Central Water Commission
-
అంబేడ్కర్ కృషిని విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వాలు
ఖజురహో: దేశంలో జల వనరుల అభివృద్ధికి డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ చేసిన కృషిని కాంగ్రెస్ పార్టీ విస్మరించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. 21వ శతాబ్దంలో తగనన్ని జల వనరులతోపాటు వాటి నిర్వహణలో మెరుగ్గా ఉన్న దేశాలే ప్రగతి పథంలో ముందుకు సాగుతాయని స్పష్టంచేశారు. 21వ శతాబ్దంలో నీటి సంరక్షణే అతిపెద్ద సవాలు అని తేలి్చచెప్పారు. బుధవారం మధ్యప్రదేశ్‌లో కెన్–బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టుకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఖజురహోలో నిర్వహించిన సభలో ప్రసంగించారు. అంబేడ్కర్ అందించిన సేవలను కొనియాడారు. మన దేశంలో జల వనరుల బలోపేతానికి, నిర్వహణకు, డ్యామ్‌ల నిర్మాణానికి అంబేడ్కర్ దార్శనికత, దూరదృష్టి ఎంతగానో దోహదపడ్డాయని తెలిపారు. కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) ఏర్పాటు వెనుక అంబేడ్కర్ కృషి ఉందన్నారు. అతిపెద్ద నదీ లోయ ప్రాజెక్టుల అభివృద్ధికి ఎంతగానో శ్రమించారని పేర్కొన్నారు. జల సంరక్షకుడు అంబేడ్కర్‌ను గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏనాడూ పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. జల సంరక్షణ ప్రాధాన్యతను సైతం పక్కనపెట్టాయని విమర్శించారు. ఈ సందర్భంగా దివంగత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రత్యేక స్మారక పోస్టల్ స్టాంప్, రూ.100 నాణాన్ని మోదీ విడుదల చేశారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా 1,153 అటల్ గ్రామ్ సేవా సదనాల నిర్మాణానికి భూమిపూజ చేశారు. రూ.437 కోట్లతో ఈ సదనాలు నిర్మిస్తారు. నేడు సుపరిపాలన దినోత్సవం జరుపుకుంటున్నామని ప్రధానమంత్రి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్వాకంతో ప్రాజెక్టులు ఆలస్యం మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలో ఓంకారేశ్వర్ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టును ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. నదుల అనుసంధానంలో భాగంగా దౌధన్ సాగునీటి ప్రాజెక్టుకు సైతం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సి.ఆర్.పాటిల్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కెన్–బెత్వా నదుల నీటిని నింపిన రెండు కలశాలను ప్రధాని మోదీకి అందజేశారు. రెండు నదుల అనుసంధాన ప్రాజెక్టు నమూనా(మోడల్)లో మోదీ ఈ నీటిని ధారగా పోశారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని లాంఛనంగా ఆరంభించారు. కెన్–బెత్వా నదుల అనుసంధానంతో బుందేల్‌ఖండ్ ప్రాంతంలో సౌభాగ్యం, సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని మోదీ ఉద్ఘాటించారు. రూ.44,605 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపడుతున్నారు. దీంతో మధ్యప్రదేశ్‌లో 44 లక్షల మందికి, ఉత్తరప్రదేశ్‌లో 21 లక్షల మందికి తాగునీరు లభించనుంది. 2,000 గ్రామాల్లో 7.18 లక్షల వ్యవసాయ కుటుంబాలు లబ్ధి పొందుతాయి. అలాగే 103 మెగావాట్ల హైడ్రోపవర్, 27 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి జరుగుతుంది. -
3 ప్రాజెక్టుల డీపీఆర్‌లు వెనక్కి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) భారీ షాకిచ్చింది. అనుమతుల కోసం గతంలో రాష్ట్ర ప్రభుత్వం పంపించిన కాళేశ్వరం అదనపు టీఎంసీ, పాలమూరు–రంగారెడ్డి, వార్ధా ప్రాజెక్టుల డీపీఆర్‌లను వెనక్కి పంపించింది. ఈ మూడు ప్రాజెక్టులపై తాము లేవనెత్తిన అంశాల(అబ్జర్వేషన్ల)కు తెలంగాణ ప్రభుత్వం దీర్ఘకాలంగా సమాధానం ఇవ్వలేదని పేర్కొంది. బీఆర్ అంబేడ్కర్ వార్ధా ప్రాజెక్టు డీపీఆర్‌పై తాము లేవనెత్తిన అంశాలకు ఏడాదిగా సమాధానం ఇవ్వలేదని, సత్వరంగా ఇవ్వకపోతే డీపీఆర్‌ను వెనక్కి పంపిస్తామని హెచ్చరిస్తూ గత నెల 22న రాష్ట్ర ప్రభుత్వానికి సీడబ్ల్యూసీ లేఖ రాసింది. అయినా ప్రభుత్వం స్పందించకపోవడంతో.. మూడు ప్రాజెక్టుల డీపీఆర్‌లను పరిశీలించలేమని, వాటిని తమ పరిశీలనలో ఉన్న ప్రాజెక్టుల జాబితా నుంచి తొలగిస్తామని తేల్చి చెప్పింది. ఈ మేరకు డీపీఆర్‌లను వెనక్కి పంపిస్తూ సీడబ్ల్యూసీలోని ప్రాజెక్టుల మదింపు విభాగం డైరెక్టర్ రాజీవ్‌కుమార్ ఈ నెల 19న లేఖ రాశారు. తాము లేవనెత్తిన అంశాలకు 3 నెలల్లోగా సమాధానమివ్వకపోయినా, ట్రిబ్యునల్ పరిధిలో వివాదం ఉన్నా డీపీఆర్‌లను పరిశీలించకూడదనే నిబంధనలున్నాయని గుర్తుచేసింది. తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్‌కు మార్గం సుగమం వార్ధా ప్రాజెక్టుపై పలు అంశాలను లేవనెత్తుతూ 2023 జూలై 4, జూలై 20, 2024 నవంబర్ 17 తేదీల్లో సీడబ్ల్యూసీలోని వేర్వేరు డైరెక్టరేట్లు రాసిన లేఖలకు తెలంగాణ ప్రభుత్వం స్పందించలేదు. ప్రాజెక్టుతో మహారాష్ట్రలో ముంపు ఉండడంతో డీపీఆర్‌ను అంతర్రాష్ట్ర బోర్డు పరిశీలనకు పంపాలని సీడబ్ల్యూసీ గతంలో సూచించింది. ముంపుపై మహారాష్ట్ర నుంచి సమ్మతి తీసుకోవాలని కోరింది. ముంపు ఆధారంగా ప్రణాళికల్లో ఏమైనా మార్పులుంటే తెలపాలని సూచించింది. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు కింద హెడ్‌వర్క్స్, సొరంగాలు, ఇతర పనులు ఎంత మేరకు చేశారు? వ్యయం ఎంత? పనుల లొకేషన్ ఏమిటి? ప్రాజెక్టు కోసం సేకరించిన పంపుసెట్ల వివరాలు, వార్ధా లేదా ఇతర ప్రాజెక్టులో వాటి వినియోగంపై సమాచారం ఇవ్వాలని కోరింది. ప్రభుత్వం సమాచారం ఇవ్వకపోవడంతో సీడబ్ల్యూసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. వార్ధా ప్రాజెక్టు డీపీఆర్‌ను సీడబ్ల్యూసీ వెనక్కి పంపడంతో ప్రాణహిత కింద ప్రతిపాదించిన తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్ నిర్మించడానికి మార్గం సుగమమైందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అదనపు ప్రయోజనం లేకుండా అంత ఖర్చు ఎందుకు? ఎలాంటి అదనపు ప్రయోజనాలు లేకపోయినా కాళేశ్వరం అదనపు టీఎంసీ ప్రాజెక్టుపై రూ.27 వేల కోట్లను ఎలా ఖర్చు చేస్తారని సీడబ్ల్యూసీ ప్రశ్నించింది. దీనిపై ఎన్నో లేఖలు రాసినా సమాధానం ఇవ్వడం లేదని తప్పుబట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టు రోజువారీ పంపింగ్ సామర్థ్యాన్ని 2 టీఎంసీల నుంచి 3 టీఎంసీలకు పెంచడానికి ఈ పనులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే ప్రాజెక్టు నిర్వహణ ఆర్థికంగా ఆచరణీయమైనదని నిరూపించడానికి దానితో వచ్చే పంటల దిగుబడులను, వాటి విలువను భారీగా పెంచి చూపారంటూ సీడబ్ల్యూసీ తప్పుబట్టింది. చివరగా గత జనవరి 12న రాసిన లేఖకు ఇంకా సమాధానం ఇవ్వలేదని తెలిపింది. ట్రిబ్యునల్‌లో తేలేవరకు పాలమూరుకు అనుమతి నో ఏపీ, తెలంగాణల మధ్య కృష్ణా జలాల పంపిణీ వ్యవహారం కృష్ణా ట్రిబ్యునల్–2 పరిధిలో ఉన్నందున పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్‌ను పరిశీలించలేమని సీడబ్ల్యూసీ స్పష్టం చేసింది. ఉమ్మడి ఏపీకి కృష్ణా జలాల్లో ఉన్న 811 టీఎంసీల వాటాతో పాటు ‘పోలవరం’ప్రాజెక్టు నిర్మాణంతో సాగర్ ఎగువన లభ్యతలోకి వచి్చన 45 టీఎంసీల జలాలను ఏపీ, తెలంగాణ మధ్య పంపిణీ చేసే బాధ్యతను కృష్ణా ట్రిబ్యునల్–2కు కేంద్రం అప్పగించిన విషయాన్ని గుర్తు చేసింది. పోలవరం ప్రాజెక్టు ద్వారా 80 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు తరలిస్తే దానికి బదులుగా సాగర్ ఎగువ రాష్ట్రాలు 80 టీఎంసీలను వాడుకోవడానికి ట్రిబ్యునల్ అవకాశం కల్పించింది. ఈ 80 టీఎంసీల్లో మహారాష్ట్ర, కర్ణాటకలు 35 టీఎంసీలు వాడుకోగా, మిగిలి ఉన్న 45 టీఎంసీలను ఏపీ, తెలంగాణకు పంచే అంశం కృష్ణా ట్రిబ్యునల్–2లో పరిధిలో ఉంది. కాగా ట్రిబ్యునల్ తుది నిర్ణయం వచ్చే వరకు నిర్ణయం తీసుకోవడానికి వీలు లేదని సీడబ్ల్యూసీ తాజాగా స్పష్టం చేసింది. -
కడెంకు సీడబ్ల్యూసీ బృందం రాక
కడెం: కడెం ప్రాజెక్టు రక్షణపై సీడబ్ల్యూసీ (సెంట్రల్ వాటర్ కమిషన్) దృష్టి సారించింది. గతేడాది, ఈఏడాది ఎగువ నుంచి వరదనీరు వస్తున్న సమయంలో ప్రాజెక్టు గేట్లు తరచు మొరాయిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్ పరిస్థితిని అధ్యయనం చేసేందుకు, సీడబ్ల్యూసీ బృందం ఈనెల 27, 28, 29 తేదీ ల్లో వస్తున్నట్టు సమాచారం. కడెం ప్రాజెక్టు నిర్మాణం 65 ఏళ్ల క్రితం జరిగింది. ప్రస్తుతం డ్యాం సేఫ్టీ, వరద గేట్ల పనితీరు, ప్రాజెక్ట్ నీటినిల్వ సామర్థ్యం, ఔట్‌ఫ్లో కెపాసిటీ, ప్రాజెక్ట్ నిర్వహణ తదితరాలను బృందం పరిశీలిస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. సీడబ్ల్యూసీ బృందం వస్తుందన్న సమాచార నేపథ్యంలో ఆదివారం నుంచి ప్రాజెక్టు వరద గేట్లు, ఇతర మరమ్మతులు చకచకా చేస్తున్నారు. అదనపు గేట్ల ఏర్పాటుపై... కడెం ప్రాజెక్ట్ నుంచి దిగువకు 3 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసేలా డిజైన్ రూపొందించారు. అయితే గతేడాది 6 లక్షల క్యూసెక్కులకుపైగా ఇన్‌ఫ్లో రాగా, గేట్ల పైనుంచి వరద వెళ్లింది. దీంతో ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో సామర్థ్యం పెంచేలా కడెం ప్రాజెక్టు మొదటి గేటు పక్క నుంచి పాత జనరేటర్ గదివైపు ఐదు అదనపు గేట్లు ఏర్పాటు చేసే అవకాశాలపై అధ్యయనం చేయనున్నట్టు తెలిసింది. అదనపు గేట్ల ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై సీడబ్ల్యూసీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్టు సమాచారం. -
దేశంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పెరుగని నేటి లభ్యత
-
తెలంగాణ మంత్రులకు కౌంటర్ ఇస్తూ కేంద్ర జలశక్తి శాఖ ప్రెస్ నోట్
-
సీఎం జగన్ అలుపెరగని పోరాటం.. కదిలిన కేంద్రం
సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారంతోపాటు కేంద్ర జలసంఘం సాంకేతిక సలహా కమిటీ ఆమోదించిన ప్రకారం పోలవరం సవరించిన అంచనా వ్యయం నిధులివ్వడంపై కేంద్రం మరో అడుగు ముందుకేసింది. తాజాగా ఢిల్లీలో ప్రధాని మోదీతో సమావేశం సందర్భంగా ఈ ఏడాది జనవరి 24న అధికారుల కమిటీ చర్చించిన అంశాలను ప్రస్తావించి సమస్యలు పరిష్కరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. దీనిపై ప్రధాని మోదీ సానుకూలంగా స్పందిస్తూ ఈ మేరకు తన కార్యాలయ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయం నియమించిన రాష్ట్ర అధికారుల కమిటీతో చర్చించి సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలని కేంద్ర కమిటీని పీఎంవో ఆదేశించింది. ఈ క్రమంలో గురువారం ఢిల్లీలో కేంద్ర అధికారుల కమిటీతో రాష్ట్ర కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు ఆదిత్యనాథ్‌దాస్ నేతృత్వంలో బుధవారం ఢిల్లీలో సన్నాహక సమావేశం జరిగింది. నేడు జరిగే సమావేశం సానుకూలంగా ముగిసే అవకాశం ఉందని, సమస్యల పరిష్కారం కొలిక్కి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాష్ట్ర అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రధానితో భేటీలో ముఖ్యమంత్రి ప్రస్తావించిన ప్రధానాంశాలు ఇవీ ► పోలవరం పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.2,900 కోట్లను వెంటనే రీయింబర్స్ చేయాలి. ► సీడబ్ల్యూసీ టీఏసీ ఖరారు చేసిన మేరకు ప్రాజెక్టు వ్యయం రూ.55,548.87 కోట్ల సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలి. చేసిన పనులకు 15 రోజుల్లోగా రీయింబర్స్ చేసేలా చర్యలు తీసుకోవాలి. ► భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాల కింద నిర్వాసితులకు డీబీటీ (నేరుగా నగదు బదిలీ) పద్ధతిలో పరిహారాన్ని అందించాలి. ► రీసోర్స్ గ్యాప్ కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులను మంజూరు చేసి ఆదుకోవాలి. ► 2014–15కి సంబంధించిన బిల్లులు, 10వ వేతన సంఘం బకాయిలు, పెన్షన్లు తదితరాల రూపంలో రాష్ట్రానికి ఈ నిధులను రావాల్సి ఉంది. ► జాతీయ ఆహార భద్రతా చట్టం కింద అర్హుల ఎంపికలో హేతుబద్ధీకరణ లేకపోవడం వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. కేంద్రం ఇస్తున్న దానికంటే అదనంగా దాదాపు 56 లక్షల కుటుంబాలకు రాష్ట్రమే రేషన్ వ్యయాన్ని భరిస్తోంది. ఏపీకి నిర్దేశించిన కేటాయింపులను పునఃపరిశీలించాలని నీతిఆయోగ్ కూడా సూచించింది. ► తెలంగాణ డిస్కంల నుంచి రూ.6,756 కోట్ల మేర విద్యుత్ బకాయిలు రావాల్సి ఉంది. ఎనిమిదేళ్లుగా ఈ సమస్య అపరిష్కృతంగానే మిగిలింది. బకాయిలు ఇప్పిస్తే కష్టాల్లో ఉన్న రాష్ట్ర విద్యుత్ సంస్థలు గట్టెక్కుతాయి. ► హేతుబద్ధత లేని రాష్ట్ర విభజనతో ఏపీ తీవ్రంగా నష్టపోయింది. విభజన సమయంలో పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలను కేంద్రం అమలు చేయాలి. ► ప్రత్యేక హోదా సహా ఇతర హామీలను నెరవేర్చాలి. పారిశ్రామిక రంగం వృద్ధి, ఉద్యోగాల కల్పన, కేంద్రం నుంచి గ్రాంట్లు, పన్ను రాయితీలు తదితర ప్రయోజనాలు ప్రత్యేక హోదా ద్వారానే దక్కుతాయి. తద్వారా రాష్ట్రంపై భారం తగ్గుతుంది. ► రాష్ట్రంలో 26 జిల్లాలకు 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. మరో 12 కాలేజీలకు అనుమతులు తక్షణమే మంజూరు చేయాలి. ► కడపలో సమీకృత స్టీల్ ప్లాంట్ కోసం ఏపీఎండీసీకి గనులు కేటాయించాలి. ఏపీఎండీసీకి బీచ్‌శాండ్ మినరల్ ఏరియాలను కేటాయించాలి. 14 ఏరియాలకు కేటాయింపు అంశం ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఈ రంగంలో దాదాపు రూ.20 వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్నందున దీనిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలి. అలుపెరగని పోరాటం.. వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019 మే 30న ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పోలవరం ప్రాజెక్టుకు 2017–18 ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లకు ఆమోదించి, ఆ మేరకు నిధులు ఇవ్వడంతోపాటు విభజన హామీలు, ప్రత్యేక హోదా కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నారు. పలు దఫాలు ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తదితరులతో సమావేశమై సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ ఏడాది జనవరి 3న ఢిల్లీలో జరిగిన సమావేశం సందర్భంగా సీఎం జగన్ ప్రస్తావించిన అంశాలపై కేంద్ర అధికారులతో కమిటీని నియమించాలని పీఎంవోను ప్రధాని ఆదేశించారు. జనవరి 10న కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి నేతృత్వంలో జల్ శక్తి శాఖ, పౌరసరఫరాల శాఖ తదితర శాఖల కార్యదర్శులతో పీఎంవో కమిటీ ఏర్పాటు కాగా అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ నేతృత్వంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక, జలవనరులు, హోంశాఖ, పౌరసరఫరాల శాఖ కార్యదర్శులు తదితరులతో సీఎంవో కూడా కమిటీని నియమించింది. కమిటీ తొలుత జనవరి 24న ఢిల్లీలో సమావేశమై చర్చించింది. తాజాగా సీఎం జగన్ ఢిల్లీ పర్యటన సందర్భంగా ప్రధానితో ఆయా అంశాలను మరోసారి ప్రస్తావించడంతో కేంద్రంలో కదలిక వచ్చింది. -
కాఫర్ డ్యామ్ ఎత్తు పెంపు భేష్
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు ఎగువ కాఫర్ డ్యామ్‌ను మరింత పటిష్టపర్చడం.. ఒక మీటర్ ఎత్తు పెంపును కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అభినందించింది. భవిష్యత్తులో గరిష్టంగా వరదలు వచ్చినా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుజాగ్రత్తతో చేపట్టిన ఈ రక్షణ చర్యలను మంగళవారం సీడబ్ల్యూసీ (డిజైన్స్ విభాగం) సీఈ డీసీ భట్ ప్రశంసించారు. నిజానికి.. పోలవరం ఎగువ కాఫర్ డ్యామ్‌ను 28.5 లక్షల క్యూసెక్కుల సామర్థ్యానికే సీడబ్ల్యూసీ గతంలో డిజైన్ చేసింది. ఆ మేరకే పనులను ప్రభుత్వం పూర్తిచేసింది. కానీ, గోదావరి బేసిన్లో ఈనెల 13 నుంచి కురిసిన భారీ వర్షాలవల్ల పోలవరం వద్దకు 28.50 నుంచి 30 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశముందని సీడబ్ల్యూసీ అంచనా వేసింది. కానీ, 30 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా కాఫర్ డ్యామ్‌ను రక్షించుకోవడానికి చర్యలు చేపట్టాలని ఈనెల 14న జలవనరుల శాఖ అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. దీంతో ఎగువ కాఫర్ డ్యామ్‌కు ఎగువన 40.5 మీటర్ల నుంచి 43 మీటర్ల వరకూ రివిట్మెంట్పైన కోర్ (నల్లరేగడి మట్టి) వేసి, దానిపై ఇసుక బస్తాలను వేశారు. రెండు మీటర్ల వెడల్పు, ఒక మీటర్ ఎత్తుతో మట్టి, రాళ్లువేసి కాఫర్ డ్యామ్ ఎత్తును 43 నుంచి 44 మీటర్లకు పాక్షికంగా పెంచే పనులను 48గంటల రికార్డు సమయంలోనే అధికారులు పూర్తిచేశారు. సీడబ్ల్యూసీ అనుమతి కోరిన అధికారులు సాధారణంగా ఆగస్టులో గోదావరికి భారీ వరదలు వస్తాయి. ఇలా గరిష్టంగా వరద వచ్చినా ఎదుర్కొనేలా కాఫర్ డ్యామ్‌ను పటిష్టంచేసే పనులను చేపట్టాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు కావడంతో మరింత పటిష్టపర్చడం.. పూర్తిస్థాయిలో 44 మీటర్ల ఎత్తుకు పెంచే పనులు చేపట్టడానికి పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ), సీడబ్ల్యూసీ అనుమతిని రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు కోరారు. దీనిపై సీడబ్ల్యూసీ సీఈ (డిజైన్స్) డీసీ భట్ అధ్యక్షతన మంగళవారం కేంద్రం వర్చువల్‌గా సమావేశం నిర్వహించింది. పీపీఏ సభ్య కార్యదర్శి రఘురాం, సీఈ (డిజైన్స్) రాజేష్‌కుమార్, ఈఎన్సీ సి. నారాయణరెడ్డి, పోలవరం సీఈ సుధాకర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాఫర్ డ్యామ్ రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను సీడబ్ల్యూసీ, పీపీఏ అభినందించాయి. ఎత్తు పెంపు పనులకు శ్రీకారం.. ప్రస్తుతం పోలవరం ఎగువ కాఫర్ డ్యామ్‌ను 43 మీటర్ల ఎత్తుతో 2,454 మీటర్ల పొడవున నిర్మించారు. 40.5 మీటర్ల వరకూ కాఫర్ డ్యామ్ మధ్యలో అడుగుభాగాన గరిష్టంగా 237 మీటర్లు (మధ్యలో 16.2 మీటర్లు వెడల్పుతో కోర్).. పైభాగానికి వచ్చేసరికి కనిష్టంగా 9 మీటర్ల (మూడు మీటర్ల వెడల్పుతో కోర్) వెడల్పుతో కాఫర్ డ్యామ్‌ను నిర్మించారు. నీటి లీకేజీలను అడ్డుకునేందుకు కోర్ వేసిన మట్టం అంటే 40.5 మీటర్ల వరకూ డ్యామ్‌లో నీటి మట్టం చేరినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆ పైభాగాన 2.5 మీటర్లు రాళ్లు, మట్టితో పనులు చేశారు. 40.5 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తుకు నీటిమట్టం పెరిగితే.. లీకేజీలవల్ల కాఫర్ డ్యామ్‌కు నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. ఇటీవల గరిష్టంగా 26.9 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినప్పుడు పోలవరంలో ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద నీటిమట్టం 38.76 మీటర్లు నమోదైంది. కానీ, గరిష్టంగా 36 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా కాఫర్ డ్యామ్‌కు నష్టం కలగకుండా ఉండాలంటే 43 మీటర్ల వరకూ 3 మీటర్ల వెడల్పుతో కోర్‌వేసి.. పాక్షికంగా రెండు మీటర్ల వెడల్పుతో ఒక మీటర్ ఎత్తు పెంచిన పనులకు తోడుగా మిగతా ఏడు మీటర్లు వెడల్పుతో ఒక మీటర్ ఎత్తు పెంచాలని రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు చేసిన ప్రతిపాదనపై సీడబ్ల్యూసీ సీఈ డీసీ భట్ ఆమోదముద్ర వేశారు. కోర్‌ను పొరలు పొరలుగా వేసి.. రోలింగ్ చేస్తూ.. పటిష్టతను ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ పనులుచేయాలని సూచించారు. ఆ మేరకు అధికారులు పనులు చేపట్టారు. -
కదిలే కాసారాలు.. ఎక్కడ, ఎంత ప్రమాదకరం?
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా నదీ జలాల్లో విషపూరిత లోహ ధాతువులు ప్రమాదకర స్థాయికి చేరినట్లు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తాజా నివేదికలో హెచ్చరించింది. పరిశ్రమల నుంచి వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండానే వదిలేయడం, పంటలకు వాడే క్రిమిసంహారక మందుల అవశేషాలు వర్షపు నీటి ద్వారా చేరడం, విచ్చలవిడిగా గనుల తవ్వకాలు, మురుగు నీటిని నదుల్లోకి వదిలేస్తుండటం దీనికి ప్రధాన కారణమని పేర్కొంది. ఆర్సినిక్, నికెల్, లెడ్, కాడ్మియం, కాపర్, క్రోమియం, ఐరన్ లాంటి లోహ ధాతువులు నదీ జలాల్లో కలిసిపోవడం మానవాళి మనుగడకు పెనుముప్పుగా మారుతోంది. ఇవి రక్తప్రసరణ వ్యవస్థను తీవ్రంగా దెబ్బ తీయడంతోపాటు హృద్రోగాలు, కిడ్నీ, ఊపిరితిత్తుల సంబంధిత జబ్బులు చుట్టుముడుతున్నాయి. నాడీ వ్యవస్థ దెబ్బతిని అల్జీమర్స్ లాంటి రుగ్మతలు, చర్మ క్యాన్సర్లకు దారి తీస్తోంది. నదీ జలాలు విషతుల్యం కావడం మనుషులతోపాటు జంతువులు, పక్షులు, జలచరాల మనుగడపై కూడా తీవ్ర ప్రభావంచూపుతోంది. కాలుష్యంలో పోటాపోటీ.. దేశంలో హిమాలయ, ద్వీపకల్ప నదుల నీటి నాణ్యతపై 2018 నుంచి సీడబ్ల్యూసీ అధ్యయనం నిర్వహించింది. గంగా నుంచి కుందూ వరకూ దాదాపు అన్ని నదీ పరీవాహక ప్రాంతాల్లో 688 నీటి నాణ్యత పర్యవేక్షణ కేంద్రాల ద్వారా నమూనాలు సేకరించి పరీక్షించింది. కాలుష్యంలో నదుల మధ్య పెద్దగా తేడా లేనట్లు అధ్యయనంలో వెల్లడైంది. ఎక్కడ, ఎంత ప్రమాదకరం? ఆర్సినిక్: ఇది అత్యంత విషపూరితమైన లోహం. ఆర్సినిక్ ధాతువులు లీటర్ నీటిలో 10 మైక్రో గ్రాములు (0.01 మిల్లీ గ్రాములు) వరకూ ఉంటే ఇబ్బంది ఉండదు. దేశంలో అన్ని నదుల్లోనూ 2,834 చోట్ల నీటి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించగా ఎనిమిది ప్రాంతాల్లో ఆర్సినిక్ ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు వెల్లడైంది. ► భద్రాచలం వద్ద గోదావరి జలాల్లో లీటర్ నీటిలో 10.17 మైక్రో గ్రాముల ఆర్సినిక్ను గుర్తించారు. ► తమిళనాడులో కావేరి ఉప నది అరసలర్ జలాల్లో అత్యధికంగా లీటర్ నీటిలో 13.33 మైక్రో గ్రాముల ఆర్సినిక్ ధాతువులు ఉన్నట్లు వెల్లడైంది. లెడ్: ఆర్సినిక్ స్థాయిలోనే అత్యంత విషపూరితమైన లోహం. లీటర్ నీటిలో పది మైక్రో గ్రాముల లెడ్ ధాతువులు ఉంటే ఇబ్బంది ఉండదు. దేశంలో 3,111 చోట్ల నమూనాలు పరీక్షించగా 34 ప్రాంతాల్లో లెడ్ ధాతువులు అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని సోన్ నదీ జలాల్లో అత్యధికంగా లీటర్ నీటిలో 67.5 మైక్రో గ్రాముల లెడ్ ఉంది. కాడ్మియం: ఆర్సినిక్, లెడ్ తర్వాత కాడ్మియం అత్యంత విషపూరితమైన లోహం. లీటర్ నీటిలో మూడు మైక్రో గ్రాముల వరకూ ఉంటే ఇబ్బంది ఉండదు. దేశంలోని నదుల్లో 3,113 చోట్ల నీటి నమూనాలు పరీక్షించగా 11 చోట్ల అత్యంత ప్రమాదకర స్థాయిలో కాడ్మియం ధాతువులున్నాయి. ► బద్రాచలం వద్ద గోదావరిలో లీటర్ నీటిలో 4.08 మైక్రో గ్రాముల కాడ్మియం ధాతువులున్నాయి. ►ఉత్తరప్రదేశ్‌లో సుకేత నదీ జలాల్లో లీటర్ నీటిలో గరిష్టంగా 12.57 మైక్రో గ్రాముల కాడ్మియం ఉన్నట్లు తేలింది. నికెల్: ఇది మరో విషపూరిత లోహం. లీటర్ నీటిలో 20 మైక్రో గ్రాముల వరకూ నికెల్ ధాతువులు ఉంటే ఇబ్బంది ఉండదు. 3,099 చోట్ల నీటి నమూనాలు పరీక్షించగా 199 చోట్ల ప్రమాదకర స్థాయిలో గుర్తించారు. ► కీసర వద్ద మున్నేరు జలాల్లో లీటర్ నీటికి 33.84 మైక్రో గ్రాములు, వైరా జలాల్లో మధిర వద్ద లీటర్ నీటిలో 71.73 మైక్రో గ్రాములు, విజయవాడ వద్ద కృష్ణా జలాల్లో లీటర్‌కు 56.71 మైక్రో గ్రాముల నికెల్ ధాతువులు ఉన్నట్లు తేలింది. సింగవరం వద్ద చిత్రావతి జలాల్లో లీటర్ నీటిలో 56.58 మైక్రో గ్రాములు, తుంగభద్ర జలాల్లో లీటర్ నీటిలో బావపురం వద్ద 24.78, మంత్రాలయం వద్ద 25.53 మైక్రో గ్రాముల నికెల్ ధాతువులు ఉన్నట్లు వెల్లడైంది. ► గోదావరి జలాల్లో లీటర్ నీటికి భద్రాచలం వద్ద 45.79, పోలవరం వద్ద 61.48 మైక్రో గ్రాములు నికెల్ ధాతువులు ఉన్నట్లు తేలింది. ► తమిళనాడు ఎల్నుతిమంగలం వద్ద నొయ్యల్ నదీ జలాల్లో లీటర్ నీటిలో గరిష్టంగా 242.90 మైక్రో గ్రాముల నికెల్ ధాతువులు ఉన్నట్లు వెల్లడైంది. క్రోమియం: లీటర్ నీటిలో 50 మైక్రో గ్రాముల వరకూ క్రోమియం ధాతువులు ఉంటే ఇబ్బంది ఉండదు. 3,106 చోట్ల నీటి నమూనాలు సేకరించి పరీక్షించగా 50 చోట్ల ప్రమాదకర స్థాయిలో ఉన్నాయి. ► రాష్ట్రంలో అల్లాదుపల్లి వద్ద కుందూ జలాల్లో లీటర్‌కు 56.04 మైక్రో గ్రాముల క్రోమియం ధాతువులున్నాయి. తుంగభద్ర జలాల్లో హర్లహళ్లి వద్ద లీటర్ నీటిలో 92.72 మైక్రో గ్రాముల క్రోమియం ఉంది. ► గోదావరి జలాల్లో మంచిర్యాల వద్ద లీటర్ నీటిలో 51.63 మైక్రో గ్రాములు, కిన్నెరసాని జలాల్లో లీటర్‌కు 60.44 మైక్రో గ్రాముల క్రోమియం ధాతువులు ఉన్నట్లు తేలింది. ► ఛత్తీస్‌గఢ్ హస్డియో నదీ జలాల్లో లీటర్ నీటికి గరిష్టంగా 180.47 మైక్రోగ్రాముల క్రోమియం ధాతువులు ఉన్నట్లు వెల్లడైంది. కాపర్: లీటర్ నీటిలో 50 మైక్రో గ్రాముల లోపు మాత్రమే కాపర్ ధాతువులు ఉండాలి. ► దేశంలో 3,107 ప్రాంతాల్లో నీటి నమూనాలు పరీక్షించగా 17 చోట్ల ప్రమాదకర స్థాయిలో ఉన్నాయి. ► మహారాష్ట్రలోని ఉల్హాస్ నదీ జలాల్లో లీటర్ నీటికి గరిష్టంగా 132.64 మైక్రో గ్రాముల కాపర్ ధాతువులు ఉన్నట్లు వెల్లడైంది. ఐరన్: లీటర్‌కు 300 మైక్రో గ్రాములు (0.3 మిల్లీ గ్రాములు) వరకూ ఐరన్ ధాతువులు ఉంటే ఇబ్బంది ఉండదు. దేశంలో 414 చోట్ల ప్రమాదకర స్థాయిలో ఐరన్ ధాతువులు ఉన్నట్లు తేలింది. ► గోదావరి జలాల్లో లీటర్ నీటికి భద్రాచలం వద్ద 0.69, పోలవరం వద్ద 4.75 మిల్లీ గ్రాముల ఐరన్ ధాతువులు ఉన్నట్లు తేలింది. ► లీటర్ నీటికి మున్నేరు జలాల్లో 1.86, ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా జలాల్లో 0.91 మిల్లీ గ్రాముల ఐరన్ ధాతువులు ఉన్నట్లు వెల్లడైంది. ► నాగావళిలో శ్రీకాకుళం వద్ద లీటర్ నీటిలో 1.30 మిల్లీ గ్రాములు, మెళియపుట్టి వద్ద వంశధార జలాల్లో 1.09 మిల్లీ గ్రాములు, నెల్లూరు జిల్లా నాయుడుపేట వద్ద స్వర్ణముఖి జలాల్లో 0.49 మిల్లీ గ్రాముల ఐరన్ ధాతువులు ఉన్నట్లు గుర్తించారు. ► బెంగాల్లో పరక్కా ఫీడర్ చానల్ జలాల్లో లీటర్ నీటికి గరిష్టంగా 11.24 మిల్లీ గ్రాముల ఐరన్ ధాతువులున్నాయి. -
వంశధార జలాల వివాదానికి చరమగీతం
సాక్షి, అమరావతి: వంశధార నదీ జలాల వినియోగంపై ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదానికి ముగింపు పలుకుతూ ఇచ్చిన తుది తీర్పునే వీడబ్ల్యూడీటీ (వంశధార జల వివాదాల ట్రిబ్యునల్) ఖరారు చేసింది. సెప్టెంబర్ 13, 2017న ఇచ్చిన తుది తీర్పుపై అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం–1956 సెక్షన్–5(3) కింద ఒడిశా సర్కార్ లేవనెత్తిన అభ్యంతరాలను తోసిపుచ్చింది. ఈ మేరకు సోమవారం వీడబ్ల్యూడీటీ చైర్మన్ జస్టిస్ డాక్టర్ ముకుందకం శర్మ ఉత్తర్వులు జారీ చేస్తూ కేంద్రానికి నివేదించారు. వంశధార ట్రిబ్యునల్ తుది తీర్పును నోటిఫై చేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తే.. ఆ తీర్పు అమల్లోకి వస్తుంది. తుది తీర్పును సవాల్ చేస్తూ ఒడిశా సర్కార్ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం ఆధారంగా కేంద్రం ఆ తీర్పును నోటిఫై చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఏడున్నరేళ్లపాటు విచారణ.. వంశధార జలాల వివాదాన్ని ఏడున్నరేళ్లపాటు విచారించిన ట్రిబ్యునల్ సెప్టెంబర్ 13, 2017న ఇరు రాష్ట్రాలకు సమన్యాయం చేస్తూ తుది తీర్పు ఇచ్చింది. ఇందులో ప్రధానాంశాలు.. – సెప్టెంబరు 30, 1962న ఆంధ్రప్రదేశ్, ఒడిశా ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు.. వంశధారలో 75 శాతం నీటి లభ్యత ఆధారంగా 115 టీఎంసీలు అందుబాటులో ఉంటాయని అంచనా. ట్రిబ్యునల్ వాటిని చెరి సగం అంటే 57.5 టీఎంసీల చొప్పున పంపిణీ చేసింది. – శ్రీకాకుళం జిల్లాలో నేరడి వద్ద వంశధారపై బ్యారేజీ నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. ఈ బ్యారేజీ నుంచి నీటిని ఇరు రాష్ట్రాలు వాడుకోవాలని సూచించింది. బ్యారేజీ కుడి వైపు స్లూయిజ్‌ల ద్వారా రోజుకు ఎనిమిది వేల క్యూసెక్కుల చొప్పున తరలించడానికి ఏపీకి అనుమతి ఇచ్చింది. తీర్పు అమలు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన ఆర్నెళ్లలోగా బ్యారేజీ ఎడమ వైపు నుంచి నీటిని వాడుకోవడానికి వీలుగా ఏపీకి ప్రతిపాదనలు పంపాలని ఒడిశాకు సూచించింది. – నేరడి బ్యారేజీ నిర్మాణానికయ్యే వ్యయాన్ని ఆయకట్టు ఆధారంగా దామాషా పద్ధతిలో ఏపీ, ఒడిశాలు భరించాలని పేర్కొంది. – నేరడి బ్యారేజీలో ముంపునకు గురయ్యే 106 ఎకరాల భూమిని సేకరించి ఏపీ ప్రభుత్వానికి అప్పగించాలని ఒడిశాను ఆదేశించింది. ఇందుకు పరిహారాన్ని ఒడిశాకు చెల్లించాలని ఏపీ ప్రభుత్వానికి సూచించింది. – కాట్రగడ్డ సైడ్‌వియర్ హెడ్ రెగ్యులేటర్‌ను జూన్ 1 నుంచి ఎనిమిది టీఎంసీలు తరలించే వరకు లేదా నవంబర్ 30 వరకు తెరిచి ఉంచాలని పేర్కొంది. – నేరడి బ్యారేజీ పూర్తయ్యాక కాట్రగడ్డ సైడ్‌వియర్‌ను పూర్తిగా తొలగించాలని షరతు విధించింది. – ఈ తీర్పు అమలును పర్యవేక్షించడానికి కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) సీఈ అధ్యక్షతన, ఇరు రాష్ట్రాల అధికారులు సభ్యులుగా అంతర్రాష్ట్ర పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయాలని సూచించింది. ఒడిశా అభ్యంతరాలను తోసిపుచ్చిన ట్రిబ్యునల్.. ఒడిశా లేవనెత్తిన అభ్యంతరాలపై విచారణ జరిపిన వంశధార ట్రిబ్యునల్ వాటిని తోసిపుచ్చింది. వంశధారలో 115 టీఎంసీల లభ్యత లేదన్న వాదనను కొట్టిపారేసింది. ఎంత నీటి లభ్యత ఉంటే.. అంత నీటిని దామాషా పద్ధతిలో చెరి సగం పంచుకోవాలని ఆదేశించింది. కాట్రగడ్డ సైడ్‌వియర్ నుంచి వాడుకునే జలాలపై పర్యవేక్షణ కమిటీ వేయాలన్న సూచననూ తోసిపుచ్చింది. తీర్పు అమలును పర్యవేక్షించేందుకు అంతర్రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో మరో కొత్త కమిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. వంశధార జలాల వివాద క్రమం ఇదీ.. – ఫిబ్రవరి, 2006: ఏపీ ప్రభుత్వం చేపట్టిన వంశధార ప్రాజెక్టు ఫేజ్–2, స్టేజ్–2పై అభ్యంతరం తెలుపుతూ కేంద్రానికి ఫిర్యాదు చేసిన ఒడిశా. అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం–1956 సెక్షన్–3 ప్రకారం ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి వివాదాన్ని పరిష్కరించాలని ప్రతిపాదన – ఏప్రిల్ 24, 2006: వివాదాన్ని పరిష్కరించేందుకు ఏపీ, ఒడిశా జలవనరుల అధికారులతో కేంద్ర జలవనరుల శాఖ అధికారుల మొదటి సమావేశం.. చర్చలు విఫలం – డిసెంబర్ 5, 6, 2006: ఇరు రాష్ట్రాల అధికారులతో కేంద్ర అధికారుల రెండో దఫా సమావేశం.. చర్చలు విఫలం – మార్చి 2, 2007: ఇరు రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతో కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి ఉన్నత స్థాయి సమావేశం.. చర్చలు విఫలం – ఏప్రిల్ 30, 2007: అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం–1956 ప్రకారం ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసి.. వంశధార వివాదాన్ని పరిష్కరించాలని సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన ఒడిశా –ఫిబ్రవరి 6, 2009: ఈ వివాదంపై విచారించిన సుప్రీంకోర్టు.. ఆర్నెళ్లలోగా ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసి, వివాదాన్ని పరిష్కరించాలని కేంద్రానికి ఆదేశం – ఏప్రిల్ 24, 2010: వంశధార జల వివాదాల ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసిన కేంద్రం – డిసెంబర్ 17, 2013: కాట్రగడ్డ సైడ్‌వియర్ నిర్మాణానికి ఏపీకి అనుమతి ఇస్తూ కేంద్రానికి మధ్యంతర నివేదిక ఇచ్చిన వంశధార ట్రిబ్యునల్ – సెప్టెంబర్ 15, 2014: వంశధార ట్రిబ్యునల్ మధ్యంతర నివేదికను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన ఒడిశా.. కాట్రగడ్డ సైడ్‌వియర్ నిర్మాణ పనులను ఏపీ కొనసాగించవచ్చన్న సుప్రీంకోర్టు – సెప్టెంబర్ 13, 2017: తుది తీర్పు జారీ చేసిన వంశధార ట్రిబ్యునల్ – డిసెంబర్ 12, 2017: తుది తీర్పుపై అభ్యంతరాలను లేవనెత్తిన ఒడిశా సర్కార్ – జూన్ 21, 2021: ఒడిశా అభ్యంతరాలను తోసిపుచ్చుతూ.. తుది తీర్పును ఖరారు చేస్తూ కేంద్రానికి నివేదిక ఇచ్చిన వంశధార ట్రిబ్యునల్ -
తెలుగు రాష్ట్రాల్లో జల సిరులు
సాక్షి, అమరావతి: ఉత్తరాదితో పోల్చితే దక్షిణాది రాష్ట్రాల్లో.. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లోని జలాశయాల్లో నీటి నిల్వ అధికంగా ఉన్నట్లు సీడబ్ల్యూసీ వెల్లడించింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా నదుల్లో వరద ప్రవాహం, సహజ సిద్ధ వరద ప్రవాహం కనిష్ట స్థాయికి చేరుకుంది. ఖరీఫ్ పూర్తయింది. రబీలో పంటలు సాగు చేస్తున్నారు. ఈ దశలో సీడబ్ల్యూసీ (కేంద్ర జల సంఘం) దేశంలో తన పర్యవేక్షణలోని 128 జలాశయాల్లో నీటి నిల్వలపై అధ్యయనం చేసింది. దక్షిణాది రాష్ట్రాల్లోని జలాశయాల్లోని నీటి నిల్వలు గత పదేళ్ల సగటుతో పోల్చితే ఈ ఏడాది 50% అధికంగా ఉన్నట్లు ఆ అధ్యయనంలో తేలింది. ఈ మేరకు శుక్రవారం విడుదల చేసిన నివేదికలో ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి. ► దేశ వ్యాప్తంగా సీడబ్ల్యూసీ పర్యవేక్షణలోని 128 జలాశయాల పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 9,104.38 టీఎంసీలు. ప్రస్తుతం ఈ జలాశయాల్లో 3,716.42 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. గతేడాది ఇదే రోజుకు 4,116.42 టీఎంసీలు ఉండేవి. గత పదేళ్లలో ఈ జలాశయాల్లో సగటున 3,021.99 టీఎంసీలు నిల్వ ఉండేవి. ► దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళల్లో సీడబ్ల్యూసీ పర్యవేక్షణలోని జలాశయాల పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 1,864.94 టీఎంసీలు. ప్రస్తుతం ఈ జలాశయాల్లో 1,169.60 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. గతేడాది ఇదేరోజు వీటిలో 1,133.23 టీఎంసీలు నిల్వ ఉండేవి. గత పదేళ్లలో ఈ జలాశయాల్లో సగటున 787.5 టీఎంసీల నిల్వ ఉండేవి. అంటే.. గత పదేళ్ల సగటు నీటి నిల్వ కంటే ఈ ఏడాది 50 శాతం అధికంగా నిల్వ ఉన్నట్లు స్పష్టమవుతోంది. ► ఉత్తరాది, ఈశాన్య, పశ్చిమ, మధ్య భారతదేశంలోని రాష్ట్రాల్లోని జలాశయాల్లో నీటి నిల్వలు గతేడాది కంటే ఈ ఏడాది తక్కువగా ఉన్నాయి. ► దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లోని జలాశయాల్లో నీటి నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. కృష్ణా బేసిన్లో జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లోనూ.. గోదావరి బేసిన్లో శ్రీరాంసాగర్, నిజాంసాగర్, లోయర్ మానేరు డ్యామ్, ఎల్లంపల్లి ప్రాజెక్టుల్లోనూ.. పెన్నా బేసిన్లో సోమశిల, కండలేరు, ఇతర బేసిన్లలో ఏలేరు జలాశయంలో నీటి నిల్వలు గతేడాది కంటే అధికంగా ఉన్నట్లు సీడబ్ల్యూసీ పేర్కొంది. ► ఈ ఏడాది ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చితే దక్షిణాది రాష్ట్రాల్లో రబీ పంటల సాగుకు.. వేసవిలో తాగునీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని సీడబ్ల్యూసీ అంచనా వేసింది. -
పోలవరం అంచనా వ్యయం రూ.47,725.74 కోట్లు
సాక్షి, అమరావతి: పోలవరం జాతీయ ప్రాజెక్టుకు 2017–18 ధరల ప్రకారం రూ.47,725.74 కోట్ల అంచనా వ్యయానికి కేంద్ర జల్ శక్తి శాఖ ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ (పెట్టుబడి అనుమతి) ఇచ్చేందుకు మార్గం సుగమమైంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో చేపట్టిన 15 జాతీయ ప్రాజెక్టులకు ఇచ్చిన తరహాలోనే.. పోలవరం ప్రాజెక్టుకూ నీటిపారుదల విభాగం పనులకు నిధులు మంజూరు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను బలపరుస్తూ జల్ శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్‌కు.. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సభ్యులు ఎస్కే హల్దార్ మంగళవారం నివేదిక ఇచ్చారు. యూపీ సింగ్ అధ్యక్షతన పనిచేసే సీడబ్ల్యూసీ టీఏసీ (సాంకేతిక సలహా మండలి) 2017–18 ధరల ప్రకారం పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయానికి ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఇక ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ కమిటీకి కూడా యూపీ సింగ్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టుకు 2017–18 ధరల ప్రకారం నిధులు ఇచ్చేందుకు అంగీకరిస్తూ ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఇవ్వడం ఇక లాంఛనమే. ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఇస్తూ కేంద్ర జల్ శక్తి శాఖ పంపిన ఫైలును కేంద్ర ఆర్థిక శాఖ యథాత«థంగా ఆమోదించి కేంద్ర కేబినెట్‌కు పంపుతుంది. విభజన చట్టం ప్రకారం ఆ ఫైలును కేంద్ర కేబినెట్ ఆమోదిస్తుంది. దాంతో.. 2017–18 ధరల ప్రకారం పోలవరం ప్రాజెక్టు పనులకు కేంద్రం నిధులు విడుదల చేస్తుంది. చంద్రబాబు కమీషన్ల కక్కుర్తి విభజన చట్టం ప్రకారం వంద శాతం ఖర్చుతో పోలవరం ప్రాజెక్టును కేంద్రమే పూర్తి చేయాలి. కానీ చంద్రబాబు కమీషన్ల కక్కుర్తితో పోలవరం నిర్మాణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని పదేపదే కోరుతూ వచ్చారు. ఇందుకోసం రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదం చేసే ప్రత్యేక హోదాను సైతం తాకట్టు పెట్టారు. ఈ నేపథ్యంలో 2016 సెప్టెంబర్ 7న అర్ధరాత్రి కేంద్రం రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. ఆ మరుసటి రోజే 2014 ఏప్రిల్ 1 నాటికి ప్రాజెక్టు నీటిపారుదల విభాగంలో మిగిలిన పనికి అయ్యే వ్యయాన్ని మాత్రమే ఇస్తామనే మెలిక పెట్టింది. ప్రత్యేక ప్యాకేజీని అమలు చేస్తూ అదే నెల 30న కేంద్ర ఆర్థిక శాఖ జారీ చేసిన మెమొరాండంలోనూ ఇదే అంశాన్ని స్పష్టం చేసింది. 2017 మార్చి 15న కేంద్ర కేబినెట్ ప్యాకేజీకి ఆమోద ముద్ర వేసింది. అన్యాయంపై నోరుమెదపని వైనం పోలవరం ప్రాజెక్టుకు 2014 ఏప్రిల్ 1 నాటి ధరల ప్రకారం నీటిపారుదల విభాగానికి అయ్యే వ్యయాన్ని మాత్రమే విడుదల చేస్తామని.. డిజైన్ మారినా, ధరలు పెరిగి అంచనా వ్యయం పెరిగినా, భూసేకరణ వ్యయం పెరిగినా ఆ భారం రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని తేల్చిచెప్పింది. పోలవరం ప్రాజెక్టుకు 2010–11 ధరల ప్రకారం మొదటిసారి సవరించిన అంచనా వ్యయం రూ.16,010.45 కోట్లకు 2017 మే 8న కేంద్ర జల్ శక్తి శాఖ ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్‌ను ఇచ్చినప్పుడు కూడా 2014 ఏప్రిల్ 1కి ముందు నీటిపారుదల విభాగానికి చేసిన ఖర్చుపోనూ, ఆ రోజు ధరల మేరకు మిగిలిన మొత్తాన్ని మాత్రమే విడుదల చేస్తామని స్పష్టం చేసింది. అప్పట్లో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామి. టీడీపీకి చెందిన అశోక్ గజపతిరాజు, సుజనాచౌదరిలు కేంద్ర కేబినెట్లో సభ్యులుగా ఉన్నారు. అయినా ఈ అన్యాయంపై నాటి సీఎం చంద్రబాబు నోరుమెదప లేదు. 2013–14 ధరలతో నిధుల విడుదలకు ప్రధానికి లేఖ పైగా 2013–14 ధరల ప్రకారం పోలవరం అంచనా వ్యయాన్ని ఆమోదించి నిధులు విడుదల చేయాలని కోరుతూ 2018 జనవరి 12న ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఇదే అంశాలను ఎత్తిచూపుతూ 2013–14 ధరల ప్రకారం పోలవరం ప్రాజెక్టు నీటిపారుదల విభాగం వ్యయాన్ని రూ.20,398.61 కోట్లుగా నిర్ధారించి, ఆమోదించాలని.. అప్పుడే రూ.2,234.28 కోట్లను రీయింబర్స్ చేస్తామని తేల్చిచెబుతూ 2020 అక్టోబర్ 12న కేంద్ర జల్ శక్తి శాఖకు కేంద్ర ఆర్థిక శాఖ లేఖ రాసింది. దాన్ని పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ)కి పంపిన కేంద్ర జల్ శక్తి శాఖ.. రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని తీసుకోవాలని కోరింది. 2017–18 ధరల ప్రకారమే ఇవ్వాలన్న జగన్ ప్రభుత్వం కేంద్ర ప్రతిపాదనపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తక్షణమే స్పందించారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌లను హుటాహుటిన ఢిల్లీకి పంపారు. కేంద్ర ఆర్థిక, జల్ శక్తి శాఖ మంత్రులు నిర్మలా సీతారామన్, గజేంద్రసింగ్ షెకావత్‌లతో వారిద్దరూ సమావేశమై 2017–18 ధరల ప్రకారమే పోలవరానికి నిధులు ఇవ్వాలని కోరారు. కేంద్రం ఆమోదించిన భూసేకరణ చట్టం వల్ల పోలవరం ప్రాజెక్టు భూసేకరణ, సహాయ పునరావాస (ఆర్ఆర్) ప్యాకేజీ వ్యయం రూ.28,191.03 కోట్లకు పెరిగిందని.. ఈ నేపథ్యంలో 2013–14 ధరల ప్రకారం రూ.20,398.61 కోట్లతో ప్రాజెక్టును పూర్తి చేయడానికి సాధ్యం కాదని.. 2017–18 ధరల ప్రకారమే నిధులను విడుదల చేసి ప్రాజెక్టును పూర్తి చేయడానికి సహకరించాలని కోరుతూ అక్టోబర్ 31న ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం వైఎస్ జగన్ లేఖ రాశారు. గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న లోపాలను లేఖలో ఎత్తిచూపారు. బేషరతుగా రూ.2,234.28 కోట్లు సీఎం లేఖపై ప్రధాని మోదీ స్పందించారు. కేంద్ర ఆర్థిక శాఖకు మార్గనిర్దేశనం చేశారు. దాంతో రూ.2,234.28 కోట్లను పోలవరానికి బేషరతుగా విడుదల చేస్తూ నవంబర్ 2న కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులిచ్చింది. అదే రోజున సమావేశమైన పీపీఏ సర్వసభ్య సమావేశం కూడా రాష్ట్ర ప్రభుత్వ వాదనతో ఏకీభవించింది. 2017–18 ధరల ప్రకారం నిధులు విడుదల చేస్తేనే ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవకాశం ఉంటుందని తేల్చిచెబుతూ కేంద్ర జల్ శక్తి శాఖకు నివేదిక పంపింది. ఈ క్రమంలో ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌లతో సమావేశమైన ప్రతిసారి పోలవరానికి 2017–18 ధరల ప్రకారం నిధులు ఇచ్చి.. శరవేగంగా పూర్తి చేయడానికి సహకరించాలని కోరారు. దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. రూ.2,234.28 కోట్లను ఇప్పటికే రీయింబర్స్ చేసింది. ఫలించిన సీఎం వైఎస్ జగన్ కృషి పోలవరానికి 2017–18 ధరల ప్రకారం నిధులు విడుదల చేయాలన్న పీపీఏ సిఫారసుపై కేంద్ర జల్ శక్తి శాఖ సీడబ్ల్యూసీ అభిప్రాయాన్ని కోరింది. ఈ నేపథ్యంలోనే ఎస్కే హల్దార్ మంగళవారం నివేదిక ఇచ్చారు. ప్రాజెక్టు పనుల్లో నీటిపారుదల, నీటి సరఫరా వేర్వేరు కాదని.. రెండు ఒకటేనని పునరుద్ఘాటించారు. నీటిపారుదల విభాగం కిందకు జలాశయం(హెడ్‌వర్క్స్),భూసేకరణ, ఆర్అండ్ఆర్ (సహాయ పునవాస ప్యాకేజీ), కాలువలు, పిల్ల కాలువలు (డిస్ట్రిబ్యూటరీలు) వస్తాయని తేల్చిచెప్పారు. సాగునీటి కాలువల ద్వారానే తాగునీరు.. పారిశ్రామిక అవసరాలకు నీరు సరఫరా చేస్తారని స్పష్టం చేశారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో చేపట్టిన 15 జాతీయ ప్రాజెక్టులకూ నీటిపారుదల విభాగం కింద నిధులు ఇస్తున్నామని ఎత్తిచూపారు. పోలవరం ప్రాజెక్టుకూ అదే రీతిలో నిధులు ఇవ్వాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే పోలవరం అంచనా వ్యయానికి కేంద్ర జల్ శక్తి శాఖ ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఇచ్చేందుకు మార్గం సుగమమైంది. ఆర్సీసీ ఆమోదించిన వ్యయానికే.. పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని 2017–18 ధరల ప్రకారం రూ.55,548.87 కోట్లుగా సీడబ్ల్యూసీ టీఏసీ 2019 ఫిబ్రవరి 11న ఆమోదించింది. జాతీయ ప్రాజెక్టుల అంచనా వ్యయం 25 శాతం కంటే పెరిగితే.. వాటిని రివైజ్డ్ కాస్ట్ కమిటీ (ఆర్సీసీ)కి పంపి.. మదింపు చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ 2016లో మార్గదర్శకాలు జారీ చేసింది. వాటి ప్రకారం పోలవరం అంచనా వ్యయాన్ని ఆర్సీసీకి ప్రతిపాదించారు. కేంద్ర జల్ శక్తి శాఖ ఆర్థిక సలహాదారు జగ్మోహన్ గుప్తా నేతృత్వంలోని ఆర్సీసీ పోలవరం అంచనా వ్యయాన్ని రూ.47,725.74 కోట్లుగా తేల్చి కేంద్ర జల్ శక్తి, ఆర్థిక శాఖలకు నివేదిక ఇచ్చింది. ఈ అంచనా వ్యయానికే కేంద్ర జల్ శక్తి శాఖ ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఇస్తుందని అధికారవర్గాలు తెలిపాయి. -
తెలుగు రాష్ట్రాలకు గోదావరి బోర్డు ఆదేశం
-
ముందుకెళ్లొద్దు: గోదావరి బోర్డు
సాక్షి, అమరావతి: కేంద్ర జల్‌శక్తి శాఖ ఉత్తర్వుల ప్రకారం.. గోదావరిపై కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులపై ముందుకెళ్లొద్దని ఉభయ తెలుగు రాష్ట్రాలను గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఆదేశించింది. తెలంగాణలో కాళేశ్వరంతో సహా అన్ని ప్రాజెక్టుల డీపీఆర్‌లను ఇవ్వాల్సిందేనని బోర్డు స్పష్టం చేసింది. గోదావరి బోర్డు, కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) డీపీఆర్‌లను పరిశీలించి సాంకేతికంగా సిఫార్సు చేయాలని, అపెక్స్ కౌన్సిల్ నుంచి ప్రాజెక్టులకు అనుమతి తీసుకోవాలని ఇరు రాష్ట్రాలకు బోర్డు సూచించింది. ఈనెల 10వ తేదీలోగా డీపీఆర్‌లు ఇవ్వాల్సిందేనని ఇరు రాష్ట్రాలకు బోర్డు స్పష్టం చేసింది. అపెక్స్ కౌన్సిల్‌కు తక్షణమే అజెండాను పంపాలని మరోసారి సూచించింది. శుక్రవారం హైదరాబాద్‌లోని బోర్డు కార్యాలయంలో చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన గోదావరి బోర్డు సమావేశమైంది. రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి రజత్‌కుమార్, ఈఎన్సీ మురళీధర్, బోర్డు సభ్య కార్యదర్శి పాండే తదితరులు పాల్గొన్నారు. సీడబ్ల్యూసీ సాంకేతిక అనుమతే ప్రాతిపదిక విభజన తర్వాత అంటే 2014 జూన్ 2 తర్వాత చేపట్టినవి, సీడబ్ల్యూసీ నుంచి సాంకేతిక అనుమతి లేని ప్రాజెక్టులన్నీ కొత్తవిగానే పరిగణిస్తామని బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ స్పష్టం చేశారు. 450.31 టీఎంసీల తరలింపు పనులు... ► తెలంగాణ సర్కార్ గోదావరిపై కొత్తగా ప్రాజెక్టులు చేపట్టలేదని ఆ రాష్ట్ర అధికారులు పేర్కొనటంపై ఏపీ అధికారులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ‘గోదావరి బోర్డు, అపెక్స్ కౌన్సిల్ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే 225 టీఎంసీల సామర్థ్యంతో కాళేశ్వరం ఎత్తిపోతల, 22 టీఎంసీల సామర్థ్యంతో జీఎల్ఐఎస్–3, 70 టీఎంసీలతో సీతారామ ఎత్తిపోతల, 100 టీఎంసీలతో తుపాకులగూడెం, 23.76 టీఎంసీలతో తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు, 0.35 టీఎంసీల సామర్థ్యంతో భీమ్కుంద్ బ్యారేజీ, ఐదు టీఎంసీలతో చనాఖా–కోరటా, 1.20 టీఎంసీలతో పింపరాడ్–పర్సోడా బ్యారేజీల నిర్మాణాన్ని తెలంగాణ చేపట్టింది. రామప్ప లేక్ నుంచి పాకాల లేక్‌కు మళ్లింపు ద్వారా మూడు టీఎంసీలు వెరసి 450.31 టీఎంసీల గోదావరి జలాలను తరలించేలా తెలంగాణ సర్కార్ పనులు చేపట్టింది’ అని ఏపీ అధికారులు వివరించారు. డెల్టా, పోలవరం ఆయకట్టుపై తీవ్ర ప్రభావం... ► తెలంగాణ సర్కార్ కాళేశ్వరం ఎత్తిపోతల సామర్థ్యాన్ని 225 టీఎంసీల నుంచి 450 టీఎంసీలకు, సీతారామ ఎత్తిపోతల సామర్థ్యాన్ని 70 నుంచి 100 టీఎంసీలకు పెంచుతూ నిర్ణయం తీసుకుందని, దీనివల్ల 150 ఏళ్ల చరిత్ర ఉన్న గోదావరి డెల్టా, జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం ఆయకట్టుపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఏపీ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ట్రిబ్యునల్ కేటాయింపులే ప్రామాణికం.. ► గోదావరి జలాల్లో 967 టీఎంసీలను వినియోగించుకునేలా తెలంగాణలో ప్రాజెక్టులు చేపడతామని ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేశారని, దీని ఆధారంగా తమ రాష్ట్రానికి గోదావరి జలాల్లో 967 టీఎంసీల వాటా ఉన్నట్లు స్పష్టమవుతోందని, వాటా జలాలను వినియోగించుకోవడానికే ప్రాజెక్టులు చేపట్టామని తెలంగాణ అధికారులు పేర్కొనడంపై ఏపీ అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నీటి కేటాయింపులకు బచావత్ ట్రిబ్యునల్ తీర్పే ప్రామాణికమని, అందులో తెలంగాణకు ప్రత్యేకంగా నీటి కేటాయింపులు ఎక్కడ చేశారో చూపాలని ఏపీ అధికారులు ప్రశ్నించారు. కాళేశ్వరంతో సహా అన్ని డీపీఆర్‌లు ఇవ్వాల్సిందే... ► ఈ దశలో గోదావరి బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ జోక్యం చేసుకుంటూ కాళేశ్వరం సహా అన్ని కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లను వెంటనే అందజేయాలని సూచించారు. తాము పట్టిసీమ, పురుషోత్తపట్నం, చింతలపూడి ఎత్తిపోతల డీపీఆర్‌లను ఇప్పటికే ఇచ్చామని, చింతలపూడి సామర్థ్యం పెంపు డీపీఆర్‌ను అందచేస్తామని ఏపీ అధికారులు తెలిపారు. తమ ప్రభుత్వంతో చర్చించి కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇస్తామని తెలంగాణ అధికారులు బోర్డుకు వివరించారు. ► పట్టిసీమ, పోలవరం ద్వారా కృష్ణా డెల్టాకు తరలిస్తున్న గోదావరి జలాలకుగానూ కృష్ణా నీటిలో తమకు 45 టీఎంసీల వాటా అదనంగా ఇవ్వాలని తెలంగాణ అధికారులు పేర్కొనటంపై ఏపీ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ట్రిబ్యునల్ తీర్పు ఉమ్మడి రాష్ట్రానికి వర్తిస్తుందని, నదీ పరీవాహక ప్రాంతంలో దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు ఆ 45 టీఎంసీలు దక్కుతాయని, ఈ అంశాన్ని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–2) తేల్చుతుందని స్పష్టం చేశారు. టెలిమెట్రీకి అంగీకారం.. ► గోదావరి జలాల వినియోగం లెక్కలను తేల్చడానికి టెలీమీటర్లు ఏర్పాటు చేయాలన్న బోర్డు ప్రతిపాదనకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. వీటిని ఏర్పాటు చేసే ప్రాంతాలను గుర్తించేందుకు సీడబ్ల్యూసీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సీపీడబ్ల్యూఆర్‌ఎస్ (పుణే) అధికారులతో కమిటీని నియమించాలని బోర్డు నిర్ణయించింది. కమిటీ నివేదిక ఆధారంగా టెలీమీటర్ల ఏర్పాటుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. ► పెద్దవాగు ప్రాజెక్టు ఆధునికీకరణ నిధులను ఆయకట్టు ఆధారంగా దామాషా పద్ధతిలో కేటాయించాలన్న గోదావరి బోర్డు ప్రతిపాదనను ఇరు రాష్ట్రాలు ఆమోదించాయి. -
‘పోలవరం’పై నివేదిక ఇవ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ స్థితిపై ఫొటోలతో కూడిన నివేదిక సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. పోలవరం నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఒడిశా దాఖలు చేసిన ఒరిజినల్ సూట్, పోలవరం బ్యాక్ వాటర్ వల్ల ముంపు ముప్పు ఉందని ఛత్తీస్‌గఢ్, తెలంగాణ ప్రభుత్వాలు, ‘రేలా’ స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం మంగళవారం విచారించింది. ఒడిశా తరఫున సీనియర్ న్యాయవాది అరుణ్ కట్పాలియా వాదనలు వినిపించగా.. జస్టిస్ ఎన్వీ రమణ జోక్యం చేసుకుని ‘ప్రాజెక్టు నిర్మాణంపై మీరు స్టే అడుగుతున్నారా?’ అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులపై ‘పనుల నిలిపివేత’ ఉత్తర్వులు అమల్లో ఉండగా.. ఏటా దీనిని కేంద్ర ప్రభుత్వం నిలిపివేస్తోందని కట్పాలియా నివేదించారు. బచావత్ అవార్డు ప్రకారం 36 లక్షల క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యం మాత్రమే ఉండాలని, కానీ 50 లక్షల ప్రవాహ సామర్థ్యంతో నిర్మాణం సాగుతోందని, దీనిపైనే తమ అభ్యంతరమని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ వాదనలు వినిపించారు. పోలవరం నిర్మాణంపై మాకు అభ్యంతరం లేదని పేర్కొన్నారు. ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రభావం తెలంగాణలోని పలు ప్రాంతాలపై ఉంటుందని నివేదించారు. పదే పదే ఎందుకు అభ్యర్థించాల్సి వస్తోంది? ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్రం వైఖరేమిటని కేంద్రం తరఫు న్యాయవాది ఖాద్రీని జస్టిస్ ఎన్వీ రమణ ప్రశ్నించారు. కేంద్ర జల సంఘం అనుమతుల మేరకు, బచావత్ అవార్డు ప్రకారమే నిర్మాణం జరుగుతోందని ఖాద్రీ వివరించారు. జస్టిస్ ఎన్వీ రమణ స్పందిస్తూ.. ‘ప్రాజెక్టు బచావత్ అవార్డుకు లోబడి ఉన్నప్పుడు పదేపదే స్టాప్ వర్క్ ఆర్డర్‌ను పొడిగించాలని అభ్యర్థించాల్సిన అవసరం ఏముంది?’ అని ప్రశ్నించారు. అది పర్యావరణ విభాగానికి చెందినదని ఖాద్రీ వివరించబోగా.. ఒక్కో శాఖకు ఒక్కో న్యాయవాది వస్తే ఎలా? అని ధర్మాసనం ప్రశ్నించింది. ఒడిశా, తెలంగాణ వాదనలపై జస్టిస్ ఎన్వీ రమణ స్పందిస్తూ.. ‘ఎగువ రాష్ట్రాల అభ్యంతరాలు, అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యతను ఏపీ ప్రభుత్వం తీసుకోవాలి’ అని సూచించారు. విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు. -
ఈసారి భారీ వర్షాలు ఎందుకు?
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే ‘సెంట్రల్ వాటర్ కమిషన్’ ఆగస్టు ఒకటవ తేదీన విడుదల చేసిన బులెటిన్ ప్రకారం దేశంలోని రిజర్వాయర్లన్నీ సాధారణ స్థాయి నీటి మట్టానికి 80 శాతం నీటితో నిండాయి. ఆ తర్వాత రెండు వారాల్లోనే అంటే ఆగస్టు 14వ తేదీన విడుదల చేసిన బులెటిన్ ప్రకారం రిజర్వాయర్లన్నీ సాధారణ స్థాయిని దాటి 125 శాతానికి చేరుకున్నాయి. అంటే సాధారణ స్థాయికన్నా 25 శాతం ఎక్కువ. దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడం వల్ల రిజర్వాయర్లలోకి నీళ్లు ఎక్కువగా వచ్చి చేరాయి. సాధారణంగా మంచి వర్షాలు కురుస్తున్నప్పుడు సెప్టెంబర్ నెలలో ఇలా దేశంలోని రిజర్వాయర్లన్నింటిలో జలకళ కనిపిస్తోంది. అందుకు విరుద్ధంగా ఆగస్టు నెలలోనే ఇప్పుడు ఆ జలకళ ఆవిష్కతమయింది. ఈ నీటిని సద్వినియోగంగా వాడితే వచ్చే ఏడాది వర్షాలు లేకపోయినా నీటి అవసరాలు తీరిపోతాయి. కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు రావడం వల్ల దేశంలోని రిజర్వాయర్లు ఎక్కువగా నిండాయి. గోదావరి నదిపైనున్న జయక్వాడి రిజర్వాయర్ 92 శాతం నిండింది. అంతగా జలకళ కనిపించని తాపీ నదిపైనున్న ఉకాయ్ రిజర్వాయర్ కూడా ఈసారి 78 శాతం నిండాయి. ఎగువ కురిసిన వర్షాల వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, ప్రకాషం బ్యారేజీలన్నీ నిండాయి. దాంతో కొంత నీటిని సముద్రంలోకి వదలక తప్ప లేదు. కేరళలో అధిక వర్షాల వల్ల వరదలు వచ్చి ఈసారి కూడా 496 మంది మరణించడం విషాదకరం. 2018లో సంభవించిన వరదల్లో తీవ్రంగా నష్టపోయిన కేరళ తేరుకోక ముందే మళ్లీ వర్షాలు, వరదలు ముంచెత్తడం దురదష్టకరం. గతేడాది సంభవించిన వరదల్లో కేరళలో ఒక లక్ష హెక్టార్లలో పంట నష్టం వాటిల్లగా, ఆరున్నర లక్షల ఇళ్లు ధ్వంసమయ్యాయి. దాదాపు రెండువేల మంది మరణించారు. వర్షాలు, వరదలు కారణంగా కేరళకు 5,597 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు నిపుణుల లెక్కలు తెలియజేస్తున్నాయి. ఈసారి కూడా ఆ రాష్ట్రంలో నష్టం భారీగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇలా అనూహ్యంగా వర్షాలు, వరదలు పెరగడానికి కారణాలు ఏమిటీ ? భూతాపోన్నతి అంటే భూమిని ఆవహించిన వాతావరణం వేడెక్కడం వల్ల వర్షాలు పెరిగాయి. 1901 నుంచి 1910 మధ్య ఉన్న భూ వాతావరణంతో పోలిస్తే 2011 నుంచి 2018 సంవత్సరాల మధ్య భూ వాతావరణంలో ఉష్ణోగ్రత 0.65 శాతం డిగ్రీలు పెరిగింది. చల్లటి గాలిలోకన్నా వేడి గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. వేడిగాలి తేమ వల్ల వాతావరణంలో అల్పపీడన ద్రోణి ఏర్పడి వర్షాలు కురుస్తాయి. తేలిగ్గా ఉండే వేడిగాలి పైకి దూసుకుపోవడం వల్ల పై వాతావరణంలో ఒత్తిడి పెరగడమే కాకుండా వేడిగాలి చోట శూన్యం ఏర్పడి, ఆ శూన్యంలోని పరిసర ప్రాంతాల తేమతో కూడిన గాలులు దూసుక రావడం వల్ల అల్పపీడనం ఏర్పడి వర్షాలు కురుస్తాయి. ఈ అల్పపీడనం ‘సైక్లోన్ సర్కులేషన్’గా మారితే భారీ వర్షాలు కురుస్తాయి. భూమి తిరుగుతున్న వైపే తుపాన్ ప్రయాణించడాన్ని సైక్లోన్ సర్కులేషన్గా వ్యవహరిస్తారు. మొత్తంగా భూ వాతావరణం వేడిక్కడం వల్ల ఈ సారి వర్షాలు ఎక్కువగా కురిశాయని, భూతాపోన్నతి వల్ల కొన్ని సార్లు లాభం కన్నా నష్టమే ఎక్కువ జరుగుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. -
ఆపదలో ‘అన్నపూర్ణ’
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ‘అన్నపూర్ణ’గా భాసిల్లడానికి కారణమైన గోదావరి, కృష్ణా డెల్టాల్లో ఆకలి దప్పులు తప్పడం లేదు. ఈ రెండు డెల్టాలతోపాటు పెన్నా డెల్టాలోనూ సాగునీటి మాట దేవుడెరుగు.. గుక్కెడు తాగునీటికి ఇబ్బందులు పడే పరిస్థితి ముంచుకొస్తోంది. డెల్టాలు ఉప్పునీటి కయ్యలుగా, సాగుకు పనికి రాని భూములుగా మారుతున్నాయి. ఈ కఠోర వాస్తవాన్ని సాక్షాత్తు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) నివేదిక బట్టబయలు చేసింది. దేశ వ్యాప్తంగా తీర ప్రాంతంలో భూములు శరవేగంగా చౌడుబారుతుండటం.. సాగుకు పనికి రాకుండా పోతుండటం.. పంటల దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుండటానికి కారణాలను అన్వేషించి.. పరిస్థితిని చక్కదిద్దడానికి చేపట్టాల్సిన చర్యలపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని 2014 జూన్ 19న ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీడబ్ల్యూసీని ఆదేశించారు. నాలుగేళ్లపాటు సమగ్ర అధ్యయనం చేసిన సీడబ్ల్యూసీ ఇటీవల కేంద్రానికి నివేదిక ఇచ్చింది. దేశానికి తూర్పు, పశ్చిమ తీర రేఖలు, అండమాన్ నికోబార్, లక్షద్వీప్‌లతో కలిపి 7,516.6 కిలోమీటర్ల పొడవునా తీరం విస్తరించి ఉంది. దీవుల తీర రేఖను మినహాయిస్తే.. దేశానికి తూర్పు, పశ్చిమాన 5,422.6 కిలోమీటర్ల పొడవున తీర రేఖ ఉంది. దేశం నుంచి ప్రవహిస్తున్న 102కు పైగా నదులు తూర్పు, పశ్చిమ తీర రేఖల మీదుగా సముద్రంలో కలుస్తున్నాయి. రాష్ట్రానికి 973.7 కిలోమీటర్ల పొడవైన తీరప్రాంతం ఉంది. పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల మీదుగా ఇది విస్తరించి ఉంది. కృష్ణా–గుంటూరు జిల్లాల మధ్యన ప్రవహిస్తున్న కృష్ణా నది, ఉభయ గోదావరి జిల్లాల నడుమ ప్రవహిస్తున్న గోదావరి, నెల్లూరు మీదుగా ప్రవహించే పెన్నా, స్వర్ణముఖి, కండలేరు, శ్రీకాకుళం జిల్లా మీదుగా ప్రవహించే వంశధార నదులు బంగాళాఖాతంలో కలుస్తాయి. ఎల్‌నినో, లానినో ప్రభావం వల్ల సముద్ర మట్టం ఎత్తు కనిష్టంగా 0.6 మీటర్ల నుంచి గరిష్టంగా రెండు మీటర్ల వరకు పెరిగింది. రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 903.2 మిల్లీమీటర్లు కురవాలి. ప్రకాశం జిల్లాలో కనిష్టంగా 757 మిల్లీమీటర్లు, తూర్పు గోదావరిలో గరిష్టంగా 1,139 మిల్లీమీటర్ల వర్షపాతం కురుస్తోంది. వర్షాభావ పరిస్థితుల వల్ల నదుల్లో ప్రవాహం ఏడాది పొడవునా ఉండటం లేదు. సముద్ర మట్టం ఎత్తు పెరగడం.. నదుల్లో ఏడాది పొడవున ప్రవాహం లేకపోవడం వల్ల తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లోకి నదులు, డ్రెయిన్ల ముఖద్వారాల మీదుగా సముద్రపు నీరు ఎగదన్నుతోందని.. ఇది భూమిని చౌడుబారేలా చేస్తుందని సీడబ్ల్యూసీ తేల్చింది. జాగ్రత్త పడకపోతే అంతే సంగతులు.. తీర ప్రాంతంలో ఇప్పటినుంచే జాగ్రత్తలు తీసుకోకపోతే భవిష్యత్‌లో భూగర్భ జలాలు ఉప్పు బారిపోవడం ఖాయమని, అప్పుడు డెల్టాల్లో సాగునీటి మాట దేవుడెరుగు గుక్కెడు తాగునీరు కూడా కష్టమవుతుందని సీడబ్ల్యూసీ తేల్చింది. భూమి చౌడుబారడం వల్ల సాగుకు పనికి రాకుండా పోతుందని.. పంట దిగుబడులు పూర్తిగా తగ్గుతాయని.. దీనివల్ల ఆకలికేకలు తప్పవని అభిప్రాయపడింది. నదులు, డ్రెయిన్లు సముద్రంలో కలిసే ప్రాంతాల్లో రెగ్యులేటర్లను నిర్మించి.. ఉప్పునీళ్లు ఎగదన్నకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. మడ అడవులను భారీ ఎత్తున పెంచి, తీరంలో జీవ వైవిధ్యాన్ని పెంపొందించాలని పేర్కొంది. భూగర్భ జలాల వినియోగాన్ని తగ్గించాలని.. భూగర్భం నుంచి తోడేసిన నీటిని.. వర్షకాలం అయినా రీఛార్జ్ చేయాలని.. దీనివల్ల ఉప్పు నీరు పైకి ఉబికి వచ్చే అవకాశం ఉండదని నివేదికలో పేర్కొంది. నదుల్లో ఏడాది పొడవునా ప్రవాహాలు కనిష్ట స్థాయిలోనైనా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. చేపల చెరువుల సాగును తగ్గించాలని.. రసాయన, క్రిమి సంహారక మందుల వినియోగాన్ని కనిష్ట స్థాయికి చేర్చాలని సూచించింది. రక్షణ చర్యలు తీసుకోకపోతే కృష్ణా, గోదావరి, పెన్నా డెల్టాల్లో పంటల సాగు ప్రశ్నార్థకం కావడం ఖాయమని స్పష్టం చేసింది. భూగర్భ జలాలు తోడేయడంతో.. కృష్ణా, గోదావరి, పెన్నా డెల్టాల్లో సాగునీటితోపాటు చేపల చెరువుల సాగుకు, తాగునీటి కోసం భారీ ఎత్తున భూగర్భ జలాలను తోడేస్తున్నారు. దీనివల్ల భూగర్భ జలమట్టం కనిష్ట స్థాయికి పడిపోతోంది. బోరుబావుల ద్వారా తోడిన మంచినీటి స్థానంలోకి ఉప్పునీరు చేరుతోందని సీడబ్ల్యూసీ గుర్తించింది. చేపల చెరువుల ప్రభావం వల్ల భూమి శరవేగంగా చౌడుబారుతోందని తేల్చింది. 2004 డిసెంబర్ 26న విరుచుకుపడిన సునామీ తూర్పు తీరాన్ని అతలాకుతలం చేసింది. మడ అడవులను నరికేయడం.. సునామీ దెబ్బకు తీర ప్రాంతం బలహీనపడటం వల్ల సముద్రపు నీరు ఉపరితలానికి బాగా ఎగదన్నింది. వీటి ప్రభావం వల్ల తీర ప్రాంతంలో 38 మండలాలు పూర్తిగానూ.. 26 మండలాల్లో భూములు పాక్షికంగానూ చౌడుబారాయి. తూర్పుగోదావరి జిల్లాలో పది, పశ్చిమగోదావరి జిల్లాలో 14, కృష్ణా జిల్లాలో 13, గుంటూరులో 12, ప్రకాశంలో 13, నెల్లూరు జిల్లాలో రెండు మండలాల్లో భూములు చౌడుబారినట్టు లెక్క తేల్చారు. దేశ వ్యాప్తంగా తీర ప్రాంతంలో 75.92 లక్షల ఎకరాల భూమి చౌడుబారిపోతే.. రాష్ట్రంలో 9.61 లక్షల ఎకరాల భూమి చౌడుబారి సాగుకు పనికి రాకుండా పోయింది. మిగతా ప్రాంతాల్లోనూ నేల చౌడు (క్షార) స్వభావం శరవేగంగా పెరుగుతోంది. ఇది కృష్ణా, గోదావరి, పెన్నా డెల్టాల్లో పంటల దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతోందని.. ఏటా సగటున ఐదు శాతం చొప్పున దిగుబడి తగ్గుతోందని సీడబ్ల్యూసీ అంచనా వేసింది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే.. తీర ప్రాంతంలో ప్రధానంగా కృష్ణా, గోదావరి, పెన్నా డెల్టాల్లో రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల వినియోగం 50 శాతం అధికంగా ఉందని, ఇది నేల స్వభావం శరవేగంగా మారడానికి దారితీస్తోందని తేల్చింది. -
ప్రతిపాదనలు పంపడానికి 30 నెలలా!
