ప్రమాదాలకు నిలయాలు.. ఫ్లెక్సీలు
► హోర్డింగులు, ఫెక్లీలను పట్టించుకోని అధికారులు
► ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు..
పెద్దపల్లి(సుల్తానాబాద్ రూరల్) : సుల్తానాబాద్‌లో రాజీవ్‌రహదారి వెంట ఫ్లెక్సీలు,హోర్డింగ్‌లు ప్రమాదాలకు హేతువుగా మారాయి. ఆర్టీసీ బస్టాండ్ ముందు హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు ఆర్టీసీ డ్రైవర్లకు తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. బస్సులు లోపలికి వెళ్లే దారిలో, బయటకు వచ్చే దారిలో హోర్డింగ్‌లు ఏర్పాటుచేయడం వల్ల డ్రైవర్లకు రాజీవ్‌రహదారి వెంట వెళ్లే వాహనాలు సరిగా కనబడక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలాంటి ఘటనే శుక్రవారం చోటుచేసుకుంది. రోడ్డు నుంచి వెళ్తున్న లారీని బస్సు ఢీకొనడం వల్ల బస్సులో ప్రయాణించే రాజయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. గతంలోనూ పలు సందర్భాల్లో ప్రమాదాలు జరిగాయి.
అధికారులు అనుమతిలేని ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లను తొలగించాలని ఆర్టీసీ అధికారులకు, సంబంధిత శాఖల అధికారులకు ఎంతో కాలంగా కోరుతున్నా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.ఇప్పటికైనా ప్రమాదాలకు కారణమవుతున్న ఫ్లెక్సీలను హోర్డింగులను నిషేధించాలని ప్రజలు కోరతున్నారు.
బస్టాండ్ మూసుకు పోయింది
హోర్డింగ్‌లతో, ఫ్లేక్సిలతో బస్టాండ్ పూర్తిగా మూసుకుపోయింది. రోడ్డుకు అసలే వంపులో ఉన్న బస్టాండ్ హోర్డింగ్‌ల వల్ల కనబడడం లేదు. దీంతో బస్సు డ్రైవర్లకు, రాజీవ్ రోడ్డు వెంట వెల్లే వాహనాల డ్రైవర్లకు ఇబ్బంది కరంగా మారింది. ప్రయాణీకులకు అసౌకర్యంగా తయారైంది. వెంటనే అధికారులు దృష్టి సారించాలి. – దొడ్ల సతీష్, సుల్తానాబాద్
చౌరస్తా ప్రమాదాలకు నిలయమైంది
ఒక వైపు హోర్డింగ్‌లు, మరోవైపు రాజీవ్‌రహదారిపై డివైడర్ల వల్ల స్థానిక బస్టాండ్ చౌరస్తా ప్రమాదాలకు నిలయంగా మారింది. ప్రయాణీకులు రోడ్డు దాటాలంటే జంకుతున్నారు. జిల్లాకు చెందిన ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ బస్టాండ్ పరిస్థితి గురించి దృష్టి సారించాలి. అనుమతి లేని హోర్డింగ్‌లను తొలగించడం లేదు. ఆర్టీసీ, స్థానిక అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. –శేట్టి శ్రీనివాస్, సుల్తానాబాద్
తగు చర్యలు తీసుకుంటాం
హోర్డింగ్‌ల గురించి తగు చర్యలు తీసుకుంటాం. సంబంధిత అధికారులను వీటిని తొలగించాల్సిందిగా ఆదేశించాం. ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలను తీసుకుంటున్నాము, పోలీసు సిబ్బంది కూడా బస్టాండ్ వద్ద విధుల్లో ఉన్నారు. సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసి ప్రత్యక్షంగా పరిస్థితిని సమీక్షించడం జరుగుతుంది. – జీవన్,ఎస్సై సుల్తానాబాద్