీ ఎస్పీ అజీత్ సింగ్ చౌహాన్ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ' ప్రధాని మోదీపై వివాదాస్పద హోర్డింగ్ ఏర్పాటు చేసిన ఐదుగురిని సీసీటీవీ దృశ్యాల ఆధారంగా అరెస్ట్ చేశాం. తెలంగాణలోని సికింద్రబాద్‌కు చెందిన వ్యక్తి, టీఆర్ఎస్ మద్దతుదారు ఆధ్వర్యంలో ఈ హోర్డింగ్ ఏర్పాటు చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. జులై 8-9 తేదీల మధ్య రాత్రి బెలి రోడ్డులో దీనిని ఏర్పాటు చేశారు. ఐపీసీలోని 153బీ, 505(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం.' అని తెలిపారు. ఈ వివాదాస్పద హోర్డింగ్ ఏర్పాటు చేసేందుకు కాంట్రాక్ట్ ఇచ్చిన వ్యక్తిని సాయిగా గుర్తించినట్లు చెప్పారు డిప్యూటీ ఎస్పీ అజిత్ సింగ్. అతడు సికింద్రాబాద్‌కు చెందిన వ్యక్తి, టీఆర్ఎస్ మద్దతుదారు అని తెలిపారు. సాయి కోసం గాలిస్తున్నామని వెల్లడించారు. జులై 7న తెలంగాణలోని సికింద్రాబాద్‌లో సైతం ఇలాంటి పోస్టర్లే వెలిచాయని, సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారయన్నారు. టీఆర్ఎస్ మద్దతుదారు సాయి.. ప్రయాగ్‌రాజ్‌లోని కాంట్రాక్టర్‌కు ఫోన్ చేసి హోర్డింగ్‌లు ఏర్పాటు చేసే ప్రాంతాలపై ఆరా తీసినట్లు విచారణలో తేలిందన్నారు అజిత్ సింగ్. ఆయా ప్రాంతాల వివరాలు ఆర్గనైజర్ పంపించగా.. బెలి రోడ్డులో ఏర్పాటు చేయాలని, అందుకు రూ.10వేలు సైతం ఇచ్చినట్లు గుర్తించామన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సాయి డైహార్డ్ ఫ్యాన్‌గా చెప్పుకొచ్చారు. ఇదీ చూడండి: టోల్గేట్ వద్ద 'ది గ్రేట్ ఖలీ' హల్చల్.. సిబ్బందిపై పంచ్‌లు! -
పెట్రోల్, డిజీల్ ధరలు రూ. 12 పెరిగే ఛాన్స్..! బంకులకు క్యూ కట్టిన జనాలు..!
రష్యా-ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో క్రూడాయిన్ ధరలు సరికొత్త రికార్డులు నమోదుచేసింది. దీంతో అంతర్జాతీయంగా పెట్రోల్, డిజీల్ ధరలు గణనీయంగా పెరిగాయి. భారత్‌లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో ఇంధన ధరల పెంపుపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో పెట్రోల్, డిజీల్ ధరలు స్థిరంగానే కొనసాగాయి. కాగా ఎన్నికల ఫలితాలు వచ్చిన మరు క్షణమే ఇంధన ధరలు భారీగా పెరుగుతాయనే వార్తలు రావడంతో ప్రజలు తమ వాహనాల్లో ఫుల్ ట్యాంక్ చేసుకున్నారు. మార్చి నెల తొలి పదేహేను రోజుల్లో రికార్డు స్థాయిలో పెట్రోల్, డిజీల్ను ప్రజలు తమ వాహనాల్లో నింపుకున్నారు. కొత్త రికార్డులు..! ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత ఇంధన ధరల పెంపు ఉంటుందనే భయం ప్రజల్లో కన్పించింది. దీంతో మార్చి మొదటి రెండు వారాల్లో జనాలు భారీగా ఇంధనాన్నినిల్వ చేసుకున్నారు. బ్లూమ్‌బెర్గ్ లెక్కల ప్రకారం..మార్చి 1 నుంచి 15 మధ్యకాలంలో భారత్‌కు చెందిన మూడు అతిపెద్ద రిటైలర్ల డీజిల్ విక్రయాలు ఇదే కాలంతో పోలిస్తే 33 శాతం ఎక్కువగా 3.53 మిలియన్ టన్నులుగా ఉన్నాయని పేర్కొంది. ఇక పెట్రోల్ మార్చి 1 నుంచి 15 మధ్య కాలంలో 1.23 మిలియన్ టన్నులతో పెట్రోలు విక్రయాలు జరిగాయి. ఈ అమ్మకాలు గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే దాదాపు 18 శాతం ఎక్కువ. 2019 కాలంతో పోలిస్తే 24.4 శాతం అధికం. ఎన్నికల నేపథ్యంలో ఇంధన ధరలు సుమారు 132 రోజుల పాటు స్థిరంగా ఉన్నాయి. ఇక ఎల్పీజీ గ్యాస్ అమ్మకాలు అమ్మకాలు 17 శాతం పెరిగాయి. రూ. 12 కు పెరిగే ఛాన్స్..! రష్యా ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో బ్యారెల్ క్రూడాయిల్ ధరలు సుమారు 80 డాలర్ల నుంచి 130 డాలర్లకు చేరకుంది.ఎన్నికలు ముగిసిన తర్వాత ఇంధన రిటైలర్లు ధరలను సర్దుబాటు చేసే అవకాశం ఉన్నట్లు ఊహగానాలు వచ్చాయి. ఫలితాల తరువాత ఇంధన ధరలు ఏకంగా రూ. 12 పెరిగే ఛాన్స్ ఉందంటూ వార్తలు ఊపందుకున్నాయి. కానీ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత కూడా పెట్రోల్, డిజీల్ రేట్లు మారలేదు.కాగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఎన్నికల ఆఫర్ త్వరలోనే ముగియనుంది వెంటనే మీ వాహనాల ట్యాంకులను ఫుల్ చేసుకోండి అంటూ ప్రజలకు హితవు పలికారు. నష్టాల్ని పూడ్చుకోవాల్సిందే పెట్రోల్, డిజీల్ అమ్మకాలు పెరగడానికి ఇంధన హోర్డింగ్ దోహదపడిందని హర్దీప్ సింగ్ పురి పార్లమెంట్లో తెలియజేశారు. ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ప్రకారం, అంతర్జాతీయ ఇంధన ధరలు పెరిగిన తర్వాత నష్టాలను పూడ్చుకోవడానికి, అతిపెద్ద ఇంధన రిటైలర్ సంస్థలు భారీగా పెంచాల్సిన అవసరం ఉంది. ఇంధన ధరలు పెంపుకు రిటైలర్లు తగిన చర్యలు తీసుకుంటారని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ చెప్పారు. చదవండి: భారీ షాక్..! రూ. 17 వేలకు పైగా పెంచేసిన చమురు సంస్థలు..! టికెట్ ధరలకు రెక్కలే..! -
‘హోర్డింగ్స్‌లా గోవా ప్రజల మార్పును తొలగించలేరు’
పనాజీ: గోవాలో తృణమూళ్ కాంగ్రెస్ పార్టీ హోర్డింగ్‌లు తొలగింపుపై టీఎంసీ సీనియర్ నేత ఫిర్హాద్ హకీమ్ బీజేపీపై మండిపడ్డారు. గోవాలో కేంద్ర హోమంత్రి అమిత్ షా పర్యటించనున్న నేపథ్యంలో స్థానిక నేతలు టీఎంసీ హోర్డింగ్‌లను తొలగించారు. దీనిపై ఫిర్హాద్ హకీమ్ స్పందిస్తూ.. కావాలనే తమ పార్టీ హోర్డింగ్‌లను బీజేపీ నేతలు తొలగించాని దుయ్యబట్టారు. గోవా ప్రజలు పశ్చిమ బెంగాల్లో టీఎంసీ సాధించిన భారీ విజయాన్ని గోవాలో కూడా సృష్టిస్తారని అన్నారు. టీఎంసీ హోర్డింగ్‌లు తొలగించినంత మాత్రనా గోవా ప్రజలు కోరుకునే మార్పును మార్చలేరని ట్విటర్లో తెలిపారు. టీఎంసీ హోర్డింగ్‌లను తొలగించే ఓ వీడియోను ట్విటర్లో షేర్చేశారు. కేంద్ర మంత్రి అమిత్ షా.. గోవాలోని ధర్బందోరాలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేయనున్నారు. కర్తిలోని తాత్కాలిక ప్రాంగణంలో ఎన్‌ఎఫ్‌ఎస్‌యూను ప్రారంభిస్తారు. అనంతరం తెలిగావ్‌లో బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. The people of #Goa will recreate the historic victory of #Bengal. The fire of change has been ignited and cannot be doused by removing hoardings! #ShameOnBJP #GoenchiNaviSakal https://t.co/BO8KqrZnXG — FIRHAD HAKIM (@FirhadHakim) October 13, 2021 -
యూపీ ప్రభుత్వానికి సుప్రీంలో ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ : ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో నిందితులుగా ఉన్నవారి పేరిట ఏర్పాటు చేసిన పోస్టర్లను తొలగించాలని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. వివరాల్లోకి వెళితే.. పోలీసులు యూపీలో సీఏఏకు వ్యతిరేకంగా జరిగిన అల్లర్లలో పాల్గొన్న వారి వివరాలతో కూడిన పోస్టర్లను ఏర్పాటు చేశారు. దీనిపై అలహాబాద్ హైకోర్టు స్పందిస్తూ.. నిందితుల పేరిట పోస్టర్లు ఏర్పాటు చేయడాన్ని తప్పుబట్టింది. పోలీసులు అనవసరంగా వారి గోపత్యకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని పేర్కొంది. ఆ పోస్టర్లను తొలగించాల్సిందిగా యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే హైకోర్టు తీర్పుపై యూపీ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. గురువారం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. అలహాబాద్ కోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. దీనిపై తదుపరి విచారణ ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం చేపడుతుందని వెల్లడించింది. -
యోగి సర్కార్‌కు హైకోర్టు షాక్
న్యూఢిల్లీ : ఉత్తర్ ప్రదేశ్‌లో యోగి ఆదిత్యానాథ్ సర్కార్‌కు అలహాబాద్ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సీఏఏకు వ్యతిరేకంగా హింసాత్మక నిరసనలకు పాల్పడిన వారి ఫోటోలు, చిరునామాలతో కూడిన షేమ్ హోర్డింగ్‌లను తొలగించాలని యూపీ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. మార్చి 16లోగా హైకోర్టు రిజిస్ర్టార్ జనరల్‌కు ఈ వ్యవహారంపై నివేదిక సమర్పించాలని జిల్లా మేజిస్ర్టేట్, పోలీస్ కమిషనర్లను కోర్టు ఆదేశించింది. సీఏఏకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో హింసకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొన్న వారి ఫోటోలు, చిరునామాలతో యూపీ ప్రభుత్వం గత వారం లక్నోలోని పలు ప్రాంతాల్లో ఆరు హోర్డింగ్‌లను ఏర్పాటు చేయడం వివాదాస్పదమైంది. డిసెంబర్లో జరిగిన సీఏఏ వ్యతిరేక అల్లర్లలో ప్రమేయం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న 53 మంది ఫోటోలు, వారి వివరాలతో ఈ హోర్డింగ్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. షియా గురువు మౌలానా సైఫ్ అబ్బాస్, మాజీ ఐపీఎస్ అధికారి ఎస్ఆర్ దారాపురి, కాంగ్రెస్ నేత సదాఫ్ జాఫర్ వంటి పలువురి వివరాలను ఈ హోర్డింగ్‌ల్లో పొందుపరిచారు. ఆస్తులను ధ్వంసం చేసిన వీరంతా పరిహారం చెల్లించాలని లేకుంటే వారి ఆస్తులను అటాచ్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. నిందితులకు ఈ మేరకు ఆస్తుల అటాచ్‌కు సంబంధించిన నోటీసులు పంపింది. ఈ వ్యవహారంపై సుమోటోగా స్పందించిన హైకోర్టు నిరసనకారుల ఫోటోలను ప్రదర్శించడం అన్యాయమని పేర్కొంది. ప్రభుత్వ చర్య పౌరుల గోప్యత హక్కులో జోక్యం చేసుకోవడమేనని కోర్టు వ్యాఖ్యానించింది. చదవండి : ‘షేమ్’ హోర్డింగ్స్‌పై స్పందించిన కోర్టు -
ప్రచార హోరు.. పన్ను కట్టరు!
