జల సంరక్షణ ప్రాధాన్యతను సైతం పక్కనపెట్టాయి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగ్రహం
మధ్యప్రదేశ్‌లో కెన్–బెత్వా
అనుసంధాన ప్రాజెక్టుకు శంకుస్థాపన
వాజ్‌పేయి స్మారక పోస్టల్ స్టాంప్, నాణెం విడుదల
ఖజురహో: దేశంలో జల వనరుల అభివృద్ధికి డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ చేసిన కృషిని కాంగ్రెస్ పార్టీ విస్మరించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. 21వ శతాబ్దంలో తగనన్ని జల వనరులతోపాటు వాటి నిర్వహణలో మెరుగ్గా ఉన్న దేశాలే ప్రగతి పథంలో ముందుకు సాగుతాయని స్పష్టంచేశారు. 21వ శతాబ్దంలో నీటి సంరక్షణే అతిపెద్ద సవాలు అని తేలి్చచెప్పారు.
బుధవారం మధ్యప్రదేశ్‌లో కెన్–బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టుకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఖజురహోలో నిర్వహించిన సభలో ప్రసంగించారు. అంబేడ్కర్ అందించిన సేవలను కొనియాడారు. మన దేశంలో జల వనరుల బలోపేతానికి, నిర్వహణకు, డ్యామ్‌ల నిర్మాణానికి అంబేడ్కర్ దార్శనికత, దూరదృష్టి ఎంతగానో దోహదపడ్డాయని తెలిపారు. కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) ఏర్పాటు వెనుక అంబేడ్కర్ కృషి ఉందన్నారు.
అతిపెద్ద నదీ లోయ ప్రాజెక్టుల అభివృద్ధికి ఎంతగానో శ్రమించారని పేర్కొన్నారు. జల సంరక్షకుడు అంబేడ్కర్‌ను గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏనాడూ పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. జల సంరక్షణ ప్రాధాన్యతను సైతం పక్కనపెట్టాయని విమర్శించారు.
ఈ సందర్భంగా దివంగత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రత్యేక స్మారక పోస్టల్ స్టాంప్, రూ.100 నాణాన్ని మోదీ విడుదల చేశారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా 1,153 అటల్ గ్రామ్ సేవా సదనాల నిర్మాణానికి భూమిపూజ చేశారు. రూ.437 కోట్లతో ఈ సదనాలు నిర్మిస్తారు. నేడు సుపరిపాలన దినోత్సవం జరుపుకుంటున్నామని ప్రధానమంత్రి చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్వాకంతో ప్రాజెక్టులు ఆలస్యం
మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలో ఓంకారేశ్వర్ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టును ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. నదుల అనుసంధానంలో భాగంగా దౌధన్ సాగునీటి ప్రాజెక్టుకు సైతం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సి.ఆర్.పాటిల్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కెన్–బెత్వా నదుల నీటిని నింపిన రెండు కలశాలను ప్రధాని మోదీకి అందజేశారు. రెండు నదుల అనుసంధాన ప్రాజెక్టు నమూనా(మోడల్)లో మోదీ ఈ నీటిని ధారగా పోశారు.
ప్రాజెక్టు నిర్మాణాన్ని లాంఛనంగా ఆరంభించారు. కెన్–బెత్వా నదుల అనుసంధానంతో బుందేల్‌ఖండ్ ప్రాంతంలో సౌభాగ్యం, సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని మోదీ ఉద్ఘాటించారు. రూ.44,605 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపడుతున్నారు. దీంతో మధ్యప్రదేశ్‌లో 44 లక్షల మందికి, ఉత్తరప్రదేశ్‌లో 21 లక్షల మందికి తాగునీరు లభించనుంది. 2,000 గ్రామాల్లో 7.18 లక్షల వ్యవసాయ కుటుంబాలు లబ్ధి పొందుతాయి. అలాగే 103 మెగావాట్ల హైడ్రోపవర్, 27 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment