కొచ్చిలోని ఓ సహాయక కేంద్రంలో ఆహారం కోసం లైనులో నిల్చున్న వరద బాధితులు
న్యూఢిల్లీ: ప్రకృతి విపత్తులు సంభవించిన సమయంలో విదేశీ సాయం తీసుకోరాదన్న పాలసీ నుంచి కేరళకు ఒక్కసారి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర మంత్రి అల్ఫోన్స్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) కేరళకు అందించాలనుకున్న రూ.700 కోట్ల సాయానికి కేంద్రం మోకాలడ్డటంపై ఆయన ఈ మేరకు స్పందించారు. ‘గత 50 ఏళ్లలో కేరళ కారణంగా దేశానికి భారీ విదేశీ మారకద్రవ్యం లభించింది. 2017లో మలయాళీలు స్వదేశానికి రూ.75,000 కోట్ల విదేశీ మారకాన్ని పంపారు.
దేశంలో అతిపెద్ద పర్యాటక కేంద్రాల్లో కేరళ ఒకటి. ఈ కారణాలరీత్యా కేరళ వరదలను ప్రత్యేక పరిస్థితిగా పరిగణించి, విదేశీ సాయంపై ఒక్కసారి మినహాయింపు ఇవ్వాలని జూనియర్ మంత్రిగా నా సీనియర్లకు విజ్ఞప్తి చేస్తున్నా’ అని అల్ఫోన్స్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దాదాపు 2 లక్షల కుటుంబాలు పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నాయనీ, వాళ్లకు కనీసం దుస్తులు, ఆహారం, స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో లేదని పేర్కొన్నారు. ఇలాంటివారిని ఆదుకోవడానికి పెద్దమొత్తంలో నగదు అవసరమని వ్యాఖ్యానించారు.
కాగా, అంతకుముందు కేరళ ఆర్థికమంత్రి థామస్ ఐజాక్ మాట్లాడుతూ.. తాము రూ.2,200 కోట్లు సాయం కోరితే కేంద్రం మాత్రం రూ.600 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం వ్యవహారశైలి ‘అమ్మ తాను అన్నం పెట్టదు. అడుక్కుని అయినా తిననివ్వదు’ రీతిలో ఉందని ఘాటుగా విమర్శిచారు. మరోవైపు, యూపీఏ హయాంలో జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్న శివశంకర్ మీనన్ మాట్లాడుతూ.. దీర్ఘకాలిక పునరావాస కార్యక్రమాలకు విదేశీ సాయం స్వీకరించడంపై ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. కేవలం సహాయ కార్యక్రమాలకు విదేశీ సాయం తీసుకోకూడదని మాత్రమే 2004లో మన్మోహన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు.
విదేశీ సాయం స్వీకరించొచ్చు: ఎన్‌డీఎంఏ
అత్యవసర పరిస్థితుల్లో విదేశాలు మానవతా దృక్పథంతో అందించే ఆర్థిక సాయాన్ని కేంద్రం ఆమోదించొచ్చని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్‌డీఎంఏ) 2016లో రూపొందించిన ఓ పత్రం వెల్లడించింది. కేరళ వరద బాధితులకు యూఏఈ సాయం ప్రకటించడంపై వివాదం నెలకొన్న నేపథ్యంలో ఈ విషయం వెలుగుచూసింది. జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళిక(ఎన్‌డీఎంపీ) పేరిట తెచ్చిన ఆ పత్రంలో ‘ఏదైనా విపత్తు తలెత్తినప్పుడు విదేశీ సాయానికి అర్థించకూడదనేది జాతీయ విధానంలో భాగం. కానీ విదేశాలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి విపత్తు బాధితులకు అండగా ఉంటామంటే, ఆ సాయాన్ని కేంద్రం ఆమోదించొచ్చు’ అని ఉంది. దానిలో ప్రధాని మోదీ, హోం మంత్రి రాజ్‌నాథ్‌ల సందేశాలు ఉన్నాయి. విదేశీ సాయాన్ని ఎలా వినియోగించుకోవాలో విదేశాంగ శాఖతో కలసి హోం శాఖ నిర్ణయిస్తుందని పత్రం తెలిపింది. ఎన్‌డీఎంపీపై వ్యాఖ్యానించేందుకు హోంశాఖ అధికారులు నిరాకరించారు.
Comments
Please login to add a commentAdd a comment