review petition
-
వర్గీకరణ రివ్యూ పిటిషన్‌పై నేడు నిర్ణయం
న్యూఢిల్లీ, సాక్షి: ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మాల మహానాడు సవాల్ చేసింది. రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు మాలలకు వ్యతిరేకంగా ఉందని, తీర్పును రివ్యూ చేయాలంటూ మాల మహానాడు అధ్యక్షుడు చెన్నయ్య, మాజీ ఎంపీ హర్ష కుమార్‌లు పిటిషన్ వేశారు. అయితే ఈ పిటిషన్‌ను న్యాయస్థానం విచారణకు స్వీకరిస్తుందా? లేదా? అనే ఉత్కంఠకు కాసేపట్లో తెరపడనుంది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణపై సుప్రీంకోర్టు ఆగస్టు 1వ తేదీన కీలక తీర్పు వెలువరించింది. విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. ఈమేరకు 2004లో ఐదుగురు సభ్యులు ఇచ్చిన తీర్పును తాజాగా విస్తృత ధర్మాసనం పక్కనబెడుతూ.. 6:1 మెజారిటీతో సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది. తాజా తీర్పును అనుసరించి ప్రభుత్వాలు దీనిపై తదుపరి మార్గదర్శకాలు రూపొందించుకోవాలని సూచించింది.‘‘వ్యవస్థాగతంగా ఎదుర్కొంటున్న వివక్ష కారణంగా ఎస్సీ/ఎస్టీ వర్గాల వారు పైకి రాలేకపోతున్నారు. ఒక కులంలో ఉపవర్గాలు చేసేందుకు రాజ్యాంగంలోని 14వ అధికరణ అనుమతి కల్పిస్తుంది. అందుకే 2004 నాటి ఈవీ చిన్నయ్య తీర్పును మేం వ్యతిరేకిస్తున్నాం. రాష్ట్రాలు ఉపవర్గీకరణ చేసుకునేందుకు అనుమతి కల్పిస్తున్నాం’’ అని సీజేఐ ధర్మాసనం స్పష్టంచేసింది. అణగారిన వర్గాల వారికి మరిన్ని ప్రయోజనాలు కల్పించేందుకు రిజర్వ్డ్ కేటగిరీలో రాష్ట్రాలు ఉప వర్గీకరణ చేసుకోవచ్చని కోర్టు వెల్లడించింది. ధర్మాసనంలో దీనికి అనుకూలంగా ఆరుగురు న్యాయమూర్తులు తీర్పు చెప్పగా.. జస్టిస్ బేలా ఎం.త్రివేది మాత్రం ఉప వర్గీకరణ సాధ్యం కాదంటూ వ్యతిరేకించారు.కేసు వివాదం..ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ కోటా రిజర్వేషన్లలో 50శాతాన్ని వాల్మీకి, మజహబీ సిక్కు సామాజికవర్గాలకు తొలి ప్రాధాన్యంగా ప్రత్యేకిస్తూ 2006లో పంజాబ్ ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. అయితే, ఎస్సీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణ చెల్లదంటూ పంజాబ్, హరియాణా హైకోర్టు 2010లో తీర్పు వెలువరించింది. ఈవీ చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 2004లో వెలువరించిన తీర్పును ఉల్లంఘించేలా పంజాబ్ చట్టం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. షెడ్యూల్డ్ కులాల జాబితాలోకి ఏదైనా సామాజిక వర్గాన్ని చేర్చాలన్నా, తొలగించాలన్నా పార్లమెంటుకు మాత్రమే అధికారం ఉంటుందని, రాష్ట్రాల శాసనసభలకు కాదని ఈవీ చిన్నయ్య కేసులో సుప్రీంకోర్టు 2004లో తీర్పు చెప్పింది. దాన్నే పంజాబ్, హరియాణా తమ ఉత్తర్వులో హైకోర్టు ప్రస్తావించింది.దీంతో, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పంజాబ్ ప్రభుత్వం అప్పట్లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అనంతరం దీనిపై మరో 22 పిటిషన్లు దాఖలయ్యాయి. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కూడా ఇందులో వ్యాజ్యదారుగా ఉన్నారు. ఈ పిటిషన్లను విచారించిన అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం.. 2020లో ఈ వివాదాన్ని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. దీనిపై సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఏడాది ఆరంభంలో విచారణ జరిపి తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా ఉపవర్గీకరణ చేసుకొనేలా రాష్ట్రాలకు అనుమతినిస్తూ గురువారం కీలక తీర్పు వెలువరించింది. విచారణ సమయంలో కేంద్రం కూడా ఎస్సీ/ఎస్టీలో ఉపవర్గీకరణను సమర్థించింది. -
బిల్కిస్ బానోకు చుక్కెదురు.. దోషుల విడుదలపై పిటిషన్ కొట్టివేత
న్యూఢిల్లీ: 2002లో జరిగిన గుజరాత్ అల్లర్లలో సామూహిక అత్యాచారానికి గురై, దోషుల విడుదలపై పోరాడుతున్న బాధితురాలు బిల్కిస్ బానోకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. దోషులను విడుదల చేస్తూ గుజరాత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించింది. తనపై అఘాయిత్యానికి పాల్పడిన, తమ కుటుంబ సభ్యులను హత్య చేసిన వారిని విడుదల చేయడంపై రెండు వేర్వేరు పిటిషన్ల ద్వారా సవాల్ చేసింది. అందులో ఒకటి దోషులకు రెమిషన్ పాలసీని అమలు చేసేందుకు గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని పిటిషన్ దాఖలు చేశారు బిల్కిస్ బానో. తాజాగా ఆ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ఇదీ కేసు.. 2002లో గోద్రా రైలు దహనం తర్వాత గుజరాత్లో అల్లర్లు జరిగాయి. ఈ క్రమంలోనే బిల్కిస్ బానో కుటుంబ సభ్యులను హత్య చేసి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు దుండగులు. ఈ కేసులో 11 మంది నిందితులకు సీబీఐ స్పెషల్ కోర్టు 2008 జనవరిలో జీవిత ఖైదు విధించింది. 15 ఏళ్లు జైలులో గడిపిన తర్వాత తమను విడుదల చేయాలంటూ అందులో ఒకరు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈక్రమంలో 1992 నాటి రెమిషన్ పాలసీని అమలు చేయాలని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సూచించింది. అందుకు సుప్రీం కోర్టు సైతం అనుమతిచ్చింది. దీంతో వారు 2022, ఆగస్టు 15న దోషులను విడుదల చేశారు. ఇదీ చదవండి: బిల్కిస్ బానో దోషుల విడుదల కేసు విచారణ నుంచి తప్పుకున్న సుప్రీం జడ్జీ -
చిక్కుల్లో నవజ్యోత్ సింగ్ సిద్ధూ
న్యూఢిల్లీ: పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ చిక్కుల్లో పడ్డారు. మూడు దశాబ్దాల క్రితం ఒక వ్యక్తి మరణానికి కారకుడైన కేసులో దోషి అయిన సిద్ధూ స్వల్ప జరిమానాతో బయటపడ్డారు. సిద్ధూ చేసిన నేరానికి తగిన శిక్ష పడలేదని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తూ మళ్లీ కోర్టుకెక్కడంతో తీర్పుని పునఃసమీక్షించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. 1998లో పంజాబ్‌లోని పాటియాలాలో వాహనం పార్కింగ్‌పై వివాదం నెలకొని 65 ఏళ్ల వయసున్న గుర్నామ్ సింగ్ అనే వ్యక్తిని సిద్ధూ చితకబాదారు. ఆ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించడంతో కుటుంబ సభ్యులు సిద్ధూపై కేసు పెట్టారు. ఈ కేసు నుంచి బయట పడడానికి సిద్ధూ దశాబ్దాల పాటు న్యాయ పోరాటం చేశారు. పంజాబ్ హరియాణా హైకోర్టు సిద్ధూ ఒక వ్యక్తి ప్రాణాలు పోవడానికి కారణమయ్యారని దోషిగా తేలుస్తూ మూడేళ్ల జైలు శిక్ష విధించింది. 2018 మేలో సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పుని పక్కన పెట్టేసింది. సీనియర్ సిటిజన్‌ను గాయపరిచినందుకు కేవలం వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ సిద్ధూని కేసు నుంచి విముక్తుడిని చేసింది. ఈ తీర్పుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన బాధిత కుటుంబం మళ్లీ కోర్టుకెక్కింది. సిద్ధూకి కఠిన శిక్ష విధించాలని బాధిత కుటుంబం సుప్రీంలో శుక్రవారం వాదనలు వినిపించింది. సిద్ధూ తరపున కాంగ్రెస్ నేత, లాయర్ పి. చిదంబరం వాదనలు వినిపించారు. ఇన్నేళ్ల తర్వాత తీర్పుని సమీక్షించడం అర్థరహితమని పేర్కొన్నారు. -
చిక్కుల్లో సిద్ధూ.. సుప్రీం నోటీసులు!
Setback To Sidhu In Road rage Case: మాజీ క్రికెటర్, పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ చిక్కుల్లో పడ్డారు. మూడు దశాబ్దాల కిందటి కేసులో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని సుప్రీం కోర్టు నిర్ణయించింది. ఈ మేరకు అత్యున్నత న్యాయస్థానం 58 ఏళ్ల సిద్ధూకి నోటీసులు జారీ చేసింది. నోటీసు పరిధిని పెంచాలని కోరుతూ దాఖలైన దరఖాస్తుపై ప్రత్యుత్తరం దాఖలు చేయాల్సిందిగా సుప్రీంకోర్టు, సిద్ధూ తరపు న్యాయవాదిని కోరింది. రెండు వారాల తర్వాత సుప్రీంకోర్టు ఈ అంశాన్ని జాబితా చేయనున్నట్లు ఓ జాతీయ మీడియా కథనం ప్రచురించింది. సిద్ధూ పాల్పడింది ఘోరమైన నేరంగా పరిగణించి.. తీర్పును పునఃసమీక్షించాలని బాధిత కుటుంబం సుప్రీంను అభ్యర్థించింది. అయితే ఘటన జరిగిన ఇన్నేళ్లకు(33 ఏళ్లకు) నేర తీవ్రత గురించి పిటిషనర్లు లేవనెత్తడం విడ్డూరంగా ఉందని, పిటిషన్‌పై అనుమానాలు ఉన్నాయని సిద్ధూ తరపున పి.చిదంబరం వాదించారు. అంతకు ముందు తనకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను తిరస్కరించాలంటూ సిద్ధూ అత్యున్నత న్యాయస్థానాన్ని వేడుకున్నారు. ఎప్పుడో ముప్ఫై ఏళ్ల కిందినాటి కేసు గనుక పరిగణనలోకి తీసుకోకూడదంటూ విజ్ఞప్తి చేశాడు. అయినప్పటికీ కోర్టు బాధితుల అభ్యర్థననే పరిగణనలోకి తీసుకుంది. కేసు పూర్వపరాలు.. 1988, డిసెంబర్ 27న పాటియాలాలో సిద్ధూ, అతని స్నేహితుడు రూపీందర్ సింగ్ సంధూ పార్కింగ్ విషయంలో గుర్నమ్ సింగ్ అనే వ్యక్తితో గొడవ పడ్డారు. ఈ క్రమంలో గుర్నమ్‌ను కారులోంచి బయటకు లాగేసి మరీ దాడి చేశారు. ఈ ఘటనలో గుర్నమ్ చనిపోయారు. ఈ కేసులో ట్రయల్ కోర్టు సిద్ధూని నిర్దోషిగా వదిలేయగా.. పంజాబ్-హర్యానా హైకోర్టు మాత్రం 2006లో దోషిగా గుర్తించి.. మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై 2007లో సుప్రీంను ఆశ్రయించగా.. అత్యున్నత న్యాయస్థానం, హైకోర్టు ఇచ్చిన తీర్పును సస్పెండ్ చేస్తూ.. బెయిల్ మంజూరు చేసింది. ఈ ఉపశనంతోనే.. అమృత్సర్ నియోజకవర్గం తరపున లోక్‌సభలో పోటీ చేయడానికి సిద్ధూకి అనుమతి దొరికినట్లయ్యింది. తిరిగి 2018, మే 15న.. జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం.. ఒక వృద్ధుడ్ని తీవ్రంగా గాయపర్చిన నేరానికి సిద్ధూ, అతని స్నేహితుడికి వెయ్యి రూపాయల ఫైన్ విధించింది. ఒక దెబ్బకే చనిపోయాడని చెప్పడానికి ఆధారాలు లేనందున ఈ తీర్పు ఇస్తున్నట్లు వెల్లడించింది బెంచ్. అయితే తీర్పుపై రివ్యూ చేపట్టాలని బాధిత కుటుంబం కోర్టును ఆశ్రయించింది. -
వినాయక నిమజ్జనంపై హైకోర్టులో జీహెచ్ఎంసీ రివ్యూ పిటిషన్
సాక్షి, హైదరాబాద్: వినాయక నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టులో జీహెచ్ఎంసీ రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు తమ తీర్పును పునః పరిశీలించాలని జీహెచ్ఎంసీ కోరింది. హుస్సేన్ సాగర్, ఇతర జలాశయాల్లో పీవోపీ విగ్రహాల నిమజ్జనంపై నిషేధం ఎత్తేయాలని పిటిషన్లో జీహెచ్ఎంసీ పేర్కొంది. ట్యాంక్ బండ్ వైపు నుంచి నిమజ్జనానికి అనుమతించాలని కోరింది. హుస్సేన్‌సాగర్‌లో రబ్బర్ డ్యాం నిర్మించాలన్న ఉత్తర్వులను సవరించాలని జీహెచ్ఎంసీ విజ్ఞప్తి చేసింది. నిమజ్జనం తర్వాత 24 గంటల్లో వ్యర్థాలు తొలగిస్తామని జీహెచ్ఎంసీ పేర్కొంది. ఇవీ చదవండి: మియాపూర్‌లో దారుణం: చిన్నారి అనుమానాస్పద మృతి డిగ్రీ చేశానని నమ్మించి నిశ్చితార్థం -
నిమజ్జనంపై హైకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తాం: తలసాని
-
నిమజ్జనంపై హైకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తాం: తలసాని
ఖైరతాబాద్: ఈ సంవత్సరం యథావిధిగానే హుస్సేన్ సాగర్‌లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో చేసిన విగ్రహాలను నిమజ్జనానికి అనుమతించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున హైకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఆదివారం ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయవద్దని హైకోర్టు అదేశించిన నేపథ్యంలో భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని కోర్టు కూడా ఆలోచించాలని కోరుతున్నామన్నారు. ఇప్పటికిప్పుడు వినాయక నిమజ్జనాలకోసం బేబీ పాండ్స్ ఏర్పాటు చేయడం కష్టమని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 35 వేలకు పైగా విగ్రహాలను ప్రతిష్టించారని, ఇంత తక్కువ సమయంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం సాధ్యం కాదని, పర్యావరణ ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని తెలిపారు. నిమజ్జనం జరిగిన 48 గంటల్లో వ్యర్థాలను పూర్తిగా తొలగిస్తామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా నిమజ్జనంపై ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులను సవరించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం హైకోర్టును ఆశ్రయించింది. హౌస్ మోషన్ రూపంలో ఈ పిటిషన్‌ను విచారించాలని కోరగా, ధర్మాసనం తిరస్కరిస్తూ, సోమవారం ఉదయం ఇదే విషయాన్ని ధర్మాసనం ముందు నివేదించాలని సూచించింది. -
TS: వినాయక నిమజ్జనంపై హైకోర్టులో రేపు రివ్యూ పిటిషన్
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ వినాయకుడిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదివారం దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వినాయక నిమజ్జనంపై హైకోర్టులో రేపు రివ్యూ పిటిషన్ వేస్తామని తెలిపారు. కాలుష్యం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. నిమజ్జనం పూర్తయ్యాక హుస్సేన్‌సాగర్‌ను శుభ్రం చేస్తామన్నారు. హైకోర్టు తమ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరతామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు ఇవీ చదవండి: ఆనాటి నుంచి పన్నెండు మెట్ల కిన్నెర పాట వరకు.. సూపర్ సక్సెస్ అనాథను ఆదరించింది.. అదే ఆమె పాలిట శాపంగా మారింది -
ట్విన్ టవర్స్ కూల్చోద్దు.. ఒక్కసారి మా మాట వినండి
ట్విన్ టవర్స్ కూల్చివేత తీర్పుపై నిర్మాణ సంస్థ సుప్రీం కోర్టులో రివ్యూ పిటీషన్ దాఖలు చేసింది. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై తమకు గౌరవం ఉందని సూపర్ టెక్ చైర్మన్ ఆర్కే అరోరా అన్నారు. రేరా చట్టంలో ఉన్న నిబంధనల ప్రకారమే ఈ భవనాలు నిర్మించామని తెలిపారు. అంతేకాదు కోర్టు తీర్పు వల్ల తమ కంపెనీపై చెడు ప్రభావం ఉంటుందని తాను అనుకోవడం లేదన్నారు. నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలోని నోయిడాలో ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి 40 అంతస్థుల ట్విన్ టవర్స్ నిర్మిచండంపై ఇటు అలహాబాద్ హైకోర్టుతో పాటు దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేశాయి. మూడు నెలలల్లోగా ఈ భవనాలను కూల్చేయడంతో పాటు అందులో ప్లాట్లను కొనుగోలు చేసిన వారికి 12 శాతం వడ్డీతో డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ కోర్టు తీర్పు వెలువరించింది. ట్విట్ టవర్స్‌లో 21 దుకాణాలతో పాటు 915 ప్లాట్స్ ఉన్నాయి. చదవండి: నోయిడా ట్విన్ టవర్ల కూల్చివేత.. ‘రేరా’ ఎక్కడ విఫలమవుతోంది? -
‘రిజర్వేషన్’ తీర్పుపై రివ్యూ పిటిషన్
న్యూఢిల్లీ: సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు(ఎస్ఈబీసీ) రిజర్వేషన్లు కల్పించడానికి సంబంధించి ఇటీవల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం రివ్యూ పిటిషన్ వేసింది. 102వ రాజ్యాంగ సవరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆ తీర్పుతో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించే రాష్ట్రాల హక్కుకు విఘాతం కలుగుతోందని పేర్కొంది. ఆ సవరణ ద్వారా పొందుపర్చిన రెండు నిబంధనలు దేశ సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కాదని కేంద్రం ఆ పిటిషన్లో పేర్కొంది. మరాఠాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాన్ని మే 5న జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం తోసిపుచ్చిన విషయం తెలిసిందే. అలాగే, రిజర్వేషన్లను 50 శాతానికి పరిమితం చేస్తూ 1992లో సుప్రీంకోర్టు ఇచ్చిన ‘మండల్’తీర్పును విస్తృత ధర్మాసనానికి నివేదించాలన్న అభ్యర్థనను కూడా కోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే. రివ్యూ పిటిషన్‌పై బహిరంగ కోర్టులోనే విచారణ జరగాలని, దీనిపై తీర్పు వెలువడే వరకు గత తీర్పులోని పలు అంశాలపై స్టే విధించాలని కేంద్రం కోరింది. గత తీర్పులో ఆర్టికల్ 342ఏను ధర్మాసనం సమర్ధిస్తూనే.. ఎస్ఈబీసీలను గుర్తించే విషయంలో రాష్ట్రాలకు ఉన్న హక్కును తప్పుగా అర్థం చేసుకుందని రివ్యూ పిటిషన్లో కేంద్రం పేర్కొంది. 342ఏతో పాటు రాజ్యాంగ సవరణ ద్వారా పొందుపర్చిన ఇతర నిబంధనలపై తీర్పు వెలిబుచ్చిన ఆదేశాలపై స్టే విధించాలని కేంద్రం తన రివ్యూ పిటిషన్లో కోరింది. -
జరిమానా చెల్లించిన ప్రశాంత్ భూషణ్, కానీ...
సాక్షి, న్యూఢిల్లీ: కోర్టు ధిక్కరణ కేసులో ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌కు కోర్టు ఒక రూపాయి జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ఆయన సోమవారం రూపాయిని సుప్రీంకోర్టులో డిపాజిట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, నేను ఈ రోజు సుప్రీంకోర్టుకు రూ.1 చెల్లించాను. అంతమాత్రానా నేను కోర్టు ఇచ్చిన తీర్పును అంగీకరించినట్లు కాదు. నేను దీని మీద రివ్యూ పిటిషన్ వేస్తాను’ అని తెలిపారు. ఈసారి ఈ కేసుపై మరొక బెంచ్‌తో విచారణ జరిపించాలని ఆయన తన పిటిషన్లో కోరారు. న్యాయవ్యవస్థ పనితీరును ప్రశ్నించిన కేసులో ఆయనను దోషిగా తేల్చిన సుప్రీం కోర్టు ఆయనకు జరిమానా విధించిన సంగతి తెలిసిందే. క్షమాపణ చెప్పాలని ధర్మాసనం ఆదేశించగా ఆయన నిరాకరించారు. దాంతో ఆయనకు సుప్రీం కోర్టు జరిమానా విధించింది. అది చెల్లించకపోతే జైలుకు వెళ్లాల్సి వుంటుందని కోర్టు తెలిపింది. దీంతో ఆయన ఈరోజు తనకు విధించిన జరిమానా రూ.1 ను డిపాజిట్ చేశారు. సెప్టెంబర్ 15 కల్లా జరిమానాను చెల్లించాలని కోర్టు ఆదేశించింది. లేకపోతే మూడు నెలలపాటు జైలుకు వెళ్లాల్సి వుంటుందని కూడా తెలిపింది. ఇక ప్రశాంత్ భూషణ్ 2009లో గతంలో కొంతమంది సుప్రీంకోర్టు జడ్జీలు అవినీతిపరులు ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. ఈ కేసు విచారణ కోసం ప్రస్తుతం సుప్రీం కోర్టు ముందు ఉంది. చదవండి: జరిమానా కట్టేందుకు సిద్ధం : భూషన్ -
నీట్, జేఈఈ వాయిదాకు రివ్యూ పిటిషన్!
