
సాకులు చెప్పొద్దు..బుకాయించొద్దు
మాజీ ఈఎన్‌సీలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: ‘మీరు ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు సీఈగా ఉన్నప్పుడు 2015 జనవరి 31, మార్చి 4 తేదీల్లో కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) మీకు రాసిన లేఖలను నిపుణుల కమిటీ దృష్టికి తీసుకెళ్లారా? అని..కాళేశ్వరం ప్రాజెక్టు గజ్వేల్ ఈఎన్‌సీ బి.హరిరామ్‌ను జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ప్రశ్నించింది. అవునని ఆయన సమాధానమివ్వగా, నిపుణుల కమిటీతో పాటు కమిషన్‌కు సైతం మీరా లేఖలు అందించలేదని సాక్ష్యాధారాలు చెబుతున్నాయని పేర్కొంది.
తనకు గుర్తు లేదని, రికార్డులు పరిశీలించి చెప్తానని హరిరామ్ అనగా, దాగుడుమూతలు వద్దంటూ అసహనం వ్యక్తం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల నిర్మాణంలో అవకతవకతలపై విచారణ నిర్వహిస్తున్న పీసీ ఘోష్ కమిషన్ గురువారం తన కార్యాలయంలో నీటిపారుదల శాఖ రిటైర్డ్ ఈఎన్‌సీ (జనరల్) సి.మురళీధర్, రామగుండం రిటైర్డ్ ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లు, గజ్వేల్ ఈఎన్‌సీ బి.హరిరామ్, సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీఓ) రిటైర్డ్ సీఈ ఎ.నరేందర్ రెడ్డిలను రెండోసారి క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించింది.
గత క్రాస్ ఎగ్జామినేషన్ సందర్భంగా పలు అంశాలపై వీరు తప్పుదోవ పట్టించారని గుర్తించిన కమిషన్.. మళ్లీ అవే అంశాలపై ప్రశ్నలను సంధించింది. అధికారుల జవాబులపై పలుమార్లు అసహనం వ్యక్తం చేయడంతో పాటు ఓ దశలో ప్రభుత్వమంటే తెలియదా? రాజ్యాంగం చదవలేదా? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
బరాజ్‌ల నిర్వహణలో విఫలమయ్యారు..
బరాజ్‌ల నిర్మాణ గడువు పొడిగించడానికి ముందు నిర్మాణ సంస్థలపై నిబంధనలకు ప్రకారం జరిమానాలు ఎందుకు విధించలేదు? అని కమిషన్ అడగగా, సైట్ వద్ద పరిస్థితులతో పనుల్లో జాప్యం జరిగిందని నల్లా వెంకటేశ్వర్లు జవాబిచ్చారు. దీంతో సాకులు చెప్పవద్దంటూ వ్యాఖ్యానించింది. ‘బరాజ్‌ల నిర్వహణ, పర్యవేక్షణలో మీరు సీఈ/ఈఎన్‌సీలుగా విఫలమయ్యారు. భారీ మొత్తంలో ప్రజాధనం ఖర్చు చేసి నిర్మించిన బరాజ్‌ల విషయంలో కనీస బాధ్యతతో వ్యవహరించలేకపోయారు. శ్రద్ధ చూపలేకపోయారు?..’అంటూ తప్పుబట్టింది. దీంతో అలా కాదంటూ నల్లా వెంకటేశ్వర్లు, మురళీధర్ వివరణ ఇచ్చారు.
డీపీఆర్‌కు రూ.677 కోట్లా?
⇒ బరాజ్‌ల డీపీఆర్‌ల తయారీకే వ్యాప్కోస్‌కి రూ.677 కోట్లు ఎలా ఇచ్చారు? అని కమిషన్ ప్రశ్నించగా, కేవలం రూ.19 కోట్లు మాత్రమే ఇచ్చామని వెంకటేశ్వర్లు వివరణ ఇచ్చారు. దీంతో బుకాయించవద్దని బిల్లుల చెల్లింపుల లెక్కలన్నీ తమ వద్ద ఉన్నాయని కమిషన్ తెలిపింది. నిల్వ సామర్థ్యం పెంచడంతో పాటు, బరాజ్‌లు–పంప్‌హౌస్‌ల మధ్య గ్రావిటీ కాల్వ పొడువు, విద్యుత్ అవసరాలూ తగ్గించేందుకే అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల లొకేషన్ మార్చాలని ప్రతిపాదించినట్లు వెంకటేశ్వర్లు చెప్పారు.
ప్రభుత్వమంటే తెలియదా? రాజ్యాంగం చదవలేదా?
⇒ వ్యాప్కోస్‌కి డీపీఆర్ తయారీ బాధ్యతలు అప్పగించాలనే నిర్ణయం ఎవరిది? అని కమిషన్ ప్రశ్నించగా, ప్రభుత్వానిదని మురళీధర్ బదులిచ్చారు. ప్రభుత్వమంటే ఎవరని మళ్లీ ప్రశ్నించగా, శాఖ ముఖ్య కార్యదర్శి అని అన్నారు. ప్రభుత్వమంటే ముఖ్య కార్యదర్శా? దేశ రాజ్యాంగం చదవలేదా? అంటూ కమిషన్ అసహనం వ్యక్తం చేసింది. నాడు సీఎం, శాఖ మంత్రి ఎవరు? అని మళ్లీ ప్రశ్నించగా, కేసీఆర్, హరీశ్ రావు అని మురళీధర్ బదులిచ్చారు. నామినేషన్‌పై వ్యాప్కోస్‌కు అప్పగించాలని సీఎం నిర్ణయించినట్టుగా తానే లేఖ రాశానని మురళీధర్ అంగీకరించారు. ఎవరి ఆదేశాలతో బరాజ్‌లలో నీళ్లు నిల్వ చేశారు? అని కమిషన్ ప్రశ్నించగా, ప్రభుత్వ ఆదేశాలతో అని నల్లా వెంకటేశ్వర్లు బదులిచ్చారు.
ఏం గుర్తు లేదు: మురళీధర్
⇒ 2016 జనవరి 17న సీఎం నిర్వహించిన సమావేశంలో వ్యాప్కోస్ డీపీఆర్‌లను సమరి్పంచింది. ఆ సమావేశంలో మీరు ఉన్నారా? జీవో 28 ద్వారా రిటైర్డ్ ఇంజనీర్లతో ఏర్పాటైన నిపుణుల కమిటీ సిఫారసులను మీరు అనుసరించారా? కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్ తయారీ విషయంలో టెక్నో కమర్షియల్ ఆఫర్‌ను సమరి్పంచాలని వ్యాప్కోస్‌ను ఎప్పుడు అడిగారు? అంటూ కమిషన్ వరుసగా అడిగిన ప్రశ్నలకు.. తనకు గుర్తు లేదంటూ రిటైర్డ్ ఈఎన్‌సీ మురళీధర్ బదులివ్వడంతో ఆసక్తికర చర్చ జరిగింది.
పుస్తకాలు చదివితే మేలు: కమిషన్
⇒ తన జ్ఞాపకశక్తి తగ్గుతోందని ఆయన చెప్పగా, పుస్తకాలు చదవితే జ్ఞాపకశక్తి పెరుగుతుందని కమిషన్ సూచించింది. వార్తాపత్రికలు చదువుతున్నానని మురళీధర్ చెప్పగా, కొన్ని ప్రత్యేక పుస్తకాలు చదివితే మేలని కమిషన్ సూచించింది. మేడిగడ్డకు లొకేషన్ మార్పును వ్యతిరేకిస్తూ నిపుణుల కమిటీ చేసిన సిఫారసులను ఉద్దేశపూర్వకంగానే మీరు పాటించలేదని కమిషన్ పేర్కొనగా, కాదంటూ మురళీధర్ ఖండించారు.
వ్యాప్కోస్ అభిప్రాయం తీసుకోకుండానే అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల లొకేషన్ల మార్పుపై నిర్ణయం తీసుకున్నారా? అని అడగగా, అవునన్నారు. తాత్కాలిక నీటి నిల్వ, నీటి మళ్లింపు కోసం బరాజ్‌లు నిర్మించినట్లు చెప్పారు. స్టీల్ కొనుగోళ్లకు 60 శాతం అడ్వాన్స్‌ను కాంట్రాక్టర్లకు చెల్లించేందుకు వీలుగా నిబంధనలను సడలించాలని సీఎంతో జరిగిన సమావేశంలో మీరు ప్రతిపాదనలు చేశారా? అని కమిషన్ ప్రశ్నించగా, అవునని బదులిచ్చారు. అదనపు పనులకు ఎంత వ్యయం చేసినా చెల్లిస్తామని సీఎం హామీ ఇచ్చారా? అని ప్రశ్నించగా, మీటింగ్ మినట్స్ చూస్తే గానీ చెప్పలేనన్నారు.
మా నివేదిక అంతా వాస్తవమే: కాగ్ అధికారులు
⇒ డీపీఆర్‌ను సీడబ్ల్యూసీ ఆమోదించడానికి ముందే పనులు ప్రారంభించడం, ప్రాజెక్టుకు రూ.81,911 కోట్ల అంచనాలతో ఒకే పరిపాలన అనుమతి ఇవ్వకుండా..నిబంధనలకు విరుద్ధంగా ఒక్కో పనికి విడివిడిగా అనుమతులివ్వడం, అలా మొత్తం రూ.1,10,248 కోట్లతో వేర్వేరు పనులకు వేర్వేరు అనుమతులివ్వడం, రూ.1,09,768 కోట్లతో ఒప్పందాలు చేసుకోవడం నిజమేనా? అని కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆడిట్ నిర్వహించిన కాగ్ డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ జె.నిఖిల్ చక్రవర్తిని కమిషన్ ప్రశ్నించగా, ఆయన అవునని బదులిచ్చారు. కాగ్ రిపోర్టులో ఉన్న అంశాలన్నీ వాస్తవాలేనని చెప్పారు. కాగ్ లేవనెత్తిన అభ్యంతరాలకు ప్రభుత్వం ఇచి్చన వివరణలను ఒకరోజులోనే సమరి్పస్తామని తెలిపారు. కాగ్ నివేదిక కరెక్టేనా? అని మరో డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ నాగేశ్వర్ రెడ్డిని అడగగా, ఆయన కూడా అవునని బదులిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment