నాగేందర్ చేరిక సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ
బంజారాహిల్స్: స్వచ్ఛ హైదరాబాద్ లక్ష్యానికి తూట్లు పొడిస్తే ఎంతటివారికైనా శిక్ష తప్పదని నిరూపించారు గ్రేటర్ అధికారులు. తప్పు చేస్తే పైవారు.. తమ వారు అన్న వివక్ష వద్దని గతంలోనే మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార టీఆర్‌ఎస్ పార్టీలోకి మారిన దానం నాగేందర్‌కు ఆహ్వానం పలుకుతూ ఓ మాజీ కార్పొరేటర్ బంజారాహిల్స్‌లోని పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు కట్టారు. ఇలా కట్టడం నిబంధనలకు విరుద్ధమని జీహెచ్‌ఎంసీ అధికారులు సదరు నేతకు నోటీసులతో షాక్ ఇచ్చారు.
ఇది మంత్రి కేటీఆర్‌కు, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డికి నచ్చలేదు. ఫ్లెక్సీలు బ్యానర్లపై నిషేధం ఉండగా ఇలా సొంత పార్టీ వారే నిబంధనలు ఉల్లంఘించడమేంటని వారు కింది స్థాయి అధికారులపై మండిపడ్డారు. తక్షణమే బాధ్యులపై జరిమానా విధించాలంటూ ఆదేశించారు. దీంతో దానంతో పాటు టీఆర్‌ఎస్‌లో చేరిన బంజారాహిల్స్ మాజీ కార్పొరేటర్ బి.భారతినాయక్‌కు నోటీసులు జారీ చేశారు. చేసిన తప్పుకు రూ.30 వేల జరిమానా చెల్లించాల్సిందేనంటూ అందులో పేర్కొన్నారు. దీంతో సదరు నాయకులు తెల్లమొహం వేశారు. దానం ఫ్లెక్సీలపై ఎవరెవరు ఆహ్వానం పలుకుతూ ఫొటోలు వేసుకున్నారో వారందరికీ జరిమానాలు వేస్తామని అధికారులు చెబుతున్నారు. అధికార పార్టీలో చేరితో ఇదోమి గోసరా దేవుడా అంటూ ఇప్పుడా నేతలు తల పట్టుకుంటున్నారు. మా కాలంలో ఇలా లేదు బాబు అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment