Ayyappa temple
-
శబరిమల అయ్యప్పను దర్శించుకున్న ట్రాన్స్‌జెండర్
నల్గొండ : కేరళ చరిత్రలో ఓ ట్రాన్స్ జెండర్ తొలిసారి శబరిమల అయ్యప్పను దర్శించుకున్నారు. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వరస్వామి దేవాలయంలో జరిగే బ్రహోత్సవాలకు, ప్రతి అమావాస్యకు విచ్చేసే ట్రాన్‌జెండర్ జోగిని నిషా క్రాంతి ఆదివారం శబరిమల అయ్యప్ప ఆలయంలో స్వామివారిని దర్శించుకుంది. ట్రాన్స్ జెండర్ ఐడీ ఆధారంగా ఆమెకు కేరళ ప్రభుత్వం దర్శనానికి అనుమతిచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ట్రాన్స్ జండర్లు చాలా మంది అయప్ప మాల ధరించి స్వామిని దర్శించుకోవాలని అనుకుంటున్నారని చెప్పింది. తనకు దర్శనం కల్పించిన కేరళ ప్రభుత్వానికి ఆమె ధన్యవాదాలు తెలిపింది. ఇది ఒక శుభ పరిణామమని.. తాను కూడా అందరిలాగే శబరిమల కొండ ఎక్కి అయ్యప్పను దర్శించుకోవడంతో తన జన్మ ధన్యం అయిందని పేర్కొంది. -
అయ్యప్ప దీక్షలో చేయవలసినవి మరియు చేయకూడనివి..!
-
Sabarimala Temple: నేటి నుంచి అయ్యప్ప దర్శనం
-
శబరిమల: హైకోర్టు ఆదేశాలు సుప్రీంలో సవాల్
న్యూఢిల్లీ: కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోన్న తరుణంలో శబరిమలను దర్శించే భక్తుల సంఖ్యను పెంచుతూ కేరళ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. శబరిమల సందర్శనకు వచ్చే భక్తుల సంఖ్యను రోజుకి 3000 నుంచి 5000కు పెంచడం పోలీసులు, వైద్య అధికారులపై పెనుభారాన్ని మోపుతుందని కేరళ ప్రభుత్వం అభిప్రాయపడింది. డిసెంబర్ 20 నుంచి జనవరి 14 మకర సంక్రాంతి వరకు శబరిమల ఆలయ ఉత్సవాల సీజన్ కావడంతో కోవిడ్ ప్రబలే ప్రమాదాన్ని నివారించేందుకు భక్తుల సంఖ్యను నిర్ధారించేందుకు ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నిర్ణయం మేరకు ప్రస్తుతం ప్రతి రోజూ 2000 మంది భక్తులను, వారాంతాల్లో 3,000 మంది భక్తులను అనుమతిస్తున్నారు. భక్తుల సంఖ్యను పెంచాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు అవడంతో, డిసెంబర్ 18న కేరళ హైకోర్టు రోజుకి 5000 మంది భక్తులు ఆలయ సందర్శనకు అనుమతించొచ్చంటూ ఉత్తర్వులు జారీచేసింది. -
కూలీల కాళ్లు మొక్కిన ఎస్పీ బాలు!
సాక్షి, హైదరాబాద్: గాన దంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం పరమపదించినా పాటగా అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిపోయారు. తను పుట్టిందే గాత్రదానం చేయడానికని ఆయన నిరూపించారు. 50 ఏళ్ల సుదీర్ఘ సంగీత ప్రయాణంలో 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు ఆలపించి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్స్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు. ప్రపంచం నలుమూలలా ఉన్న అభిమానులు ఆయన మృతిపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఓ అభిమాని ట్విటర్లో షేర్ చేసిన వీడియో బాలు ఇతరులకిచ్చే గౌరవాన్ని, గొప్ప మనసును తెలియజేసిదిగా ఉంది. గతంలో ఓసారి శబరిమలకు వెళ్లిన సమయంలో కొండ ప్రాంతం కావడంతో బాలు ఎక్కువ దూరం నడవలేకపోయారు. దీంతో ఆయన్ను కొందరు కూలీలు డోలీలో ప్రధాన ఆలయం వరకు మోసుకెళ్లారు. అక్కడకు చేరుకోగానే తనను మోసుకొచ్చిన కూలీలకు బాలు కృతజ్ఞతలు తెలిపారు. దాంతోపాటు వారి పాదాలకు నమస్కారం చేశారు. గుడిపాటి చంద్రారెడ్డి అనే యూజర్ ఈ వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. (చదవండి: ఎస్పీ బాలు పాడిన తొలి, ఆఖరు పాట తెలుసా?) కాగా, అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలు ఈరోజు (శుక్రవారం) మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. యాభై రోజుల క్రితం కోవిడ్ బారినపడ్డ ఆయన.. వైరస్ నుంచి కోలుకున్నప్పటికీ ఆరోగ్యం కుదుటపడకపోవడంతో ప్రాణాలు విడిచారు. చెన్నైలోని తామరైపాక్కంలో ఉన్న బాలు ఫాంహౌజ్‌లో శనివారం ఉదయం 10.30 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో ఈ అంత్యక్రియలు జరుగనున్నాయి. 🙏 బాలసుబ్రహ్మణ్యం గారు శబరిమల కు వచ్చినప్పుడు తనను డోలీలో మోసిన కూలీల కాళ్లకు దండం పెట్టిన మహానుభావుడు🙏🙏🙏🙏🙏🙏🙏 pic.twitter.com/e6ip1MWbBI — 🌹CHANDRA REDDY GUDIPATI🌹 (@GsrcgsrReddy) September 25, 2020 (చదవండి: జీవితాన్నే మార్చేసిన ‘శంకరాభరణం) -
కరోనా కోరల్లో కేరళ దేవస్థానాలు
-
నువ్వు ఇక్కడే ఉండు.. మీరు వెళ్లొచ్చు!
తిరువనంతపురం: శబరిమల అయ్యప్ప దర్శనానికి వచ్చిన బాలికను పంబ బేస్ క్యాంపు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఆమె కుటుంబ సభ్యులకు దర్శనానికి అనుమతినిచ్చి.. బాలికను వెనక్కి వెళ్లాల్సిందిగా సూచించారు. శబరిమల ఆలయంలోకి రుతుక్రమ వయసు గల మహిళలను అనుమతించే విషయమై గతేడాది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పిటిషన్లను గురువారం విచారించిన సర్వోన్నత న్యాయస్థానం ఈ వివాదాన్ని ఏడుగురు సభ్యులు గల విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. ఈ క్రమంలో శనివారం సాయంత్రం అయ్యప్ప ఆలయ తలుపులు తెరచుకోగా.. దైవ దర్శనానికి వచ్చే మహిళలకు నిరాశే ఎదురైంది. కాగా శబరిమల వివాదాన్ని సుప్రీంకోర్టు ఎటూ తేల్చని నేపథ్యంలో ఆలయంలోకి ప్రవేశించే మహిళలకు ఎటువంటి రక్షణ కల్పించలేమని కేరళ మత్రి ఏకే బాలన్ స్పష్టం చేశారు. అయినప్పటికీ కొంతమంది మహిళలు ఆలయ ప్రవేశానికి ప్రయత్నిస్తుండగా మార్గమధ్యలోనే పోలీసులు వారిని అడ్డుకుని వెనక్కి పంపిస్తున్నారు. తాజాగా ఆలయానికి 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంబ బేస్ క్యాంపు నుంచి పుదుచ్చేరికి చెందిన బాలిక కుటుంబ సభ్యులతో అయ్యప్పను దర్శించుకునేందుకు పయనం కాగా మహిళా పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. ఆధార్ కార్డు వివరాల ప్రకారం ఆమె వయస్సు 12 సంవత్సరాలు కాబట్టి.. ఆలయంలోకి అనుమతించలేమని తేల్చిచెప్పారు. దీంతో పాప తండ్రి తమ కూతురు ఆలయంలోకి ప్రవేశించేందుకు అర్హురాలే అని పోలీసులకు చెప్పినప్పటికీ లాభం లేకపోయింది. ఈ క్రమంలో బాలికను అక్కడే ఉండాల్సిందిగా ఆదేశించిన పోలీసులు.. కుటుంబాన్ని అనుమతించడంతో వారు కొండపైకి వెళ్లారు. బాలికను తాము బస చేసిన గదికి పంపించారు. -
అయ్యప్ప ఆలయంలోకి వెళ్లిన మహిళపై అత్త దాడి
సాక్షి, తిరువనంతపురం : శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి ప్రవేశించిన మహిళలపై వేధింపులు ఎక్కువయ్యాయి. బిందుతో కలిసి ఆయలంలోకి ప్రవేశించిన కనకదుర్గ అనే మహిళను సొంతింటి వాళ్లే చిత్రహింసలు పెట్టారు. అయ్యప్ప దర్శనం అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిన కనకదుర్గ నేడు సొంతింటి చేరుకున్నారు.మొదటిసారిగి ఇంటికి వచ్చిన కనకదుర్గపై అత్తింటివారు దాడికి దిగారు.(శబరిమలలో కొత్త చరిత్ర) ఆలయంలోకి ఎందుకు వెళ్లావంటూ కనకదుర్గ అత్త కర్రతో ఆమెను చితకబాదారు. సంస్కృతి, సంప్రదాయాలను మరచి ఎంత చెప్తున్నా వినకుండా అయ్యప్ప ఆలయాన్ని దర్శించుకునేందుకు వెళ్లి ఆచారాలను మంటగలిపిందంటూ ఆమెపై చేయిచేసుకున్నారు. దీంతో కనకదుర్గ తలకు బలంగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు కనకదుర్గ ఇంటికి చేరుకున్నారు. తీవ్రగాయాలపాలైన కనకదుర్గను ఆస్పత్రికి తరలించారు. దాడికి దిగిన కనకదుర్గ అత్తపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇది చదవండి : ఆ ఇద్దరూ శబరిమలకు ఎలా వెళ్లారు? -
శబరిమలలో మకరజ్యోతి దర్శనం..పోటెత్తిన భక్తులు
సాక్షి, శబరిమల : కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో మకరజ్యోతిని అయప్పభక్తులు దర్శించుకున్నారు. పొన్నాంబలమేడు నుంచి మకరజ్యోతిని లక్షలాది మంది భక్తులు దర్శించుకున్నారు. జ్యోతి రూపంలో అయ్యప్ప స్వామి దర్శనం ఇవ్వడంతో భక్తులు తన్మయత్వంతో పులకించి పోయారు.‘స్వామియే శరణం అయ్యప్ప’ అంటూ భక్తుల శరణుఘోషతో శబరిగిరులు మార్మోగాయి. మకరజ్యోతి దర్శనం కోసం అయ్యప్ప భక్తులు పెద్దసంఖ్యలో శబరిమల చేరుకున్నారు. సుమారు 18 లక్షల మంది శబరిమలకు వచ్చినట్లు సమాచారం. మకరజ్యోతి దర్శనం నిమిత్తం ట్రావెన్ కోర్ దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది. దర్శనం కోసం పంపా నది, సన్నిధానం, హిల్ టాప్, టోల్ ప్లాజా వద్ద ఏర్పాట్లు చేశారు. భక్తులు ఈనెల 19వరకు అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు వీలు కల్పించారు. ఈనెల 20న పందళ రాజవంశీకులు స్వామివారి దర్శనం తర్వాత ఆలయం మూసివేస్తారు. -
శబరిమలపై బీజేపీ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : శబరిమల అయ్యప్ప ఆలయంలో మహిళలను అనుమతించడం మంచి నిర్ణయమని బీజేపీ ఎంపీ ఉదిత్ రాజ్ సమర్ధించారు. లింగ సమానత్వం సాధించే దిశగా ఇది ముందడుగు వంటిదని అన్నారు. శబరిమలలో మహిళల ప్రవేశాన్ని ఆరెస్సెస్, బీజేపీ వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ ఎంపీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పరిసంఘ్ చైర్మన్‌గా తాను వ్యక్తిగత హోదాలో అయ్యప్ప ఆలయంలో మహిళల ప్రవేశాన్ని సమర్ధిస్తానని ఆయన చెప్పుకొచ్చారు. పురుషుడి పుట్టుకకు మూలమైన స్ర్తీ అపవిత్రురాలు ఎలా అవుతుందని ప్రశ్నించారు. భగవంతుడు సర్వాంతర్యామి అంటే ఆలయం వెలుపలా దేవుడు ఉంటాడని, రాజ్యాంగం దృష్టిలో మహిళలు, పురుషులూ సమానమేనని ఉదిత్ రాజ్ ట్వీట్ చేశారు. సంప్రదాయాలు కాలానుగుణంగా మారుతాయని, గతంలో బాల్య వివాహాలు, సతీసహగమనం సైతం దేశంలో సంప్రదాయాలుగా ఉండేవని తదనంతరం మార్పులు చోటుచేసుకున్నాయని అన్నారు. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించడాన్ని అందరూ స్వాగతించాలని కోరారు. కాగా, అఖిల భారత ఎస్సీ, ఎస్టీ సంఘాల సమాఖ్యకు ఉదిత్ రాజ్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. -
మహిళల ఆలయ ప్రవేశం.. కేరళలో తీవ్ర ఉద్రిక్తత
తిరువనంతపురం : శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం కేరళలో ఉద్రిక్తత రాజేసింది. ఆలయ నిబంధనలు, ఆచారాలు మంటకలిశాయని, కేరళలోని కమ్యూనిస్టు ప్రభుత్వమే దీనికి కారణమంటూ ఆందోళనలు పెల్లుబిగిస్తున్నాయి. కేరళ బంద్‌కు పిలుపునిచ్చిన యూడిఎఫ్ పక్షాలకు బీజేపీ, అన్ని వర్గాల అయ్యప్ప సంఘాలు మద్దతు పలికాయి. బంద్ ప్రభావంతో కేరళ స్తంభించింది. (శబరిమలలో కొత్త చరిత్ర) ఆందోళన బాట పట్టిన బీజేపీ, హిందూ సంస్థల కార్యకర్తలు వీరంగం సృష్టిస్తున్నారు. కోయంబత్తూరు- పాలక్కాడు, నాగర్ కోయిల్- ట్రివేండ్రం సరిహద్దులు మూసివేయటంతో ఇరువైపుల రవాణా బంద్ స్తంభించింది. ఇరువైపుల బారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. దీంతో శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులు తీవ్రస్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. కేరళ వైపు వెళ్లే బస్సులను కోయంబత్తూరు, నాగర్ కోయిల్ లొనే నిలిపివేయటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేరళలో బంద్ ప్రబావం తీవ్రంగా ఉండటంతో ఎప్పుడు ఎలాంటి సంఘటనలు జరుగుతాయోనన్న ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయి. -
‘అయ్యప్ప’కు పొంచి ఉన్న పెను వివాదం
సాక్షి, న్యూఢిల్లీ : శబరిమలలోని అయ్యప్ప ఆలయానికి మరో పెను వివాదం పొంచి ఉంది. ఆ వివాదానికి కూడా సుప్రీం కోర్టు ఉత్తర్వులే కారణం అవుతాయనడంలో సందేహం లేదు. అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయస్కుల మహిళలను అనుమతించాలంటూ సుప్రీం కోర్టు జారీ చేసిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా ప్రస్తుతం వివాదం రగులుతున్న విషయం తెల్సిందే. ఈ వివాదం కారణంగానే సుప్రీం కోర్టు అయ్యప్ప ఆలయానికి సంబంధించి జారీ చేసిన మరో ఉత్తర్వులు మరుగున పడిపోయాయి. శబరిమల పరిసర ప్రాంతాల్లోని అన్ని అక్రమ కట్టడాలను కూల్చివేయాల్సిందిగా కేరళ ప్రభుత్వాన్ని జస్టిస్ మదన్ బీ లోకుర్ నాయకత్వంలోని సుప్రీం కోర్టు బెంచీ నవంబర్ 2వ తేదీన ఉత్తర్వులను జారీ చేసింది. మొదటి వివాదం భక్తుల నమ్మకానికి సంబంధించినది కాగా, పొంచి ఉన్న వివాదం పర్యావరణ పరిరక్షణకు సంబంధించినది. ఒకప్పుడు సన్నిదానంలో శబరిమల ఆలయం చుట్టూ దట్టమైన అడవి ఉండేది. ఇప్పుడు దాని చుట్టూ 63.5 ఎకరాల పరిధిలో చెట్లుపోయి కాంక్రీటు జంగిల్ ఆవిర్భవించింది. సుప్రీం కోర్టు ఉత్తర్వులను అమలు చేయాలంటే ఈ కాంక్రీటు జంగిల్లో 90 శాతం కట్టడాలను కూల్చాల్సిందే. శబరిమల ఆలయం పరిసరాల్లో పర్యావరణ పరిస్థితులను పరిరక్షించాలంటూ కోజికోడ్‌కు చెందిన సామాజిక కార్యకర్త శోభీంద్రన్ నాలుగేళ్ల క్రితం సుప్రీం కోర్టులో పిల్ వేశారు. దాంతో శబరిమల ఆలయం పరిసరాల్లో పర్యావరణానికి హాని కలిగించే అక్రమ కట్టడాలను పరిశీలించి నివేదిక సమర్పించాల్సిందిగా ఓ కేంద్ర కమిటీని సుప్రీం కోర్టు ఆదేశించింది. అటవి ప్రాంతాల్లో గనులు, పరిశ్రమలకు సంబంధించి సుప్రీం కోర్టు ఆదేశాల అమలును పర్యవేక్షించే కమిటీయే ఇది. ఈ కమిటీ ఇటీవలనే సుప్రీం కోర్టుకు సమర్పించిన నివేదికలో అనేక భయానక వాస్తవాలు బయట పడ్డాయి. శబరిమల ఆలయం భక్తుల నుంచి వస్తున్న భారీ ఆదాయానికి ఆశపడి 1998లో కేరళ అసెంబ్లీ ఆమోదించిన ఆలయం మాస్టర్ ప్లాన్‌నే కాకుండా ఆ తర్వాత 2007లో తీసుకొచ్చిన సవరణ ప్లాన్‌ను కూడా ఉల్లంఘించి కేరళ దేవసం బోర్డు పలు అక్రమాలను నిర్మించిన విషయాన్ని కమిటీ నివేదిక వెల్లడించింది. శబరిమల ఆలయ పరిసర కొండల్లో పుడుతున్న పంబా నదీ ప్రవాహాన్ని దెబ్బతీసేలా నది ఒడ్డునే కాకుండా నది ప్రవహించే ప్రదేశంలో కూడా అక్రమ కట్టడాలు నిర్మించారట. అందుకనే గత ఆగస్టులో వచ్చిన పంబా వరదల వల్ల రెండంతస్థుల మురుగుదొడ్ల భవనాలు, భక్తుల క్లాక్‌రూమ్‌లు, ఓ రెస్టారెంట్ కూలిపోయాయని నివేదిక తెలిపింది. ఆ మరుగుదొడ్ల స్థానంలో మరోచోట మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టినా అవి ఇంకా పూర్తి కాలేదు. పర్యవసానంగా భక్తులు భహిర్భూమిని ఆశ్రయిస్తున్నారట. పంబా నది కాలుష్యం కాకుండా నియంత్రించేందుకు రెండు సివరేజ్ ప్లాంట్లను నిర్మించినా అందులో ఒకదాన్నే ఆపరేట్ చేస్తున్నారు. దానికి కూడా అన్ని మరుగు దొడ్ల కాల్వలను అనుసంధానించలేదు. కొన్ని కాల్వలు నేరుగా పంబా నదిలో కలుస్తున్నాయి. పైగా ఆగస్టులో వచ్చిన వరదల్లో ఈ రెండు సీవరేజ్ ప్లాంట్లు, మరుగుదొడ్డి కాల్వలు దెబ్బతిన్నాయి. ఆ కాల్వలు కూడా ఒవర్ ఫ్లోఅయి నేరుగా పంబా నదిలో కలుస్తున్నాయి. పర్యవసానంగా నీటిలో ‘ఫేకాల్ కోలిఫామ్ బ్యాక్టీరియా’ కనీసం ఊహకు కూడా అందనంతగా పెరిగిపోయి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. స్నానం చేయడానికి పనికి వచ్చే నీటిలో ‘ప్రతి 100 ఎంఎల్ నీటికి 2,500 ఎంపీఎన్’ కన్నా ఈ బ్యాక్టీరియా తక్కువ ఉండాలట. 2014–2015లో సేకరించిన శాంపిల్ నీటిలోనే ‘100 ఎంల్ నీటికి బ్యాక్టీరియా 13,20,000 ఎంపీఎన్’ ఉందట. అంటే ఉండాల్సిన దానికన్నా 500 రెట్లు ఎక్కువ. సీవరేజ్ ప్లాంటులు, మురుగు కాల్వలు దెబ్బతిన్న ప్రస్తుత పరిస్థితుల్లోబ్యాక్టీరియా మరింత ప్రమాదకరంగా ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. అడవి పందులు వచ్చి నీటిని తాగుతున్నాయంటేనే అందులో ఈ బ్యాక్టీరియా ఎక్కువగా ఉందని అర్థం అట. అయ్యప్ప ఆలయంకు వచ్చే భక్తులు విధిగా ఈ పంబా నదిలో స్నానం ఆచరిస్తారు. అంతేకాకుండా పట్టణం మిట్ట, అలప్పూజ, కొట్టాయం జిల్లాల్లోని దాదాపు 50 లక్షల మంది ప్రజలు తాగునీటి కోసం ఈ నదిపైనే ఆధారపడుతున్నారు. నవంబర్ 17వ తేదీన ప్రారంభమైన ‘మండల మకరవిలక్కు’ సీజన్లో భక్తుల రద్దీ మరింత పెరగడం వల్ల పంబా నదికి వాటిల్లే కాలుష్యాన్ని అంచనా కూడా వేయలేకపోతున్నామని పంబా పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి నక్కే సుకుమారన్ నాయర్ లాంటి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము ఎన్ని అభ్యంతరాలు చెప్పినా వినకుండా నది ఒడ్డుకు 50 మీటర్ల దూరంలోనే కేరళ దేవసం బోర్డు పనుల నిర్వహణా భవనాన్ని కూడా నిర్మించారని ఆయన తెలిపారు. నీలక్కల్ వద్ద భక్తుల సౌకర్యాల కోసం 2007లో సవరించిన మాస్టర్ ప్లాన్ ప్రకారం 250 ఎకరాలను కేరళ ప్రభుత్వం కేటాయించినా పట్టించుకోకుండా సన్నిధానంలోనే అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని నాయర్ ఆరోపించారు. గత నెలలోనే సన్నిదానంలో 52 గదుల అతిథి గృహాన్ని కేరళ దేవసం మంత్రి కే. సురేంద్రన్ ప్రారంభించారు. సన్నిదానం, పంబా ప్రాంతాల్లోనే కాకుండా నీలక్కల్ వద్ద కూడా అక్రమ నిర్మాణాలు ఉన్నాయని కేంద్ర కమిటీ పేర్కొంది. వాటన్నింటిని కూల్చివేయాల్సిందిగా కేరళ ప్రభుత్వాన్ని సుప్రీం ఆదేశించింది. సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాలను అమలు చేయడం తన కర్తవ్యమని అయ్యప్ప ఆలయంలోకి మహిళలను అనుమతించేందుకు ప్రయత్నిస్తున్న కేరళ ప్రభుత్వం కూల్చివేతల విషయంలో కూడా సుప్రీం కోర్టు ఉత్తర్వులకు కట్టుబడి ఉంటుందా? కూల్చివేతల వల్ల భక్తులకు ఎదురయ్యే ఇబ్బందులను ఎలా ఎదుర్కొంటుంది? భక్తులుగానీ, భక్తుల తరఫున హిందూ సంఘాలుగానీ కూల్చివేతలను అనుమతిస్తాయా? -
అయ్యప్పపై మరో తీవ్ర వివాదం
సాక్షి, న్యూఢిల్లీ : శబరిమలలోని అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయస్కుల మహిళలు అనుమతించాలంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై ఓ పక్క రాదాంతం జరుగుతుండగా మరో వివాదం రాజుకుంది. ఈ ఆలయం తరతరాలుగా తమదని, తమ ఆలయాన్ని తమకు అప్పగించాలని, అలా జరగక పోయినట్లయితే సుప్రీం కోర్టు వరకైనా వెళ్లి సాధించి తీరుతామని కేరళకు చెందిన మాల ఆర్యులు డిమాండ్ చేస్తున్నారు. ‘12 శతాబ్దానికి చెందిన శబరిమలలోని అయ్యప్ప ఆలయం మాల ఆర్యులది. పండలం రాజ కుటుంబం 1800లో దీన్ని ఆక్రమించుకున్నారు. ఆలయంలోని పలు దేవతా విగ్రహాలను తొలగించి వాటిని అడవుల్లో విసిరేశారు. వాటి స్థానంలో కొత్త విగ్రహాలను ప్రతిష్టించారు. చరిత్రగతిలో అడవుల్లో పడేసిన విగ్రహాలు కరిమల, పొన్నంబాల్మేడు, కొత్తకుతితార, నీలక్కల్, తలపరమల అడవుల్లో దొరికాయి. 1904లో పండలం రాజు ఆంధ్రప్రదేశ్‌లోని బ్రాహ్మణ వర్గానికి చెందిన తాజమన్ కుటుంబాన్ని తీసుకొచ్చి ప్రధాన పూజారి బాధ్యతలను అప్పగించారు. అప్పటి వరకు ద్రావిడ పద్ధతిలో జరిగిన పూజాది కార్యక్రమాలను మార్చివేసి బ్రాహ్మణ పద్ధతులను ప్రవేశ పెట్టారు. గతంలో అయ్యప్పకు పూజారులుగా వ్యవహరించిన మాల ఆర్యులు తేనతోనే అభిషేకం చేసేవారు. ఆ స్థానంలో బ్రాహ్మణ పూజారులు పాలతోని అభిషేకం చేయడం ప్రారంభించారు. 1950లో ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ఆలయ పాలనా బాధ్యతలను స్వీకరించింది. ‘మాకు ఈ ఆలయాన్ని తిరిగి అప్పగించాల్సిందిగా ముందుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతాం. ఆ తర్వాత అవసరమైతే సుప్రీం కోర్టు వరకైనా వెళ్లి న్యాయం సాధిస్తాం. అన్ని వయస్కుల మహిళలను అనుమతించాలంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఆందోళనలు చేయడం మా మంచికే జరిగిందేమో! మా గొంతును కూడా ఈ ప్రపంచానికి వినిపించేందుకు అవకాశం దొరికింది. మాకు ఆలయాన్ని అప్పగించినట్లయితే సుప్రీం కోర్టు ఉత్తర్వులను అమలు చేస్తాం. మా గుండెల నిండా ఎప్పుడూ గూడుకట్టుకొనే ఉండే మా అయ్యప్ప మహిళల పట్ల ఎప్పుడూ వివక్షత లేదు’ అని ఐక్య మాల ఆర్య మహా సభ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి పీకే సజీవ్ చెప్పారు. ఆయన అయ్యప్ప ఆలయంపై విస్తృత పరిశోధనలు జరిపారు. అయ్యప్ప ఎవరి పుత్రుడు ? శబరిమల ఆలయానికి సమీపంలోని పొన్నంబాలమేడు గుహలో కందన్, కారతమ్మ దంపతులకు అయ్యప్ప జన్మించారన్నది మాల ఆర్యులు నమ్మకం. అయ్యప్ప ఆలయం మొట్టమొదటి పూజారి కరిమల ఆర్యన్ అని, ఆయన్నే ఆలయానికి శంకుస్థాపన చేశారని, ఆఖరి పూజారి కోచుకుట్టి కోచురామన్ అని, వారి బంధువులు ఇప్పటికీ కొట్టాయం జిల్లా ముండక్కయమ్‌లో నివసిస్తున్నారని సజీవ్ తెలిపారు. దక్షిణ కేరళలోని పట్టణంతిట్ట, కొట్టాయం, ఇదుక్కి ప్రాంతాల్లోని ఎత్తైన పర్వతాల వాలున దాదాపు 30 వేల మంది మాల ఆర్యులు నివసిస్తున్నారు. వారి రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీలుగా పరిగణిస్తోంది. వారి ఇళ్లన్నీ విసిరేసినట్లుగా దూర, దూరంగా కొండ చెరియ వాలుకు ఆనుకొని ఉన్నాయి. అలా వాళ్ల ఊళ్లన్ని ఎత్తైన కొండ శిఖరాల వాలునే ఉండేవని, అందుకే వారికి మాల ఆర్య (కింగ్ ఆఫ్ ది మౌంటేన్) అని పేరు వచ్చిందని 1883లోనే ప్రచురించిన ‘నేచర్ లైవ్ ఇన్ ట్రావెంకోర్’ పుస్తకంలో శామ్యూల్ మతీర్ రాశారు. ఇప్పటికే కరిమల, పొన్నంబాలమేడు, నీలక్కల్ మహదేవ్ ఆలయాలపై హక్కుల కోసం పోరాడుతున్న ఐక్య మాల ఆర్య మహా సభ ఇప్పుడు అయ్యప్ప ఆలయాన్ని తమ పోరాటంలో భాగం చేసింది. కేరళలో దాదాపు వంద ఆలయాలపై ఆదివాసీ, దళిత సంఘాలు తమ హక్కుల కోసం పోరాడుతున్నాయి. బ్రాహ్మణ పూజారులకు ముందు మాల ఆర్య పూజారులు ఉండేవారని, వారు అయ్యప్పకు తేనాభిషేకం చేసేవారని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అక్టోబర్ 23వ తేదీన పట్టణంతిట్టలో జరిగి బహిరంగ సభలో వ్యాఖ్యానించడం గమనార్హం. చరిత్రగతిలో ఆదివాసీల ఆలయాలు అన్యాక్రాంతం అవడం, ధ్వంసమవడం తెల్సిందే. తూర్పు గోదావరి జిల్లా తలుపులమ్మా, కొడగులోని తాళకావేరి, చిక్‌మగలూరులోని బాబా బుడాన్ గిరి టెంపల్, తిరుపతిలో వేంకటేశ్వర స్వామి ఒకప్పడు గిరిజన దేవాలయాలన్న వివాదం ఉంది. తమ దేవుళ్ల పక్కన అన్య మతస్థులను పేర్కొనే సంస్కృతి ద్రవిడులదని, గిరిజనులు లేదా ఆదివాసీల సంప్రదాయం కూడా ద్రవిడ సంస్కృతికి దగ్గరగా ఉంటుందని చరిత్రకారులు చెబుతారు. అందుకేనేమో అయ్యప్ప ముస్లిం మిత్రుడు వావర్ మసీదు అయ్యప్పకు దగ్గరలోనే ఉంది. అయ్యప్పను సందర్శించే భక్తుల్లో 80 శాతం మంది 40 కిలోమీటర్ల దిగువనున్న వావర్ మసీదు సందర్శించాకే అయ్యప్ప వద్దకు వెళతారు. వేంకటేశ్వరుడి భార్య బీబీ నాంచారమ్మ ముస్లిం మహిళ అన్న విషయం తెల్సిందే. వేంకటేశ్వరుడు ఒకప్పటి చెంచుల ఆరాధ్య దైవంగా చరిత్రకారులు చెబుతారు. శబరిమల; కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు -
‘దానికోసం ఇంత చేయాలా’
సాక్షి, న్యూఢిల్లీ : కేరళలోని శబరిమల ఆలయంలోకి హిందూ మహిళలే కాదు.. అన్ని మతాల స్త్రీలు వెళ్లొచ్చునని కేరళ హైకోర్టు సోమవారం తీర్పు వెలువరించిన నేపథ్యంలో కేంద్రమంత్రి కేజే అల్ఫోన్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నడూ మసీదులు, చర్చిలకు వెళ్లని మహిళలు శబరిమలకు వెళ్లేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. 10 సెకండ్లపాటు టీవీలో కనిపించడానికి, కెమెరాలకు పోజుల్విడానికి పవిత్రమైన అయ్యప్ప గుడిమెట్లు ఎక్కడానికి పూనుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయ పవిత్రతను కాలరాయాలా? ‘ఎన్నడూ మసీదువైపు కన్నెత్తి చూడని ఒక ముస్లిం యువతి శబరిమల అయ్యప్ప ఆలయానికి వెళ్లి తీరతానని అంటోంది. చర్చ్ అంటే ఏంటో తెలియని మరో క్రిస్టియన్ అమ్మాయి శబరిమల యాత్ర చేస్తానంటోంది. ఎంత విడ్డూరం. పాపులర్ అయిపోవడానికీ, కెమెరాల్లో కనిపించడానికి ఇంత చేయాలా? దానికోసం ఆలయ పవిత్రతను కాలరాయాలా’అని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్టోబర్ 19న శబరిమల యాత్ర చేపట్టిన రేహానా ఫాతిమాను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 5 కిలోమీటర్లు యాత్ర చేసి అయ్యప్ప ఆలయ ప్రాంతానికి చేరుకున్న అనంతరం తీవ్ర ఉద్రికత్తలు తలెత్తడంతో ఫాతిమాను పోలీసులు అడ్డుకుని వెనక్కి పంపిన సంగతి తెలిసిందే. కాగా, అన్ని వయసుల మహిళలు శబరిమల అయ్యప్ప ఆలయానికి వెళ్లొచ్చునని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన తర్వాత ఇప్పటి వరకు 12 మంది మహిళలు శబరిమల ఆలయంలోకి వెళ్లేందుకు యత్నించారు. అయితే, తీవ్ర నిరసనలు వ్యక్తమవడంతో భద్రతాబలగాలు వారిని వెనక్కి పంపించివేశాయి. బెదిరింపులు రావడంతో మరి కొందరు తమ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. (చదవండి : శబరిమలకు వెళ్లనున్న అమిత్ షా!) -
శబరిమల వివాదంపై రజనీకాంత్ స్పందన
చెన్నై: శబరిమల ఆలయంలో ఎన్నో ఏళ్లుగా పాటిస్తున్న ఆచారాలను గౌరవించాలని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పేర్కొన్నారు. శబరిమల ఆలయంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు చెబుతూనే... శబరిమల ఆలయం మతపరమైన విశ్వాసాలతో ముడిపడిందని, ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. తాను నటిస్తున్న ‘పేట్టా’ చిత్రం షూటింగ్ పూర్తి కావడంతో రజనీకాంత్ లక్నో నుంచి విమానంలో చెన్నైకి చేరుకున్నారు. ఈ సందర్భంగా చెన్నై విమానాశ్రయంలో రజనీకాంత్ మీడియాతో మాట్లాడుతూ.. మహిళలకు సమాన హక్కులు కల్పించాలన్న విషయంలో ఎలాంటి భిన్నాభిప్రాయాలు అవసరం లేదన్నారు. అయితే ఒక్కో ఆలయానికి ఒక్కో ఆచారం ఏళ్లుగా ఉంటోందని, ఇది నమ్మకానికి సంబంధించిన వ్యవహారమన్నారు. ఈ విషయాల్లో ఎవరూ జోక్యం చేసుకోవడం సరికాదని అన్నారు. అటు దేశాన్ని కుదిపేస్తున్న మీటూ వివాదంపైనా రజనీకాంత్ స్పందించారు. ‘మీటూ’ ఉద్యమంతో మహిళలకు మేలు జరుగుతుందన్నారు. అయితే దీన్ని ఎవరూ దుర్వినియోగం చేయకూడదని చెప్పారు. సరైన రీతిలో మీటూను బాధిత మహిళలు వినియోగించుకోవాలన్నారు. తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను వైరముత్తు తోసిపుచ్చారని...తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు అవసరమైన ఆధారాలు తన దగ్గర ఉన్నాయని కూడా వైరముత్తు చెప్పారని గుర్తుచేశారు. ఈ ఏడాది డిసెంబర్ 12వ, తేదీన పార్టీ, ఎజెండాను ప్రకటిస్తానని తాను చెప్పలేదని రజనీకాంత్ స్పష్టం చేశారు. -
శబరిమల ఆలయ కమిటీ కీలక నిర్ణయం..!
తిరువనంతపురం : శబరిమల ఆలయ కమిటీ బోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తున్నట్లు ట్రావెన్కోర్ దేవాస్థానం బోర్డు (టీడీబీ) ప్రకటించింది. శుక్రవారం జరిగిన కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. న్యాయస్థానం తీర్పు అనంతరం గత బుధవారం ఆలయం తెరుచుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీం తీర్పుకు వ్యతిరేకంగా ఆలయ కమిటీతో సహా పలు సంఘాలు మహిళల ప్రవేశంను అడ్డుకున్నాయి. అంతటితో ఆగకుండా ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన మహిళలపై రాళ్లతో దాడులకు పాల్పడ్డారు. దీంతో శబరిమలలో గత మూడు రోజులుగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాజకీయ దుమారం.. పరిస్థితి మరింత హింసాత్మకంగా మారుతుండంతో సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని ఆలయ కమిటీ నిర్ణయించింది. ఇదిలా ఉండగా కేరళ ప్రభుత్వం మాత్రం సుప్రీం తీర్పును అమలు చేసి తీరుతామని.. తీర్పును తాము స్వాగతిస్తున్నామని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా శబరిమలపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. ఆర్ఎస్ఎస్, బీజేపీకి చెందిన వారే ఈ దాడులకు పాల్పడుతున్నారని కేరళ సీఎం పినరయి విజయన్ ఆరోపించారు. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలని బీజేపీ నేతలు కుట్రపూరితంగా వ్యవహిస్తున్నారని ఆయన అన్నారు. బాబ్రీ మసీదు కూల్చీవేత తరహాలో కేరళలో కూడా విధ్వంసం సృష్టించాలని బీజేపీ ప్రయత్నిస్తోందని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. కేవలం కాషాయరంగు దుస్తులు దరించిన వ్యక్తులే మహిళఫై రాళ్లు రువ్వుతున్నారని.. గతంలో కూడా ఇలాంటి సంఘటనలకు వారు పాల్పడ్డారని అన్నారు. చదవండి : అయ్యప్పల ‘రివ్యూ’కు మోక్షం లేదా!? -
శబరిమల ఆలయ సమీపంలోకి మహిళలు..!
-
శబరిమల ఆలయ సమీపంలోకి మహిళలు..!
నిలక్కళ్/పత్తనంతిట్ట/పంబ: శబరిమల ఆలయ పరిసరాల్లో మూడో రోజు కూడా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ సుప్రీం వెలువరించిన తీర్పుకు వ్యతిరేకంగా భక్తులు ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. మాస పూజల కోసం బుధవారం నుంచి ఐదు రోజుల పాటు ఆలయాన్ని తెరచి ఉంచనున్నారు. ఈ నేపథ్యంలో పలువురు మహిళలు ఆలయంలోకి వెళ్లేందుకు కేరళ చేరుకున్నారు. కాగా వారు ఆలయంలోకి ప్రవేశించకుండా భక్తులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మహిళలను ఆలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటామని వారు హెచ్చరిస్తున్నారు. బుధ, గురు వారాల్లో ఆలయ పరిసరాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. పోలీసులకు, భక్తులకు మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసకుంది. అన్ని వయసుల మహిళలను ఆలయంలోకి అనుమతించడానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో కేరళలో టెన్షన్ వాతావరణం చోటుచేసకుంది. మరోవైపు శుక్రవారం 250 మంది పోలీసుల బందోబస్తు మధ్య బుల్లెట్ ఫ్రూప్ జాకెట్, హెల్మెట్ ధరించిన ఇద్దరు మహిళలు ఆలయ సమీపంలోకి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. వారిలో ఒకరు జర్నలిస్టు కాగా, మరోకరు మహిళ కార్యకర్త ఉన్నారు. భక్తులు అడ్డుకోవడంతో పోలీసులు వారిని శబరిమల పోలీసు కార్యాలయానికి తరలించారు. భక్తుల నిరసనల నేపథ్యంలో లోనికి అనుమతించడం సాధ్యం కాదని పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మహిళా జర్నలిస్టులు మాత్రం తాము దర్శనం చేసుకునే ఇక్కడి నుంచి వెళ్తామని పట్టుబడుతున్నట్టు సమాచారం. ఐజీ శ్రీజిత్ వారిని అక్కడి నుంచి వెనక్కి పంపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆలయ ప్రధాన పూజారి కూడా మహిళల చర్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రావెన్కోర్ ఆలయ కమిటీ ఈరోజు భేటీ కానుంది. కాగా, మహిళా జర్నలిస్టుల చర్యలపై కేరళ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. భక్తుల ముసుగులో అలజడి సృష్టించవద్దని పేర్కొంది. నిరసనల నేపథ్యంలో వారిని వెనక్కి వెళ్లాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేసింది. గురువారం కూడా ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన న్యూయార్క్ టైమ్స్‌కు ఇద్దరు మహిళ జర్నలిస్టులను భక్తుల ఆందోళనల నేపథ్యంలో బలవంతంగా వెనక్కి పంపిచారు. -
శబరిమలలో కొనసాగుతున్న ఉద్రిక్తత.. భగవత్ స్పందన!
నిలక్కళ్/పత్తనంతిట్ట/పంబ : శబరిమల ఆలయం పరిసర ప్రాంతాల్లో గురువారం కూడా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళా భక్తులను అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ.. భక్తులు చేపట్టిన ఆందోళన బుధవారం హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆందోళన చేపట్టిన భక్తులపై పోలీసులు లాఠీచార్జ్ జరపడాన్ని నిరసిస్తూ.. గురువారం బంద్ చేపట్టారు. హిందూ సంఘాలు, భక్తుల బంద్‌తో కేరళలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కర్ణాటక, తమిళనాడు బస్సులను రాష్ట్ర సరిహద్దుల్లోనే నిలిపివేశారు. బంద్‌తో కేరళ అంతటా స్తంభించిపోయింది. అనేక ప్రాంతాల్లో దుకాణాలు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. రుతుస్రావం అయ్యే వయస్సుల్లో ఉన్న మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించకుండా నిషేధం ఉండగా, ఆ నిషేధాన్ని గత నెల 28న ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు తీర్పుచెప్పింది. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ కేరళలో గత కొన్నిరోజులుగా ఉధృతమైన నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. హిందూ సంస్థలు చేపట్టిన బంద్‌కు బీజేపీ, దాని అనుబంధ పార్టీలు మద్దతు ఇవ్వగా.. కాంగ్రెస్ పార్టీ బంద్‌లో పాల్గొనకపోయినప్పటికీ.. సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ.. నిరసన ప్రదర్శనల్లో పాల్గొంటున్నట్టు తెలిపింది. మోహన్ భగవత్ స్పందన సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో శబరిమలలో కొనసాగుతున్న ఆందోళనలపై ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ స్పందించారు. సమాజం, మహిళలు అంగీకరించి ఎంతోకాలంగా పాటిస్తున్న సంప్రదాయాలను పట్టించుకోకుండానే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని, శబరిమలలోకి మహిళలను అనుమతించే విషయంలో మతపెద్దల అభిప్రాయాలను, కోట్లాదిమంది భక్తుల విశ్వాసాలను పరిగణనలోకి సుప్రీంకోర్టు తీసుకోలేదని ఆయన అన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. అయోధ్యలో రామమందిరాన్ని వెంటనే నిర్మించాలని, ఇందుకోసం అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకురావాలని డిమాండ్ చేశారు. -
మహిళలే నిరసిస్తే ఎలా అయ్యప్పా!
సాక్షి, న్యూఢిల్లీ: శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయస్కుల మహిళలను అనుమతించాల్సిందేనంటూ సుప్రీం కోర్టు సెప్టెంబర్ 28వ తేదీన సంచలన తీర్పును ఇచ్చిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా అయ్యప్ప ఆలయంలో మహిళలకు తగిన సౌకర్యాలు కల్పిస్తామంటూ కేరళ ప్రభుత్వం చేసిన ప్రకటనను వ్యతిరేకిస్తూ అక్టోబర్ రెండవ తేదీన ప్రారంభమైన నిరసన ప్రదర్శనలు మంగళవారం నాటికి ఊపందుకున్నాయి. ఈ రోజు నుంచి సుప్రీం కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా కేరళ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఆందోళనలను తీవ్రతరం చేయాలని కోచిలో సోమవారం నాడు జరిగిన 41 హిందూ సంఘాల నేతలు నిర్ణయించారు. వీరిలో ఆరెస్సెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీ. గోపాలన్కుట్టీ కూడా పాల్గొన్నారు. ఆందోళనా కార్యక్రమాల కోసం ఆరెస్సెస్ ఓ కార్యాచరణ సమితి కూడా ఏర్పాటు చేసింది. రాష్ట్ర బీజేపీ శాఖ కూడా ఆందోళనకు మద్దతు ప్రకటించింది. (శబరిమలలో మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు) సెప్టెంబర్ 28వ తేదీన సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఆరెస్సెస్ నాయకుడు పీ. గోపాలన్ కుట్టీ హర్షం వ్యక్తం చేయడం గమనార్హం. ‘సుప్రీం కోర్టు తీర్పును సంఘ్ పరివార్ శిరసావహిస్తోంది. కులం, లింగ వివక్ష లేకుండా ఆలయంలోకి వెళ్లే సమాన హక్కు భక్తులందరికి ఉండాల్సిందే’ అని వ్యాఖ్యానించారు. బీజేపీ కేరళ అధ్యక్షుడు పీఎస్ శ్రీధరన్ పిళ్లై మాట్లాడుతూ ‘ఆలయాల్లోకి మహిళల ప్రవేశంపై వివక్ష చూపడాన్ని బీజేపీ ఎంత మాత్రం అనుమతించదు’ అని వ్యాఖ్యానించారు.‘మహిళల ప్రవేశాన్ని నియంత్రిస్తున్న ఆలయ యజమాన్యాల మనస్తత్వం మారాలి’ అని ఆరెస్సెస్ ప్రధాన కార్యదర్శి సురేశ్ భయ్యాజీ జోషీ గతంలో పలుసార్లు వ్యాఖ్యానించారు. (తీర్పులు కాదు..సంప్రదాయాలే ముఖ్యం!) ఓటు బ్యాంకు రాజకీయాలే సుప్రీం కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా అక్టోబర్ రెండున ప్రారంభమైన నిరసన ప్రదర్శనలు మరుసటి రోజుకే ఊపందుకొని వేల సంఖ్యలో ప్రజలు తరలి వస్తుండడంతో ఆరెస్సెస్, బీజేపీ నాయకులు ఒక్కసారిగా మాట మార్చారు. ఆందోళన బాట పట్టారు. ముంబైలోని హాజి అలీ దర్గాలోకి, శని శింగ్నాపూర్ ఆలయాల్లో మహిళలను అనుమతించాలంటూ బాంబే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేసినప్పుడు అదే పార్టీ ఇక్కడ అందుకు విరుద్ధంగా వ్యవహరించడమంటే ద్వంద్వ ప్రమాణాలు పాటించడమే. పలు రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ, ఆరెస్సెస్‌లు ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయని కేరళ ముఖ్యమంత్రి విజయన్ ఆరోపించారు. ఈ రోజు చర్చలకు రావాల్సిందిగా ఆయన పంపిన ఆహ్వానాన్ని ఆందోళన చేస్తున్న హిందూ సంఘాలన్నీ తిరస్కరించాయి. అయ్యప్ప సేవా సంఘంతో మొదలు సుప్రీం కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా అక్టోబర్ రెండవ తేదీన ఏ రాజకీయ పార్టీతోని సంబంధంలేని అఖిల భారత అయ్యప్ప సేవా సంఘం పండలంలో శాంతియుతంగా ప్రదర్శన జరిపింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నాయర్ సర్వీస్ సొసైటీ ‘నామ జప యాత్ర’ పేరిట నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. శబరిమల పూజారుల కుటుంబానికి చెందిన రాహుల్ ఈశ్వర్ నాయకత్వంలోని అయ్యప్ప ధర్మసేన, విహెచ్పీ నుంచి బహిష్కతుడైన ప్రవీణ్ తొగాడియా స్థాపించిన అంతరాష్ట్రీయ హిందూ పరిషత్ సహా దాదాపు హిందూ సంస్థలు నేడు నిరసన ప్రదర్శనల్లో పాల్గొంటున్నాయి. (శబరిమల తీర్పును సవాల్ చేయం..) ఈ ప్రదర్శనల్లో మగవారికన్నా మహిళలే ఎక్కువగా పాల్గొనడం మరీ విచిత్రం. రాష్ట్రంలో 28 శాతం జనాభా కలిగిన ఎఝావా సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ‘శ్రీ నారాయణ ధర్మ పరిపాలనా యోగం’తోపాటు ఆదివాసీ, దళిత సంఘాలు నిరసన ప్రదర్శనల్లో పాల్గొనక పోవడమూ విÔó షమే. నిరసన ప్రదర్శనలను ఈ సంఘాల వారు అగ్రవర్ణాల ఆదిపత్య రాజకీయాలుగా వర్ణిస్తున్నాయి. చదవండి: శబరిమల: ‘మైలాచారాన్ని’ మరచిన సుప్రీంకోర్టు అయ్యప్పల ‘రివ్యూ’కు మోక్షం లేదా!? -
అయ్యప్పల ‘రివ్యూ’కు మోక్షం లేదా!?
