నిధులెలా? | Regulation of the board meeting on the banks of the Central Water Commission | Sakshi
Sakshi News home page

నిధులెలా?

Published Sat, Sep 13 2014 3:01 AM | Last Updated on Sat, Sep 2 2017 1:16 PM

Regulation of the board meeting on the banks of the Central Water Commission

కార్యాలయాలు, సిబ్బంది, నిధులపైనే చర్చ
కృష్ణా, గోదావరి బోర్డుల
స్వరూపంపై మంతనాలు
హాజరైన ఇరు రాష్ట్రాల ఈఎన్‌సీలు
దేశంలోని మిగతా బోర్డుల స్వరూపం పరిశీలన

 
హైదరాబాద్/ న్యూఢిల్లీ: దేశంలో పనిచేస్తున్న నదీ యాజమాన్య బోర్డుల తరహాలోనే కృష్ణా, గోదావరి బోర్డుల స్వరూపం ఉంటే బాగుంటుందనే అభిప్రాయం కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) శుక్రవారం ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో వ్యక్తమైంది. రెండు బోర్డుల కార్యాలయాల ఏర్పాటుకయ్యే ఖర్చును కేంద్రంతో పాటు రెండు రాష్ట్రాలు భరించాలని, సిబ్బందిని శాశ్వత ప్రాతిపదికన తీసుకోవాలని, నిధుల సమస్య రాని విధంగా తగిన ఏర్పాట్లు ఉండాలని పలువురు ఇంజనీర్లు సూచించారు. బోర్డుల స్వరూపం, పాలనకు సంబంధించిన విధివిధానాలను నిర్ణయించే కసరత్తులో భాగంగా సీడబ్ల్యూసీ శుక్రవారం ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసింది. సమావేశంలో వివిధ నదీ యాజమాన్య బోర్డుల్లో పనిచేసిన అనుభవం ఉన్న ఇంజనీర్లతో పాటు ఆంధ్రప్రదేశ్ ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు, తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్ పాల్గొన్నారు. సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయాలను అధికారులు ‘సాక్షి’కి చెప్పారు. ముఖ్యాంశాలు ఇవీ..
     
కృష్ణా బోర్డు ఆంధ్రప్రదేశ్ రాజధానిలో, గోదావరి బోర్డు హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తే బాగుంటుంది. కొత్త రాజధానిలో కార్యకలాపాలు ప్రారంభమయ్యేవరకు.. రెండు బోర్డులు హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేయవచ్చు. రెండు బోర్డులు ఒకే ప్రాంగణంలో ఉండటం మంచిది. రెండు బోర్డుల్లోనూ సభ్యులుగా ఉన్న అధికారులు ఉన్నారు. ప్రారంభంలో సిబ్బంది కొరతను అధిగమించడానికి రెండు బోర్డులకు ఉమ్మడిగా సిబ్బందిని నియమించుకోవచ్చు. రెండు బోర్డులను బూర్గుల రామకృష్ణారావు భవన్‌లో ఏర్పాటు చేయడానికి అనుకూలంగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ తెలిపింది. జలసౌధలో ఏర్పాటు చేస్తే అనువుగా ఉంటుందని తెలంగాణ చెప్పింది.

రెండు బోర్డుల్లోనూ సిబ్బంది శాశ్వత ప్రాతిపదికన తీసుకోవడం మంచిది. అయితే బోర్డుల పరిధిలోని ప్రాజెక్టులను నిర్ధారించి నోటిఫై చేయకుండా.. బోర్డులో పనిభారం ఎంత ఉంటుందనే అంశాన్ని నిర్ధారించలేమని, ఫలితంగా ఎంతమంది సిబ్బంది కావాలనే విషయంలో నిర్ణయానికి రాలేమని ఇరు రాష్ట్రాలు చెప్పాయి. సిబ్బంది సంఖ్యను నిర్ధారించిన తర్వాతే బోర్డు నిర్వహణ ఖర్చుపై తుది అంచనాకు రావచ్చని తెలిపాయి
.
బోర్డుల నిర్వహణకు అవసరమైన నిధులు సమకూర్చుకొనే విధానం మీద సుదీర్ఘ చర్చ జరిగింది. ముందుగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు సమకూర్చిన తర్వాత కేంద్రం రీయింబర్స్‌మెంట్ చేయాలా? కేంద్రం, రాష్ట్రాల వాటా తేలిన తర్వాత ఎవరి వాటా మేరకు నిధులను సమకూర్చాలా? అనే విషయం మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ముందుగా నిర్ధారించిన మేరకు నిధులు విడుదల చేయడంలో సిబ్బందికి జీతాల చెల్లింపు సమస్య రాకుండా తగిన ముందు జాగ్రత్త చర్యలు అవసరమనే అభిప్రాయాన్ని సమావేశంలో పాల్గొన్న నిపుణుల్లో దాదాపు అందరూ వ్యక్తం చేశారు.

సిబ్బందిని శాశ్వత ప్రాతిపదికన తీసుకోవాలని ఎక్కువమంది అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంతమందిని తీసుకోవాలి? రెండు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎంతమందిని తీసుకోవాలి? ఏ క్యాడర్ వారిని తీసుకోవాలి? బోర్డుల్లో పనిచేయడానికి అవసరమైన మంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావడానికి ఆసక్తి చూపించకపోతే ఏం చేయాలి? ఏ స్థాయిలో డిప్యుటేషన్లను అనుమతించాలి? డిప్యుటేషన్లకు అనుమతి ఉంటే.. రెండు రాష్ట్రాల్లో పనిచేస్తున్న సిబ్బంది సీనియారిటీ దెబ్బతినకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇతర బోర్డుల్లో తలెల్తిన సమ్యలేమిటి?.. ఈ అంశాలపై చర్చ జరిగింది.

 బోర్డు నివేదికలు కాలపరిమితి (పీరియాడిసిటీ) ఎలా ఉండాలనే అంశం మీదా చర్చ జరిగింది. త్రైమాసిక, అర్ధ సంవత్సరం, వార్షిక నివేదికలు.. ఇస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమైంది. బోర్డు సభ్యులతోపాటు బోర్డు చైర్మన్‌కి సైతం ఓటింగ్ హక్కు ఉండాలని సూచించారు.

పాలనా నిబంధనలు కేంద్ర ప్రభుత్వ తరహాలోనే ఉండాలని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. డిప్యుటేషన్ మీద తీసుకొనే వారికి కేంద్ర ప్రభుత్వ సర్వీసులోకి వెళ్లినట్లుగా భావించాలని సూచించారు. అదే సమయంలో సీనియారిటీ, పదోన్నతుల్లో ప్రతికూల ప్రభావం లేకుండా నిబంధనలు రూపొందించాలనే అభిప్రాయం వ్యక్తమయింది.గ
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement