- ఏర్పాటు చేసిన వాటిని తొలగిస్తున్నామంటే ఎలా?
- పాత వాటి స్థానంలో కొత్తవి పెట్టుకునేందుకే తొలగిస్తున్నట్లుంది
- వారికి జరిమానాలు ఎందుకు విధించడం లేదు
- కఠినంగా వ్యవహరిస్తేనే పరిస్థితులు దార్లోకొస్తాయి
- జీహెచ్‌ఎంసీకి హైకోర్టు ఆదేశం.. విచారణ 25కు వాయిదా
సాక్షి, హైదరాబాద్: నగరంలో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు, కటౌట్లను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నామన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) వాదనపై హైకోర్టు మండిపడింది. తొలగించిన వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసుకునే ందుకే ఉన్న వాటిని తొలగిస్తున్నట్లున్నారంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేసిన వారికి ఎందుకు జరిమానా విధించడం లేదని ప్రశ్నించింది.
ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తేనే పరిస్థితులు దార్లోకి వస్తాయని పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు, కటౌట్లు ఏర్పాటు చేస్తున్న వారి పై ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని ఆదేశిస్తూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావుతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
నగరంలో నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేస్తున్నా జీహెచ్‌ఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదని తెలంగాణ వనరుల పరిరక్షణ కమిటీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని సోమవారం విచారించిన ధర్మాసనం.. ఓ నిర్ధిష్ట ప్రదేశంలో కాకుండా ఎక్కడపడితే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారని, చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. జీహెచ్‌ఎంసీ తరఫు న్యాయవాది పి.కేశవరావు వాదనలు వినిపిస్తూ నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన 2,385 కటౌట్లు తొలగించామని చెప్పారు. దీనికి ధర్మాసనం తీవ్రంగా స్పందిస్తూ.. తొలగిస్తున్నామని చెప్పడంలో ఏ మాత్రం అర్థం లేదని, నిబంధనలకు విరుద్ధంగా ఎవరో ఏర్పాటు చేసిన వాటిని సొంత ఖర్చుతో తొలగించడంలో అర్థమేమిటని ప్రశ్నించింది. ఇష్టారాజ్యంగా ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేసిన వారికి ఎందుకు జరిమానా విధించడం లేదని ప్రశ్నించింది. తమకు రోడ్డుపై ప్రతీ రోజూ లెక్కకు మించి ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు కనిపిస్తున్నాయని, ఓ నిర్ధిష్ట ప్రదేశంలో కాక ఇలా ఎక్కడ పడితే అక్కడ ఏర్పాటు చేయడం సరికాదని పేర్కొంది.
ఈ విషయాన్ని జీహెచ్‌ఎంసీకే పరిమితం చేయవద్దని, అన్ని మున్సిపల్ కార్పొరేషన్లకు వర్తింప చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేస్తున్న వారిపై తీసుకున్న చర్యలను వివరించాలని కేశవరావుకు స్పష్టం చేసింది. ఇందుకు ఆయన గడువును కోరడంతో ధర్మాసనం అందుకు అంగీకరిస్తూ విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది.
ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లపై ఏం చర్యలు తీసుకున్నారు
Published Tue, Jul 12 2016 3:02 AM | Last Updated on Tue, Oct 2 2018 7:28 PM
Advertisement
Advertisement