న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ చట్టంపై ఇచ్చిన తీర్పు నిబంధనలను నిర్వీర్యం చేసేలా ఉందని, ఇది ప్రజల్లో ఆగ్రహానికి, అశాంతికి కారణమై దేశానికి తీవ్ర నష్టం వాటిల్లేలా చేస్తుందని, అందువల్ల దీనిని సమీక్షించాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద తక్షణం అరెస్టులు చేయకుండా మార్చి 20వ తేదీన సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును నిరసిస్తూ దేశవ్యాప్తంగా దళిత సంఘాలు ఆందోళనలకు దిగాయి. దీంతో ఈ తీర్పుపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషనదాఖలు చేసింది. ఈ పిటిషన్‌కు మద్దతుగా గురువారం కేంద్ర ప్రభుత్వం రాతపూర్వక నివేదిక సమర్పించింది.
న్యాయ, శాసన, కార్యనిర్వాహక విభాగాల మధ్య అధికారాల విభజన భారత రాజ్యాంగంలో ప్రాథమిక భాగమనీ, చట్టాలు చేయగలిగే ఎలాంటి అవకాశమూ కోర్టులకు లేదని పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ చట్టంపై తీర్పు తీవ్ర గందరగోళానికి దారి తీసిందని, సమీక్ష ద్వారా, ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకోవటం ద్వారా ఈ అంశాన్ని చక్కదిద్దవచ్చని తెలిపింది. ఇది చాలా సున్నితమైన అంశమని, కోర్టు తీర్పు ఫలితంగా గందరగోళం, ఆగ్రహం, అసంతృప్తి, అశాంతి దేశంలో చెలరేగాయని పేర్కొంది. ఈ తీర్పు చట్టాన్ని బలహీనపరిచేలా ఉందని తెలిపింది. తమ తీర్పును పూర్తిగా చదవలేదని, స్వార్థ ప్రయోజనాల కోసమే ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొంటూ దీనిపై సమీక్షించేందుకు గత వారం సుప్రీంకోర్టు నిరాకరించింది.
Comments
Please login to add a commentAdd a comment