సాక్షి, న్యూఢిల్లీ : కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయంలోకి రుతుస్రావం వయస్కుల మహిళలను అనుమతిస్తూ సుప్రీం కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును సమీక్షించాల్సిందిగా కోరుతూ జాతీయ అయ్యప్ప భక్తుల సంఘం అధ్యక్షుడు శ్యాలజ విజయన్ సోమవారం నాడు సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయస్కుల ఆడవారిని అనుమతించాలని కోరుతూ ఇంతకుముందు పిటిషన్లు వేసిన వారు, అయ్యప్ప భక్తులు కారని, అయ్యప్ప నైష్టిక బ్రహ్మచారి అని నమ్మే భక్తుల నమ్మకాలను కాదనే హక్కు బయట వారికి లేదని రివ్యూ పిటిషన్లో వాదించారు. ఇదేమి కొత్త వాదన కాదు. జస్టిస్ ఇందు మల్హోత్ర మొన్న నలుగురు సభ్యుల సుప్రీం ధర్మాసనం ఇచ్చిన తీర్పులోనే తన అభిప్రాయంగా చెప్పారు. ఎవరి మతరమైన నమ్మకాలు వారివని, మతపరమైన నమ్మకాలను కాదనడం రాజ్యాంగంలోని 25, 26 అధికరణలు కల్పిస్తున్న మత హక్కులను ఉల్లంఘించడమేనని కూడా ఆమె అభిప్రాయపడ్డారు. ఆమె వాదనను తిరస్కరిస్తూ మిగతా ముగ్గురు జడ్జీలు మహిళలకు అనుకూలంగా తీర్పు చెప్పారు. అలాంటప్పుడు ఆమె వాదననే ప్రాతిపదికగా తీసుకొని వేసిన రివ్యూ పిటిషన్‌ను కోర్టు స్వీకరిస్తుందా? విచారిస్తుందా? స్వీకరించి, విచారించినా భిన్నమైన తీర్పు వెలువడే అవకాశం ఉందా? అన్నదే ఇక్కడ చర్చ. సాధారణంగా పాత వాదననే ప్రాతిపదికగా తీసుకునే పిటిషన్ సర్వ సాధారణంగా విచారణ యోగ్యం కాదు. సుప్రీం కోర్టు సంప్రదాయం ప్రకారం తీర్పు ఇచ్చిన బెంచీనే రివ్యూ పిటిషన్‌ను విచారించాల్సి ఉంటుంది. విచారణ యోగ్యమని సదరు బెంచీ అభిప్రాయపడినట్లయితే అదే బెంచీ దాన్ని విచారించవచ్చు. లేదా ప్రధాన న్యాయమూర్తి సూచన మేరకు మరో బెంచీకి అప్పగించవచ్చు. ఇటీవల తీర్పు ఇచ్చిన బెంచీలో మాజీ ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాతోపాటు జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ చంద్రఛూడ్, జస్టిస్ రోహింటన్ నారిమన్, జస్టిస్ ఇందు మల్హోత్రలు ఉన్నారు. వారిలో దీపక్ మిశ్రా ఒక్కరే పదవి విరమణ చేశారు. ఆయన స్థానంలో బెంచీలోకి కొత్త వారు వస్తారు. కొత్తగా వచ్చే జస్టిస్ ఇందు మల్హోత్ర అభిప్రాలతో ఏకీభించినప్పటికీ విభేదించేవారు చంద్రఛూడ్, నారిమన్, ఖాన్‌విల్కర్‌లు ఉంటారు కదా! ఇక తీర్పు తారుమారే అవకాశం ఎక్కడిది? కొత్త వాదోపవాదాల కారణంగా న్యాయమూర్తుల అభిప్రాయాలు మారుతాయనుకుంటే తీర్పు ఎలా ఉండబోతుంది? హోమో సెక్యువాలిటీని నేరంగా పరిగణిస్తున్న భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని 377వ సెక్షన్‌ను కొట్టివేస్తూ మాజీ ప్రధాన న్యాయమూర్తి ఓ వాదనను తీసుకొచ్చారు. ‘నాన్ రెట్రోగెషన్’ దృక్పథం గురించి ఆయన ప్రస్తావించారు. అంటే, ప్రతీగమనం చేసి అంతకుముందున్న చోటుకన్నా అధ్వాన్నమైన చోటుకు రాకూడదనేది అర్థం. ఈ అర్థాన్ని విడమర్చి చెబుతూ రాజ్యాంగం స్ఫూర్తి ప్రకారం ఏ తీర్పయినా అంతకుముందు తీర్పుకన్నా మెరుగ్గా ఉండాలన్నారు. అందుకని ఓసారి కల్పించిన హక్కులను కోర్టులు కూడా వెనక్కి తీసుకోలేవని చెప్పారు. ఆయన మాటలను ఇక్కడ పరిగణలోకి తీసుకుంటే శబరిమల ఆలయంలోకి రుతుస్రావ వయస్కులైన మహిళలకు మొన్ననే కల్పించిన హక్కులను వెనక్కి తీసుకునే హక్కు సుప్రీం కోర్టుకు లేనట్లే. ఈ లెక్కన రివ్యూ పిటిషన్ కారణంగా తీర్పు మారే అవకాశమే లేదు. -
శబరిమల ప్రసాదానికి కొత్త రూపు
సాక్షి, తిరువనంతపురం : అయ్యప్పస్వామి ఆలయం శబరిమల ప్రసాదంలో భక్తులకు ఇచ్చే అప్పం, అరవణలో మార్పు చేర్పులు చేపట్టనున్నారు. తిరుపతి వెంకన్న, పళనిలోని మురగ ఆలయ ప్రసాదాలైన లడ్డు, పంచామృతాల తయారీలో సూచనలు చేస్తున్న సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చి ఇనిస్టిట్యూట్ (సీఎఫ్టీఆర్ఐ) శబరిమల ఆలయ ప్రసాదానికీ మెరుగులుదిద్దనుంది. ప్రసాదంగా అందించే అప్పం, అరవణలకు కొత్త రుచి, నాణ్యతలను మేళవించేందుకు ఆలయ యాజమాన్యం ట్రావన్‌కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) సీఎఫ్‌టీఆర్‌ఐతో ఒప్పందం చేసుకుంది. శబరిమల ఆలయానికి ఏటా నవంబర్ నుంచి జనవరి సీజన్లో దేశ విదేశాల నుంచి లక్షలాది భక్తులు తరలివస్తారు. మే 15న నెలవారీ పూజ కోసం ఆలయాన్ని తెరుస్తామని..ఆ మరుసటి రోజే ప్రసాదంలో మార్పు చేర్పుల కోసం సీఎఫ్‌టీఆర్‌ఐతో ఆలయ బోర్డు ఎంఓయూ చేసుకుంటుందని టీడీబీ అధ్యక్షుడు ఏ పద్మకుమార్ తెలిపారు. ప్రసాదం తయారీలో నిమగ్నమయ్యే ఆలయ సిబ్బందికి సీఎఫ్ఐఆర్ఐ బృందం శిక్షణ ఇస్తుందని చెప్పారు. అన్నీ సజావుగా సాగితే తదుపరి సీజన్ నుంచే భక్తులకు అప్పం, అరవణ ప్రసాదాలు సరికొత్త రుచులతో అందుబాటులో ఉంటాయని తెలిపారు. కాగా ప్రసాదాల ధరలను పెంచే ప్రతిపాదన లేదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటివరకూ శబరిమల అప్పం గట్టిగా ఉంటోందని, దాన్ని కొంచెం మెత్తగా, తీయగా రూపొందిస్తామని, ఇక అరవణ గట్టిదనాన్ని తగ్గిస్తామని, ఇందులో ఉపయోగించే బెల్లం పరిమాణం కూడా 30-40 శాతం తగ్గుతుందని చెప్పారు. సీఎఫ్టీఆర్ఐ నిపుణుల పర్యవేక్షణలో ప్రసాదాల తయారీ ఏర్పాట్లు, ప్యాకింగ్ పద్ధతుల్లో మార్పుచేర్పులు చోటుచేసుకుంటాయన్నారు. -
