బీఆర్ అంబేద్కర్కు మరో అరుదైన గౌరవం
యునైటెడ్ నేషన్స్: రాజ్యాంగ నిర్మాత, 'భారతరత్న' డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం ఈ ఏడాది అంతా అనేక కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసింది. వాటికి కొనసాగింపుగా మొట్టమొదటిసారి ఐక్యరాజ్య సమితి(యూఎన్ఓ)లోనూ అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించనున్నట్లు భారత శాశ్వత ప్రతినిధి సయీద్ అక్బరుద్దీన్ శనివారం వెల్లడించారు. అణగారిన వర్గాల్లో చైతన్యం నింపడం, అసమానతలు రూపుమాపడంతోపాటు పేదరిక నిర్మూలనకూ అంబేద్కర్ విశేష కృషిచేశారని, ఆయన అందించిన స్పూర్తి నేటి ప్రపంచానికి ఎంతో అవసరమని, అందుకే ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో అంబేద్కర్ జయంతివేడుకలను నిర్వహిస్తున్నామని అక్బరుద్దీన్ వెల్లడించారు.
భారత శాశ్వత రాయబారితోపాటు కల్పనా సరోజ్ ఫౌండేషన్, ఫౌండేషన్ ఫర్ హ్యూమన్ హారిజోన్ సంస్థలు సంయుక్తంగా యూఎన్ లో వేడుకలను నిర్వహించనుంది. అంబేద్కర్ జయంతికి ఒకరోజు ముందు, అంటే ఏప్రిల్ 13న న్యూయార్క్ లోని ప్రధాన కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పిస్తారు. ఈ సందర్భంగా 'అసమానతలపై పోరాటం: ఆమోదయోగ్య లక్ష్యాలు' అంశంపై పలువురు అధ్యయనకారులు ప్రసంగిస్తారు. భారత్ వెనుకబాటుకుగురైన కోట్లాది మందిని అంబేద్కర్ చైతన్యపరిచారని, సామాజిక న్యాయం, సమానత్వాల కోసం జీవితాంతం శ్రమించారని ఐక్యరాజ్య సమితి.. బాబా సాహెబ్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. 2030లోగా అసమానతలు లేని సమాజాన్ని స్థాపించేందుకు యూఎన్ జనరల్ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని కూడా ప్రకటనలో గుర్తుచేశారు.
బీఆర్ అంబేద్కర్ మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా అంబావాడేలో 1891 ఏప్రిల్ 14న జన్మించారు. న్యాయ కోవిదుడిగా, భారత రాజ్యాంగ నిర్మాతగా, స్వంతంత్ర భారత తొలి న్యాయ శాఖా మంత్రిగా, స్వాతంత్ర్యోద్యమంలో దళిత నాయకుడిగా నేకాక ఆంథ్రోపోలజిస్ట్ , హిస్టారియన్, బెస్ట్ స్పీకర్, రైటర్, ఎకానమిస్ట్, ఎడిటర్, విప్లవకారుడు, బౌద్ధ ధర్మ పునరుద్ధరణకర్తగా ఖ్యాతిపొందిన అంబేద్కర్ 1956లో కన్నుమూశారు. ఆయన మరణానంతరం 1990లో భారత ప్రభుత్వ అత్యున్నత పురస్కారం 'భారతరత్న' పొందారు.