సామాజిక రాజకీయ దార్శనికుడు
ఇది అంబేడ్కర్ యుగం. అంబేడ్కర్ జీవన గాథలో వ్యక్తిత్వ నిర్మాణ శిల్పం ఉంది. హేతువాద భావనా మూర్తిమత్వం వుంది. ఆయన్ని ఈనాడు ప్రపంచమంతా స్మరించుకోవడానికి కారణం ఆయన ప్రపంచ మానవునిగా, మేధావిగా విస్తరించటమే! ఆయన అణగారిన ప్రజల గుండె దివ్వెలు వెలిగించిన భానుడు. భారతదేశంలో వచ్చిన రాజకీయ పరిణామాలన్నిటిపై ఆయన బలమైన ముద్ర ఉంది. భారత రాజ్యాంగ రూపకల్పనలో లౌకిక, సామ్యవాద, ప్రజాస్వామ్య భావాలను బౌద్ధ తాత్విక దృక్పథంతో మేళవించారు. అంబేడ్కర్ పోరాటమంతా బహు జనుల రాజ్యాధికార దిశగానే సాగింది. అందుకు సిద్ధాంతాలు, ప్రణాళికలు, పార్టీలు, కార్యాచరణ రూపొందించారు. రాజ్యాధికారమే వారికి సంపదను, సమతను ఇస్తాయని చెప్పారు.అంబేడ్కర్ గుణగణాలు ఎక్కువగా తల్లిదండ్రుల నుంచి రూపొందించుకున్నవే. ఆయన తల్లిదండ్రులు నీతి, నిజాయితీ గలిగిన సంస్కరణ హృదయులు. ఆనాడే వారి వ్యక్తిత్వం నలుగురు నోళ్ళలో నానింది. మహర్లు సహజంగానే నీతిపరులు. అందునా ఇది సైనిక కుటుంబం. మహర్ సైనికులకు అంబేడ్కర్ తండ్రి టీచర్ కూడా! తండ్రి క్రమశిక్షణతో కూడిన జీవితమే అంబేడ్కర్లో ప్రతిఫలించింది. చాలామంది వ్యక్తిస్వార్థంతో జీవిస్తారు, సామాజికంగా జీవించలేరు. అంబేడ్కర్ కుటుంబం మొదటి నుండి సామాజిక స్పృహతో జీవించింది. అంబేడ్కర్ పూర్ణంగా తల్లి, తండ్రి రూపం. ఆయన చిన్నతనం నుండి కూడా తనకు ఎదురైన ప్రతి సంఘటననూ మొత్తం సమాజపరంగా చూసి దానిమీద పోరాటం చేసే తత్త్వాన్ని తండ్రి నుండే నేర్చుకున్నాడు.తల్లిదండ్రుల వారసత్వంఎక్కడా కూడా ఆయన జీవితంలో చిన్న తప్పు చేయలేదు. మచ్చలేని వ్యక్తిగా ఆయన జీవన క్రమం సాగింది. తల్లితో ఎక్కువ గడపకపోయినా, ఆయన బంధువులందరూ తల్లిని గురించే ప్రస్తావించేవారు. ఆమె సంతానాన్ని కనే సమయంలో ప్రసవ వేదనలకు గురై, శక్తి శూన్యమైనప్పుడు కూడ ‘ధైర్యాన్ని వదలని గొప్ప వ్యక్తి’. అంబేడ్కర్ కూడా జీవితంలో ఎన్నో దుఃఖ ఘట్టాలు వచ్చినా సహించాడు, ఎదురుతిరిగాడు, పోరాడాడు, విజయం పొందాడు. తల్లి రూపంలో ఉన్న సౌందర్యం, సౌకుమార్యం, శిల్పం అంబేడ్కర్‌కు వచ్చాయి. ఈనాడు కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఏకశిల్పం జాతిని ఏకం చేస్తూ మనకు కన్పిస్తుంది– అదే అంబేడ్కర్ శిల్పం. ఈ రూపాన్ని ఈ దేశానికి, ప్రపంచానికి ఇచ్చిన భీమాబాయి అన్వర్థ నామధేయం గలది. ‘భీమా’ అంటే ‘శక్తి’ అని అర్థం. అంబేడ్కర్ ఒక జాతీయవాదిగా మహర్ రెజీవ్ు వారసునిగా ఎదిగాడు. అంబేడ్కర్ కుటుంబం, వంశం, దేశంకోసం పోరాడిన నేపథ్యం కలిగి వున్నాయి.అంబేడ్కర్ జీవన వర్తనలో కరుణ, ప్రేమ, సామాజిక విప్లవం స్ఫూర్తి, సాంస్కృతికత, తాత్విక అధ్యయనం, ఆచరణ బలంగా ఉన్నాయి. అంబేడ్కర్ తత్వవేత్త, దార్శనికుడుగా ఎదగడానికి కారణం ఆయనలోనే హేతువాద భావనాధ్యయనం ఉండటం. ఆయన వేదాలను, ఉపనిషత్తులను, దర్శనాలను, ఆరణ్యకాలను, ముఖ్యంగా పరాశర స్మృతిని, నారద స్మృతిని అధ్యయనం చేసి, వాటిని నిశితంగా శాస్త్రీయ దృక్పథంతో విశ్లేషణ చేశారు. భారతదేశంలో వేద వాఙ్మయాన్ని క్షుణ్ణంగా చదివిన పది మందిలో ఆయన ఒకరు. భారత ఉపఖండంలో తన సౌజన్యం ద్వారా, రక్తపాతాన్ని నివారించి, నిర్మాణాత్మక సామాజిక విప్లవాన్ని నడిపించారు. ప్రపంచంలోనే రాజనీతిజ్ఞులుగా పేరొందిన జాన్ డ్యూయికి వారసుడు. సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్‌ను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తాత్వికుడు. ప్రజాస్వామ్యంలో దాగున్న నియంతృత్వాన్ని ప్రశ్నించిన పోరాటవీరుడు. భారత స్వాతంత్య్రోద్యమంలో దాగున్న వర్ణ, కులాధిపత్య భావాలను పసిగట్టిన, ప్రకటించగలిగిన రాజకీయ ప్రజా ధురంధరుడు. స్వాతంత్య్రోద్యమ కాలంలోనే అంబేడ్కర్ హిందూ రాజకీయాల నిజ స్వరూపాన్ని గమనించారు. ‘మీరు స్వాతంత్య్రాన్ని కోరుతోంది కేవలం అధికార మార్పిడి కోసమే. కానీ ఈ కులాల ఆధిపత్యాన్ని ఎదిరించడానికి కాదు. కులం నుండి విముక్తి చేయడానికి జరిగే పోరాటమే నిజమైన స్వాతంత్య్ర పోరాటం’ అని అంబేడ్కర్ నొక్కి వక్కాణించారు. అంబేడ్కర్ తన ‘కుల నిర్మూలన’ గ్రంథంలో భారత స్వాతంత్య్రోద్యమ నాయకత్వంలో దాగిన కుల భావాలను బయటకీడ్చారు. భారతదేశంలో కులం చట్రం నుండి బయటకు రాలేక చాలామంది దేశ నాయకులు, ప్రపంచ మేధావులు కాలేకపోయారు. ప్రత్యామ్నాయ తత్వంభారతదేశంలో వచ్చిన రాజకీయ పరిణామాలన్నిటిపై ఆయన బలమైన ముద్ర ఉంది. ముఖ్యంగా భారత రాజ్యాంగ రూపకల్పనలో ఆయన లౌకిక, సామ్యవాద, ప్రజాస్వామ్య భావాలను బౌద్ధ తాత్విక దృక్పథంతో మేళవించారు. రాజ్యాంగ నిర్మాణంలో వున్న పటిçష్ఠత వలన దాని మౌలిక రూపాన్ని మార్చాలనుకునే వారి ప్రయత్నాలు విఫలం అవుతూ వస్తున్నాయి. దానికి కారణం రాజ్యాంగం సత్యనిష్ఠగా రూపొందించబడటమే. కులం, అççస్పృశ్యత, లింగవివక్ష, మతమౌఢ్యాలన్నింటినీ ఆయన ఎదిరించగలిగారు. ప్రత్యామ్నాయ తత్వాన్ని రూపొందించగలిగారు.1913 లోనే ఉన్నత చదువుల కోసం న్యూయార్క్ వెళ్ళగలిగారు. కొలంబియా విశ్వవిద్యాలయానికి తన ‘ది ఎవొల్యూషన్ ఆఫ్ ప్రొవిన్షియల్ ఫైనాన్స్ ఇన్ బ్రిటిష్ ఇండియా’ గ్రంథాన్ని సమర్పించారు. అంబేడ్కర్ వ్యక్తిత్వంలో ప్రధాన అంశం అవినీతి రహిత జీవనం. ఆయన వ్యక్తిత్వంలో ఉన్న నిక్కచ్చితనం అనేది ఆయన్ని ప్రపంచ మానవుడిగా విస్తరింపజేసింది. అనేక దేశాలలో చదివినా ఒక చిన్న మచ్చ లేకుండా, ఏ విధమైన వ్యసనాలూ లేకుండా ఆదర్శంగా నిలిచిన వ్యక్తిత్వ నిర్మాణ దక్షుడు.రౌండ్ టేబుల్ సమావేశాల్లోనూ, బహిరంగ వేదికల మీదా అనర్గళంగా మాట్లాడారు. నిరంతరం రాయడం ద్వారా గొప్ప వాఙ్మయ సంపదను సృష్టించారు. బ్రిటిష్ ప్రభుత్వం హౌస్ ఆఫ్ కామన్స్ (లండన్ పార్లమెంటు)లో ఆయన శతజయంతిని జరిపింది. ఆ దశకు అంబేడ్కర్ చేరడానికి కారణం ఏమిటి? ఆయనకు ఆ నాయకత్వ లక్షణాలు ఎలా వచ్చాయి? అని పరిశీలిస్తే, కృషి ఉంటే అట్టడుగు లోయల నుండి కూడా పర్వత శిఖరాలను అధిరోహించవచ్చు అని అర్థం అవుతుంది. పాలకులు కండి!అంబేడ్కర్ నిర్మించిన ఇండియన్ లేబర్ పార్టీ 1937లో బొంబాయి ప్రెసిడెన్సీలో కాంగ్రెస్‌కు పటిష్ఠమైన ప్రతిపక్షంగా వ్యవహరించింది. ఇండియన్ లేబర్ పార్టీని విస్తృత పరచాలనే ఉద్దేశంతో 1942 జూలైలో ఆలిండియా షెడ్యూల్డు క్యాస్ట్ ఫెడరేషన్ స్థాపించారు. ఆ సందర్భంగా, దళితుల సాంఘిక, ఆర్థిక హక్కులను సాధించటానికి వారికి రాజకీయాధికారం కావాలని ప్రబోధించారు. తన ‘రణడే, గాంధీ అండ్ జిన్నా’ గ్రంథంలో ప్రజాస్వామ్య దేశంలో రాజకీయ ప్రతిపక్షపు ప్రాధాన్యాన్ని నొక్కి వక్కాణించారు. 1952 ఎన్నికలకు సన్నద్ధమవుతూ, షెడ్యూల్డు క్యాస్ట్ ఫెడరేషన్ మాత్రమే గెలవడం కష్టమని భావించి ఇతర వామపక్ష పార్టీలను పొత్తు కోసం పిలిచారు. అçస్పృశ్యతను నివారించే క్రమంలో సామాజిక అసమానతలను రూపుమాపే ముఖ్యసూత్రంపైన ఆయన పార్టీల పొత్తును కోరారు. ఆయన ఈ విషయంపై ప్రజా సోషలిస్టు పార్టీతో చర్చించారు. ‘సోషలిస్టులు కొన్ని విషయాల్లో నమ్మదగ్గవారు కాకపోయినా వారు మతశక్తులు కాదు. రాజకీయంగా వారి మార్గం సరైనదే. అందుకే వారితో నేను కలవడానికి వెనుకాడటం లేదు’ అని వ్యాఖ్యానించారు.అంబేడ్కర్ పోరాటమంతా బహుజనుల రాజ్యాధికార దిశగానే సాగింది. అందుకు సిద్ధాంతాలు, ప్రణాళికలు, పార్టీలు, కార్యాచరణ, రూపొందించారు. రాజ్యాధికారమే వారికి సంపదను, సమతను సమసమాజ నిర్మాణాన్ని కలిగిస్తుందని అంబేడ్కర్ ఆశయం. బానిసలుగా బతకవద్దు, పాలకులుగా బతకండి అని చెప్పారు. అందుకు త్యాగాలు అవసరం. అంబేడ్కర్ త్యాగ జీవితమే మనకు దిక్సూచి. ఆ దిశగా నడుద్దాం.- వ్యాసకర్త దళితోద్యమ నాయకులు ‘ 98497 41695(నేడు డా‘‘ బి.ఆర్. అంబేడ్కర్ వర్ధంతి)- డా‘‘ కత్తి పద్మారావు