సాక్షి, హైదరాబాద్: ఎన్నో ఏళ్ల పోరాటం తరువాత సాకారమైన సామాన్యుల కల సమాచార హక్కు చట్టం. పరిపాలనలో పారదర్శకత, అధికారుల్లో జవాబుదారీతనం పెంచడానికి, అవినీతిని అంతం చేయడానికి 2005, అక్టోబర్ 12న ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని అమలులోకి తీసుకువచ్చింది. అప్పటి నుంచి ఈ చట్టం అవినీతిపై బ్రహ్మాస్త్రంగా మారింది. దీనివల్ల దేశంలోని ఎన్నో కుంభకోణాలు వెలుగుచూశాయి. అనేక సంచలన విషయాలు లోకానికి తెలిశాయి. కానీ, ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఈ చట్టంపై మొదటి నుంచి శీతకన్ను వేసిందనే విమర్శలు ఉన్నాయి.
ఆర్టీఐ అమలు విషయంలో కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలను సామాజిక ఉద్యమకారులు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. చట్టం నిర్వీర్యం చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నారు. సమాచార హక్కు చట్టానికి కేంద్రం ప్రతిపాదించిన సవరణలు పార్లమెంటులో ఆమోదం పొందితే.. సమాచార హక్కు చట్టం పూర్తిగా నిర్వీర్యమవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే జరిగితే పౌరుల స్వేచ్ఛకు విఘాతం కలిగించినట్లేనని చెబుతున్నారు.
ప్రధాన అభ్యంతరాలు ఇవే.
1. చట్టానికి సవరణలు జరిగితే.. కేంద్రం, రాష్ట్ర పరిధిలో పనిచేసే సమాచార కమిషనర్లను కేంద్రమే నియమిస్తుంది. వారి జీతభత్యాలు, పదవీకాలం కూడా కేంద్రమే నిర్ణయిస్తుంది. ఇది సమాఖ్యస్ఫూర్తికి విరుద్ధమని సామాజిక ఉద్యమకారులు వాదిస్తున్నారు. అలా జరిగితే.. సమాచార వెల్లడిలో కేంద్రం జోక్యం చేసుకోవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
2. ప్రస్తుతం సమాచార కమిషనర్ల పదవీకాలం ఐదేళ్లుగా ఉంది. లేదా 65 ఏళ్లు వచ్చే వరకు పనిచేయవచ్చు. చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్‌కి ప్రధాన ఎన్నికల కమిషనర్, రాష్ట్రంలోని చీఫ్ సెక్రటరీ హోదాకు సమానంగా ఉంటుంది. ఇకపై వీటి ప్రకారం.. ఉండకపోవచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
సమాచార కమిషనర్ల నుంచే వ్యతిరేకత..: కేంద్రం ప్రతిపాదిస్తున్న సవరణలపై సమాచార కమిషనర్ల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ వివాదాస్పద బిల్లును కేంద్రం వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు. సవరించాలనుకుంటున్న నిబంధనలు అవినీతి అధికారులకు రక్షణ కల్పించేలా ఉన్నాయంటూ ఆరోపిస్తున్నారు. ఇకపై ప్రభుత్వం చేపట్టే పనుల్లో అధికారి పనిని మూల్యాంకనం చేసేందుకు ప్రజలకున్న హక్కును కొత్త సవరణలు కాలరాస్తాయని, దీని ఆధారంగా అవినీతి అ«ధికారులు చెలరేగే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా సమాజంలో పారదర్శకత, జవాబుదారీతనం, ప్రజాప్రయోజనం లోపిస్తాయని సమాచార కమిషనర్ మాఢభూషి శ్రీధర్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. కేంద్రం సమాచార హక్కు చట్టంలోని నిబంధనలను సవరించాలని ప్రయత్నిస్తే ఉద్యమాల ఎదుర్కొనక తప్పదని ఆర్టీఐ కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment