KJ Alphons
-
‘దానికోసం ఇంత చేయాలా’
సాక్షి, న్యూఢిల్లీ : కేరళలోని శబరిమల ఆలయంలోకి హిందూ మహిళలే కాదు.. అన్ని మతాల స్త్రీలు వెళ్లొచ్చునని కేరళ హైకోర్టు సోమవారం తీర్పు వెలువరించిన నేపథ్యంలో కేంద్రమంత్రి కేజే అల్ఫోన్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నడూ మసీదులు, చర్చిలకు వెళ్లని మహిళలు శబరిమలకు వెళ్లేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. 10 సెకండ్లపాటు టీవీలో కనిపించడానికి, కెమెరాలకు పోజుల్విడానికి పవిత్రమైన అయ్యప్ప గుడిమెట్లు ఎక్కడానికి పూనుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయ పవిత్రతను కాలరాయాలా? ‘ఎన్నడూ మసీదువైపు కన్నెత్తి చూడని ఒక ముస్లిం యువతి శబరిమల అయ్యప్ప ఆలయానికి వెళ్లి తీరతానని అంటోంది. చర్చ్ అంటే ఏంటో తెలియని మరో క్రిస్టియన్ అమ్మాయి శబరిమల యాత్ర చేస్తానంటోంది. ఎంత విడ్డూరం. పాపులర్ అయిపోవడానికీ, కెమెరాల్లో కనిపించడానికి ఇంత చేయాలా? దానికోసం ఆలయ పవిత్రతను కాలరాయాలా’అని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్టోబర్ 19న శబరిమల యాత్ర చేపట్టిన రేహానా ఫాతిమాను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 5 కిలోమీటర్లు యాత్ర చేసి అయ్యప్ప ఆలయ ప్రాంతానికి చేరుకున్న అనంతరం తీవ్ర ఉద్రికత్తలు తలెత్తడంతో ఫాతిమాను పోలీసులు అడ్డుకుని వెనక్కి పంపిన సంగతి తెలిసిందే. కాగా, అన్ని వయసుల మహిళలు శబరిమల అయ్యప్ప ఆలయానికి వెళ్లొచ్చునని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన తర్వాత ఇప్పటి వరకు 12 మంది మహిళలు శబరిమల ఆలయంలోకి వెళ్లేందుకు యత్నించారు. అయితే, తీవ్ర నిరసనలు వ్యక్తమవడంతో భద్రతాబలగాలు వారిని వెనక్కి పంపించివేశాయి. బెదిరింపులు రావడంతో మరి కొందరు తమ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. (చదవండి : శబరిమలకు వెళ్లనున్న అమిత్ షా!) -
కేరళను మినహాయించండి
న్యూఢిల్లీ: ప్రకృతి విపత్తులు సంభవించిన సమయంలో విదేశీ సాయం తీసుకోరాదన్న పాలసీ నుంచి కేరళకు ఒక్కసారి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర మంత్రి అల్ఫోన్స్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) కేరళకు అందించాలనుకున్న రూ.700 కోట్ల సాయానికి కేంద్రం మోకాలడ్డటంపై ఆయన ఈ మేరకు స్పందించారు. ‘గత 50 ఏళ్లలో కేరళ కారణంగా దేశానికి భారీ విదేశీ మారకద్రవ్యం లభించింది. 2017లో మలయాళీలు స్వదేశానికి రూ.75,000 కోట్ల విదేశీ మారకాన్ని పంపారు. దేశంలో అతిపెద్ద పర్యాటక కేంద్రాల్లో కేరళ ఒకటి. ఈ కారణాలరీత్యా కేరళ వరదలను ప్రత్యేక పరిస్థితిగా పరిగణించి, విదేశీ సాయంపై ఒక్కసారి మినహాయింపు ఇవ్వాలని జూనియర్ మంత్రిగా నా సీనియర్లకు విజ్ఞప్తి చేస్తున్నా’ అని అల్ఫోన్స్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దాదాపు 2 లక్షల కుటుంబాలు పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నాయనీ, వాళ్లకు కనీసం దుస్తులు, ఆహారం, స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో లేదని పేర్కొన్నారు. ఇలాంటివారిని ఆదుకోవడానికి పెద్దమొత్తంలో నగదు అవసరమని వ్యాఖ్యానించారు. కాగా, అంతకుముందు కేరళ ఆర్థికమంత్రి థామస్ ఐజాక్ మాట్లాడుతూ.. తాము రూ.2,200 కోట్లు సాయం కోరితే కేంద్రం మాత్రం రూ.600 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం వ్యవహారశైలి ‘అమ్మ తాను అన్నం పెట్టదు. అడుక్కుని అయినా తిననివ్వదు’ రీతిలో ఉందని ఘాటుగా విమర్శిచారు. మరోవైపు, యూపీఏ హయాంలో జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్న శివశంకర్ మీనన్ మాట్లాడుతూ.. దీర్ఘకాలిక పునరావాస కార్యక్రమాలకు విదేశీ సాయం స్వీకరించడంపై ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. కేవలం సహాయ కార్యక్రమాలకు విదేశీ సాయం తీసుకోకూడదని మాత్రమే 2004లో మన్మోహన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు. విదేశీ సాయం స్వీకరించొచ్చు: ఎన్డీఎంఏ అత్యవసర పరిస్థితుల్లో విదేశాలు మానవతా దృక్పథంతో అందించే ఆర్థిక సాయాన్ని కేంద్రం ఆమోదించొచ్చని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) 2016లో రూపొందించిన ఓ పత్రం వెల్లడించింది. కేరళ వరద బాధితులకు యూఏఈ సాయం ప్రకటించడంపై వివాదం నెలకొన్న నేపథ్యంలో ఈ విషయం వెలుగుచూసింది. జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళిక(ఎన్డీఎంపీ) పేరిట తెచ్చిన ఆ పత్రంలో ‘ఏదైనా విపత్తు తలెత్తినప్పుడు విదేశీ సాయానికి అర్థించకూడదనేది జాతీయ విధానంలో భాగం. కానీ విదేశాలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి విపత్తు బాధితులకు అండగా ఉంటామంటే, ఆ సాయాన్ని కేంద్రం ఆమోదించొచ్చు’ అని ఉంది. దానిలో ప్రధాని మోదీ, హోం మంత్రి రాజ్‌నాథ్‌ల సందేశాలు ఉన్నాయి. విదేశీ సాయాన్ని ఎలా వినియోగించుకోవాలో విదేశాంగ శాఖతో కలసి హోం శాఖ నిర్ణయిస్తుందని పత్రం తెలిపింది. ఎన్‌డీఎంపీపై వ్యాఖ్యానించేందుకు హోంశాఖ అధికారులు నిరాకరించారు. -
రిలీఫ్ క్యాంప్‌లో నిద్రించిన ఫోటో : మంత్రికి చీవాట్లు
తిరువనంతపురం : వరదలతో తల్లడిల్లిన కేరళలో సోమవారం రాత్రి సహాయ పునరావాస శిబిరంలో కేంద్ర మంత్రి కేజే ఆల్ఫోన్స్ నిద్రించిన వ్యవహారం ప్రహసనంలా మారింది. ట్విటర్లో ఆయన పోస్ట్ చేసిన పరుపుపై నిద్రిస్తున్న ఫోటోకు ప్రశంసలు రాకపోగా నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేశారు. ఆల్ఫోన్స్ ఈ ఫోటోను ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా సహా పలువురిని ట్యాగ్ చేయగా ఈ పోస్ట్‌పై నెటిజన్ల స్పందన ఆయనకు షాక్ ఇస్తోంది. సార్..ఇది పబ్లిసిటీ చేసుకునేందుకు సరైన అవకాశం కాదని ఓ ట్విటర్ యూజర్ వ్యాఖ్యానించగా, సార్ ఇది జోక్ కాదు..ఇలాంటి ప్రదర్శనలకు ఇది సమయం కాదని మరో యూజర్ కామెంట్ చేశారు. కేంద్ర మంత్రిగా కేరళకు ఇతోధిక సాయం చేయాల్సిన మీరు ఇలాంటి చవకబారు ప్రచార ఎత్తుగడకు పాల్పడటం సరైంది కాదని మరొకరు ట్రోల్ చేశారు. సహాయ శిబిరంలో మీరు నిద్రించినా రేపటిపై బెంగతో చాలా మంది నిద్రకు నోచుకోలేదనే విమర్శలు ఆల్ఫోన్స్పై వెల్లువెత్తాయి. మరోవైపు వరదల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కేరళ ప్రస్తుతం సహాయ, పునరావాస చర్యలు ముమ్మరం చేయడంపై దృష్టిసారించింది. -
నాలుగేళ్లలో అభివృద్ధిలో ముందంజ: ఆల్ఫోన్స్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ఏర్పడిన నాలుగేళ్ల కాలంలోనే అభివృద్ధిలో రాష్ట్రం అద్భుతమైన పురోగతిని సాధించిందని కేంద్రమంత్రి కేజే ఆల్ఫోన్స్ కితాబిచ్చారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు అందజేశారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా ఆదివారం ఢిల్లీ తెలంగాణ భవన్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి పనిచేస్తే అభివృద్ధిలో దేశం ముందడుగు వేస్తుందన్నారు. ఆ దిశగా కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం పనిచేయాలని ఆయన సూచించారు. అందరికీ తిండి, వైద్యం, విద్య, ఉపాధి లక్ష్యంతో కేంద్రం పనిచేస్తోందని, ఈ లక్ష్యసాధనకు అందరూ కలసి పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి, తెలంగాణ భవన్ ఆర్సీ అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ముఖంతోనూ ఆధార్ ధ్రువీకరణ
న్యూఢిల్లీ: వృద్ధాప్యంతో వేలిముద్రలు చెరిగిపోయిన, మసకబారిన వారికి ఆధార్ ధ్రువీకరణ సమయంలో ఇబ్బందులు తొలగిపోనున్నాయి. ముఖంతోనూ ఆధార్ ధ్రువీకరణ చేపట్టేందుకు ఆధార్ ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) సమాయత్తమవుతోంది. జూలై 1 నుంచే ఈ విధానం అమల్లోకి రానుంది. అయితే ఆధార్ ధ్రువీకరణకు ముఖం ఒక్కటే సరిపోదని యూఐడీఏఐ పేర్కొంది. దీనికి అదనంగా వేలిముద్రలు, కంటిపాప, వన్‌టైం పాస్వర్డ్(ఓటీపీ)ల్లో ఒకదాన్ని కూడా సరిపోల్చాల్సి ఉంటుందని స్పష్టతనిచ్చింది. తెల్లోడి ముందు దుస్తులు విప్పగా లేనిది... కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి కేజే ఆల్ఫోన్స్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆధార్ సమాచారం దుర్వినియోగమవుతోందని ప్రచారం చేస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని ఆదివారం వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. వీసా కోసం విదేశీయుల ముందు దుస్తులు విప్పడానికి కూడా సిద్ధపడే భారతీయులు..ప్రభుత్వం వ్యక్తిగత వివరాలు అడిగితే మాత్రం ప్రైవసీ దెబ్బతింటుందని రాద్ధాంతం చేస్తున్నారని చురకలంటించారు. ‘ అమెరికా వీసా కోసం నేను కూడా 10 పేజీల దరఖాస్తును నింపా. తెల్లవాడికి మన వేలిముద్రలు ఇవ్వడానికి, వారి ముందు నగ్నంగా నిలబడటానికి మనకేం అభ్యంతరం ఉండదు. కానీ మన ప్రభుత్వమే పేరు, చిరునామా లాంటి వివరాలు అడిగితే మాత్రం గోప్యతను ఉల్లంఘిస్తున్నారని గగ్గోలు పెడుతున్నారు’ అని ఆల్ఫోన్స్ వ్యాఖ్యానించారు. -
‘రాహుల్ మాటలు నమ్మొద్దు’
సాక్షి, న్యూఢిల్లీ : నమో యాప్‌లో డేటా ఉల్లంఘనలపై మోదీ సర్కార్‌ను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను కేంద్రం తోసిపుచ్చింది. ‘మీ డేటాను అమెరికాలోని ప్రైవేట్ కంపెనీకి ప్రధాని నరేంద్ర మోదీ అప్పగిస్తారని మీరు అనుకుంటున్నారా...ఇలాంటి అవాస్తవ కథనాలను విశ్వసించకండ’ ని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ సహాయ మంత్రి కేజే అల్ఫోన్స్ అన్నారు. ఆధార్‌లో ప్రజలు పేరు, చిరునామాలే ఇస్తారని, యూఐడీఏఐ వద్ద ఉండే బయోమెట్రిక్ డేటా బహిర్గతం కాదని తాను ప్రజలకు హామీ ఇస్తానన్నారు. అయితే ఆధార్ సమాచారాన్ని ఉపయోగించుకునేందుకు ప్రభుత్వ ఏజెన్సీలకు తాము అనుమతిస్తామని స్పష్టం చేశారు. కాగా, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ నమో యాప్ డేటా ఉల్లంఘనలకు పాల్పడుతోందని ట్వీట్ చేశారు. అమెరికన్ కంపెనీలకు యూజర్ల సమాచారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అమ్మచూపుతున్నారని ఫ్రెంచ్ హ్యాకర్ ప్రకటనల ఆధారంగా రాహుల్ ప్రధానిని టార్గెట్ చేస్తూ ట్వీట్ల దాడి సాగించారు. కీలకమైన ఈ వ్యవహారాన్ని ఎత్తిచూపడంలో మీడియా అలసత్వం ప్రదర్శిస్తోందని కూడా రాహుల్ ఆరోపించారు. -
వాళ్ల ముందు నగ్నంగా ఉండండి.. కానీ!
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర పర్యాటక శాఖా మంత్రి కేజే ఆల్ఫోన్స్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో బికినీలు వేసుకుని తిరిగితే సహించేది లేదంటూ ఇటీవల విదేశీ పర్యాటకులను హెచ్చరించిన విషయం తెలిసిందే. విదేశీయుల (తెల్లజాతీయుల) ముందు నగ్నంగా ఉండేటంలో ఏ సమస్యలేదు, కానీ మన చుట్టూ ఉన్న అధికారులు, ప్రభుత్వం మన వివరాలు సేకరిస్తే మీకు అనుమానాలెందుకని ప్రశ్నించారు. ఓ కార్యకర్త ఆధార్ డేటాపై సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌పై ఈ విధంగా స్పందించారు. కేంబ్రిడ్జ్ అనలైటికాతో, ఆధార్‌కార్డులతో డాటా దుర్వినియోగం అవుతుందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆధార్ డేటా దుర్వనియోగం ఆరోపణలపై మంత్రి అల్ఫోన్స్ మీడియాతో మాట్లాడుతూ.. విదేశాలకు వెళ్తే తనిఖీలలో భాగంగా అక్కడి అధికారుల ముందు నగ్నంగా ఉండేందుకు ఏ మాత్రం ఇబ్బంది లేదు, కానీ స్వదేశంలో అధికారులు వేలిముద్రలు, వివరాలు అడిగితే మాత్రం మీకు అభ్యంతరాలు వస్తాయి అంటూ వ్యాఖ్యానించారు. తాను అమెరికా వీసా కోసం 10 పేజీల దరఖాస్తు ఫామ్‌ను నింపానని, వేలిముద్రలు, ఇతర వివరాలు కూడా అధికారులకు ఇచ్చానని చెప్పారు. ‘విదేశాల్లో రోడ్ల మీద విదేశీయులు బికినీలేస్కుని తిరుగుతారు. కానీ, ఇండియా విషయానికొస్తే ఇక్కడ అలా తిరగటం కుదరదు. ఉదాహరణకు లాటిన్ అమెరికాలో రోడ్లపైనే మహిళలు బికినీలతో దర్శనమిస్తుంటారు. అఫ్ కోర్స్.. మన దగ్గర గోవా బీచ్‌లో అలాంటి స్వేచ్ఛ ఉంది. కానీ, వీధుల్లో మాత్రం అలా తిరిగేందుకు ఒప్పుకోమంటూ’ వ్యాఖ్యలు చేశారు. ‘బీఫ్‌ను తమ దేశంలోనే తిని.. ఇండియాకు రావాలంటూ’ విదేశీ పర్యాటకులకు సూచించి గతంలో కేజే ఆల్ఫోన్స్ విమర్శల పాలైన సంగతి తెలిసిందే. -
బికినీలు.. ఇండియాలో జాన్తా నై!
సాక్షి, న్యూఢిల్లీ : విదేశీ పర్యాటకులపై కేంద్ర పర్యాటక శాఖా మంత్రి కేజే ఆల్ఫోన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫారిన్ టూరిస్ట్‌లు తమ దేశంలో తిరిగినట్లు.. భారత్‌లో తిరిగితే ఉపేక్షించే ప్రసక్తే లేదని ఆయన సున్నితంగా హెచ్చరించారు. తాజాగా ఓ ప్రముఖ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... ‘విదేశాల్లో రోడ్ల మీద విదేశీయులు బికినీలేస్కుని తిరుగుతారు. కానీ, ఇండియా విషయానికొస్తే ఇక్కడ అలా తిరగటం కుదరదు. ఉదాహరణకు లాటిన్ అమెరికాలో రోడ్లపైనే మహిళలు బికినీలతో దర్శనమిస్తుంటారు. అఫ్ కోర్స్.. మన దగ్గర గోవా బీచ్‌లో అలాంటి స్వేచ్ఛ ఉంది. కానీ, వీధుల్లో మాత్రం అలా తిరిగేందుకు ఒప్పుకోం. ఎందుకంటే ఈ దేశంలో కొన్ని సంప్రదాయాలు, పద్ధతులు ఉన్నాయి. వాటిని గౌరవించాల్సిన అవసరం ఉంది. విదేశీయులతోపాటు మనవాళ్లు కూడా దానికి భంగం కలిగించకూడదు’ అని ఆల్ఫోన్స్ వ్యాఖ్యానించారు. అలాగని చీరలు కట్టుకునే ఇక్కడికి రావాలని విదేశీయులకు తాను చెప్పటం లేదని.. ఇక్కడి సంప్రదాయాలకు తగ్గట్లుగా మెదిలితే చాలని, మన ప్రజలు ఆయా దేశాలకు వెళ్లినప్పుడు.. వాళ్లు కూడా కోరుకునేది ఇదేనని ఆయన తెలిపారు. కాగా, గతంలోనూ విదేశీ పర్యాటకులను ఉద్దేశించి ఆయన ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ‘బీఫ్‌ను తమ దేశంలోనే తిని.. ఇండియాకు రావాలంటూ’ విదేశీ పర్యాటకులకు ఆయన సలహా ఇచ్చారు. -
మంత్రిపై ఫైర్.. అయినా స్పందన లేదు
పట్న : కేంద్ర మంత్రి కేజే ఆల్ఫోన్స్ పై తీవ్ర స్థాయిలో ఓ మహిళ మండిపడిన వీడియో మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. వీవీఐపీ కల్చర్‌కు వ్యతిరేకంగా మంత్రిపై వేలెత్తి చూపిన ఆమె తెగువను పలువురు అభినందించారు కూడా. దీనిపై సదరు వీడియోలో ఉన్న మహిళ.. బిహార్‌కు చెందిన డాక్టర్ నిరాల సిన్హా మీడియా ముందుకు వచ్చి స్పందించారు. ‘‘వీవీఐపీ కల్చర్ మూలంగా దేశంలో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. వాళ్లే కాదు.. ప్రతీ పౌరుడూ దేశానికి అవసరమే. సెలబ్రిటీలు, నేతలు అన్న తేడా లేకుండా సేవలు అందరికీ అందాల్సిన అవసరం ఉంది’’ అని నిరాల ఓ ఛానెల్‌తో అభిప్రాయపడ్డారు. తన కుటుంబంలోని ఓ వ్యక్తి చనిపోతే అంత్యక్రియల కోసం తాను బయలుదేరానని.. కానీ, మంత్రి మూలంగానే ఆ కార్యక్రమానికి తాను హాజరుకాలేకపోయానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఇంఫాల్‌లో వైద్యురాలిగా పని చేస్తున్న నిరాల నవంబర్ 21న పట్నకు ఇండిగో విమానంలో ప్రయాణానికి సిద్ధమయ్యారు. అదే సమయంలో మంత్రి ఆల్ఫోన్స్ రాక సందర్భంగా ఎయిర్‌లైన్స్ వాళ్లు ఆమె ప్రయాణించాల్సిన విమానాన్ని ఆలస్యం నడిపారు. దీంతో ఆమె మీడియా ముందే మంత్రిపై ధ్వజమెత్తారు. అయితే అంత జరిగినా మంత్రి తనకు సాయం చేయకపోగా.. ఏం పట్టనట్లు అక్కడి నుంచి వెళ్లిపోవటంతో నిరాల అసంతృప్తి వ్యక్తం చేశారు కూడా. మంత్రి వివరణ... రాష్ట్రపతి, ప్రధాని విషయంలో ఖచ్ఛితంగా ప్రోటోకాల్ పాటించాల్సి ఉంటుంది. మంత్రులు, మిగతా నేతల విషయంలో అలాంటి నిబంధనలు ఏం ఉండవు. ఆ సమయంలో రాష్ట్రపతి కోవింద్ అక్కడ రావటంతో విమానాలు ఆలస్యం అయ్యాయి. అంతే తప్ప ఆ మహిళ వాదిస్తున్న దాంట్లో వాస్తవం లేదు అని ఆల్ఫోన్స్ వివరణ ఇచ్చుకున్నారు. -
అక్కడ బీఫ్ తిని.. ఇండియాకు రండి: కేంద్ర మంత్రి
సాక్షి, భువనేశ్వర్: ఓవైపు గోమాంస నిషేధంపై వివిధ రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్తగా టూరిజం శాఖ(సహాయ) బాధ్యతలు స్వీకరించిన మంత్రి కేజే ఆల్ఫోన్స్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఫ్ తిన్నాకే ఇండియాకు రావాలంటూ విదేశీ టూరిస్ట్‌లకు ఆయన సూచించారు. భువనేశ్వర్‌లో నిర్వహిస్తున్న 33వ ఇండియన్ టూరిస్ట్ అసోషియేషన్ సదస్సుకు ఆయన హాజరయ్యారు. ఈ నేపథ్యంలో మీడియా ఆయనను పలకరించగా, బీఫ్ బ్యాన్పై ఆయన స్పందించారు. ‘వాళ్లు(విదేశీ టూరిస్ట్‌లు) వాళ్ల సొంత దేశాల్లో బీఫ్ తిన్న తర్వాతే .. ఇండియాకు రావాల్సి ఉంటుంది’ అంటూ నవ్వుతూ ఓ ప్రకటన ఇచ్చారు. మోదీ సర్కారు అన్ని వర్గాలను కలుపుకొని పోతుందని, కేరళ, గోవాలో బీఫ్‌ను తినడంపై తమ ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం, సమస్య లేవని ఇంతకు ముందు ఈయనే వ్యాఖ్యానించారు. అయితే గోమాంస నిషేధం చాలా సున్నితమైన అంశమని, స్పందించేందుకు తానేం ఆహార శాఖ మంత్రిని కాదని తర్వాత ఆల్ఫోన్స్ వివరణ ఇచ్చుకున్నారు. గోమాంస నిషేధాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్న రాష్ట్రాల్లో మంత్రి ఆల్ఫోన్స్ సొంత రాష్ట్రం కేరళ కూడా ఉంది. జంతువుల అమ్మకం అనేది మాంసం కోసం కాదంటూ కేంద్ర ప్రభుత్వం చట్టాలను సవరించిన విషయం తెలిసిందే. -
బీఫ్‌పై కొత్త కేంద్రమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
న్యూఢిల్లీ: నరేంద్రమోదీ ప్రభుత్వంలో టూరిజం శాఖ సహాయమంత్రిగా చేరిన మాజీ బ్యూరోక్రాట్ కేజే ఆల్ఫోన్స్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి, క్రైస్తవులకు మధ్య తాను వారధిగా పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు. మోదీ సర్కారు అన్ని వర్గాలను కలుపుకొని పోతుందని, కేరళ, గోవాలో బీఫ్‌ను తినడంపై తమ ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం, సమస్య లేదని ఆయన స్పష్టం చేశారు. ’మోదీ సర్కారు సమ్మిళిత దృక్పథంతో ముందుకుసాగుతోంది. మీరు ఏ విశ్వాసాన్నైనా కలిగి ఉండండి. మేం మిమ్మల్ని కాపాడుతామన్న విషయాన్ని ప్రధాని స్పష్టం చేశారు. మోదీ హయాంలో ఒక్క చర్చినిగానీ, మసీదుగానీ ఘటన లేదు. మోదీ అద్భుతంగా పనిచేస్తున్నారు’ అని ఆల్ఫోన్స్ ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. నిజాయితీ గల అధికారిగా పేరుతెచ్చుకున్న కేజే ఆల్ఫోన్స్ కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టే తరుణంలోనూ తన దృఢవైఖరిని చాటుకున్నారు. కేంద్ర పర్యాటక శాఖ పూర్వపు మంత్రి మహేశ్ శర్మ నుంచి పగ్గాలు అందుకునేందుకు దాదాపు గంటసేపు వేచిచూసిన ఆయన.. లాంఛనంగా మంత్రిత్వశాఖ బాధ్యతలు చేపట్టేవరకు ఆ చైర్లో కూర్చోవడానికి కూడా నిరాకరించారు. బీఫ్ తినడం, గో రక్షకులపై కేంద్రంలోని బీజేపీ సర్కారు భిన్నంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. చాలా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పశువధపై కఠిన ఆంక్షలు ఉన్నాయి. గోరక్షకులు కొట్టిచంపేస్తున్నా.. ప్రభుత్వాలు తీవ్రంగా చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇటీవల గోవా సీఎంగా బాధ్యతలు చేపట్టిన మనోహరి పారికర్ రాష్ట్రంలో బీఫ్ కొరత లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు. పారికర్ వ్యాఖ్యలను ప్రస్తావించిన ఆల్ఫోన్స్.. రాష్ట్రాల్లో ఆహార అలవాట్లపై ఎలాంటి ఆంక్షలు లేవని చెప్పారు. -
సర్ప్రైజ్.. ఎంతో థ్రిల్ అయ్యా!
సాక్షి, న్యూఢిల్లీ: మీడియాను, ప్రజలను ఊహించనిరీతిలో ఆశ్చర్యపరచడం, విస్మయానికి గురిచేయడం నరేంద్రమోదీ-అమిత్ షా ద్వయానికి వెన్నతో పెట్టిన విద్య. సర్జికల్ స్ట్రైక్స్ నుంచి పెద్దనోట్ల రద్దు వరకు ఇదేరీతిలో అనూహ్య నిర్ణయాలు తీసుకున్న మోదీ-షా ద్వయం తాజాగా కేంద్ర కేబినెట్ విస్తరణలోనూ ఎవరూ ఊహించనివిధంగా కొత్తవారికి పెద్దపీట వేయడం గమనార్హం. తాజాగా ప్రమాణం చేయబోతున్న 9మంది కేంద్ర మంత్రుల్లో నలుగురు మాజీ బ్యూరోక్రాట్లు ఉండటం గమనార్హం. వీరిలో ఇద్దరు తొలిసారి లోక్‌సభకు ఎన్నిక కాగా, మరో ఇద్దరు పార్లమెంటు సభ్యులు కాదు. మాజీ బ్యూరోక్రాట్లు అయిన హర్దీప్ సింగ్ పూరి, కేజే అల్ఫోన్స్, రాజ్‌కుమార్ సింగ్(ఆర్కే సింగ్), సత్యపాల్ సింగ్ కేంద్రమంత్రులుగా పగ్గాలు చేపడుతున్నారు. ఇన్నాళ్లు పరిపాలన విభాగంలో పనిచేసి.. పాలనను నిశితంగా గమనించిన ఈ నలుగురు మోదీ టీమ్‌లో భాగంగా మంచి పనితీరు కనబరుస్తారని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. తమకు అనూహ్యంగా కేంద్ర కేబినెట్లో అవకాశం కల్పించడంపై ఈ నలుగురు ఆనందం వ్యక్తం చేశారు. 'నేను ఊహించలేదు. ఎంతో థ్రిల్‌కు గురయ్యాను. ఇది గొప్ప సర్ప్రైజ్' అని అనూహ్యంగా తెరపైకి వచ్చిన కేరళ మాజీ ఐఏఎస్ అధికారి కేజే అల్ఫోన్స్ హర్షం వ్యక్తం చేశారు. 'ప్రధాని మోదీ టీంలో నన్ను తీసుకున్నందుకు ఆయనకు కృతజ్ఞతలు' అని హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. 'నా సామర్థ్యంపై విశ్వాసం కనబరిచిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు. నా పోర్ట్‌ఫోలియో ఏమిటో ఇంకా నిర్ణయించలేదు' అని మరో మాజీ బ్యూరోక్రాట్ ఆర్కే సింగ్ తెలిపారు.