సాక్షి, న్యూఢిల్లీ : కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయంలోకి రుతుస్రావం వయస్కుల మహిళలను అనుమతిస్తూ సుప్రీం కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును సమీక్షించాల్సిందిగా కోరుతూ జాతీయ అయ్యప్ప భక్తుల సంఘం అధ్యక్షుడు శ్యాలజ విజయన్ సోమవారం నాడు సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయస్కుల ఆడవారిని అనుమతించాలని కోరుతూ ఇంతకుముందు పిటిషన్లు వేసిన వారు, అయ్యప్ప భక్తులు కారని, అయ్యప్ప నైష్టిక బ్రహ్మచారి అని నమ్మే భక్తుల నమ్మకాలను కాదనే హక్కు బయట వారికి లేదని రివ్యూ పిటిషన్‌లో వాదించారు.
ఇదేమి కొత్త వాదన కాదు. జస్టిస్ ఇందు మల్హోత్ర మొన్న నలుగురు సభ్యుల సుప్రీం ధర్మాసనం ఇచ్చిన తీర్పులోనే తన అభిప్రాయంగా చెప్పారు. ఎవరి మతరమైన నమ్మకాలు వారివని, మతపరమైన నమ్మకాలను కాదనడం రాజ్యాంగంలోని 25, 26 అధికరణలు కల్పిస్తున్న మత హక్కులను ఉల్లంఘించడమేనని కూడా ఆమె అభిప్రాయపడ్డారు. ఆమె వాదనను తిరస్కరిస్తూ మిగతా ముగ్గురు జడ్జీలు మహిళలకు అనుకూలంగా తీర్పు చెప్పారు. అలాంటప్పుడు ఆమె వాదననే ప్రాతిపదికగా తీసుకొని వేసిన రివ్యూ పిటిషన్‌ను కోర్టు స్వీకరిస్తుందా? విచారిస్తుందా? స్వీకరించి, విచారించినా భిన్నమైన తీర్పు వెలువడే అవకాశం ఉందా? అన్నదే ఇక్కడ చర్చ.
సాధారణంగా పాత వాదననే ప్రాతిపదికగా తీసుకునే పిటిషన్ సర్వ సాధారణంగా విచారణ యోగ్యం కాదు. సుప్రీం కోర్టు సంప్రదాయం ప్రకారం తీర్పు ఇచ్చిన బెంచీనే రివ్యూ పిటిషన్‌ను విచారించాల్సి ఉంటుంది. విచారణ యోగ్యమని సదరు బెంచీ అభిప్రాయపడినట్లయితే అదే బెంచీ దాన్ని విచారించవచ్చు. లేదా ప్రధాన న్యాయమూర్తి సూచన మేరకు మరో బెంచీకి అప్పగించవచ్చు. ఇటీవల తీర్పు ఇచ్చిన బెంచీలో మాజీ ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాతోపాటు జస్టిస్ ఏఎం ఖాన్‌విల్కర్, జస్టిస్ చంద్రఛూడ్, జస్టిస్ రోహింటన్ నారిమన్, జస్టిస్ ఇందు మల్హోత్రలు ఉన్నారు. వారిలో దీపక్ మిశ్రా ఒక్కరే పదవి విరమణ చేశారు. ఆయన స్థానంలో బెంచీలోకి కొత్త వారు వస్తారు.
కొత్తగా వచ్చే జస్టిస్ ఇందు మల్హోత్ర అభిప్రాలతో ఏకీభించినప్పటికీ విభేదించేవారు చంద్రఛూడ్, నారిమన్, ఖాన్‌విల్కర్‌లు ఉంటారు కదా! ఇక తీర్పు తారుమారే అవకాశం ఎక్కడిది? కొత్త వాదోపవాదాల కారణంగా న్యాయమూర్తుల అభిప్రాయాలు మారుతాయనుకుంటే తీర్పు ఎలా ఉండబోతుంది? హోమో సెక్యువాలిటీని నేరంగా పరిగణిస్తున్న భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని 377వ సెక్షన్‌ను కొట్టివేస్తూ మాజీ ప్రధాన న్యాయమూర్తి ఓ వాదనను తీసుకొచ్చారు. ‘నాన్ రెట్రోగెషన్’ దృక్పథం గురించి ఆయన ప్రస్తావించారు. అంటే, ప్రతీగమనం చేసి అంతకుముందున్న చోటుకన్నా అధ్వాన్నమైన చోటుకు రాకూడదనేది అర్థం. ఈ అర్థాన్ని విడమర్చి చెబుతూ రాజ్యాంగం స్ఫూర్తి ప్రకారం ఏ తీర్పయినా అంతకుముందు తీర్పుకన్నా మెరుగ్గా ఉండాలన్నారు. అందుకని ఓసారి కల్పించిన హక్కులను కోర్టులు కూడా వెనక్కి తీసుకోలేవని చెప్పారు. ఆయన మాటలను ఇక్కడ పరిగణలోకి తీసుకుంటే శబరిమల ఆలయంలోకి రుతుస్రావ వయస్కులైన మహిళలకు మొన్ననే కల్పించిన హక్కులను వెనక్కి తీసుకునే హక్కు సుప్రీం కోర్టుకు లేనట్లే. ఈ లెక్కన రివ్యూ పిటిషన్ కారణంగా తీర్పు మారే అవకాశమే లేదు.
Comments
Please login to add a commentAdd a comment