స్థానిక సంస్థలు ఆర్థికంగా బలంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. అందువల్లే పాలక వర్గాలు నిరంతరం ఆదాయ మార్గాలకోసం అన్వేషిస్తుంటాయి. మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో అయితే అక్కడున్న హోర్డింగ్‌లు, సైన్‌బోర్డులు తదితరాలపై ప్రచార పన్ను పేరుతో ప్రతి నెలా రూ.లక్షల్లో వసూలు చేస్తుంటారు. కానీ అనంతపురం నగరపాలక సంస్థ గత పాలకవర్గం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించింది. పన్నుల రూపంలో ఖజానాకు చేరాల్సిన డబ్బుకు కన్నం వేసింది. అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించాల్సిన డబ్బును తమ అనుయాయులకు దోచిపెట్టింది. ఫలితంగా అనుకున్న మేర అభివృద్ధి జరగక నగరవాసులు అల్లాడిపోయారు. సాక్షి, అనంతపురం: నగరంలో ఎక్కడ చూసినా భారీ హోర్డింగ్‌లు, బోర్డులు కనిపిస్తుంటాయి. వాటిపై అడ్వర్టైజ్మెంట్లు కళకళలాడుతుంటాయి. కానీ నగరపాలక సంస్థకు చెందాల్సిన ప్రచార పన్ను అందకపోగా ఖజానా వెలవెలబోతుంటుంది. టీడీపీ హయాంలో ఐదేళ్లూ ప్రచార పన్నుకు భారీగా కన్నం వేసినట్లు తెలుస్తోంది. యాడ్ ఏజెన్సీ నిర్వాహకులకు అధికారులు, అప్పటి పాలక వర్గంలోని నేతలు సహకరించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఏటా జనాభాకు అనుగుణంగా పన్ను పెంచాల్సి ఉన్నా.. గత పాలక వర్గం ఐదేళ్లూ ఎలాంటి మార్పు చేయకపోవడంతో నగరపాలక సంస్థ ఖజానాకు చేరాల్సిన రూ.లక్షల ఆదాయం ఇతరుల జేబుల్లోకి వెళ్లిపోయింది. పేరుకే గెజిట్.. వసూళ్లు నామమాత్రం నగరపాలక సంస్థ పరిధిలో ప్రకటనల బోర్డులపై ఏటా లైసెన్స్డ్ యాడ్ ఏజెన్సీ నిర్వాహకులు పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. టీడీపీ హయాంలో నగరపాలక సంస్థ పాలకవర్గం ఏర్పడిన ఐదు నెలల తర్వాత ప్రచార పన్ను చెల్లింపునకు గెజిట్ తయారు చేసి, కౌన్సిల్ అనుమతులు తీసుకున్నారు. ఈ క్రమంలో ఒక చదరపు మీటరు వైశాల్యం గల స్థలంలో దీపాలు అమర్చకుండా ఏర్పాటు చేసే ప్రకటనకు రూ.500, ఒక చదరానికి మించితే రూ.800, ఇలా ప్రతి అదనపు 2.50 చదరపు మీటరుకు రూ.800 చొప్పున వసూలు చేయాలని నిర్ణయించారు. అలాగే 5 చదరపు మీటర్లకు రూ.2,800 వసూలు చేయాలని గెజిట్‌లో పొందుపరిచారు. ఇక 5 చదరపు మీటర్ల స్థలంలో దీపాలు అమర్చిన వాహనాలపై బోర్డులు ఏర్పాటు చేసి ప్రచారం చేస్తే బోర్డుకు రూ.5 వేలు, 0.50 చదరపు మీటర్ల స్థలంలో తెరపైన ల్యాండర్న్ స్లైడ్స్ ప్రకటనలకు(పబ్లిక్ప్లేస్) రూ.2 వేలు, 0.50 చదరపు మీటర్ల నుంచి 2.50 చదరపు మీటర్లకు రూ.3 వేలు చెల్లించాల్సి ఉంటుంది. సినిమా హాల్లో స్లైడ్స్‌కు(కలర్, కలర్ లేనివి) రూ.1,300, షార్డు(ట్రైలర్ ఫిలిం సహా 150మీ) రూ.4,000, షార్టు ట్రైలర్ ఫిలిం 150 మీటర్ల నుంచి 300 వరకు రూ.9 వేలు చెల్లించాలని గెజిట్‌లో పేర్కొన్నారు. కానీ పన్ను వసూళ్లపై కనీస దృష్టి సారించలేదు. వేల పాట రద్దు చేసి మరీ.. నిబంధనల ప్రకారం మున్సిపాలిటీల్లో ప్రచారానికి హోర్డింగ్‌లు, బోర్డుల ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తిగల వారిని ఆహా్వనించి వేలంపాట నిర్వహిస్తారు. కానీ టీడీపీ హయాంలో అప్పటి ప్రజాప్రతినిధులు తమ అనుయాయులకు లబ్ధి చేకూర్చేందుకు వేలంపాటను పూర్తిగా రద్దు చేశారు. అనధికార హోర్డింగ్‌లే ఎక్కువ నగరంలో 20 యాడ్ ఏజెన్సీలుండగా ఆయా ఏజెన్సీల పరిధిలో 258 బోర్డులు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేసినట్లు రికార్డుల్లో నమోదు చేశారు. అనధికారికంగా మరో 10 ఏజెన్సీలు నగరంలో ఎలాంటి అనుమతులు లేకుండానే హోర్డింగ్‌లు, ఫ్లెక్సీ బోర్డులను ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇవి కాకుండా మరో 250 హోర్డింగ్‌లు అనధికారికంగా వేసినట్లు తెలుస్తోంది. దీని ద్వారా రూ.లక్షల్లో నగరపాలక సంస్థ ఆదాయానికి గండి పడుతోంది. ప్రస్తుతం నగరపాలక సంస్థలో కొన్ని యాడ్ ఏజెన్సీల నిర్వాహకులు టౌన్ ప్లానింగ్ అధికారులతో కుమ్మక్కయ్యారు. రూ.వేలల్లో మామూళ్లిచ్చి రూ.లక్షల్లో పన్ను ఎగ్గొడుతున్నారు. అక్రమాలకు అందలం టౌన్ ప్లానింగ్ విభాగంలో ఓ టీపీఓ (కీలక అధికారి), మరో ఇద్దరు టీపీఎస్‌ల నిర్వాకంతోనే ఈ అక్రమ బాగోతం చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. టీడీపీ హయాంలో యాడ్ ఏజెన్సీ విధానాన్ని వేలం పాటలో నిర్వహించకుండా వివిధ కమర్షియల్ ప్రాంతాలకు టీపీఎస్‌లే పంచుకున్నారు. వారి పరిధిలోనే యాడ్ ఏజెన్సీ నిర్వహణ జరిగేలా చూసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో గత పాలకులు, అధికారులు మీకు..మాకు అన్న ధోరణిలో నగరపాలక సంస్థ ఆదాయానికి గండికొట్టినట్లు తెలుస్తోంది. ఈ ఏడాదే సదరు కీలక అధికారి, టీపీఎస్‌లు వివిధ ప్రాంతాలకు బదిలీపై వెళ్లగా వారు చేసిన ఘనకార్యాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. పన్ను చెల్లింపు రికార్డులు మాయం ప్రచార పన్నులకు సంబంధించిన రికార్డులు గల్లంతయినట్లు నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రకటనల పన్ను చెల్లింపులకు సంబంధించిన రికార్డులేవీ లేవని చెబుతున్నారు. ఆ రికార్డులు బయటకు వస్తే ఎంత వసూలు చేశారు...ఎంత మేశారో తెలిసిపోతుందన్న భయంతోనే కొందరు ఇంటిదొంగలే ఆ రికార్డులను మాయం చేసినట్లు తెలుస్తోంది. కమిషనర్ ఆరా కమిషనర్ పి.ప్రశాంతి పది రోజుల కిందట నగరంలో వేసిన హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు, బోర్డులకు సంబంధించి పన్నులు ఏ విధంగా వసూలు చేస్తున్నారని టౌన్ ప్లానింగ్ అధికారులను అడిగినట్లు తెల్సింది. కానీ వారి నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో ఆమె సచివాలయ ఉద్యోగుల ఎంపిక ప్రక్రియ ముగిసిన వెంటనే దీనిపై లోతుగా ఆరా తీస్తానని, ఆలోపు ప్రకటనల పన్ను ఫైలు సిద్ధం చేయాలని సిబ్బందిని ఆదేశించినట్లు సమాచారం. పన్ను చెల్లించని వారిపై చర్యలు నేను ఈ ఏడాదే ఏసీపీగా ‘అనంత’కు వచ్చాను. యాడ్ ఏజెన్సీ ప్రకటనల పన్ను విషయం గురించి ఆరా తీస్తున్నా. ఇటీవల కమిషనర్ మేడం కూడా పన్నులు సక్రమంగా వసూలు చేయాలని చెప్పారు. ప్రకటన పన్నులకు సంబంధించిన రికార్డులను పరిశీలిస్తున్నాం. ఎవరైనా పన్ను చెల్లించకుండా ఉంటే వారిపై చర్యలు తీసుకుంటాం. – సుబ్బారావు, ఏసీపీ టీడీపీ హయాంలో ఆ పార్టీ నేతల అండదండలతో తిరుపతికి చెందిన ఓ యాడ్ ఏజెన్సీ నగరంలోని ప్రధాన కూడళ్లతో పాటు వివిధ ప్రాంతాల్లో హోర్డింగ్‌లు, డివైడర్ల మధ్యలో స్లైడ్స్, లాలిపాప్స్ అడ్వర్టైజ్మెంట్ బోర్డులు ఏర్పాటు చేసింది. అయితే నగరపాలక సంస్థకు చెల్లించాల్సిన ప్రకటన పన్ను మాత్రం సక్రమంగా చెల్లించలేదు. అయినా అప్పటి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అప్పటి సీఎం, జిల్లా ఇన్చార్జ్ మంత్రి జిల్లాకు వచ్చినప్పుడు టీడీపీ నాయకుల ప్రకటనలకు డబ్బు తీసుకోలేదనే కారణంతో నగరపాలక సంస్థ పాలక వర్గం ఆ ఏజెన్సీకి అనధికారికంగా పన్ను మినహాయించింది. నగరంలోని సర్వజనాస్పత్రి, సప్తగిరి సర్కిల్ ముందు ఓ యాడ్ ఏజెన్సీ నిర్వాహకుడు బోర్డులు వేసుకున్నారు. వాటిని తొలగించేందుకు వెళ్లిన సిబ్బందిని దబాయించాడు. పాలకవర్గం అండదండలతో పన్ను చెల్లించకుండా రెండేళ్ల పాటు యాడ్స్ వేసుకుని రూ.లక్షలు సంపాదించాడు. -
ఫ్లెక్సీ రచ్చ
ఫ్లెక్సీ, బ్యానర్, హోర్డింగ్‌ల సంస్కృతి మరోమారు రచ్చకెక్కింది. వీటిని అరికట్టడంలో పాలకుల వైఫల్యాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది. ప్రభుత్వమే ఈ ఫ్లెక్సీలతో హంగామా సృష్టిస్తుంటే, ఇక, ఎలా అడ్డుకట్ట వేస్తారని న్యాయమూర్తులు ప్రశ్నించారు. తిరుచ్చి వేదికగా హంగామా సాగడంపై మండిపడ్డారు. శుక్రవారం సాయంత్రంలోగా ఒక్క ఫ్లెక్సీ, బ్యానర్ ఉండేందుకు వీలు లేదని తొలగించాల్సిందేనన్న ఆదేశాలు ఇచ్చారు. సాక్షి, చెన్నై : రాష్ట్రంలో ఫ్లెక్సీ, బ్యానర్, హోర్డింగ్ సంస్కృతి ఎక్కువేనన్న విషయం తెలిసిందే. రాజకీయ పక్షాలే కాదు, సంఘాలు, సంస్థలు, ఏ చిన్న వేడుకైనా సరే హంగామా చేయాల్సిందే. వీటికి అడ్డుకట్ట వేసే విధంగా ఏళ్ల తరబడి సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి పోరాడుతూనే వస్తున్నారు. ఇప్పటికే మద్రాసు హైకోర్టు వీటి తొలగింపు విషయంగా పలుసార్లు ఉత్తర్వులు, ఆదేశాలు జారీచేసినా ఫలితం శూన్యం. రెండేళ్ల క్రితం అప్పటి ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్‌కౌల్ అయితే, తీవ్రంగానే స్పందించారు. ఫ్లెక్సీ, బ్యానర్లు, హోర్డింగ్‌ల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరి చేశారు. అనేక రకాల ఆంక్షలు విధించడంతో పాటు, ఇష్టారాజ్యంగా ఏర్పాటుచేసే వాటిమీద పరిశీలించి, అందుకు తగ్గ చర్యలు తీసుకునేందుకు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృ త్వంలో ఓ కమిటీ నియమకానికి తగ్గ ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాలు ఖాతరు చేయని రాజకీయ పక్షాలు ప్రైవేటు ఫ్లెక్సీ, హోర్డింగ్, బ్యానర్ల వ్యవహారంలో నిబంధనలు తప్పని సరిగా అమల్లో ఉన్నా, రాజకీయ పక్షాలు మాత్రం ఆదేశాలను ఖాతరు చేయడం లేదు. దీంతో ఎక్కడ ఫ్లెక్సీ, బ్యానర్ కనిపించినా, స్వయంగా వాటిని తొలగించే పనిలో సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి నిమగ్నం అయ్యారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎంజీఆర్ శత జయంతి పేరుతో సాగుతున్న వేడుకల్లో ప్రభుత్వ హంగామా మళ్లీ ఫ్లెక్సీ, బ్యానర్, హోర్డింగ్‌ల వ్యవహరాన్ని రచ్చకెక్కెలా చేశాయి. రెండు రోజుల క్రితం న్యాయమూర్తి వైద్యనాథన్ బెంచ్ అయితే, ఈ వ్యవహారంపై కీలక ఆదేశాలు ఇచ్చింది. ఫ్లెక్సీ, బ్యానర్, హోర్డింగ్‌లలో బతికే ఉన్న వాళ్ల ఫొటోల్ని పొందుపరిచేందుకు వీలు లేదని ఉత్తర్వులు జారీచేశారు. అయితే, తిరుచ్చి వేదికగా పాలకులు హంగామా సృష్టిస్తూ గత రెండు రోజులుగా చేసిన ఏర్పాట్లు ఇద్దరు న్యాయమూర్తుల నేతృత్వంలోని బెంచ్ ముందుకు గురువారం చేరింది. తీవ్రంగా పరిగణన గురువారం హైకోర్టులో ఫ్లెక్సీల వ్యవహారంగా రెండు బెంచ్‌ల ముందు విచారణలు సాగాయి. ఇందులో ఒకటి రెండు రోజుల క్రితం ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా. మరొకటి ప్రభుత్వమే హంగామా సృష్టించడం. బతికి ఉన్న వాళ్ల ఫొటోలను పొందు పరచవద్దని జారీచేసిన ఉత్తర్వులకు స్టే ఇవ్వాలని చెన్నై కార్పొరేషన్ తరఫున అత్యవసర పిటిషన్ దాఖలుకు కసరత్తులు సాగాయి. అయితే, హైకోర్టు నిరాకరించడమే కాకుండా, సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వుల్లో ఎలాంటి తప్పు లేదని ఏకీ భవిస్తున్నామని ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన బెంచ్ స్పష్టం చేసింది. ఈ పిటిషన్ విచారణ ముగియగానే, సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి దాఖలు చేసిన ప్రభుత్వం తరఫు హంగామా గురించిన పిటిషన్ విచారణకు వచ్చింది. ఈసందర్భంగా ప్రభుత్వం తరఫున న్యాయవాదులు తిరుచ్చిలో అనుమతులతోనే ఫ్లెక్సీలు, బ్యానర్లు ఎంజీఆర్ జయంతి వేడుకల నిమిత్తం ఏర్పాటు చేసినట్టు వివరించారు. ప్రభుత్వం తరఫున 200, బయటి వ్యక్తులు 20 ఫ్లెక్సీల ఏర్పాటుకు అనుమతి పొందినట్టు పేర్కొన్నారు. 220కు అనుమతి ఇచ్చినప్పుడు అక్కడ వందలాదిగా ఎలా ఏర్పాటు చేస్తారని న్యాయమూర్తులు సుందరేష్, సుందర్‌ల నేతృత్వంలోని బెంచ్ సంధించిన ప్రశ్నలకు ప్రభుత్వం తరఫు న్యాయవాదులు ఉక్కిరి బిక్కిరి కాక తప్పలేదు. ప్రభుత్వ వేడుకలకు ఇంత అవసరమా? ప్రభుత్వమే ఫ్లెక్సీలతో ఇలా హంగామా చేస్తుంటే, ఇక, బయటి వ్యక్తులు, ప్రైవేటు సంస్థలు, సంఘాలు ఇష్టారాజ్యంగా వ్యవహరించవా.?, అని న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వేడుకలకు ఇంత హంగామా అవసరమా..? అన్న ప్రశ్నలు ఇరకాటంలో పడేశాయని చెప్పవచ్చు. గతంలో ఇచ్చిన ఆదేశాలను ఎందుకు అమలు చేయడం లేదన్న ప్రశ్నల వర్షంతో, చివరకు సోమవారం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని బెంచ్ విచారణకు నిర్ణయించడం గమనార్హం. దీంతో తిరుచ్చిలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగ్‌లను శుక్రవారం సాయంత్రంలోపు తొలగిస్తామని ప్రభుత్వం తరఫున కోర్టుకు న్యాయవాదులు హామీ ఇచ్చారు. తొలగించాల్సిందేనని ఆదేశిస్తూ, తదుపరి విచారణను సోమవారానికి వాయిదావేశారు. ఆరోజున సమగ్ర నివేదికను సమర్పించాలని న్యాయమూర్తులు సూచించారు. కాగా, ఇదివరకు న్యాయమూర్తి సుందరేష్, సుందర్ పలుమార్లు ఈ వ్యవహారాలపై ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. తాజాగా, సోమవారం ప్రధాన న్యాయమూర్తితో కలిసి విచారించనున్న దృష్ట్యా, కీలక ఆదేశాలు, తీవ్ర హెచ్చరికలు సంధించే అవకాశాలు ఎక్కువే. -
యూపీలో హోర్డింగుల కలకలం
మీరట్: జమ్మూకశ్మీర్ లో సైనికులపై దాడులను వ్యతిరేకిస్తూ ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో పెట్టిన హోర్డింగులు కలకలం రేపుతున్నాయి. కశ్మీరీలు తమ రాష్ట్రం విడిచి వెళ్లిపోవాలని పేర్కొంటూ ఢిల్లీ-డెహ్రడూన్ జాతీయ రహదారిపై హోర్డింగులు పెట్టారు. సైన్యంపై కశ్మీరీల రాళ్లు రువ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఈ హోర్డింగులు ఏర్పాటు చేసినట్టు ఉత్తరప్రదేశ్ నవనిర్మాణ సేన అధ్యక్షుడు అమిత్ జానీ తెలిపారు. కశ్మీర్ విద్యార్థులు ఎక్కువగా ఉండే కాలేజీలకు సమీప ప్రాంతాల్లో దాదాపు 48 హోర్డింగులు పెట్టినున్నట్టు తెలిపారు. తమ నిరసనలో భాగంగా కశ్మీర్ విద్యార్థులకు ఆహారం, నీరు, నివాసం నిరాకరించాలని యూపీ ప్రజలను నవనిర్మాణ సేన కార్యకర్తలు కోరతారని చెప్పారు. ‘కశ్మీర్ లో ప్రతి రోజు భారత సైనికులపై కశ్మీరీలు రాళ్లు రువ్వుతున్నారు. మీరట్ లో నేను చాలా మంది విద్యార్థులతో మాట్లాడాను. ఇక్కడ చదువుకుంటున్న కశ్మీర్ విద్యార్థులు జాతీయ గీతం, జాతీయ గేయం ఆలపించడం లేదని తెలుసుకున్నాను. ఇక్కడ చదువుకుంటున్న, పనిచేస్తున్న కశ్మీరీలు భారత్ కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. ఇటువంటి వారిపై నిషేధం విధించాలని యూపీ ప్రజలను చైతన్య పరుస్తాం. పాలు, నీళ్లు, న్యూస్ పేపర్లు, అద్దెకు ఇళ్లు ఇవ్వొద్దని కోరతాం. జమ్మూకశ్మీర్ బ్యాంకులో ఖాతాలు మూసివేయాలని ఖాతాదారులకు చెబుతాం. మా రాష్ట్రంలో ఉన్న కశ్మీరీలందరూ తిరిగి వెళ్లిపోవాలి. వారు వెళ్లకపోతే ఏప్రిల్ 30 నుంచి ధర్నాలు, ఆందోళన చేపడతామ’ని అమిత్ జానీ పేర్కొన్నారు. -
హోర్డింగ్ పిడుగు!
సిటీబ్యూరో : 2016 మే నెల.. అకస్మాత్తుగా ఈదురు గాలుల పెను ప్రళయం...గాలి వాన బీభత్సంతో నగరం అతలాకుతలమైంది. భారీ చెట్లు ఫెళఫెళమంటూ నేలకూలాయి. పెద్ద పెద్ద హోర్డింగులు, విద్యుత్‌స్తంభాలు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. గంటకు 100 నుంచి 150 కి.మీ. వేగంతో వీచిన ప్రళయ గాలులతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు. ఏ హోర్డింగు వచ్చి ఇంటిమీద పడుతుందోనని భయం. బయటకు వెళితే ఏచెట్టు కూలి నెత్తిన పడుతుందోననే ఆందోళనతో అల్లాడిపోయారు. ఒక్కసారి కాదు.. గతేడాది మేలో మూడు పర్యాయాలు ఇదే రకమైన భయంకర పరిస్థితి తలెత్తింది. ఇది గతం... .....మరి ఈ సంవత్సరం సైతం అలాంటి పరిస్థితి ఎదురైతే ఎలా? నగర వాసులను వేధిస్తున్న ప్రశ్న ఇది. వాస్తవంగా అలాంటి భీతావహ పరిస్థితి ఏనెలలో వస్తుందో.. ఎంత తీవ్రతతో వస్తుందో ముందస్తుగానే తెలియజేసే యంత్రాంగం, సాంకేతిక పరిజ్ఞానం మనకు లేవు. నగరంలో ఇప్పటికే అడపాదడపా ఈదురుగాలులు మొదలయ్యాయి. గత అనుభవంతోనైనా జీహెచ్ఎంసీ తగిన ముందస్తు చర్యలు చేపట్టిందా అంటే.. ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించి ఇటీవల ఒక సమావేశం నిర్వహించినప్పటికీ, స్పష్టమైన కార్యాచరణ రూపొందించలేదు. ఉన్నట్లుండి మళ్లీ గాలివీస్తే .. ప్రజల ప్రాణాలకు గ్యారంటీలేదు. నియంత్రణ ఏదీ? గత సంవత్సరం జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ సమీపంలో యూనిపోల్ కూలి పలు కార్లు ధ్వంసమైన నేపథ్యంలో హోర్డింగులు, యూనిపోల్స్, సెల్‌టవర్లు ప్రమాదవశాత్తు కూలితే వాటిని ఏర్పాటుచేసిన సంస్థలపై సివిల్, క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్లు జీహెచ్ఎంసీ హెచ్చరించింది. దాదాపు నాలుగునెలలపాటు హోర్డింగులను పూర్తిగా తొలగించారు. హోర్డింగులు, సెల్టవర్ల సామర్ధ్యమెంత.. ఎంత గాలిని తట్టుకోగలవు.. తదితరమైనవి బేరీజు వేసి తగిన స్ట్రక్చరల్ స్టెబిలిటీ ఉంటేనే అనుమతులిస్తామని ప్రకటించారు. 100–150 కి.మీ.ల మేర గాలి వేగాన్ని తట్టుకునేలా డిజైన్ చేయాలని నిర్ణయించారు. రెండంతస్తులకు మించిన భవ నాలపై ఏర్పాటు చేసే హోర్డింగులు, 40 25 అడుగుల కంటే మించిన హోర్డింగులను ఏర్పాటు చేసేందుకు ముందే జేఎన్టీయూ నిపుణులు క్షేత్రస్థాయి పరిశీలన చేసి ధ్రువీకరిస్తేనే అనుమతులిస్తామని స్పష్టం చేశారు. అంతకంటే తక్కువ సైజులోని వాటికి 2017 మార్చి(ఈనెలాఖరు) లోగా స్ట్రక్చరల్ స్టెబిలిటీ, డిజైన్లకు సంబంధించి పూర్తిస్థాయి జాగ్రత్తచర్యలు చేపట్టాలని, వాటిని సైతం జేఎన్టీయు లేదా ఐఐటీ నిపుణులు ఆమోదించాలని పేర్కొన్నారు. ఆ మేరకు పాలసీని రూపొందించారు. అంతవరకు బాగానే ఉంది. కానీ అమలు మాత్రం సాధ్యం కాలేదు. హోర్డింగ్‌ల నిర్వాహకులు కొందరు హైకోర్టుకు వెళ్లి హోర్డింగులపై స్టే తెచ్చుకున్నారు. హోర్డింగుల ఏర్పాటుకు ఫీజు తీసుకున్నాక ఎలా తొలగిస్తారంటూ కోర్టు స్టే ఇవ్వడంతో జీహెచ్ఎంసీ ఏమీ చేయలేకపోయింది. ఈ మార్చి నెలాఖరుతో ఫీజు గడువు ముగిసిపోనుంది. ఏప్రిల్ నుంచైనా కొత్త పాలసీని అమలు చేస్తుందో, లేదో వేచిచూడాల్సిందే. అడ్డగోలు హోర్డింగ్‌లు... గతంలో గంటకు 30 నుంచి 40 కి.మీ.ల వేగంతో వీచే గాలులను తట్టుకునేలా మాత్రమే స్ట్రక్చరల్ స్టెబిలిటీని పరిగణనలోకి తీసుకునేవారు. 150 కి.మీ.ల వేగంతో గత సంవత్సరం మాదిరిగా మళ్లీ గాలులు వీస్తే ఎన్నో హోర్డింగులు కూలే ప్రమాదం ఉంది. కోర్టు స్టే వారాలకు వారాలుగా పొడిగింపు అవుతోంది. దీనిపై కూడా తగిన విధంగా వ్యవహరించడంలో జీహెచ్ఎంసీ విఫలమైందనే చెప్పాలి. కోర్టు స్టే సాకుతో అడ్డగోలుగా, ఎన్ని అక్రమ హోర్డింగులు వెలుస్తున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. గత సంవత్సరం ప్రమాదం జరిగినప్పుడు జేఎన్టీయూ ప్రొఫెసర్ డా.ఎన్.వి.రమణారావు నేతృత్వంలోని కమిటీ హోర్డింగుల ఏర్పాటుపై నిబంధనలు విధిస్తూ పలు సిఫార్సులు చేసింది. అందుకనుగుణంగా పాలసీ రూపొందించినప్పటికీ కోర్టు స్టేతో పట్టించుకోవడం లేదు. ఉత్తుత్తి తనిఖీలే... జీహెచ్ఎంసీలో 2,684 హోర్డింగులు, యూనిపోల్స్‌కు, 1151 బస్‌షెల్టర్లకు, 6 ఎఫ్‌ఓబీలపై మాత్రమే ప్రకటనలకు అనుమతి ఉందని జీహెచ్ఎంసీ గత సంవత్సరం స్పష్టం చేసింది. జేఎన్టీయూ మార్గదర్శకాల అనంతరం 1125 హోర్డింగులకు సంబంధించి నిర్వాహకులు స్ట్రక్చరల్ స్టెబిలిటీ సర్టిఫికెట్లను సమర్పించగా,అనుమతులిచ్చినట్లు పేర్కొంది. అనంతరం సర్కిల్‌స్థాయిలో 972 హోర్డింగులను తనిఖీ చేయగా, వాటిల్లో 83 హోర్డింగులు అక్రమమైనవిగా గుర్తించారు. ప్రధాన కార్యాలయంలోని ప్రకటనల విభాగానికి చెందిన ఇంజినీర్లతో కూడిన మరో బృందం 894 హోర్డింగులను తనిఖీ చేయగా, వాటిల్లో 41 హోర్డింగుల్ని అక్రమంగా గుర్తించారు. మొత్తం తనిఖీలు పూర్తిచేసి అనుమతుల్లేనివి కూల్చివేస్తామన్నారు కానీ..ఆ తర్వాత తనిఖీలు మరిచారు. అమలుకు నోచని సిఫార్సులు.. జేఎన్టీయూకు చెందిన ఫ్రొఫెసర్ డాక్టర్ ఎన్.వి.రమణారావు సిఫార్సుల మేరకు స్ట్రక్చరల్ ఇంజినీర్ క్షేత్రస్థాయి తనిఖీల అనంతరం తగిన సేఫ్టీ ఉందని భావించిన ప్రదేశాల్లో...ఆ విషయాన్ని జేఎన్టీయూకు తెలియజేసి గోడలపై, భూమిపై 40 ్ఠ 25 అడుగుల వరకు హోర్డింగ్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. రూఫ్ టాప్‌పై ఏర్పాటు చేసేవి రెండంతస్తుల వరకు 30 ఇంటూ 25 అడుగులకు మించకుండా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇలాంటి వాటికి ఏదేని ప్రమాదం జరిగితే తమదే పూర్తిబాధ్యత అనే పూచీకత్తుపై తాత్కాలిక అనుమతులివ్వవచ్చు. భద్రత, ప్రజల రక్షణలకు సంబంధించి ఎలాంటి రాజీ లేకుండా పరిశ్రమపై ఆధారపడ్డవారిని దృష్టిలో ఉంచుకొని ఈ సిఫార్సులు చేసినట్లు పేర్కొన్నారు. వీటికి సంబంధించి ప్రతి అడ్వర్టయిజింగ్ ఏజెన్సీ వేటికవిగా విడివిడిగా వ్యక్తిగతంగా అండర్‌టేకింగ్ ఇవ్వాలి. థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్ ఉండాలి. ఏదేని అనుకోని ప్రమాదం జరిగితే సంబంధిత ఏజెన్సీయే పూర్తి బాధ్యత వహించాలి. డిజైన్లు, మార్పుచేర్పులకు సంబంధించి చేయాల్సిన పనుల్ని 2017 మార్చినెలాఖరు లోపున పూర్తిచేయాలి. హోర్డింగులపై సింగిల్ ఫ్లెక్సీలనే ప్రదర్శించాలి. వీటితోపాటు మరికొన్ని సిఫార్సులు చేశారు. హైకోర్టు స్టే సాకుతో అన్నింటినీ తుంగలో తొక్కారు. నాటి ప్రళయం.. మరువని నగర జనం.. గత సంవత్సరం గాలివాన బీభత్సానికి మూడువేల చెట్లకు పైగా కూలిపోయాయి. వెయ్యికి పైగా విద్యుత్‌స్తంభాలు నేలకొరిగాయి. 60 ట్రాన్స్ఫార్మర్లు పడిపోయాయి. వందల సంఖ్యలో కార్లు, ద్విచక్రవాహనాలు దెబ్బతిన్నాయి. గత సంవత్సరం అనుభవంతో పెనుగాలికి కూలే కొండతంగేడు మొక్కలను రోడ్ల వెంబడి నాటడం లేదని జీహెచ్ఎంసీ జీవవైవిధ్య విభాగం డైరెక్టర్ దామోదర్ తెలిపారు. కూలేలా బలహీనంగా ఉన్న చెట్లను కూడా గుర్తించి గత సంవత్సరమే కూల్చివేశామన్నారు. -
కేజేరెడ్డి హోర్డింగ్‌లు తొలగించాలి
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కేజే రెడ్డి ప్రచార హోర్డింగ్‌లను వెంటనే తొలగించాలని సీసీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు టి.షడ్రక్, జిల్లా కార్యదర్శి కే.ప్రభాకరరెడ్డి డిమాండ్ చేశారు. టీడీపీ అభ్యర్థి ప్రభుత్వ కార్యాలయాలు, మునిసిపల్ స్థలాల్లో ఎక్కడపడితే అక్కడ పెద్ద పెద్ద హోర్డింగ్‌లను పెట్టినా తొలగించడంలో అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ప్రవరిస్తున్నారని ఆరోపించారు. అధికార పార్టీ అభ్యర్థులకు ఎన్నికల నిబంధనలు వర్తించావా అని వారు ప్రశ్నించారు. జిల్లా అధికార యంత్రాంగం బరితెగించి టీడీపీ అభ్యర్థికి సహకారం అందిస్తున్నాయని, వెంటనే హోర్డింగ్‌లను తొలగించకపోతే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. గురువారం సుందరయ్య భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల జాబితా తప్పుల తడకగా ఉందన్నారు. నిబంధనలు ప్రకారం పట్టభద్రులకు 2013 ఆక్టోబర్లోపు డిగ్రీ పాసైనా వారికే ఓటు హక్కును కల్పించాలని, అయితే 2016లో డిగ్రీ పాసైనా వారికి కూడా ఓటు ఉందన్నారు. కర్నూలులో కొన్ని కేంద్రాల్లో కేవలం 150 మంది మాత్రమే ఓటేసేవిధంగా కేంద్రాలు ఉండగా..గ్రామీణ ప్రాంతాల్లో 2500 మందికి ఒక్క పోలింగ్ బూతును ఏర్పాటు చేశారని చెప్పారు. జిల్లాలో ఇసుక మాఫీయా రెచ్చిపోతోందని, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తమ్ముళ్లు మాఫీగా ఏర్పడి జిల్లాలోని తుంగభద్ర, హంద్రీ, హగరి నదుల ఇసుకను కొల్లగొట్టి కోట్లను గడిస్తున్నారని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యుడు రామాంజనేయులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ హోర్డింగుల్లో ప్రణబ్
న్యూఢిల్లీ: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన హోర్డింగులలో రాష్ట్రపతి ప్రణబ్ ఫొటోలు దర్శనమిచ్చాయి. వీటిపై రాష్ట్రపతి భవన్ మండిపడింది. రాష్ట్రపతి పదవికున్న తటస్థతను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. కాంగ్రెస్ హోర్డింగులలో ప్రణబ్ ఫొటోలకు సంబంధించి జాతీయ దినపత్రికల్లో వచ్చిన వార్తలను రాష్ట్రపతి కార్యదర్శి ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఫొటో విషయాన్ని లూధియానా డిప్యూటీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారులు పరిశీలిస్తున్నారని తెలిపారు. -
తొలగించండి..లేదా ముసుగేయండి
న్యూఢిల్లీ: రానున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ చర్యలు మొదలుపెట్టింది. ఏదైనా పార్టీకి స్వీయ లబ్ధి కలిగేలా ఉన్న హోర్డింగులు, ప్రకటనల్లోని రాజకీయనాయకుల ఫొటోలను తొలగించడం లేదా మూసివేయడం చేయాలని ఎన్నికల యంత్రాంగాన్ని ఆదేశించింది. యూపీలో ఎన్నికల్లో అవినీతిని అరికట్టేందుకు ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ ప్రత్యేక టోల్ ఫ్రీ నంబరును ప్రారంభించింది. అభ్యర్థులెవరైనా పరిమితి(రూ.28 లక్షలు)కి మించి ఎన్నికల కోసం ఖర్చు పెడితే, ప్రజలు 1800 180 6555 నంబరుకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరింది. గోవాలో ప్రచారం కోసం అభ్యర్థులెవరూ మత సంస్థలను ఉపయోగించుకోకూడదని ఈసీ తెలిపింది. -
ప్రమాదాలకు నిలయాలు.. ఫ్లెక్సీలు
► హోర్డింగులు, ఫెక్లీలను పట్టించుకోని అధికారులు ► ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు.. పెద్దపల్లి(సుల్తానాబాద్ రూరల్) : సుల్తానాబాద్‌లో రాజీవ్‌రహదారి వెంట ఫ్లెక్సీలు,హోర్డింగ్‌లు ప్రమాదాలకు హేతువుగా మారాయి. ఆర్టీసీ బస్టాండ్ ముందు హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు ఆర్టీసీ డ్రైవర్లకు తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. బస్సులు లోపలికి వెళ్లే దారిలో, బయటకు వచ్చే దారిలో హోర్డింగ్‌లు ఏర్పాటుచేయడం వల్ల డ్రైవర్లకు రాజీవ్‌రహదారి వెంట వెళ్లే వాహనాలు సరిగా కనబడక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలాంటి ఘటనే శుక్రవారం చోటుచేసుకుంది. రోడ్డు నుంచి వెళ్తున్న లారీని బస్సు ఢీకొనడం వల్ల బస్సులో ప్రయాణించే రాజయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. గతంలోనూ పలు సందర్భాల్లో ప్రమాదాలు జరిగాయి. అధికారులు అనుమతిలేని ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లను తొలగించాలని ఆర్టీసీ అధికారులకు, సంబంధిత శాఖల అధికారులకు ఎంతో కాలంగా కోరుతున్నా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.ఇప్పటికైనా ప్రమాదాలకు కారణమవుతున్న ఫ్లెక్సీలను హోర్డింగులను నిషేధించాలని ప్రజలు కోరతున్నారు. బస్టాండ్ మూసుకు పోయింది హోర్డింగ్‌లతో, ఫ్లేక్సిలతో బస్టాండ్ పూర్తిగా మూసుకుపోయింది. రోడ్డుకు అసలే వంపులో ఉన్న బస్టాండ్ హోర్డింగ్‌ల వల్ల కనబడడం లేదు. దీంతో బస్సు డ్రైవర్లకు, రాజీవ్ రోడ్డు వెంట వెల్లే వాహనాల డ్రైవర్లకు ఇబ్బంది కరంగా మారింది. ప్రయాణీకులకు అసౌకర్యంగా తయారైంది. వెంటనే అధికారులు దృష్టి సారించాలి. – దొడ్ల సతీష్, సుల్తానాబాద్ చౌరస్తా ప్రమాదాలకు నిలయమైంది ఒక వైపు హోర్డింగ్‌లు, మరోవైపు రాజీవ్‌రహదారిపై డివైడర్ల వల్ల స్థానిక బస్టాండ్ చౌరస్తా ప్రమాదాలకు నిలయంగా మారింది. ప్రయాణీకులు రోడ్డు దాటాలంటే జంకుతున్నారు. జిల్లాకు చెందిన ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ బస్టాండ్ పరిస్థితి గురించి దృష్టి సారించాలి. అనుమతి లేని హోర్డింగ్‌లను తొలగించడం లేదు. ఆర్టీసీ, స్థానిక అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. –శేట్టి శ్రీనివాస్, సుల్తానాబాద్ తగు చర్యలు తీసుకుంటాం హోర్డింగ్‌ల గురించి తగు చర్యలు తీసుకుంటాం. సంబంధిత అధికారులను వీటిని తొలగించాల్సిందిగా ఆదేశించాం. ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలను తీసుకుంటున్నాము, పోలీసు సిబ్బంది కూడా బస్టాండ్ వద్ద విధుల్లో ఉన్నారు. సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసి ప్రత్యక్షంగా పరిస్థితిని సమీక్షించడం జరుగుతుంది. – జీవన్,ఎస్సై సుల్తానాబాద్ -
ఫ్లెక్సీలు బంద్
► హోర్డింగులకే పరిమితం ►నేటినుంచి పక్కాగా అమలు ► పటిష్టంగా ప్లాస్టిక్ నిషేధం ► నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా ►ప్రత్యామ్నాయం చూపండి ►ఫ్లెక్సీ నిర్వాహకుల విజ్ఞప్తి రహదారులకు అడ్డుగా, ట్రాఫిక్ సమస్యలు తలెత్తేలా కట్టే ఫ్లెక్షీలు ఇకనుంచి కనిపించవు. తమ నేత వస్తున్నాడని రాజకీయ పార్టీలు, నాయకుడొస్తున్నాడని వివిధ సంఘాల నాయకులు పట్టణాలు, ఊళ్లను ఫ్లెక్సీలతో కుమ్మేయడం ఈ కొత్త సంవత్సరం నుంచి కుదరదు. ఫ్లెక్షీల ద్వారా తలెత్తుతున్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు ఫ్లెక్సీలను నిషేధిస్తూ (హోర్డింగ్‌లకు మినహా) గతంలోనే నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది అంటే.. ఆదివారం నుంచి మంత్రి ఆదేశాలు పక్కాగా అమలులోకి రానున్నాయి. – సాక్షి, సిరిసిల్ల సాక్షి, సిరిసిల్ల : పర్యావరణానికి హానికరంగా మారిన ప్లాస్టిక్‌ను తరిమివేసే క్రమంలో ఫ్లెక్షీలనూ నిషేధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేవలం మున్సిపల్ అనుమతులున్న హోర్డింగ్‌లు, సైన్ బోర్డులకు తప్ప ఫ్లెక్షీలు ఏర్పాటు చేయడంపై నిషేధం విధించారు. సిరిసిల్ల పట్టణంలో 12, వేములవాడలో 4 హోర్డింగ్‌లకు మాత్రమే మున్సిపాల్టీల అనుమతి ఉంది. ఫ్లెక్సీల తయారీపై నిషేధిం విధించకున్నా .. హోర్డింగ్‌లు తప్ప బయట ఏర్పాటు చేస్తే జరిమానా విధిస్తామనే అధికారుల హెచ్చరికతో దాదాపు నిషేధం అమలు కానుంది. పటిష్టంగా ప్లాస్టిక్‌పై నిషేధం మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సూచన మేరకు ప్లాస్టిక్‌రహిత జిల్లాగా మార్చేందుకు అధికారులు నడుం కట్టా రు. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపాల్టీల్లో ప్లాస్టిక్, ఫ్లెక్షీల నిషేధాన్ని పగడ్బందీగా అమలు చేసేం దుకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ప్లాస్టిక్‌పై నిషేధం కొనసాగిస్తుండగా, నూతన సంవత్సరంలో మరింత పటిష్టంగా అమలు చేసేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు. సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ సుమన్ రావు నేతృత్వంలో ఎన్విరాన్ మెంట్ ఇంజినీరింగ్, శానిటరీ ఇన్ స్పెక్టర్, సంబంధిత వార్డు జవాన్, ఇద్దరు వర్కర్లతో కూడిన బృందం నిషేధం అమలు ఉల్లంఘించేవారిపై దాడులు చేపడుతోంది. గత మూడు నెలల్లో 12 సార్లు చేసిన దాడుల్లో రూ.1.10 లక్షల జరిమానాను వ్యాపారుల నుంచి వసూలు చేశారు. ప్లాస్టిక్ కవర్స్, గ్లాస్లు విక్రయిస్తూ తొలిసారి పట్టుబడిన దుకాణదారుకు రూ.2 వేలు, రెండోసారి పట్టుబడితే అదనంగా రూ.వేయి కలిపి జరిమానా విధిస్తారు. మూడు, నాలుగో సారైతే లైసెన్స్ రద్దు చేస్తారు. వేములవాడలోనూ పలు పర్యాయాలు తనిఖీలు చేపట్టారు. ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్‌ల స్థానంలో నాన్ వోవెన్ క్లాత్ బ్యాగ్స్‌ను మాత్రమే అనుమతినిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రణాళికాబద్ధంగా ప్రచారం.. పా్లస్టిక్ రహిత సమాజం వైపు అడుగులు వేయాలంటే ప్రజలు, వ్యాపారుల సహకారం అత్యవసరమని గుర్తిం చిన అధికారులు.. ఆ దిశగా చర్యలు చేపట్టారు. ప్రణాళి కాబద్ధంగా ప్లాస్టిక్ నిషేధానికి విస్తృత ప్రచారం కల్పిం చేందుకు కొత్త సంవత్సరం మొదటి వారంలో వరుస కార్యక్రమాలు చేపట్టారు. పట్టణాల్లో ర్యాలీలు, పాఠశాలల్లో వ్యాసరచన, ఉపన్యాస పోటీలు, వ్యాపార, వాణి జ్య వర్గాలతో సమావేశాలు, ఆటోలకు మైక్‌ల ద్వారా కాలనీల్లో తిరుగుతూ ప్రచారం చేపట్టేందుకు నిర్ణయించారు. ప్రత్యామ్నయం చూపండి.. ఫ్లెక్షీలపై నిషేధాన్ని అమలు చేస్తుండడంపై నిర్వాహకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఫ్లెక్షీల తయారీపై నిషేధం లేకున్నా.. అనుమతున్న హోర్డింగ్‌లు మిన హా ఇతర ప్రాంతాల్లో నిషేధించడంతో తమ వ్యాపారం పడిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రూ.లక్షల్లో రుణాలు తీసుకుని, అప్పులు తెచ్చి ఫ్లెక్షీ వ్యాపారం చేసుకుంటున్న తమకు ప్రభుత్వ నిర్ణయం అశనిపాతంలా మారిందని ఆవేదన చెందుతున్నారు. ఫ్లెక్షీ దుకాణాలు సిరిసిల్లలో ఆరు, వేములవాడలో రెండు ఉన్నాయి. ఫ్లెక్షీలను నిషేధించడం సరికాదని, దీని వల్ల తాము ఉపాధి కోల్పోతున్నామని నిర్వాహకులు భిక్షపతి, మాదాసు రమేశ్ ఆవేదన చెందారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా వంద కుటుంబాలపై దీని ప్రభావం పడుతుందని ఆందోళన చెందారు. ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకోకపోతే ప్రత్యామ్నాయ ఉపాధి చూపించాలని వారు కోరారు. ఇక ప్లాస్టిక్, ఫ్లెక్షీ రహితం పా్లస్టిక్, ఫ్లెక్షీ రహిత పట్టణంగా సిరిసిల్లను ప్రకటించాం. రాజకీయ పార్టీలు, మత, విద్యా, వ్యాపార సంస్థలు, సహకార, విద్యార్థి సంఘాలు, వ్యక్తులు ఎవరూ కూడా ఆదివారం నుంచి చౌరస్తాలు, ఎక్కడైనా ఫ్లెక్షీలు కట్టడం, ప్రదర్శించడం చేయరాదు. చనిపోయిన వారి చిత్రాలు, ఫొటలతో కూడిన ఫ్లెక్షీలు కూడా పెట్టొద్దు. వ్యాపారసంస్థలు, వ్యక్తులు ప్లాస్టిక్, పాలిథిన్ క్యారీ బ్యాగులు అమ్మడం, వాడడం చేయొద్దు. నిబంధనలు అతిక్రమిస్తే భారీ జరిమానా విధింస్తాం. నూతన సంవత్సరంలో వందశాతం ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దుతాం. ప్లాస్టిక్ నిషేధంపై ప్రచారాన్ని విస్తృతం చేశాం. ప్రజలు, వ్యాపారులు కూడా ఇందుకు సహకరించాలి. – బడుగు సుమన్ రావు, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ -
ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లపై ఏం చర్యలు తీసుకున్నారు
- ఏర్పాటు చేసిన వాటిని తొలగిస్తున్నామంటే ఎలా? - పాత వాటి స్థానంలో కొత్తవి పెట్టుకునేందుకే తొలగిస్తున్నట్లుంది - వారికి జరిమానాలు ఎందుకు విధించడం లేదు - కఠినంగా వ్యవహరిస్తేనే పరిస్థితులు దార్లోకొస్తాయి - జీహెచ్ఎంసీకి హైకోర్టు ఆదేశం.. విచారణ 25కు వాయిదా సాక్షి, హైదరాబాద్: నగరంలో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు, కటౌట్లను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నామన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) వాదనపై హైకోర్టు మండిపడింది. తొలగించిన వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసుకునే ందుకే ఉన్న వాటిని తొలగిస్తున్నట్లున్నారంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేసిన వారికి ఎందుకు జరిమానా విధించడం లేదని ప్రశ్నించింది. ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తేనే పరిస్థితులు దార్లోకి వస్తాయని పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు, కటౌట్లు ఏర్పాటు చేస్తున్న వారి పై ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని ఆదేశిస్తూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావుతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. నగరంలో నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేస్తున్నా జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదని తెలంగాణ వనరుల పరిరక్షణ కమిటీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని సోమవారం విచారించిన ధర్మాసనం.. ఓ నిర్ధిష్ట ప్రదేశంలో కాకుండా ఎక్కడపడితే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారని, చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. జీహెచ్ఎంసీ తరఫు న్యాయవాది పి.కేశవరావు వాదనలు వినిపిస్తూ నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన 2,385 కటౌట్లు తొలగించామని చెప్పారు. దీనికి ధర్మాసనం తీవ్రంగా స్పందిస్తూ.. తొలగిస్తున్నామని చెప్పడంలో ఏ మాత్రం అర్థం లేదని, నిబంధనలకు విరుద్ధంగా ఎవరో ఏర్పాటు చేసిన వాటిని సొంత ఖర్చుతో తొలగించడంలో అర్థమేమిటని ప్రశ్నించింది. ఇష్టారాజ్యంగా ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేసిన వారికి ఎందుకు జరిమానా విధించడం లేదని ప్రశ్నించింది. తమకు రోడ్డుపై ప్రతీ రోజూ లెక్కకు మించి ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు కనిపిస్తున్నాయని, ఓ నిర్ధిష్ట ప్రదేశంలో కాక ఇలా ఎక్కడ పడితే అక్కడ ఏర్పాటు చేయడం సరికాదని పేర్కొంది. ఈ విషయాన్ని జీహెచ్ఎంసీకే పరిమితం చేయవద్దని, అన్ని మున్సిపల్ కార్పొరేషన్లకు వర్తింప చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేస్తున్న వారిపై తీసుకున్న చర్యలను వివరించాలని కేశవరావుకు స్పష్టం చేసింది. ఇందుకు ఆయన గడువును కోరడంతో ధర్మాసనం అందుకు అంగీకరిస్తూ విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది. -
సిటీ నెత్తిన హోర్డింగ్ పిడుగు!
♦ నగరంలో ఇష్టారాజ్యంగా హోర్డింగ్‌లు, యూనిపోల్స్ ♦ నిబంధనలు బేఖాతరు.. ♦ ప్రమాదాలు జరిగినప్పుడే స్పందిస్తున్న యంత్రాంగం ♦ జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు ఘటనతో చర్యలకు దిగిన వైనం ♦ కొత్తపాలసీ రూపకల్పనకు నిర్ణయం సాక్షి, సిటీబ్యూరో : వానొచ్చినా...గట్టిగా గాలి వీచినా నగర వాసి ఉలిక్కి పడుతున్నాడు. ఏ వైపు నుంచి ఏ ముప్పు వస్తుందోనని ఆందోళన చెందుతున్నాడు. భారీ హోర్డింగులు, చెట్లు, విద్యుత్ స్తంభాలు ఎక్కడ పడితే అక్కడ కూలుతుండడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడపాల్సి వస్తోంది. అస్తవ్యస్తంగా ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లు, యూనిపోల్స్ మరీ ప్రమాదకరంగా మారడం ఆందోళన కలిగిస్తోంది. నగరంలో భవనాలు కూలితే అనుమతులున్నాయో లేదో పరిశీలించడం, అగ్నిప్రమాదాలు జరిగితే ఫైర్ సేఫ్టీ హోర్డింగ్ పిడుగులు! ఏర్పాట్లున్నాయో లేవో చూడటం, హోర్డింగులు కూలితే స్ట్రక్చరల్ స్టెబిలిటీ ఇతరత్రా అంశాలు చర్చకు రావడం పరిపాటిగా మారింది. ప్రమాదాలు జరిగినప్పుడు తప్ప సాధారణ సమయాల్లో వీటిపై శ్రద్ధచూపని యంత్రాంగం...తాజాగా శుక్రవారం గాలివాన బీభత్సానికి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ సమీపంలోని యూనిపోల్ కుప్పకూలి పలు కార్లు ధ్వంసం కావడంతో కళ్లు తెరిచింది. ఈ మేరకు అధికారులు శనివారం హోర్డింగుల అంశంపై అత్యవసర సమావేశం నిర్వహించారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అదే జనంపై పడితే జరిగి ఉండే ప్రాణ నష్టాన్ని అంచనా వేసి పటిష్ట చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. వాస్తవానికి నగరంలో అక్రమంగా వెలిసిన హోర్డింగులు, యూనిపోల్స్‌పై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవు. అసలు ఎన్ని అక్రమంగా ఉన్నాయో, ఎన్నింటికి ఫీజులు చెల్లిస్తున్నారో కూడా తెలియదు. ఓవైపు చాలినంత యంత్రాంగం లేక, మరోవైపు ఉన్న యంత్రాంగాన్ని సైతం వివిధ ఇతర పనులకు వినియోగిస్తుండటంతో వీటిపై శ్రద్ధ చూపిన వారు లేరు. అరకొర సిబ్బందితో ఏ క్ష ణాన ఏ హోర్డింగ్ కుప్పకూలుతుందో కూడా తెలియని దుస్థితి. 2007లో బంజారాహిల్స్‌లో ఒక యూనిపోల్ కూలి ఒకరు మృతి చెందడంతోపాటు పలువురు గాయాలపాలైనప్పుడు భవిష్యత్‌లో తిరిగి అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకని, తగిన విధివిధానాలు రూపొందించారు. కానీ, వాటిని ఆచరణలో పాటించడం లేదు. కొద్ది కాలం వరకు మాత్రం నిబంధనలు పాటించినప్పటికీ, అనంతరం విస్మరించారు. అప్పటినుంచి ఇప్పటి వరకు అడపా దడపా ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రం స్ట్రక్చరల్ స్టెబిలిటీ అంశం ప్రస్తావనకొస్తోంది. ప్రతి ఏటా లేదా రెండేళ్లకోమారు స్ట్రక్చరల్ స్టెబిలిటీ సర్టిఫికెట్ తప్పనిసరి అనే ప్రకటనలు తప్ప అమలు కావడం లేవు. తాజా ఘటన నేపథ్యంలో తిరిగి వీటిపై దృష్టి సారించారు. నగరంలో జీహెచ్ఎంసీ అధికారిక సమాచారం మేరకు 2600లకు పైగా హోర్డింగ్‌లుండగా, అనుమతిలేకుండా వెలసినవి రెట్టింపు సంఖ్యలో ఉంటాయని అధికారులు సైతం అంచనా వేశారు. హోర్డింగుల ఏర్పాటుకు సంబంధించి న్యాయస్థానాల సూచనలు, వివిధ కమిటీల సిఫార్సులను పరిగణనలోకి తీసుకోవడంతోపాటు ఆయా నగరాల్లో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేసి వీటి ఏర్పాటుకు సంబంధించి నిపుణులతో తగిన పాలసీని రూపొందించాలని నిర్ణయించారు. ప్రస్తుతానికి అన్ని హోర్డింగులను, వినైల్స్ను, తొలగించి వాటి స్ట్రక్చరల్ స్టెబిలిటీని నిర్ధారించాకే, కొత్త పాలసీకనగుణంగా హోర్డింగుల ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనున్నారు. దాదాపు 60 కి.మీల వేగంతో కూడిన గాలులను మాత్రం పరిగణనలోకి తీసుకొని గతంలో పాలసీని రూపొందించగా, తాజా ఘటనతో 100 నుంచి 150 కి.మీ. వేగానికి తగిన విధంగా రూపొందించాలని భావించారు. హోర్డింగ్ డిస్ప్లే సైజు సైతం 40 అడుగులకు మించి ఉండరాదని నిర్ణయించారు. జోన్‌కు ఇద్దరు చొప్పున జీహెచ్ఎంసీలో పదిమంది స్ట్రక్చరల్ ఇంజినీర్లు, నిపుణులతో హోర్డింగ్‌ల సామర్ధ్యంపై అంచనా వేయనున్నారు. ప్రైవేటు ఏజెన్సీలు వాటంతటవే అసెస్ చేసుకునేందుకు సైతం అనుమతిచ్చారు. పదిరోజుల్లో ఈ ప్రక్రియను పూర్తిచేసి, కొత్త పాలసీని రూపొందించి అందుకనుగుణంగా మాత్రమే హోర్డింగ్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఎవరైనా హోర్డింగులను తొలగించని పక్షంలో క్రిమినల్ చర్యలు చేపట్టనున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ హెచ్చరించారు. గతంలోని నిబంధనల మేరకు.. ♦ హోర్డింగ్ ఏర్పాటుచేసే భవన యజమాని అనుమతి పొందాలి. ♦ ఫుట్‌పాత్‌లు, క్యారేజ్‌వేలపై ఎలాంటి హోర్డింగ్‌లు, యూనిపోల్స్ ఉండరాదు. ♦ నిర్ణీత వ్యవధుల్లో స్ట్రక్చరల్ స్టెబిలిటీ సర్టిఫికెట్స్ అందజేయాలి. ♦ స్ట్రక్చరల్ డిజైన్లు, స్టెబిలిటీ సర్టిఫికెట్లను గుర్తింపుపొందిన స్ట్రక్చరల్ ఇంజినీర్ల నుంచి తీసుకోవాలి. ♦ హోర్డింగ్ ఏర్పాటులోనూ పటిష్టమైన ఏర్పాట్లుండాలి. ♦ అదనపు వినైల్ షీట్లను వినియోగించరాదు. -
హోర్డింగ్ కూలిపడి వ్యక్తి మృతి
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో శుక్రవారం ఉదయం భారీ గాలివాన బీభత్సం సృష్టించింది. తాడేపల్లి బైపాస్‌లో ఆంధ్రాబ్యాంకు సమీపంలో హైవేపై హోర్డింగ్ కూలి ఓ వ్యక్తిపై పడిపోయింది. దీంతో అతడు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. -
'మీరు చెప్పేది నమ్మశక్యంగా లేదు'
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హోర్డింగ్స్, బ్యానర్లు, కటౌట్ల ఏర్పాటుపై హైకోర్టు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. అనుమతులు లేకుండా వెలసిన బ్యానర్లు, హోర్డింగ్స్, కటౌట్లను తక్షణమే తొలగించాల్సిందేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. అక్రమ హోర్డింగ్‌లపై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఎలాంటి అక్రమ హోర్డింగ్స్ లేవని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనిపై హైకోర్టు సీరియస్‌గా స్పందించింది. 'మీరు చెప్పేది నమ్మశక్యంగా లేదు. అనుమతులు లేకుండా వెలసిన హోర్డింగ్స్‌పై జన్మదిన శుభాకాంక్షలా?. దీనిపై రెండు వారాల్లో నివేదిక ఇవ్వండి' అని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను రెండువారాలకు వాయిదా వేసింది. కాగా రాజకీయ పక్షాలు తమ పార్టీల నాయకులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆహ్వానాలు పలుకుతూ ఇష్టారాజ్యంగా ఎక్కడ బడితే అక్కడ బ్యానర్లు, హోర్డింగ్స్ ఏర్పాటు చేసేస్తున్న విషయం తెలిసిందే. -
గాంధీభవన్‌లో NSUI సమావేశం
-
అక్రమ సంపాదనతో భారీ ప్రచారం
♦ టీఆర్ఎస్పై ఉత్తమ్‌కుమార్ రెడ్డి ధ్వజం ♦ అరాచకాలను ఎండగట్టాలి ♦ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ ఉగ్రవాది: భట్టి సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్ఎస్ పార్టీ అక్రమ సంపాదనతో భారీ హోర్డింగులు, ఫ్లెక్సీలతో బూటకపు ప్రచారం చేసుకుంటోందని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా అభివృద్ధి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన కృషి చాలా ఉందన్నారు. కాంగ్రెస్ హయాంలోని అభివృద్ధిని తమ ఘనతగా టీఆర్ఎస్ నేతలు ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. శనివారం గాంధీభవన్‌లో జరిగిన ఎన్ఎస్యూఐ సమావేశంలో ఉత్తమ్ మాట్లాడారు. టీఆర్ఎస్ నాయకుల అరాచకాలను, అప్రజాస్వామిక పద్ధతులను ప్రజలకు తెలియజేయడానికి సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికల్లో గెలవడానికి టీఆర్ఎస్ అన్ని అడ్డదారులను తొక్కుతోందంటూ వీటిపై టీపీసీసీ రూపొందించిన వీడియో క్లిప్పింగులను విద్యార్థి నేతలకు ఉత్తమ్ చూపించారు. హైదరాబాద్‌కు గోదావరి జలాలు, మెట్రో రైలు, ఔటర్ రింగురోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం వంటి వాటికి కాంగ్రెస్ చేసిన కృషిని ప్రజలకు వివరించాలని చెప్పారు. హైదరాబాద్‌లో ఉంటున్న సెటిలర్లకు అందరితోపాటు సమానహక్కులుంటాయన్నారు. టీఆర్ఎస్కు ఓటేస్తే వృథా అయినట్టేనని పేర్కొన్నారు. టీఆర్ఎస్ కుట్రలు: భట్టి ప్రతిపక్షాలను లేకుండా చేయాలని, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ ఉగ్రవాదిగా వ్యవహరిస్తున్నారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. గ్రేటర్ ఎన్నికల్లో గెలుపుకోసం ఇప్పటికే టీఆర్ఎస్ సర్కారు చాలా కుట్రలు చేసిందని ఆరోపించారు. ఎన్నికల నిర్వహణలో శాస్త్రీయత, పారదర్శకత లేకుండా వ్యవహరిస్తున్నదన్నారు. న్యాయస్థానాలు మొట్టికాయలు వేసినా, ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చినా అధికారపక్షం బరితెగించి పనిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రేటర్‌లోని ఏ దామాషా ప్రకారం డివిజన్ల రిజర్వేషన్లు చేశారని ప్రశ్నించారు. చండీయాగం దాతలెవరు: షబ్బీర్ అలీ సీఎం కేసీఆర్ నిర్వహించిన చండీయాగానికి 7.5 కోట్లు ఖర్చు అయినట్టు స్వయంగా ఆయనే చెప్పారని, దానికి విరాళాలు ఇచ్చిన దాతల పేర్లను చెప్పాలని శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. కేసీఆర్‌కు ప్రచార పిచ్చి పట్టుకుందని, పబ్లిక్ టాయిలెట్లను కూడా కేసీఆర్ ఫొటోలతో నింపేస్తున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కాళ్ల దగ్గర మజ్లిస్ నేత అసదుద్దీన్ ఒవైసీ ఫొటోలు న్నాయని, ముస్లిం వేషధారణలో ఉన్న ఒవైసీ ఫొటోను అక్కడ పెట్టి ముస్లిం లను అవమానిస్తున్నారన్నారు. ముస్లింలకు కేసీఆర్, అసదుద్దీన్ క్షమాపణ చెప్పాలని షబ్బీర్ డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావును మించిన అబద్ధాలకోరు దేశంలోనే లేరని విమర్శించారు. వీసాలపై న్యాయసలహాలు అమెరికా వెళ్లి ఇబ్బం దులు పడుతున్న తెలంగాణ విద్యార్థులకు ఆదివారం న్యాయ నిపుణుల ద్వారా ఉచితంగా న్యాయసలహాలను అందిస్తామని ఏఐసీసీ అధికార ప్రతినిధి మధు యాష్కీ, టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ వినోద్‌కుమార్ తెలిపారు. అమెరికా వెళ్తున్న విద్యార్థులు అవగాహన లేకపోవడం వల్ల ఆర్థికంగా నష్ట పోతు న్నారని, అక్కడ ఇబ్బందులు పడుతున్నా రని చెప్పారు. -
పోలీసులు శివసేన హోర్డింగులు పీకేశారు
ముంబయి: ముంబయి పోలీసులు శివసేన పార్టీ ఏర్పాటు చేసిన ప్లెక్సీలను, హోర్డింగ్‌లను పీకేశారు. ప్రధాని నరేంద్రమోదీని కించపరిచేలా, ఎత్తిపొడిచేలా అవి ఉండటంతో వాటిని తొలగించారు. ఆ ఫ్లెక్సీల కారణంగా బీజేపీ, శివసేన పార్టీ కార్యకర్తల మధ్య, నాయకుల మధ్య వివాదం తలెత్తి శాంతిభద్రతలకు భంగం కలగకూడదనే ఉద్దేశంతోనే వాటిని తొలగించినట్లు పోలీసులు తెలిపారు. శివసేన భాగస్వామ్యంతో బీజేపీ మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే, గత కొద్ది రోజులుగా ఆ రెండు పార్టీల మధ్య అస్సలు పొసగడం లేదు. ఆ పార్టీకి చెందిన నాయకులు ఎదురెదురుపడకముందే తూటాల్లాంటి మాటలు పేల్చుకుంటున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అన్నంత పరిస్థితి ఆ రెండు పార్టీల మధ్య నిశ్శబ్దంగా కొనసాగుతుంది. దసరా పండుగ నేపథ్యంలో నిర్వహిస్తున్న ర్యాలీ సందర్భంగా శివసేన ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. వాటిల్లో ఒకప్పుడు శివసేన అధినేత బాల్ ఠాక్రే ముందు నేటి ప్రధాని నరేంద్రమోదీ తలవొంచి నవ్వుతూ నమస్కరిస్తున్న ఫొటోలు ఉంచారు. 'నాటి రోజులు అప్పుడే మర్చిపోయావా? మీలాంటి గర్విష్టులంతా ఠాక్రే పాదాల ముందు తలవంచినప్పటి రోజులు మీరంతా మర్చిపోయారా?' అంటూ వ్యాఖ్యలు పెట్టారు. వాజపేయి, ఎల్ కే అద్వానీ, రాజనాథ్ సింగ్ వీళ్లంతా ఒకప్పుడు ఠాక్రే పాదాల ముందు మోకరిల్లినవారే అన్నట్లుగా ఫ్లెక్సీల్లో వ్యాఖ్యలు పెట్టారు. దీంతో ఇవి రెండు పార్టీల మధ్య పెను ధుమారం రేపే అవకాశం ఉన్నందున పోలీసులు వాటిని తొలగించారు. -
ప్రచార పటాటోపం
కోట్లు కుమ్మరిస్తున్న ప్రభుత్వం జిల్లా అంతటా హోర్డింగ్‌లు ఆర్థిక లోటులోనూ వృథా ఖర్చు ప్రచార ఆర్భాటంపై విమర్శల వెల్లువ విశాఖపట్నం: అధికారం చేపట్టి తొమ్మిది నెలలవుతున్నా అభివృద్ధిలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటనలకు, సెమినార్లలో సావనీర్లు విడుదలచేసి పంపిణీకి డబ్బులు మంంచినీళ్లలా ఖర్చు చేస్తున్నారు. ప్రచారం పేరుతో వృథా ఖర్చు ప్రారంభించారు. జిల్లాలో ఏ మూలకెళ్లినా బాబు ప్రచార హోర్డింగ్‌లే కనిపిస్తున్నాయి. బస్సులపైనే కాదు..బస్షెల్టర్లు, ప్రధాన,మారుమూల కూడళ్లలో సైతం భారీ హోర్డింగ్‌లు దర్శనమిస్తున్నాయి. ఫిబ్రవరి 25వ తేదీ నుంచి మార్చి 24వ తేదీ వరకు ఈ ప్రచార హోర్డింగ్‌ల కోసం ఒక్క విశాఖ జిల్లాలోనే అక్షరాల కోటిన్నర ఖర్చు చేస్తున్నారు. ఇక రాష్ర్టవ్యాప్తంగా ఎన్ని కోట్లు ఈ రూపంలో తలగేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాష్ర్టంలో రైతులకు రూ.87వేల కోట్ల రుణాలు మాఫీ చేయాల్సి ఉండగా మొదటివిడతలో కేవలం నాలుగున్నరవేల కోట్లతో సరిపెట్టింది. రెండోవిడత కోసం బడ్జెట్లో మరో 5వేల కోట్లు మాత్రమే కేటాయించింది. కానీ రెండువిడతల్లో 82.66లక్షల మందిరైతులకు రుణవిముక్తి కల్పించినట్టుగా ప్రచార హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. ఇవేకాదు..ఇలాంటి లేనిగొప్పలు చెప్పుకుంటూ వెలిసిన హోర్డింగ్‌ల పట్ల సర్వత్రా విమర్శలువెల్లువెత్తుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 544 ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేశారు. సుమారు 2,75,980 చదరపు అడుగుల్లో ఏర్పాటు చేసిన హోర్డింగ్‌ల కోసం రూ.89,42,690లు ఖర్చు చేస్తున్నారు. ఇక సుమారు 160 బస్షెల్టర్లలో 36,557 చదరపు అడుగుల హోర్డింగ్‌ల కోసం రూ. 52,51, 570 ఖర్చు చేస్తున్నారు. ఇలా ప్రచారహోర్డింగ్ల కోసం ఏకంగా కోటి 41 లక్షల 94 వేల 260 చెల్లించాలని ప్రతిపాదించారు. ఈ విధంగా రాష్ర్ట వ్యాప్తంగా 13 జిల్లాల్లో తమ ప్రభుత్వ గొప్పతనం ప్రచారం కోసం సర్కార్ అక్షరాల రూ.20కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్టు తెలియవచ్చింది. ఇక బస్సులపై ఏర్పాటు చేసిన హోర్డింగ్‌ల కోసం మరో నాలుగైదు కోట్లు ఖర్చు చేస్తున్నట్టు చెబుతున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడమే లక్ష్యంగా సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ప్రచారార్భాటం కోసం గత నెలలో జిల్లాకు మూడు ప్రచార రథాలను కేటాయించారు. ఒక్కొక్క రథం ప్రతీరోజు రెండు గ్రామాలను సందర్శించే విధంగా డిజైన్ చేసిన ఈ కార్యక్రమం కోసం రాష్ర్టంలో రూ.4కోట్ల వరకు ఖర్చు చేశారు. మళ్లీ ఇప్పుడు ఈ హోర్డింగ్‌ల పేరుతో మరో రూ.20కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఆర్థిక లోటు సాకుతో ట్రెజరీ ద్వారా చెల్లింపులపై కూడా ఆంక్షలు విధించిన ప్రభుత్వం బొటాబొటీగా జీతభత్యాలు మాత్రమే చెల్లిస్తూ మిగిలిన చెల్లింపులకు సవాలక్ష కొర్రీలు వేస్తోంది. ట్రెజరీల్లో వందల కోట్లకు చెందిన వేలసంఖ్యలో బిల్లులు పెండింగ్‌లో పడిపోతున్నాయి. ఆర్థిక ఇబ్బందులున్న సమయంలో ప్రచారం కోసం ఈ వృథా ఖర్చు లెందుకని విపక్షాలు.. మేధావులు విమర్శలు గుప్పిస్తున్నారు. -
ముఖకాంతికి...
చదివింత... సత్యవర్షి నీ దూకుడు... ‘బొమ్మకు చెలగాటం వాహనదారులకు ప్రాణ సంకటం’ అన్నట్టు పరిస్థితి మారడంతో అధికారులు రంగంలోకి దిగక తప్పలేదు. అమెరికాలోని లోవా ప్రాంతపు యుఎస్ రూట్ 61లో ఓ కార్డీలర్ తన ప్రచారం కోసం భారీ హోర్డింగ్ని ఏర్పాటు చేశాడు. అత్యంత వ్యయప్రయాసలతో ఏర్పాటు చేసిన ఈ హోర్డింగ్ చాలా సహజంగా, వినూత్నంగా అనిపిస్తూ అందర్నీ ఆకట్టుకుంటోంది. అచ్చం మనిషిలా అనిపించే మానిక్వెన్ను కూడా ఆ బోర్డ్ మీద ఏర్పాటు చేశారు. చూసేవాళ్లకి హోర్డింగ్ అవతలి నుంచి ఇవతలకి ఎవరో దూకుతున్నట్టు ఉంటుందది. అంతవరకూ బానే ఉంది కానీ.. ఇది మరీ సహజంగా ఉండడంతో... దారిన పోయే వాహనచోదకులు బెంబేలెత్తడం ప్రారంభించారు. ‘‘ఎవరిదో ఆ దూకుడు? మీరొచ్చి కాస్త ఆపుడు’’ అంటూ అక్కడి ప్రభుత్వ ఎమర్జన్సీ నెంబరు 911కు వరుసపెట్టి ఫోన్లు రావడం ప్రారంభించాయి. దీంతో చిర్రెత్తిన ప్రభుత్వవర్గాలు... సదరు బోర్డును తొలగించమంటూ ఆదేశాలు జారీ చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో బోర్డును తొలగించిన వెస్ట్ బర్లింగ్టన్ వాసి కార్ డీలర్ బ్రాడ్ డెర్రీ... ‘‘ఈ బోర్డును ఎంతో ఇష్టపడి తయారు చేయించా. చాలా మంది దీన్ని మెచ్చుకున్నారు, సెల్ఫీలు దిగారు కూడా. కాని భద్రత దృష్ట్యా తొలగించక తప్పడం లేదు’’ అంటూ విచారం వ్యక్తం చేశాడు. -
వీరింతే..
అధికారిక లెక్కల మేరకు అనుమతి పొందిన హోర్డింగులు: 2425 అధికారిక లెక్కల మేరకు అనుమతి లేనివి: 300 ఒక అంచనా మేరకు అనుమతి లేని హోర్డింగులు: 1500 అనుమతి లేని ఫ్లెక్సీలు, ఇతరత్రా : 10, 000 ప్రాణాంతకంగా మారుతున్న హోర్డింగ్‌లు అనుమతి లేకుండా ఏర్పాటు పట్టించుకోని అధికార గణం హైకోర్టు ఆదేశించినా స్పందన అంతంతే మృత్యువు చేతులు చాచినట్టు దారి పొడవునా అనుమతి లేని హోర్డింగులు వేలాడుతున్నాయి. అధికారుల కళ్ల ముందే ఎంతోమంది క్షతగాత్రులుగా మారుతున్నారు. మరికొంతమంది ఇప్పటికే ప్రాణాలూ పోగొట్టుకున్నారు. ‘అయ్యో’ అనడమే తప్ప... అక్రమాన్ని అరికట్టాలని మన యంత్రాంగానికి అనిపించడం లేదు. న్యాయస్థానం చెబితే పట్టించుకుంటారనుకుంటే... తమదైన శైలిలో లెక్కలతో మాయ చేశారు. మరోసారి స్పందించిన న్యాయస్థానం అదే విషయాన్ని గుర్తు చేసింది. ఇదంతా తమకు అలవాటే అన్నట్టుగా ‘కదులుతున్నట్టు’ నటిస్తున్నారు. అవి మాత్రం అలాగే ఉన్నాయి. సిటీబ్యూరో: గ్రేటర్ నగరంలో అడుగడుగునా వేలాడుతున్న అనుమతి లేని హోర్డింగులు, ఫ్లెక్సీలు, ప్లాస్టిక్ బ్యానర్లు ప్రమాదాలను ఆహ్వానిస్తున్నాయి. ప్రమాణాలు పాటించకపోవడంతో ఎప్పటికప్పుడు కింద పడుతున్నాయి. ఇప్పటికే ఎంతోమంది వీటి కారణంగా గాయపడ్డారు. కొంతమంది ప్రాణాలూ కోల్పోయారు. వీటిని తొలగించాల్సిందిగా హైకోర్టు ఆదేశించినప్పటికీ, అమలు చేసే వారే కనిపించడం లేదు. కనీసం కొత్తవి పెట్టకుండా అడ్డుకునే ప్రయత్నమూ చేయడం లేదు. రాజకీయ హోర్డింగులకు 24 గంటల వరకే ప్రత్యేక అనుమతులిస్తుండగా... నెలల తరబడి తొలగించడం లేదు. అయినా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఎప్పటికప్పుడు అక్రమ హోర్డింగులను తొల గిస్తున్నామని చెబుతున్నప్పటికీ అమలులో కనిపించడం లేదు. తాజాగా రెండు వారాల క్రితం హైకోర్టు మరోసారి వీటిపై స్పం దించింది. అక్రమ హోర్డింగులు, ఫ్లెక్సీలను వెంటనే తొలగించాల్సిందిగా ఆదేశించింది. అయినా అధికారులు స్పందించలేదు. హోర్డిం గులకు స్ట్రక్చరల్ స్టెబిలిటీ ఉన్నట్లు సర్టిఫికెట్ ఉంటేనే అనుమతించాల్సి ఉంది. ఈ విషయాన్నీ పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఇక రాజకీయ సభలు ఉంటే ఎక్కడ పడితే అక్కడ హోర్డింగులు, ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పా టు చేస్తున్న వారు వెంటనే వాటిని తొలగించడం లేరు. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. తాత్కాలింగా ఏర్పాటు చేస్తున్న అక్రమ హోర్డింగులను తొలగించాల్సిందిగా హైకోర్టు గతంలో ఆదేశించింది. వాటిని తొలగించడంతో పాటు నిర్ణీత వ్యవధిలోగా నివేదిక అందించాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించింది. దీనిపై స్పందించిన అధికారులు దాదాపు 750 అక్రమ హోర్డింగులు ఉన్నాయని... వాటిలో 600కు పైగా తొలగించామని... మిగిలినవి తొలగిస్తున్నామని అప్పట్లో నివేదించారు. ఆ తర్వాత ఆ సంగతే మరచిపోయారు. ఇటీవల మరోసారి హైకోర్టు ఆదేశించడంతో తిరిగి చర్యలకు సిద్ధమవుతున్నారు. సర్కిళ్ల వారీగా అక్రమ హోర్డింగులను గుర్తించి, వెంటనే తొలగించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశిం చారు. అయితే ఆశించిన స్థాయిలో ఈ పనులు సాగడం లేదు. కొన్ని ప్రాంతాల్లోని హోర్డింగులు ఏ క్షణాన ఎవరిపై పడతాయో తెలియని స్థితిలో ఉన్నాయి. దాదాపు 2500 అక్రమ హోర్డింగులు ఉన్నట్లు అధికారులు చెబుతుండగా... వాస్తవంగా ఈ సంఖ్య అంతకు రెట్టింపే ఉంటుందని అంచనా. అక్రమ హోర్డింగుల విషయమై జీహెచ్ఎంసీ స్పెషలాఫీసర్ సోమేశ్ కుమార్ వద్ద గురువారం ప్రస్తావించగా, వీటిని తొలగించామని చెప్పారు. ఇంకా ఎక్కడైనా మిగిలి ఉంటే తొలగిస్తామన్నారు. వాటిని చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. -
హోర్డింగ్స్, బ్యానర్లు, కటౌట్లు పీకిపారేయండి
-
హోర్డింగ్స్, బ్యానర్లు, కటౌట్లు పీకిపారేయండి
హైదరాబాద్ : హోర్డింగ్స్, బ్యానర్లు, కటౌట్ల ఏర్పాటుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అనుమతులు లేకుండా వెలసిన బ్యానర్లు, హోర్డింగ్స్, కటౌట్లను తక్షణమే తొలగించాల్సిందేనని న్యాయస్థానం శుక్రవారం స్పష్టం చేసింది. ఈ మేరకు ఇరు రాష్ట్రాల డీజీపీలు, కలెక్టర్లు, ఎస్పీలు, మున్సిపల్ అధికారులను ఆదేశించింది. బహిరంగ ప్రదేశాల్లో ఫ్లెక్సీలు, బ్యానర్లు పెట్టడం వల్ల ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారని, ప్రభుత్వం జీవో జారీ చేసినా వాటిని అమలు చేయడం లేదంటూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. న్యాయవాది ఎంఎస్ఎన్ ప్రసాద్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. విచారణ చేపట్టిన హైకోర్టు ..ఈ మేరకు ఆదేశాలు ఇస్తూ విచారణను జనవరి చివరి వారానికి వాయిదా వేసింది. అలాగే ఏపీ, తెలంగాణలో ఏర్పాటు చేసిన విగ్రహాలపై సమీక్ష జరిపి నిర్ణయాలు తీసుకోవాలని రెండు రాష్ట్రాలకు హైకోర్టు ఆదేశించింది. రాజకీయ పక్షాలు తమ పార్టీల నాయకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆహ్వానాలు పలుకుతూ ఇష్టారాజ్యంగా ఎక్కడ బడితే అక్కడ బ్యానర్లు, హోర్డింగ్స్ ఏర్పాటు చేసేస్తున్న విషయం తెలిసిందే. -
బ్యానర్లు తొలగిస్తున్న బీఎంసీ
సాక్షి, ముంబై : నగరంలో రాజకీయ బ్యానర్లు, హోర్డింగ్‌లను బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) తొలగించే పనులు చేపట్టింది. నూతన ముఖ్యమంత్రికి, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు తెలుపుతూ నగరంలోని చాలా ప్రాంతాల్లో వేలాది బ్యానర్లు, పోస్టర్లను అక్రమంగా ఏర్పాటు చేశారు. దీంతో వీటి తొలగింపునకు బీఎంసీ ఉపక్రమించింది. బీఎంసీ అధికారుల కథనం ప్రకారం.. వ్యక్తిగత, రాజకీయ పోస్టర్లు, బ్యానర్లను ఏర్పాటు చేయడానికి 2013 సెప్టెంబర్‌లో బీఎంసీ ఓ విధానాన్ని రూపొందించింది. ఈ మేరకు పుట్టిన రోజు శుభాకాంక్షలు, స్వాగత హోర్డింగ్‌లు, రాజకీయ, వ్యక్తిగత పోస్టర్లు, బ్యానర్ల ఏర్పాటుకు బీఎంసీ అనుమతించింది. అయితే వాటి పరిమాణం కేవలం 10 గీ 10 అడుగులు మాత్రమే ఉండాలనే నిబంధన విధించింది. అలాగే వాటిని ఒక్కరోజు మాత్రమే ఉంచేందుకు అనుమతించింది. ఆ తర్వాత కూడా సదరు బ్యానర్లు, హోర్డింగ్‌లను అలాగే వదిలేస్తే బాధ్యులపై బీఎంసీ చర్యలు తీసుకోవచ్చు. వారికి రూ.1,000 నుంచి రూ.2 వేల వరకు జరిమానా లేదా మూడు నెలల జైలు శిక్ష విధించేందుకు అవకాశముంది. -
ప్రకటనలు జిగేల్.. ఆదాయం దిగాల్!
రిమ్స్ క్యాంపస్:పారిశ్రామిక, వ్యాపార సంస్థలు తమ ఉత్పత్తులకు ప్రచారం కల్పించేందుకు పట్టణ ప్రాంతాల్లో వాణిజ్య ప్రకటనలను హోర్డింగుల రూపంలో ప్రదర్శిస్తుంటాయి. ఇలా ప్రకటనల హోర్డింగులు ఏర్పాటు చేసుకునేందుకు ఆయా మున్సిపాలిటీలకు నిర్ణీత పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఆ విధంగా ప్రకటనల ద్వారా వసూలయ్యే పన్నులు మున్సిపాలిటీల ప్రధాన ఆదాయ వనరుల్లో ఒకటిగా మారాయి. అయితే ఈ పన్ను వసూళ్లు సక్రమంగా జరగకపోవడంతో రావాల్సినంత ఆదాయం లభించడం లేదు. ఇంకా విడ్డూరమేమిటంటే.. ప్రజల నుంచి వసూలు చేసే ఆస్తి, నీటి పన్నుల వగైరాలను ఠంచనుగా నిర్ణీత కాలపరిమితిలో పెంచుతూ ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్న మున్సిపాలిటీలు ప్రకటనల పన్ను విషయంలో మాత్రం అత్యంత ఉదారంగా వ్యవహరిస్తున్నాయి. ఎప్పుడో 14 ఏళ్ల క్రితం నిర్ణయించిన పన్నులే ఇప్పటికీ అమల్లో ఉన్నాయి. ప్రస్తుత సమాజంలో పారిశ్రామిక, వాణిజ్య సంస్థలే కాకుండా విద్యాసంస్థలు, సేవా సంస్థలు వంటివి కూడా ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రచార హోర్డింగులనే ఆశ్రయిస్తున్నాయి. ఇటువంటి హోర్డింగుల ఏర్పాటుకు చాలా ఏజెన్సీలు కూడా పని చేస్తున్నాయి. ఈ ఏజెన్సీలు పట్టణాల్లోని ముఖ్యమైన కూడళ్లలో హోర్డింగుల ఏర్పాటుకు మున్సిపాలిటీల నుంచి అనుమతులు పొందుతాయి. అందుకుగాను ఏడాదికోసారి పన్ను రూపంలో ప్రభుత్వం నిర్దేశించిన రుసుము చెల్లిస్తాయి. ప్రకటనకర్తలు ఈ ఏజెన్సీలతో మాట్లాడుకొని తమ హోర్డింగులను ఏర్పాటు చేయించుకుంటారు. జిల్లాలో శ్రీకాకుళం, ఆమదాలవలస, పలాస, ఇచ్ఛాపురం, రాజాం మున్సిపాలిటీల పరిధిలో వందకు పైగా చిన్న పెద్ద ఏజెన్సీలు పని చేస్తున్నాయి. వీటి ద్వారా మున్సిపాల్టిలకు కోట్లలో అధాయం రావల్సి ఉండగా, కేవలం లక్షల్లో మాత్రమే అధాయం చేకురుతొంది. అంటే ప్రకటనల ద్వారా మున్సిపాలిటీలకు కోట్లలో ఆదాయం రావాల్సి ఉండగా.. లక్షల్లో మాత్రమే వస్తోంది. ఒకటిన్నర దశాబ్దాలుగా పన్ను పెంపు లేదు ప్రకటనల హోర్డింగుల రుసుములకు సంబంధించి ఏ సైజుకు ఎంత రేటు తీసుకోవాలన్నది నిర్దేశిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేస్తుంది. ఐదారేళ్లకోసారి తాజా పరిస్థితులకు అనుగుణంగా ఈ రేట్లను సవరించాల్సి ఉంటంది. గతంలో1993 నుంచి అమల్లో ఉన్న పన్ను రేట్లను దాదాపు రెట్టింపు చేస్తూ 1998లో ప్రభుత్వం సవరించింది. ఈ రేట్లను 2000 అక్టోబర్ ఒకటో తేదీ నుంచి అమలు చేస్తున్నారు. సవరణ జరిగి 14 ఏళ్లు గడిచిపోయాయి. ఇప్పటికీ అవే రేట్లు అమలవుతున్నాయి. అన్ని రకాల ధరలు పెరిగిపోయాయి. మున్సిపాలిటీల్లో ఆస్తి, నీటి పన్నులు కూడా ఇబ్బడిముబ్బడిగా పెంచేశారు. అయినా ప్రకటనల పన్ను విషయం మాత్రం పట్టించుకున్న పాపాన పోలేదు. లెక్క ప్రకారం రెండుసార్లు పన్ను రివిజన్ జరిగి ప్రకటనల పన్ను దాదాపు నాలుగింతలు పెరగాల్సి ఉంది. ప్రభుత్వ ఉదాసీనత వల్ల అసలే ఆర్థిక సంక్షోభంలో ఉన్న మున్సిపాలిటీలు ప్రకటనల పన్ను ఆదాయాన్ని భారీగా కోల్పోతున్నాయి. జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం మున్సిపాలిటీనే తీసుకుంటే 2000 నాటి పన్ను రేట్లు వసూలు చేస్తుండటం వల్ల ఏడాదికి రూ.5.20 లక్షల ఆదాయమే సమకూరుతోంది. అదే పన్ను రివిజన్ జరిగి ఉంటే సుమారు రూ.21 లక్షలు వచ్చే అవకాశం ఉందని మున్సిపల్ అధికారవర్గాలే పేర్కొంటున్నాయి. అనధికార ప్రటకనలే ఎక్కువ అధికారిక వాణిజ్య ప్రకటనల పన్ను పెంచకపోవడం వల్ల ఆదాయం కోల్పోతుండటం ఒకెత్తయితే.. ప్రధాన కూడళ్లలో అధికారిక ప్రకటనల కంటే అనధికారిక ప్రకటనలే ఎక్కువ కనిపించడం మరో ఎత్తు. వీటి ద్వారా ఒక్క పైసా కూడా మున్సిపాలిటీకి ఆదాయం రావట్లేదు. ప్రకటనల ఏజెన్సీ ఒక హోర్డింగ్‌ను లీజ్‌కు తీసుకుంటే వాళ్లు ఒప్పందం కుదుర్చుకున్న వ్యాపార ప్రకటనే హోర్డింగ్‌పై ఉండాలి. దీన్ని అధికారిక ప్రకటనగా గుర్తిస్తారు. అలా కాకుండా ఆ హోర్డింగులతోపాటు ఖాళీగా ఉన్న హోర్డింగులపైనా రాజకీయ పార్టీలు, ఇతరత్రా చిన్నాచితకా సంస్థల ప్రచార పోస్టర్లు కనిపిస్తున్నాయి. అలాగే విద్యుత్ స్తంభాలకు, రోడ్లపై కర్రలు పాతి ఏర్పాటు చేసే ఫ్లెక్సీలను అనధికారిక ప్రకటనలుగా గుర్తిస్తారు. వీటిని ఎప్పటికప్పుడు గుర్తించి తొలగించడం, సంబంధిత సంస్థలపై చట్టప్రకారం చర్యలు తీసుకునే అధికారం ఉన్న మున్సిపల్ అధికారులు అటువంటి ప్రయత్నాలు చేస్తున్న దాఖలాలే కనిపించడం లేదు. దీని వల్ల మున్సిపాలిటీ అదాయం కోల్పోతోంది. -
హోర్డింగ్‌లతో ఆదాయం..