-
పోలవరానికి తొలగుతున్న చిక్కులు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు చిక్కులు ఒక్కొక్కటిగా తొలగుతున్నాయి. ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలపై కేంద్ర ఆర్థిక శాఖ అధ్యయనం పూర్తి చేసింది. మంగళవారం మధ్యాహ్నం కేంద్ర ఆర్థిక శాఖ జాయింట్ సెక్రటరీ నేతృత్వంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవో ఆర్కే జైన్, పోలవరం ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ ప్రాజెక్టు మోనిటరింగ్ యూనిట్ (పీఎంయూ) చీఫ్ ఇంజనీర్ సభ్యులుగా ఉన్న రివైజ్డ్ ఎస్టిమేట్స్ కమిటీ (ఆర్ఈసీ) సమావేశం కానుంది. సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలపై చర్చించనుంది. వీటికి కమిటీ ఆమోద ముద్ర వేస్తే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. ఆ తర్వాత వీటిని కేంద్ర కేబినెట్‌కు పంపుతారు. చివరగా కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేస్తే పోలవరం ప్రాజెక్టుకు ఆర్థిక ఇబ్బందులు పూర్తిగా తొలగినట్టేనని అధికార వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్ర ప్రజల ఆగ్రహాగ్నిని చల్లార్చేందుకు పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించింది. 2014 ఏప్రిల్ 1 తర్వాత ప్రాజెక్టుకు అయ్యే వ్యయాన్ని వంద శాతం భరించి.. పూర్తి చేస్తామని విభజన చట్టంలో హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)ను ఏర్పాటు చేసింది. పీపీఏతో ఒప్పందం చేసుకోవాలని 2014 నుంచి అనేక సందర్భాల్లో కేంద్రం సూచించినా స్పందించలేదు కదా.. ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను తమకే అప్పగించాలని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కోరుతూ వచ్చింది. ఈ క్రమంలోనే 2016 సెప్టెంబరు 7న ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించి.. 2014 ఏప్రిల్ 1 తర్వాత నీటి పారుదల విభాగానికి అయ్యే వ్యయాన్ని మాత్రమే తిరిగిస్తామని కేంద్రం షరతు విధించింది. అక్రమాలే అడ్డంకి పీపీఏ నియమావళిలో సెక్షన్ 9(1) ప్రకారం అనుమతి తీసుకోకుండా అంచనా వ్యయం పెంచడం.. పాత కాంట్రాక్టర్లపై వేటు వేయడం.. కొత్త కాంట్రాక్టర్లకు అప్పగించడం గానీ చేయకూడదు. కానీ.. ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు దక్కించుకున్న తర్వాత 2016 సెప్టెంబర్ 8న హెడ్‌వర్క్స్ అంచనా వ్యయాన్ని రూ.4,054 కోట్ల నుంచి రూ.5,535.91 కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం పెంచేసింది. కుడి కాలువ పనుల అంచనా వ్యయాన్ని రూ.2,240.86 కోట్ల నుంచి రూ.4,375.77 కోట్లకు, ఎడమ కాలువ పనులను రూ.1,954.74 కోట్ల నుంచి రూ.3,645.15 కోట్లకు పెంచుతూ అదే ఏడాది డిసెంబర్ 6న చంద్రబాబు ఉత్తర్వులు జారీ చేయించారు. తొలుత సబ్ కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి కమీషన్లు దండుకున్న చంద్రబాబు.. అధికారంతమున పాత కాంట్రాక్టర్లపై 60సీ నిబంధన కింద వేటు వేసి.. రూ.7,984.93 కోట్ల విలువైన పనులను నామినేషన్ పద్ధతిలో అప్పగించి భారీ ఎత్తున ముడుపులు వసూలు చేసుకున్నారు. ఈపీసీ (ఇంజనీరింగ్ ప్రొక్యుర్‌మెంట్ కన్స్ట్రక్షన్) ఒప్పందాన్ని రద్దు చేసుకోకుండానే నామినేషన్ పద్ధతిలో లంప్సమ్ (ఎల్ఎస్)–ఓపెన్ విధానంలో పనులు అప్పగించడం నిబంధనలకు విరుద్ధం. ప్రాజెక్టు ముంపు గ్రామాల్లోనూ భూసేకరణలో అక్రమాలకు పాల్పడ్డారు. విడుదల చేసిన నిధులకు యూసీలు (యుటిలైజేషన్ సర్టిఫికెట్లు) పంపితే.. అక్రమాలు బట్టబయలవుతాయనే ఉద్దేశంతో వాటిని పంపకుండా మోకాలడ్డారు. దాంతో నిధుల విడుదల విషయంలో కేంద్రం జాప్యం చేస్తూ వచ్చింది. 2018 జూలై 26న తుది సారిగా కేంద్ర ఆర్థిక శాఖ ఆడిట్ స్టేట్మెంట్ పంపాలని జారీ చేసిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం ఖాతరు చేయలేదు. దీంతో కేంద్రం ఇప్పటివరకూ ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు. ప్రతిపాదనలు పంపడానికి 30 నెలలా! పీపీఏ మొదటి సర్వసభ్య సమావేశం 2015 మార్చి 12న హైదరాబాద్‌లో జరిగింది. అప్పటి సీఈవో దినేష్‌కుమార్ పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం తాజా ధరల మేరకు ఎంతో తేల్చి.. సంబంధిత ప్రతిపాదనలను తక్షణమే పంపాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. దీనిపై అప్పటి రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. 30 నెలల తర్వాత రూ.57,940.86 కోట్లకు అంచనా వ్యయాన్ని సవరిస్తూ 2017 ఆగస్టు 16న పీపీఏ ద్వారా కేంద్ర జల వనరుల శాఖకు ప్రతిపాదనలు పంపింది. భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడినట్టు తేలడంతో కేంద్ర జల వనరుల శాఖ అనేక మార్లు వీటిని సమీక్షించింది. చివరకు అంచనా వ్యయాన్ని రూ.55,548.87 కోట్లకు కుదించారు. సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలను ఫిబ్రవరి 11న కేంద్ర జల సంఘం సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) ఆమోదించి.. కేంద్ర ఆర్థిక శాఖకు పంపింది. వీటిని కేంద్ర ఆర్థిక శాఖ అధ్యయనం పూర్తి చేసింది. వీటిపై చర్చించడానికి మంగళవారం ఆర్ఈసీ సమావేశాన్ని ఏర్పాటు చేసి తుది నిర్ణయం తీసుకోనుంది. పారదర్శకతకు పెద్దపీట వేయడంతో.. సీఎం ప్రమాణ స్వీకారం చేయక ముందే వైఎస్ జగన్మోహన్రెడ్డి మే 26న ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టుకు సత్వరమే నిధులు ఇవ్వాలని కోరారు. విడుదల చేసిన నిధులకు యూసీలను ఎప్పటికప్పుడు పంపుతామని హామీ ఇచ్చారు. సాగునీటి ప్రాజెక్టులపై నిర్వహించిన సమీక్షల్లోనూ పోలవరం ప్రాజెక్టు పనుల్లో అక్రమాలను సహించే ప్రశ్నే లేదని తేల్చిచెప్పారు. ఈనెల 15న నీతి అయోగ్ సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. విభజన చట్టంలో హామీ ఇచ్చిన మేరకు నిధులు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. ఈనెల 20న పోలవరం ప్రాజెక్టును క్షేత్ర స్థాయిలో పరిశీలించిన సందర్భంలోనూ అక్రమాలను సహించే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు. నాలుగు నెలల్లోగా పోలవరం పనులపై ఆడిట్ నిర్వహించి.. అక్రమాల నిగ్గు తేలుస్తామని ప్రకటించారు. ఆ క్రమంలోనే ఈనెల 22న నిపుణుల కమిటీతో సమా వేశమైన సీఎం వైఎస్ జగన్ తక్షణమే పోలవరం పనులపై విచారణ చేయాలని సూచించారు. పారదర్శకతకు పెద్దపీట వేస్తుండటంతో ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనల వ్యవహారాన్ని తక్షణమే తేల్చాలని కేంద్ర ఆర్థిక శాఖను ప్రధాని ఆదేశించారు. సవరించిన అంచనా వ్యయం రూ.55,548 కోట్లు రాజ్యసభలో ఎంపీ వి.విజయసాయిరెడ్డి ప్రశ్నకు మంత్రి కటారియా జవాబు సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్ట్‌పై రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను ఆమోదిస్తూ సవరించిన అంచనా వ్యయాన్ని రూ.55,548.87 కోట్లుగా కేంద్రం నిర్ధారించిందని కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రతన్‌లాల్ కటారియా వెల్లడించారు. వైఎస్సార్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, మహ్మద్ అలీఖాన్ సోమవారం రాజ్యసభలో అడిగిన వేర్వేరు ప్రశ్నలకు ఆయన రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ‘గతేడాది జనవరిలో ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ సవరించిన అంచనా వ్యయం ప్రతిపాదనలను 2013–14, 2017–18 ధరల సూచీకి అనుగుణంగా వరుసగా రూ.57,941 కోట్లు, రూ.57,297.42 కోట్ల మేర కేంద్ర జలవనరుల సంఘానికి సమర్పించింది. జలవనరుల శాఖలోని సాగునీరు, బహుళార్థ సాధక ప్రాజెక్టుల విభాగం సలహా కమిటీ.. ఫిబ్రవరి 11న జరిగిన భేటీలో ఈ ప్రతిపాదనలను ఆమోదించింది. 2017–18 ధరల ప్రాతిపదికన సవరించిన అంచనా వ్యయాన్ని రూ.55,548.87 కోట్లుగా నిర్ధారించింది. దీని ప్రకారం.. పోలవరం కుడి ప్రధాన కాలువ పనులకు రూ.4,318.97 కోట్లు, ఎడమ ప్రధాన కాలువకు రూ.4,202.69 కోట్లు, హెడ్‌వర్క్స్‌కు రూ.9,734.34 కోట్లు, పవర్‌హౌస్ పనులకు రూ.4,124.64 కోట్లు, భూసేకరణ, పునరావాసం, పునర్నిర్మాణ పనులకు రూ.33,168.23 కోట్ల మేర ఆమోదం తెలిపింది’ అని మంత్రి వివరించారు. అమరావతి రింగ్ రోడ్డు ఎంవోయూకు సిద్ధం విజయవాడ, అమరావతి చుట్టూ రింగ్ రోడ్డు అభివృద్ధి చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ రింగ్ రోడ్డు నిర్మాణంలో ఎందుకు జాప్యం జరుగుతోందని రాజ్యసభ ఎంపీ వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన జవాబిస్తూ.. ‘అమరావతిలో రింగ్ రోడ్డు అభివృద్ధి చేసే ప్రాజెక్ట్‌కు మేం ఏనాడో ఆమోదం తెలిపాం. అయితే.. ఈ ప్రాజెక్ట్‌కు అవసరమైన భూసేకరణ జరగనందున పనులు ప్రారంభం కాలేదు. భూసేకరణ ఖర్చును నూరు శాతం భరించడానికి తొలుత అంగీకారం తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం ఆ తర్వాత ఈ వ్యయంలో 50 శాతం కేంద్రమే భరించాలని కోరింది. ఈ ప్రతిపాదనకు మేం అంగీకరించాం. కొత్త ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌పై ముందుకు వస్తే ఎంవోయూ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం’ అని తెలిపారు. అలాగే అమరావతి–అనంతపురం గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణంలో భూసేకరణకు అయ్యే ఖర్చులో 50 శాతం రాష్ట్రమే భరించాలని కేంద్రం చెబుతోందని, రాష్ట్ర ఆర్థిక స్థితి అందుకు అనుగుణంగా లేనందున కేంద్రం భరించాలని విజయసాయిరెడ్డి కోరారు. దీనికి మంత్రి స్పందిస్తూ భూసేకరణ సమస్య తీవ్రంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వమే మార్గం చూడాలన్నారు. అనంతపురం జిల్లా జంతలూరు వద్ద కేంద్రీయ విశ్వవిద్యాలయం స్థాపనకు కేంద్ర మంత్రిమండలి గతేడాది మేలో ఆమోదం తెలిపిందని, అయితే దీనికి సెంట్రల్ యూనివర్సిటీ (సవరణ) బిల్లు ఆమోదం పొందాల్సి ఉందని కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోక్రియాల్ లోక్‌సభలో చెప్పారు. -
గప్‌చుప్‌గా ఆల్మట్టి ‘ఎత్తు’లు
చుక్క నీరు కూడా దిగువకు రాకుండా కృష్ణమ్మను ఒడిసి పట్టుకునేందుకు కర్ణాటక తహతహలాడుతుంటే రాష్ట్ర సర్కారు చోద్యం చూస్తోంది. ఒక్కటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 130 టీఎంసీలను అదనంగా దండుకునేందుకు ‘ఆల్మట్టి’ ఎత్తు పెంచుతుంటే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఎత్తిపోతల పథకాలతో ‘కృష్ణ’ను దారి మళ్లిస్తున్నా గుడ్లప్పగించింది. పాలక పెద్దల స్వార్థం రైతాంగానికి శాపంగా మారనుంది. ఇంకా ఇలాగే ఉపేక్షిస్తే రాష్ట్రంలో సాగు నీటిపై అన్నదాతలు ఆశలొదులుకోవాల్సిందే. సాక్షి, అమరావతి : ఆల్మట్టి డ్యామ్ ఎత్తును 519.6 మీటర్ల నుంచి 524.256 మీటర్లకు పెంచే పనులను కర్ణాటక ప్రభుత్వం శరవేగంగా పూర్తి చేయడానికి సిద్ధమైంది. తద్వారా అదనంగా 130 టీఎంసీలను వినియోగించుకుని 5,62,032 హెక్టార్ల ఆయకట్టుకు నీళ్లందించే పనులను రూ.30,143 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టింది. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపు వల్ల ముంపునకు గురయ్యే 30,875 హెక్టార్ల భూమిని ఒక వైపు సేకరిస్తూనే, మరో వైపు 22 ముంపు గ్రామాలకు చెందిన 23,561 కుటుంబాల ప్రజలకు పునరావాసం కల్పించే పనులను ప్రారంభించింది. డ్యామ్ ఎత్తు పెంచే పనులను గ్లోబల్ టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లకు అప్పగించడంపై దృష్టి సారించింది. ఈ పనులు పూర్తయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణా నదీ పరీవాహక ప్రాంతం పరిధిలోని రైతులపై తీవ్ర ప్రభావం ఉంటుందని సాగునీటి రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా చంద్రబాబు మాత్రం నోరు మెదపడం లేదు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పును కేంద్రం ‘నోటిఫై’ చేయక ముందే.. కర్ణాటక సర్కార్ దూకుడుగా వ్యవహరిస్తున్నా వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజల హక్కులను తాకట్టు పెట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆల్మట్టి డ్యామ్ ఎత్తును 519.6 మీటర్ల నుంచి 524.256 మీటర్లకు పెంచేందుకు బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఆమోదం తెలిపింది. కానీ ఈ తీర్పును అమలు పరుస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేయలేదు. తెలుగు రాష్ట్రాల మధ్య కాకుండా నాలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాలను పునఃపంపిణీ చేయాలని రెండు రాష్ట్రాలు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ కొనసాగుతోంది. డీపీఆర్ తయారీకి 2014లోనే టెండర్లు కేంద్రం నోటిఫై చేయకపోయినా, సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతున్నప్పటికీ ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచే పనులు చేపట్టడానికి అవసరమైన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీకి 2014 డిసెంబర్లోనే కర్ణాటక సర్కారు టెండర్లు పిలిచి, తక్కువ ధరకు కోట్ చేసిన వ్యాప్కోస్‌కు అప్పగించింది. ఈ విషయమై అధ్యయనం చేసిన వ్యాప్కోస్.. 524.256 మీటర్లకు ఎత్తు పెంచితే 30,875 హెక్టార్ల భూమి ముంపునకు గురవుతుందని, 22 గ్రామాలకు చెందిన 23,561 మంది నిర్వాసితులుగా మారతారని తేల్చింది. అప్పర్ కృష్ణా ప్రాజెక్టు (యూకేపీ) మూడో దశలో భాగంగా 8 ఎత్తిపోతల పథకాలు చేపట్టి, ఆల్మట్టి ఎత్తు పెంపు వల్ల అందుబాటులోకి వచ్చే 130 టీఎంసీలను వినియోగించుకుని 5,62,032 హెక్టార్లకు నీళ్లందించవచ్చని నివేదించింది. ఇందుకు రూ.30,143 కోట్ల వ్యయం అవుతుందని చెప్పింది. ఈ నివేదికను 2016లోనే ఆమోదించిన కర్ణాటక సర్కార్ ఇప్పుడు భూసేకరణ, పునరావాస పనులను ప్రారంభించింది. డ్యామ్ ఎత్తు పెంచే పనులకు టెండర్లు పిలిచేందుకు రంగం సిద్ధం చేసింది. రెండు నెలలు ఆలస్యంగా కృష్ణమ్మ ఆల్మట్టి ఎత్తు పెంచి, నారాయణపూర్ జలాశయం ఎడమ కాలువకు అనుబంధంగా ఎత్తిపోతల పథకాలు చేపట్టడం ద్వారా అదనంగా కనీసం 223 టీఎంసీలను వినియోగించుకోవడానికి కర్ణాటక సర్కార్ సన్నాహాలు చేస్తోంది. కేవలం ఆల్మట్టి ఎత్తు పెంచడం వల్ల ఆ జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 123.08 టీఎంసీల నుంచి 210.89 టీఎంసీలకు పెరుగుతుంది. ప్రస్తుతం ఆగస్టు నాటికిగానీ ఎగువ నుంచి కృష్ణా వరద ప్రవాహం జూరాల, శ్రీశైలం జలాశయాలకు చేరడం లేదు. ఆల్మట్టి ఎత్తు పెంచే పనులు పూర్తయినా, నారాయణపూర్ జలాశయానికి అనుబంధంగా ఎత్తిపోతల పథకాలు పూర్తయినా.. ఎగువ నుంచి జూరాల, శ్రీశైలానికి చేరే వరద ప్రవాహంలో తీవ్ర జాప్యం చోటుచేసుకోనుంది. సెప్టెంబరు ఆఖరు నాటికిగానీ ఎగువ నుంచి కృష్ణా వరద ప్రవాహం చేరే అవకాశం ఉండదు. అప్పుడు సాగునీటి మాట దేవుడెరుగు.. తాగునీటికి కూడా ఇబ్బందులు తప్పవు. కృష్ణా పరీవాహక ప్రాంతం ఎడారే తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాల్లో 811 టీఎంసీల వాటా ఉంది. ఇందులో 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్.. 299 టీఎంసీలు తెలంగాణకు తాత్కాలికంగా కేటాయించారు. ఐదేళ్లుగా వర్షాభావం వల్ల కృష్ణా నదిలో నీటి లభ్యత పూర్తిగా తగ్గిపోయింది. కేటాయింపుల మేరకు నీటి లభ్యత లేకపోవడం వల్ల కృష్ణా పరివాహక ప్రాంతంలోని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిలో ఆల్మట్టి ఎత్తు పెంచితే తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా నదిలో నీటి లభ్యత కనిష్ట స్థాయికి పడిపోతుంది. అప్పుడు కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలోని ఆయకట్టు ఎడారిగా మారడం ఖాయమని సాగునీటి రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక సర్కార్ ఇంత చేస్తున్నా సీఎం చంద్రబాబు వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం నోరు మెదపడం లేదంటున్నారు. కనీసం కర్ణాటక చర్యలపై కేంద్ర జల సంఘానికి ఫిర్యాదు కూడా చేయకపోవడాన్ని బట్టి చూస్తే.. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కర్ణాటకకు తాకట్టు పెట్టారన్నది స్పష్టమవుతోంది. -
మరో రియాల్టీ షోకు సిద్ధమైన చంద్రబాబు
-
పోలవరంలో ‘గేట్ షో’
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టులో మరో రియాల్టీ షోకు ముఖ్యమంత్రి చంద్రబాబు రంగం సిద్ధం చేశారు. 48 గేట్లు అమర్చాల్సిన చోట ఇప్పటికి ఒక గేటు అమర్చుతూ ప్రాజెక్టు పూర్తయినట్లే హడావుడి చేస్తున్నారు. నిజానికి 2018 నాటికే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి గ్రావిటీపై ఆయకట్టుకు నీటిని ఇస్తానని గతంలో చంద్రబాబు పలుమార్లు హామీ ఇచ్చారు. 2018 మరో వారం రోజుల్లో పూర్తి కానున్నా.. ప్రాజెక్టు పనుల్లో కీలకమైన మట్టి, రాతి కట్ట (ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్) పనులు ప్రాథమిక స్థాయిని కూడా దాటలేదు. దీంతో మే, 2019 నాటికి పాక్షికంగానూ.. డిసెంబర్, 2019 నాటికి పూర్తిగానూ పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఇటీవల సీఎం చంద్రబాబు మాట మార్చారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను పరిశీలిస్తే, అదీ సాధ్యం కాదని భావించిన ఆయన.. వరుస వైఫల్యాలు, పోలవరంలో వేలాది కోట్ల రూపాయల కమీషన్ల బాగోతాన్ని కప్పిపుచ్చుకోవడానికి సోమవారం కొత్త షోకు తెరతీశారు. పోలవరం స్పిల్ వేలో 41వ గేటు స్కిన్ ప్లేట్‌ను అమర్చే కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రియాలిటీ షోలలో ఇది ఆదీ కాదు.. అంతమూ కాదు, ప్రజలను మభ్యపెట్టేందుకు ఏదోక హడావుడి చేస్తూనే ఉంటారని సీనియర్ ఐఏఎస్ అధికారులు బాహాటంగా విమర్శిస్తున్నారు. మట్టి పనులే పూర్తికాలేదు.. పోలవరం జలాశయాన్ని 194.6 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. జలాశయం(హెడ్ వర్క్స్) పనులను ఐదు భాగాలుగా చేపట్టారు. వీటిలో స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ (ఈసీఆర్ఎఫ్), జలవిద్యుద్పుత్తి కేంద్రం, కుడి వైపు కాలువ అనుసంధానం.. ఎడమ వైపు కాలువ అనుసంధానం ఉన్నాయి. కుడి, ఎడమ వైపు కాలువల అనుసంధానం, జలవిద్యుద్పుత్తి కేంద్రం పనులు దాదాపుగా నిలిచిపోయాయి. జలాశయంలో నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరుకున్నాక స్పిల్ వే ద్వారా వరద జలాలను గోదావరి నదిలోకి మళ్లిస్తారు. 50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా సులభంగా నదిలోకి విడుదల చేసేలా 1128.40 మీటర్ల పొడవుతో, 45.72 మీటర్ల ఎత్తుతో స్పిల్ వేను నిర్మించాలి. స్పిల్ వే నుంచి వరద జలాలను విడుదల చేయడానికి 20 మీటర్ల ఎత్తు, 16 మీటర్ల వెడల్పుతో కూడిన 48 గేట్లను అమర్చాలి. పది రివర్ స్లూయిజ్‌లను ఏర్పాటు చేయాలి. ఈ పనులు పూర్తి కావాలంటే 1115.59 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని, 36.79 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని చేయాలి. మట్టిపనిలో ఇంకా 194.42 లక్షల క్యూబిక్ మీటర్లు మిగిలి ఉంది. గోదావరి వరద జలాలను స్పిల్ వే మీదుగా మళ్లించడానికి వీలుగా చేపట్టిన అప్రోచ్ ఛానల్లో 101.48 క్యూబిక్ మీటర్లు, వరద దిగువకు విడుదల చేయడానికి చేపట్టిన స్పిల్ ఛానల్ పనులలో ఇంకా 46.94 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని పూర్తి చేయాలి. కాంక్రీట్ పనుల్లో ఇంకా 17.06 లక్షల క్యూబిక్ మీటర్ల పని చేయాలి. రెండు బ్లాక్లే గేట్ల ఎత్తుకు.. స్పిల్ వేను 52 బ్లాక్‌లుగా నిర్మిస్తున్నారు. ఇందులో కేవలం రెండు బ్లాక్‌లు మాత్రమే 25.72 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తుకు పనులు పూర్తయ్యాయి. ఆ రెండు బ్లాక్‌ల మధ్యనే 41వ గేట్‌ను అలంకార ప్రాయంగా అమర్చే పనులను సోమవారం సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు. ఒక్కొక్క గేట్‌ను అమర్చాలంటే ఎనిమిది స్కిన్ ప్లేట్లను హారిజాంటల్ గెర్డర్లు, ఆర్మ్స్ గెర్డర్లు, బ్రాకెట్స్తో వెల్డింగ్ చేయాలి. ఒక్కో గేట్ బరువు 300 టన్నుల బరువు ఉంటుంది. ఒక్కో గేటును అమర్చడానికి కనీసం 55 నుంచి 60 రోజులు పడుతుంది. ఈ గేట్లు ఎత్తడానికి దించడానికి వీలుగా 250 మెట్రిక్ టన్నులతో కూడిన హైడ్రాలిక్ హాయిస్ట్‌లను అమర్చుతారు. వీటిని జర్మనీ నుంచి ఇప్పటివరకూ దిగుమతి చేసుకోలేదు. అవెప్పుడు చేరుతాయో అధికారులే చెప్పలేకపోతున్నారు. ఇకపోతే జలాశయం పనుల్లో అత్యంత కీలకమైన 18 డిజైన్లకు సంబంధించి కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) నుంచి ఇంకా ఆమోదం పొందలేదు. పనులన్నీ పునాదిలోనే.. పోలవరం ప్రాజెక్టులో నీటిని నిల్వ చేసేది ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్‌లోనే. గోదావరి నదీ గర్భంలో 2,454 మీటర్ల పొడవున దీనిని నిర్మించాలి. దీని నిర్మాణానికి గోదావరి ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా మళ్లించాలి. ఇందుకు ఈసీఆర్‌ఎఫ్‌కు 250 మీటర్ల ఎగువన 2,050 మీటర్ల పొడవున ఒక కాఫర్ డ్యామ్, 200 మీటర్ల దిగువన 1,417 మీటర్ల పొడవున మరో కాఫర్ డ్యామ్ నిర్మించాలి. ఎగువ కాఫర్ డ్యామ్‌ను 41.15 మీటర్ల ఎత్తుతో నిర్మించడానికి సీడబ్ల్యూసీ షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. జూన్ నాటికి స్పిల్ వే పనులను పూర్తి చేసి.. కనీసం 17 లక్షల క్యూసెక్కుల వరదను మళ్లించడానికి వీలుగా నిర్మాణం ఉన్నప్పుడే ఎగువ కాఫర్ డ్యామ్‌ను నిర్మించుకోవాలని సూచించింది. అయితే ఈ కాఫర్ డ్యామ్‌ను మే నాటికి పూర్తి చేసి గ్రావిటీపై ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు చెబుతున్నారు. ఎగువ కాఫర్ డ్యామ్ పనుల్లో ఇప్పటివరకూ కేవలం పునాది పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఈ డ్యామ్ పూర్తి కావాలంటే 77.81 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి, రాతి పని చేయాలి. ఇప్పటివరకూ కేవలం 97 వేల క్యూబిక్ మీటర్ల పనులే చేశారు. ఇంకా 76.84 లక్షల క్యూబిక్ మీటర్ల పనులను మే నెలాఖరులోగా పూర్తి చేయాలి. లేదంటే జూన్‌లో వచ్చే వరదకు కాఫర్ డ్యామ్ కొట్టుకుపోయే అవకాశం ఉందని ఇటీవల పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈవో ఆర్కే జైన్ పేర్కొన్నారు. ఇక దిగువ కాఫర్ డ్యామ్‌ను పూర్తి చేయాలంటే 53.78 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి, రాతి పనులు చేయాలి. ఇందులో ఇప్పటివరకూ పునాది పనులే చేశారు. ఇక ఈసీఆర్ఎఫ్ పనులు పునాదికే పరిమితమయ్యాయి. వాస్తవాలు ఇలా ఉంటే.. ప్రాజెక్టు పనులు పూర్తయినట్లుగా చంద్రబాబు ప్రచారం చేసుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ప్లానింగ్ లోపమే శాపం
-
ప్రణాళిక లోపమే పోలవరానికి శాపం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధి లోపం, ప్రణాళిక రాహిత్యం పోలవరం ప్రాజెక్టుకు శాపంగా మారుతోందంటూ పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) కుండబద్ధలు కొట్టింది. విజయవాడలోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో పోలవరం ప్రాజెక్టు పనులపై పీపీఏ బుధవారమూ సమీక్ష సమావేశం నిర్వహించింది. పూణేలో సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్(సీడబ్ల్యూపీఆర్ఎస్)లో నిర్మించిన నమూనా పోలవరం జలాశయంలో వివిధ స్థాయిలో వరదను పంపి.. ప్రయోగాలు చేసి డిజైన్లలో మార్పులు చేర్పులు చేయాలని పేర్కొంది. జనవరి మొదటి వారంలో ఢిల్లీలో నిర్వహించే డీడీఆర్పీ (డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్) సమావేశంంలో పెండింగ్ డిజైన్లు, స్పిల్‌వే, కాఫర్ డ్యామ్‌ల పనులను పూర్తి చేయడంపై సమగ్రంగా చర్చించి.. నిర్ణయం తీసుకుందామని సూచించింది. ఆలోగా నమూనా డిజైన్లు సిద్ధం చేయాలని ఆదేశించింది. హెడ్ వర్క్స్‌లో స్పిల్ వే, స్పిల్ ఛానల్ పనుల్లో 194.92 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని, 17.06 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని మిగిలి ఉందని.. గేట్ల తయారీ పనులు పూర్తి చేశామని పీపీఏకు సీఈ శ్రీధర్ వివరించారు. మే నెలాఖరుకు నాలుగు భాగాలుగా కాఫర్ డ్యామ్ పనులు పూర్తిచేయడానికి ప్రణాళిక రచించామన్నారు. దీనిపై పీపీఏ సీఈవో ఆర్కే జైన్ స్పందిస్తూ మే నెలాఖరు నాటికి స్పిల్ వే, స్పిల్ ఛానల్ పనులు పూర్తి చేయగలిగితేనే.. జూన్ రెండో వారం నుంచి వచ్చే వరద ప్రవాహాన్ని నదిలోకి మళ్లించవచ్చునన్నారు. ఇదే సమయంలో డీడీఆర్పీ ఛైర్మన్ ఏబీ పాండ్య స్పందిస్తూ హెడ్ వర్క్స్‌కు సంబంధించిన 45 డిజైన్లలో ఇప్పటివరకూ సీడబ్ల్యూసీ 27 డిజైన్లను ఆమోదించిందని మిగతా 18 డిజైన్లు అత్యంత కీలకమైనవని, వీటిని కూడా వీలైనంత తొందరగా ఆమోదించేలా చర్యలు తీసుకుంటామని, అయితే ఇప్పటికీ కాంట్రాక్టర్, రాష్ట్ర ప్రభుత్వం నుంచి డిజైన్ నమునాలు తమకు అందకపోవడాన్ని ఎత్తిచూపారు. పనుల నాణ్యతపై పెదవివిరుపు..: పోలవరం స్పిల్ వే, స్పిల్ ఛానల్ పనుల్లో నాణ్యతపై వైకే శర్మ నేతృత్వంలోని కేంద్ర నిపుణుల కమిటీ తప్పుబట్టడంపై పీపీఏ ప్రధానంగా చర్చించింది. జలాశయం పనుల పర్యవేక్షణ, నాణ్యత పరిశీలనకు వేర్వేరు అధికారులను నియమించాలని.. కానీ ఒకే అధికారిని ఆ రెండు పదవుల్లో నియమించడాన్ని తప్పుబట్టింది. సెంట్రింగ్, షట్టరింగ్ పనులు సక్రమంగా చేయకపోవడం వల్లే స్పిల్‌వేకు పలు బ్లాక్‌లలో పగుళ్లు ఏర్పడ్డాయని, వాటిని పూడ్చడంపై సీఎస్ఎంఆర్ఎస్ (సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్) సూచలన ఆధారంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కుడి, ఎడమ కాలువలకు నీటిని సరఫరా చేసే అనుసంధానాల (కనెక్టివిటీస్) పనుల్లో పురోగతి కన్పించకపోవడాన్ని ఎత్తిచూపింది. ఆ పనులను కొత్త కాంట్రాక్టర్లకు అప్పగించి.. మే నాటికి పూర్తయ్యేలా చూస్తామని జలవనరుల శాఖ అధికారులు పీపీఏకు వివరించారు. ఈ సందర్భంలోనే మే నెలాఖరు నాటికి హెడ్ వర్క్స్, కాలువలు పూర్తి చేస్తామని చెబుతున్నారని, అయితే ఇప్పటికీ డిస్ట్రిబ్యూటరీ పనులు ప్రారంభించకుండా ఆయకట్టుకు నీళ్లు ఎలా అందిస్తారని పీపీఏ సీఈవో ఆర్కే జైన్ ప్రశ్నించారు. ఇది ప్రణాళిక రాహిత్యాన్ని ఎత్తిచూపుతోందని వ్యాఖ్యానించారు. పునరావాసంపై ప్రతి వారం సమీక్ష..: కేంద్ర జల సంఘం ఆమోదించిన ప్రకారం కాఫర్ డ్యామ్‌ను 41.5 మీటర్ల ఎత్తుతో నిర్మించి.. నీటిని నిల్వ చేస్తే 18,118 కుటుంబాల ప్రజలు నిర్వాసితులు అవుతారన్నారు. ఇప్పటివరకూ 3,922 కుటుంబాలకే పునరావాసం కల్పించారని.. మిగిలిన కుటుంబాలకు మేలోగా ఎలా పునరావాసం కల్పిస్తారని పీపీఏ ప్రశ్నించింది. దీనిపై సహాయ, పునరావాస కమిషనర్ రేఖారాణి, పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి స్పందిస్తూ ఇప్పటికే టెండర్లు పిలిచామని, పనులు వివిధ దశల్లో ఉన్నాయని చెప్పారు. టెండర్లలో పునరావాస కాలనీల నిర్మాణానికి కనీస గడువు 12 నెలలు పెట్టారని.. ఇప్పుడేమో మే నెలాఖరకు పూర్తి చేస్తామని చెబుతున్నారని.. ఎలా విశ్వసించాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇకపై ప్రతి వారం సమీక్షలు నిర్వహిస్తామని.. వాటి ఆధారంగా> చర్యలు తీసుకుంటామని పీపీఏ సీఈవో ఆర్కే జైన్ స్పష్టం చేశారు. -
అంచనాల్లో ఇంత అరాచకమా!?
సాక్షి, అమరావతి : పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనల్లోని లోపాలను కేంద్రం మరోసారి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 2015–16 ఎస్ఎస్ఆర్ (స్టాండర్డ్ షెడ్యూల్డ్ రేట్స్)తో పోల్చితే.. 2013–14 ఎస్ఎస్ఆర్ ఆధారంగా రూపొందించిన ప్రతిపాదనల్లో అంచనా వ్యయం అధికంగా ఉండటంపై నివ్వెరపోయింది. హెడ్‌వర్క్స్, కుడి, ఎడమ కాలువ పనుల అంచనా వ్యయాల్లో భారీగా అంతరాలు ఉండటంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. భూసేకరణ.. సహాయ, పునరావాస ప్యాకేజీపై రాష్ట్ర ప్రభుత్వం పంపిన వివరణ నివేదికలపై ఈనెల 12 నుంచి ఢిల్లీలో వరుసగా సమావేశాలు నిర్వహిస్తామని.. వాటికి సంబంధిత అధికారులు హాజరయ్యేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సహేతుకమైన వివరణలు ఇస్తే సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలను ఆమోదించి.. సాంకేతిక సలహా మండలి (టీఏసీ)కి పంపుతామని తెలిపింది. సవరణల్లో లోపాలను అధ్యయనం చేయండి పోలవరం పనుల పురోగతి, సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలపై ఢిల్లీలోని కేంద్ర జలవనరుల శాఖ కార్యాలయంలో ఆ శాఖ కార్యదర్శి యూపీ సింగ్ నేతృత్వంలో శుక్రవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) అధ్యక్షులు మసూద్ హుస్సేన్, పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ) సీఈవో ఆర్కే జైన్, సభ్య కార్యదర్శి డాక్టర్ ఆర్కే గుప్తా, రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.16,010.45 కోట్ల (2010–11 ధరల ప్రకారం) నుంచి 2013–14 ధరల ప్రకారం రూ.57,940.86 కోట్లకు సవరిస్తూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. వీటిలో కేంద్ర జలవనరుల శాఖ ఎత్తిచూపిన లోపాలపై గత నెల 13న రాష్ట్ర ప్రభుత్వం వివరణ పంపింది. ఆ నివేదికపై ఈ నెల 12లోగా సమగ్రంగా అధ్యయనం చేయాలని సీడబ్ల్యూసీ అధికారులను కేంద్ర జలవనరుల కార్యదర్శి యూపీ సింగ్ ఆదేశించారు. భూసేకరణ, పునరావాస ప్యాకేజీపైనా అనుమానాలు ఇదిలా ఉంటే.. భూసేకరణ, సహాయ పునరావాస ప్యాకేజీ అంచనా వ్యయం రూ.2,934.42 కోట్ల నుంచి రూ.33,225.74 కోట్లకు పెరగడంపై కూడా కేంద్రం అనేక అనుమానాలు వ్యక్తంచేసింది. వాటిపై రాష్ట్ర ప్రభుత్వం పంపిన నివేదిక ఆధారంగా.. జలాశయం నీటి నిల్వ సామర్థ్యం పెరగకపోయినా ముంపునకు గురయ్యే భూమి రెండింతలకు చేరడం, ముంపు గ్రామాలు పెరగడం, నిర్వాసితుల కుటుంబాల సంఖ్య భారీగా పెరగడంపై అధ్యయనం చేసి, పూర్తిస్థాయి నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించింది. అంతలోనే ఇంత తేడానా.. పోలవరం హెడ్ వర్క్స్ అంచనా వ్యయం 2010–11 ధరల ప్రకారం రూ.6,600.56 కోట్లనీ.. ఇందులో కేవలం స్పిల్ వే, ఈసీఆర్ ఆఫ్ పనుల అంచనా వ్యయాన్ని 2015–16 ధరల ఆధారంగా రూ.4,054 కోట్ల నుంచి రూ.5535.41 కోట్లకు పెంచారని.. ఈ లెక్కన 2015–16 ధరల ప్రకారం హెడ్ వర్క్స్ అంచనా వ్యయం రూ.8,081.41 కోట్ల అవుతుందని కేంద్ర జలవరుల శాఖ కార్యదర్శి యూపీ సింగ్ పేర్కొన్నారు. కానీ.. 2013–14 ధరల ప్రకారం హెడ్ వర్క్స్ అంచనా వ్యయాన్ని రూ.11,338.37 కోట్లకు పెంచేయడంపై ఆశ్చర్యం వ్యక్తంచేశారు. 2015–16 ధరలతో పోల్చితే 2013–14 ధరలు తక్కువగా ఉంటాయని.. ఆ లెక్కన అంచనా వ్యయం తగ్గాల్సి ఉండగా ఎందుకు పెరిగిందని సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ నిలదీశారు. 2015–16 ధరల ప్రకారం ఎడమ కాలువ అంచనా వ్యయాన్ని రూ.3,645.15 కోట్లకు పెంచారని, కుడి కాలువ అంచనా వ్యయాన్ని రూ.4,375.77 కోట్లకు పెంచారనీ.. కానీ 2013–14 ధరల ప్రకారం పంపిన ప్రతిపాదనల్లో ఎడమ కాలువ అంచనా వ్యయాన్ని 4,476.96 కోట్లకు, కుడి కాలువ అంచనా వ్యయాన్ని రూ.4,644.13 కోట్లకు పెంచేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. -
ఇది ప్రకృతి హెచ్చరిక
కేరళలో ఈ ఏడాది వానలు, నదులు మనుషులతో మాట్లాడుతున్నాయి. చిన్ననాటి నుంచీఈ వానలే నా కలంలో సిరా. అవే నన్ను రచయిత్రిని చేశాయి. మీనాచిల్ నది నా కథను నడిపించింది. ప్రస్తుతం నదుల మహోగ్రరూపం ఊహకు అందనిది. త్రివిధ దళాలు, ప్రభుత్వ సంస్థలు, స్థానికులు, జర్నలిస్టులు, మత్స్యకారులు ముఖ్యంగా సామాన్యులు ఎనలేని ధైర్యసాహసాలు చూపారు. ఇదంతా ప్రకృతి వైపరీత్యమే అని చెప్పడానికి వీల్లేదు. మానవ తప్పిదం ఎంతో ఉంది. వాతావరణంలో చోటు చేసుకుంటున్న అనూహ్య మార్పులు, గ్లోబల్ వార్మింగ్ పరిస్థితులతో కొండ ప్రాంతాలు, తీర ప్రాంతాలే మొదట బలైపోతాయి. ఒకవైపు కార్చిచ్చులతో కాలిఫోర్నియా తగలబడిపోతూంటే, ఇటు వర్షబీభత్సంతో కేరళ మునిగింది. మనిషి అంతులేని స్వార్థంతో చేస్తున్న పనులతో కొండల మీదుగా వాన నీటి ప్రవాహం దిశ మారింది. అటవీ భూముల్లో గనుల తవ్వకం, చట్టవిరుద్ధంగా రిసార్టులు, సంపన్నుల ఇళ్లు, డ్యామ్‌ల అడ్డగోలు నిర్వహణ వంటివన్నీ నేటి ప్రళయానికి కారణం. ఈ వరదల్ని సెంట్రల్ వాటర్ కమిషన్ ఊహించకుండా ఎలా ఉంది? వరదనీటిని ఒడిసిపట్టాల్సిన డ్యామ్‌లు కీలక సమయంలో విపత్తు తీవ్రతను ఎన్నో రెట్లు పెంచేలా నీళ్లు ఎలా విడుదల చేశాయి? ఇప్పుడు సీఎం సహాయ నిధికి విరాళాలు భారీగా వస్తున్నాయి. వాటిలో సామాన్యులు ఇస్తున్నవే ఎక్కువ. చిత్రమేమిటంటే ఎవరికైతే మనం నిధులిస్తున్నామో ఆ ప్రభుత్వ యంత్రాంగమే హెచ్చరికల్ని పెడచెవిన పెట్టింది. ఇలాంటి పరిస్థితి వస్తుందని మాధవ్ గాడ్గిల్ కమిటీ ఎప్పుడో ఊహించింది. అభివృద్ధి పేరుతో సాగిస్తున్న కార్యకలాపాలను అడ్డుకోకపోతే వినాశనమేనని హెచ్చరించింది. కేరళ వరదల్ని అడ్డుపెట్టుకొని భారత్‌లో కొందరు విషాన్ని చిమ్ముతున్నారు. ప్రేమ, ఆప్యాయత పంచాల్సిన సమయంలో విద్వేషాన్ని రగిలిస్తున్నారు. వరదల్లో తీవ్రంగా నష్టపోయిన దళితులు, ఆదివాసీలకు రాష్ట్రసర్కారు అండగా ఉంటుందని ఆశిద్దాం. మనం చేతులారా నాశనం చేసిన పర్యావరణాన్ని మనమే చక్కదిద్దాలి. అలా చేయకుంటే దేవభూమిలో మనిషి మసలడం సాధ్యం కాదు. 2018 వరదలు మనకి ఒక సున్నితమైన హెచ్చరిక.