భారీగా పెరిగిన శబరిమల ఆదాయం
సాక్షి, శబరిమల : ఈ ఏడాది శబరిమల ఆదాయం గణనీయంగా పెరిగింది. ఆలయం తెరిచిన మూడు వారాల్లో అంటే డిసెంబర్ 6 నాటికి రూ.83 కోట్ల ఆదాయం అయ్యప్ప ఆలయానికి వచ్చిందని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు ప్రకటించింది. ఇదే గత ఏడాది డిసెంబర్ 6 నాటికి అయ్యప్ప ఆదాయం రూ. 70 కోట్లు అని ఆలయ అధికారులు తెలిపారు. అయ్యప్ప అరవణ ప్రసాదం అమ్మకాల ద్వారా ఇప్పటివరకూ రూ. 36.20 కోట్లు వచ్చాయి. ఇదే గత ఏడాది రూ.30.48 కోట్లు వచ్చాయని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. స్వామివారి హుండీ ద్వారా 29.49 కోట్ల రూపాయాలు రాగా, గత ఏడాది ఇది రూ. 22.80 కోట్లుగా ఉండేది. కేవలం అప్పం ప్రసాదం అమ్మకాల ద్వారా 5.95 కోట్ల రూపాయాలు వచ్చినట్లు ట్రావెన్ కోర్ అధికారులు ప్రకటించారు. -
సన్నిధానం చుట్టూ భారీ భద్రత
సాక్షి, తిరువనంతపురం : శబరిమల అయ్యప్ప ఆలయంపై ఉగ్రవాదులు దాడి చేసే అవకాశముందన్న నిఘా వర్గాల సమాచరంతో ఈ ఏడు భారీ భద్రతను పెంచారు. అలాగే ఈ సంవత్సరం ఆలయానికి భక్తులు ఎన్నడూ లేనంతగా వస్తారనే అంచనాలతో భధ్రతను కేరళ ప్రభుత్వం మరింత కట్టుదిట్టం చేసింది. శబరిమల ఆలయం చుట్టూ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) కేరళ పోలీస్ బలగాలు ఆలయ భద్రతను పర్యవేక్షిస్తున్నాయి. అలాగే.. పెరియార్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌ను ఇప్పటికే నేవీ తమ ఆధీనంలోకి తీసుకుంది. డ్రోన్లతో పహారా! శబరిమల అయ్యప్ప సన్నిధానంకు ఈ ఏడు కేరళ ప్రభుత్వం భారీ భద్రతను ఏర్పాటు చేసింది. ప్రధానంగా సన్నిధానంను ప్రతిక్షణం పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా డ్రోన్లను రంగంలోకి దింపింది. సన్నిధానంతో పాటు పంబా, అడవిదారి, ఎరుమేలి, ఇతర ముఖ్యప్రాంతాల్లో సైతం భద్రను పెట్టినట్టు సన్నిధానం ప్రత్యేక పోలీసు అధికారి కేకే జయరామన్ తెలిపారు. పదునెట్టాంబడి చుట్టూ పారా మిలటరీ బలగాలు పహారా కాస్తుంటాయన్నారు. ఇతర రాష్ట్రాల నుంచీ! అయ్యప్ప భద్రత కోసం కేరళ పోలీసులతో పాటు, పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటకనుంచి అదనపు బలగాలను తెప్పించుకున్నట్లు కేకే జయరామన్ చెప్పారు. అయ్యప్పలు సహరించాలి అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులును క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. ప్రధానంగా నీలిమల, మరక్కూట్టం యూ టర్న్, లోయర్ తిరుమట్టం వద్ద సెక్యూరిటీ చెకింగ్ ఉంటుందని చెప్పారు. అనుమతి ఉన్న వారికే! సన్నిధానానికి వెళ్లే ప్రత్యేకదారిలో.. కేవలం అనుమతి ఉన్న వ్యక్తులకు మాత్రమే ప్రవేశం ఉంటుందని చెప్పారు. ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అనుమతి పత్రం, లేదంటే కేరళ ప్రభుత్వం జారీ చేసిన ఐడెంటీ కార్డు ఉండాలని చెప్పారు. -
శబరిమలలో ఆధునిక సౌకర్యాలు
సాక్షి, శబరిమల : కేరళలోని ప్రఖ్యాత శబరిమల ఆలయం.. అయ్యప్ప భక్తుల కొరకు సర్వాంగసుందరంగా ముస్తాబైంది. ఏటికేడు పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ సంవత్సరం ఆధునిక వసతి సౌకర్యాలు కల్పించినట్లు ఆలయ అధికారులు చెబుతున్నారు. మహిళా భక్తుల కోసం పంబా నుంచి సన్నిధానం వరకూ ప్రత్యేక క్యూ లైన్‌ను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. మండల పూజలు ఆరంభం కానున్న నేపథ్యంలో శబరిమల ఆయ్యప్పస్వామి ఆలయాన్ని బుధవారం అర్చకులు తెరవనున్నారు. గరురువారం నుంచి సాధారణ అనుమతి వేళల్లో స్వామి వారిని భక్తులు దర్శించుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ ఏడాది తొలిసారిగా శబరిమలలో నిత్యాన్నదాన సేవా కార్యక్రమాన్ని కేరళ ప్రభుత్వం మొదలు పెట్టింది. ప్రతిరోజూ 5 వేల మంది భక్తులు భోజనం చేసేలా వసతి సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు కేరళ దేవాదాయ ధర్మాదాయ శాఖామంత్రి సుందరన్ తెలిపారు. ఈ అన్నదానం జనవరి 14 మకర విళక్కు వరకూ కొసాగుతుందని ఆయన చెప్పారు. అరవణ ప్రసాదం, అప్పం అందరికీ అందేలా ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. వనయాత్ర (పెద్దపాదం) చేసే భక్తులకు తాగు నీటికి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అడవుల్లో ప్లాస్టిక్ నిషేధించిన కారణంగా.. బక్తులు ఎవరూ ప్లాస్టిక్ బాటిల్స్ తమ వెంట తీసుకెళ్లరాదని ఆయన స్పష్టం చేశారు.