కేరళలో ఈ ఏడాది వానలు, నదులు మనుషులతో మాట్లాడుతున్నాయి. చిన్ననాటి నుంచీఈ వానలే నా కలంలో సిరా. అవే నన్ను రచయిత్రిని చేశాయి. మీనాచిల్ నది నా కథను నడిపించింది. ప్రస్తుతం నదుల మహోగ్రరూపం ఊహకు అందనిది. త్రివిధ దళాలు, ప్రభుత్వ సంస్థలు, స్థానికులు, జర్నలిస్టులు, మత్స్యకారులు ముఖ్యంగా సామాన్యులు ఎనలేని ధైర్యసాహసాలు చూపారు. ఇదంతా ప్రకృతి వైపరీత్యమే అని చెప్పడానికి వీల్లేదు. మానవ తప్పిదం ఎంతో ఉంది. వాతావరణంలో చోటు చేసుకుంటున్న అనూహ్య మార్పులు, గ్లోబల్ వార్మింగ్ పరిస్థితులతో కొండ ప్రాంతాలు, తీర ప్రాంతాలే మొదట బలైపోతాయి.
ఒకవైపు కార్చిచ్చులతో కాలిఫోర్నియా తగలబడిపోతూంటే, ఇటు వర్షబీభత్సంతో కేరళ మునిగింది. మనిషి అంతులేని స్వార్థంతో చేస్తున్న పనులతో కొండల మీదుగా వాన నీటి ప్రవాహం దిశ మారింది. అటవీ భూముల్లో గనుల తవ్వకం, చట్టవిరుద్ధంగా రిసార్టులు, సంపన్నుల ఇళ్లు, డ్యామ్‌ల అడ్డగోలు నిర్వహణ వంటివన్నీ నేటి ప్రళయానికి కారణం. ఈ వరదల్ని సెంట్రల్ వాటర్ కమిషన్ ఊహించకుండా ఎలా ఉంది? వరదనీటిని ఒడిసిపట్టాల్సిన డ్యామ్‌లు కీలక సమయంలో విపత్తు తీవ్రతను ఎన్నో రెట్లు పెంచేలా నీళ్లు ఎలా విడుదల చేశాయి? ఇప్పుడు సీఎం సహాయ నిధికి విరాళాలు భారీగా వస్తున్నాయి.
వాటిలో సామాన్యులు ఇస్తున్నవే ఎక్కువ. చిత్రమేమిటంటే ఎవరికైతే మనం నిధులిస్తున్నామో ఆ ప్రభుత్వ యంత్రాంగమే హెచ్చరికల్ని పెడచెవిన పెట్టింది. ఇలాంటి పరిస్థితి వస్తుందని మాధవ్ గాడ్గిల్ కమిటీ ఎప్పుడో ఊహించింది. అభివృద్ధి పేరుతో సాగిస్తున్న కార్యకలాపాలను అడ్డుకోకపోతే వినాశనమేనని హెచ్చరించింది. కేరళ వరదల్ని అడ్డుపెట్టుకొని భారత్‌లో కొందరు విషాన్ని చిమ్ముతున్నారు. ప్రేమ, ఆప్యాయత పంచాల్సిన సమయంలో విద్వేషాన్ని రగిలిస్తున్నారు. వరదల్లో తీవ్రంగా నష్టపోయిన దళితులు, ఆదివాసీలకు రాష్ట్రసర్కారు అండగా ఉంటుందని ఆశిద్దాం. మనం చేతులారా నాశనం చేసిన పర్యావరణాన్ని మనమే చక్కదిద్దాలి. అలా చేయకుంటే దేవభూమిలో మనిషి మసలడం సాధ్యం కాదు. 2018 వరదలు మనకి ఒక సున్నితమైన హెచ్చరిక.
Comments
Please login to add a commentAdd a comment