న్యూడిల్లీ: జేఈఈ, నీట్ పరీక్షలను యథాత«థంగా నిర్వహించాలన్న తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ ఆరు రాష్ట్రాలు సుప్రీంకోర్టులో రివ్యూపిటిషన్ వేశాయి. పరీక్షలు నిర్వహించాలన్న తీర్పు విద్యార్థుల జీవించే హక్కుకు విఘాతమని, అదేవిధంగా ప్రస్తుత సంక్షోభ సమయంలో రవాణా ఇబ్బందులను ఆ తీర్పులో పరిగణించలేదని పిటిషన్లో పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్, మహారాష్ట్రకు చెందిన మంత్రులు మోలాయ్ ఘటక్, రామేశ్వర్ ఓరాన్, రఘుశర్మ, అమర్జీత్ భగత్, బీఎస్ సిద్ధు, ఉదయ్ రవీంద్ర సావంత్ తరఫున న్యాయవాది సునీల్ ఫెర్నాండెజ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. పరీక్షలు యథాత«థంగా నిర్వహించాలని, కరోనా కారణంగా జీవితాలు ఆగవని ఈ నెల 17న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీంతో కేంద్రం పరీక్షల నిర్వహణకు సిద్ధ్దమైంది. అప్పటినుంచి ఈ విషయం రాజకీయ రంగు పులుముకుంది. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పరీక్షలు వాయిదా వేయాలని కాంగ్రెస్ సహా విపక్షాలు డిమాండ్ చేయడం మొదలుపెట్టాయి. అయితే ప్రభుత్వం పరీక్షల నిర్వహణకే ముందుకు సాగడంతో విపక్ష రాష్ట్రాల మంత్రులు సుప్రీంను ఆశ్రయించారు. సెప్టెంబర్ 1–6లో జేఈఈ, సెప్టెంబర్ 13న నీట్ పరీక్షలు నిర్వహించేందుకు ఎన్టీఏ సమాయత్తమయింది. ఇప్పటికే అడ్మిట్‌కార్డుల డౌన్లోడ్ ప్రక్రియను ఆరంభించింది. అభ్యర్థులకే కాదు... కుటుంబాలకు కూడా రిస్కే పరీక్షలు జరపాలన్న నిర్ణయం అసంబద్ధమని, జిల్లాలో పరీక్షా కేంద్రాల సమీక్షకు కేంద్రానికి తగిన సమయం ఉన్నా పట్టించుకోలేదనే విషయాన్ని తీర్పులో ప్రశ్నించలేదని రివ్యూపిటిషన్‌లో పేర్కొన్నారు. లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు రిజిస్టర్ చేసుకోవడం వారంతా పరీక్షకు ప్రస్తుతం హాజరయ్యేందుకు సమ్మతించినట్లు కాదని తెలిపారు. ఆగస్టు 17న ఇచ్చిన ఆదేశం ఈ విషయానికి సంబంధించిన అన్ని అంశాలను పట్టించుకోలేదన్నారు. ‘‘జీవితాలు ముందుకు సాగాలి, విద్యార్థులు ఒక విద్యాసంవత్సరం నష్టపోకూడదు’’ అనే రెండు అంశాల ఆధారంగా తీర్పునిచ్చారని, అంతేకాని నిర్వహణకు సంబంధించిన అన్ని అంశాలను కూలంకషంగా చర్చించలేదని పిటి షన్లో వాదించారు. ఈ తీర్పును సమీక్షించకపోతే దేశ విద్యార్థి సమూహానికి తీవ్ర హాని జరగవచ్చని, కేవలం పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల ఆరోగ్యమే కాకుండా వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై కూడా పెను ప్రభావం చూపవచ్చని వివరించారు. ఇన్ని లక్షల మంది కరోనా సంక్షోభ సమయంలో అటుఇటు ప్రయాణాలు చేయడం తీవ్ర ఆరోగ్య సమస్యకు కారణమవుతుందన్నారు. ఈ ఒక్క కారణంతోనైనా గత తీర్పును రద్దు చేయవచ్చని కోరారు. కరోనా సమయంలలో కేంద్రానికి వ్యతిరేకంగా ఎలాంటి రాజకీయ విమర్శలు చేయదలుచుకోలేదని పిటిషనర్లు తెలిపారు. కరోనా ఉధృతంగా ఉన్నప్పుడు నిర్వహించాలనుకోవడం సమంజసం కాదన్నారు. -
విజయ్ మాల్యాకు షాకిచ్చిన సుప్రీం కోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: ఉద్దేశపూర్వక ఎగవేతదారుడు, వ్యాపారవేత్త విజయ్ మాల్యా తన పిల్లలకు 40 మిలియన్ డాలర్లు బదిలీ చేసి.. కోర్టు ధిక్కారానికి పాల్పడ్డాడంటూ 2017లో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఉత్తర్వులను సమీక్షించాలని కోరుతూ విజయ్ మాల్యా దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు గురువారం తన ఉత్తర్వులను రిజర్వు చేసింది. విచారణ సందర్భంగా జస్టిస్ యూయూ లలిత్, అశోక్ భుషణ్లతో కూడిన ధర్మాసనం మల్యాకు వ్యతిరేకంగా డబ్బు కొల్లగొట్టడం, ఆస్తులను వెల్లడించడంలో విఫలమయ్యాడనే ఆరోపణలు ఉన్నట్లు అభిప్రాయపడింది. అంతేకాక మూడేళ్లుగా విజయ్ మాల్యా రివ్యూ పిటిషన్‌ను సంబంధిత కోర్టులో ఎందుకు లిస్టు చేయలేదో వివరించాల్సిందిగా రిజిస్ట్రీని ధర్మాసనం ఈ ఏడాది జూన్‌లోనే ఆదేశించింది. అంతేకాక ఈ రివ్యూ పిటిషన్‌కు సంబంధించిన ఫైల్‌ను ఏ ఏ అధికారులు డీల్ చేశారో అందరి వివరాలను అందించాలని ధర్మాసనం ఆదేశించింది. (చదవండి: మాల్యాను దివాలాకోరుగా ప్రకటించాల్సిందే!) ప్రభుత్వ బ్యాంకులకు తొమ్మిది వేల కోట్ల రూపాయలకు పైగా రుణాలను ఎగవేసి లండన్‌లో ఉంటున్న విజయ్ మాల్యా తన పిల్లల పేరిట 40 మిలియన్ డాలర్లను బదలాయించారని, ఇది కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనే అని ఎస్బీఐ నేతృత్వంలోని కన్సార్షియం గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో పిల్లలకు 40 మిలియన్ డాలర్లను బదలాయింపు వ్యవహారంలో కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు గాను ఆయనపై కోర్టు ధిక్కార కేసు నమోదైంది. ఈ కేసులో విజయ మాల్యాను దోషిగా పేర్కొంటూ జులై 14, 2017 నాడు సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. దానికి వ్యతిరేకంగా విజయ్ మాల్యా రివ్యూ పిటిషన్ ను దాఖలు చేశారు. ప్రస్తుతం దీనిపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతుంది. దీనిలో భాగంగా గురువారం సుప్రీం కోర్టు పిటిషన్‌పై ఉత్తర్వులను రిజర్వ్‌లో ఉంచింది. -
కుల్‌భూషణ్ కేసులో పాక్ కొత్త కుట్ర
ఇస్లామాబాద్: ఇండియన్ నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ యాదవ్ కేసులో పాకిస్తాన్ కొత్త కుట్రకు తెరతీసినట్లు కనిపిస్తోంది. ఆయన తన కేసులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసుకోవడానికి నిరాకరించారని పేర్కొంది. అంతేకాక పెండింగ్‌లో ఉన్న క్షమాభిక్ష పిటిషన్‌తోనే ఆయన ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నారని పాక్ ప్రభుత్వం తెలిపింది. జూన్ 17న కుల్‌భూషణ్‌ను రివ్యూ పిటిషన్ వేసుకోవాల్సిందిగా ఆహ్వానించామని.. అందుకు ఆయన నిరాకరించారని పాకిస్థాన్ అదనపు అటార్నీ జనరల్ తెలిపారు. భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌కు మరో అవకాశం ఇచ్చినట్లు పాక్ మీడియా బుధవారం (జులై 8) వెల్లడించింది. ఆయనపై మోపిన ఆరోపణలు, విధించిన మరణశిక్షను పున:సమీక్షించడానికి అవకాశం కల్పించగా.. న్యాయపరంగా తన హక్కులను దృష్టిలో ఉంచుకొని రివ్యూ పిటిషన్ దాఖలు చేయడానికి ఆయన తిరస్కరించారని పాక్ మీడియా తెలిపింది. ఉగ్రవాదం, గూఢచర్యం ఆరోపణలపై 2016 మార్చి 3న పాకిస్థాన్‌లోని బెలూచిస్థాన్ ప్రావిన్స్‌లో పాక్ బలగాలు కుల్భుషణ్ యాదవ్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ న్యాయస్థానం 2017 ఏప్రిల్‌లో కులభూషణ్‌కు మరణశిక్ష విధించింది. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇరాన్లో వ్యాపార కార్యకలాపాలు చేసుకుంటుండగా పాక్ అక్రమంగా నిర్భందించి, న్యాయస్థానానికి కూడా అనుమతివ్వలేదని భారత్ ఫిర్యాదు చేసింది.(మౌనం వీడని శాంతి కపోతం) దీనిపై విచారణ చేపట్టిన ఐసీజే కుల్‌భూషణ్ మరణశిక్షను నిలిపివేస్తూ 2019 జులై 17న తీర్పు చెప్పింది. కుల్‌భూషణ్ తరఫున న్యాయవాదిని నియమించుకునే హక్కు భారత్‌కు ఉందని స్పష్టం చేసింది. దీంతో భారత్‌లో ఆశలు చిగురించాయి.16 మంది న్యాయమూర్తుల్లో 15 మంది భారత్‌కు అనుకూలంగా తీర్పు చెప్పడం గమనార్హం. అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పునకు కట్టుబడి ఉంటామని గతంలో పాక్ ప్రభుత్వం పేర్కొన్న సంగతి తెలిసిందే. కుల్‌భూషణ్ జాదవ్‌ను వెంటనే విడుదల చేయాలని భారత్ డిమాండ్ చేస్తోంది. -
మాల్యా పిటిషన్ మూడేళ్లుగా రాలేదెందుకు?
న్యూఢిల్లీ: తనపై ఉన్న ఓ కోర్టు ధిక్కారం కేసులో వ్యాపారవేత్త విజయ్ మాల్యా పెట్టుకున్న రివ్యూ పిటిషన్‌ను ఎందుకు గత మూడేళ్లుగా సంబంధిత కోర్టు బెంచ్ ముందుకు తీసుకురాలేదని సుప్రీంకోర్టు.. తన రిజిస్ట్రీని ప్రశ్నించింది. దీనితో సంబంధమున్న అధికారుల పేర్లను పేర్కొంటూ, ఆలస్యానికి కారణాలను రెండు వారాల్లోగా తెలపాలని రిజిస్ట్రీని ఆదేశించింది. 2017లో విజయ్‌మాల్యా తన సంతానానికి 4కోట్ల డాలర్లను బదిలీచేయడాన్ని కోర్టు ధిక్కారంగా పేర్కొంటూ సుప్రీంకోర్టు అదే ఏడాది తీర్పు చెప్పింది. -
షెడ్యూల్డ్ ప్రాంతాల్లో రిజర్వేషన్ల పరిమితిపై రివ్యూ పిటిషన్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉపాధ్యాయ నియామకాల్లో వంద శాతం గిరిజనులకు రిజర్వేషన్లు వర్తింపజేయడం చెల్లదని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం వెలువరించిన తీర్పుపై ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి రివ్యూ పిటిషన్లు దాఖ లయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో గిరిజనులకు వంద శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని సవాలు చేస్తూ చేబ్రోలు లీలాప్రసాదరావు, ఇతరులు 2002లో దాఖలు చేసిన సివిల్ అప్పీలును జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలో ని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారించి ఈ ఏడాది ఏప్రిల్ 22న 152 పేజీల తీర్పు వెలువరించింది. రిజర్వేషన్లు 50% మించరాదని తీర్పులో పేర్కొంది. అయితే ఇప్పటివరకు చేసిన నియామకాలకు మాత్రం రక్షణ కల్పిస్తున్నట్టు తెలిపింది. 1986లో చట్ట వ్యతిరేకంగా చేసిన కసరత్తును సరిదిద్దుకోకుండా 2000 సంవత్సరంలో తిరిగి అవే తప్పులు చేశారని, ఒకవేళ ఈ నియామకాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు భవిష్యత్తులో అవే తప్పులు పునరావృతం చేస్తే, రిజర్వేషన్లు 50 శాతానికి మించి కల్పిస్తే 1986 నుంచి ఇప్పటివరకు చేసిన నియామకాలకు రక్షణ ఉండదని హెచ్చరించింది. ఈ తీర్పును సమీక్షించాలని కోరు తూ తాజాగా రెండు రాష్ట్రాలకు చెందిన వివిధ గిరిజన సంఘాల తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది అల్లంకి రమేశ్ పిటిషన్లు దాఖలు చేశారు. తెలంగాణ నుంచి ఆదివాసీ హక్కుల పోరాట సమితి–తుడుందెబ్బ ద్వారా బీజేపీ ఎంపీ సోయం బాపూరావు, ఆదివాసీ(గిరిజన) ఎంప్లాయీస్ వెల్ఫేర్ అండ్ కల్చరల్ అసోసియేషన్, సువర్ణపాక జగ్గారావు పిటిషన్లు దాఖలు చేసినవారిలో ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి దండకారణ్య లిబరేషన్ ఆర్గనైజేషన్ తరఫున కూడా అల్లంకి రమేశ్ పిటిషన్ దాఖలు చేశారు. -
ఆ జీవో రద్దుపై సుప్రీంలో రివ్యూ
సాక్షి, హైదరాబాద్: ఏజెన్సీ ప్రాంతాల్లోని టీచర్ల పోస్టులను 100 శాతం స్థానిక గిరిజనులకే రిజర్వు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను (జీవో నంబర్ 3/2000) సుప్రీంకోర్టు కొట్టేయడంపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఈ విషయంలో న్యాయ, రాజ్యాంగపరమైన అంశాలను అధ్యయనం చేసి వెంటనే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని అధికారులను ఆదేశించారు. సుప్రీంకోర్టు తీర్పు స్థానిక గిరిజనులకు అన్యాయం కలిగించే అవకాశం ఉన్నందున ప్రభుత్వం తరఫున న్యాయ పోరాటం చేయాలని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్యే ఆత్రం సక్కు మంగళవారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను కలసి వినతిపత్రం సమర్పించారు. రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్లో పేర్కొన్న షెడ్యూల్డ్ ప్రాంతాలకు చెందిన స్థానికులకు అదే ప్రాంతంలోని పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా నియమించే విషయంలో 100 శాతం రిజర్వేషన్ కేటాయిస్తూ ప్రభుత్వం గతంలో జీవో జారీ చేసింది. దీనిపై కొందరు కోర్టుకెళ్లగా సుప్రీంకోర్టు ఇటీవల జీవోను కొట్టేసింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల వల్ల స్థానిక ఎస్టీలకు నష్టం జరుగుతుందని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం దృష్టికి తెచ్చారు. 1950 జనవరి 26కు ముందు నుంచీ స్థానికంగా నివాసముంటున్న ఎస్టీలకు స్థానిక ఉద్యోగాల్లో వంద శాతం రిజర్వేషన్ ఇచ్చే పద్ధతి ఉందని, దీనివల్ల ఎస్టీలు కొద్దోగొప్పో ప్రయోజనం పొందారని చెప్పారు. కానీ సుప్రీంకోర్టు ప్రభుత్వ జీవోను కొట్టేయడం వల్ల ఎస్టీలు రిజర్వేషన్ సౌకర్యం కోల్పోతారని వారు వివరించారు. రాజ్యంగం కల్పించిన ప్రత్యేక హక్కులకు సుప్రీంకోర్టు తీర్పు భంగకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయ పోరాటం చేయాలని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి.. ఎస్టీల రిజర్వేషన్ కొనసాగించడం సముచితమని అభిప్రాయపడ్డారు. సుప్రీం తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం పక్షాన రివ్యూ పిటిషన్ వేస్తామని స్పష్టం చేశారు. ఎస్టీల రిజర్వేషన్ సౌకర్యం యథావిధిగా కొనసాగేలా అవసరమైన వాదనలతో సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్టీలకు రాజ్యాంగమే ప్రత్యేక హక్కులు, రిజర్వేషన్లు కల్పించిందని, వాటిని కాపాడే విషయంలో ఎస్టీలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. -
నిర్భయ కేసు: పవన్ గుప్తాకు సుప్రీంకోర్టు షాక్
న్యూఢిల్లీ: నిర్భయ దోషుల్లో ఒకడైన పవన్ గుప్తా దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. నిర్భయ సామూహిక అత్యాచారం జరిగిన సమయంలో తాను మైనర్‌ను అని వేసిన పిటిషన్‌ను కొట్టివేయడాన్ని సమీక్షించాలంటూ.. పవన్ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ రివ్యూ పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టిన జస్టిస్ ఆర్ భానుమతి నేతృత్వంలోని ధర్మాసనం.. దానిని కొట్టివేసింది. కాగా ఢిల్లీ కోర్టు తీర్పు మేరకు నిర్భయ దోషులు ముకేశ్ సింగ్, అక్షయ్ ఠాకూర్, పవన్ గుప్తా, వినయ్ శర్మకు ఫిబ్రవరి 1న ఉరిశిక్ష అమలు చేయాల్సి ఉన్న విషయం తెలిసిందే.(మొన్న ముఖేష్.. నిన్న వినయ్ శర్మ.. నేడు అక్షయ్) ఈ నేపథ్యంలో శిక్ష నుంచి తప్పించుకునేందుకు, ఉరి అమలును వాయిదా వేసేందుకు దోషులు అన్ని అవకాశాలను వినియోగించుకుంటున్నారు. వరుస పిటిషన్లు దాఖలు చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారు. అదే విధంగా ఒకరి తర్వాత ఒకరు రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరుతున్నారు. ఈ క్రమంలో వినయ్ శర్మ తాజాగా క్షమాభిక్ష అభ్యర్థించిన నేపథ్యంలో మిగిలిన ముగ్గురు దోషులను ఉరితీసేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. కాగా ఏడేళ్ల క్రితం దేశ రాజధానిలో కదులుతున్న బస్సులో ఓ యువతిపై ఆరుగురు మృగాళ్లు సామూహిక అత్యాచారానికి గురిచేసి దారుణంగా హింసించగా.. సింగపూర్‌లో చికిత్స పొందుతూ ఆమె మరణించిన విషయం విదితమే. ఈ కేసులో ప్రధాన దోషి రామ్ సింగ్ జైలులో ఆత్మహత్య చేసుకోగా.. ఘటన నాటికి మైనర్‌గా ఉన్న మరో నిందితుడు విడుదలయ్యాడు.(నిర్భయ కేసు : ఉరి అమలు ఆ ముగ్గురికే..!) -
టెల్కోలకు ‘సుప్రీం’ షాక్
న్యూఢిల్లీ: దాదాపు రూ. 1.47 లక్షల కోట్ల మేర బకాయీల భారం విషయంలో ఊరట లభించగలదని ఆశతో ఉన్న టెలికం సంస్థలకు సుప్రీం కోర్టు షాకిచ్చింది. సవరించిన స్థూల ఆదాయానికి (ఏజీఆర్) నిర్వచనానికి సంబంధించి గతంలో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ టెల్కోలు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను తోసిపుచ్చింది. దీన్ని మరోసారి సమీక్షించేందుకు తగిన కారణాలేమీ లేవని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. టెలికం కంపెనీలపై విధించిన వడ్డీ, జరిమానాలు సరైనవేనని అభిప్రాయపడింది. దీనిపై తదుపరి లిటిగేషనేదీ ఉండబోదని, టెలికం కంపెనీలు కట్టాల్సిన బకాయిల లెక్కింపు, చెల్లింపునకు నిర్దిష్ట గడువు ఉంటుందని స్పష్టం చేసింది. జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఎస్ఏ నజీర్, జస్టిస్ ఎంఆర్ షాతో కూడుకున్న బెంచ్ గురువారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. ఈ పిటిషన్‌పై విచారణను ఓపెన్ కోర్టు విధానంలో నిర్వహించాలని టెల్కోలు కోరినప్పటికీ.. ఇన్–చాంబర్ విధానంలోనే జరపాలని సుప్రీం కోర్టు నిర్ణయించింది. తీర్పు నిరాశపర్చింది: భారతి ఎయిర్టెల్ ఏజీఆర్ బకాయీలపై పునఃసమీక్ష పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేయడం తమను నిరాశపర్చిందని భారతీ ఎయిర్టెల్ వెల్లడించింది. దీనిపై క్యూరేటివ్ పిటీషన్ దాఖలు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. ‘టెలికం పరిశ్రమ ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. నెట్‌వర్క్‌ను విస్తరించుకోవడం, స్పెక్ట్రం కొనుగోలు చేయడం, 5జీ వంటి కొంగొత్త టెక్నాలజీలను ప్రవేశపెట్టడం మొదలైన వాటిపై భారీగా పెట్టుబడులు పెడుతూ ఉండాలి. ఈ తీర్పు కారణంగా టెలికం పరిశ్రమ లాభదాయకత పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. సుప్రీం కోర్టు తీర్పును గౌరవిస్తాం. అయితే దీనిపై మా నిరాశ కూడా తెలియజేదల్చుకున్నాం. ఏజీఆర్‌పై దీర్ఘకాలంగా నెలకొన్న వివాదంపై మా వాదనలు సరైనవేనని మేం గట్టిగా విశ్వసిస్తున్నాం’ అని ఎయిర్టెల్ ఒక ప్రకటనలో తెలిపింది. అటు వొడాఫోన్ ఐడియా కూడా క్యూరేటివ్ పిటిషన్ వేసే యోచనలో ఉంది. ఇంటర్నెట్ సంస్థలకు దెబ్బ: ఐఎస్‌పీఏఐ సుప్రీం కోర్టు తాజా ఉత్తర్వు .. టెలికం సంస్థలను మరింత సంక్షోభంలోకి నెట్టేస్తుందని, వాటిపై ఆధారపడిన ఇంటర్నెట్ సంస్థలకు ఇది పెద్ద దెబ్బని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఎస్‌పీఏఐ) ప్రెసిడెంట్ రాజేశ్ ఛారియా వ్యాఖ్యానించారు. ‘రివ్యూ పిటిషన్ తిరస్కరణతో టెలికం రంగం మొత్తం రెండు సంస్థల చేతుల్లోకి వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది వినియోగదారులకు ఎంత మాత్రం మంచిది కాదు. ఏజీఆర్ నిర్వచనాన్ని సమీక్షించే విషయంలో ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకోకపోతే చిన్న స్థాయి ఐఎస్పీల మనుగడ కష్టమవుతుంది‘ అని ఆయన పేర్కొన్నారు. వివాదమిదీ.. టెలికం కంపెనీలు కట్టాల్సిన లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీలను మదింపు చేయడానికి ఉద్దేశించిన ఏజీఆర్ నిర్వచనం సరైనదేనంటూ గతేడాది అక్టోబర్ 24న కేంద్రానికి అనుకూలంగా సుప్రీం కోర్టు ఉత్తర్వులిచ్చింది. టెలికంయేతర ఆదాయాలను కూడా ఏజీఆర్‌లో కలపడం వల్ల బాకీలు తడిసి మోపెడు కావడంతో టెలికం సంస్థలకు శరాఘాతంగా మారింది. దీని ప్రకారం చూస్తే వడ్డీలు, జరిమానాలు కలిపి.. భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, ఇతర టెలికం కంపెనీలు జనవరి 23లోగా ఏకంగా రూ. 1.47 లక్షల కోట్ల మేర కట్టాల్సి రానుంది. ప్రభుత్వపరంగా మినహాయింపేదైనా లభిస్తుందేమోనని టెల్కోలు ఆశించినప్పటికీ.. అలాంటి సంకేతాలేమీ కనిపించలేదు. టెల్కోలు దాదాపు రూ. 1.47 లక్షల కోట్ల బకాయీలు కట్టాల్సి ఉందంటూ గతేడాది నవంబర్‌లో పార్లమెంటుకు కేంద్ర టెలికం శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. టెలికం సంస్థలు లైసెన్సు ఫీజు బకాయీల కింద రూ. 92,642 కోట్లు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల (ఎస్‌యూసీ) కింద రూ. 55,054 కోట్లు కట్టాల్సి ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతానికి వడ్డీ, పెనాల్టీలను మాఫీ చేసే యోచనేదీ లేదని స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాలు, టెలికం శాఖ లెక్కింపు ప్రకారం.. వొడాఫోన్ ఐడియా బాకీలు రూ. 53,038 కోట్లు (రూ. 24,729 కోట్ల ఎస్‌యూసీ, రూ. 28,309 కోట్ల లైసెన్సు ఫీజు) కాగా, భారతీ ఎయిర్టెల్ బకాయీలు రూ. 35,586 కోట్ల మేర (రూ. 21,682 కోట్ల లైసెన్సు ఫీజు, రూ. 13,904 కోట్లు ఎస్‌యూసీ) ఉంటాయి. భారతి ఎయిర్‌టెల్‌లో విలీనమైన టెలినార్, టాటా టెలిసర్వీసెస్ బాకీలు విడిగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అక్టోబర్ 24న ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ టెలికం సంస్థలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. వడ్డీ, పెనాల్టీ, జరిమానాపై మళ్లీ వడ్డీ విధింపునకు సంబంధించిన అంశాలను పునఃసమీక్షించాలంటూ భారతీ ఎయిర్టెల్ కోరింది. ఈ రివ్యూ పిటిషన్లపైనే సుప్రీం కోర్టు తాజా ఆదేశాలిచ్చింది. బాకీల విషయంలో ఊరట లభించకపోతే కంపెనీని మూసివేయక తప్పదంటూ వొడాఫోన్ ఐడియా చైర్మన్ కుమార మంగళం బిర్లా ఇప్పటికే ప్రకటించడంతో .. ప్రైవేట్ రంగంలో రెండే సంస్థలు మిగిలే అవకాశాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. -
నిర్భయ దోషికి మరణ శిక్షే
న్యూఢిల్లీ: నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషి అక్షయ్ కుమార్ సింగ్ తనకు విధించిన మరణ శిక్షను సమీక్షించాలంటూ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. అక్షయ్ కుమార్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను బుధవారం జస్టిస్ ఆర్.బానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఏఎస్ బొప్పన్నలతో కూడిన ధర్మాసనం విచారించింది. 2017లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై సమీక్షకు ఎలాంటి ఆధారాలు లేవని ఈ సందర్భంగా ధర్మాసనం స్పష్టం చేసింది. అక్షయ్‌కు మరణశిక్షను ధ్రువీకరిస్తూ తీర్పు వెలువరించింది. గత ఏడాది జులై 9న ఈ కేసులో మరో ముగ్గురు దోషులు ముఖేష్, పవన్‌గుప్తా, వినయ్ శర్మల రివ్యూ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. వారి రివ్యూ పిటిషన్లకి, అక్షయ్ పిటిషన్‌కి ఎలాంటి తేడా లేదని ఈ సందర్భంగా ధర్మాసనం తెలిపింది. దీంతో అక్షయ్ తరపు లాయర్ రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరడానికి మూడు వారాల గడువివ్వాలని కోరారు. రాజకీయపరమైన, మీడియా ఒత్తిళ్ల వల్లనే తన క్లయింట్‌ను దోషిగా తేల్చారని ఆరోపించారు. ఇక దోషులకు న్యాయ పరంగా క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేసుకునే అవకాశం మాత్రం మిగిలుంది. డెత్ వారెంట్లపై విచారణ 7కి వాయిదా నిర్భయ దోషులు ఉరిశిక్షపై రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరుకుంటారో లేదో వారంలోగా వారి స్పందనను తెలుసుకోవాలని ఢిల్లీ కోర్టు తీహార్ జైలు అధికారుల్ని ఆదేశించింది. డెత్ వారెంట్లు జారీపై విచారణను జనవరి 7వ తేదీకి వాయిదా వేసింది. మహారాష్ట్రలోనూ ‘దిశ’ తరహా చట్టం నాగపూర్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళల భద్రతకు సంబంధించి యావత్ జాతికి దిశానిర్దేశం చేసేలా తీసుకువచ్చిన దిశ చట్టంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దిశ చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలన్న డిమాండ్లు పుట్టుకొస్తున్నాయి. దిశ చట్టం ఎంత శక్తిమంతమైనదో గ్రహించిన మహా రాష్ట్ర ప్రభుత్వం ఏపీ బాటలో నడవాలని యోచిస్తోంది. మహిళల అకృత్యాలపై 21 రోజుల్లోగా విచారణ జరిపి, అత్యాచారం కేసుల్లో మరణ దండన విధించాలని దిశ చట్టం చెబుతోంది. ఈ తరహాలోనే చట్టం చేయాలని భావిస్తున్నట్లు హోం మంత్రి ఏక్నాథ్ షిండే బుధవారం శాసన మండలిలో చెప్పారు. ‘మహిళలపై అకృత్యాల విషయంలో చట్టాలను అమలు చేయడంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో దిశ చట్టం తరహాలో సత్వర న్యాయం కోసం ఒక కొత్త చట్టం తీసుకువచ్చే ఆలోచన ఉంది’ అని హోం మంత్రి వెల్లడించారు. మహిళలు, చిన్నారులపై రోజు రోజుకి పెరిగిపోతున్న నేరాల విషయంలో విపక్షాలిచ్చిన సావధాన తీర్మానానికి హోం మంత్రి ఈ మేరకు బదులిచ్చారు. బిహార్‌లో మరో ఘోరం ససారం: బిహార్‌లోని రోహ్తాస్ జిల్లాలో ఓ దళిత మహిళపై నలుగురు వ్యక్తులు అత్యాచారానికి యత్నించగా ఆమె తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం మంగళవారం రాత్రి బాధితురాలిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపగా తీవ్రంగా గాయపడింది. నిందితులను ఆదివారమే అరెస్టు చేశామని ఎస్పీ వెల్లడించారు. కాల్పులు జరిపిన వారికోసం గాలిస్తున్నామన్నారు. -
అక్షయ్ సింగ్ రివ్యూ పిటిషన్ తిరస్కరణ
-
నిర్భయ దోషి రివ్యూ పిటిషన్‌పై విచారణ
-
నిర్భయ దోషి రివ్యూ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: నిర్భయ కేసులో దోషి అక్షయ్ కుమార్ సింగ్ తనకు విధించిన మరణ శిక్షపై దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. తీర్పుపై సమీక్ష కోరే హక్కు దోషికి ఉండబోదని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. నిర్భయ దోషులకు ఉరిశిక్ష సరైనదని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ఇదివరకే ఈ కేసులోని ముగ్గురు దోషులకు సంబంధించిన రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇక, ఇవాళ (బుధవారం) మధ్యాహ్నం రెండుగంటలకు పటియాల హౌజ్ కోర్టులో నిర్భయ దోషులకు డెత్ వారెంట్ల జారీపై విచారణ జరగనుంది. తనకు విధించిన ఉరిశిక్షను పునఃసమీక్షించాలని నిర్భయ కేసులో దోషి అయిన అక్షయ్‌సింగ్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అతని అభ్యర్థనపై త్రిసభ్య ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు జరపాలని కోరినా.. పట్టించుకోలేదని, దర్యాప్తు అధికారుల అసమర్థత వల్ల ఈ కేసులో నిజమైన దోషులను పట్టుకోలేకపోయారని అక్షయ్‌కుమార్‌సింగ్ తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. ఈ రివ్యూ పిటిషన్ విచారణ నుంచి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే సోమవారం తప్పుకున్న సంగతి తెలిసిందే. జస్టిస్ బాబ్డే, జస్టిస్ ఆర్ బానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్‌లతో కూడిన డివిజన్ బెంచ్ మంగళవారం ఈ పిటిషన్‌పై విచారణ జరపాల్సి ఉంది. అయితే, నిర్భయ తల్లి తరఫున విచారించిన లాయర్లలో తన బంధువు ఉన్నారని, అందుకే విచారణ నుంచి తప్పుకుంటున్నట్టు జస్టిస్ బాబ్డే ప్రకటించారు. దీంతో బుధవారం మరో బెంచ్ విచారణ చేపట్టింది. -
ఆ రాక్షస చర్యపై సమీక్షా?
న్యూఢిల్లీ: తన కూతురిని రాక్షసంగా చెరిచి హత్య చేసిన వారికి విధించిన తీర్పును సమీక్షించరాదంటూ నిర్భయ తల్లి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దోషుల్లో ఒకరైన అక్షయ్‌కుమార్ 2017లో కోర్టు విధించిన ఉరిశిక్షను సమీక్షించాలని కోరుతూ ఇప్పటికే అత్యున్నత న్యాయస్థానంలో వేసిన పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ నిర్భయ తల్లి శుక్రవారం ఓ పిటిషన్ వేశారు. రివ్యూ పిటిషన్‌పై విచారించే రోజున, అంటే ఈ నెల 17వ తేదీనే ఈ పిటిషన్‌పైనా వాదనలు వింటామని ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎ.బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. తన కూతురిపై అత్యాచారం జరిగిన డిసెంబరు 16వ తేదీనే దోషులకు శిక్ష అమలు చేయాలని నిర్భయ తల్లి మీడియా ఎదుట డిమాండ్ చేశారు. తన కూతురుకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ఇలా ఉండగా.. నిర్భయ దోషులకు డెత్ వారెంట్లు జారీ చేయాల్సిందిగా ఢిల్లీ కోర్టులో దాఖలైన పిటిషన్‌పై 18న విచారణ చేపడతామని అడిషనల్ సెషన్స్ జడ్జి స్పష్టం చేశారు. ఉరి అమలుకు సిద్ధం: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జైలుకు చెందిన తలారి... తీహార్ జైలులో ఉరిశిక్షను అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. నిర్భయ దోషులకు సుప్రీంకోర్టు ఉరిశిక్ష విధించిన నేపథ్యంలో తీహార్ జైలు అధికారులు తలారి కోసం ఉత్తరప్రదేశ్ జైళ్ల శాఖను అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో మీరట్ జైలుకు చెందిన తలారి పవన్ జల్లాడ్ (55)... ఉరి అమలుకు సిద్ధమన్నాడు. విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయిస్తాం: కేజ్రీవాల్ మహిళల పట్ల ఎలాంటి అనుచిత చర్యలకు దిగబోమంటూ విద్యార్థుల చేత పాఠశాలల్లో ప్రతిజ్ఞ చేయిస్తామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. నిర్భయ కేసులో దోషులకు ఉరిశిక్ష పడాలని దేశమంతా కోరుకుంటోందని తెలిపారు. -
‘అయోధ్య’ రివ్యూ పిటిషన్ల కొట్టివేత
న్యూఢిల్లీ: అయోధ్యలోని వివాదాస్పద ప్రాంతంలో రామాలయ నిర్మాణానికి అడ్డంకి తొలగిపోయింది. నవంబర్ 9వ తేదీన వెలువరించిన చారిత్రక తీర్పును సమీక్షించాలంటూ దాఖలైన పిటిషన్లన్నిటినీ సుప్రీంకోర్టు కొట్టివేసింది. తీర్పు సమీక్ష కోరుతూ దాఖలైన మొత్తం 19 పిటిషన్లకు ఎలాంటి విచారణార్హత లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ‘రివ్యూకోసం దాఖలైన పిటిషన్లను, జత చేసిన పత్రాలను క్షుణ్నంగా పరిశీలించాం. వీటికి ఎలాంటి ప్రాతిపదిక లేదని భావిస్తున్నాం. అందుకే ఈ పిటిషన్లన్నిటినీ తిరస్కరిస్తున్నాం’ అంటూ వాస్తవ కక్షిదారులు వేసిన 10 పిటిషన్లను కొట్టివేస్తూ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్ఏ నజీర్, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన ఈ ధర్మాసనం పేర్కొంది. తీర్పుపై సమీక్ష కోరేందుకు అనుమతించాలంటూ మూడోపక్షం(థర్డ్ పార్టీ) దాఖలు చేసిన 9 పిటిషన్లను కూడా ధర్మాసనం తోసిపుచ్చింది. ఇందులోని 10 పిటిషన్లు వాస్తవ కక్షిదారులవి కాగా, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు, దాని మద్దతుతో వేసినవి 8, హక్కుల కార్యకర్తలు 40 మంది కలిసి వేసిన మరో పిటిషన్ ఉన్నాయి. వీటితోపాటు అఖిల భారత హిందూ మహాసభ వేసిన పిటిషన్, నిర్మోహి అఖాడా వేసిన రివ్యూ పిటిషన్ కూడా తిరస్కరణకు గురయ్యాయి. ఆఖరి చాన్స్ ‘క్యూరేటివ్’ అన్ని రివ్యూ పిటిషన్లు సుప్రీంకోర్టు తిరస్కరణకు గురికావడంతో కక్షిదారులకు ఇక ఒకే ఒక్క అవకాశం మిగిలి ఉంది. అదే క్యూరేటివ్ పిటిషన్. తీర్పులో ఏవైనా లోపాలున్నాయని అత్యున్నత న్యాయస్థానం భావించిన పక్షంలో వాటిని సవరించేందుకు క్యూరేటివ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు స్వీకరిస్తుంది. పునస్సమీక్షకు తగిన ఆధారాలున్నాయని న్యాయస్థానం భావించినా, విచారణ చేపట్టేందుకు అవకాశం ఉంటుంది. -
అయోధ్య రివ్యూ పిటిషన్లపై సుప్రీం కీలక నిర్ణయం
-
అయోధ్య తీర్పుపై సుప్రీం కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్య తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్య కేసులో సుప్రీం తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన 18 రివ్యూ పిటషన్లను సర్వోన్నత న్యాయస్ధానం తిరస్కరించింది. నవంబర్ 9న వెలువరించిన నిర్ణయమే తుది తీర్పని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని అయిదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం బెంచ్ స్పష్టం చేసింది. అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమం చేస్తూ గత నెలలో సుప్రీం కోర్టు చారిత్రక తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. సుప్రీం తీర్పును సవాల్ చేస్తూ ముస్లిం పర్సనల్ లా బోర్డు, నిర్మోహి అఖారా సైతం రివ్యూ పిటిషన్లు దాఖలు చేశాయి. అయోధ్య తీర్పును సవాల్ చేస్తూ 40 మంది సామాజిక కార్యకర్తలు సైతం రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేశారు. మరోవైపు అయోధ్యలో ముస్లింలకు మసీదు నిర్మాణం కోసం ఐదు ఎకరాలు కేటాయించాలని సుప్రీం కోర్టు దాఖలు చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ హిందూ మహాసభ పిటిషన్ దాఖలు చేసింది. -
అయోధ్య తీర్పు : రివ్యూ పిటిషన్లపై తేల్చనున్న సుప్రీం
సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్య కేసులో వెలువడిన తీర్పుపై రివ్యూ పిటిషన్లను బహిరంగ న్యాయస్ధానంలో విచారణకు చేపట్టాలా లేదా అనే అంశంపై అయిదుగురు న్యాయమూర్తులతో కూడిన సర్వోన్నత న్యాయస్ధానం గురువారం అంతర్గత విచారణ చేపట్టనుంది. బహిరంగ విచారణకు సుప్రీంకోర్టు మొగ్గుచూపితే అన్ని రివ్యూ పిటిషన్లను విచారణకు ముందుకు రానుండగా, వీటిని ప్రోత్సహించరాదని నిర్ణయిస్తే రివ్యూ పిటిషన్లను కోర్టు తోసిపుచ్చనుంది. రామజన్మభూమి-బాబ్రీమసీదు భూ వివాదం కేసులో నవంబర్ 9న సుప్రీం కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఇప్పటివరకూ ఏడు పిటిషన్లు సర్వోన్నత న్యాయస్ధానం ముందుకు వచ్చాయి. అయోధ్య తీర్పును సవాల్ చేస్తూ సోమవారం 40 మంది సామాజిక కార్యకర్తలు సైతం రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేశారు. మరోవైపు అయోధ్యలో ముస్లింలకు మసీదు నిర్మాణం కోసం ఐదు ఎకరాలు కేటాయించాలని సుప్రీం కోర్టు దాఖలు చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ హిందూ మహాసభ పిటిషన్ దాఖలు చేసింది. అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమం చేస్తూ గత నెలలో సుప్రీం కోర్టు చారిత్రక తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. -
అయోధ్య తీర్పు: వారికి 5 ఎకరాలు ఎలా ఇస్తారు?
న్యూఢిల్లీ: అయోధ్యలో రామ జన్మభూమి- బాబ్రీమసీదు వివాదాస్పద స్థలానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సోమవారం హిందూ మహాసభ రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో సుప్రీంకోర్టు వెలువరించిన చారిత్రక తీర్పుపై సమీక్ష కోరుతూ 7 పిటిషన్లు దాఖలయ్యాయి. సుప్రీం కోర్టులో ముస్లింలు ఇప్పటివరకూ 6 రివ్యూ పిటిషన్లు దాఖలు చేయగా.. హిందువుల నుంచి తొలి రివ్యూ పిటిషన్ దాఖలైంది. ముస్లింలకు అయోధ్యలోని ప్రముఖ ప్రాంతంలో మసీదు నిర్మాణం కోసం 5 ఎకరాల స్థలం కేటాయించాలని ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ హిందూ మహాసభ రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేసింది. కాగా డిసెంబర్ 2న తొలి రివ్యూ పిటిషన్‌ను ఉత్తరప్రదేశ్‌లోని జామియత్ ఉలామా-ఏ-హింద్‌కు అధ్యక్షుడైన సయ్యద్ అష్షద్ రషీదీ దాఖలు చేశారు. రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 2.77 ఎకరాల వివాదాస్పద స్థలంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన ట్రస్ట్ ఆధ్వర్యంలో రామ మందిరం నిర్మాణం జరగాలని, ప్రతిగా ముస్లింలకు అయోధ్యలోని ప్రముఖ ప్రాంతంలో మసీదు నిర్మాణం కోసం 5 ఎకరాల స్థలం కేటాయించాలని నవంబర్ 9న సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. -
‘అయోధ్య’పై రివ్యూ పిటిషన్
న్యూఢిల్లీ: అయోధ్యలో రామ జన్మభూమి– బాబ్రీమసీదు వివాదాస్పద స్థలానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలైంది. తీర్పులో కొన్ని తప్పులున్నాయని, వాటిని సవరించాలని కోరుతూ సోమవారం మౌలానా సయ్యద్ అషాద్ రషీది, జామియత్ ఉలేమా ఇ హింద్ ఉత్తరప్రదేశ్ శాఖ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదానీ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. సయ్యద్ రషీది తొలి పిటిషన్‌దారు ఎం సిద్ధిఖీకి చట్టబద్ధ వారసుడు. ‘ఆ స్థలంలో బాబ్రీ మసీదును నిర్మించాలని తీర్పునివ్వడం ద్వారానే నిజమైన న్యాయం జరిగినట్లవుతుంది’ అని 93 పేజీల ఆ రివ్యూ పిటిషన్లో పేర్కొన్నారు. 2.77 ఎకరాల వివాదాస్పద స్థలంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన ట్రస్ట్ ఆధ్వర్యంలో రామాలయ నిర్మాణం జరగాలని, ప్రతిగా, ముస్లింల తరఫున సున్నీ వక్ఫ్ బోర్డుకు అయోధ్యలోని ప్రముఖ ప్రాంతంలో మసీదు నిర్మాణం కోసం 5 ఎకరాల స్థలం కేటాయించాలని జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం నవంబర్ 9న సంచలన తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. -
రివ్యూనే కోరుకుంటున్నారు!
లక్నో: అయోధ్యలోని వివాదాస్పద స్థలంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేయాలనే దేశంలోని 99 శాతం ముస్లింలు కోరుకుంటున్నారని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ (ఏఐఎంపీఎల్బీ) పేర్కొంది. రామజన్మభూమి– బాబ్రీ మసీదు వివాదానికి సంబంధించి నవంబర్ 9న సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. బాబ్రీ మసీదును కూల్చిన స్థలంలో ట్రస్ట్ ఆధ్వర్యంలో రామాలయ నిర్మాణం జరగాలని, మసీదు నిర్మాణం కోసం అయోధ్యలోనే మరో చోట సున్నీ వక్ఫ్ బోర్డుకు 5 ఎకరాల స్థలం కేటాయించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అయితే, ముస్లింల తరఫు పిటిషన్‌దారు అయిన సున్నీ వక్ఫ్‌బోర్డు ఆ తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయబోమని స్పష్టం చేసింది. కానీ, ఏఐఎంపీఎల్బీ మాత్రం డిసెంబర్ 9న రివ్యూ పిటిషన్ దాఖలవుతుందని పేర్కొంది. తాజాగా, ఆదివారం ఏఐఎంపీఎల్బీ ప్రధాన కార్యదర్శి మౌలానా వాలి రహ్మానీ మాట్లాడుతూ.. ‘99% ముస్లింలు రివ్యూ పిటిషన్ వేయాలనే కోరుకుంటున్నారు. ముస్లింలకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంది. కానీ సుప్రీంకోర్టు తీర్పు తరువాత.. వారిలో ఆ నమ్మకం తగ్గింది’ అని వ్యాఖ్యానించారు. రివ్యూ పిటిషన్ వేసినా.. ఆ పిటిషన్‌ను కొట్టేస్తారనే అనుమానం తమకుందన్నారు. పిటిషన్ వేయడం తమ హక్కు అని, సుప్రీంకోర్టు తీర్పులో వైరుద్ధ్యాలున్నాయన్నారు. ఉద్రిక్తతలు సృష్టించాలనే.. అయోధ్య తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయాలన్న నిర్ణయాన్ని కేంద్రమంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ తప్పుబట్టారు. పిటిషన్ వేయడం ద్వారా సమాజంలో విభజనపూరిత, ఘర్షణాత్మక వాతావరణం ఏర్పడేలా చేయాలనుకుంటున్నాయని ఏఐఎంపీఎల్బీ, జమాయిత్ సంస్థలపై మండిపడ్డారు. ‘ముస్లింలు బాబ్రీని కాదు.. ఆర్థికంగా, సామాజికంగా సమానత్వం కోరుకుంటున్నార’న్నారు. ఆర్థికంపై దృష్టిపెట్టండి రివ్యూ పటిషన్ వేయాలన్న నిర్ణయాన్ని గతంలో అయోధ్య వివాదంలో మధ్యవర్తిత్వం వహించిన శ్రీశ్రీ రవిశంకర్ కూడా తప్పుబట్టారు. ఆ వివాదాన్ని మర్చిపోయి, హిందూ, ముస్లింలు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేయాలని సూచించారు. -
9లోగా ‘అయోధ్య’ రివ్యూ పిటిషన్
లక్నో: అయోధ్యలోని వివాదాస్పద బాబ్రీ మసీదు– రామ జన్మభూమి కేసులో ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై డిసెంబర్ 9లోపు రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని ది ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్బీ) బుధవారం ప్రకటించింది. సుప్రీంతీర్పును సమీక్షించబోమని సున్నీ వక్ఫ్ బోర్డు మంగళవారం ప్రకటించిన నేపథ్యంలో బుధవారం ఏఐఎంపీఎల్బీ తాజాగా ఈ ప్రకటన చేయడం గమనార్హం. నవంబరు 17న జరిగిన బోర్డు సమావేశంలోనే రివ్యూ పిటిషన్‌పై తీర్మానించామని, సమీక్ష కోరేందుకు తమకు డిసెంబరు 9వరకు సమయం ఉందని ఏఐఎంపీఎల్బీ కార్యదర్శి జఫర్యాబ్ జిలానీ తెలిపారు. రివ్యూ పిటిషన్ దాఖలు చేసేందుకు అవకాశమున్న ముస్లిం వర్గాలను అయోధ్య పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారని, కేసుల్లో ఇరికించి జైల్లో పెడతామని బెదిరిస్తున్నారని జలానీ ఆరోపించారు. అయోధ్య పోలీసుల తీరును పిటిషన్లో తాము సుప్రీంకోర్టుకు నివేదిస్తామని అన్నారు. ఇదిలా ఉండగా.. మసీదు నిర్మాణానికి ప్రభుత్వమిచ్చే ఐదెకరాల స్థలాన్ని సున్నీ వక్ఫ్‌బోర్డు నిరాకరిస్తే దాన్ని తమకు ఇవ్వాల్సిందిగా కోరతామని ఉత్తరప్రదేశ్ షియా సెంట్రల్ వక్ఫ్‌బోర్డు బుధవారం తెలిపింది. అయితే ఆ స్థలాన్ని తాము మసీదు నిర్మాణానికి కాకుండా ఆసుపత్రిని నిర్మించేందుకు వినియోగిస్తామని ఉత్తరప్రదేశ్ షియా సెంట్రల్ వక్ఫ్‌బోర్డు ఛైర్మన్ వసీమ్ రిజ్వీ తెలిపారు. అయోధ్య తీర్పుకు సంబంధించి రివ్యూ పిటిషన్ ముసాయిదా తయారైందని ప్రముఖ ముస్లిం సంస్థలు తెలిపాయి. డిసెంబరు 3 లేదా 4 తేదీల్లో జమాయత్ ఉలేమా ఏ హింద్ సంస్థ సుప్రీంకోర్టులో దాఖలు చేసే అవకాశం ఉంది. -
‘అయోధ్య వివాదాన్ని సజీవంగా ఉంచొద్దు’
న్యూఢిల్లీ: అయోధ్యలోని రామ జన్మభూమి- బాబ్రీ మసీదు వివాదాస్పద స్థలానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేసే విషయమై పునర్ ఆలోచించాలని బాలీవుడ్ నటులు షబానా అజ్మీ, నసీరుద్దీన్ షాతో పాటు దేశంలోని వందకు పైగా ముస్లిం ప్రముఖులు కోరారు. అయోధ్య వివాదాన్ని సజీవంగా ఉంచితే ముస్లిం కమ్యూనిటీకి హాని కలుగుతుందని అభిప్రాయపడుతూ మంగళవారం వారు ఒక ప్రకటనను విడుదల చేశారు. రివ్యూ పిటిషన్ దాఖలు విషయమై మరోసారి ఆలోచించాలంటూ సంతకాల సేకరణ చేపట్టారు. ఇందులో ముస్లిం సామాజిక వర్గానికి చెందిన లాయర్లు, పత్రికా విలేకరులు, సామాజిక కార్యకర్తలు, నటులు, వ్యాపారవేత్తలు, సంగీతకారులతో పాటు విద్యార్థులు ఉన్నారు. అయోధ్య వివాదాన్ని సజీవంగా ఉంచడం ద్వారా భారత ముస్లిం సామాజిక వర్గానికి హాని కలుగుతుందని తాము గట్టిగా నమ్ముతున్నామని లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ ప్రకటనపై సంతకం చేసిన వారిలో సినీ రచయిత అంజుమ్ రాజ్బలి, జర్నలిస్ట్ జావేద్ ఆనంద్ సహా పలువురు ప్రముఖులు ఉన్నారు. కాగా అయోధ్యలోని వివాదాస్పద భూమి (2.77) ఎకరాలు హిందువులకే చెందుతుందని సుప్రీం సంచలన తీర్పు వెలువరించింది. ప్రత్యామ్నాయంగా మసీదు నిర్మాణానికి అయోధ్యలోనే సున్నీవక్ఫ్ బోర్డుకు 5 ఎకరాల స్థలం ఇవ్వాలని ఆదేశించిన సంగతి విధితమే. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్(ఏఐఎంపీఎల్బీ) నవంబర్ 17న ప్రకటించింది. -
ఏజీఆర్‌పై సుప్రీంలో టెల్కోల రివ్యూ పిటిషన్
న్యూఢిల్లీ: టెల్కోల రాబడి (ఏజీఆర్)కి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎయిర్టెల్ శుక్రవారం రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. ఏజీఆర్ మొత్తంపై వడ్డీ, జరిమానాను రద్దు చేయాలని ఈ పిటిషన్లో కోరింది. ఈ ఏడాది జూలై నాటికి డాట్ లెక్కల ప్రకారం ఎయిర్టెల్ రూ. 21,682 కోట్లు లైసెన్సు ఫీజు కింద బకాయి పడింది. స్పెక్ట్రం యూసేజీ చార్జీగా చెల్లించాల్సింది రూ.13,904 కోట్లు. కాగా వొడాఫోన్ ఐడియా కూడా సుప్రీంలో రివ్యూ పిటిషన్ వేసినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే... కొత్త టెలికం విధానం ప్రకారం.. టెల్కోలు తమ సవరించిన స్థూల రాబడి (ఏజీఆర్)లో నిర్దిష్ట వాటాను ప్రభుత్వానికి వార్షిక లైసెన్సు ఫీజుగా కట్టాల్సి ఉంటుంది. దీనితో పాటు స్పెక్ట్రం వినియోగానికి గాను నిర్దిష్ట చార్జీలు (ఎస్‌యూసీ) చెల్లించాలి. అయితే ఈ ఏజీఆర్ లెక్కింపు విషయంలో వివాదం నెలకొంది. అద్దెలు, స్థిరాస్తుల విక్రయంపై లాభాలు, డివిడెండు మొదలైన టెలికంయేతర ఆదాయాలు కూడా ఏజీఆర్ కిందే వస్తాయని, దానిపైనే లైసెన్సు ఫీజు కట్టాల్సి ఉంటుందని టెలికం వివాదాల పరిష్కార, అప్పిలేట్ ట్రిబ్యునల్ (టీడీశాట్) గతంలో ఆదేశాలు ఇచ్చింది. దీనివల్ల ప్రభుత్వానికి చెల్లించాల్సిన లైసెన్సు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల భారం భారీగా పెరిగిపోనుండటంతో టీడీశాట్ ఆదేశాలను సవాల్ చేస్తూ టెల్కోలు .. సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. గత నెల 24వ తేదీన ప్రభుత్వ వాదనలతో ఏకీభవిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. దీనిప్రకారం రూ.92,642 కోట్లు టెల్కోలు లైసెన్స్ ఫీజుగా చెల్లించాల్సి ఉండగా, రూ.55,054 కోట్లు స్పెక్ట్రమ్ వినియోగ చార్జీగా చెల్లించాలి. మారటోరియం, టారిఫ్ పెంపు సరిపోదు: ఫిచ్ రేటింగ్స్ స్పెక్ట్రం యూసేజీ చార్జీల చెల్లింపుపై రెండేళ్ల మారటోరియం, టారిఫ్‌ల పెంపు వంటివి సానుకూలమే అయినప్పటికీ .. వీటి వల్ల టెలికం రంగానికి పెద్దగా ఒరిగేదేమీ ఉండకపోవచ్చని రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ రేటింగ్స్ వెల్లడించింది. సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్)కి సంబంధించి సుప్రీం కోర్టులో ప్రతికూల తీర్పుతో భారీగా లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీలు కట్టాల్సి రానున్న టెల్కోలకు ఊరట లభించకపోవచ్చని పేర్కొంది. ఈ నేపథ్యంలో 2020 సంవత్సరం.. టెలికం రంగానికి ప్రతికూలంగా ఉండవచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపింది. జియోకు సానుకూలం..: టారిఫ్ పెంపుతో అత్యంత వేగంగా మార్కెట్ వాటా పెంచుకుంటున్న జియోకు లాభపడగలదని ఫిచ్ అంచనా వేసింది. 2020 ద్వితీయార్ధానికి జియో 40 కోట్ల మంది యూజర్లు, పరిశ్రమ ఆదాయంలో 40 శాతం వాటాను దక్కించుకోగలదని భావిస్తున్నట్లు పేర్కొంది. -
అయోధ్య’పై రివ్యూ పిటిషన్ వేస్తాం
అయోధ్యలోని రామ జన్మభూమి– బాబ్రీ మసీదు వివాదాస్పద స్థలానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూపిటిషన్ దాఖలు చేస్తామని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్, జమీయత్ ఉలేమా ఎ హింద్ ప్రకటించాయి. లక్నో/న్యూఢిల్లీ: అయోధ్యలోని రామజన్మభూమి– బాబ్రీ మసీదు వివాదాస్పద స్థలానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్(ఏఐఎంపీఎల్బీ), జమీయత్ ఉలేమా ఎ హింద్ ప్రకటించాయి. ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డ్ మాత్రం సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయబోమన్నారు. వివాదాస్పద స్థలంలో రామమందిరం నిర్మించాలని, మసీదు నిర్మాణం కోసం అయోధ్యలో వేరే చోట సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డ్‌కు 5 ఎకరాల స్థలం కేటాయించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఆ ఐదు ఎకరాల స్థలాన్ని స్వీకరించాలా? వద్దా? అనేది నవంబర్ 26న జరిగే బోర్డు సమావేశంలో నిర్ణయిస్తామని వక్ఫ్ బోర్డు చైర్మన్ జుఫర్ ఫారూఖీ తెలిపారు. మసీదు స్థలాన్ని వదులుకోవడం షరియా ప్రకారం సరికాదని ఏఐఎంపీఎల్బీ పేర్కొంది. ఏఐఎంపీఎల్బీ సమావేశం ఆదివారం లక్నోలో జరిగింది. మసీదు నిర్మాణం కోసం 5 ఎకరాలు ఇస్తామన్న ప్రతిపాదనను అంగీకరించబోమని సమావేశం అనంతరం ఏఐఎంపీఎల్బీ స్పష్టం చేసింది. ‘అది సరైన న్యాయం కాదు.. అలాగే, మాకు జరిగిన నష్టానికి పరిహారం కాబోదు’ అని స్పష్టం చేసింది. ‘ఈ కేసులో ఏఐఎంపీఎల్బీ పిటిషన్‌దారు కాదు. కానీ పిటిషన్‌దారులకు దిశానిర్దేశం చేస్తుంది. ముస్లింల తరఫు పిటిషన్‌దారుల్లో ఐదుగురు రివ్యూ వేసేందుకే మొగ్గు చూపారు’ అని ఏఐఎంపీఎల్బీ సభ్యుడు కమల్ ఫారూఖీ తెలిపారు. ‘మసీదు స్థలం అల్లాకు చెందుతుంది. షరియా ప్రకారం ఆ స్థలాన్ని ఎవరికీ ఇవ్వకూడదు’ అని ఏఐఎంపీఎల్బీ కార్యదర్శి జఫర్యాబ్ జిలానీ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో పలు పరస్పర విరుద్ధ అంశాలున్నాయన్నారు. ఈ కేసులో తొలుత కేసు వేసినవారిలో ఒకరైన జమీయత్ సంస్థ ఉత్తరప్రదేశ్ మాజీ ప్రధాన కార్యదర్శి ఎం సిద్దిఖీ కూడా సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్ వేస్తామన్నారు. సాక్ష్యాలపైనో లేక హేతుబద్ధతపైననో ఆధారపడి తీర్పు ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. అయోధ్య కేసులో ముఖ్య పిటిషనర్ అయిన ఇక్బాల్ అన్సారీ మాత్రం రివ్యూ పిటిషన్ వేసే ఆలోచన లేదన్నారు. ముస్లిం వర్గాల వాదనలను, అందించిన సాక్ష్యాధారాలను అంగీకరించిన సుప్రీంకోర్టు.. తీర్పు మాత్రం హిందువులకు అనుకూలంగా ఇచ్చిందని జమీయత్ సంస్థ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదానీ అన్నారు. సమావేశానికి ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా హాజరయ్యారు. ఏఐఎంపీఎల్బీ కార్యదర్శి జఫర్యాబ్ జిలానీ -
అయోధ్య తీర్పు: ముస్లిం లా బోర్డు సంచలన నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: అయోధ్య తీర్పుపై ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఎఐఎంపీఎల్బీ) కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్యపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని ఎఐఎంపీఎల్బీ నిర్ణయించింది. అలాగే మసీదు కోసం కేంద్ర ప్రభుత్వం అయోధ్యలో ఇవ్వబోయే ఐదెకరాల భూమిని కూడా ముస్లిం లా బోర్డు నిరాకరించింది. తమకు ఆ భూమి అవసరం లేదని తేల్చిచెప్పింది. సుప్రీం కోర్టు తీర్పుపై సమీక్షించిన బోర్డు సభ్యులు.. తీర్పును సవాలు చేయాలని నిర్ణయించారు. ఆదివారం ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు, బాబ్రీ మసీదు యాక్షన్ కమిటీ, మత పెద్దలు, అయోధ్య కేసులో ముస్లిం పక్షాలతో లక్నోలోని నద్వా కళాశాలలో సమావేశం అయ్యారు. భేటీ అనంతరం ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. పిటిషన్ ఎప్పుడు వేయాలనేది మాత్రం వారు వెల్లడించలేదు. వారి తరఫున న్యాయవాదులతో మాట్లాడిన అనంతరం తేదీని వెల్లడిస్తామని తెలిపారు. వీరితో భేటీలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా పాల్గొన్నారు. కాగా అయోధ్యలో వివాదాస్పదంగా మారిన 2.77 ఎకరాల భూమి హిందువులకే చెందుతుందని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. అయితే ఎన్నో ఏళ్లుగా సాగుతున్న ఈ వివాదానికి ముగింపు పలుకుతూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తుది తీర్పు చెప్పింది. అలాగే అయోధ్యలోనే ముస్లింలు మసీదు నిర్మాణం కొరకు కేంద్ర ప్రభుత్వం వారికి ఐదెకరాల భూమిని కేటాయించాలని తీర్పులో పేర్కొంది. ఈ తీర్పును పలు ముస్లిం సంఘాలు మినహా.. దేశంలోని అన్ని వర్గాల వారు స్వాగతించారు. ఈ నేపథ్యంలో ఎఐఎంపీఎల్బీ దాఖలు చేయబోయే సమీక్ష పిటిషన్‌ను సుప్రీం పరిగణిస్తుందా లేక విచారణకు నిరాకరిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. -
'రివ్యూ పిటిషన్‌పై నేడు నిర్ణయం తీసుకుంటాం'
లక్నో: అయోధ్య రామాలయం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ వేసే విషయంలో నేడు నిర్ణయం తీసుకోనున్నట్టు సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు లాయర్ జఫర్యాబ్ జిలానీ తెలిపారు. ఇందుకోసం ఆదివారం ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు, బాబ్రీ మసీదు యాక్షన్ కమిటీ, మత పెద్దలు, అయోధ్య కేసులో ముస్లిం పక్షాలతో లక్నోలోని నద్వా కళాశాలలో సమావేశం ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. జిలానీ ఇంకా మాట్లాడుతూ.. ‘మాకు ఐదెకరాలు ఇవ్వాలని సుప్రీ ఇచ్చిన తీర్పుపై మాకు అసంతృప్తి ఉంది. నా వ్యక్తిగత అభిప్రాయమైతే ఐదెకరాలు కాదు. 500 ఎకరాలు ఇచ్చినా సమ్మతం కాదు. మాకు మసీదే కావాలని వ్యాఖ్యానించిన ఎమ్ఐఎమ్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీతో నేను ఏకీభవిస్తా’నని వెల్లడించారు. మరోవైపు ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు చైర్మన్ జుఫర్ ఫారూఖీ సుప్రీం తీర్పును స్వాగతించారు కదా అని ప్రశ్నించగా, ఆయన చెప్పేదే ఫైనల్ కాదు. అతనిని కూడా ఈ సమావేశానికి ఆహ్వానించామని తెలిపారు. ఇదిలా ఉండగా, అయోధ్య కేసులో తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ఆదివారం పదవీ విరమణ చేయనున్న సంగతి తెలిసిందే. -
రఫేల్ రివ్యూ పిటిషన్లపై రేపు సుప్రీం తీర్పు..
న్యూఢిల్లీ : రఫేల్ ఒప్పందానికి క్లీన్ చిట్ ఇస్తూ సర్వోన్నత న్యాయస్దానం గతంలో ఇచ్చిన ఉత్తర్వులపై దాఖలైన రివ్యూ పిటిషన్లపై సుప్రీం కోర్టు గురువారం తీర్పు వెలువరించనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్‌లతో కూడిన సుప్రీం బెంచ్ తీర్పును వెల్లడిస్తుంది. గత ఏడాది డిసెంబర్ 14న రఫేల్ ఒప్పందంపై ఇచ్చిన తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లపై మే 10న అన్ని పక్షాల వాదనలు విన్న మీదట సుప్రీం కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. బీజేపీ మాజీ నేతలు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరి, సామాజిక కార్యకర్త ప్రశాంత్ భూషణ్‌లు ఈ పిటిషన్లను దాఖలు చేశారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, ఫ్రెంచ్ కంపెనీ దసాల్ట్ ఏవియేషన్ల మధ్య కుదిరిన రఫేల్ ఒప్పందంపై విచారణ జరిపించాలని దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు గతంలో కొట్టివేసిన సంగతి తెలిసిందే. రఫేల్ యుద్ధ విమానాల ధరలు, ఇతర వివరాలతో కూడిన పత్రాలను సుప్రీం కోర్టు పరిశీలించిన మీదట ఈ ఒప్పందానికి సర్వోన్నత న్యాయస్ధానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా రఫేల్ ఒప్పందంలో భారీ అవినీతి జరిగిందని అప్పటి కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సహా విపక్ష నేతలు ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. -
కోయంబత్తూర్ హత్యాచారం : మరణ శిక్షకే సుప్రీం మొగ్గు
సాక్షి, న్యూఢిల్లీ : కోయంబత్తూర్‌లో 2010లో మైనర్ బాలికపై సామూహిక లైంగిక దాడి అనంతరం బాధితురాలితో పాటు ఆమె సోదరుడిని హత్య చేసిన కేసులో తనకు మరణ శిక్షను ఖరారు చేయడాన్ని సవాల్ చేస్తూ దోషి మనోహరన్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు గురువారం తోసిపుచ్చింది. జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్‌తో కూడిన సుప్రీం బెంచ్ ఈ కేసులో దోషి మనోహరన్‌కు విధించిన మరణ శిక్షను సమీక్షించే అవసరం లేదని, అతను నీచమైన నేరానికి ఒడిగట్టాడని స్పష్టం చేసింది. జస్టిస్ నారిమన్, జస్టిస్ సూర్యకాంత్ రివ్యూ పిటిషన్‌ను తిరస్కరించగా, ఇదే బెంచ్‌లో భాగమైన మరో న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా శిక్షపై మాత్రమే తనకు వేరే అభిప్రాయం ఉందని చెప్పారు. మెజారిటీ జడ్జిమెంట్‌కు అనుగుణంగా రివ్యూ పిటిషన్ కొట్టివేశామని బెంచ్ స్పష్టం చేసింది. ఈ కేసులో దోషి మనోహరన్ ఉరి శిక్షను నిలిపివేయాలని గత నెలలో సుప్రీం కోర్టు స్టే విధించింది. తనకు విధించిన మరణ శిక్షను పునఃసమీక్షించాలని కోరుతూ మనోహరన్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌పై విచారణ చేపడతామని స్పష్టం చేసింది. 2010, అక్టోబర్ 29న మనోహరన్, సహ నిందితుడు మోహన కృష్ణన్లు ఓ గుడి వెలుపల నుంచి స్కూల్‌కు వెళుతున్న మైనర్ బాలిక, ఆమె సోదరుడిని అపహరించి చేతులు కట్టేసి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం వారిద్దరిపై విష ప్రయోగం చేశారు. విషం ప్రయోగించినా వారు మరణించకపోవడంతో వారి చేతులను కట్టేసి పరాంబికులం-అఖియార్ ప్రాజెక్టు కాలువలోకి వారిని తోసివేసి దారుణ హత్యకు పాల్పడ్డారు. కాగా పోలీస్ ఎన్కౌంటర్లో సహ నిందితుడు మోహన కృష్ణ హతమయ్యాడు. -
వీవీప్యాట్లపై విపక్షాలకు గట్టి ఎదురుదెబ్బ
-
వీవీప్యాట్లపై విపక్షాలకు సుప్రీం షాక్
సాక్షి, న్యూఢిల్లీ : వీవీప్యాట్ల వ్యవహారంలో విపక్షాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఈవీఎంల్లో నిక్షిప్తమైన ఓట్లతో కనీసం 50 శాతం వీవీప్యాట్లతో సరిపోల్చాలన్న విపక్షాల అభ్యర్ధనను సర్వోన్నత న్యాయస్ధానం తోసిపుచ్చింది. విపక్షాల రివ్యూ పిటిషన్‌ను సోమవారం సుప్రీం కోర్టు కొట్టివేసింది. 50 శాతం వీవీప్యాట్లను లెక్కించాలంటే వారం రోజుల సమయం పడుతుందన్న ఈసీ వాదనతో కోర్టు ఏకీభవిస్తూ గతంలో ఇచ్చిన ఆదేశాలను మార్చే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. మరోవైపు కోర్టు తీర్పును గౌరవిస్తామని విపక్షాల తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి పేర్కొన్నారు. తమ రివ్యూ పిటిషన్‌ను న్యాయస్ధానం తిరస్కరించిందని చెప్పారు.కాగా విపక్షాల అప్పీల్‌పై గతంలో అసెంబ్లీ సెగ్మెంట్‌కు ఒక ఈవీఎంకు బదులుగా ఐదు ఈవీఎంల్లో పోలయిన ఓట్లతో వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని సుప్రీం కోర్టు ఏప్రిల్ 8న ఈసీని ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియలో కచ్చితత్వాన్ని పెంపొందించే క్రమంలో ఈ చర్యలు చేపట్టాలని కోరింది. సర్వోన్నత న్యాయస్ధానం ఉత్తర్వులపై ఏప్రిల్ 24న 21 రాజకీయ పార్టీలు తిరిగి రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేశాయి. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కోసం కనీసం 50 శాతం ఈవీఎంల్లో నిక్షిప్తమైన ఓట్లతో వీవీప్యాట్ స్లిప్పులను సరిపోల్చేలా లెక్కించాలని ఆయా పార్టీలు పట్టుబట్టాయి. ఇక కాంగ్రెస్, ఎన్సీపీ, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, ఆప్, సీపీఐ, సీపీఎం, టీడీపీ సహా 21 పార్టీలు రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేశాయి. -
తీర్పులో సమీక్షించేంత తప్పేం లేదు
న్యూఢిల్లీ: రఫేల్ కేసుకు సంబంధించి గతంలో తాము ఇచ్చిన విస్పష్టమైన తీర్పులో సమీక్షించాల్సినంత తప్పేమీ లేదని సుప్రీంకోర్టుకు కేంద్రం శనివారం తెలిపింది. తీర్పు సమీక్ష పేరిట పిటిషనర్లు.. కొన్ని పత్రికా కథనాలు, చట్టవ్యతిరేకంగా, అనధికారికంగా సేకరించిన కొన్ని అసంపూర్తి అంతర్గత ప్రభుత్వ పత్రాలను ఆధారంగా చేసుకుని మొత్తం వ్యవహారాన్ని తిరగదోడాల్సిందిగా కోరలేరని చెప్పింది. ప్రభుత్వ రహస్య సమాచారాన్ని ఈ విధంగా వెల్లడించడం తీవ్ర దుష్పరిణామాలకు దారితీస్తుందని తెలిపింది. రఫేల్ కేసులో గత ఏడాది డిసెంబర్ 14న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించాల్సిందిగా దాఖలైన పిటిషన్‌పై సుప్రీం ఆదేశాల మేరకు కేంద్రం శనివారం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. రివ్యూ పిటిషన్ ద్వారా కోర్టు నుంచి మరొక విచారణ ఉత్తర్వు తెచ్చుకునేందుకు పిటిషనర్లు ప్రయత్నిస్తున్నారంది. కొందరు వ్యక్తుల అభిప్రాయాలను ఆధారంగా చేసుకుని విచారణ జరిపేందుకు కోర్టు ఇంతకుముందే నిరాకరించిందని తెలిపింది. 36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే ఇందులో జోక్యం చేసుకోవాల్సిన పనిలేదని కోర్టు భావించిందని వివరించింది. మీడియా కథనాల ఆధారంగా కోర్టులు నిర్ణయం తీసుకోలేవని చట్టంలోనే ఉందని తెలిపింది. కేసులో యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరితో పాటు మరో ఇద్దరు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్లపై చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం వచ్చే వారం విచారణ జరపనుంది. -
మరుసటి వారం వీవీప్యాట్లపై రివ్యూ పిటిషన్ విచారణ
-
సుప్రీం ముందుకు వీవీప్యాట్లపై రివ్యూ పిటిషన్ విచారణ
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కనీసం 50 శాతం ఈవీఎంల్లో పోలయిన ఓట్లను వీవీప్యాట్ స్లిప్పులతో సరిపోల్చాలని 21 రాజకీయ పార్టీలు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీం కోర్టు వచ్చే వారం విచారణకు చేపట్టనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్, జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడిన బెంచ్ ఈ పిటిషన్‌ను తక్షణం విచారించాలని విపక్ష పార్టీలు దాఖలు చేసిన పిటిషన్ కోరింది. కాగా విపక్షాల అప్పీల్‌పై గతంలో అసెంబ్లీ సెగ్మెంట్‌కు ఒక ఈవీఎంకు బదులుగా ఐదు ఈవీఎంల్లో పోలయిన ఓట్లతో వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని సుప్రీం కోర్టు ఏప్రిల్ 8న ఈసీని ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియలో కచ్చితత్వాన్ని పెంపొందించే క్రమంలో ఈ చర్యలు చేపట్టాలని కోరింది. సర్వోన్నత న్యాయస్ధానం ఉత్తర్వులపై ఏప్రిల్ 24న 21 రాజకీయ పార్టీలు తిరిగి రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేశాయి. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కోసం కనీసం 50 శాతం ఈవీఎంల్లో నిక్షిప్తమైన ఓట్లతో వీవీప్యాట్ స్లిప్పులను సరిపోల్చేలా లెక్కించాలని ఆయా పార్టీలు పట్టుబట్టాయి. ఇక కాంగ్రెస్, ఎన్సీపీ, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, ఆప్, సీపీఐ, సీపీఎం, టీడీపీ సహా 21 పార్టీలు రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేశాయి. -
లీకైన పత్రాలు చెల్లుతాయి
న్యూఢిల్లీ: వివాదాస్పద రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించేందుకు మార్గం సుగమమైంది. పిటిషన్‌దార్లు సమర్పించిన లీకేజీ పత్రాల ఆధారంగా విచారణ జరుపుతామని కోర్టు బుధవారం స్పష్టం చేసింది. ఆ పత్రాలపై విశిష్ట అధికారం ప్రభుత్వానిదే అని, అక్రమంగా సేకరించిన సమాచారంతో వేసిన పిటిషన్ల విచారణార్హతపై కేంద్రం లేవనెత్తిన ప్రాథమిక అభ్యంతరాలను తోసిపుచ్చింది. ఫ్రాన్స్ నుంచి 36 రఫేల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేసేందుకు కుదుర్చుకున్న ఒప్పందం అంతా సవ్యంగానే ఉందని గత డిసెంబర్ 14న సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును సమీక్షించాలని కోరుతూ కేంద్ర మాజీ మంత్రులు అరుణ్ శౌరీ, యశ్వంత్ సిన్హా, సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌దార్లు దాఖలుచేసిన పత్రాల యోగ్యత ఆధారంగా రివ్యూ పిటిషన్లను విచారిస్తామని కోర్టు తెలిపింది. ఈ పిటిషన్ల విచారణకు ప్రత్యేక తేదీని ప్రకటిస్తామంది. ఈసారి విచారణలో రఫేల్ విమానాల ధరల నిర్ధారణతో పాటు భారత్‌లో ఆఫ్సెట్ భాగస్వామి ఎంపికపై దృష్టిసారిస్తామంది. తన తరఫున, జస్టిస్ కౌల్ తరపున జస్టిస్ గొగోయ్ తీర్పును రాయగా, వేరుగా తీర్పు వెలువరించిన జస్టిస్ జోసెఫ్ మిగిలిన ఇద్దరు సభ్యులతో ఏకీభవించారు. ‘హిందూ’ ప్రచురణ స్వేచ్ఛా హక్కే రఫేల్ ఒప్పందం వివరాలు ‘ది హిందూ’ పత్రికలో ప్రచురితం కావడం భావప్రకటనా స్వేచ్ఛలో భాగమేనని కోర్టు తెలిపింది. గతంలో అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన కొన్ని తీర్పులు తమకు గుర్తొచ్చాయని పేర్కొంది. పెంటగాన్ పత్రాల ప్రచురణకు సంబంధించి ‘న్యూయార్క్ టైమ్స్ వర్సెస్ యునెటెడ్ స్టేట్స్’ కేసులో పత్రికలపై ప్రభుత్వ నియంత్రణను అమెరికా కోర్టు గుర్తించలేదని తెలిపింది. ఇదే కేసు రఫేల్కూ వర్తిస్తుందని జస్టిస్ గొగోయ్, జస్టిస్ కౌల్ తమ తీర్పులో పేర్కొన్నారు. రహస్య పత్రాల ప్రచురణను నిలిపేసేలా ప్రభుత్వ విభాగాలకు విశేషాధికారులు కట్టబెడుతూ అధికారిక రహస్యాల చట్టంలో నిబంధనలు ఉన్నట్లు తమ దృష్టికి రాలేదని తెలిపారు. జాతీయ భద్రతను సాకుగా చూపుతూ కేంద్రం ఆర్టీఐ కింద ఇవ్వాల్సిన సమాచారాన్ని దాచిపెట్టకూడదని జస్టిస్ జోసెఫ్ అన్నారు. ‘ అడిగినంత మాత్రాన సమాచారం వెల్లడించకూడదనడంలో సందేహం లేదు. కానీ ఆ సమాచారాన్ని వెల్లడించడం కన్నా దాచితే ఎక్కువ నష్టం అని దరఖాస్తుదారుడు నిరూపించాలి. దేశ భద్రతతో ముడిపడిన సమాచారాన్ని అడిగే హక్కును ఆర్టీఐ పౌరుడికి కట్టబెట్టింది. ఆæ సమాచారం ప్రజా ప్రయోజనం కోసమే ఉద్దేశించినదవ్వాలి’ అని ఆయన అన్నారు. బహిరంగ చర్చకు సిద్ధమా?: రాహుల్ రఫేల్ ఒప్పందం, నోట్లరద్దు అంశాలపై బహిరంగ చర్చకు రావాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని మోదీకి సవాల్ విసిరారు. ‘రఫేల్ ఒప్పందం విషయంలో సుప్రీంకోర్టు తనకు క్లీన్చిట్ ఇచ్చినట్లు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మోదీ అన్నారు. కానీ, చౌకీదార్‌జీ అవినీతికి పాల్పడినట్లుగా సుప్రీంకోర్టు తాజాగా పేర్కొంది. వైమానిక దళం డబ్బును చౌకీదార్‌జీ(మోదీ) పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి అప్పగించారనే విషయాన్ని గత కొంతకాలంగా చెబుతూ వస్తున్నా. దీనిపై కోర్టు దర్యాప్తు చేయబోతోంది. మోదీ, అంబానీ పేర్లు బయటకు రానున్నాయి’ అని అన్నారు. ‘సుప్రీంకోర్టు నిర్ణయం నేపథ్యంలో మిమ్మల్ని సవాల్ చేస్తున్నా.. బహిరంగ చర్చకు రండి. అవినీతి, నోట్లరద్దు, రఫేల్ ఒప్పందం, బీజేపీ చీఫ్ అమిత్ షా తనయుడు జై షా అవినీతి తదితర అంశాలపై దేశ ప్రజలు మీ నుంచి నిజాలు తెలుసుకోవాలనుకుంటున్నారు’ అని అన్నారు. ఎవరేమన్నారంటే.. ► నిజాలపై మూత ఎగిరిపోయింది: కాంగ్రెస్ మోదీ ఎన్ని అబద్ధాలు చెప్పినా చివరకు నిజం బయటకు వస్తుందని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ఇన్నాళ్లూ నిజాలు దాచేందుకు మోదీ పెట్టిన మూత కొట్టుకుపోయిందని ఎద్దేవా చేసింది. ‘రఫేల్ అవినీతిన బయటపెట్టిన పాత్రికేయులపై అధికారిక రహస్యాల చట్టాన్ని ప్రయోగించాలని మోదీ ప్రభుత్వం భావించింది’ అని కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా అన్నారు. ► దేశభద్రతపై కేంద్రం రాజీ పడిందని సీపీఎం ప్రధాన కార్యదర్శి ఏచూరీ ఆరోపించారు. ► సుప్రీం తీర్పును పిటిషనర్లలో ఒకరైన అరుణ్ శౌరీ స్వాగతించారు. ► అసమగ్ర సమాచారం: రక్షణ శాఖ జాతీయ భద్రతపై జరిగిన చర్చలకు సంబంధించి అసంపూర్ణ సమాచారం ఇవ్వడమే పిటిషన్‌దారుల ఉద్దేశమని రక్షణ శాఖ పేర్కొంది. ‘గోప్యంగా ఉంచాల్సిన సున్నిత సమాచారం ప్రజాక్షేత్రంలోకి వెళ్లడం ఆందోళనకరం’ అని సుప్రీంకోర్టు తీర్పు అనంతరం రక్షణ శాఖ ప్రకటన జారీ చేసింది. ► రాహుల్‌ది కోర్టు ధిక్కారం: బీజేపీ కోర్టు తన తీర్పులో చెప్పని మాటలను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అత్యున్నత న్యాయస్థానానికి ఆపాదించి తీవ్ర కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని బీజేపీ ఆరోపించింది. ప్రధాని నరేంద్ర మోదీ దొంగతనానికి పాల్పడ్డారని సుప్రీంకోర్టు తాజాగా స్పష్టం చేసిందని రాహుల్ చేసిన వ్యాఖ్యలపై రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. రాహుల్ సుప్రీం తీర్పులోని సగం పేరాను కూడా చదవలేదని, కోర్టు చెప్పని మాటలు చెప్పినట్లు వ్యాఖ్యానించి తన నైరాశ్యాన్ని చాటుకున్నారని ఎద్దేవా చేశారు. ఎప్పుడేం జరిగింది ⇒ 2007, ఆగస్టు 28: 126 మీడియం మల్టీరోల్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల (ఎంఎంసీఏ) కొనుగోలుకు ప్రకటన జారీ ⇒ 2011 మే: రఫేల్, యూరో ఫైటర్ జెట్ విమానాలతో తుది జాబితా తయారీ ⇒ 2012, జూన్ 30: తక్కువ మొత్తానికి బిడ్ దాఖలుచేసిన ఫ్రాన్స్ కంపెనీ డసాల్ట్ ⇒ 2014, మార్చి 13: 108 విమానాల కోసం 70, 30 శాతం చొప్పున పని చేయడానికి హాల్, డసాల్ట్ మధ్య కుదిరిన ఒప్పందం ⇒ 2015, ఏప్రిల్: ఫ్రాన్స్ నుంచి ఎగరడానికి సిద్ధంగా ఉన్న 36 విమానాల కొనుగోలుకు కొత్త ఒప్పందం ఖరారు ⇒ సెప్టెంబర్ 23: ఇరు దేశాల మధ్య అంతర ప్రభుత్వ ఒప్పందంపై సంతకాలు ⇒ నవంబర్ 18: ఒక్కో విమానం ఖర్చు రూ.670 కోట్లు అని ప్రకటించిన ప్రభుత్వం ⇒ 2016, డిసెంబర్ 31: 36 విమానాల ఖర్చు రూ.60 వేల కోట్లని డసాల్ట్ నివేదికలో వెల్లడి. ఈ మొత్తం ప్రభుత్వం ప్రకటించిన మొత్తంపై రెట్టింపు కన్నా అధికం ⇒ 2018 మార్చి 13: రఫేల్ కొనుగోలుపై సుప్రీంలో పిటిషన్ ⇒ అక్టోబర్ 10: రఫేల్ కొనుగోలుకు నిర్ణయాలు తీసుకున్న విధానంపై వివరాలు సీల్డ్ కవర్లో సమర్పించాలన్న సుప్రీంకోర్టు ⇒ డిసెంబర్ 14: ప్రభుత్వ నిర్ణయాల్లో సంశయించాల్సిందేం లేదని తీర్పు ⇒ 2019, జనవరి 2: ఈ తీర్పును సమీక్షించాలని సుప్రీంలో పిటిషన్లు దాఖలు ⇒ మార్చి 6: రఫేల్ పత్రాలు చోరీకి గురయ్యాయని కోర్టుకు తెలిపిన కేంద్రం ⇒ మార్చి 13: లీకేజీ పత్రాలతో విచారణ వద్దని కోర్టుకు విన్నవించిన కేంద్రం ⇒ ఏప్రిల్ 10: లీకేజీ పత్రాలను విచారణలో పరిగణనలోకి తీసుకుంటామన్న సుప్రీం నేపథ్యమిదీ.. రివ్యూ పిటిషన్ల దాఖలుపై కేంద్రం లేవనెత్తిన అభ్యంతరాలను పరిశీలించిన కోర్టు మార్చి 14న తన తీర్పును రిజర్వులో ఉంచింది. రఫేల్ ఒప్పందానికి సంబంధించిన కీలక సమాచారం మీడియాలో ప్రచురితం కావడం అప్పట్లో కలకలం రేపింది. ప్రధాని కార్యాలయం ఫ్రాన్స్‌తో సమాంతర చర్చలు జరపడంపై రక్షణ శాఖ అయిష్టత వ్యక్తం చేసినట్లు ‘ది హిందూ’ వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. రఫేల్ ఒప్పందానికి సంబంధించిన పత్రాలు, సమాచారంపై కేంద్రానికే పూర్తి హక్కులుంటాయని, సంబంధిత విభాగం అనుమతి లేనిదే వాటిని కోర్టుకు సమర్పించరాదని కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. -
రఫేల్ కేసు : కేంద్రానికి సుప్రీం షాక్
సాక్షి, న్యూఢిల్లీ : రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంలో కేంద్రానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రఫేల్ తీర్పుపై రివ్యూ పిటిషన్లపై కేంద్ర ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలను సర్వోన్నత న్యాయస్ధానం తోసిపుచ్చింది. రివ్యూ పిటిషన్ల విచారణకు అంగీకరించిన సుప్రీం త్వరలో విచారణ తేదీని నిర్ణయిస్తామని స్పష్టం చేసింది. రఫేల్ ఒప్పంద పత్రాలను తస్కరించారన్న కేంద్ర ప్రభుత్వ అభ్యంతరాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్‌లతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చుతూ తీర్పును వెలువరించింది. రఫేల్ ఒప్పందంలో విచారణ చేపట్టాల్సిన అంశాలేమీ లేవని గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ విపక్షాలు సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించి రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. నూతన అంశాలతో పిటిషనర్లు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్లపై విచారణ కొనసాగిస్తామని కోర్టు తేల్చిచెప్పింది. -
రఫేల్‌పై సుప్రీంలో రివ్యూ పిటిషన్
సాక్షి, న్యూఢిల్లీ : ఫ్రాన్స్ నుంచి రఫేల్ విమానాల కొనుగోలులో అవకతవకలు జరిగాయని దాఖలైన పిటిషన్లను తోసిపుచ్చుతూ డిసెంబర్ 14న ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ మాజీ కేంద్ర మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరి, న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌లు బుధవారం సర్వోన్నత న్యాయస్దానంలో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం సంతకం చేయకుండా సీల్డ్ కవర్లో ఇచ్చిన నోట్లో పేర్కొన్న అవాస్తవ అంశాల ఆధారంగా తీర్పు వెలువరించారని రివ్యూ పిటిషన్లో వారు ఆరోపించారు. ఓపెన్ కోర్టులో తమ పిటిషన్ విచారించాలని వారు విజ్ఞప్తి చేశారు. కాగా రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో భారీ అవకతవకలు జరిగినట్లు తమకు కనిపించడం లేదని గత ఏడాది డిసెంబర్లో సుప్రీం కోర్టు రఫేల్ ఒప్పందంలో మోదీ సర్కార్‌ను సమర్ధిస్తూ తీర్పును వెల్లడించిన సంగతి తెలిసిందే. విమానాల కొనుగోలుకు నిబంధనలను అనుసరించి రక్షణ ఉత్పత్తుల సేకరణ విధానాల (డీపీపీ) ప్రకారమే మోదీ ప్రభుత్వం ముందుకు వెళ్లిందని పేర్కొంది. రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందానికి సంబంధించి పిటిషనర్ల ఆరోపణల్లోని ప్రధానంగా మూడు అంశాలపై విచారణ జరిపామని సుప్రీంకోర్టు తెలిపింది. వాటిలో ఒకటి ప్రభుత్వ నిర్ణయం, రెండోది విమానాల ధరలు కాగా ఇక మూడోది భారత్‌లో ఆఫ్సెట్ భాగస్వామి ఎంపిక ప్రక్రియ అని పేర్కొంది. ఈ మూడు అంశాలను పరిశీలించిన మీదట ఈ సున్నితమైన కేసులో కోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని తమకు అనిపించలేదని ఈ సందర్భంగా న్యాయమూర్తులు అన్నారు. -
శబరిమల ప్రవేశానికి మరో మహిళ యత్నం
న్యూఢిల్లీ/పంబా: శబరిమలలోకి అన్ని వయస్సుల మహిళలను అనుమతించాలన్న సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించేందుకు సోమవారం మరో మహిళ విఫలయత్నం చేసింది. బిందు అనే దళిత మహిళా కార్యకర్త వినతి మేరకు పోలీసులు ఆమెను కేరళ ఆర్టీసీ బస్సులో పంబ వద్దకు తీసుకువచ్చారు. అయితే, అక్కడ పెద్ద సంఖ్యలో రోడ్డుపై బైఠాయించిన బీజేపీ కార్యకర్తలు ఆమెను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు ఆమెను జీపులో ఎక్కించుకుని సురక్షిత ప్రాం తానికి తరలించారు. కాగా, సోమవారం రాత్రి 10 గంటలకు ఆలయాన్ని మూసి వేయనున్న నేపథ్యంలో మరికొందరు మహిళలు ప్రవేశించేందుకు ప్రయత్నించవచ్చనే సమాచారంతో సుప్రీం తీర్పు మేరకు కేరళ సర్కారు ఆలయం వద్ద గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేపట్టింది. సుప్రీంకోర్టులో 19 రివ్యూ పిటిషన్లు శబరిమల తీర్పుపై దాఖలైన పలు రివ్యూ పిటిషన్ల విచారణ తేదీని నేడు సుప్రీంకోర్టు ఖరారు చేయనుంది. సన్నిధానంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాలంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ కేరళతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ సంఘాలు ఆందోళన లు కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రివ్యూ పిటిషన్లను అత్యవసరమైనవిగా పరిగణించి విచారణ చేపట్టాలంటూ పిటిషన్ దాఖలైంది. -
అయ్యప్పల ‘రివ్యూ’కు మోక్షం లేదా!?
సాక్షి, న్యూఢిల్లీ : కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయంలోకి రుతుస్రావం వయస్కుల మహిళలను అనుమతిస్తూ సుప్రీం కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును సమీక్షించాల్సిందిగా కోరుతూ జాతీయ అయ్యప్ప భక్తుల సంఘం అధ్యక్షుడు శ్యాలజ విజయన్ సోమవారం నాడు సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయస్కుల ఆడవారిని అనుమతించాలని కోరుతూ ఇంతకుముందు పిటిషన్లు వేసిన వారు, అయ్యప్ప భక్తులు కారని, అయ్యప్ప నైష్టిక బ్రహ్మచారి అని నమ్మే భక్తుల నమ్మకాలను కాదనే హక్కు బయట వారికి లేదని రివ్యూ పిటిషన్లో వాదించారు. ఇదేమి కొత్త వాదన కాదు. జస్టిస్ ఇందు మల్హోత్ర మొన్న నలుగురు సభ్యుల సుప్రీం ధర్మాసనం ఇచ్చిన తీర్పులోనే తన అభిప్రాయంగా చెప్పారు. ఎవరి మతరమైన నమ్మకాలు వారివని, మతపరమైన నమ్మకాలను కాదనడం రాజ్యాంగంలోని 25, 26 అధికరణలు కల్పిస్తున్న మత హక్కులను ఉల్లంఘించడమేనని కూడా ఆమె అభిప్రాయపడ్డారు. ఆమె వాదనను తిరస్కరిస్తూ మిగతా ముగ్గురు జడ్జీలు మహిళలకు అనుకూలంగా తీర్పు చెప్పారు. అలాంటప్పుడు ఆమె వాదననే ప్రాతిపదికగా తీసుకొని వేసిన రివ్యూ పిటిషన్‌ను కోర్టు స్వీకరిస్తుందా? విచారిస్తుందా? స్వీకరించి, విచారించినా భిన్నమైన తీర్పు వెలువడే అవకాశం ఉందా? అన్నదే ఇక్కడ చర్చ. సాధారణంగా పాత వాదననే ప్రాతిపదికగా తీసుకునే పిటిషన్ సర్వ సాధారణంగా విచారణ యోగ్యం కాదు. సుప్రీం కోర్టు సంప్రదాయం ప్రకారం తీర్పు ఇచ్చిన బెంచీనే రివ్యూ పిటిషన్‌ను విచారించాల్సి ఉంటుంది. విచారణ యోగ్యమని సదరు బెంచీ అభిప్రాయపడినట్లయితే అదే బెంచీ దాన్ని విచారించవచ్చు. లేదా ప్రధాన న్యాయమూర్తి సూచన మేరకు మరో బెంచీకి అప్పగించవచ్చు. ఇటీవల తీర్పు ఇచ్చిన బెంచీలో మాజీ ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాతోపాటు జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ చంద్రఛూడ్, జస్టిస్ రోహింటన్ నారిమన్, జస్టిస్ ఇందు మల్హోత్రలు ఉన్నారు. వారిలో దీపక్ మిశ్రా ఒక్కరే పదవి విరమణ చేశారు. ఆయన స్థానంలో బెంచీలోకి కొత్త వారు వస్తారు. కొత్తగా వచ్చే జస్టిస్ ఇందు మల్హోత్ర అభిప్రాలతో ఏకీభించినప్పటికీ విభేదించేవారు చంద్రఛూడ్, నారిమన్, ఖాన్‌విల్కర్‌లు ఉంటారు కదా! ఇక తీర్పు తారుమారే అవకాశం ఎక్కడిది? కొత్త వాదోపవాదాల కారణంగా న్యాయమూర్తుల అభిప్రాయాలు మారుతాయనుకుంటే తీర్పు ఎలా ఉండబోతుంది? హోమో సెక్యువాలిటీని నేరంగా పరిగణిస్తున్న భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని 377వ సెక్షన్‌ను కొట్టివేస్తూ మాజీ ప్రధాన న్యాయమూర్తి ఓ వాదనను తీసుకొచ్చారు. ‘నాన్ రెట్రోగెషన్’ దృక్పథం గురించి ఆయన ప్రస్తావించారు. అంటే, ప్రతీగమనం చేసి అంతకుముందున్న చోటుకన్నా అధ్వాన్నమైన చోటుకు రాకూడదనేది అర్థం. ఈ అర్థాన్ని విడమర్చి చెబుతూ రాజ్యాంగం స్ఫూర్తి ప్రకారం ఏ తీర్పయినా అంతకుముందు తీర్పుకన్నా మెరుగ్గా ఉండాలన్నారు. అందుకని ఓసారి కల్పించిన హక్కులను కోర్టులు కూడా వెనక్కి తీసుకోలేవని చెప్పారు. ఆయన మాటలను ఇక్కడ పరిగణలోకి తీసుకుంటే శబరిమల ఆలయంలోకి రుతుస్రావ వయస్కులైన మహిళలకు మొన్ననే కల్పించిన హక్కులను వెనక్కి తీసుకునే హక్కు సుప్రీం కోర్టుకు లేనట్లే. ఈ లెక్కన రివ్యూ పిటిషన్ కారణంగా తీర్పు మారే అవకాశమే లేదు. -
‘శబరిమల’పై తక్షణ విచారణకు సుప్రీం నో
సాక్షి, న్యూఢిల్లీ : కేరళలోని శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల స్ర్తీలను అనుమతిస్తూ సర్వోన్నత న్యాయస్ధానం ఇటీవల వెల్లడించిన తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్ తక్షణ విచారణకు సుప్రీం కోర్టు నిరాకరించింది. నిర్థిష్ట సమయంలోనే రివ్యూ పిటిషన్లు విచారణకు వస్తాయని స్పష్టం చేసింది. శబరిమల తీర్పుపై రివ్యూ పిటిషన్‌ను ఇప్పటికిప్పుడు విచారించలేమని తేల్చిచెప్పింది. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సుప్రీం తీర్పును పలు మహిళా సంఘాలు స్వాగతించగా, హిందూ సంస్ధలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కాగా కోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయబోమని, తీర్పును అమలు చేసేందుకు చర్యలు చేపడతామని కేరళ సీఎం పినరయి విజయన్ పేర్కొన్నారు. లౌకిక స్ఫూర్తిని దెబ్బతీసేలా కొన్ని శక్తులు వ్యవహరిస్తున్నాయని ఆయన ఆరోపించారు. -
ప్రభుత్వంతో చర్చల ప్రశ్నే లేదు
తిరువనంతపురం: శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పించాలన్న సుప్రీం కోర్టు తీర్పుపై కేరళ ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేసేంత వరకూ ప్రభుత్వంతో చర్చల ప్రశ్నే లేదని ఆలయ పూజారులు తేల్చిచెప్పారు. ఆలయంలో మహిళల ప్రవేశంపై సుప్రీం కోర్టు తీర్పును అమలు చేస్తామని, స్వామి సన్నిధానంలో మహిళా పోలీసులను నియమిస్తామన్న కేరళ ప్రభుత్వం నిర్ణయంపైనా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అయ్యప్ప ఆలయంతో సంబంధాలున్న పూర్వపు రాజులు పండాళం రాయల్స్ కూడా ఇదే విషయాన్ని ప్రభుత్వానికి స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు అమలుపై సోమవారం మాట్లాడేందుకు పండాళం రాయల్స్ కుటుంబ సభ్యులు, ఆలయ పూజారులను కేరళ ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. అయితే దీనిపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేయనంతవరకూ చర్చల ప్రసక్తే లేదని ఆలయ ప్రధాన పూజారుల్లో ఒకరైన కందరారు మోహనారు తెలిపారు. -
రివ్యూ పిటిషన్ వెయ్యబోం: కేరళ
తిరువనంతపురం: అన్ని వయసుల మహిళలకు శబరిమల ఆలయ ప్రవేశానికి అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయబోమని కేరళ సర్కారు స్పష్టం చేసింది. అక్టోబర్ 16న భక్తులందరికీ దర్శనాలకు అనుమతించనున్న నేపథ్యంలో మహిళా భక్తుల దర్శనం కోసం ఏర్పాట్లు చేయాలని ట్రావెన్కోర్ దేవస్థాన బోర్డు నిర్ణయించింది. సుప్రీం తీర్పును వ్యతిరేకిస్తూ బుధవారం వందలాది మంది అయ్యప్ప భక్తులు (అందులో మహిళలూ ఉన్నారు) కేరళలోని జాతీయ రహదారులను నిర్భందించారు. -
‘లోయా మృతి’పై రివ్యూ పిటిషన్ కొట్టివేత
న్యూఢిల్లీ: సీబీఐ కోర్టు జడ్జి బీహెచ్ లోయా మృతిపై పునర్విచారణ జరపాల న్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. లోయాది సహజమరణమే అని ఏప్రిల్ 19న కోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును సమీక్షించాలని బాంబే లాయర్ల అసోసియేషన్ వేసిన పిటిషన్లో విచారణార్హమైన విషయాలేవీ లేవని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం పేర్కొంది. ‘రివ్యూ పిటిషన్, దానికి సంబంధించిన పత్రాలన్నింటిని క్షుణ్నంగా పరిశీలించాం. పాత ఉత్తర్వుల్లో మార్పు చేయడానికి తగిన కారణం కనిపించలేదు’ అని బెంచ్ తెలిపింది. సోహ్రాబుద్దీన్ నకిలీ ఎన్కౌంటర్ కేసును విచారిస్తున్న బీహెచ్ లోయా 2014, డిసెంబర్ 1న గుండెపోటుతో మరణించారు -
కావాలంటే సుప్రీంకు వెళ్లండి: ఎన్జీటీ
సాక్షి, న్యూఢిల్లీ: అమరావతి నిర్మాణానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను జాతీయ హరిత ట్రిబ్యునల్ కొట్టి వేసిన సంగతి తెలిసిందే. షరతులకు లోబడి పర్యావరణానికి విఘాతం కలగకుండా రాజధాని నిర్మాణం చేపట్టాలని తన తుది తీర్పులో పేర్కొంది. అయితే, ఆ తీర్పును పునఃపరిశీలించాలని ఈఏఎస్ శర్మ, బొలిశెట్టి సత్యనారాయణ ఎన్జీటీలో పిటిషన్ వేసిన వేశారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి గతంలో ఇచ్చిన పర్యావరణ అనుమతులు సరిగాలేవనీ, అమరావతిలో నిర్మాణాలు ఆపాలని పిటిషనల్లో పేర్కొన్నారు. ట్రిబ్యునల్ ఈ పిటిషన్‌పై స్పందించింది. రాజధానిలో నిర్మాణాలు ఆపాలని లేవనెత్తుతున్న అంశాలతో పిటిషనర్ సుప్రీం కోర్టును ఆశ్రయించవచ్చని సూచించింది. కానీ, ఎన్జీటీ తీర్పును పునఃసమీక్షించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. -
సెక్షన్-377.. కేంద్రానికి ఎదురుదెబ్బ
న్యాయ చరిత్రలో మరో చారిత్రక అధ్యయం చోటుచేసుకుంది. ఐపీసీలోని వివాదాస్పద సెక్షన్-377పై దాఖలైన రివ్యూ పిటిషన్‌పై సుప్రీం కోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. స్వలింగ సంపర్కం నేరం కిందకే వస్తుందంటూ గతంలో(2013) అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వగా.. ఇప్పుడు ఆ తీర్పును సమీక్షించేందుకే మొగ్గు చూపింది. ఈ మేరకు విచారణను వాయిదా వేయాలన్న కేంద్రం వినతిని ధర్మాసనం సున్నితంగా తోసిపుచ్చింది. దీంతో ఎల్జీబీటీ వర్గాలు సంబరాలు చేసుకుంటున్నాయి. సాక్షి, న్యూఢిల్లీ: సెక్షన్-377 తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్‌ను విచారణను వాయిదా వేయాలంటూ కేంద్రం తరపున అదనపు సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బెంచ్‌కు విజ్ఞప్తి చేశారు. అయితే ‘సామాజిక నైతికతలో మార్పులు వస్తున్నాయి. అందుకే తీర్పులోని తప్పుఒప్పులను పునఃసమీక్షించాలని నిర్ణయించాం’ అని ధర్మాసనం పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఆర్ఎఫ్ నారీమన్, వైవీ చంద్రచూడ్, ఎఎమ్ కన్వీల్కర్, జస్టిస్ ఇందూ మల్హోత్రాలతో కూడిన విస్తృత ధర్మాసనం రిప్యూ పిటిషన్‌ను విచారణ చేపట్టింది. ‘సమాజంలో మార్పులు వస్తున్నాకొద్దీ.. విలువలు కూడా మారుతున్నాయి. కాబట్టి స్వలింగ సంపర్కం నేరం కాదు’ అని పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి(మాజీ అటార్నీ జనరల్) వాదనలు వినిపించారు. లంచ్ విరామం అనంతరం తిరిగి విచారణ కొనసాగనుంది. ఐపీసీ సెక్షన్ 377... ఈ సెక్షన్ కింద ప్రకృతి విరుద్ధంగా జరిగే లైంగిక సంపర్కం నేరం. మగవాళ్ళు మగవాళ్లతో.. లేదా మహిళలు మహిళలతో శృంగారంలో పాల్గొనడం అనైతిక చర్యగా పరిగణిస్తారు. ఐపిసి 377 సెక్షన్ కింద 'అసహజమైన నేరాల' (ఎవరైనా పురుషుడు, లేదా స్త్రీ, లేదా జంతువుతో అసహజ సంపర్కానికి) పాల్పడేందుకు ప్రయత్నించినా, పాల్పడినా వారికి యావజ్జీవిత జైలు శిక్ష, లేదా పదేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం వుంది. దీనితో పాటు భారీ జరిమానా కూడా విధించొచ్చు. 150 ఏళ్లకు పైగా.. 1861లో ఈ సెక్షన్‌ను అప్పటి బ్రిటిష్ పాలకులు భారత శిక్షా స్మృతిలో ప్రవేశపెట్టారు. ఈ సెక్షన్‌ను సవాలు చేస్తూ 2001లో నాజ్ ఫౌండేషన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. పిటిషన్‌ను విచారించిన ఢిల్లీ హైకోర్టు ఇద్దరు వయోధికుల మధ్య పరస్పర అంగీకారంతో జరిగే గే సెక్స్ ‘నేరం కాదని’ తేల్చింది. రాజ్యాంగంలోని 14, 15, 21ల అధికరణాల్ని 377 సెక్షన్ ఉల్లంఘిస్తోందని పేర్కొంది. ఈ తీర్పును కొందరు సుప్రీంకోర్టులో సవాలు చేయడంతో తీర్పుపై అభిప్రాయాన్ని వెల్లడించాలని కేంద్రాన్ని సుప్రీం ఆదేశించింది. చివరకు డిసెంబర్ 11, 2013న ఢిల్లీ హైకోర్టు తీర్పును సుప్రీం కొట్టివేస్తూ 377 సెక్షన్ రాజ్యాంగ విరుద్ధం కాదని, నేరమని తేల్చి చెప్పిది. అనంతరం తీర్పును సమీక్షించాలని కేంద్ర ప్రభుత్వం, గే హక్కుల కార్యకర్తలు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అనంతరం పలువురు క్యూరేటివ్ పిటిషన్లు దాఖలు చేయడంతో.. ఫిబ్రవరి 2, 2016న వాటిని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మసనానికి సిఫార్సు చేసింది. దాదాపు 26కు పైగా దేశాలు ఇప్పటికే స్వలింగ సంపర్కం నేరం కాదంటూ చట్టం చేశాయన్న విషయాన్ని ఈ సందర్భంగా పలువురు న్యాయనిపుణులు లేవనెత్తుతున్నారు. -
స్వలింగ సంపర్కం నేరమా?
