రిటైరయ్యాక కూడా వాస్తవాలు దాచే ప్రయత్నం చేస్తారా?
నిబద్ధతతో కడితే బ్లాకులెందుకు కొట్టుకుపోయాయి?
ఇంజనీర్లపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఆగ్రహం
15 మంది ఇంజనీర్ల క్రాస్ ఎగ్జామినేషన్... 3 రోజుల్లో 49 మంది ఇంజనీర్లను ప్రశ్నించిన కమిషన్
సాక్షి, హైదరాబాద్: ‘మీరు ఇంజనీరేనా? ఏ యూనివర్సిటీలో చదువుకున్నారు? కమిషన్ ముందు కథలు చెబుతున్నారా? బాధ్యతలను కేంద్రంపైకి నెట్టేయడానికి ప్రయత్నిస్తున్నారా? ఎవరిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు? పక్కదోవ పట్టించడానికి యత్నించినా వాస్తవాలన్నీ వెలుగులోకి తెస్తాం..’అని కాళేశ్వరం ప్రాజెక్టు మాజీ చీఫ్ ఇంజనీర్ (సీఈ) శంకర్ నాయక్‌పై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బరాజ్‌ల నిర్మాణంలో లోపాలు, అవకతవకలపై విచారణలో భాగంగా బుధవారం 15 మంది ఇంజనీర్లకు క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించింది.
డిజైన్ ఫ్లడ్స్ అంటే ఏమిటని కమిషన్ ప్రశ్నించగా, పరీవాహక ప్రాంతంలో వచ్చే వరద ఆధారంగా డిజైన్లు తయారు చేయడమేనని నాయక్ బదులిచ్చారు. దీంతో మీరు ఇంజనీరేనా? డిజైన్ ఫ్లడ్ అంటే కూడా తెలియదా? అని కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తాను జేఎనీ్టయూలో చదువుకున్నానని, నదిలో వచ్చే వరద ఆధారంగా చేసేదే డిజైన్ ఫ్లడ్ అని ఆయన బదులిచ్చారు. ‘ఏం దాస్తున్నారు? రిటైరయ్యాక కూడా దాచేది ఏముంది? విచారణను పక్కదారిపట్టించే ప్రయత్నం చేస్తారా? అని కమిషన్ ఆయనపై మండిపడగా, లేదని శంకర్‌నాయక్ వివరణ ఇచ్చారు.
2016 జనవరి 17న నాటి సీఎం అధ్యక్షతన జరిగిన సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్‌ను వ్యాప్కోస్ సంస్థ సమరి్పంచిందా? ఆ సమావేశం మినిట్స్‌ను పరిశీలించారా? అన్న ప్రశ్నకు మినిట్స్‌ను చూడలేదని నాయక్ తెలిపారు. కేంద్ర జలవనరుల సంఘం కాళేశ్వరం ప్రాజెక్టుకు హైడ్రాలజీ క్లియరెన్స్ ఇచ్చిందన్నారు. నీటి లభ్యతను తొలుత ఇక్కడి ఇంజనీర్లే నిర్ధారించాల్సి ఉంటుందని కమిషన్ తప్పుబట్టింది. కేంద్రంపై తోసేందుకు ప్రయత్నిస్తున్నారా? ఎంత ప్రయత్ని0చినా వాస్తవాలను బయటికి తీసుకొస్తాం అని ఆగ్రహం వ్యక్తంచేసింది.
క్షేత్రస్థాయిలోని ఇంజనీర్లు పంపే నీటి లభ్యత లెక్కలను పరిశీలించి సరిగ్గా ఉన్నట్టు నిర్ధారించడమే తమ బాధ్యత అని శంకర్‌నాయక్ తెలిపారు. బరాజ్‌ల నిర్మాణ స్థలాలను మార్చిన విషయం వాస్తవమేనని అంగీకరించారు. నీటి లభ్యత అధ్యయనాలు జరపకముందే జనరల్ అలైన్‌మెంట్ డ్రాయింగ్స్ తయారు చేస్తారా? అని కమిషన్ ప్రశ్నించగా, లేదని నాయక్ బదులిచ్చారు.
వరద తీవ్రత ఆధారంగా ఎన్ని గేట్లు పెట్టాలనే దానిపై నిర్ణయం తీసుకుంటారన్నారు. కాగా, బరాజ్ సీసీ బ్లాక్స్ ఎందుకు కొట్టుకుపోయాయి? బ్లాకులు కొట్టుకుపోతే పైఅధికారులకు ఎందుకు లేఖలు రాయలేదు? మౌఖికంగానే సమాచారం ఇస్తారా? అని అన్నారం బరాజ్ ఏఈఈ ఆర్మూరి రామచందర్‌పై కమిషన్ మండిపడింది.
పినాకిని అంటే అర్థం తెలుసా?
మీ పదవీకాలంలో బరాజ్‌లను ఎన్నిసార్లు సందర్శించారు? నివేదికలు ఏమైనా ఇచ్చారా? అని ఓ అండ్ ఎం విభాగం మాజీ సీఈ జి.రమేశ్‌ను కమిషన్ ప్రశ్నించింది. 2021 జూలైలో ఒక్కసారి పరిశీలించి నివేదిక ఇచ్చానని రమేశ్ బదులిచ్చారు. జస్టిస్ పినాకి చంద్రఘోష్ పేరుకి బదులు అఫిడవిట్‌లో పినాకిని చంద్రఘోష్ అని రాయడంపై కమిషన్ అసహనం వ్యక్తం చేసింది.
పినాకిని అంటే అర్థం తెలుసా?, అఫిడవిట్ ప్రారంభంలోనే తప్పులు ఉంటే ఎలా? సంతకం చేయడానికి ముందు అఫిడవిట్ చదువుకోరా? అని నిలదీసింది. అర్జీల్లో అచ్చు తప్పులున్నా న్యాయస్థానాలు కేసులను కొట్టివేసిన సందర్భాలున్నాయని గుర్తు చేసింది. సరైన పరిశోధనలు చేయకుండానే బరాజ్‌ల నిర్మాణంపై నిర్ణయాలు తీసుకున్నారని మాజీ ఇంజనీర్ ఐ.వికల్రార్ కమిషన్‌కు తెలిపారు. బరాజ్‌ల వైఫల్యానికి హైపవర్ కమిటీ ప్రధాన కారణమని ఆరోపించారు.
2–3 టీఎంసీల సామర్థ్యంతోనే బరాజ్‌లను నిర్మిస్తారని, 16 టీఎంసీల సామర్థ్యంతో కట్టడంతోనే సమస్యలొచ్చాయన్నారు. గత మూడు రోజుల్లో మొత్తం 49 మంది ఇంజనీర్లకు కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించడంతో ఇంజనీర్ల వంతు ముగిసింది. మళ్లీ సోమవారం నుంచి ఐఏఎస్, మాజీ ఐఏఎస్‌లతోపాటు కాంట్రాక్టర్లను ప్రశ్నించనుంది.
Comments
Please login to add a commentAdd a comment