ఫిక్స్డ్ డిపాజిట్లు, స్టాక్ మార్కెట్లు లాంటివే కాకుండా చిన్న ఇన్వెస్టర్ల కోసం కొంగొత్త ఆదాయ మార్గాలు వస్తున్నాయి. ఇలాంటివే హోర్డింగ్‌లు, బిల్‌బోర్డులు వంటివి. కొన్ని చోట్ల హోర్డింగ్‌లను తొలగించాలంటూ వివాదాలు ఉన్నా నోయిడా, ముంబైలాంటి ప్రాంతాల్లో హోర్డింగ్‌లపై ఇన్వెస్ట్మెంటు ట్రెండు ఊపందుకుంటోంది. ఏరియా, ప్రకటనలను బట్టి సుమారు పది లక్షల రూపాయలు పెట్టి తీసుకున్న బిల్‌బోర్డ్స్ నెలకు దాదాపు రెండు లక్షల దాకా ఆదాయాన్ని అందిస్తున్నాయి. దీంతో చిన్న ఇన్వెస్టర్లు వీటిపై కూడా ఆసక్తి చూపిస్తున్నారు. సాధారణంగా ప్రభుత్వ రంగ సంస్థలవయితే బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొనే తీసుకోవాల్సి ఉంటుంది. అదే ప్రైవేట్ మాల్స్, బిల్డింగ్స్ వంటి వాటి లోనైతే ఆయా భవంతుల యజమానులతో ఇన్వెస్టర్లు ఒప్పందాలు కుదుర్చుకుని సదరు హోర్డింగ్‌లను అద్దెకు తీసుకోవచ్చు. ఆ తర్వాత అడ్వరై ్టజింగ్ ఏజె న్సీల సహాయంతో కస్టమర్లను సాధించుకోవచ్చు. ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయాన్ని అందుకునే ఇన్వెస్టర్లు హోర్డింగ్‌కి సంబంధించిన అద్దెలు, పన్నులు కట్టుకోవాల్సి ఉంటుంది. ప్రైవేట్ వాటితో పోలిస్తే ప్రభుత్వ విభాగాల అసెట్స్‌పై మెరుగైన రాబడులు అందుకోవ చ్చు. చాలా మటుకు ఇవి తక్కువ రేటుకి లభిస్తాయి..వచ్చే ఆదాయాలు మాత్రం ప్రాంతాన్ని బట్టి భారీగా ఉంటాయి. సందర్భాన్ని బట్టి కొన్ని సార్లు నెలకు అద్దె రూ. 5,000 రేంజిలో ఉంటే.. ప్రకటనల ద్వారా రూ. 50,000 దాకా కూడా ఆర్జించవచ్చనేది అడ్వరై ్టజ్మెంట్ రంగ సంస్థల మాట. -
బద్ధకమానిర్లక్ష్యమా
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో తొమ్మిది శాసనసభ నియోజకవర్గాలున్నాయి. వీటి పరిధిలో 18,52,970 మంది ఓటర్లున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో 13,25,045 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంటే 5,27,925 మంది ఓటర్లు ఎన్నికలకు దూరంగా ఉన్నారన్న మాట. జిల్లాలో నిజామాబాద్ కార్పొరేషన్‌తో పాటు బోధన్, కామారెడ్డి, ఆర్మూర్ మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇవే కాకుండా ఆయా నియోజకవర్గాల్లో మేజర్ పంచాయతీలూ పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. జిల్లాలో విద్యావంతులు, మేధావులు, మహిళలు, విద్యార్థులు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. ఎక్కువ మంది పోలింగ్‌కు దూరంగా ఉంటుండడంపై ఎలక్షన్ కమిషన్ దృష్టి సారించింది. 90 శాతం ఓటర్లు పోలింగ్‌లో పాల్గొనేలా చూడాలన్న లక్ష్యంతో ఎలక్షన్ కమిషన్ ఎన్నో చర్యలు తీసుకుంది. ఓటు హక్కు ప్రాధాన్యతను వివరిస్తూ విస్తృతంగా ప్రచారం నిర్వహించింది. ఓటర్లను చైతన్యవంతం చేయడానికి కమిటీలను నియమించింది. ప్రధాన కూడళ్లలో హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించింది. కళాబృందాలను రంగంలోకి దింపింది. మైకుల ద్వారా సైతం ప్రచారం చేపట్టింది. ఇంటింటికి అధికారులే వెళ్లి పోల్ చీటీలు ఇచ్చేలా చర్యలు తీసుకుంది. అయినా బద్ధకస్తులు కదల్లేదు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లలేదు. ఓటు హక్కు వినియోగించుకోలేదు. దీంతో పోలింగ్ శాతం 2 శాతానికి మించి పెరగలేదు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో మరీ దారుణంగా 52.02 శాతమే పోలింగ్ నమోదైంది. అయితే గత ఎన్నికలతో పోల్చితే ఈసారి అర్బన్‌లో కాస్త పోలింగ్ శాతం పెరగడం మాత్రమే అధికారులకు ఉపశమనం ఇచ్చింది. 2009 సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడ 39 శాతం పోలింగ్ నమోదు కాగా.. 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో 43 శాతం ఓటు హక్కు వినియోగించుకున్నారు. గ్రామాల్లోనే చైతన్యం పట్టణ ప్రాంతాల్లోని వారు పోలింగ్‌కు దూరంగా ఉండగా.. గ్రామీణులు మాత్రం ఎండను లెక్క చేయకుండా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేయడానికి ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచే బారులు తీరారు. ఏ పోలింగ్ కేంద్రం వద్ద చూసినా భారీ క్యూ కనిపించింది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అత్యధికంగా 78.86 శాతం పోలింగ్ నమోదు కాగా.. బాన్సువాడలో 76.76, జుక్కల్‌లో 76.46, బోధన్‌లో 75.44 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
అడ్డగోలుగా హోర్డింగులు
సాక్షి, రాజమండ్రి :సిటీలో రోడ్డుపై నడుస్తూ తల తిప్పితే చాలు.. రంగు రంగుల బొమ్మలతో వందలాది హోర్డింగులు కనిపిస్తుంటాయి. వివిధ కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రచారం చేసుకోవడానికి వీటిని ఏర్పాటు చేస్తుంటాయి. ఇటీవలి కాలంలో రాజకీయ నేతల నిలువెత్తు చిత్రాలు కూడా దర్శనం ఇస్తున్నాయి. ఇవన్నీ అనుమతులతో పెట్టారా లేక అడ్డుగోలుగా ఏర్పాటు చేశారా అన్న ప్రశ్న అందరికీ తలెత్తుతుంది. ప్రస్తుతం ఇదే అనుమానం సాక్షాత్తూ మున్సిపల్ అధికారులకు కూడా కలుగుతోందంటే ఆశ్చర్యపడనక్కరలేదు. ఆదాయం తక్కువగా ఉందన్న కారణంగా మున్సిపాలిటీల్లో హోర్డింగుల ద్వారా వ్యాపార ప్రకటనలకు అనుమతిస్తున్నారు. కార్పొరేట్ ప్రచార సంస్థలు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న హోర్డింగుల్లో భాగంగా మన ప్రాంతంలో కూడా పెడుతున్నాయి. రాజకీయ నాయకులు తమ ప్రచారం కోసం ఎక్కడ పడితే అక్కడ హోర్డింగ్‌లు పెట్టేస్తున్నారు. ఇలా వివిధ కారణాల నేపథ్యంలో మున్సిపాలిటీల్లో వందలాదిగా హోర్డింగులు వెలుస్తున్నాయి. వీటిని అదుపు చేయడంలో అధికారులు విఫలం అవుతున్నారు. పట్టణాలే టార్గెట్ పట్టణాల్లో జన సాంద్రత ఎక్కువగా ఉంటుంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అందువల్ల హోర్డింగులు ఎక్కువగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో ఏర్పాటు చేస్తున్నారు. పెద్ద సంస్థలు ముందుగా అధికారుల నుంచి అనుమతులు పొంది ఏర్పాటు చేసుకుంటున్నాయి. కానీ ఎన్నింటికి అనుమతులు పొందారు, ఏఏ సెంటర్లలో ఎన్ని ఏర్పాటు చేశారు అనే అంశాలపై అధికారులకు స్పష్టత లేదు. ఇక ప్రధాన కూడళ్లలో, ఖాళీ స్థలాల్లో ఇబ్బడి ముబ్బడిగా ఏర్పాటయ్యే వాటికి అసలు అనుమతులు తీసుకోవడం లేదు. ప్రధాన రాజకీయ పార్టీల ప్రచారాల కోసం ముందుగా తాత్కాలికంగా ఏర్పాటై ఆనక అవి పర్మనెంట్ అయిపోతున్నాయి. కాకినాడ, రాజమండ్రి ప్రాంతాల్లో స్థానిక నేతల అనుయాయులు ఇలాంటివి వందల్లోనే నిర్వహిస్తున్నారు. కానీ వాటిని తొలగించేందుకు అధికారులు సాహసం చేయడం లేదు. గుర్తిస్తే చర్యలు తీసుకుంటాం అని అంటున్నారు. బ్యానర్లు, ఫ్లెక్సీలతో మరింత తంటా కేవలం హోర్డింగులే కాకుండా ప్రతి చిన్న సందర్భంలో విచ్చలవిడిగా ఏర్పాటు చేస్తున్న బ్యానర్లు, ఫ్లెక్సీల కారణంగా విపరీతమైన ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. వీటి ఏర్పాటుకు అసలు అనుమతులే తీసుకోవడం లేదు. వీటివల్ల నగర సుందరీకరణకు కూడా విఘాతం కలుగుతోంది. అనధికారికం ఎన్నో.. జిల్లాలోని రెండు నగర పాలక సంస్థలు, ఏడు మున్సిపాలిటీల్లో 2,200 పైగా హోర్డింగులు సుమారు 300 ఏజెన్సీల ద్వారా ఏర్పాటై ఉన్నాయి. ఇవికాక మరో 1200 వరకూ అనుమతుల్లేనివి ఉన్నట్టు తెలుస్తోంది. రాజమండ్రి నగరపాలక సంస్థ పరిధిలో 88 ఏజెన్సీలకు చెందిన 750 పైగా హోర్డింగులు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. వీటి ద్వారా ఏడాదికి రూ.రెండు కోట్ల వరకూ కార్పొరేషన్ కు ఆదాయం లభిస్తోంది. అనధికారికంగా సుమారు 500 హోర్డింగులున్నట్టు అంచనా. ఈ కారణంగా ఏటా రూ.75 లక్షల వరకూ ఆదాయాన్ని కార్పొరేషన్ కోల్పోతోంది. కాకినాడలో 70 ఏజెన్సీలకు చెందిన 800 వరకూ అధికారిక హోర్డింగులు ఉన్నాయి. వీటి ద్వారా సాలీనా సుమారు రూ.1.75 కోట్ల ఆదాయం లభిస్తోంది. ఇవికాక అనుమతుల్లేని హోర్డింగులు సుమారు 400 ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఏడు మున్సిపాలిటీల్లో 650 హోర్డింగుల వరకూ ఉంటాయని ప్రాథమిక అంచనాల ప్రకారం తెలుస్తోంది. ఇవికాక మరో 350 వరకూ అనధికారికంగా ఏర్పాటై ఉన్నాయి. వీటన్నింటి ద్వారా ఆయా మున్సిపాలిటీలకు సుమారు రూ.కోటి ఆదాయం లభిస్తోంది. ఈ ప్రాంతాల్లో అధికారుల కళ్లు కప్పి ఏర్పాటైనవి సుమారు 350 వరకూ ఉంటాయి. వీటి ద్వారా మరో రూ.50 లక్షల ఆదాయాన్ని ఆయా మున్సిపాలిటీలు కోల్పోతున్నాయి. -
సోనియాకు ఏమైంది..? యూపీలో కలకలం
ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సంబంధించి ఆ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లు ఉత్తరప్రదేశ్‌లో కలకలం రేపాయి. సోనియా, ఆమె కుమార్తె ప్రియంకా గాంధీ చిత్రాలను ముద్రించిన హోర్డింగ్‌లపై 'తల్లి అనారోగ్యంతో ఉన్నారు. అన్న బరువుకు మించిన బాధ్యతలు మోస్తున్నారు. ప్రియాంక పూల్పూర్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు' అని రాశారు. పూల్పూర్ నుంచి మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఒకప్పుడు ప్రాతినిధ్యం వహించారు. హోర్డింగ్‌ల విషయం తెలుసుకున్న ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సంబంధిత నాయకులకు షోకాజ్ నోటీసులు జారీచేసింది. జిల్లా సెక్రటరీ హసీబ్ అహ్మద్ మరో నాయకుడు శ్రీష్ చంద్ర దూబేను బాధ్యులుగా పేర్కొన్నారు. 'సోనియాపై దుష్ప్రచారం చేయడంతో పాటు ప్రియాంకను అనసవరంగా రాజకీయాల్లోకి లాగడంపై పార్టీ చర్యలు తీసుకుంటుంది. ఈ విషయంలో రాష్ట్ర శాఖ త్వరలో నిర్ణయం తీసుకుంటుంది' అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడొకరు చెప్పారు.