సాక్షి, న్యూఢిల్లీ : మరో చారిత్రక తీర్పుకు దేశ అత్యున్నత న్యాయస్థానం సిద్ధమైంది. ఎన్నో ఏళ్లుగా వివాదంగా మారిన భారతీయ శిక్షా స్మృతి (ఐపీసీ) 377పై దాఖలైన రిప్యూ పిటిషన్‌ను మంగళవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ఐపీసీ 377 దేశంలో స్వలింగ సంపర్కం నేరం అనే భావాన్ని వ్యక్తం చేస్తోంది. దీనిపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. హోమో సెక్సువల్ను చట్టబద్దం చేయాలని కొందరు, సెక్షన్ 377ను ఐపీసీ నుంచి తొలగించాలని కొందరు పలు కేసులను దాఖలు చేశారు. ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఆర్ఎఫ్ నారీమన్, వైవీ చంద్రచూడ్, ఎఎమ్ కన్వీల్కర్, జస్టిస్ ఇందూ మల్హోత్రాలతో కూడిన విస్తృత ధర్మాసనం రిప్యూ పిటిషన్‌ను విచారించనుంది. ఢిల్లీ హైకోర్టు తీర్పు స్వలింగ సంపర్క నేరంగా భావించే సెక్షన్ 377పై 2009లో ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులకు ఇది విరుద్ధంగా ఉందని, చట్టం దృష్టిలో అందరూ సమానమేనని తీర్పును వెలువరించింది. హైకోర్టు తీర్పుతో హోమో సెక్సువల్స్ దేశ వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేశారు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు తమకు కూడా వర్తిస్తాయని, స్వలింగ సంపర్కాన్ని చట్టబద్దం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును లెస్బియన్, గే, బైసెక్సువల్,లింగమార్పిడి (ఎల్జీబీటీ) చెందిన వ్యక్తులు 2013లో సుప్రీంకోర్టులో సవాలు చేశారు. సెక్షన్ 377 ఇద్దరు వ్యక్తుల లైంగిక ధోరణిని నాశనం చేస్తోందని, చట్టంపై సహేతుకమైన పరిమితులు విధించకూడదని ఎల్జీబీటీలు పిటిషన్లో పేర్కొన్నారు. వ్యక్తిగత గోప్యత పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కు అని ఇటీవల సుప్రీంకోర్టు చారిత్రక తీర్పును వెలువరించడంతో.. మరోసారి సెక్షన్ 377 తెరమీదకు వచ్చింది. 149 సంవత్సరాల చరిత్ర గల ఈ సెక్షన్ అసహజ లైంగిక చర్యలకు పాల్పడే స్త్రీ, పురుషులకు పది సంవత్సరాల జైలు శిక్షతో పాటు పెనాల్టీ కూడా విధిస్తారు. స్వలింగ సంపర్కం రుగ్మత కాదు స్వలింగ సంపర్కం రుగ్మత కాదని ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ గతంలో ప్రకటించింది. హోమో సెక్సువల్ను మానవ లైంగిక వైవిద్యంగా పేర్కొంటూ.. దానిని ద్విలింగ సంపర్కమని తెలిపింది. సైకియాట్రిక్ సోసైటీ ప్రకటన ఎల్జీబీటీకి కొంత ఊరటనిచ్చింది. కొన్ని దేశాల్లో స్వలింగ సంపర్కం చట్టబద్దంగా ఉన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఏ విధమైన తీర్పును వెలువరిస్తుందో వేచి చూడాలి. -
‘నిర్భయ’ తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ
దేశం నడిబొడ్డున అర్ధరాత్రి పారామెడికల్ విద్యార్థిని అతిక్రూరంగా లైంగిక దాడి చేసి చంపిన దోషుల భవితవ్యం నేడు తేలనుంది. మరణ శిక్ష రద్దు కోరుతూ దోషులు దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించనుంది. సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచార కేసులో సుప్రీం తీర్పు కోసం దేశం ఇప్పుడు ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ కేసులో దాఖలైన రివ్యూ పిటిషన్‌పై సోమవారం ధర్మాసనం తీర్పు వెలువరించనుంది. నిందితులకు ట్రయల్ కోర్టు.. ఢిల్లీ హైకోర్టు ఖరారు చేసిన మరణ శిక్షలను గతేడాది మేలో సుప్రీం కోర్టు ఖరారు చేసిన విషయం తెలిసిందే. అయితే సుప్రీం తీర్పును సమీక్షించాలని కోరుతూ దోషులు ముఖేష్(29), పవన్ గుప్తా(22), వినయ్ శర్మ(23)ల తరపున పిటిషన్ దాఖలైంది. మరో నిందితుడు అక్షయ్ కుమార్ సింగ్(31) కూడా దాఖలు చేయనున్నట్లు అతని తరపు న్యాయవాది తెలిపాడు. కాగా రివ్యూ పిటిషన్‌పై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా, న్యాయమూర్తులు భానుమతి, అశోక్ భూషణ్‌ల ఆధర్వ్యంలో ధర్మాసనం విచారణ చేపట్టి, తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. మరికొద్ది గంటల్లోనే తీర్పు వెలువడనుండటంతో ఉత్కంఠ నెలకొంది. మరణ శిక్షనే అమలు చేయాలని తీర్పిస్తుందా? లేదా? జీవిత ఖైదుగా మారుస్తుందా? అన్న చర్చ మొదలైంది. కాగా, 2012 డిసెంబర్ 16వ తేదీ రాత్రి 23 ఏళ్ల విద్యార్థినిపై ఆరుగురు లైంగిక దాడికి పాల్పడి, ఆపై ఆమెను, ఆమె స్నేహితుడిని నగ్నంగా రోడ్డు మీదకు విసిరేశారు. ప్రాణాల కోసం పోరాడి చివరకు యువతి కన్నుమూసింది. కేసులో ఆరుగురు నిందితులను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో రామ్ సింగ్ తీహార్ జైల్లో 2013 మార్చిలో ఆత్మహత్య చేసుకోగా, మరో నిందితుడు మైనర్ కావడంతో మూడేళ్ల శిక్ష తర్వాత విడుదలయ్యాడు(అతనిపై నిఘా కొనసాగుతుంది). ఇక మిగిలిన నలుగురు నిందితులు అక్షయ్, వినయ్ శర్మ, పవన్, ముఖేశ్‌లకు ఉరిశిక్షను ఖరారు చేస్తూ సుప్రీం కోర్టు గతేడాది తీర్పు వెలువరించింది. -
ఎస్సీ, ఎస్టీ చట్టంపై వెనక్కితగ్గని సుప్రీం
సాక్షి, న్యూఢిల్లీ : ఎస్సీ, ఎస్టీ చట్టంపై గతంలో జారీ చేసిన ఉత్తర్వులను నిలుపుదల చేసేందుకు సర్వోన్నత న్యాయస్ధానం నిరాకరిచింది. కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ విచారణ సందర్భంగా గురువారం సుప్రీం కోర్టులో ఆసక్తికర వాదనలు చోటుచేసుకున్నాయి. ఎస్సీ, ఎస్టీ వర్గాల హక్కుల పరిరక్షణకు నూరు శాతం కట్టుబడి ఉన్నామని కోర్టు కేంద్రానికి తెలిపింది. దళితులపై వేధింపులకు పాల్పడే దోషులపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంపై గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలు సరైనవి కావని, వాటిపై స్టే విధించాలన్న కేంద్రం వాదనను తోసిపుచ్చింది. తమ రివ్యూ పిటిషన్‌ను విస్తృత ధర్మాసనానికి బదలాయించాలని కేంద్రం కోర్టును కోరింది. అయితే ఈ అంశంపై తదుపరి విచారణను కోర్టు ఈనెల 16కు వాయిదా వేసింది. ఎస్సీ, ఎస్టీ కేసును నిర్థారించే న్యాయమూర్తుల కులాలకు సంబంధించి న్యాయవాది ఇందిరా జైసింగ్ చేసిన ట్వీట్‌ను కేంద్రం తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకురాగా, ఏమైనా ఈ అంశం ముగిసిపోయిందని (క్లోజ్డ్) కోర్టు వ్యాఖ్యానించింది. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద బాధితులు ఫిర్యాదు చేయగానే తక్షణ అరెస్టులను నిషేధిస్తూ సర్వోన్నత న్యాయస్ధానం మార్చి 20న తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. సుప్రీం ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా దళిత సంఘాలు,పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించాయి. భారత్ బంద్‌ను నిర్వహించి నిరసన వ్యక్తం చేశాయి. పార్టీ దళిత ఎంపీలు, విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో కేంద్రం ఏప్రిల్ 3న సుప్రీం ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేశాయి. -
ఆ తీర్పు చట్టాన్ని నిర్వీర్యం చేసేలా ఉంది
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ చట్టంపై ఇచ్చిన తీర్పు నిబంధనలను నిర్వీర్యం చేసేలా ఉందని, ఇది ప్రజల్లో ఆగ్రహానికి, అశాంతికి కారణమై దేశానికి తీవ్ర నష్టం వాటిల్లేలా చేస్తుందని, అందువల్ల దీనిని సమీక్షించాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద తక్షణం అరెస్టులు చేయకుండా మార్చి 20వ తేదీన సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును నిరసిస్తూ దేశవ్యాప్తంగా దళిత సంఘాలు ఆందోళనలకు దిగాయి. దీంతో ఈ తీర్పుపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషనదాఖలు చేసింది. ఈ పిటిషన్‌కు మద్దతుగా గురువారం కేంద్ర ప్రభుత్వం రాతపూర్వక నివేదిక సమర్పించింది. న్యాయ, శాసన, కార్యనిర్వాహక విభాగాల మధ్య అధికారాల విభజన భారత రాజ్యాంగంలో ప్రాథమిక భాగమనీ, చట్టాలు చేయగలిగే ఎలాంటి అవకాశమూ కోర్టులకు లేదని పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ చట్టంపై తీర్పు తీవ్ర గందరగోళానికి దారి తీసిందని, సమీక్ష ద్వారా, ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకోవటం ద్వారా ఈ అంశాన్ని చక్కదిద్దవచ్చని తెలిపింది. ఇది చాలా సున్నితమైన అంశమని, కోర్టు తీర్పు ఫలితంగా గందరగోళం, ఆగ్రహం, అసంతృప్తి, అశాంతి దేశంలో చెలరేగాయని పేర్కొంది. ఈ తీర్పు చట్టాన్ని బలహీనపరిచేలా ఉందని తెలిపింది. తమ తీర్పును పూర్తిగా చదవలేదని, స్వార్థ ప్రయోజనాల కోసమే ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొంటూ దీనిపై సమీక్షించేందుకు గత వారం సుప్రీంకోర్టు నిరాకరించింది. -
ఆ రివ్యూ పిటిషన్‌ను విచారించలేం
-
ఎస్సీ, ఎస్టీ చట్టం... ‘ఆ’ తీర్పుపై స్టే ఇవ్వలేం!
-
తీర్పుపై స్టే ఇవ్వలేం
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ చట్టంలో నిబంధనలు మార్చుతూ ఈ నెల 20న ఇచ్చిన తీర్పుపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అలాగే తీర్పును సమీక్షించాలని కేంద్రం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించలేమని, 10 రోజుల అనంతరం సమగ్రంగా పరిశీలిస్తామంది. చట్టంలోని ఏ నిబంధనను నీరుగార్చే ప్రయత్నం చేయలేదని, అమాయకుల ప్రాథమిక హక్కుల్ని పరిరక్షించే ఉద్దేశంతోనే రక్షణ ఏర్పాట్లు చేశామని స్పష్టం చేసింది. ఆందోళనకారులు తీర్పును సరిగా చదవలేదని, స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు వారిని పక్కదారి పట్టించి ఉండవచ్చని జస్టిస్ ఏకే గోయల్, జస్టిస్ యు యు లలిత్‌ల ధర్మాసనం అభిప్రాయపడింది. మార్చి 20న ఎస్సీ, ఎస్టీ చట్టంలో మార్పులు చేస్తూ ఈ ధర్మాసనమే తీర్పు వెలువరించింది. జీవించే హక్కుకు భంగం కలగకూడదు.. ‘అమాయకుల్ని శిక్షించకూడదనే మేం చెప్పాం. ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌లోని నిబంధనల్ని ఆసరాగా చేసుకుని అమాయకుల్ని భయభ్రాంతులకు గురిచేయకూడదు. జీవించే హక్కుకు భంగం కలిగించడాన్ని మేం కోరుకోవడం లేదు. అదే సమయంలో ఎస్సీ, ఎస్టీ చట్టానికి లేదా ఫిర్యాదులకు మేం వ్యతిరేకం కాదని చాలా స్పష్టంగా చెప్పాం’ అని తీర్పును ధర్మాసనం మరోసారి గుర్తుచేసింది. రివ్యూ పిటిషన్‌పై తీర్పు వెలువరించే వరకూ.. మార్చి 20 నాటి తీర్పును నిలుపుదల చేయాలని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చేసిన వినతిని కోర్టు తోసిపుచ్చింది. తీర్పును సమీక్షించాలని కోరుతూ కేంద్రం వేసిన రివ్యూ పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తూ... ఈ కేసులో ప్రధాన పిటిషన్‌లోని అసలు కక్షిదారులతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వ వాదనలు కూడా వింటామని తెలిపింది. రివ్యూ పిటిషన్‌పై మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఇతర కక్షిదారులు రెండు రోజుల్లోగా లిఖితపూర్వకంగా కోర్టుకు అనుమతి తెలిపాలని ఆదేశించింది. ఎస్సీ, ఎస్టీ చట్టంలోని నిబంధనల్లో మార్పులు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు నిరసనగా సోమవారం ఎస్సీ, ఎస్టీ సంఘాలు చేపట్టిన భారత్ బంద్ హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఎఫ్ఐఆర్ లేకుండానే పరిహారం ఇవ్వొచ్చు ‘ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌లో పేర్కొన్న నేరాలకు సంబంధించిన అంశాలు మాత్రమే తీర్పు పరిధిలోకి వస్తాయి. ఐపీసీ కింద కేసు పెట్టదగిన నేరాల విషయంలో ఎఫ్ఐఆర్ నమోదుకు ముందస్తు విచారణ అవసరం లేదు. ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌లోని ఏ నిబంధనను మేం బలహీనపరచలేదు. ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండానే వేధింపుల బాధితులకు నష్టపరిహారం చెల్లించవచ్చు. ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద నమోదైన నేరాలపై విచారణ పూర్తి చేయడానికి ఇచ్చిన ఏడు రోజుల గడువు కేవలం గరిష్ట పరిమితి మాత్రమే... మీరు కావాలంటే పది నిమిషాల్లో లేదా అరగంట, గంటలో ఆ పని పూర్తి చేసి ఎఫ్ఐఆర్ దాఖలు చేయవచ్చు. ఇతర చట్టాల్లో ఉన్నట్లే ముందస్తు బెయిల్ కోసం నిబంధనల్ని ప్రవేశపెట్టాం’ అని బెంచ్ స్పష్టం చేసింది. ఎలాంటి నిర్ధారణ లేకుండా మీపై ఆరోపణలు చేస్తే మీరు పనిచేయగలరా? ప్రభుత్వాధికారిపై అలాంటి ఆరోపణలు చేస్తే అతను లేదా ఆమె పనిచేయగలరా? అని అటార్నీ జనరల్‌ను ప్రశ్నించింది. ‘అలాంటి పరిస్థితుల్లో వారు పనిచేయలేరు. పరిష్కార మార్గం చూపకుండా అమాయకుల హక్కుల్ని దూరం చేయలేం’ అని కోర్టు పేర్కొంది. రివ్యూ పిటిషన్‌ను తక్షణమే విచారించాలి: కేంద్రం ఈ సందర్భంగా రివ్యూ పిటిషన్‌ను తక్షణమే విచారించాలని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సుప్రీంకోర్టును కోరారు. సోమవారం జరిగిన హింసలో వందల కోట్ల ఆస్తినష్టం జరిగిందని, పలువురు ప్రాణాలు కోల్పోయారని కోర్టుకు తెలిపారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ప్రకారం వేధింపుల బాధితుల్ని కూడా కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈ సందర్భంగా కోర్టు జోక్యం చేసుకుంటూ.. నిజమైన కేసుల్లో నిందితుడ్ని విడుదల చేయమని తాము చెప్పలేదని తెలిపింది. -
సుప్రీం తీర్పుపై కేంద్రం రివ్యూ పిటిషన్
సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాల నిరోధక చట్టం అమలులో తక్షణ అరెస్టులు వద్దంటూ సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని సొంత పార్టీ ఎంపీల నుంచే బీజేపీపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ విషయమై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్.. రాష్ట్రపతిని కలిసిన నేపథ్యంలో నష్ట నివారణ చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీం తీర్పుపై వచ్చే వారం రివ్యూ పిటిషన్ దాఖలు చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. సామాజిక న్యాయ శాఖతో న్యాయ శాఖ ఉన్నతాధికారులు సంప్రదింపులు కొనసాగిస్తున్నారని, వచ్చే బుధవారం రివ్యూ పిటిషన్ వేస్తామని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. రివ్యూ పిటిషన్ దాఖలు చేయాల్సిన అవసరాన్ని పరిశీలించాలని అధికారుల్ని ఆదేశించానని, వారు తగిన చర్యలు చేపడుతున్నారని న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ తెలిపారు. -
వచ్చే దీపావళికి రామ మందిరం పూర్తి!
సాక్షి, న్యూఢిల్లీ : రామ జన్మభూమి.. అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామ మందిరం కట్టి తీరతామని బీజేపీ నేత, రాజ్యసభ ఎంపీ సుబ్రమణియన్ స్వామి ప్రకటించారు. త్వరలో ఆటంకాలన్నీ తొలగుతాయన్న ఆశాభావం వ్యక్తం చేసిన ఆయన... వచ్చే దీపావళి నాటికి గుడి నిర్మాణం పూర్తి చేసి తీరతామని చెబుతున్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘సుప్రీంలో ప్రస్తుతం రివ్యూ పిటిషన్‌పై విచారణ జరగాల్సి ఉంది. అది పూర్తవ్వగానే రామ మందిర నిర్మాణ పనులు మొదలుపెడతాం. వచ్చే ఆగష్టు నుంచి పనులు మొదలుపెట్టి 3-4 నాలుగు నెలల్లో పూర్తి చేసి దీపావళి నాటికి ఆలయ నిర్మాణం పూర్తి చేస్తాం’ అని అన్నారు. కాగా, డిసెంబర్ 5న అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టులో ఇరు వర్గాలు తుది వాదనలు వినిపించనున్నారు. ఆ మరుసటిరోజు అంటే డిసెంబర్ 6 నాటికి బాబ్రీ కూల్చివేత ఘటన జరిగి సరిగ్గా 26 ఏళ్లు పూర్తవుతుండటం విశేషం. స్వామి వాదన ఏంటంటే... ఆ కాలంలో మొగలు చక్రవర్తి బాబర్ స్వాధీనంలో ఉండటంతో ఆ స్థలం తమకు చెందించే అని ముస్లిం నేతలు వాదిస్తున్నారు. కానీ, అలహాబాద్ హైకోర్టు దానిని తోసిపుచ్చింది. అదే సమయంలో నేను లేవనెత్తిన అంశంపై కూడా వారి నుంచి సమాధానం రావటం లేదు. అది స్థిరాస్థి హక్కు అని వారు(ముస్లిం సంఘాలు) అంటున్నారు. కాబట్టి అదొక సాధారణ హక్కు అవుతుంది. కానీ, రామ జన్మభూమిపై హిందువులకు ప్రాథమిక హక్కు ఉందని న్యాయస్థానం గత తీర్పులో స్పష్టం చేసింది. ఆ లెక్కన్న వారు గెలిచే అవకాశాలు లేనే లేవన్నది స్పష్టమవుతోంది అని స్వామి చెబుతున్నారు మరోవైపు ఆలయ నిర్మాణానికి తమకేం అభ్యంతరం లేదని.. కాకపోతే వివాదాస్పద స్థలానికి సహేతుక దూరంలో మసీదు నిర్మించాలంటూ షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు ఓ ప్రతిపాదనను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. -
మరిన్ని చిక్కుల్లో పాక్ మాజీ ప్రధాని..
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ మరిన్ని చిక్కుల్లో పడ్డారు. అనర్హత వేటు తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ ఆయన కుటుంబ సభ్యలు వేసిన పిటిషన్‌ను ఆదేశ సుప్రీం కోర్టు శుక్రారం తోసిపుచ్చింది. గత నెల షరీఫ్ తరపున ఆయన కూతురు మర్యమ్ నవాజ్, తనయులు హుస్సేన్ నవాజ్ మరియు హస్సన్ నవాజ్, అల్లుడు కెప్టెన్ సఫ్దార్‌లు పిటిషనర్లుగా పేర్కొంటూ న్యాయవాది సల్మాన్ అక్రమ్ రాజా రివ్యూ పిటిషన్‌ను ఫైల్ చేశారు. అక్రమ ఆరోపణలపై విచారణ అంశం అసలు కోర్టు పరిధిలోకే రాదంటూ వాళ్లు పిటిషన్లో పేర్కొన్నారు. విచారించిన ఐదుగురి జడ్జిల ప్యానెల్ రివ్యూ పిటిషన్లన్నిటినీ తిరస్కరించింది. నవాజ్ షరీఫ్‌ను పదవి నుంచి తొలగించడాన్ని కోర్టు సమర్ధించింది.దుబాయ్ కంపెనీలకు చెందిన ఆదాయాన్ని 2013 ఎన్నికల సమయంలోని నామినేషన్ పేపర్లలో షరీఫ్ పేర్కొనలేదంటూ పనామా పేపర్ల లీకేజీతో వెలుగులోకి రాగా, ఆ ఆరోపణలపై విచారణ చేపట్టిన ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఆయన దోషిగా ప్రకటించి ప్రధాని పదవికి రాజీనామా చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. పాక్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 62(1)(F) ప్రకారం ఆయనపై అనర్హత వేటు వేస్తూ జూలై 28న సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. -
సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్
-
సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్
ఇస్లామాబాద్: పనామా ఆరోపణలు, ఆపై సుప్రీంకోర్టు తీర్పుననుసరించి పాకిస్థాన్ ప్రధాని గద్దె నుంచి నవాజ్ షరీఫ్ ప్రస్తుతం ప్రజా మద్ధతును కూడగట్టే పనిలో ఉన్నారు. దేశవ్యాప్తంగా ర్యాలీలు, సభలు నిర్వహిస్తూ తనపై వచ్చినవన్నీ ఆరోపణలేనని చెప్పుకొస్తున్నారు . ఇక ఆయన కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టు అనర్హత వేటు తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ శుక్రవారం ఓ పిటిషన్ దాఖలు చేశారు. షరీఫ్ తరపున ఆయన కూతురు మర్యమ్ నవాజ్, తనయులు హుస్సేన్ నవాజ్ మరియు హస్సన్ నవాజ్, అల్లుడు కెప్టెన్ సఫ్దార్‌లు పిటిషనర్లుగా పేర్కొంటూ న్యాయవాది సల్మాన్ అక్రమ్ రాజా రివ్యూ పిటిషన్‌ను ఫైల్ చేశారు. అక్రమ ఆరోపణలపై విచారణ అంశం అసలు కోర్టు పరిధిలోకే రాదంటూ వాళ్లు పిటిషన్లో పేర్కొన్నారు. దుబాయ్ కంపెనీలకు చెందిన ఆదాయాన్ని 2013 ఎన్నికల సమయంలోని నామినేషన్ పేపర్లలో షరీఫ్ పేర్కొనలేదంటూ పనామా పేపర్ల లీకేజీతో వెలుగులోకి రాగా, ఆ ఆరోపణలపై విచారణ చేపట్టిన ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఆయన దోషిగా ప్రకటించి ప్రధాని పదవికి రాజీనామా చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. పాక్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 62(1)(F) ప్రకారం ఆయనపై అనర్హత వేటు వేస్తూ జూలై 28న సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేయగా, ఆయన కుటుంబ సభ్యులు ఇప్పుడు రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. -
జైలు శిక్ష రద్దు చేయండి
-
జైలు శిక్ష రద్దు చేయండి
సుప్రీంకోర్టులో జస్టిస్ కర్ణన్ రివ్యూ పిటిషన్ న్యూడిల్లీ/సాక్షి ప్రతినిధి, చెన్నై: కోర్టు ధిక్కరణ కేసులో తనకు విధించిన ఆరు నెలల జైలు శిక్షను రద్దు చేయాలని కోరుతూ జస్టిస్ కర్ణన్ తన న్యాయవాది మాథ్యుస్ నెదుమ్పరా ద్వారా సుప్రీంకోర్టులో గురువారం రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. న్యాయమూర్తులపై తాను చేసిన ఫిర్యాదులపై విచారణ జరపాల్సింది పోయి.. జైలు శిక్ష విధించడం అన్యాయమని పిటిషన్లో పేర్కొన్నారు. న్యాయమూర్తులను తప్పుపట్టాను కానీ న్యాయస్థానాన్ని కాదని ఆయన వివరించారు. ఇది న్యాయస్థానాలను అవమానించినట్లు ఎలా అవుతుందని ప్రశ్నించారు. కర్ణన్ అభ్యర్థనపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జగదీశ్ సింగ్ ఖేహర్ సానుకూలంగా స్పందించారు. ‘మీ అభ్యర్థనను అంగీకరిస్తున్నాం. దీన్ని పరిశీలిస్తాం’ అని జస్టిస్ ఖేహర్ అన్నారు. అలాగే జస్టిస్ కర్ణన్ దేశం విడిచి వెళ్లిపోయారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తరఫు న్యాయవాదులు ఖండించారు. ఆయన ఎక్కడికీ వెళ్లలేదని, చెన్నైలోనే ఉన్నారని తెలిపారు. రివ్యూ పిటిషన్ వేయమంటూ జస్టిస్ కర్ణన్ న్యాయవాదికి సమర్పించిన నోటరీ పత్రాలను కోర్టు చూపించమనడంతో వాటిని మాథ్యూస్ సుప్రీంకోర్టుకు చూపారు. అలాగే కర్ణన్ క్షమాపణలు కోరినట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని కూడా ఆయన తరఫు న్యాయవాదులు కొట్టిపారేశారు. కొనసాగుతున్న గాలింపు.. మరోవైపు జస్టిస్ కర్ణన్‌ను అదుపులోకి తీసుకునేందుకు కోల్‌కతా నుంచి చెన్నై వచ్చిన పోలీసులు గాలింపును ముమ్మరం చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం తనిఖీలు నిర్వహించారు. -
‘సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్ వేస్తాం’
-
‘సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్ వేస్తాం’
చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వీకే శశికళను దోషిగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ వేస్తామని లోక్ సభ డిప్యూటీ స్పీకర్, అన్నాడీఎంకే ఎంపీ ఎం తంబిదురై తెలిపారు. తమ నాయకురాలు శశికళ జైలుకెళ్లే పరిస్థితి రావడంతో ఆమె స్థానంలో పళనిస్వామిని శాసనసభాపక్ష నేతగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారని చెప్పారు. శశికళపై తిరుగుబాటు చేసిన పన్నీర్ సెల్వంకు అన్నాడీఎంకేలో చోటు లేదని స్పష్టం చేశారు. శశికళపై అలకబూని ఢిల్లీకే పరిమితమైన తంబిదురై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మళ్లీ వెలుగులోకి వచ్చారు. పన్నీర్ సెల్వం స్థానంలో తనకు పార్టీ కోశాధికారి పదవి ఇవ్వకపోవడంతో శశికళపై ఆయన అలిగినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. అప్పటినుంచి ఆయన హస్తినకే పరిమితమయ్యారు. -
‘రివ్యూ’ అవసరం లేదు!
బీసీసీఐ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీం న్యూఢిల్లీ: లోధా కమిటీ సిఫారసుల అమలుపై జులై 18న ఇచ్చిన తీర్పును పునస్సమీక్షించాలంటూ బీసీసీఐ వేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ‘రివ్యూ గురించి చేసిన విజ్ఞప్తిని అన్ని విధాలా పరిశీలించాం. మా ఉత్తర్వును వెనక్కి తీసుకునే విధంగా ఎలాంటి తప్పూ కనిపించలేదు. కాబట్టి దీనిని కొట్టివేస్తున్నాం’ అని సుప్రీం స్పష్టం చేసింది. అయితే దేశ అత్యున్నత న్యాయస్థానం నవంబర్ 10నే ఈ ఉత్తర్వులు ఇచ్చినా... ఇటీవలే దీనిని కోర్టు వెబ్సైట్లో ఉంచారు. లోధా సిఫారసుల విషయంలో బహిరంగ విచారణ జరపాలని, ఒక రాష్ట్రం–ఒక ఓటు ప్రతిపాదనను తప్పించాలంటూ బోర్డు వేర్వేరు అంశాలపై సుప్రీంలో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. మరోవైపు లోధా కమిటీ సూచనల అమలుపై సుప్రీం కోర్టు తుది తీర్పు గురువారం వెలువరించే అవకాశం ఉంది. ఇప్పటికే ఇది రెండు సార్లు వాయిదా పడగా, గురువారం గనుక తీర్పు వస్తే అది భారత క్రికెట్ స్వరూపాన్నే మార్చేయవచ్చు. -
చీఫ్ జస్టిస్‌ను తప్పించండి!
‘లోధా’ కేసులో బీసీసీఐ రివ్యూ పిటిషన్ ముంబై: లోధా కమిటీ సిఫారసుల అమలు విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సుప్రీం కోర్టుతోనే ఢీకొట్టేందుకు సిద్ధమైంది. లోధా ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతూ జులై 18న ఇచ్చిన తీర్పును పునస్సమీక్షించాలని కోరుతూ రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. ‘సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధం. ఆర్టికల్ 19 (ఎ) (సి) ప్రకారం ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తోంది. తీర్పు ఇచ్చే ముందు ఇద్దరు సభ్యులు వాస్తవాలను పరిగణలోకి తీసుకోలేదు’ అని ఈ పిటిషన్లో పేర్కొంది. అన్నింటికి మించి తదుపరి విచారణనుంచి సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్‌ను తప్పించాలని కూడా కోరింది. బోర్డుకు వ్యతిరేకంగా చీఫ్ జస్టిస్ ముందే ఒక అభిప్రాయం ఏర్పరుచుకున్నారని, నిష్పాక్షిక విచారణ జరగడం లేదని తాము భావిస్తున్నామన్న బీసీసీఐ... ఐదుగురు సభ్యుల బెంచ్ ముందు వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాలని కోరింది. బీసీసీఐకి ఈ కేసులో మాజీ న్యాయమూర్తి జస్టిస్ కట్జూ మార్గనిర్దేశనం చేస్తున్నారు. -
ఆస్తుల రివ్యూ పిటిషన్‌ను తోసిపుచ్చిన ‘సుప్రీం’
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ ఉన్నత విద్యామండలి ఆస్తులను జనాభా ప్రాతిపదికన పంచుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను ఆ కోర్టు తోసిపుచ్చింది. బుధవారం రివ్యూ పిటిషన్‌ను పరిశీలించిన జస్టిస్ వి.గోపాల గౌడ, జస్టిస్ అరుణ్ మిశ్రా తో కూడిన ధర్మాసనం పిటిషన్లో పునఃసమీక్షించాల్సిన అంశాలేవీ లేవంటూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు ఉత్తర్వులను సుప్రీంకోర్టు గురువారం వెల్లడించింది. -
పరిష్కారానికి చొరవ చూపేదెవరు?
* ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌పై పీటముడి * స్లైడింగ్‌కైనా అవకాశం తప్పనిసరి * ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు స్పందిస్తేనే విద్యార్థులకు న్యాయం * ఇంజనీరింగ్ రివ్యూ పిటిషన్‌పైనే ఆశలు సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ వ్యవహారంలో విద్యార్థులకు మేలు జరగాలంటే కనీసం స్లైడింగ్‌కైనా (కాలేజీ, బ్రాంచీ మార్చుకునే) అవకాశం కల్పించాల్సి ఉంది. ఇందుకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కలసి స్పందిస్తేనే ఫలితం ఉంటుంది. అయితే ఎవరు చొరవ తీసుకుంటారన్నదే ఇపుడు సమస్య. ప్రవేశాలు ఆలస్యం అవుతున్నాయంటూ కోర్టుకు చెప్పిన ఏపీ ప్రభుత్వం ఈ విషయంపై మిన్నకుండిపోగా, తాము ప్రవేశాల గడువు పెంచాలని కోరినా ఏపీ సర్కారే వద్దన్నదంటూ తెలంగాణ ప్రభుత్వం స్పందించడం లేదు. దీంతో కన్వీనర్ కోటాలో తమకు ఇష్టంలేని బ్రాంచీల్లో మెరిట్ మేరకు సీట్లు పొందిన విద్యార్థుల పరిస్థితి గందరగోళంలో పడింది. వేలమందికి నిరాశ.. ఇంజనీరింగ్‌లో 1.16 లక్షల మందికి అధికారులు సీట్లు కేటాయించారు. అందులో 1.12 లక్షలమంది విద్యార్థులు కాలేజీల్లో చేరారు. ఇంకో నాలుగువేల మంది స్లైడింగ్ ఉంటుందనే ఆశతో ఇష్టంలేని కాలేజీల్లో చేరలేదు. కాగా, కాలేజీల్లో చేరిన వారిలో చాలా మంది స్లైడింగ్‌లో మరో కాలేజీలో.. మరో బ్రాంచీకి మారవచ్చనే ఆలోచనతో ఉన్నారు. అయితే గురువారంనాటి సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో వారి ఆశలు అడియాసలయ్యాయి. తల్లిదండ్రులు కూడా తీవ్రఆవేదన చెందుతున్నారు. 35 వేల మందికి ఇష్టమైన బ్రాంచీలో సీటు రానందునే! మేనేజ్మెంట్ కోటా విషయంలో పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చనే భావన అధికారుల్లో ఉంది. మేనేజ్మెంట్ కోటా కోసం ఏపీ ఉన్నత విద్యా మండలి గత నెల 22న నోటిఫికేషన్‌ను జారీ చేసినా, అంతుకుముందుగానే యాజమాన్యాలు సీట్లు భర్తీ చేసుకున్నాయని తెలుస్తోంది. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు కన్వీనర్ కోటాలో మంచి బ్రాంచీల్లో సీట్లు రాకపోవడంతో మేనేజ్మెంట్ కోటాలో పేరున్న కాలేజీలో, ఇష్టమైన బ్రాంచీల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇలా దరఖాస్తు చేసుకున్న వారు 35 వేలమంది ఉంటారు. వీరి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దీనికితోడు బీటెక్ బయోటెక్నాలజీ వంటి కోర్సుల్లో బైపీసీ స్ట్రీమ్ ద్వారా ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న మరో 3 వేల మందికి కౌన్సెలింగ్ ఎలా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇక వారంతా నేరుగా కాలేజీలను సంప్రదించి అనధికారింగా చేరాల్సి ఉంది. అయితే అసలు నోటిఫికేషనే జారీ చేయనపుడు ప్రవేశాలు చేపట్టడమూ కుదరకపోవచ్చనే వాద న ఉంది. ఈ పరిస్థితుల్లో రెండు రాష్ట్రాలప్రభుత్వాలు, రెండు ఉన్నత విద్యా మండళ్లు పట్టిం పులు వీడాలని నిఫుణులు పేర్కొంటున్నారు. విద్యార్థులకు మేలు చేసేందుకు ఉమ్మడి ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉందంటున్నారు. -
ఆలోగా సాధ్యం కాదు!
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికలు నాలుగు వారాల్లో నిర్వహించడం సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. నాలుగు వారాల్లో ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించడంతో.. తీర్పును పూర్తిగా పరిశీలించిన తరువాత దీనిపై ఓ నిర్ణయానికి రావాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే తీర్పుపై రివ్యూ పిటిషన్ వేసే అంశంతోపాటు, మరోవైపు ఎన్నికల నిర్వహణకున్న అవకాశాలను కూడా ప్రభుత్వం పరిశీలించనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో మొత్తం 163 మున్సిపాలిటీలు, 19 కార్పొరేషన్లు ఉంటే.. అందులో 146 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించడానికి అవకాశం ఉన్నట్లు అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే వీటిలో వార్డుల వారీగా రిజర్వేషన్లు ప్రకటించామని, రాష్ట్ర వ్యాప్తంగా చైర్పర్సన్లు, మేయర్లకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియ మాత్రమే పూర్తి చేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. 2013 ఓటర్ల జాబితా ఆధారంగా ఈ రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు అధికారవర్గాలు వివరించాయి. 2014 జనవరి 31న ఈసీ కొత్త ఓటర్ల జాబితాను ప్రకటించింది. కొత్తగా 76 లక్షల ఓటర్లు చేరారు. వారిలో బీసీ ఓటర్లను లెక్కించి, మళ్లీ వార్డుల వారీ రిజర్వేషన్లు ఖరారు చేయాలి. హైకోర్టు తీర్పులో తాజా ఓటర్ల జాబితా అని ఉంటే విధిగా మళ్లీ బీసీ గణన తప్పనిసరి అవుతుంది. బీసీ ఓటర్ల గణన, రిజర్వేషన్లకు 40 రోజుల గడువు కావాలి. ఎన్నికలు రెండు దశల్లో నిర్వహించాల్సి వస్తుంది. పునర్విభజన కార్యక్రమం కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీల న్నింటిలో పూర్తి కాలేదు. ఎన్నికలపై సీఎం కిరణ్ అభిప్రాయం తెలుసుకోవాల్సి ఉంది. ఎన్నికలకు మేము సిద్ధం: రమాకాంత్‌రెడ్డి మున్సిపల్ రిజర్వేషన్లను ప్రభుత్వం ప్రకటించిన తరువాత నాలుగు వారాల్లోగా ఎన్నికలు నిర్వహించడానికి తాము సిద్ధమని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పి.రమాకాంత్‌రెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. కాగా దీనిపై కోర్టు ఆర్నెల్ల కిందే ఉత్తర్వులు జారీ చేసి ఉంటే ఎన్నికల నిర్వహణ సాధ్యమయ్యేదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభరెడ్డి పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలను స్వాగతిస్తూనే.. ప్రస్తుతం రాష్ట్రంలో పాలన లేదని, సీఎం ఎన్నికలు నిర్వహించే పరిస్థితుల్లో లేరన్నారు. -
'అనర్హత'పై కేంద్రం అభ్యర్థనను తోసిపుచ్చిన సుప్రీం
దోషులుగా తేలిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించాలని ఇచ్చిన తీర్పును సమీక్షించాలంటూ కేంద్రం వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ తీర్పును సమీక్షించాల్సిన అవసరం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే నేరారోపణలతో కస్టడీలో ఉన్నవారు ఎన్నికల్లో పోటీకి అర్హులన్న తీర్పును పునఃసమీక్షించేందుకు అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. కింది కోర్టులో దోషులుగా నిర్ధారితులైన ప్రజాప్రతినిధులు.. దానిపై ఉన్నతస్థాయి కోర్టులో చేసుకున్న అప్పీలు పెండింగ్‌లో ఉన్నట్లయితే వారిని అనర్హులను చేయరాదని చెప్తున్న ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8(4).. న్యాయవిరుద్ధమైనదని పేర్కొంటూ అత్యున్నత న్యాయస్థానం గతంలో కొట్టివేసింది. ప్రజాప్రతినిధులు దోషులుగా నిర్ధారితులైన తేదీ నుంచే వారు అనర్హులుగా మారతారని జస్టిస్ ఎ.కె.పట్నాయక్, జస్టిస్ ఎస్.జె.ముఖోపాధ్యాయలతో కూడిన ధర్మాసనం స్పష్టంచేసింది. -
'అనర్హత'పై కేంద్రం అభ్యర్థనను తోసిపుచ్చిన సుప్రీం
దోషులుగా తేలిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించాలని ఇచ్చిన తీర్పును సమీక్షించాలంటూ కేంద్రం వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ తీర్పును సమీక్షించాల్సిన అవసరం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే నేరారోపణలతో కస్టడీలో ఉన్నవారు ఎన్నికల్లో పోటీకి అర్హులన్న తీర్పును పునఃసమీక్షించేందుకు అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. కింది కోర్టులో దోషులుగా నిర్ధారితులైన ప్రజాప్రతినిధులు.. దానిపై ఉన్నతస్థాయి కోర్టులో చేసుకున్న అప్పీలు పెండింగ్‌లో ఉన్నట్లయితే వారిని అనర్హులను చేయరాదని చెప్తున్న ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8(4).. న్యాయవిరుద్ధమైనదని పేర్కొంటూ అత్యున్నత న్యాయస్థానం గతంలో కొట్టివేసింది. ప్రజాప్రతినిధులు దోషులుగా నిర్ధారితులైన తేదీ నుంచే వారు అనర్హులుగా మారతారని జస్టిస్ ఎ.కె.పట్నాయక్, జస్టిస్ ఎస్.జె.ముఖోపాధ్యాయలతో కూడిన ధర్మాసనం స్పష్టంచేసింది.