సాక్షి, న్యూఢిల్లీ : కేరళలోని శబరిమల ఆలయంలోకి హిందూ మహిళలే కాదు.. అన్ని మతాల స్త్రీలు వెళ్లొచ్చునని కేరళ హైకోర్టు సోమవారం తీర్పు వెలువరించిన నేపథ్యంలో కేంద్రమంత్రి కేజే అల్ఫోన్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నడూ మసీదులు, చర్చిలకు వెళ్లని మహిళలు శబరిమలకు వెళ్లేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. 10 సెకండ్లపాటు టీవీలో కనిపించడానికి, కెమెరాలకు పోజుల్విడానికి పవిత్రమైన అయ్యప్ప గుడిమెట్లు ఎక్కడానికి పూనుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆలయ పవిత్రతను కాలరాయాలా?
‘ఎన్నడూ మసీదువైపు కన్నెత్తి చూడని ఒక ముస్లిం యువతి శబరిమల అయ్యప్ప ఆలయానికి వెళ్లి తీరతానని అంటోంది. చర్చ్ అంటే ఏంటో తెలియని మరో క్రిస్టియన్ అమ్మాయి శబరిమల యాత్ర చేస్తానంటోంది. ఎంత విడ్డూరం. పాపులర్ అయిపోవడానికీ, కెమెరాల్లో కనిపించడానికి ఇంత చేయాలా? దానికోసం ఆలయ పవిత్రతను కాలరాయాలా’అని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్టోబర్ 19న శబరిమల యాత్ర చేపట్టిన రేహానా ఫాతిమాను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 5 కిలోమీటర్లు యాత్ర చేసి అయ్యప్ప ఆలయ ప్రాంతానికి చేరుకున్న అనంతరం తీవ్ర ఉద్రికత్తలు తలెత్తడంతో ఫాతిమాను పోలీసులు అడ్డుకుని వెనక్కి పంపిన సంగతి తెలిసిందే.
కాగా, అన్ని వయసుల మహిళలు శబరిమల అయ్యప్ప ఆలయానికి వెళ్లొచ్చునని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన తర్వాత ఇప్పటి వరకు 12 మంది మహిళలు శబరిమల ఆలయంలోకి వెళ్లేందుకు యత్నించారు. అయితే, తీవ్ర నిరసనలు వ్యక్తమవడంతో భద్రతాబలగాలు వారిని వెనక్కి పంపించివేశాయి. బెదిరింపులు రావడంతో మరి కొందరు తమ ప్రయత్నాన్ని విరమించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment